లక్డీకాపూల్: కరోనా మహమ్మారిని తుదముట్టించే క్రమంలో అడుగులు వడివడిగా పడుతున్నాయి. కొవాక్జిన్ క్లినికల్ ట్రయల్స్ 2వ ఫేజ్‌కు నిమ్స్‌కసరత్తు చేపట్టింది. ఫార్మా దిగ్గజ భారత్‌బయోటెక్ సంస్థకు చెందిన ఈ వ్యాక్సిన్ మానవ ప్రయోగ ప్రక్రియను నిమ్స్ ఆస్పత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ క్రమంలో ఐసీఎంఆర్ ఆదేశాలకనుగుణంగా కొవాక్జిన్ వ్యాక్సిన్‌ను మనుషులపై ప్రయోగించే ప్రక్రియను శరవేగంగాకొనసాగిస్తోంది. సంపూర్ణ ఆరోగ్యవంతులపై ప్రయోగించే అంశంలో నిమ్స్ వైద్యులు ఏమాత్రం రాజీ లేకుండా ముందుకు అడుగులేస్తున్నారు. నిర్దేశిత నిబంధనలను అనుసరిస్తూ.. 50 మంది వలంటీర్లకు కొవాక్జిన్ టీకాను 3 ఎంఎల్, 6 ఎంఎల్ మోతాదులో టీకాలను ఇచ్చింది.
వీరంతా టీకా మందు తీసుకున్న గంటల వ్యవధిలోనే తమ తమ ఇళ్లకు వెళ్లి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వీరికి బూస్టర్ డోస్‌ను సైతం ఇస్తున్నారు. ఈ ప్రక్రియ కూడా దాదాపుగా ముగింపు దశకు వస్తోంది. దీంతో క్లినికల్ ట్రయల్స్‌లో ఫేజ్– 1ను విజయవంతంగా పూర్తి చేసినట్లవుతుంది. ఈ బూస్టర్ తీసుకున్న తర్వాత దాదాపు 28 రోజుల పాటు వ్యాక్సిన్ పనితీరుపై వైద్యులు దృష్టి పెట్టనున్నారు. వాస్తవానికి ఈ టీకా తీసుకున్న వలంటీర్లలో ఇప్పటి వరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానరాలేదు. ఇందుకు నిమ్స్ వైద్యులు తీసుకున్న జాగ్రత్తలు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఇదే క్రమంలో రెండు మోతాదుల్లో ఇచ్చిన వ్యాక్సిన్‌లు ఏ విధంగా పని చేస్తున్నాయన్న అంశంపై నిమ్స్ క్లినికల్ ట్రయల్స్ నోడల్ అధికారి డాక్టర్ సి.ప్రభాకర్‌రెడ్డి నేతృత్వంలోని వైద్య బృందం అధ్యయనం చేపట్టింది. దీంతో కొవాక్జిన్ పనితీరు తేటతెల్లమవుతుందంటున్నారు.
అందులోనూ ఏ మోతాదు ఎంతవరకు పని చేస్తుందన్న అంశంపై స్పష్టత ఏర్పడుతుందని చెబుతున్నారు. ఈ తరహా ప్రక్రియ రెండు వారాల పాటు కొనసాగుతుందని నిమ్స్ వైద్యులు పేర్కొంటున్నారు. బూస్టర్ డోస్ ముగిసిన నాటి నుంచి 28 రోజుల వరకు ఆయా వలంటీర్ల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తారు. ఆ తర్వాత ఫేజ్–2 ప్రక్రియను చేపట్టేందుకు నిమ్స్ క్లినికల్ ట్రయల్స్ వైద్య బృందం కసరత్తు చేపట్టింది. ఇందులో భాగంగా టీకాలు తీసుకున్న వలంటీర్లకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలు ముగిసిన తర్వాత మొదటి ఫేజ్‌లో ఇచ్చిన మోతాదుల్లో మెరుగైన ఒక మోతాదు టీకాను ఇవ్వనున్నారు. ఈ ప్రయోగం కూడా విజయవంతమైతే కరోనా మహమ్మారికి చెక్ పెట్టినట్టే. సెకండ్ ఫేజ్ ట్రయల్స్ పూర్తయిన తర్వాత ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్నిస్తున్నాయి. కొవాక్జిన్ సెప్టెంబర్ నెలలో అందుబాటులోకి వస్తుందన్న ఆశాభావాన్ని నిమ్స్ వైద్యులు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment