Animal Welfare Act
-
బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వపై కేసు!
బిగ్‌బాస్ కంటెస్టెంట్, యూట్యూబర్ గంగవ్వ చిక్కుల్లో పడింది. వీడియోల పేరుతో వన్యప్రాణుల రక్షణ చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించారంటూ గంగవ్వతో పాటు మరో యూట్యూబర్ రాజుపై కేసు నమోదు అయింది. యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ జంతు సంరక్షణ కార్యకర్త అదులాపురం గౌతమ్ ఫిర్యాదు మేరకు జగిత్యాల అటవీ శాఖ అధికారులు ఈ కేసు నమోదు చేశారు. వినోదం కోసం చిలుకను హింసించారని గౌతమ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఏం జరిగింది?2022 లో గంగవ్వ, రాజు కలిసి ‘మై విలేజ్ షో’ యూట్యూబ్ ఛానెల్ లో గంగవ్వ చిలుక పంచాంగం అనే వీడియో చేశారు. అందులో గంగవ్వ, రాజు జ్యోతిష్కులుగా నటిస్తూ చిలుకను ఉపయోగించారు. ఇలా వినోదం కోసం చిలుకను పంజరంలో బంధించడం వన్యప్రాణుల రక్షణ చట్టం, 1972 షెడ్యూల్ IV కింద నేరమని గౌతమ్ ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. గౌతమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. (చదవండి: మొన్న బెయిల్‌పై వచ్చిన నటుడు.. ఇంతలోనే మూడో పెళ్లితో వైరల్)బిగ్‌బాస్ హౌస్‌లో గంగవ్వగంగవ్వ ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో ఉంది. బిగ్‌బాస్ సీజన్ 4లో గంగవ్వ తొలిసారి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వెళ్లింది. అయితే అక్కడి వాతావరణం పడక అనారోగ్యం బారిన పడడంతో మధ్యలోనే ఆమెను బయటకు పంపించేశారు. మళ్లీ సీజన్ 8లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి తనదైన ఆటతీరుతో ఆకట్టుకుంటుంది. -
Delhi High Court: సంక్షేమం కాదు.. సంఘర్షణ
జనావాసాల మధ్య సంచరించే వానరాలకు ఆహారం అందుబాటులో ఉంచడం జంతు సంక్షేమం కిందికి రాదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఇది ఒక రకంగా మనుషులతో వాటి సంఘర్షణకు దారి తీస్తోందని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, జస్టిస్ తుషార్ రావు గేదెల ధర్మాసనం సెప్టెంబర్ 30వ తేదీన వెలువరించిన తీర్పులో కీలక వ్యాఖ్యలు చేసింది. అడవుల్లో చెట్లపై సంచరిస్తూ కాయలు, పండ్లు లాంటివి తినే వానరాలు సహజ ఆవాసాలను వదిలి జనాల మధ్యకు, వీధుల్లోకి రావడానికి కారణం మనమేనని పేర్కొంది. బ్రెడ్, చపాతీ, అరటి పండ్లులాంటివి ఇస్తూ వాటికి హానిని, ప్రజలతో ఘర్షణ పడే స్థితికి వాటిని తీసుకొస్తున్నామని వ్యాఖ్యానించింది. ‘పబ్లిక్ పార్కులు, హోటళ్లు, క్యాంటీన్లలో పోగయ్యే చెత్తను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తుండటంతో కోతులు అక్కడ పోగవుతున్నాయి. కోతులకు ఆహారం ఇవ్వడం వల్ల అవి మనుషులపై ఆధారపడటాన్ని పెంచుతుంది. ఆహారం దొరకని సందర్భాల్లో అవి హాని కలిగిస్తాయి. ఈ పరిణామం మనుషులతో జంతు సంఘర్షణకు దారి తీస్తుంది. పౌర సంస్థలు దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. సురక్షితంగా ఉండాలనుకునే వారు ఆహార వ్యర్థాలను ఎక్కడిపడితే అక్కడ పడేయడం మానుకోవాలి’అని హితవు పలికింది. -
పర్యావరణం.. పక్షికి పండగ దూరం చేయవద్దు!
ఆమె రాగానే అప్పటివరకు గోలగోలగా ఉన్న హాలు సద్దుమణిగింది. ‘అందరూ వచ్చినట్లే కదా!’ అని ఆత్మీయంగా అడిగింది సీమ. ‘ఏమిటో మేడమ్ సెలవ రోజుల్లో ఈ క్లాసు...’ అని ఆవులించాడు ఒక కాలేజి విద్యార్థి. కొన్ని నవ్వులు వినిపించాయి. ‘ఇవి చూడండి’ అంటూ ఆమె కొన్ని చిత్రాలు చూపించింది. నీలాకాశంలో రంగురంగుల గాలిపటాలు ఎగురుతున్న చిత్రాలు, ఆబాలగోపాలం ఆనందంతో పతంగులు ఎగరేస్తున్న చిత్రాలు, ‘కీంచ్...కాట్’ అంటూ వేరేవాళ్ల గాలిపటాలను ఆకాశంలో కట్ చేస్తున్న చిత్రాలు, తెగిపడిన గాలిపటాల వెంట అరుపులతో పరుగులు తీస్తున్న పిల్లలు... ఇలా ఎన్నో ఉన్నాయి. ‘ఈ చిత్రాలు కూడా చూడండి’ అంటూ మరికొన్ని చిత్రాలు చూపించింది. రెక్కలు తెగిన పక్షుల చిత్రాలు. మెడ తెగి నేలరాలి బాధతో కొట్టుకుంటున్న పక్షుల చిత్రాలు. కరెంటు తీగలకు, చెట్ల కొమ్మలకు అల్లుకున్న దారాల్లో చిక్కుకుపోయి ఊపిరాడక చనిపోతున్న పక్షుల చిత్రాలు... హృదయాన్ని మెలిపెట్టే చిత్రాలు ఇవి. ‘సంతోషం ముఖ్యమే కాని, మన సంతోషం పక్షుల చావుకు కారణం కావద్దు కదా!’ అన్నది సీమ. కొద్దిసేపు ఆ హాల్లో నిశ్శబ్దం. ‘గాలిపటాలు ఎగిరేస్తున్నప్పుడు అప్పుడప్పుడు మన చేతివేళ్లు కోసుకుపోతాయి. ఆ కాస్త దానికే తల్లడిల్లిపోయి హాస్పిటల్‌కు పరుగెత్తుతాం. కాని పక్షులు మాత్రం మన గాలిపటాల వల్ల తీవ్రగాయాలపాలై చనిపోతున్నాయి. మనం హాస్పిటల్‌కు పరుగెత్తినట్లు అవి పరుగెత్తలేవు కదా!’ అని సీమ అన్నప్పుడు ఎంతటి హృదయాలైనా కరిగిపోవాల్సిందే. నవీ ముంబైకి చెందిన సీమా టాంక్ జంతు ప్రేమికురాలు. పండగరోజుల్లో గాలిపటాలు పక్షుల పాలిట మృత్యుపాశాలుగా మారకుండా ఉండడానికి ఆమె అవగాహన సదస్సులు నిర్వహిస్తుంటుంది. మొదట్లో ఈ సదస్సుకు రావడానికి ఇష్టపడని వారు కూడా ఆ తర్వాత నిజం గ్రహించి మార్పు దిశగా పయనించడం ఆమెకు సంతోషం ఇస్తోంది. సీమ మాటలతో ప్రభావితమైనవారు ‘పక్షులకు పండగ దూరం చేయవద్దు ప్లీజ్’ ‘మన సంతోషానికి పక్షులు మూల్యం చెల్లించుకోవాలా?’ ‘ఆకాశంలో గాలిపటం ఎగరేసేముందు, అదే ఆకాశంలో ఎగురుతున్న పక్షి వైపు కూడా చూడు’... లాంటి పోస్ట్‌లు సామాజికవేదికల్లో పెడుతుంటారు. సీమలాంటి వ్యక్తులే కాదు ‘ప్లాంట్స్ అండ్ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ’లాంటి సంస్థలు కూడా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి. ఫేస్బుక్ వేదికగా హెల్ప్‌లైన్ నంబర్స్, రెస్క్యూ టిప్స్ షేర్ చేస్తున్నాయి. ‘సేవ్ బర్డ్స్’ అనేది యానిమల్ లవర్స్, యాక్టివిస్ట్‌ల నినాదం మాత్రమే కాదు, అది అందరి కనీస బాధ్యత అనే ఎరుక మనకు కలిగితే చాలు... పండగ సంతోషం మనతోపాటు పక్షులకూ దక్కుతుంది. -
ఇలా అయితే పక్షులు బతకడం కష్టం
నల్లగండ్ల చెరువు.. నగర శివారు ప్రాంతం.. చుట్టూ జనావాసాలు తక్కువే. ఉదయం ఆ ప్రాంతానికి వచ్చిన స్థానికులకు చెరువు మధ్యలోని ఓ వెదురుచెట్టుపై ఓ కొంగ వేలాడుతూ కనిపించింది. వెంటనే నెట్లో వెతికి యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీకి ఫోన్ చేసి సమాచారామిచ్చారు. ఆ సంస్థకు చెందిన సంజీవ్ వర్మ, బాలాజీలు వచ్చి థర్మాకోల్ తెప్ప సాయంతో నీటిలో ప్రయాణించారు. పొడవాటి ముళ్లతో ఉన్న ఆ చెట్టుకొమ్మపై అతి కష్టమ్మీద నిలబడి గాయాలను లెక్కచేయకుండా ఐదు గంటలు యత్నించి కొంగను కాపాడారు. జనావాసాలకు దూరంగా ఉన్నప్పటికీ దారం గాలికి కొట్టుకొచ్చి చెట్టుకు చిక్కుకుంది. అది ఆ కొమ్మమీదకు వచ్చే పక్షుల ప్రాణాలను హరిస్తోంది. ఇలా ఇప్పటికే నగరం, శివారు ప్రాంతాల్లో వందల సంఖ్యలో పక్షులు చనిపోగా, పక్షి ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరో రెండు మూడు వందల పక్షులను కాపాడారు. సాక్షి, హైదరాబాద్: జనవరి సమీపిస్తోందంటే చాలు వినీలాకాశం మరిన్ని రంగులనద్దుకుంటుంది. రంగురంగుల పతంగులతో కొత్త శోభను సంతరించుకుంటుంది. గాలిపటాలు ఎగరేయటం సరదానే. కానీ, పక్షులకు మాత్రం ప్రాణసంకటంగా మారింది. ఎదుటివారి గాలిపటాన్ని తెంపే ఉద్దేశంతో దానికి కొంతమేర వరకు మాంజా కడుతున్నారు. పతంగి తెగినప్పుడు గాలివాటానికి కొట్టుకుపోయి ఏ చెట్టు కొమ్మకో, సెల్టవర్కో చిక్కుకుంటోంది. ఆ విషయం గుర్తించని పక్షులు దానికి చేరువగా ఎగిరినప్పుడు వాటి రెక్కలకు దారం చుట్టుకుపోతోంది. విడిపించుకునే తొందరలో అటు, ఇటు ఎగిరేసరికి రెక్కలు తెగిపోయో, శరీరం కోసుకుపోయో పక్షులు చనిపోతున్నాయి. కొన్ని దారాలకే వేలాడుతూ తిండిలేక మరణిస్తున్నాయి. ఇలా ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో పక్షులు చనిపోతుండటంతో ప్రభుత్వం మాంజాను నిషేధించింది. కానీ, దాన్ని పట్టించుకోకుండా చాలామంది మాంజాను వాడుతూ పక్షుల మృతికి కారణమవుతున్నారు. ఏ చెట్టుకు చూసినా... ప్రస్తుతం నగరంలో ఏ చెట్టుకు చూసినా మాంజా దారపు పోగులు వేలాడుతున్నాయి. నిత్యం వాటికి పక్షులు చిక్కి విలవిలలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో మాంజా ఫ్రీ నగరం చేసేందుకు యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ కార్యాచరణ చేపడుతోంది. జీహెచ్ఎంసీ, అగ్నిమాపక విభాగం, డిజాస్టర్ రెస్పాన్స్ టీంల చేయూతతో పక్షి ప్రేమికులను ఏకం చేస్తోంది. ఇందుకోసం సామాజిక వేదికల ద్వారా ప్రచారం ప్రారంభించింది. వారి వారి ఇళ్ల వద్ద ఉన్న చెట్లకు వేలాడుతున్న దారాలను తొలగించాలని కోరుతోంది. చెట్టు ఎక్కలేని పరిస్థితి ఉన్నా, సెల్‌టవర్లకు దారాలున్నా తమకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తోంది. ఈ సమాచారం ఇచ్చేందుకు కూడా సామాజిక మాధ్యమం ద్వారా ఓ వ్యవస్థ ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉంది. దారం వేలాడుతున్న ప్రాంతాల వివరాలు, ఫొటోలు అందులో అప్లోడ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. త్వరలో ఇది ప్రారంభం కానుంది. డిజాస్టర్ రెస్పాన్స్ టీం, అగ్నిమాపక విభాగం సహకారం చాలా ప్రాంతాల్లో ఎత్తుగా ఉన్న చెట్లపైన పక్షులు దారాలకు చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. చిటారు కొమ్మల వరకు చేరుకోవటం కష్టంగా ఉండటంతో డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్, అగ్నిమాపక విభాగం బృందాలు నిచ్చెనల సాయంతో రక్షిస్తున్నారు. ఈ విషయంలో ఆ రెండు విభాగాలు చాలా సహకరిస్తున్నాయని యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీకి చెందిన అమర్నాథ్ పేర్కొన్నారు. -
జల్లికట్టు..పెటా పట్టు
జల్లికట్టు క్రీడకు మార్గం సుగమం చేస్తూ తమిళనాడు ప్రభుత్వం చేసిన ప్రత్యేక ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ ‘పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్’(పెటా) వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన డివిజన్బెంచ్కు శుక్రవారం పిటిషన్‌ను బదలాయించింది. జల్లికట్టుపై నిషేధం తీసుకురావాలని పెటా పట్టుదలతో పోరాడుతోంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: జంతు సంక్షేమ సంరక్షణ చట్టం పరిధిలోని జంతువుల జాబితాలో ఉన్న ఎద్దులను ఆ జాబితా నుంచి కేంద్రం తొలగించడంతో రాష్ట్రంలో జల్లికట్టు క్రీడ యథావిధిగా సాగుతోంది. అయితే తమిళనాడులో జల్లికట్టు క్రీడపై నిషేధం విధించాలని జంతు సంక్షేమ సంఘం గతంలో ఒక పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై వాదోపవాదాలు ముగిసిన తరువాత 2014లో సుప్రీంకోర్టు జల్లికట్టుపై నిషే«ధం విధించింది. తమిళనాడు ప్రజల ఆచార, వ్యవహరాల్లోనూ, ప్రాచీన సంప్రదాయక్రీడైన జల్లికట్టులోనూ జోక్యం తగదని నినాదాలు చేశారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ 2017 జనవరి 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. చెన్నై మెరీనా తీరంలో విద్యార్థులు, యువజనులు లక్షలాదిగా తరలివచ్చి నిరవధిక ఆందోళనకు దిగారు. పిల్లలు పెద్దలు, యువతీ యువకులు మెరీనాతీరం చేరుకున్నారు. జల్లికట్టు ఉద్యమంలో ఆందోళనకారులు ఉడుంపట్టు మొత్తం ప్రపంచాన్నే ఆకర్షించి తనవైపునకు తిప్పుకుంది. ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. అప్పటి ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం అదే ఏడాది జనవరి 20వ తేదీన జల్లికట్టుపై ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్రగవర్నర్‌కు అందజేశారు. గవర్నర్ సదరు ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి ఆమోదానికి పంపడం వెంటనే ఆమోద ముద్ర పడడం చకచకా జరిగిపోయాయి. దీంతో 22వ తేదీన మదురై జిల్లా అలంగానల్లూరులో జల్లికట్టు క్రీడలు ఉత్సాహంగా సాగాయి. ఆనాటి నుంచి రాష్ట్రంలో పొంగల్ పండుగల దినాల్లో జల్లికట్టు క్రీడలు యథావిధిగా జరుగుతున్నాయి. అయితే పన్నీర్‌సెల్వం ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రత్యేక ఆర్డినెన్స్‌ను పెటా తీవ్రంగా గర్హిస్తూ జల్లికట్టుపై నిషేధం విధించాలని సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై బదులివ్వాల్సిందిగా సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించగా, ప్రభుత్వం వివరణతో కూడిన నివేదికను కోర్టుకు సమర్పించింది. ఈ కేసు న్యాయమూర్తి రోహింగ్టన్ ముందుకు శుక్రవారం విచారణకు వచ్చింది. జల్లికట్టుపై మధ్యంతర నిషేధం విధించలేమని, అయితే ఈ కేసును ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన డివిజన్ బెంచ్‌కు బదలాయిస్తున్నట్లు న్యాయమూర్తి రోహింగ్టన్ తెలిపారు. -
రోబో గజరాజు!
వివాహాది శుభకార్యాలకు గజరాజులను తీసుకొస్తే ఆ వేడుకలు అంగరంగ వైభవ మే. ఇప్పుడు వేడుకలకు ఏనుగును తీసుకురావడం అంటే ఖరీదైన వ్యవహారమే కాదు, జంతు సంరక్షణ చట్టం నిబంధన లు పెద్ద అడ్డంకి. అందుకే ఆ ఆనందాన్ని పంచుకున్న అనుభూతిని కల్పించేందుకు ఈ రోబో గజరాజును రూపొందించాడు తిరుచ్చి జిల్లా ఉడుమలైపేట్టకు చెందిన అబ్దుల్ హకీం. పెళ్లిళ్లు, ఆలయా ల్లో ఉత్సవాలకు అలంకారాలు చేసే ఇతను ఒకసారి కొడెకైనాల్ నుంచి వస్తుండగా చెక్క ఏనుగు, కీలుగుర్రాలను మార్కెట్లో చూశాడట. దీంతో ఈ రెండు బొమ్మల లక్షణాలను కలిపి ఏనుగును తయారుచేస్తే ఎలాగుంటుందనే ఆలోచన వచ్చింది. బంకమట్టిలో ఇనుప ముక్కలు కలిపి ఈ ఏనుగుకు రూపమిచ్చాడు. రంగురంగుల వస్త్రాలతో అలంకరించి ఏనుగులా సిద్ధం చేశాడు. ఇది జనరేటర్ సహాయంతో పని చేస్తుంది. తన సొంతూరులోనైతే రోజుకు రూ.3,500, మరోచోటకైతే రవాణా చార్జీలు కలుపుకుని రూ.18 వేలు వసూలు చేస్తున్నట్లు తెలిపారు.