Interceptor: పదేళ్లలో ఒక్క కేసూ పట్టుకోలే...! | No use police interceptor vehicle telangana | Sakshi
Sakshi News home page

Interceptor: పదేళ్లలో ఒక్క కేసూ పట్టుకోలే...!

Published Mon, Jul 15 2024 11:18 AM | Last Updated on Mon, Jul 15 2024 12:00 PM

No use police interceptor vehicle telangana

నగర వ్యాప్తంగా 20 వాహనాలు

  పదేళ్ల క్రితం అమలులోకి..

 కీలక సమయాల్లో తక్షణ స్పందన కోసం ఏర్పాటు 

 కేవలం నామ్‌కే వాస్తేగా పనితీరు 

 సమీక్షించి, ప్రక్షాళన చేయాలని కొత్వాల్‌ నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: ‘ఇంటర్‌సెప్టర్‌’.. ఈ పదానికి తెలుగులో అడ్డగించేవాడు అని అర్థం. నగరంలో ఏదైనా జరగరాని ఉదంతం జరిగినా, ముష్కర మూకలు దాడులు చేసినా, శాంతిభద్రతల పరమైన హఠాత్పరిణామాలు తలెత్తినా తక్షణం స్పందించాలని, బాధ్యతలను అడ్డుకోవాలని, పారిపోతున్న వారిని పట్టుకోవాలనే ఉద్దేశంతో నగర పోలీసు విభాగం ఇంటర్‌సెప్టర్‌ వాహనాలు, అందులో సిబ్బందిని ఏర్పాటు చేసింది. అయితే పదేళ్లు ఈ టీమ్స్‌ కనీసం ఒక్కసారీ ‘అడ్డుకోలేదు’.. కొన్ని అంశాల్లో ఆ అవసరం ప్రాంతానికీ రాలేదు. ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకున్న నగర పోలీసు కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఈ వాహనాల అంశాన్ని సమీక్షించాలని నిర్ణయించారు.

స్పందించిన ఉదంతం ఒక్కటీ లేదు..
గడిచిన పదేళ్ల కాలంలో ఉన్నతాధికారులు మారినప్పుడల్లా వారి ప్రాధాన్యాలు మారాయి. అందులో భాగంగా ఇంటర్‌సెప్టర్‌ తీరుతెన్నులు, రూపు మారుతూ వచ్చింది. కాలక్రమంలో ఇద్దరు ఏఆర్‌ కానిస్టేబుళ్లను పంప్‌ గన్‌తో, ఒక హోంగార్డును వాకీటాకీతో ఈ వాహనంలో ఉంచి సరిపెట్టారు. నగర పోలీసు కమిషనరేట్‌ పునరి్వభజన తర్వాత డివిజన్ల సంఖ్య 25కు పెరిగింది. ఈ వాహనాల సంఖ్య 20కి మాత్రమే చేరింది. ప్రజాభవన్, డీజీపీ కార్యాలయం సహా అనేక ప్రాంతాల్లో నిలిచి ఉండే ఈ ఇంటర్‌సెప్టర్స్‌ గడిచిన పదేళ్లలో అడ్డుకున్న ఉదంతం కానీ, పట్టుకున్న నేరగాడు కానీ లేడు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్న నగర కొత్వాల్‌ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఈ వాహనాల పనితీరును సమీక్షించాలని, పునర్‌ వ్యవస్థీకరించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఆ వాహనం పని తీరు చూసిన తర్వాతే..
నాంపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద శుక్రవారం తెల్లవారుజామున డెకాయ్‌ బృందాలు నేరగాళ్లపై కాల్పులు జరిపాయి. ఈ ఉదంతం నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. అదే రోజు మధ్య మండల డీసీపీ కార్యాలయానికి వెళ్లిన ఆయన జరిగిన ఉదంతాన్ని సమీక్షించారు. తిరిగి వెళ్తున్న సమయంలో అక్కడ ఉన్న ఇంటర్‌సెప్టర్‌ వాహనంపై ఆయన దృష్టి పడింది. అందులో ఉన్న సిబ్బందితో మాట్లాడటంతో పాటు దాని కదలికలను నమోదు చేసే లాగ్‌బుక్‌ను పరిశీలించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ వాహనాల పరిస్థితి ఆయన దృష్టికి వచ్చింది. ఇలా నగరంలోని అనేక ప్రాంతాల్లో కనిపించే ఈ ఇంటర్‌సెప్టర్‌ బృందాలను సది్వనియోగం చేసుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. త్వరలో ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమగ్ర విధివిధానాలు ఖరారు చేయనున్నారు. మొత్తమ్మీద ప్రతి షిఫ్ట్‌లోనూ 60 మంది చొప్పున సిబ్బంది ఉండే ఈ వాహనాలను నగర ప్రజలకు ఉపయోగపడేలా నిఘాతో పాటు గస్తీకి వినియోగించుకోవాలని సీపీ భావిస్తున్నారు.

  అంతన్నారు.. ఇంతన్నారు..
రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన పోలీసు సంస్కరణల్లో భాగంగా 2014లో ఇంటర్‌సెప్టర్‌ వాహనాలను  అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రాథమికంగా ఒక్కో డివిజన్‌కు ఒకటి చొప్పున కేటాయించారు. అప్పటికి నగరంలో 17 సబ్‌ డివిజన్లే ఉండటంతో 17 వా హనాలు, అదనంగా మరోటి ఆవిష్కరించా­రు. ఆలివ్‌ గ్రీన్‌ యూనిఫాంలో బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు ధరించిన సాయుధులు ముగ్గురు ఉండేలా, వీరితో అత్యాధునిక కమ్యూనికేషన్‌ పరికరాలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 24 గంటలూ నగరంలోని కీలక ప్రాంతాల్లో మోహరించిన ఉండే ఈ టీమ్స్‌ ఆయా ప్రాంతాల్లో నిఘా వేసి ఉంటారని, శాంతిభద్రతల సమస్యలు తలెత్తినప్పుడు వీరు తక్షణం స్పందించి వాటిని అణిచి వేస్తారని ప్రకటించారు. దీనికోసమే వీటికి పంప్‌ యాక్షన్‌ షాట్‌ గన్స్‌ కూడా 
అందించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement