phase-II
-
హైదరాబాద్ మెట్రో విస్తరణ: ఏయే రూట్లో అంటే..
సాక్షి, హైదరాబాద్: నగరంలో పెరిగిన ట్రాఫిక్ రద్దీని నివారించడంతోపాటు భవిష్యత్ రవాణా అవసరాలను, ఎయిర్‌పోర్టు కనెక్టివిటీని దృష్టిలో ఉంచుకొని మెట్రోరైలు రెండో దశ ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు 70 కిలోమీటర్ల పొడవుతో రూపొందించిన ఫేజ్–2 మెట్రో రూట్‌మ్యాప్‌ను ఖరారుచేశారు. రెండో కారిడార్ పొడిగింపుతోపాటు నాలుగు కొత్త కారిడార్లు కలిపి కొత్త రూట్‌మ్యాప్‌ను రూపొందించారు. దీనికి ప్రభుత్వపరంగా ఆమోదముద్ర పడితే తదుపరి ప్రక్రియ మొదలవుతుందని హెచ్ఎంఆర్ఎల్ అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం రూపొందించిన విస్తరణ ప్రణాళికలను పక్కనబెట్టి, తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి మెట్రో కనెక్టివిటీ రీచ్ అయ్యేలా కొత్త రూట్‌ను డిజైన్ చేశారు. హైదరాబాద్ పాత నగరంతోపాటు కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ ఉండేలా రూపొందించడం విశేషం. రెండోదశ మెట్రో రూట్ మ్యాప్ ఇదీ... హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం మూడు కారిడార్లలో 69 కి.మీ. మేర అందుబాటులో ఉంది. మియాపూర్ టు ఎల్బీ నగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, నాగోల్ టు రాయదుర్గం వరకు కనెక్టివిటీ ఉంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకున్న రెండో కారిడార్‌ను ఫేజ్–1లో ప్రతిపాదించిన ఫలక్‌నుమా వరకు పొడిగించి, అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్స్ వరకు మొత్తంగా 7 కి.మీ. పొడిగించాలని కొత్త రూట్‌మ్యాప్‌లో ప్రతిపాదించారు. కారిడార్ 4: నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు, అక్కణ్నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు, మైలార్దేవ్ పల్లి, పీ7 రోడ్డు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు (మొత్తం 29 కి.మీ.), అలాగే మైలార్దేవ్ పల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా రాజేంద్రనగర్‌లో ప్రతిపాదించిన హైకోర్టు వరకు (4 కి.మీ.) ఉంటుంది. కారిడార్ 5: రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి బయో డైవర్సిటీ జంక్షన్, నానక్ రామ్ గూడ జంక్షన్, విప్రో జంక్షన్, అమెరికన్ కాన్సులేట్ (ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్) వరకు (8 కి.మీ.) కారిడార్ 6: మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి బీహెచ్ఈఎల్ మీదుగా పటాన్చెరు వరకు (14 కి.మీ.) కారిడార్ 7: ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం, హయత్ నగర్ వరకు (8 కి.మీ.) -
ఇక చెత్త కనిపించదు: మోదీ
న్యూఢిల్లీ: స్వచ్ఛభారత్ మిషన్–అర్బన్, అటల్ మిషన్ ఫర్ రెజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్సఫర్మేషన్ (అమృత్) పథకాల రెండో దశను శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. పట్టణ ప్రాంతాల ప్రజలకు చెత్త నుంచి విముక్తి కలిగించడంతో పాటు, తాగునీటి భద్రత కల్పించడమే ఈ పథకాల ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ దశలో మురుగునీటిని శుద్ధి చేయకుండా నదుల్లోకి వదలమని చెప్పారు. అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఎస్బీఎం 2.0, అమృత్ 2.0ను ప్రారంభించిన ప్రధాని అంబేడ్కర్ కలలు సాకారం అవడానికి కూడా ఈ పథకాల ప్రారంభం ఒక ముఖ్యమైన అడుగు అని అన్నారు.సమాజంలో అసమానతలు తొలగించడానికి పట్టణాభివృద్ధి కూడా కీలకపాత్ర పోషిస్తుందని దాదాసాహెబ్ భావించేవారని, అలాంటి చోట ఈ కార్యక్రమం జరగడం హర్షించదగిన విషయమని అన్నారు. మెరుగైన జీవితం కోసం ఎన్నో కలలతో గ్రామాల నుంచి పట్టణాలకు వస్తారని, వారికి ఉద్యోగాలు వచ్చినప్పటికీ జీవన ప్రమాణాలు దక్కడం లేదని అన్నారు. ఇళ్లకి దూరంగా వచ్చిన వారు ఇలాంటి పరిస్థితుల్లో నివసించడం చాలా దారుణమైన విషయమని అందుకే పట్టణాల్లో పరిస్థితులు మారాలని అన్నారు. రోజుకి లక్ష టన్నుల వ్యర్థాలు: దేశంలో ప్రతీ రోజూ లక్ష టన్నుల చెత్త వస్తోందని, పట్టణాల్లో ఎక్కడికక్కడ కొండల్లా పేరుకుపోతున్న ఈ చెత్తను తొలగించడమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. 2014లో స్వచ్ఛభారత్‌ని బహిరంగ మల విసర్జనకి వ్యతిరేకంగా చేపట్టామని ఆ దశలో 10 కోట్లకు పైగా టాయిలెట్లు నిర్మించామని చెప్పారు. ఈ సారి పట్టణాల్లో చెత్త నుంచి ప్రజల్ని విముక్తి చేయడమే లక్ష్యమని ప్రధాని చెప్పారు. అమృత్‌లో భాగంగా మురుగునీరు నదుల్లోకి కలవకుండా చూస్తామని, పట్టణ ప్రాంత ప్రజలకు సురక్షిత మంచినీరు అందిస్తామని ప్రధాని చెప్పారు. పరిసరాల పరిశుభ్రత ప్రచారాన్ని యువతరం అందిపుచ్చుకుందని మోదీ చెప్పారు. ఎక్కడ పడితే అక్కడ చిత్తు కాగితాలు విసిరివేయొద్దని, జేబులో ఉంచుకొని తర్వాత చెత్త బుట్టలో వెయ్యాలన్నారు. చిన్న చిన్న పిల్లలే రోడ్లపై ఉమ్మి వేయొద్దని పెద్దలకి చెబుతున్నారని అన్నారు. ఇదేదో ఒక్క రోజో, ఒక ఏడాదో చేసే కార్యక్రమం కాదని, ప్రతీ రోజూ చేయాలని, ఒక తరం నుంచి మరో తరానికి స్వచ్ఛభారత్ ప్రయాణం కొనసాగించాలని అన్నారు. 70% చెత్త శుద్ధి చేస్తున్నాం 2014లో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభమైనప్పుడు దేశంలో పేరుకుపోయే చెత్తలో 20 శాతం కంటే తక్కువ మాత్రమే శుద్ధి అయ్యేదని, ఇప్పుడు 70% చెత్తను శుద్ధి చేస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. త్వరలోనే దానిని 100 శాతానికి తీసుకువెళతామని చెప్పారు. పట్టణాభివృద్ధి శాఖకి 2014లో 1.25 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తే, ప్రస్తుతం రూ.4 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టుగా చెప్పారు. అర్బన్ 2.0కి 1.41 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టుగా వెల్లడించారు. ఆ మిషన్‌ని మూడు ఆర్లు (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్) ద్వారా ముందుకు తీసుకువెళతామని ప్రధాని మోదీ వివరించారు. ఇక అమృత్‌లో భాగంగా భూగర్భ జల సంరక్షణకు చర్యలు చేపడతారు. అత్యంత ఆధునిక టెక్నాలజీని వినియోగిం చుకుంటూ మురుగు నీరు భూగర్భంలోకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. -
నిమ్స్‌లో క్లినికల్ ట్రయల్స్ 2వ ఫేజ్‌కు..
లక్డీకాపూల్: కరోనా మహమ్మారిని తుదముట్టించే క్రమంలో అడుగులు వడివడిగా పడుతున్నాయి. కొవాక్జిన్ క్లినికల్ ట్రయల్స్ 2వ ఫేజ్‌కు నిమ్స్కసరత్తు చేపట్టింది. ఫార్మా దిగ్గజ భారత్‌బయోటెక్ సంస్థకు చెందిన ఈ వ్యాక్సిన్ మానవ ప్రయోగ ప్రక్రియను నిమ్స్ ఆస్పత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ క్రమంలో ఐసీఎంఆర్ ఆదేశాలకనుగుణంగా కొవాక్జిన్ వ్యాక్సిన్‌ను మనుషులపై ప్రయోగించే ప్రక్రియను శరవేగంగాకొనసాగిస్తోంది. సంపూర్ణ ఆరోగ్యవంతులపై ప్రయోగించే అంశంలో నిమ్స్ వైద్యులు ఏమాత్రం రాజీ లేకుండా ముందుకు అడుగులేస్తున్నారు. నిర్దేశిత నిబంధనలను అనుసరిస్తూ.. 50 మంది వలంటీర్లకు కొవాక్జిన్ టీకాను 3 ఎంఎల్, 6 ఎంఎల్ మోతాదులో టీకాలను ఇచ్చింది. వీరంతా టీకా మందు తీసుకున్న గంటల వ్యవధిలోనే తమ తమ ఇళ్లకు వెళ్లి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వీరికి బూస్టర్ డోస్‌ను సైతం ఇస్తున్నారు. ఈ ప్రక్రియ కూడా దాదాపుగా ముగింపు దశకు వస్తోంది. దీంతో క్లినికల్ ట్రయల్స్‌లో ఫేజ్– 1ను విజయవంతంగా పూర్తి చేసినట్లవుతుంది. ఈ బూస్టర్ తీసుకున్న తర్వాత దాదాపు 28 రోజుల పాటు వ్యాక్సిన్ పనితీరుపై వైద్యులు దృష్టి పెట్టనున్నారు. వాస్తవానికి ఈ టీకా తీసుకున్న వలంటీర్లలో ఇప్పటి వరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానరాలేదు. ఇందుకు నిమ్స్ వైద్యులు తీసుకున్న జాగ్రత్తలు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఇదే క్రమంలో రెండు మోతాదుల్లో ఇచ్చిన వ్యాక్సిన్లు ఏ విధంగా పని చేస్తున్నాయన్న అంశంపై నిమ్స్ క్లినికల్ ట్రయల్స్ నోడల్ అధికారి డాక్టర్ సి.ప్రభాకర్‌రెడ్డి నేతృత్వంలోని వైద్య బృందం అధ్యయనం చేపట్టింది. దీంతో కొవాక్జిన్ పనితీరు తేటతెల్లమవుతుందంటున్నారు. అందులోనూ ఏ మోతాదు ఎంతవరకు పని చేస్తుందన్న అంశంపై స్పష్టత ఏర్పడుతుందని చెబుతున్నారు. ఈ తరహా ప్రక్రియ రెండు వారాల పాటు కొనసాగుతుందని నిమ్స్ వైద్యులు పేర్కొంటున్నారు. బూస్టర్ డోస్ ముగిసిన నాటి నుంచి 28 రోజుల వరకు ఆయా వలంటీర్ల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తారు. ఆ తర్వాత ఫేజ్–2 ప్రక్రియను చేపట్టేందుకు నిమ్స్ క్లినికల్ ట్రయల్స్ వైద్య బృందం కసరత్తు చేపట్టింది. ఇందులో భాగంగా టీకాలు తీసుకున్న వలంటీర్లకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలు ముగిసిన తర్వాత మొదటి ఫేజ్‌లో ఇచ్చిన మోతాదుల్లో మెరుగైన ఒక మోతాదు టీకాను ఇవ్వనున్నారు. ఈ ప్రయోగం కూడా విజయవంతమైతే కరోనా మహమ్మారికి చెక్ పెట్టినట్టే. సెకండ్ ఫేజ్ ట్రయల్స్ పూర్తయిన తర్వాత ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్నిస్తున్నాయి. కొవాక్జిన్ సెప్టెంబర్ నెలలో అందుబాటులోకి వస్తుందన్న ఆశాభావాన్ని నిమ్స్ వైద్యులు వ్యక్తం చేస్తున్నారు. -
కోవాక్జిన్ రెండో దశ ట్రయల్స్ షురూ
నాగ్‌పూర్: హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ తయారుచేసిన కోవిడ్–19 టీకా ‘కోవాక్జిన్’రెండోదశ మానవ ప్రయోగాలు నాగ్‌పూర్‌లో బుధవారం మొదలయ్యాయి. కోవాక్జిన్‌ను మనుషులపై ప్రయోగించేందుకు దేశవ్యాప్తంగా మొత్తం 12 ఆస్పత్రులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇందులో హైదరాబాద్‌లోని నిమ్స్, వైజాగ్‌లోని కేజీహెచ్ కూడా ఉన్నాయి. వలంటీర్ల నమూనాలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కు పంపి... సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నారని నిర్ధారణ జరిగిన తర్వాత వారికి టీకాను ఇస్తున్నారు. నాగ్‌పూర్‌లోని గిల్లూర్కర్ ఆస్పత్రిలో బుధవారం రెండో దశ ప్రయోగం ప్రారంభమయ్యింది. టీకా సమర్థత, రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తున్న తీరు, సైడ్ ఎఫెక్ట్స్ పరిశీలిస్తారు. వందల మంది వలంటీర్లపై ఈ ప్రయోగం ఉంటుంది. -
కరోనా వ్యాక్సిన్ : రెండో దశ క్లినికల్ ట్రయల్స్
బీజింగ్ : కోవిడ్-19 మహమ్మారిని అంతమొందించే చర్యల్లో చైనా మరో అడుగు ముందుకేసింది. చైనా శాస్త్రవేత్తలు కరోనా వైరస్ టీకా రెండవ దశ క్లినికల్ ట్రయల్స్ ను మొదలు పెట్టింది. ఇందుకు దాదాపు 500 మంది వాలంటీర్లను నియమించుకుంది. ముఖ్యంగా వుహాన్ కు చెందిన 84 ఏళ్ల వుహాన్ నివాసి కూడా ఉన్నారు. మార్చిలో చేపట్టిన మొదటి దశ పరీక్షల్లో పరిశోధకులు టీకా భద్రతపై దృష్టి సారించగా, రెండవ దశలో దృష్టి టీకా సమర్థతపై దృష్టి పెట్టారు. అలాగే రెండవ దశలో మొదటి దశ కంటే ఎక్కువమంది వాలంటీర్లు ఉన్నారనీ, ఇందులో ప్లేసిబో నియంత్రణ బృందం కూడా ఉందని అధ్యయనవేత్తలు తెలిపారు. ముఖ్యంగా, క్లినికల్ హ్యూమన్ టెస్టింగ్‌లో మొదటి దశగా వారు తెలిపారు. రెండు ప్రయోగాత్మక వ్యాక్సిన్లకుగాను మానవ పరీక్షలను చైనా ఆమోదించినట్లు చైనా మీడియా జిన్హువా మంగళవారం నివేదించింది. (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం) ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ, అకాడమీ ఆఫ్ మిలిటరీ మెడికల్ సైన్సెస్ ఆఫ్ చైనా జెనెటిక్ ఇంజనీరింగ్ పద్దతుల్లో కోవిడ్-19 వ్యాక్సిన్ ను అభివృద్ది చేసింది. ఈ పరిశోధనా బృందానికి పిఎల్ఎ మేజర్ జనరల్ చెన్ వీ నేతృత్వం వహిస్తున్నారు.దీనికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ గేబ్రేయేసెస్ సోమవారం (ఏప్రిల్ 13) మాట్లాడుతూ, కరోనావైరస్ కోవిడ్ -19 స్వైన్ ఫ్లూ కంటే 10 రెట్లు ఎక్కువ ప్రాణాంతకమని, ఒక టీకా మాత్రమే కరోనావైరస్ పూర్తిగా అడ్డుకోగలదని స్పష్టం చేశారు. ఇది 2009 ఫ్లూ మహమ్మారి కంటే 10 రెట్లు ప్రాణాంతకమని ఆయన చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి 1 లక్ష 19వేల 587 మంది, దేశంలొ 339 మంది మృత్యువాత పడ్డారు. ( కరోనా : ఎగతాళి చేసిన టిక్‌టాక్ స్టార్ కు పాజిటివ్ ) చదవండి : కరోనా : తల్లినుంచి నవజాత శిశువుకు వచ్చే ప్రమాదం పేదల ఊసే లేదు, రాష్ట్రాలకు సాయం లేదు China's #COVID19 vaccine has taken the lead to enter Phase II clinical trials, recruiting 500 volunteers including an 84-year-old Wuhan resident. The recombinant vaccine was developed by #China’s CanSino Biologics Inc under a research team headed by PLA Major General Chen Wei. pic.twitter.com/wiDwR55cPu — Global Times (@globaltimesnews) April 14, 2020 -
ఇక పట్టణ ప్రగతి ప్రణాళిక
సిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి ప్రణాళికను అమలు చేస్తామని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంటలో గురువారం రెండో విడత పల్లె ప్రగతి ప్రణాళికను మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. అంతకుముందు మోహినికుంటలో మంత్రులు పర్యటించి ‘పల్లె ప్రగతి’ని పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. పల్లె ప్రగతే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. పల్లె ప్రగతి కార్యాచరణలో భాగంగా రాష్ట్రంలోని 12,751 గ్రామాలు ఎంతో అభివృద్ధి సాధించాయని, అదే స్ఫూర్తితో రెండో విడతను అమలు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల తర్వాత నూతన మున్సిపల్ పాలక వర్గాలకు శిక్షణ ఇచ్చి, పకడ్బందీగా పట్టణ ప్రగతి ప్రణాళికను అమలు చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. మోహినికుంట తమ తాత సొంత ఊరు అని, స్థలం ఇస్తే ఇక్కడ తాత, నాయనమ్మల పేరిట సొంత ఖర్చులతో ఫంక్షన్ హాలు నిర్మిస్తామని కేటీఆర్ ప్రకటించారు. మోహినికుంట వెళ్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెబితే.. ఆ ఊరి కోసం ఏదైనా మంచి పని చేయాలని సూచించారని కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్‌కు సీఎం అయ్యే అర్హతలు ఉన్నాయి వర్ధన్నపేట: ‘మంత్రి కేటీఆర్‌కు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి.. ఆయన అన్ని విధాల సమర్థుడు. కేటీఆర్ నాయకత్వంలో జరిగిన అన్ని ఎన్నికల్లో విజయం సాధించాం’ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా దమ్మన్నపేటలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి గురువారం ప్రారంభించారు. -
గాలేరు – నగరి రెండో దశ రెండో ప్యాకేజీలో రూ.33.57 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం రెండో దశలో రెండో ప్యాకేజీ పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.33.57 కోట్లు ఆదా అయ్యాయి. ఎన్నికలకు ముందు ఈ పథకం రెండో దశలో ఏడు ప్యాకేజీల పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను బెదిరించి ప్రీ–క్లోజర్ చేసుకునేలా చక్రం తిప్పిన గత ప్రభుత్వ పెద్ద.. ఆ పనుల అంచనా వ్యయాన్ని పెంచి, అధిక ధరకు ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు దండుకున్నారు. రెండో ప్యాకేజీ (గాలేరు–నగరి ప్రధాన కాలువ 66.15 కిలోమీటర్ల నుంచి 96.50 కిలోమీటర్ల వరకు తవ్వడం, 12 వేల ఎకరాలకు నీళ్లందించడానికి పిల్ల కాలువలు తవ్వడం) పనుల అంచనా వ్యయాన్ని రూ.343.97 కోట్లకు పెంచి లంప్సమ్–ఓపెన్ పద్ధతిలో టెండర్ నోటిఫికేషన్లను జారీ చేయించారు. తాను ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌ను కాదని బిడ్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లపై అనర్హత వేటు వేయించారు. ఆ కాంట్రాక్టర్లు న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానంలో ఆ కేసు విచారణలో ఉండగానే సింగిల్ బిడ్‌గా దాఖలు చేసిన టెండర్‌ను ఆమోదించేలా అధికారులపై ఒత్తిడి తెచ్చి 4.76 శాతం అధిక ధర (రూ.360.35)కు ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు పనులు కట్టబెట్టారు. దాంతో ఖజానాపై రూ.16.38 కోట్ల భారం పడింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇలా చేసింది.. పనులు ప్రారంభించకపోవడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేసిన గాలేరు–నగరి అధికారులు.. రూ.343.97 కోట్ల అంచనా వ్యయంతో 36 నెలల్లో ఆ పనులు పూర్తిచేయాలనే షరతుతో రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఫైనాన్స్ బిడ్‌ను శుక్రవారం ఉదయం 11 గంటలకు తెరిచారు. నాలుగు సంస్థలు (ఎమ్మార్కేఆర్, ఎస్సీఎల్, బీవీఎస్సార్, బృందా ఇన్ఫ్రాటెక్) పోటీ పడుతూ బిడ్లు దాఖలు చేశాయి. 4.5 శాతం తక్కువ ధర (రూ.328.50 కోట్లు)కు కోట్ చేసిన సంస్థ ఎల్–1గా నిలిచింది. దాంతో ప్రైస్ బిడ్ స్థాయిలోనే రూ.15.47 కోట్లు ఆదా అయ్యాయి. రూ.328.50 కోట్లనే కాంట్రాక్టు విలువగా పరిగణించిన అధికారులు శుక్రవారం మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు ఈ–ఆక్షన్ (రివర్స్ టెండరింగ్) నిర్వహించారు. ఐదు శాతం తక్కువ ధర(రూ.326.78 కోట్లు)కు కోట్ చేసిన సంస్థ ఎల్–1గా నిలిచించింది. దాంతో ఆ సంస్థకే పనులు అప్పగించాలని సిఫార్సు చేస్తూ కమిషనర్ ఆఫ్ టెండర్స్(సీవోటీ)కు గాలేరు–నగరి అధికారులు నివేదిక పంపనున్నారు. దీని వల్ల ఖజానాకు రూ.17.19 కోట్లు ఆదా అయ్యాయి. గతంతో 4.76 శాతం అధిక ధరలకు అప్పగించడం వల్ల ఖజానాపై రూ.16.38 కోట్ల భారం పడింది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం ఖజానాకు రూ.33.57 కోట్లు ఆదా అయినట్లు స్పష్టమవుతోంది. మొత్తంగా 9.76 శాతం తక్కువ ధరకు పనులు అప్పగించినట్లయింది. కాగా, ఈ నెల 19న రెండో దశలోని మొదటి ప్యాకేజీ పనులకు నిర్వహించిన రివర్స్ టెండరింగ్ వల్ల రూ.35.3 కోట్లు ఖజానాకు ఆదా అయిన విషయం తెలిసిందే. మొత్తంగా ఈ విధానం వల్ల రాష్ట్ర ఖజానాకు ఇప్పటి దాకా రూ.1752.83 కోట్లు ఆదా అయ్యాయి. టిడ్కో నాలుగో దశ రివర్స్‌టెండరింగ్‌లో రూ.47.48కోట్లు ఆదా ఏపీ టౌన్షిప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) నిర్వహించిన నాలుగో దశ రివర్స్‌టెండరింగ్‌లో రూ.47.48 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 8,448 ఇళ్ల నిర్మాణానికి ఏపీ టిడ్కో శుక్రవారం రూ.431.62 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్ టెండర్లు పిలవగా ఇంద్రజిత్ మెహతా కన్స్ట్రక్షన్స్ రూ.384.14 కోట్లకు బిడ్ దాఖలు చేసి ఎల్–1గా నిలిచింది. దాంతో రూ.47.48 కోట్ల ప్రజాధానం ఆదా అయ్యింది. ఇంతకు ముందు మూడు దశల్లో 40,160 ఇళ్ల నిర్మాణానికి ఈ విధానం ద్వారా రూ.255.83 కోట్ల ప్రజాధనం మిగిలిన విషయం తెలిసిందే. మొత్తంగా నాలుగు దశల్లో 48,608 ఇళ్ల నిర్మాణానికి రూ.2,399 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్ టెండర్లు నిర్వహించగా రూ.303.31 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ సత్ఫలితాలు ఇస్తున్నందున మరిన్ని ప్రాజెక్టుల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. -
శివారు.. సిటీ.. ఓ ఎంఎంటీఎస్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివారు ప్రాంతాలను నగరంతో అనుసంధానం చేసేందుకు ఉద్దేశించిన ఎంఎంటీఎస్ రెండో దశ పనులు శరవేగంగా సాగుతు న్నాయి. ఎంఎంటీఎస్ 2వ దశ మొత్తం 96.25 కి.మీల దూరంతో రూ.641 కోట్ల అంచనా వ్యయంతో 2012– 13లో ఈ పనులకు అనుమతులు వచ్చాయి. పెరిగిన అంచనా వ్యయం మేరకు రూ.817 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాయి. ఇందులో రాష్ట్రం రూ.544 కోట్లు, దక్షిణ మధ్య రైల్వే రూ.272 కోట్లు భరించాలి. అయితే ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.110 కోట్లు మాత్రమే విడుదల చేయగా, దక్షిణ మధ్య రైల్వే తన వంతు నిధులను పూర్తిగా ఖర్చు చేసింది. మిగతా నిధులు కూడా విడుదలైతే ప్రాజెక్టును త్వరగా అందుబాటులోకి తీసుకువస్తా మని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. ఈ పనులు పూర్తయితే తెల్లాపూర్–రామచంద్రాపురం, సనత్‌నగర్–మేడ్చల్–బొల్లారం, ఫలక్‌నుమా–ఉందానగర్ ప్రాంతాలు.. శంషాబాద్ విమానాశ్రయం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లతో సులువుగా అనుసంధానం అవు తాయి. ఫలితంగా నగరవాసులకు భారీగా సమయం, ఇంధన ఆదా, ప్రయాణ ఖర్చులు కలసి వస్తాయి. పెరిగిన అంచనా వ్యయం.... ప్రారంభం నాటి అంచనా ప్రకారం ప్రాజెక్టు విలువ రూ.641 కోట్లు.. తరువాత భూసేకరణ, పనుల్లో జాప్యం తదితర సమస్యల కారణంగా రూ.817 కోట్లకు చేరింది. మిగతా మార్గాల్లో సమస్యలు కొలిక్కి రాగా, సనత్‌నగర్–మౌలాలి మార్గంలోని సుచిత్ర ప్రాంతంలో భూ సేకరణపై కాస్త ప్రతిష్టంభన నెలకొంది. దీనిపై ద.మ.రైల్వే, రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ప్రారంభానికి సిద్ధంగా ఉన్నవి.. ♦ 1. తెల్లాపూర్–రామచంద్రాపురం ♦ 2. సికింద్రాబాద్–బొల్లారం ఇంకా రావాల్సింది.. రూ.434 కోట్లు.. ఒప్పందం ప్రకారం ఈ సంవత్సరం డిసెంబర్ 18 నాటికి పనులు పూర్తవ్వాలి. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వాటాలోని మిగిలిన రూ.434 కోట్లు కూడా విడుదలైతే త్వరలోనే రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఎంఎంటీఎస్ 2వ దశ మార్గాలివే... 1.ఫలక్‌నుమా–ఉందానగర్–శంషాబాద్ ఎయిర్‌పోర్టు (13.5 కి.మీ.+6.5 కి.మీ.) డబ్లింగ్+ఎలక్ట్రిఫికేషన్ పనులు. అంచనా వ్యయం రూ.85 కోట్లు. (ఇందులో ఉందానగర్– ఎయిర్‌పోర్టు 6.5 కి.మీ.ల దూరంలో కొత్త రైల్వేలైను నిర్మాణ పనులకు ఇంకా అనుమతి రాలేదు.) 2.తెల్లాపూర్–రామచంద్రాపురం (5.75కి.మీ). పాత ట్రాక్‌ను పునరుద్ధరణ+విద్యుదీకరణ. అంచనా వ్యయం రూ.32 కోట్లు 3. సికింద్రాబాద్–బొల్లారం (14కి.మీ.).ఎలక్ట్రిఫికేషన్+స్టేషన్ ఆధునీకరణ.అంచనా వ్యయం రూ.30 కోట్లు 4.సనత్‌నగర్–మౌలాలి (22.4 కి.మీ.). డబ్లింగ్+ఎలక్ట్రిఫికేషన్. అంచనా వ్యయం రూ.170 కోట్లు 5. మౌలాలి–మల్కాజిగిరి–సీతాఫల్మండి (10 కి.మీ.). డబ్లింగ్+ఎలక్ట్రిఫికేషన్. అంచనా వ్యయం రూ.25 కోట్లు 6. బొల్లారం–మేడ్చల్ (14 కి.మీ.). డబ్లింగ్+ఎలక్ట్రిఫికేషన్. అంచనా వ్యయం రూ.74 కోట్లు. 7. మౌలాలి–ఘట్కేసర్ (12.2 కి.మీ.).నాలుగులైన్ల నిర్మాణం+ఎలక్ట్రిఫికేషన్.అంచనా వ్యయం రూ.120 కోట్లు 8. ప్రయాణికుల సదుపాయాలకురూ.20 కోట్లు 9. రైలు కోచ్‌లకు రూ.85 కోట్లు మొత్తం వ్యయం... 641 కోట్లు గడువులోగా పూర్తి చేస్తాం... ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రభుత్వం కూడా మాకు పూర్తిగా సహకరిస్తోంది. ఇప్పటికే మంత్రి కేటీఆర్‌తో సమావేశం నిర్వహించాం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిధులు కూడా విడుదల చేసింది. గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న నమ్మకం ఉంది. – వినోద్‌కుమార్ యాదవ్, జీఎం, ద.మ. రైల్వే -
బిహార్ రెండో దశ ఎన్నికల్లో 55 శాతం ఓటింగ్
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. 32 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 55 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ఆరు జిల్లాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నెల 12న తొలి విడత పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. రెండు విడతల్లోనూ పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ రోజు 57.5 శాతం మంది మహిళలు, 52.5 శాతం మంది పురుషులు ఓటేశారు.