కోతులకు ఆహారం వేయడంపై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్య
జనావాసాల మధ్య సంచరించే వానరాలకు ఆహారం అందుబాటులో ఉంచడం జంతు సంక్షేమం కిందికి రాదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఇది ఒక రకంగా మనుషులతో వాటి సంఘర్షణకు దారి తీస్తోందని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, జస్టిస్ తుషార్ రావు గేదెల ధర్మాసనం సెప్టెంబర్ 30వ తేదీన వెలువరించిన తీర్పులో కీలక వ్యాఖ్యలు చేసింది.
అడవుల్లో చెట్లపై సంచరిస్తూ కాయలు, పండ్లు లాంటివి తినే వానరాలు సహజ ఆవాసాలను వదిలి జనాల మధ్యకు, వీధుల్లోకి రావడానికి కారణం మనమేనని పేర్కొంది. బ్రెడ్, చపాతీ, అరటి పండ్లులాంటివి ఇస్తూ వాటికి హానిని, ప్రజలతో ఘర్షణ పడే స్థితికి వాటిని తీసుకొస్తున్నామని వ్యాఖ్యానించింది. ‘పబ్లిక్ పార్కులు, హోటళ్లు, క్యాంటీన్లలో పోగయ్యే చెత్తను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తుండటంతో కోతులు అక్కడ పోగవుతున్నాయి.
కోతులకు ఆహారం ఇవ్వడం వల్ల అవి మనుషులపై ఆధారపడటాన్ని పెంచుతుంది. ఆహారం దొరకని సందర్భాల్లో అవి హాని కలిగిస్తాయి. ఈ పరిణామం మనుషులతో జంతు సంఘర్షణకు దారి తీస్తుంది. పౌర సంస్థలు దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. సురక్షితంగా ఉండాలనుకునే వారు ఆహార వ్యర్థాలను ఎక్కడిపడితే అక్కడ పడేయడం మానుకోవాలి’అని హితవు పలికింది.
Comments
Please login to add a commentAdd a comment