న్యూఢిల్లీ: స్వచ్ఛభారత్ మిషన్–అర్బన్, అటల్ మిషన్ ఫర్ రెజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్సఫర్మేషన్ (అమృత్) పథకాల రెండో దశను శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. పట్టణ ప్రాంతాల ప్రజలకు చెత్త నుంచి విముక్తి కలిగించడంతో పాటు, తాగునీటి భద్రత కల్పించడమే ఈ పథకాల ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ దశలో మురుగునీటిని శుద్ధి చేయకుండా నదుల్లోకి వదలమని చెప్పారు.
అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ఎస్‌బీఎం 2.0, అమృత్ 2.0ను ప్రారంభించిన ప్రధాని అంబేడ్కర్ కలలు సాకారం అవడానికి కూడా ఈ పథకాల ప్రారంభం ఒక ముఖ్యమైన అడుగు అని అన్నారు.సమాజంలో అసమానతలు తొలగించడానికి పట్టణాభివృద్ధి కూడా కీలకపాత్ర పోషిస్తుందని దాదాసాహెబ్ భావించేవారని, అలాంటి చోట ఈ కార్యక్రమం జరగడం హర్షించదగిన విషయమని అన్నారు. మెరుగైన జీవితం కోసం ఎన్నో కలలతో గ్రామాల నుంచి పట్టణాలకు వస్తారని, వారికి ఉద్యోగాలు వచ్చినప్పటికీ జీవన ప్రమాణాలు దక్కడం లేదని అన్నారు. ఇళ్లకి దూరంగా వచ్చిన వారు ఇలాంటి పరిస్థితుల్లో నివసించడం చాలా దారుణమైన విషయమని అందుకే పట్టణాల్లో పరిస్థితులు మారాలని అన్నారు.
రోజుకి లక్ష టన్నుల వ్యర్థాలు: దేశంలో ప్రతీ రోజూ లక్ష టన్నుల చెత్త వస్తోందని, పట్టణాల్లో ఎక్కడికక్కడ కొండల్లా పేరుకుపోతున్న ఈ చెత్తను తొలగించడమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. 2014లో స్వచ్ఛభారత్‌ని బహిరంగ మల విసర్జనకి వ్యతిరేకంగా చేపట్టామని ఆ దశలో 10 కోట్లకు పైగా టాయిలెట్లు నిర్మించామని చెప్పారు. ఈ సారి పట్టణాల్లో చెత్త నుంచి ప్రజల్ని విముక్తి చేయడమే లక్ష్యమని ప్రధాని చెప్పారు.
అమృత్‌లో భాగంగా మురుగునీరు నదుల్లోకి కలవకుండా చూస్తామని, పట్టణ ప్రాంత ప్రజలకు సురక్షిత మంచినీరు అందిస్తామని ప్రధాని చెప్పారు. పరిసరాల పరిశుభ్రత ప్రచారాన్ని యువతరం అందిపుచ్చుకుందని మోదీ చెప్పారు. ఎక్కడ పడితే అక్కడ చిత్తు కాగితాలు విసిరివేయొద్దని, జేబులో ఉంచుకొని తర్వాత చెత్త బుట్టలో వెయ్యాలన్నారు. చిన్న చిన్న పిల్లలే రోడ్లపై ఉమ్మి వేయొద్దని పెద్దలకి చెబుతున్నారని అన్నారు. ఇదేదో ఒక్క రోజో, ఒక ఏడాదో చేసే కార్యక్రమం కాదని, ప్రతీ రోజూ చేయాలని, ఒక తరం నుంచి మరో తరానికి స్వచ్ఛభారత్ ప్రయాణం కొనసాగించాలని అన్నారు.
70% చెత్త శుద్ధి చేస్తున్నాం
2014లో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభమైనప్పుడు దేశంలో పేరుకుపోయే చెత్తలో 20 శాతం కంటే తక్కువ మాత్రమే శుద్ధి అయ్యేదని, ఇప్పుడు 70% చెత్తను శుద్ధి చేస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. త్వరలోనే దానిని 100 శాతానికి తీసుకువెళతామని చెప్పారు. పట్టణాభివృద్ధి శాఖకి 2014లో 1.25 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తే, ప్రస్తుతం రూ.4 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టుగా చెప్పారు. అర్బన్ 2.0కి 1.41 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టుగా వెల్లడించారు. ఆ మిషన్‌ని మూడు ఆర్‌లు (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్) ద్వారా ముందుకు తీసుకువెళతామని ప్రధాని మోదీ వివరించారు. ఇక అమృత్‌లో భాగంగా భూగర్భ జల సంరక్షణకు చర్యలు చేపడతారు. అత్యంత ఆధునిక టెక్నాలజీని వినియోగిం చుకుంటూ మురుగు నీరు భూగర్భంలోకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment