సాక్షి, లక్డీకాపూల్: నిజామ్స్ ఇనిస్టిట్యూట్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న వలంటీర్లు వైద్యుల నిరంతర పర్యవేక్షణలో కొనసాగుతున్నారు. భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న కోవాక్జిన్ ట్రయల్స్‌లో భాగస్వాములైన వలంటీర్లపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. మొదటి దశ టీకా తీసుకున్న 53 మంది వలంటీర్లలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉత్పన్నం కాలేదు. వీరందరికీ తొలుత మూడు మైక్రో గ్రాముల మోతాదులో కోవాక్జిన్ టీకా ప్రయోగం చేశారు. ఆ తర్వాత 14 రోజులకు అదే కోడ్‌కు సంబంధించిన బూస్టర్ డోస్‌ను కూడా ఇచ్చారు.
నిమ్స్ సంచాలకులు డాక్టర్ కె.మనోహర్ పర్యవేక్షణలో నిమ్స్ క్లినికల్ ట్రయల్స్ నోడల్ అధికారి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి.ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో క్లినికల్ ఫార్మకాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్లు, సీనియర్ వైద్యులతో పాటు జనరల్ మెడిసిన్, అనస్తీషియా, రెస్పిరేటరీ మెడిసిన్ వైద్యుల సమన్వయంతో ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వలంటీర్లంతా తమ ఇళ్లలోనే వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు నోడల్ అధికారి పరిశీలిస్తున్నట్లు సమాచారం. 28 రోజుల తర్వాత సెకండ్ ఫేస్ టీకా ఇచ్చేందుకు నిమ్స్ వైద్యులు సంసిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో నిమ్స్ క్లినికల్ ఫార్మకాలజీ విభాగంలోని ల్యాబ్‌ను పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నారు. మరో పక్క వలంటీర్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
అధ్యయన ప్రాంతాల్లోనే..
స్టడీ ప్రోటోకాల్ అవసరాలకు అనుగుణంగా వలంటీర్లు అధ్యయన ప్రాంతంలోనే నివసించాలి. ఆ దిశగా నిమ్స్ వైద్య బృందం అవసరమైన చర్యలు తీసుకుంది. వాస్తవానికి కోవాక్జి్జన్ టీకా వేయించుకునేందుకు ఆసక్తి చూపిన వాళ్లు తాము సిద్ధంగా ఉన్నట్లు రాతపూర్వకంగా ఇవ్వాల్సి ఉంది. అందుకు ముందుకు వచ్చి న వాళ్లలో ఎక్కువగా విద్యార్థి దశలో ఉన్న వాళ్లే పాల్గొన్నారు. మరి కొందరు ఉద్యోగ అన్వేషణలో ఉన్న వాళ్లు కూడా ఉన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ఆదేశాల మేరకు వీరికి టీకా ప్రయోగ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ క్రమంలో తొలుత వారి రక్త నమూనాలను సేకరించి సమగ్రంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. వాస్తవానికి సంపూర్ణ ఆరోగ్యవంతులైన వలంటీర్లను మాత్రమే ఈ ట్రయిల్స్‌కు ఎంపిక చేశారు.
ఇదే క్రమంలో ఆయా వలంటీర్ల ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీలోని ఐసీఎంఆర్ అనుమతించిన ల్యాబ్‌కు నివేదికను అందజేశారు. ఆ ల్యాబ్ వలంటీర్ల ఫిట్‌నెట్‌పై ఆమోదం తెలిపిన మేరకే టీకా ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. మొదటి దశలో టీకా, బూస్టర్ డోస్ తీసుకున్నారు. 28 రోజుల తర్వాత రెండవ దశలో టీకా తీసుకోవాల్సి ఉంది. అది కూడా ఈ నెల 29వ తేదీ నుంచి అధ్యయన గడువు ముగుస్తుంది. ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఈ వలంటీర్లందరికీ సెప్టెంబరు రెండవ వారంలో రెండవ దశ టీకాలు ఇవ్వనున్నారు. 45 రోజులకు మూడవ దశ టీకా.. 90 రోజుల తర్వాత నాల్గోవ డోస్ టీకా.. చివరిగా 180 రోజులకు మలి దశ టీకా ప్రయోగం జరుగుతుంది. వాస్తవానికి ఈ టీకా ప్రయోగం జూలై 14న మొదలైంది.
నవంబర్ నెలాఖరు నాటికి కోవాక్జిన్..
నవంబర్ నెలాఖరు నాటికి భారత్ బయోటెక్ ఫార్మసూటికల్ సంస్థ తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ కోవాక్జి్జన్ టీకా అందుబాటులోకి వస్తుందని నిమ్స్ వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఫేజ్–2 ట్రయిల్స్ ముగిసిన తర్వాత దాదాపుగా ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందంటున్నారు. వాస్తవానికి ఆగస్టు 15వ తేదీ నాటికి ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని భారత్ బయోటెక్ వెల్లడించింది. అయితే క్లినికల్ ట్రయిల్స్ ప్రక్రియ కొనసాగుతుండటంతో కొంతమేర జాప్యం ఏర్పడుతుంది. ఏదిఏమైనా కోవిడ్–19కి ప్రివ్వెంటీ వ్యాక్సిన్ అయిన టీకా ఎంత కాలం తన ప్రభావాన్ని చూపుతుందన్న అంశంలో ఈ ఫేజ్–2లో స్పష్టమవుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. రెండు దశలలో నిర్వహించే హ్యూమన్ క్లినికల్ ట్రయిల్స్‌లో కోవాగ్జిన్ పనితీరుపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. ఆ మేరకు ఈ టీకాను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. దాని వల్ల ప్రజల్లో ఏర్పడిన ఆందోళన కూడా తగ్గుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment