లక్డీకాపూల్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నివారణకు రూపొందించిన వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నది. అంతర్జాతీయ స్థాయి వైద్య ప్రమాణాలతో కూడిన నిమ్స్‌లో ఈ నెల 7వ తేదీ నుంచి క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. శనివారం ఇందుకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అనుమతినిచ్చింది. వ్యాక్సిన్‌ను ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నాటికి తయారు చేయాలని ఐసీఎంఆర్ భావిస్తోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ అభివృద్ధి చేసే విషయంలో నగరానికి చెందిన భారత్ బయోటెక్, పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ)తో కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్‌ను మనుషులపై ప్రయోగించేందుకు డీసీజీఐ అనుమతి లభించింది. దీంతో క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహించేందుకు ఐసీఎంఆర్ నిమ్స్‌ను ఎంచుకుంది.
దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ ట్రయల్స్‌కు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిందని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.మనోహర్ వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిమ్స్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు ఎంపిక చేశారన్నారు. దేశంలో ట్రయల్స్ నిర్వహిస్తున్న 12 సంస్థల్లో నిమ్స్ ఒకటి కావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఐసీఎంఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 7వ తేదీ నుంచి క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ ప్రక్రియలో మూడు రకాల వ్యాక్సిన్‌ను రెండు డోస్‌ల చొప్పున ఇస్తామన్నారు. ఈ వ్యాక్సిన్‌లో కూడా 3 మైక్రోగ్రాములు ఒక రకమైన వ్యాక్సిన్, మరొకటి 6 మైక్రో గ్రాములు ఉంటుందన్నారు. ఫేస్–1, ఫేస్–2 కింద ఈ క్లినికల్ ట్రయిల్స్ చేపడతామన్నారు. మొదటి ఫేస్ 28 రోజులు ఉంటుందన్నారు. సమావేశంలో నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment