
కృషి
‘పనిలో షార్ట్ కట్స్ ఉండచ్చు. కానీ, ఫలితాలు అందుకోవాలంటే దీర్ఘకాలం ప్రయత్నించాల్సిందే’ అంటారు డాక్టర్ పింగళి ఉషారాణి. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో క్లినికల్ ఫార్మకాలజీలో డీఎమ్‌గా ఉన్న డాక్టర్ పింగళి ఉషారాణి చేసిన పరిశోధనలకు గాను ఇండియన్ సొసైటీ ఫర్ క్లినికల్ రీసెర్చ్ (ఐఎస్‌సీఆర్) నుంచి జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా పాతికేళ్లుగా క్లినికల్ ఫార్మకాలజీలో తాను చేస్తున్న కృషి గురించి వివరించారామె ...
‘మా వర్క్‌లో పేషెంట్ కేర్, రీసెర్చ్ రెండూ ఉంటాయి. గాంధీ, నిమ్స్ ఫార్మాస్యుటికల్ విభాగాలలో ఎలాంటి వర్క్ జరుగుతుందో బయటి వారికి తెలియదు. అకడమిక్ విభాగంలో విద్యార్థులకు పాఠాలు చెప్పి, పంపుతారు అనే ఆలోచనలో ఉంటారు. కానీ, దీని వెనకాల ప్రతిరోజూ పరిశోధన ఉంటుంది. విద్యార్థులకుప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి నిరంతర ప్రయత్నం ఉంటుంది.
మందుల పనితీరుపై పరిశోధనలు
కార్డియో, లివర్ చికిత్సలకు, నొప్పులకు వేసుకునే మందులు పేషంట్ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి... అనే అంశంపై పీహెచ్‌డి స్టూడెంట్స్‌తో కలిసి పరిశోధన చేశాం. దేశవ్యాప్తం గా ఉన్న ఫార్మకాలజీ స్టూడెంట్స్‌కి ప్రతియేటా ట్రైనింగ్ ఇస్తుంటాం. పరిశోధనలు చేయడానికి అన్ని మెడికల్ కాలేజీలకు సరైన పరికరాలు ఉండకపోవచ్చు. అందుకని అందరికీ అర్ధమయ్యే విధంగా మా పరిశోధనల ఫలితాలు తీసుకువస్తున్నాం.
పాతికేళ్ల ప్రయాణం
ఈ రంగంలో నా వర్క్ మొదలు పెట్టినప్పుడు ఏదీ సులువుగా లేదు. ఒక్కోసారి 15–18 గంటలు వర్క్‌లో ఉండాల్సిన రోజులు ఉన్నాయి. పనికి షార్ట్‌కట్స్ ఉండచ్చు, ఫలితాలకు మాత్రం షార్ట్ కట్స్ ఉండవు అనేది తెలుసుకున్నాను.
ప్రతి నిమిషమూ విలువైనదే
ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. కానీ, సవాళ్లు ఉంటేనే మరింత బాగా పనిచేయగలం. ప్రస్తుతం ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ పేషెంట్స్‌కు బ్లడ్ లెవల్స్‌లో మందుల వాడకం పైన వర్క్ చేస్తున్నాం. మన వర్క్‌ని ఎలా ప్రూవ్ చేసుకోవాలో ఒక ప్రణాళిక వేసుకుని, ఆపైన కృషి చేస్తూ పోతే మంచి గుర్తింపు వస్తుంది. మన వర్క్‌ని మనం బాగా ఇచ్చాం అనే సంతృప్తి కూడా దానికి తోడవుతుంది. నేర్చుకోవాలనే తపన ఏ వయసులోనైనా ఉండాలి’ అని వివరించారు ఉషారాణి.
క్లినికల్ ఫార్మకాలజీలో డిఎమ్ అంటే ‘డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్ లేదా డిఎమ్ ఇన్ క్లినికల్ ఫార్మకాలజీ’ అని కూడా పిలుస్తారు. ఈ రంగంలో పేషంట్ కేర్ – రీసెర్చ్ డెవలప్‌మెంట్ లో చేసిన ఇన్నేళ్ల కృషికి ఫలితంగా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ లభించింది. ఐఎస్‌సిఆర్ ప్రెసిడెంట్ పురస్కారంతో పాటు క్లినికల్ రీసెర్చ్‌లో భాగంగా అవార్డులు, ప్రశంసలు అందుతూనే ఉన్నాయి. దేశీయ, అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లలో పాల్గొనే అవకాశాలూ లభించాయి.
– డాక్టర్ పింగళి ఉషారాణి
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment