సాక్షి, హైదరాబాద్: నగరంలో పెరిగిన ట్రాఫిక్ రద్దీని నివారించడంతోపాటు భవిష్యత్ రవాణా అవసరాలను, ఎయిర్‌పోర్టు కనెక్టివిటీని దృష్టిలో ఉంచుకొని మెట్రోరైలు రెండో దశ ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు 70 కిలోమీటర్ల పొడవుతో రూపొందించిన ఫేజ్–2 మెట్రో రూట్‌మ్యాప్‌ను ఖరారుచేశారు. రెండో కారిడార్ పొడిగింపుతోపాటు నాలుగు కొత్త కారిడార్లు కలిపి కొత్త రూట్‌మ్యాప్‌ను రూపొందించారు. దీనికి ప్రభుత్వపరంగా ఆమోదముద్ర పడితే తదుపరి ప్రక్రియ మొదలవుతుందని హెచ్‌ఎంఆర్‌ఎల్ అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం రూపొందించిన విస్తరణ ప్రణాళికలను పక్కనబెట్టి, తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి మెట్రో కనెక్టివిటీ రీచ్ అయ్యేలా కొత్త రూట్‌ను డిజైన్ చేశారు. హైదరాబాద్ పాత నగరంతోపాటు కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ ఉండేలా రూపొందించడం విశేషం.
రెండోదశ మెట్రో రూట్ మ్యాప్ ఇదీ...
హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం మూడు కారిడార్లలో 69 కి.మీ. మేర అందుబాటులో ఉంది. మియాపూర్ టు ఎల్బీ నగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, నాగోల్ టు రాయదుర్గం వరకు కనెక్టివిటీ ఉంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకున్న రెండో కారిడార్‌ను ఫేజ్–1లో ప్రతిపాదించిన ఫలక్‌నుమా వరకు పొడిగించి, అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్స్ వరకు మొత్తంగా 7 కి.మీ. పొడిగించాలని కొత్త రూట్‌మ్యాప్‌లో ప్రతిపాదించారు.
కారిడార్ 4: నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు, అక్కణ్నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు, మైలార్‌దేవ్ పల్లి, పీ7 రోడ్డు నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు (మొత్తం 29 కి.మీ.), అలాగే మైలార్‌దేవ్ పల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా రాజేంద్రనగర్‌లో ప్రతిపాదించిన హైకోర్టు వరకు (4 కి.మీ.) ఉంటుంది.
కారిడార్ 5: రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి బయో డైవర్సిటీ జంక్షన్, నానక్ రామ్ గూడ జంక్షన్, విప్రో జంక్షన్, అమెరికన్ కాన్సులేట్ (ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్) వరకు (8 కి.మీ.)
కారిడార్ 6: మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి బీహెచ్‌ఈఎల్ మీదుగా పటాన్‌చెరు వరకు (14 కి.మీ.)
కారిడార్ 7: ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం, హయత్ నగర్ వరకు (8 కి.మీ.)
Comments
Please login to add a commentAdd a comment