Swachh Bharat Mission
-
స్వచ్ఛత ఎంతో మీరే చెప్పండి
సాక్షి, అమరావతి: స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా పట్టణాల్లో నిర్మించిన ప్రజా మరుగుదొడ్లు, కమ్యూనిటీ టాయిలెట్ల నాణ్యత, నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం ఈ నెల 18 వరకు ఆన్లైన్ సర్వే ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. ‘టాయిలెట్–2.0’ పేరుతో ఈ సర్వే చేస్తోంది. మరుగుదొడ్లను వినియోగించిన తర్వాత అక్కడే ఉన్న ‘క్యూఆర్ కోడ్’ను సెల్ఫోన్లో స్కాన్ చేసి ఆన్లైన్ సర్వేలో పాల్గొనాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ప్రకటించింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకొని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్) నగరాలను ఎంపిక చేస్తుంది. స్వచ్ఛత పాటించే నగరాలు, పట్టణాలకు గుర్తింపునిచ్చి, ప్రోత్సాహకాలను అందిస్తుంది. స్వచ్ఛ పట్టణాలు, నగరాలుగా ప్రకటిస్తుంది. మరుగుదొడ్లను పరిశుభ్రంగా నిర్వహించే వారికి కెప్టెన్ అవార్డు కింద నగదు బహుమతులు సైతం ప్రకటించింది. అంతేకాకుండా సర్వే ముగిసిన మరుసటి రోజు నుంచే చెడిపోయిన మరుగుదొడ్లను బాగుచేసేందుకు చర్యలు తీసుకుంటారు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాలు వాటర్+ అవార్డును, ఏడు పట్టణాలు ఓడీఎఫ్++ గుర్తింపు, 94 పట్టణాలు ఓడీఎఫ్+ గుర్తింపు పొందాయి. పరిశుభ్రమైన పట్టణాలే లక్ష్యంగా బహిరంగ మల విసర్జనను నూరు శాతం నిర్మూలించేందుకు కేంద్రం ప్రజలను భాగస్వాములను చేస్తోంది. అందుకోసం నవంబర్ 19 ప్రపంచ టాయిలెట్ డే సందర్భంగా స్వచ్ఛ సర్వే ప్రారంభించింది. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 25 శాతం నగరాలు ఓడీఎఫ్++ గుర్తింపు సాధించగా, ఈ సంఖ్యను నూరు శాతానికి పెంచాలన్నది కేంద్రం లక్ష్యం. అందుకనుగుణంగా రాష్ట్రంలో లక్ష కంటే తక్కువ జనాభా గల పట్టణాలను బహిరంగ మల విసర్జన రహితంగా మార్చాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిర్ణయించింది. అందులో భాగంగా పట్టణాల్లో ప్రజా మరుగుదొడ్ల నిర్వహణపై అవగాహన పెంచేందుకు, సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చేందుకు వాటివద్ద ‘క్యూఆర్’ కోడ్‌ను ఉంచింది. దీనిని స్కాన్ చేసి, ఆన్లైన్లో 24 ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాలి. దీంతోపాటు ఇచ్చే ఓటింగ్ ఆధారంగా నిర్వాహకులను ఈ నెల 20వ తేదీన కెప్టెన్ అవార్డుతో సత్కరిస్తారు. మొదటి బహుమతిగా రూ.75 వేలు, రెండో బహుమతిగా రూ.50 వేలు, మూడో బహుమతిగా రూ.25 వేలు అందిస్తారు. ప్రజలు తమ అభిప్రాయాలను https://docs.google.com/forms/d/1AYucwLyLAJ037h1h_x2JpqoBoqLGDaGSU9FlYArRo8s/editలో చెప్పాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు కోరారు. -
స్వచ్ఛ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ భారత్ మిషన్‌లో తెలంగాణ దూసుకుపోతోంది. సర్వ సర్వేక్షణ్ గ్రామీణ్ (ఎస్ఎస్జీ)లో జాతీయ స్థాయిలో (పెద్ద రాష్ట్రాల విభాగం) నంబర్ వన్‌గా నిలిచింది. ఎస్ఎస్జీకి సంబంధించిన పలు కేటగిరీల్లో టాప్–3 ర్యాంకుల్లో నిలిచింది. మొత్తం 13 స్వచ్ఛ అవార్డులు సాధించి సత్తా చాటింది. అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అవార్డులు అందజేస్తారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి, స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ వికాస్ శీల్ రాష్ట్రానికి లేఖ రాశారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తోందని ప్రశంసించారు. కాగా సీఎం కేసీఆర్, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ల సహకారంతోనే ఈ ప్రగతి సాధ్యమైందంటూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు. అవార్డులు, రికార్డులతో పాటు రాష్ట్రానికి కేంద్రం నిధులు కూడా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గతంలోనూ స్వచ్ఛ, పారిశుధ్య, ఇ– పంచాయతీ, ఉత్తమ గ్రామ పంచాయతీలు, ఉత్తమ ఆడిటింగ్ వంటి అంశాలతో పాటు 100 శాతం నల్లాల ద్వారా మంచినీటిని అందిస్తున్న రాష్ట్రంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. ఏటా నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛత, పరిశుభ్రతపై సర్వే (ఎస్ఎస్జీ) నిర్వహించి ఆ మేరకు కేంద్రం అవార్డులు అందజేస్తోంది. -
క్లీన్ ఏలూరుకు ‘క్లాప్’
ఏలూరు టౌన్: పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలం. వ్యక్తిగత, ఇల్లు, చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఇళ్ల నాని ప్రత్యేక శ్రద్ధతో ఏలూరు నగరాన్ని క్లీన్‌గా ఉంచేందుకు జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లాప్ ప్రోగ్రామ్‌ను పక్కాగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి ఇంటికీ మూడు రంగుల చెత్త డబ్బాలు పంపిణీ చేయగా, చెత్త సేకరణకు ప్రత్యేకంగా వాహనాలనూ ఏర్పాటు చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ చెత్తసేకరణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చెత్తసేకరణ చేస్తూ యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. 60 వాహనాలు ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలోని 60 వేల గృహాల నుంచి చెత్తసేకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. నగరంలో సుమారు 79 సచివాలయాల పరిధిలో 60 చెత్త సేకరణ వాహనాలు ఏర్పాటు చేశారు. ఒక్కో చెత్త సేకరణ వాహనంలో డ్రైవర్, ఒక శానిటరీ సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకున్నారు. కార్పొరేషన్ పాలక మండలి నగరంలోని గృహాలకు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి ప్రతి ఇంటికీ మూడు రంగుల డస్ట్‌బిన్స్ పంపిణీ చేసింది. ఒక బుట్టలో తడి చెత్త, మరో బుట్టలో పొడి చెత్త, ఇంకో బుట్టలో ప్రమాదకర వ్యర్థాలను వేరుచేసి చెత్త సేకరణ వాహనానికి అందించేలా ప్రణాళిక తయారు చేసి అమలు చేస్తున్నారు. యూజర్ చార్జీలు తప్పనిసరి స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న ఇంటింటా చెత్తసేకరణలో విధిగా యూజర్ చార్జీలు వసూలు చేయాల్సిందేనని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు పరిసరాల పరిశుభ్రతకు చెత్త సేకరణ చేస్తూనే ప్రజల నుంచి సేవా పన్ను వసూలు చేయాలని ఆదేశించింది. యూజర్ చార్జీలు వసూలు చేయని రాష్ట్రాలకు స్వచ్ఛ భారత్ నిధులను నిలిపివేస్తామని హెచ్చరించింది. దీంతో ఏలూరు నగరంలోనూ సేవా పన్ను వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పారదర్శక సేవలకు చార్జీలు ఏలూరు నగరంలో చెత్తసేకరణ సేవలకు చార్జీలు వసూలును అత్యంత పారదర్శకంగా వసూలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. స్లమ్ ఏరియాలో ఒక్కో ఇంటికి నెలకు రూ.60, సాధారణ ప్రాంతాల్లో రూ.100 వసూలు చేస్తుండగా, హాస్పిటల్స్, మాల్స్, పెద్దషాపులు, హోటల్స్, సినిమా థియేటర్లు, కమర్షియల్ ఇలా 3500 ప్రాంతాల్లో రోజువారీ చెత్త అధారంగా పన్ను వసూలు చేసేలా చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా ఈ నెల నుంచీ ఈపాస్ మిషన్ల ద్వారా చార్జీలు వసూలు చేసేలా చర్యలు తీసుకున్నారు. నగదు, క్రెడిట్, డెబిట్, ఇతర విధానాల్లో చార్జీలు వసూలు చేయటంతోపాటు తప్పనిసరిగా రశీదు అందజేస్తారు. నగర ప్రజలు సహకరించాలి నగర ప్రజలు సహకరిస్తే రాబోయే కాలంలో క్లీన్ ఏలూరుగా చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. నగరంలో సుమారు 60 వేల ఇళ్ల నుంచి నిత్యం చెత్తను సేకరించేందుకు సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతి రోజూ ఒక్కో వ్యక్తి ద్వారా అరకేజీ చెత్త తయారవుతుందని ప్రభుత్వ అంచనా. యూజర్ చార్జీలను పారదర్శకంగా సేకరించేందుకు ఈపాస్ విధానాన్ని అమలు చేస్తున్నాం. ప్రజలకు మెరుగైన సేవలు అందించటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. – షేక్ నూర్జహాన్, ఏలూరు నగర మేయర్ రోడ్లపై చెత్త, వ్యర్థాలు వేయకండి నగరాన్ని చెత్త రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. నగరంలోని ప్రజలు చెత్త సేకరణకు సిబ్బందికి సహకరించాలి. రోడ్లపైనా, డ్రెయినేజీల్లోనూ చెత్త, వ్యర్థాలు వేయవద్దు. చెత్త ఒక రోజు మర్చిపోయినా మరుసటి రోజు వరకు వ్యర్థాలను ఇంటివద్దనే ఉంచి చెత్త సేకరణ వాహనాలకు అందించాలి. ఇష్టారాజ్యంగా రోడ్లపై, డ్రెయినేజీల్లో వేయటంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. – డి.చంద్రశేఖర్, ఏలూరు నగర కమిషనర్ -
‘స్వచ్ఛ’ సేవకు యూజర్ చార్జీ
సాక్షి, అమరావతి: పట్టణాల్లో ఇబ్బడి ముబ్బడిగా పేరుకుపోతున్న చెత్తను సేకరించి, ప్రాసెస్ చేసే నిమిత్తం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యూజర్ చార్జీలు చెల్లించేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. చెత్త సేకరణ వాహనాలను నూరు శాతం అందించిన స్థానిక పట్టణ సంస్థల్లో చార్జీల వసూళ్లు మొదలయ్యాయి. గత ఐదు నెలలుగా 17 యూఎల్బీల్లో ఫీజు వసూలు చేస్తుండగా.. ఇప్పటి దాకా ఆయా ప్రాంతాల్లో 26.89 శాతం వసూలైంది. రాష్ట్రంలోని 123 స్థానిక పట్టణ సంస్థలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇంటింటి చెత్త సేకరణకు చెత్త డబ్బాలు అందజేయడంతో పాటు.. ఆ చెత్తను ప్రాసెస్ యూనిట్లకు తరలించేందుకు ప్రత్యేక వాహనాలను సైతం అందించనున్నారు. మొదటి విడతగా 42 యూఎల్బీలను ఎంపిక చేసి వాహనాల అందజేత ప్రారంభించగా, 17 యూఎల్బీలకు నూరు శాతం వాహనాల ను అందించగా, మరో 15 యూఎల్బీలకు యాభై శాతం వాహనాలను సరఫరా చేసి సేవలు ప్రారంభించారు. డిమాండ్‌లో 26.89 శాతం వసూలు రాష్ట్రాలకు స్వచ్ఛ భారత్ మిషన్ నిధులు ఇవ్వాలంటే కొన్ని నిబంధనలను పాటిం చాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. అందులో భాగంగా ఇంటింటి చెత్త సేకరణకు యూజర్ చార్జీలు వసూలు చేయాలని, ఆ నిధులను వాహనాలు, చెత్త ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణకు వినియోగించాలని షరతు విధించింది. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా 2014–2019 సంవత్సరాలకు గాను మొదటి విడతలో కేంద్రం వాటాగా రూ.567 కోట్లు అందించింది. అయితే, ఇంటింటి చెత్త సేకరణలో 75 శాతం యూజర్ చార్జీలు వసూలు చేస్తేనే రెండో విడత స్వచ్ఛ భారత్ నిధులు ఇస్తామని చెబుతోంది. అయితే, 17 స్థానిక పట్టణ సంస్థల నుంచి రూ.58.81 కోట్ల డిమాండ్ ఉండగా.. నవంబర్ నుంచి మార్చి వరకు రూ.15.81 కోట్లు వసూలయింది. అంటే మొత్తం డిమాండ్‌లో 26.89 శాతం మాత్రమే వసూలైంది. ప్రస్తుతం యూజర్ చార్జీల వసూళ్లలో గుడివాడ మున్సిపాలిటీ 60.42 శాతంతో ముందుండగా, అమలాపురం మున్సిపాలిటీ 60.31 శాతంతో రెండో స్థానంలో ఉంది. వీటి తర్వాత కాకినాడ (54.59 శాతం), తాడేపల్లిగూడెం (50.13 శాతం), పార్వతీపురం (50.06 శాతం) మున్సిపాలిటీలు ఉన్నాయి. -
కేంద్రానిదే ‘చెత్త’ చార్జి
సాక్షి, అమరావతి: నిధుల మంజూరుకు కేంద్రం పెట్టిన నిబంధనలతో 2015లోనే ‘చెత్త’ చార్జీలు మొదలయ్యాయి. ఏపీలోని అప్పటి టీడీపీ ప్రభుత్వం కూడా దానిని తూ.చ. తప్పకుండా పాటించింది. రాష్ట్రాల్లో తాము అమలు చేస్తున్న పథకాలకు నిధులు కావాలంటే.. వాటిలో వినియోగించే యంత్రాలు, సిబ్బంది నిర్వహణకు ప్రజల నుంచే వినియోగ(యూజర్) చార్జీలు వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం 2015లోనే ఉత్తర్వులు జారీ చేసింది. వినియోగ చార్జీలు వసూలు చేయని రాష్ట్రాలకు నిధులు నిలిపివేస్తామని తేల్చిచెప్పింది. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా ఇంటింటి నుంచి చెత్తను తీసుకెళ్లే వాహనాలు, సిబ్బంది నిర్వహణకు స్థానిక పాలనా సంస్థలు వంద శాతం వినియోగ చార్జీలను.. ప్రతి నెలా ప్రజల నుంచే వసూలు చేయాలని 2015 జూలై 27న ఇచ్చిన ఉత్తర్వుల్లో కేంద్రం స్పష్టం చేసింది. ఆ వెనువెంటనే ఆగస్టు 19న రాష్ట్రంలోని అప్పటి టీడీపీ ప్రభుత్వం కూడా చెత్త సేకరణపై వినియోగ చార్జీల వసూలుకు మెమో జారీ చేసింది. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం ఈ మెమో (నం.36579/బి2/2015)ను విడుదల చేసింది. ఇంటింటి చెత్త సేకరణకు చార్జీలు వసూలు చేయాలని పట్టణ స్థానిక సంస్థలకు ఆదేశాలిచ్చింది. మరోవైపు వీధుల్లో పారిశుధ్య సౌకర్యాలు మెరుగుపరిచేందుకు, ఇళ్ల నుంచి ప్రతిరోజు చెత్త తరలింపు కోసం గుంటూరు నగరంలోని దుకాణాలు, థియేటర్లు, ప్రైవేట్ హాస్టళ్లు, ఫంక్షన్ హాళ్లు, సూపర్ మార్కెట్లు, టీస్టాళ్ల నుంచి వినియోగ చార్జీలు వసూలు చేయాలని ఆ నగరపాలక సంస్థ 2015 ఏప్రిల్‌లోనే తీర్మానించింది. తర్వాత రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు కూడా ఇదే నిర్ణయం తీసుకుని అమలు చేశాయి. 75 శాతం వసూలు చేసిన పట్టణ సంస్థలకే నిధులు! కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం 2016 ఏప్రిల్ 8న గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇంటింటి చెత్త సేకరణ కోసం స్థానిక పాలనా సంస్థల ద్వారా యూజర్ చార్జీలు వసూలు చేయాలని అన్ని రాష్ట్రాలనూ కేంద్రం ఆదేశించింది. ఘన వ్యర్థాల సేకరణ, రవాణా, ప్రాసెసింగ్‌తో పాటు తరలింపు సేవలను అందించేందుకు ప్రజల నుంచి చార్జీలు వసూలు చేయడాన్ని తప్పనిసరి చేసింది. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణకు, నిర్వహణకు స్థానిక సంస్థలు తగినంత మంది సిబ్బందిని నియమించాలని సూచించింది. తాము అమలు చేస్తున్న ‘స్వచ్ఛ’ కార్యక్రమాలకు నిధులు కావాలంటే వినియోగ రుసుం వసూలు తప్పనిసరి అని కేంద్రం తేల్చిచెప్పింది. 15వ ఆర్థిక సంఘం సైతం స్థానిక పట్టణ సంస్థలు ఇంటింటి చెత్త సేకరణకు తప్పనిసరిగా ప్రజల నుంచి చార్జీలు వసూలు చేయాలని ఆదేశించింది. 75 శాతం యూజర్ చార్జీలు వసూలు చేసిన స్థానిక పట్టణ సంస్థలకే రెండో విడత స్వచ్ఛ భారత్ మిషన్ నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేసింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమాలకే కాకుండా.. కేంద్రం అమలు చేస్తున్న అన్ని పథకాల్లోనూ.. ఎక్కడ ‘నిర్వహణ’ అవసరముంటే అక్కడ తప్పనిసరిగా ప్రజల నుంచి వినియోగ చార్జీలు వసూలు చేయాలని పేర్కొంది. -
ఇక చెత్త కనిపించదు: మోదీ
న్యూఢిల్లీ: స్వచ్ఛభారత్ మిషన్–అర్బన్, అటల్ మిషన్ ఫర్ రెజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్సఫర్మేషన్ (అమృత్) పథకాల రెండో దశను శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. పట్టణ ప్రాంతాల ప్రజలకు చెత్త నుంచి విముక్తి కలిగించడంతో పాటు, తాగునీటి భద్రత కల్పించడమే ఈ పథకాల ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ దశలో మురుగునీటిని శుద్ధి చేయకుండా నదుల్లోకి వదలమని చెప్పారు. అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఎస్బీఎం 2.0, అమృత్ 2.0ను ప్రారంభించిన ప్రధాని అంబేడ్కర్ కలలు సాకారం అవడానికి కూడా ఈ పథకాల ప్రారంభం ఒక ముఖ్యమైన అడుగు అని అన్నారు.సమాజంలో అసమానతలు తొలగించడానికి పట్టణాభివృద్ధి కూడా కీలకపాత్ర పోషిస్తుందని దాదాసాహెబ్ భావించేవారని, అలాంటి చోట ఈ కార్యక్రమం జరగడం హర్షించదగిన విషయమని అన్నారు. మెరుగైన జీవితం కోసం ఎన్నో కలలతో గ్రామాల నుంచి పట్టణాలకు వస్తారని, వారికి ఉద్యోగాలు వచ్చినప్పటికీ జీవన ప్రమాణాలు దక్కడం లేదని అన్నారు. ఇళ్లకి దూరంగా వచ్చిన వారు ఇలాంటి పరిస్థితుల్లో నివసించడం చాలా దారుణమైన విషయమని అందుకే పట్టణాల్లో పరిస్థితులు మారాలని అన్నారు. రోజుకి లక్ష టన్నుల వ్యర్థాలు: దేశంలో ప్రతీ రోజూ లక్ష టన్నుల చెత్త వస్తోందని, పట్టణాల్లో ఎక్కడికక్కడ కొండల్లా పేరుకుపోతున్న ఈ చెత్తను తొలగించడమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. 2014లో స్వచ్ఛభారత్‌ని బహిరంగ మల విసర్జనకి వ్యతిరేకంగా చేపట్టామని ఆ దశలో 10 కోట్లకు పైగా టాయిలెట్లు నిర్మించామని చెప్పారు. ఈ సారి పట్టణాల్లో చెత్త నుంచి ప్రజల్ని విముక్తి చేయడమే లక్ష్యమని ప్రధాని చెప్పారు. అమృత్‌లో భాగంగా మురుగునీరు నదుల్లోకి కలవకుండా చూస్తామని, పట్టణ ప్రాంత ప్రజలకు సురక్షిత మంచినీరు అందిస్తామని ప్రధాని చెప్పారు. పరిసరాల పరిశుభ్రత ప్రచారాన్ని యువతరం అందిపుచ్చుకుందని మోదీ చెప్పారు. ఎక్కడ పడితే అక్కడ చిత్తు కాగితాలు విసిరివేయొద్దని, జేబులో ఉంచుకొని తర్వాత చెత్త బుట్టలో వెయ్యాలన్నారు. చిన్న చిన్న పిల్లలే రోడ్లపై ఉమ్మి వేయొద్దని పెద్దలకి చెబుతున్నారని అన్నారు. ఇదేదో ఒక్క రోజో, ఒక ఏడాదో చేసే కార్యక్రమం కాదని, ప్రతీ రోజూ చేయాలని, ఒక తరం నుంచి మరో తరానికి స్వచ్ఛభారత్ ప్రయాణం కొనసాగించాలని అన్నారు. 70% చెత్త శుద్ధి చేస్తున్నాం 2014లో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభమైనప్పుడు దేశంలో పేరుకుపోయే చెత్తలో 20 శాతం కంటే తక్కువ మాత్రమే శుద్ధి అయ్యేదని, ఇప్పుడు 70% చెత్తను శుద్ధి చేస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. త్వరలోనే దానిని 100 శాతానికి తీసుకువెళతామని చెప్పారు. పట్టణాభివృద్ధి శాఖకి 2014లో 1.25 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తే, ప్రస్తుతం రూ.4 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టుగా చెప్పారు. అర్బన్ 2.0కి 1.41 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టుగా వెల్లడించారు. ఆ మిషన్‌ని మూడు ఆర్లు (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్) ద్వారా ముందుకు తీసుకువెళతామని ప్రధాని మోదీ వివరించారు. ఇక అమృత్‌లో భాగంగా భూగర్భ జల సంరక్షణకు చర్యలు చేపడతారు. అత్యంత ఆధునిక టెక్నాలజీని వినియోగిం చుకుంటూ మురుగు నీరు భూగర్భంలోకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. -
నేడే అర్బన్ 2.0, అమృత్ 2.0
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని నగరాలను చెత్త రహితమైన నగరాలుగా, సురక్షితమైన తాగునీరు లభించే నగరాలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధన కోసం కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ మిషన్– అర్బన్ 2.0, అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్(అమృత్) 2.0కు రూపకల్పన చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఈ కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీకారం చుట్టనున్నారు. దేశంలో పట్టణీకరణ విసురుతున్న సవాళ్లను ప్రభావ వంతమైన రీతిలో ఎదుర్కోవడంతోపాటు 2030 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ఈ రెండు కార్యక్రమాలు దోహదపడతాయని కేంద్రం భావిస్తోంది. అర్బన్ 2.0.. అన్ని నగరాలను ‘చెత్త రహితం’గా మార్చడమే అర్బన్ 2.0 లక్ష్యం. ఇందులో భాగంగా ఆయా నగరాల్లో మురుగు నీటి నిర్వహణకు చర్యలు చేపడతారు. బహిరంగ మల విసర్జన రహిత నగరాలుగా తీర్చిదిద్దుతారు. స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0కు దాదాపు రూ.1.41 లక్షల కోట్లు నిధులు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. అమృత్ 2.0.. దాదాపు 2.68 కోట్ల కుళాయి కనెక్షన్లను ఇవ్వడం ద్వారా 4,700 పట్టణ స్థానిక సంస్థల్లోని అన్ని కుటుంబాలకు 100 శాతం మంచినీరు అందించేందుకు అమృత్ 2.0ను రూపొందించారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో 10.5 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. ఉపరితల, భూగర్భ జలాల పరిరక్షణ, పునరుజ్జీవనాన్ని అమృత్ 2.0 ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమ వ్యయం రూ.2.87 లక్షల కోట్లు అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. -
సఫాయి కర్మచారీ.. వి ఆర్ 'వెరీ సారీ'
వారు మోరీలలోకి దిగుతారు.. మురికి నీటిలో మునుగుతూ.. మురికి కంపుని పీల్చుతూ.. ప్రాణాలను ఫణంగా పెట్టి మానవ వ్యర్థాలను ఎత్తిపోస్తారు. సంఘంలో వారు వివక్షను ఎదుర్కొంటారు.. అయినా డీలా పడకుండా మరుగుదొడ్లలోని మలమూత్రాలను ఎత్తిపోస్తూ ప్రజలు పలు రోగాల బారిన పడకుండా తమవంతు కృషి చేస్తుంటారు. వారే శ్రమ ప్రేమికులు..రోగాలను తరిమేసే సిపాయిలు.. సఫాయి కర్మచారీలు! సాక్షి, అమరావతి: మరుగుదొడ్లలోని మలమూత్రాలను మనుషులే ఎత్తిపోసే పద్ధతి దేశంలో ఇంకా ఉందా? వందల ఏళ్ల నాటి అత్యంత హీనమైన ఈ పద్ధతిని రద్దు చేస్తూ చట్టాన్ని తీసుకువచ్చినా ఈ వ్యవస్థ ఇంకా పోలేదా? అంటే కేంద్ర ప్రభుత్వం అవుననే జవాబు చెబుతోంది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ ఇటీవల రాజ్యసభకు చెప్పిన దాని ప్రకారం దేశంలో 58,098 మంది సఫాయి కార్మికులు ఉన్నారు. ఈ వ్యవస్థను రద్దు చేస్తూ 2013లో మాన్యువల్ స్కావెంజింగ్ నిషేధిత చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆ తర్వాత 2019లో జరిపిన సర్వే ప్రకారం దేశంలో 58,098 మంది సఫాయి కార్మికులు ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, కర్నాటక, కేరళ, తమిళనాడుతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో వీరు ఉన్నట్లు సర్వే తెలిపింది. వీరి పునరావాసానికి కేంద్రం కట్టుబడి ఉందని సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రకటిస్తూనే ఏమేమి చర్యలు చేపట్టిందో వివరించింది. ఆ వృత్తిలో ఉన్న వారిని విముక్తి చేసేందుకు సుదీర్ఘకాలంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పుడున్న సఫాయి కర్మచారీలలో అర్హులైన వారికి నగదు సాయం చేసి విముక్తం చేసింది. మరో 16,057 మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తోంది. 1,387 మందికి స్వయం ఉపాధి పథకాలకు మూలధన పెట్టుబడిలో సబ్సిడీ ఇచ్చింది. అయినా ఇంకొంతమంది ఆ వృత్తిలోనే ఉన్నట్లు గుర్తించి వారిని విముక్తం చేసేందుకు ముమ్మరంగా కృషి చేస్తున్నట్లు తెలిపింది. వారి వివరాలను ‘స్వచ్ఛ అభియాన్’లో అప్లోడ్ చేయండి దేశంలో మాన్యువల్ స్కావెంజర్లతో శుభ్రం చేయించే మరుగుదొడ్లే లేకుండా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్‌ను ప్రకటించింది. ప్రతి ఇంటికీ మరుగు దొడ్డి కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామాల్లో ఇప్పటికే 10.71 కోట్ల పరిశుభ్రమైన లెట్రిన్లను, పట్టణ ప్రాంతాల్లో 62.57 లక్షల లెట్రిన్లను నిర్మించింది. దీంతో సఫాయికర్మచారీల అవసరం తొలగిపోయినా ఇంకా అక్కడక్కడ మిగిలే ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. సఫాయికర్మచారీలు ఎక్కడైనా చేతికి బకెట్ తగిలించుకుని, చీపురు కట్ట, ఇనుప రేకు పట్టుకుని కనిపించినా, ఎక్కడైనా లెట్రిన్లను శుభ్రం చేస్తున్నా, మనుషులు శుభ్రం చేసే లెట్రిన్లు కనిపించినా ఫోటోలు తీసి ‘స్వచ్ఛ అభియాన్’ మొబైల్ అప్లికేషన్లో అప్లోడ్ చేయాలని కేంద్రం సూచించింది. ఇలా చేయడం వల్ల వారి వివరాలు కనుక్కోవడంతో పాటు వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించవచ్చని, సఫాయి కర్మచారీల వ్యవస్థను రూపుమాపవచ్చని పౌర సమాజానికి కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. -
పట్టణాల్లో సెప్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో జల, వాయు కాలుష్య నివారణకు పురపాలక శాఖ ఉపక్రమిస్తోంది. పట్టణ స్థానిక సంస్థల్లో సెప్టేజ్ ట్రీట్మెంట్ (మరుగుదొడ్ల వ్యర్థాల నిర్వహణ) ప్లాంట్లు పెద్ద సంఖ్యలో నెలకొల్పాలని నిర్ణయించింది. ఈ వ్యర్థాల నిర్వహణ లోపభూయిష్టంగా ఉండటంతో దేశంలో జల, వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ్ భారత్ మిషన్ నివేదించింది. మరుగుదొడ్డి, సెప్టిక్ ట్యాంక్‌కు సమీపంలోని నీటి వనరుకు మధ్య కనీసం 20 అడుగుల దూరం ఉండాలి. అయితే ప్రస్తుతం సగటున 4 అడుగుల దూరం మాత్రమే ఉంటోందని నివేదిక పేర్కొంది. దాంతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని వెల్లడించింది. నిర్దేశిత సమయంలో సెప్టిక్ ట్యాంక్‌లను శుభ్రం చేయకపోవడం వల్ల కూడా జల, వాయు కాలుష్యాలు పెరుగుతూ ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. భవిష్యత్ అవసరాలు పరిగణనలోకి.. బహిరంగ మల విసర్జనను అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఏర్పాటు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. మరోవైపు మన రాష్ట్రంలో ‘అందరికీ ఇళ్లు’పథకం కింద ‘వైఎస్సార్ జగనన్న కాలనీలు’పేరిట 30 లక్షల ఇళ్లతో దాదాపు 17వేల ఊళ్లు కొత్తగా నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యుక్తమైంది. ఆయా కాలనీల్లో ప్రతి ఇంటికీ తప్పనిసరిగా మరుగుదొడ్డి నిర్మించేలా డిజైన్‌ను ఖరారు చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో కొత్తగా మరుగుదొడ్లు నిర్మించనుండటంతో మరుగుదొడ్ల వ్యర్థాల నిర్వహణకు సరైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం మరింతగా పెరగనుంది. ఈ సమస్యకు పరిష్కారంగా సెప్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు పురపాలక శాఖ కార్యాచరణ రూపొందించింది. భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో స్వచ్ఛ్ ఏపీ కార్పొరేషన్ ద్వారా మూడు దశల్లో సెప్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నెలకొల్పాలని నిర్ణయించారు. మేలో తొలిదశ ప్రారంభం ► సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను నగర, పట్టణ శివారులోని సెప్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు తరలిస్తారు. అక్కడ వ్యర్థాలను తగిన రీతిలో నిర్వహించిన తరువాత ఎరువు తయారవుతుంది. వాటిని నర్సరీలు, పొలాలకు సరఫరా చేస్తారు. మిగిలిన వ్యర్థాలను కాలుష్య కారకం కాని రీతిలో డిస్పోజ్ చేస్తారు. ► మొదటి దశ సెప్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణాన్ని వచ్చే మేలో మొదలు పెట్టి వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని స్వచ్ఛ్ ఏపీ కార్పొరేషన్ భావిస్తోంది. ఆ తర్వాత రెండు, మూడు దశల పనులు చేపడతారు. తొలుత 32 పట్టణ స్థానిక సంస్థల్లో.. ► మొదటి దశలో అమృత్ పథకం అమలు అవుతున్న 32 పట్టణ స్థానిక సంస్థల్లో ఈ ప్లాంట్లను నెలకొల్పుతారు. రెండో దశలో లక్ష నుంచి 5 లక్షల జనాభా ఉన్న మున్సిపాలిటీలు, మూడో దశలో లక్షలోపు జనాభా ఉన్న మున్సిపాలిటీలలో వీటిని ఏర్పాటు చేస్తారు. ఆ విధంగా మొత్తం 110 పట్టణ స్థానిక సంస్థల్లో వీటిని నెలకొల్పుతారు. ► నగరం, పట్టణం శివారులో ఈ ప్లాంట్లను నెలకొల్పుతారు. అందుకు ఆయా మున్సిపాలిటీలు భూమిని కేటాయిస్తాయి. జనాభా ప్రాతిపదికన ప్లాంట్ల సామర్థ్యాన్ని నిర్ణయించి ఏర్పాటు చేస్తారు. ► ఒక్కో ట్రీట్మెంట్ ప్లాంట్‌కు రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వ్యయం అవుతుందని భావిస్తున్నారు. వాటితోపాటు సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసే వాహనాలతో కూడిన యూనిట్లను కొనుగోలు చేస్తారు. ► మరుగుదొడ్ల అవుట్ లెట్లను ఎక్కడా వీధి కాలువలలోకి విడిచిపెట్టకుండా కచ్చితంగా నియంత్రిస్తారు. ► పట్టణాల్లో ప్రతి ఇంటి సెప్టిక్ ట్యాంక్ కనీసం మూడేళ్లకు ఓసారి శుభ్రం చేయాలన్నది లక్ష్యం. ► అందుకోసం ఒక్కో మున్సిపాలిటీకి 5 నుంచి 25 వరకు సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసే వాహనాలతో కూడిన యూనిట్లను సమకూరుస్తారు. -
కోవిడ్‌పై పోరులో కీలకం స్వచ్ఛభారత్: మోదీ
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరులో స్వచ్ఛభారత్ కార్యక్రమం చాలా ముఖ్యమైందని ప్రధాని మోదీ అన్నారు. శనివారం ఆయన స్వచ్ఛభారత్ వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్‌ఘాట్ వద్ద రాష్ట్రీయ సచ్ఛతా కేంద్రాన్ని ప్రారంభించి కార్యక్రమానికి హాజరైన విద్యార్థులనుద్దేశించి ప్రధాని మాట్లాడారు. ఈనెల 15వ తేదీ వరకు కొనసాగే ‘వ్యర్థ విముక్త భారత్’ కార్యక్రమం ద్వారా వ్యర్థాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రత ప్రాధాన్యాన్ని చాటిచెప్పిన మహాత్మాగాంధీకి నివాళిగా రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రంను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గాంధీజీ చేపట్టిన చంపారన్ సత్యాగ్రహం కార్యక్రమం వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ 2017లో ప్రకటించారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన ఆగస్టు 8వ తేదీని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో టాయిలెట్లు నిర్మించాలని, అవసరమైన చోట్ల మరమ్మతులు చేపట్టాలని ఆయన జిల్లాల అధికారులను కోరారు. కరోనా వైరస్ నుంచి కాపాడుకునేందుకు భౌతిక దూరం నిబంధనలను పాటించాలనీ, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని విద్యార్థులను ప్రధాని కోరారు. తగ్గిన మరణాలు.. పెరిగిన రికవరీ న్యూఢిల్లీ: భారత్‌లో వరుసగా రెండో రోజూ 60 వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి. శనివారం కొత్తగా 61,537 కేసులు బయటపడటంతో మొత్తం కేసుల సంఖ్య 20,88,611కు చేరుకుంది. గత 24 గంటల్లో 48,900 కోలుకోగా, 933 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 42,518కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 14,27,005కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 6,19,088 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 29.64గా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 68.32 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 2.04%కి పడిపోయిందని తెలిపింది. ఆగస్టు 7 వరక 2,33,87,171 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. శుక్రవారం మరో 5,98,778 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. కేంద్రమంత్రి మేఘ్వాల్కు పాజిటివ్ కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కరోనా బారిన పడ్డారు. కోవిడ్–19 పరీక్షలో పాజిటివ్ వచ్చిందని, ఎయిమ్స్‌లో చేరానని ఆయన శనివారం వెల్లడించారు. తన ఆరోగ్యం బాగానే ఉందన్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాని కోరారు. -
చెత్త వేశారో... రైల్వే వాతే!
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): స్వచ్ఛ భారత్ మిషన్ అమలుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే సిద్ధమైంది. ఇందులో భాగంగా రైల్వేస్టేషన్ పరిసరాల్లో నిబంధనలు అతిక్రమించిన వారిపై విధించే జరిమానాలను అధికం చేసింది. ఈ నూతన జరిమానాలు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. రైల్వే స్టేషన్ పరిసరాలలో చెత్త వేయడం, ఉమ్మి వేయడం, మూత్ర విసర్జన, గోడలను పాడుచేయడం వంటి నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకుని 2016లో జరిమానాలు అమలులోకి తీసుకొచ్చారు. వీటికి అదనంగా మరికొన్ని నిబంధనలు కూడా ఇక నుంచి అమలు చేయనున్నారు. వీటిని అతిక్రమించినా జరిమానాలు చెల్లించుకోవాల్సిందే. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల అమలుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే ముందుకు సాగుతోందని, ప్రయాణికులు పూర్తిస్థాయిలో సహకరించి స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగస్వాములు కావాలని రైల్వే అధికారులు కోరుతున్నారు. మరింత మందికి అధికారం ఇప్పటి వరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో గల మూడు డివిజన్లలో వేర్వేరు జరిమానాలు అమలయ్యేవి. ఇప్పటి నుంచి మూడు డివిజన్ల పరిధిలో గల అన్ని స్టేషన్లలో ఒకే రకమైన జరిమానాలు అమలు చేయనున్నారు. చెత్త వేస్తే రూ.200, వంట చేస్తే రూ.500, ఉమ్మి వేస్తే రూ.300, మూత్ర విసర్జన చేస్తే రూ.400, గోడలను పాడుచేస్తే రూ.500, జంతువులు, పక్షులకు మేత వేస్తే రూ.500, వాహనాలు కడిగినా, రిపేర్ చేసినా రూ.500, దుస్తులు ఉతికినా, పాత్రలు కడిగినా రూ.500, అనుమతి లేకుండా పత్రికలు అతికిస్తే రూ.2వేలు, అనుమతి పొందిన వెండర్స్, హాకర్స్ తడి, పొడి చెత్తకు సంబంధించిన ప్రత్యేక డస్ట్ బిన్స్ ఏర్పాటు చేయకపోతే రూ.2వేలు, 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ వినియోగిస్తే రూ.500ల జరిమానా విధించనున్నారు. మరోవైపు నిబంధనలు అతిక్రమించే వారిపై జరిమానా విధించేందుకు మరింత మంది అధికారులకు అధికారం కల్పించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో గల ఖుర్దా రోడ్, సంబల్పూర్, వాల్తేర్ డివిజన్లలో గల స్టేషన్ మేనేజర్స్, స్టేషన్ సూపరింటెండెంట్స్, స్టేషన్ మాస్టర్స్, టికెట్ కలెక్టర్స్, స్పెషల్ స్వా్కడ్, కమర్షియల్ / ఆపరేటింగ్ విభాగంలో గల గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంక్ కలిగిన అధికారులు, ఆర్పీఎఫ్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్సెక్టర్ ర్యాంకు కన్నా తక్కువ కాని అధికారులకు అధికారం కల్పించారు. -
నాలుగేళ్లైనా వాళ్లకు టాయ్‌లెట్స్ గతిలేవు..!
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాలకు దూరంగా సాగుతోంది. దేశాన్ని నిర్మలంగా మార్చడమే లక్ష్యంగా 2014 అక్టోబర్ 2న ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే, నాలుగేళ్లు గడుస్తున్నా.. చాలా ప్రభుత్వాస్పత్రుల్లో వాటి సిబ్బందికి కనీసం టాల్లెట్స్ కూడా గతిలేవు. గ్రామీణ భారతంలోని దాదాపు 38 శాతం ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసే సిబ్బందికి మరుగుదొడ్లు అందుబాటులో లేవని ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. ‘గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన’పై కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ లోక్‌సభలో ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడయ్యాయని తెలిపింది. ఇక ‘స్వచ్ఛ భారత్’ తమ ప్రభుత్వం విజయవంతమైన పథకాల్లో ఒకటని కేంద్రం చెప్తున్న సంగతి తెలిసిందే. ఈ మిషన్‌లో భాగంగా 2014 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 9.5 మిలియన్ల మరుగుదొడ్లు నిర్మించామని కేంద్రం పేర్కొంది. ఇక 10 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో 50 శాతం సర్కారు దవాఖానాల్లో టాయ్లెట్స్లేని దారుణ పరిస్థితి నెలకొందని జాతీయ మీడియా పేర్కొంది. తెలంగాణ, రాజస్తాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఈ జాబితాలో మొదటి వరుసలో ఉన్నాయని తెలిపింది. తెలంగాణలో అత్యధికంగా 86 శాతం హెల్త్ సెంటర్లలో సిబ్బందికి మరుగుదొడ్లు లేవని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలో పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపింది. -
ఓడీఎఫ్ లక్ష్యం నెరవేరిందా?
దేశంలోని గ్రామీణ ప్రాంతాలు బహిరంగ మల విసర్జన రహిత(ఓడీఎఫ్)మయ్యాయని బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆయన చెబుతున్న లెక్కల ప్రకారం దేశంలో గత అయిదేళ్లలో 60 కోట్లమంది ప్రజలకు 11 కోట్ల మరుగుదొడ్లను నిర్మించారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ వివరాలనుబట్టి పశ్చిమబెంగాల్లోని 52 మున్సిపాలిటీలు మినహా దేశమంతా ఓడీఎఫ్ సాధించినట్టే. తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక మోదీ స్వాతంత్య్ర దినో త్సవం రోజున ఎర్రకోట బురుజులపై నుంచి ప్రసంగిస్తూ ‘స్వచ్ఛ భారత్’ బృహత్తర కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. 2019లో జరగబోయే మహాత్మా గాంధీ 150వ జయంతి నాటికి ఓడీఎఫ్ సాధించాలని అప్పట్లో మోదీ లక్ష్య నిర్దేశం చేశారు. దీనిపై ఆనాటినుంచీ అన్ని మాధ్యమాల్లో, అన్ని భాషల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. మోదీ తానే స్వయంగా ప్రతి సందర్భంలోనూ దాని గురించి ప్రస్తావిస్తూ వచ్చారు. అందువల్ల చెప్పుకోదగ్గ ఫలితం కూడా కనబడిందనడంలో సందేహం లేదు. అయితే అది ఓడీఎఫ్ ప్రకటించేంత స్థాయిలో ఉందా అన్న విషయంలోనే అందరికీ సంశయం. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో రెండు ప్రధానాంశాలున్నాయి. అందులో మరుగుదొడ్ల నిర్మాణం ఒకటైతే, ప్రజానీకం ప్రవర్తలో మార్పు తీసుకురావడం రెండోది. మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం భారీయెత్తున నిధులు వ్యయం చేసింది. అయితే ఈ కార్యక్రమంలో ప్రధాన లోపం ఏమంటే, ఇంటి యజమానులు ముందుగా తమకు తాము మరుగుదొడ్లు నిర్మించుకోవాలి. వాటిని తనిఖీ చేసి అవి సక్రమంగా ఉన్నాయని సంతృప్తి చెందాక యజమానులకు పంచాయతీలు ఆ నిర్మాణానికైన ఖర్చు చెల్లిస్తాయి. ఒక మరుగుదొడ్డి కోసం కనీసం రూ. 15,000 అవసరమవుతాయి. అంత సొమ్ము సొంతంగా పోగేసుకుని నిర్మించుకోవడం ఎంతమందికి సాధ్యమవుతుంది? ఏమై తేనేం రిజిస్టరైన ప్రతి ఇంటి ఆవరణలోనూ ఇప్పుడు మరు గుదొడ్డి సదుపాయం ఉందని కేంద్రం అంటున్నది. అది జరిగిందనే అనుకుందాం. మరి ప్రజానీకం ప్రవర్తనలో మార్పు సంగతేమిటి? అసలు అది ప్రవర్తనకు సంబంధించిన సమస్యా లేక ఇతరత్రా సమస్యల పర్యవసానంగా ఏర్పడిందా? మరుగుదొడ్ల లెక్కలన్నీ దేశవ్యాప్తంగా 2012లో గ్రామీణ గృహ నిర్మాణ సంస్థలు, గ్రామీణాభివృద్ధి విభాగం పంచాయతీలతో కలిసి సంయుక్తంగా జరిపిన సర్వే ద్వారా వెల్లడైనవే. ఇప్పుడు దాని ప్రాతిపదికనే ఓడీఎఫ్ ప్రకటించారు. అప్పట్లోనే ఎన్నో విమర్శలొచ్చిన ఆ గణాంకాల ప్రాతిపదికగా అంతా సవ్యంగానే ఉన్నదని చెప్పడం సరైందేనా? మన దేశంలో బహిరంగ మల విసర్జన ఏనాటినుంచో ఒక ప్రధాన సమస్యగా ఉంది. మోదీకి ముందు పనిచేసిన ప్రధానులెవరూ దీన్నంతగా పట్టించుకోలేదుగానీ, ఇది తీవ్ర అనారోగ్య సమస్య లకు దారితీస్తోంది. ముఖ్యంగా మహిళలకు చెప్పనలవికాని సమస్యల్ని సృష్టిస్తోంది. పరిశుభ్రత భావన లేకపోవడం వల్లనే జనంలో ఈ అలవాటు పెరిగిందని చెప్పడం పూర్తిగా అవాస్త వమవుతుంది. వారు గత్యంతరం లేక, సిగ్గు విడిచి ఈ అలవాటు కొనసాగించవలసి వస్తున్నది. మరుగుదొడ్లు నిర్మించుకున్నా వాటి నిర్వహణకు అవసరమైన నీరు, ఫ్లష్అవుట్ సదుపాయం వగైరాలు సరిగా లేకపోతే ఆ మరుగుదొడ్లను ఉపయోగించుకోవడం సాధ్యం కాదు. అలాంటి లోపాలు ఉత్తరప్రదేశ్, ఒడిశా, బిహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ఎన్నోచోట బయటపడ్డాయి. ఆ మరుగుదొడ్లు నిష్ప్రయోజనంగా పడి ఉండటంతో అనేకచోట్ల వాటిని చిన్న సైజు గోడౌన్లుగా వినియోగించుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో మురికివాడలు అధికం. దుర్భర దారిద్య్రంలో మగ్గుతూ రోజుకూలీపై ఆధారపడేవారు, చిన్న చిన్న పనులతో పొట్టపోసుకునేవారు అనేకమంది వాటిల్లో బతకవలసి వస్తోంది. అలాంటిచోట ఎవరికివారు మరుగుదొడ్లు ఎలాగూ ఏర్పాటు చేసుకోలేరు. కనీసం అందరూ వినియోగించుకోవడానికి నిర్మించిన సామాజిక మరుగుదొడ్లు సైతం సరైన నీటి సదుపాయం లేక అంతంతమాత్రంగా నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులున్నప్పుడు జనం బయటకు పోక తప్పడం లేదు. రాజస్తాన్, బిహార్ వంటిచోట్ల మరుగుదొడ్లు నిర్మిం చుకోకపోతే ఇతరత్రా సౌకర్యాలను ఆపేస్తామని ఒత్తిళ్లు తీసుకురావడం వంటివి చోటు చేసుకున్నాయి. కొన్నిచోట్ల బహిరంగ మలవిసర్జనకు పోతున్నవారిని గేలిచేయడం, అవమా నించడం, బెదిరించడం వంటివి జరిగాయి. రాజస్తాన్‌లోని ఒక గ్రామంలో కేవలం 19శాతం ఇళ్లకు మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయని ఆగ్రహించి ఆ గ్రామానికి విద్యుత్ సదు పాయాన్ని నిలిపేశారు. మొన్నీమధ్య మధ్యప్రదేశ్‌లో నిరుపేద దళిత కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు బహిరంగ మల విసర్జన చేస్తున్నారని ఆగ్రహించి వారిని కొట్టి చంపిన ఉదంతం బయటికొచ్చింది. ఆ పిల్లల తండ్రి పక్కా ఇల్లు కోసం చేసిన దరఖాస్తును కావాలని పంచాయతీలో కొందరు బుట్టదాఖలు చేశారు. ఆ ఇల్లు దక్కితే తనకు కూడా మరుగుదొడ్డి ఉండేదని, తన పిల్లలు ప్రాణాలు కోల్పోయేవారు కాదని అతడు ఆవేదనపడుతున్నాడు. చిత్రమేమంటే ఆ గ్రామం కూడా ఓడీఎఫ్ జాబితాలో ఉంది. ఇలా సమస్య తీరకపోయినా జాబితాల్లోకెక్కిన గ్రామాలు మరెన్ని ఉన్నాయో? స్వచ్ఛభారత్ కార్యక్రమం నిస్సందేహంగా బృహత్తరమైనది. దాన్ని విజయవంతంగా అమలు చేయగలిగితే ప్రజారోగ్యానికి అదెంతో మేలు చేస్తుంది. ఐక్యరాజ్యసమితి 2030నాటికి ప్రపంచ దేశాలన్నీ సాధించాలంటున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో పారిశుద్ధ్యం కూడా ఉంది. అందుకోసం కేంద్రప్రభుత్వం పెట్టిన శ్రద్ధ కూడా మెచ్చదగిందే. అయితే దాని అమలుకు ఎదురవుతున్న సమస్యలేమిటో తెలుసుకుని ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించుకుంటూ పోతే వేరుగా ఉండేది. ఇప్పుడైనా ఇలాంటి లోటుపాట్లను గుర్తించి, మరుగుదొడ్ల నిర్వహణ ఎలా ఉంటున్నదో తెలుసుకుని సరిచేస్తే స్వచ్ఛభారత్ అనుకున్న స్థాయిలో విజయం సాధించడానికి వీలవుతుంది. -
‘స్వచ్ఛత’లో వెనుకంజ
సాక్షి, ఆదిలాబాద్‌రూరల్: స్వచ్ఛ సర్వేక్షణ్–2019 ర్యాంకుల్లో ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎంతో వెనుకబడింది. ఈ సారి జాతీయస్థాయిలో 330వ స్థానంలో నిలిచింది. గతంలో 133వ ర్యాంకులో ఉన్న మున్సిపాలిటీ ఈ సారి వెనక్కి వెళ్లింది. ఈ ఏడాది మైనస్ మార్కులు ఉండడంతో ర్యాంకుల్లో వెనుకబడ్డామని అధికారులు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా నగరాలు, పట్టణాలను స్వచ్ఛమైన నివాస ప్రాంతాలుగా మార్చాలన్న లక్ష్యంతో మున్సిపాలిటీల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఇది ఏ మేరకు అమలవుతుందో తెలుసుకునేందుకు 2017 నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్‌ను ప్రారంభించింది. ఏటా జనవరిలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ బృందం సభ్యులు పరిశుభ్రతను పరిశీలించి స్వచ్ఛతపై వివరాలు సేకరించిన తర్వాత మార్పులను బట్టి ర్యాంకు కేటాయిస్తారు. ఈ బృందం సభ్యులు కాలనీల్లో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వివరాల సేకరణతోపాటు స్థానికుల నుంచి వివరాలు సేకరించి కేంద్రానికి పంపిస్తారు. ఈ వివరాల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులను ప్రకటిస్తుంది. గతం కంటే ఈసారి మరిన్ని నిబంధనలు పొందుపర్చడంతో కొంత ర్యాంకు తగ్గిందని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే గతంలో మైనస్ మార్కులు ఉండేవి కావు, ఈ సారి మైనస్ మార్కులు ఉండడంతో ర్యాంకులో వెనుకపడ్డట్లు తెలుస్తోంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో తగ్గిన ర్యాంకు.. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఆదిలాబాద్ మున్సిపాలిటీ 2017లో 195వ ర్యాంకు సాధించింది. 2018లో 2,423 మార్కులు సాధించి 133వ ర్యాంకు పొందింది. 2017తో పోలిస్తే 2018లో మెరుగైన ర్యాంకు సాధించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2019లో ఆదిలాబాద్ మున్సిపాలిటీ జాతీయ స్థాయిలో 330వ ర్యాంకు సాధించగా, రాష్ట్ర స్థాయిలో 11వ ర్యాంకు సాధించింది. వీటిలో మెరుగైతేనే.. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మార్పులు, మెరుగైన ర్యాంకు సాధించాలంటే మొదటగా ప్రత్యేక ప్రణాళిక రూపొదించుకోవాల్సి ఉంటుంది. ర్యాంకు సాధించుకోవాలంటే పట్టణ ప్రజల్లో పరిశుభ్రతపై చైతన్యం తేవాలి. పారిశుధ్య సిబ్బంది మున్సిపాలిటీల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించి పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలి. బహిరంగ మల, మూత్ర విసర్జనను వంద శాతం నిషేధించాలి. ప్రతీ ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేరు చేసి అందించేలా చూడడంతోపాటు పారిశుధ్య కార్మికులు బాధ్యతగా చెత్తను ప్రతీ రోజు తీసుకెళ్లేలా చూడాలి. మున్సిపాలిటీల్లో తడి, పొడి చెత్త సేకరణకు ప్రజలకు రెండు చెత్త బుట్టలు అందించాలి. వాటి వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రత్యేక ప్రశ్నావళి ద్వారా ప్రజల నుంచి వివరాలను రాబడతారు. స్వచ్ఛ సర్వేక్షణ్ బృందంలోని అధికారులు మున్సిపాలిటీ నాలుగు విభాలుగా విభజించి మార్కులు కేటాయిస్తారు. సర్వీస్ లెవల్ బెంచ్ మార్కులు 1250, థర్డ్ పార్టీ ఆఫీసర్ల పరిశీలన ద్వారా 1250 మార్కులు, సిటిజన్ ఫీడ్ బ్యాక్ ద్వారా 1250 మార్కులు, సర్టిఫికెట్, ఓడీఎఫ్ గ్యార్బేజీ, ప్రీసిటీ, కెపాసిటీ బిల్డిండ్ ద్వారా మరో 1250 మార్కులకు కేటాయించి ర్యాంకు ప్రకటిస్తారు. మరిన్ని నిబంధనలు పొందుపర్చడంతోనే.. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో గతంలో మైనస్ మార్కులు ఉండేవి కావు. ఈసారి మరిన్ని నిబంధనలు పొందుపర్చారు. దీంతో ర్యాంకు తగ్గింది. వచ్చే సంవత్సరం పట్టణ ప్రజలకు మరింత అవగాహన కల్పించి, మెరుగైన ర్యాంకు సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తాం. – మారుతిప్రసాద్, మున్సిపల్ కమిషనర్, ఆదిలాబాద్ -
ఈ–ఆటోలపై చినబాబు ట్యాక్స్ రూ.83 కోట్లు
సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి, అమరావతి : ఏదైనా వస్తువు కొనాలంటే మార్కెట్ ధర పరిశీలించి, బేరం ఆడి కొనుగోలు చేస్తాం. ప్రభుత్వం తరపున కొనుగోలు చేయాలంటే టెండర్లు పిలిచి, తక్కువ ధరకే ఆ వస్తువును అందించే సంస్థకే టెండర్ ఖరారు చేసి, కొనుగోలు చేయడం పరిపాటి. కానీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఆరాటంతో మార్కెట్ ధర కంటే రెండింతలు అధికధరకు వస్తువు సరఫరా చేస్తామంటున్న సంస్థకే టెండర్ కట్టబెట్టడం విస్మయం కలిగిస్తోంది. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్లో చోటుచేసుకున్న ఈ బాగోతం వెనుక చినబాబు హస్తం ఉన్నట్లు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో చెత్తను సేకరించడానికి బ్యాటరీతో నడిచే ఈ–ఆటోలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జాతీయ సఫాయి కర్మచారీ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సౌజన్యంతో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తొలివిడతగా 7,500 ఈ–ఆటోలను కొనుగోలు చేసి, షెడ్యూల్ క్యాస్ట్(ఎస్సీ) నిరుద్యోగ యువతకు అప్పగించాలని నిర్ణయించారు. పశ్చిమ గోదావరి, చిత్తూరు, తూర్పు గోదావరి, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో ఈ–ఆటోల కొనుగోలు కోసం టెండర్లు పిలిచారు. జూలై 29వ తేదీన కైనెటిక్ గ్రీన్ ఇండియా సంస్థ ప్రతినిధులు సచివాలయంలో చినబాబును కలిశారు. ఈ–ఆటోల సరఫరా టెండర్‌ను ఆ సంస్థకే అప్పగించేలా డీల్ కుదిరినట్లు ఆరోపణలున్నాయి. ఓపెన్ టెండర్ కావడంతో మొత్తం 24 ప్రైవేటు సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. అందులో 16 సంస్థలు అర్హత సాధించినట్లు అధికారులు నిర్ధారించారు. టెండర్‌ను తెరిచే సమయంలో చినబాబు తెరపైకి వచ్చారు. తాము సూచించిన కంపెనీకే టెండర్ దక్కేలా చూడాలని ఆదేశించారు. ఆప్పట్లో చినబాబు ఆశీస్సులు ఉన్న కంపెనీ ఇతర కంపెనీల కంటే ఎక్కువ ధర కోట్ చేసింది. దాంతో ఆ కంపెనీకి టెండర్ దక్కే అవకాశాలు లేవని అధికారులు ఏకంగా ఆ టెండర్‌నే రద్దుచేశారు. మరోసారి సెప్టెంబర్‌లో టెండర్లను ఆహ్వానించారు. ఈ టెండర్లపైనా వివాదం తలెత్తడంతో మళ్లీ నవంబర్‌లో టెండర్లు పిలిచారు. డిసెంబర్ 4న టెండర్లను తెరిచారు. ఇటీవల సచివాలయంలో మంత్రి లోకేశ్‌ను కలిసిన కైనెటిక్ గ్రీన్ ఇండియా ప్రతినిధులు టెండర్ నిబంధనల్లో మార్పులు అస్మదీయ సంస్థకే టెండర్ దక్కేలా టెండర్ నిబంధనల్లోనూ చినబాబు మార్పులు చేయించారు. ముందుగా పిలిచిన టెండర్లో ఈఎండీ(ఎర్నేస్ట్ మనీ డిపాజిట్) నాన్ రిఫండబుల్ రూ.25 వేలు కాగా, తాజాగా పిలిచిన టెండర్లో ఈఎండీ రూ.1.5 కోట్లుగా చూపించడం గమనార్హం. దాంతోపాటు ఈ–ఆటోలను సరఫరా చేసే సంస్థ ఇప్పటికే 2,500 ఆటోలను ఏదైనా సంస్థకు సరఫరా చేసినట్లు అధికారిక ధ్రువీకరణ కావాలని నిబంధన విధించారు. అయినప్పటికీ టెండర్లలో ఏడు కంపెనీలు పాల్గొన్నాయి. ఎస్ఎస్వీ టెక్నాలజీ, గోయెంకా మోటార్స్, విక్టరీ ఎలక్ట్రికల్, రిప్ టెక్నాలజీ, కైనెటిక్ గ్రీన్ ఇండియా, భారత్ ఇంజనీరింగ్ వర్క్స్ తదితర కంపెనీలు పాల్గొన్నాయి. చివరకు చినబాబుతో డీల్ కుదుర్చుకున్న కైనటిక్ గ్రీన్ ఇండియా సంస్థకే టెండర్‌ను ఖరారు చేశారు. అర్హత లేని కంపెనీకే టెండర్ టెండర్ నిబంధనల ప్రకారం హోమోలోగేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. కానీ, ఆ సర్టిఫికేట్ లేని కైనెటిక్ గ్రీన్ ఇండియాకు టెండర్ ఖరారు చేయడం గమనార్హం. మిగిలిన సంస్థల కంటే ఎక్కువ ధర కోట్ చేసిన కంపెనీకి టెండర్ కట్టబెట్టడం విశేషం. కైనెటిక్ గ్రీన్ ఇండియా ఒక్కో ఆటోను రూ.2.44 లక్షలకు సరఫరా చేయనున్నట్లు టెండర్లలో చూపించారు. మిగిలిన సంస్థలు రూ.2.20 లక్షల లోపు ధరకే సరఫరా చేస్తామంటూ బిడ్ దాఖలు చేశాయి. ఈ–ఆటో ప్రస్తుతం రూ.1.48 లక్షల ధర పలుకుతోంది. కానీ, చినబాబు సూచించిన సంస్థ మాత్రం ఒక్కో ఆటోను రూ.2.44 లక్షలకు ఇచ్చేలా ఒప్పందం చేసుకోవడం గమనార్హం. అంటే ఒక్కో ఆటోకు అదనంగా రూ.లక్ష చెల్లించాల్సి వస్తోంది. తొలివిడతగా ఆహ్వానించిన టెండర్లలో పాల్గొన్న కంపెనీలు చిత్తూరు జిల్లాలో ఒక్కో ఆటోను రూ.1.08 లక్షలకు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.1.16 లక్షలకు సరఫరా చేస్తామంటూ ముందుకొచ్చాయి. కానీ, ఆ టెండర్లను రద్దు చేయించారు. అధిక ధర కోట్ చేసిన కైనెటిక్ గ్రీన్ ఇండియాకే టెండర్ కట్టబెట్టడం వెనుక లోగుట్టు ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కేవలం రూ.1.08 విలువైన ఆటోను అస్మదీయ సంస్థ నుంచి రూ.2.44 లక్షలకు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధ పడింది. అంటే ఖజానాపై రూ.83 కోట్ల మేర అదనపు భారం పడుతోంది. ఈ సొమ్ముంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎస్సీ యువతపై అదనపు భారం పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ మిషన్ పథకంలో భాగంగా అర్హులైన దళిత యువతకు ఈ–ఆటోలను సరఫరా చేయనున్నారు. ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించాల్సి ఉంటుంది. ఆటోలకు ప్రభుత్వ సబ్సిడీ పోను బ్యాంకు రుణం అందిస్తారు. బ్యాంకు రుణాన్ని లబ్ధిదారుడు నెలవారీగా చెల్లించుకోవాలి. చినబాబు కమీషన్ల కక్కుర్తి వల్ల లబ్ధిదారులు ఒక్కొక్కరు రూ.లక్ష వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఈ–ఆటోల టెండర్లలో అవినీతి ‘‘ఈ–ఆటోల సరఫరా టెండర్లలో అవినీతి చోటుచేసుకుంది. కొందరి స్వార్థం కోసం మన రాష్ట్రానికి చెందిన చిన్న తరహా పరిశ్రమలకు అన్యాయం చేశారు. మరో రాష్ట్రానికి చెందిన కంపెనీకి ఈ–ఆటోల సరఫరా టెండర్‌ను అప్పగించడం దారుణం. టెండర్లలో అక్రమాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా సృందించలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే న్యాయ పోరాటం చేస్తాం’’ – కె.పి.రావు, ఎలక్ట్రికల్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ నేత, విజయవాడ -
రాజన్న సిరిసిల్ల.. రాష్ట్రానికే ఆదర్శం
రాజన్న సిరిసిల్ల జిల్లా : స్వచ్ఛత, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో దేశంలోనే జిల్లాకు అరుదైన ఖ్యాతి లభించడం మనందరికీ దక్కిన గౌరవమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. సిరిసిల్లలో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ.. యావత్ భారతానికి తెలంగాణను, తెలంగాణకు సిరిసిల్ల జిల్లాను దిక్సూచిగా నిలుపుదామంటూ పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛ దర్పణ్ ర్యాకింగ్‌లో జిల్లాకు ప్రథమ బహుమతి లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత తొలి జిల్లాగా సిరిసిల్ల ప్రత్యేకతను సంతరించుకుని రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాబోయే రోజుల్లో ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతూ బంగారు తెలంగాణను సాధించుకుందామని పిలుపునిచ్చారు. జిల్లాను అగ్రస్థానంలో నిలిపిన ఉద్యోగుల సేవలు గుర్తించడంతో పాటు, సమస్యలకు పరిష్కారం చూపుతూ, వారి సంక్షేమానికై ప్రభుత్వం కృషి చేస్తోందని కేటీఆర్ తెలిపారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవడానికి, నేతన్నల నుంచి వస్త్రాలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. సుదీర్ఘ పోరాట ఫలితం తెలంగాణ.. సంకల్పం గట్టిదైతే ఎన్ని అవరోధాలైనా అవలీలగా అడ్డుకోవచ్చని తెలంగాణ ఉద్యమం నిరూపించిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సుదీర్ఘ పోరాట ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం సఫల రాష్ట్రంగా స్థిరపడిందని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రం ప్రగతి దారుల వెంట వేగంగా పయనిస్తోందని, ఇది ఒక చారిత్రాత్మక విజయయాత్ర అని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర పురోగమనాన్ని అడ్డుకోవాలనే ప్రతిఘాతక శక్తుల ప్రయత్నాలు ఆనాడు పోరాటంలో.. ఈనాడు పాలనలోనూ ఎదురవుతున్నప్పటికీ ప్రభుత్వం వాటిని తిప్పికొడుతోందని తెలిపారు. -
బిల్లులు చెల్లించట్లేదు సార్..
సదాశివనగర్(ఎల్లారెడ్డి) : మండలంలోని మర్కల్ గ్రామాన్ని స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం కేంద్ర బృందం సందర్శించింది. ఈ సందర్భంగా గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రెండు ఏళ్ల క్రితం మరుగుదొడ్లు నిర్మించుకున్నప్పటికీ ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదని, ఇంకా మరుగుదొడ్లు ఎక్కడ నిర్మించుకుంటామని ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈజీఎస్, ఐకేపీ అధికారులకు లంచం ఇస్తేనే బిల్లులు మంజూరు చేస్తున్నారన్నారు. నిరుపేదలమైన తమకు లంచం ఇవ్వడానికి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలన్నారు. ఈ విషయమై వచ్చే శుక్రవారం గ్రామంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బృందం ప్రతినిధి మానిటరింగ్ అధికారి సంతోష్, జిల్లా కో–ఆర్డీనేటర్లు శంకర్, నారాయణ, జిల్లా ప్రేరక్ రమాదేవి, జడ్పీటీసీ పడిగెల రాజేశ్వర్రావ్, సర్పంచ్ నర్సింహారెడ్డి, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంఈవో యోసెఫ్, ఏపీవో శృతి, ఈసీ తిరుపతి నాయక్, ఎఫ్ఏ రాములు, టీఏలు జగదీశ్వర్ రెడ్డి, గంగాధర్, సంతోష్, రైతు సమన్వయ సమితి చైర్మన్ రాంరెడ్డి, జూకంటి రాజులు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాతుసంగెంలో కేంద్ర బృందం పర్యటన గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని మాతుసంగెం గ్రామంలో సోమవారం జాతీయ స్థాయి పర్యవేక్షక బృందం సభ్యులు సంతోష్...ఎంపీడీవో సాయాగౌడ్‌తో కలిసి పర్యటించారు. గ్రామంలో బృందం సభ్యులు ఇంటింటికి తిరిగి మౌళిక సదుపాయాలున్నాయా లేదా అని విచారణ చేశారు. ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు.ఎస్బీఎం రమాదేవి, జిల్లా కో–ఆర్డినేటర్ శంకర్ నాయక్, సింగిల్ విండో చైర్మన్ వజీర్ ముకుంద్‌రావు, నాయకులు ఉన్నారు. -
లక్ష్యం సాధ్యమా!
కడప : వైఎస్సార్‌జిల్లాను 2018 మార్చి నాటికి స్వచ్ఛజిల్లాగా ప్రకటించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చేందుకు అధికారులు ఆపసోపాలు పడక తప్పడం లేదు. కలెక్టర్ నుంచి పంచాయతీ కార్యదర్శుల వరకు ప్రతి ఒక్కరూ నడుంబిగించి కృషి చేస్తున్నారు. ఈనెలాఖరుకల్లా వైఎస్సార్‌జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లా(ఓడీఎఫ్)గా ప్రకటించాలని సీఎం అధికారులను అదేశించారు. కేవలం పదిరోజులు మాత్రమే గడువు ఉంది. ఈలోగా పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలను పూర్తి చేసి జిల్లాను ఓడీఎఫ్‌గా ప్రకటించగలగాలి. అ దిశగా అధికారులు కృషి చేస్తున్నా కింది స్థాయిలో అది సాధ్యం అవుతుందా అన్న దానిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కారణం 3వేల మరుగుదొడ్లకు సంబంధించి హార్డ్‌కోర్ కింద ( పలు కారణాల చేత ఆగిపోయినవి, ఉదాహరణకు గట్టి నేల ఉండటం, ఇంటిలో గర్భిణులు,బాలింతలు ఉండటం, ఇంటి పెద్దలు చనిపోవడం వంటి వి) పనులు అగిపోయాయి. అడుగడుగునా అడ్డంకులే జిల్లాలో స్వచ్చ భారత్ మిషన్ పథకాన్ని 2014లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అప్పట్లో జిల్లావ్యాప్తంగా సర్వే నిర్వహించి 3,04, 992 మరుగుదొడ్లు అవసరమని గుర్తించారు. పథకం ప్రారంభంలో లబ్థిదారులకు బిల్లుల చెల్లింపు సరిగా లేదు. ఫలితంగా మరుగుదొడ్ల నిర్మాణానికి చాలామంది ఆసక్తి చూపలేదు.దీంతో పథకం లక్ష్యం కుంటుపడుతూ వచ్చింది. గ్రామీణ ప్రజలకు మరుగుదొడ్డి నిర్మాణం గురించి సరైన అవగాహన కల్పించక పోవడం కూడా మరో కారణంగా చెప్పవచ్చు. కేటాయించిన టార్గెట్లను పూర్తి చేయలేక అధికారులు ఆపసోసాలు పడాల్సి వస్తోంది. కలెక్టర్ ప్రత్యేక చొరవ స్వచ్చభారత్ మరుగుదొడ్ల నిర్మాణంపై కలెక్టర్ బాబురావునాయుడు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగిని మరుగుదొడ్ల నిర్మాణంలో భాగస్వాములను చేసి లక్ష్యాన్ని కేటాయించారు. దీనిపై నిత్యం పర్యవేక్షించడంతోపాటు నివేదికలను ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయులతోపాటు 9వ తరగతి చదివే విద్యార్థులను కూడా మరుగుదొడ్ల నిర్మాణంలో భాగస్వాములను చేస్తున్నారు. లక్ష్యం సాధించేందుకు కృషి మరుగుదొడ్ల నిర్మాణం జిల్లాలో స్పీడ్‌గా ఉంది.కలెక్టర్ చొవర తీసుకోవడంతోపాటు నిత్యం పర్యవేక్షించడం సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈనెలాఖరుకు జిల్లాను ఓడీఎఫ్‌గా ప్రకటించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకున్నాం. లక్ష్యం సాధించేందుకు కృషి చేస్తున్నాం. – సంజీవరావు, ఆర్‌డబ్లూఎస్, ఎస్ఈ -
స్వచ్ఛతకు ‘దివ్యో’పాయం
సాక్షి, ఆదిలాబాద్: వంద శాతం స్వచ్ఛ ఆదిలాబాద్ సాధించేందుకు జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ వినూత్న ఆలోచన చేశారు. మండలాల్లో అధికారులకు రెండు గ్రామాల చొప్పున కేటాయించి లక్ష్యం పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. మండల అధికారు లు, వివిధ శాఖల్లోని ఇంజినీరింగ్ సిబ్బందికి ఈ లక్ష్యాన్ని కేటాయించి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించారు. లక్కీ డ్రా ద్వారా గ్రామాలను అప్పగించారు. లక్ష్యం లో ఫిబ్రవరిలో 50 శాతం, మార్చిలో 50 శాతం లో పూర్తి చేసేలా ఆలోచన చేసి ముందుకు కదులుతున్నారు. ఆమె అనుకు న్న విధంగా మార్చి లో పూర్తి స్థాయిలో కాకపోయినా ప్రభుత్వ లక్ష్యం మేరకు గడువు కంటే ముందే స్వచ్ఛ ఆదిలాబాద్ సాకారమయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండో దశలో 165 జీపీల్లో స్పెషల్‌డ్రైవ్.. రాష్ట్ర స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ)ఆధ్వర్యం లో అన్ని జిల్లాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. గతంలో గ్రామీణ నీటి సరఫరా, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథ కం ఆధ్వర్యంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మా ణాలు చేపట్టారు. ఆ తర్వాత గతేడాది జూన్ నుంచి ఆర్డబ్ల్యూఎస్, ఉపాధిహామీల నుంచి ఐహెచ్హెచ్ఎల్ను నిలిపివేసి పూర్తిగా డీఆర్డీఓలోని ఎస్‌బీఎంకు బదలాయించారు. జిల్లాలో మొదటి దశలో 78 గ్రామపంచాయతీల్లో వ్యక్తిగ త మరుగుదొడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ గ్రామపంచాయతీల్లో 20వేలకు పై గా లక్ష్యం ఉండగా, ఇప్పటివరకు 11వేలకు పై గా పూర్తిచేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో 9వేలు పూర్తి చేయాల్సి ఉంది. ఇక మిగిలి న 165 గ్రామపంచాయతీలను రెండో దశ కింద తీసుకొని ఈ స్పెషల్డ్రైవ్ను కలెక్టర్ అమలు చే స్తున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం, నీటిపారుదల శాఖ, గిరిజన సం క్షేమ శాఖ, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లోని ఇంజినీరింగ్ శాఖ సిబ్బంది సహకారంతో ఎంపీడీవోలు, ఈఓపీఆర్డీలు, ఏపీఎంలు, ఏపీవోలు ఈ కార్యం లో పాల్గొంటున్నారు. చెరో రెండు గ్రామాలను టాస్క్‌గా కేటాయించారు. ఈ గ్రామాలను లక్కీ డీప్ ద్వారా వారికి కేటాయించారు. రెండు గ్రామాల్లో ఒకటి ఫిబ్రవరి, మరొకటి మార్చిలో తీసుకొని ఆ గ్రామాలను ఓడీఎఫ్‌గా మార్చేందుకు కృషి చేయాలి. తద్వారా 165 గ్రామపంచాయతీలను 80 మందికి పైగా అధికారులకు బాధ్యతలు అప్పగించి ఈ కార్యాన్ని సఫలీకృతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంటింటికి మరుగుదొడ్డి.. గ్రామీణ ప్రాంతాల్లో నీటి కలుషితం కారణంగా అనేక రోగాలు ప్రబలి పర్యావసనంగా మరణాలు సంభవిస్తున్నాయి. ప్రధానంగా పారిశుధ్య లోపం కారణంగానే ఈ పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మలవిసర్జన నీటిని కలుషితం చేస్తోంది. గ్రామాల్లో ఇప్పటికీ ఇది ప్రధాన సమస్యగా ఉందంటే నమ్మాల్సిందే. పారిశుధ్యం మెరుగుపర్చాలంటే ప్రధానంగా వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరుగుదొడ్డి నిర్మించుకొని వినియోగించడం ముఖ్యమని ప్రజల్లో భావన తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే సామాజిక, ఆర్థిక, వ్యక్తిగత ప్రవర్తన కారణాలతో పలువురు మరుగుదొడ్డి నిర్మాణాలకు ముందుకు రాకపోవడం సవాలుగా మారుతుంది. ఈ నేపథ్యంలో గౌరవం, గోప్యత, సురక్షిత, సాంఘికస్థితి తెలియజేసేందుకు ఇంటింటికి మరుగుదొడ్డి ఉండాలనే నినాదంతో ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2014 అక్టోబర్ 2న కేంద్ర ప్రభుత్వం క్లీన్ ఇండియా నినాదంతో 2019 అక్టోబర్ 2కు స్వచ్ఛభారత్ నిర్మించాలనే ఉద్దేశ్యంతో వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్ల నిర్మాణంపై దృష్టి సారించింది. దీని ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ)అనే కార్యక్రమాన్ని చేపట్టి మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టింది. 2018 అక్టోబర్ 2 నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయా లని లక్ష్యం పెట్టుకుంది. గత ప్రభుత్వాల హయాంలో మరుగుదొడ్ల నిర్మాణం జరిగినప్పటికీ ఉమ్మడి జిల్లాలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయి. ప్రధానంగా పెద్దఎత్తున మరుగు దొడ్డి సామగ్రి కొనుగోలు చేసినప్పటికీ నిర్మా ణాలు జరగకపోవడం, సామగ్రి కూడా వృథా అయినటువంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. బేస్‌లైన్ సర్వే 2012 ప్రకారం స్వచ్ఛభారత్‌లో భాగంగా గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు లేని ఇళ్ల సముదాయాలను గుర్తించడం జరిగింది. జనవరి 31లోగా పరిపాలన ఆమోదం తీసుకోవాలి.. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను వేగిరం చేసేందుకు కలెక్టర్ వినూత్న ఆలోచన చేశారు. లక్కీడీప్ ద్వారా అధికారులకు గ్రామాలను కేటాయించడం జరిగింది. మిగిలిన 165 గ్రామపంచాయతీల్లో జనవరి 31లోగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి పరిపాలన ఆమోదం తీసుకోవాలి. మార్చిలో అనుకున్న మేరకు టాస్క్ పూర్తి చేస్తాం. ఒకవేళ కొంత మిగిలిపోయినా గడువుకంటే ముందే పూర్తయ్యేలా ప్రయత్నాలు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు అక్టోబర్ 2కు ముందే జిల్లాను ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దుతాం. – రాజేశ్వర్ రాథోడ్, డీఆర్డీవో, ఆదిలాబాద్ జిల్లా -
వెయ్యిమంది గాంధీలు వచ్చినా ఇండియా క్లీన్ కాదు : మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : వెయ్యిమంది మహాత్మాగాంధీలు వచ్చినా స్వచ్ఛభారత్ లక్ష్యం సాధ్యం కాదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అలాగే లక్షమంది నరేంద్రమోదీలు, దేశంలోని ముఖ్యమంత్రులు అంతా ఏకమైనా ఇది అసాధ్యం అని.. కానీ, ఎప్పుడైతే ప్రజలంతా ఏకమవుతారో, 125 కోట్లమంది భారతీయ ప్రజలు అనుకుని ముందుకు సాగుతారో అప్పుడు మాత్రమే ఈ లక్ష్యం సాధ్యం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. స్వచ్ఛభారత్ ప్రారంభమై మూడో ఏడాది పూర్తవడంతోపాటు నేడు గాంధీ జయంతి కావడంతో ప్రధాని మోదీ మాట్లాడారు. భారత్ ఎప్పుడో స్వయం పాలనకు వచ్చినప్పటికీ సాధించాల్సినది చాలా ఉందని అన్నారు. వాటన్నింటికంటే ముందు స్వచ్ఛ భారత్‌ను సాధించడం ముఖ్యం అని అన్నారు. పౌరసమాజంలోని సభ్యులు, మీడియాది స్వచ్ఛ భారత్‌ను విజయవంతం చేయడంలో కీలక పాత్ర అని చెప్పారు. ఒక శక్తిమంతమైన దేశంగా రూపుదిద్దుకునే ముందు పరిశుభ్రతతో కూడిన దేశంగా మారడం ముఖ్యం అని గుర్తు చేశారు. 'మోదీని విమర్శించడానికి చాలా విషయాలు మీకున్నాయి. కొంతమంది అలా విమర్శించడానికి మీకు వెయ్యి అంశాలు అందిస్తారు. .. అయితే, అలా విమర్శించేవారు దయచేసి పరిశుభ్రతను పాటించేవారిని మాత్రం అధైర్యపరచకండి' అంటూ మోదీ విజ్ఞప్తి చేశారు. -
‘మరుగు’లో మేత
♦ లబ్ధిదారుల పేరుతో ఎన్జీఓల ఖాతాల్లోకి రూ.కోటి మళ్లింపు ♦ కొన్ని గ్రామాల్లో పాతదొడ్లకు రంగులు వేసి బిల్లులు స్వాహా ♦ ఎంపీడీఓ, జూనియర్ అసిస్టెంటే సూత్రధారులు..? ♦ స్వచ్ఛభారత్ మిషన్, ఉపాధిహామీ నిధులు కైంకర్యం చందర్లపాడు(నందిగామ) : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ మిషన్ నిధులు భారీగా దుర్వినియోగమయ్యాయి. ఎన్జీఓ (నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్) అవతారమెత్తిన కొందరు అధికార పార్టీ నేతలు మరుగుదొడ్లు నిర్మించకుండానే లబ్ధిదారుల పేరుతో లక్షల రూపాయల మేర బిల్లులు పొందారు. చందర్లపాడు మండలంలో జరిగిన ఈ కుంభకోణంలో ఎంపీడీఓ కీలకపాత్ర వహించగా కార్యాలయ జూనియర్ అసిస్టెంటు తనవంతు సహాయ సహకారాలు అందించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నేరుగా లబ్ధిదారుల పేరుతో ఎన్జీఓల ఖాతాలోకి డబ్బు జమచేశారు. ఒక్క తోటరావులపాడు సుమారు 120 మంది పేరుమీద రూ.18 లక్షలు డ్రాచేయగా కోనాయపాలెం, చందర్లపాడు, ముప్పాళ్ల, కాసరబాద, కొడవటికల్లుతో పాటు మిగిలిన పంచాయతీల్లోనే ఈ కుంభకోణం కొనసాగింది. పాత వాటికి బిల్లులు చెల్లించడంతోపాటు, అసలు మరుగుదొడ్లు నిర్మించకుండానే నిర్మాణం పూర్తయినట్లుగా నమోదుచేసి బిల్లులు చెల్లించేశారు. కొన్నిచోట్ల లబ్ధి దారుల ఖాతాల్లోకి డబ్బు జమచేసి, వారికి కొద్ది మొత్తంలో కమిషన్ ఇచ్చి మిగిలిన మొత్తాన్ని స్వాహాచేయగా, మరికొంతమందికి చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. గడిచిన రెండేళ్లుగా స్వచ్ఛభారత్ మిషన్‌తోపాటు ఉపాధిహామీ పథకం కింద మరుగుదొడ్లు నిర్మించినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి మండలవ్యాప్తంగా కోటి రూపాయల నిధులను స్వాహా చేసినట్లు సమాచారం. నిబంధనలకు పాతర మరుగుదొడ్ల నిర్మాణాల విషయంలో అధికారులు నిబం ధనలను తుంగలో తొక్కారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి అధికారి వరకు పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించారు. దొడ్డి నిర్మాణాలను పరిశీలించిన తరువాత గ్రామ ప్రత్యేకాధికారి (చెక్మెజర్మెంటు అధికారి) ఎంబుక్‌లో రికార్డు చేయాలి. దానిని మండల పరిషత్ కార్యాలయానికి అందజేయాలి. మరుగు దొడ్డి నిర్మాణం జరిగిందా లేదా, లేదా? అది ఏ స్టేజీలో ఉంది? అన్న విషయాన్ని కంప్యూటర్ డేటాలో పరిశీంచిన తరువాత ఎంపీడీఓ లబ్ధిదారుడి ఖాతాకు బిల్లుమొత్తం జమచేయాలి. అయితే ఈ విషయంలో ఎంపీడీఓ, జూనియర్ అసిస్టెంటు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. మరుగుదొడ్డికి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు కమీషన్ తీసుకుని లబ్ధిదారుడి ఖాతాకు బదులు ఎన్జీఓ ఖాతాలోలో బిల్లులు మళ్లించారని సమాచారం. నిర్మించకుండానే బిల్లులు చెల్లింపు మండలంలో ఇప్పటి వరకు స్వచ్ఛభారత్ మిషన్ కింద 1,936 మరుగుదొడ్లను నిర్మించారని రికార్డుల్లో నమోదు చేశారు. అయితే 11 వేల వరుకు సక్రమంగా నిర్మించారని సమాచారం. అధిక మొత్తంలో మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు చెల్లించరని సమాచారం. కొందరు టీడీపీ కార్యకర్తలకు చెందిన పాత మరుగుదొడ్లకే రంగులు వేసి, కొత్తవాటిగా చూపి బిల్లులు చెల్లించారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కోనపాలెం 2, 3 వార్డులో 100 పాత దొడ్లకు, చందర్లపాడు 4, 5, 9 10, 11, 12, 13, 14 వార్డులో మరో 200 దొడ్లకు బిల్లులు చెల్లించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
పంపిణీ సరే.. నిర్వహణేది?
► పారిశుధ్య కార్మికులు లేక మూలనపడ్డ ట్రైసైకిళ్లు ► చాలా గ్రామాల్లో కనిపించని డంపింగ్‌యార్డులు ► నెరవేరని చెత్త సేకరణ లక్ష్యం ► పట్టించుకోని అధికారులు తానూరు(ముథోల్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ పల్లెలను తీర్చదిద్దాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నా క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అలసత్వం కారణంగా అనుకున్న లక్ష్యానికి చేరుకోవడం లేదు. పల్లెలను పారిశుధ్య రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛభారత్ మిషన్ పథకంలో భాగంగా కేంద్రప్రభుత్వం రూరల్ వాటర్‌స్కీం అండ్ శాని టేషన్ (ఆర్డబ్ల్యూఎస్) శాఖ ఆధ్వర్యంలో ప్రతీ గ్రామ పంచాయతీకి రెండు, మూడు చొప్పున ట్రైసైకిళ్లను పంపిణీ చేసింది. నిర్మల్ జిల్లా 13 మండలాల పరిధిలోని 240 గ్రామ పంచాయతీ లకు ఒక్కోదానికి రూ.20వేల చొప్పున రూ. 1.44 కోట్లు వెచ్చించి 720 ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ నిర్ణయం బాగానే ఉన్నా కొన్ని చోట్ల మాత్రమే ఉపయోగంలో ఉండగా.. చాలా చోట్ల మూలనపడ్డాయి. పలు మండలాల్లో వీటి ద్వారా చెత్త సేకరిస్తున్నా మిగతా చోట్ల సి బ్బం ది కొరతతో నిరుపయోగంగా మారాయి. దీం తో పల్లెల్లో ఎక్కడిచెత్త అక్కడే దర్శనమిస్తోంది. నీరుగారుతున్న లక్ష్యం.. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీ ణ) పథకంలో భాగంగా జిల్లాలోని అన్ని గ్రా మాలకు ఏడాది క్రితం ట్రైసైకిళ్లను పంపిణీ చే సింది. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో వీటి నిర్వహణ బాధ్యతను సంబంధిత సర్పంచ్‌లకు అ ప్పగించింది. ఒక్కో ట్రైసైకిల్‌కు రూ.20 వేల చొ ప్పున వెచ్చించి కొనుగోలు చేశారు. ఇందులో త డి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు వీ లు కల్పించారు. ఈ సైకిళ్లపై స్వచ్ఛభారత్ లోగో ను సైతం ముద్రించారు. గ్రామాల్లో ఉన్న జనా భా ఆధారంగా వీటిని పంపిణీ చేశారు. అయితే నిర్వహణకు తగిన నిధులు లేక సిబ్బంది కోరత కారణంగా సర్కారు లక్ష్యం నీరుగారిపోతోంది. వేధిస్తున్న సిబ్బంది కొరత ... జిల్లాలోని సగం గ్రామ పంచాయతీల్లో పారిశు ధ్య కార్మికులు ఒక్కరిద్దరు మాత్రమే ఉన్నారు. దీంతో సిబ్బంది అందుబాటులో ఉన్న జీపీల్లో మాత్రమే వీటిని ఉపయోగిస్తుండగా మిగతా చో ట్ల నిరుపయోగంగా మారుతున్నాయి. రోజు వారి కూలీలను నియమించేందుకు నిధుల కొర త ఉందని తెలుస్తోంది. సిబ్బంది లేని గ్రామాల్లో ట్రైసైకిళ్లు మూలనపడి శిథిలావస్థకు చేరా యి. అలాగే కొన్ని గ్రామాల్లో డంపింగ్ యార్డులు లేక సేకరించిన చెత్తను వేయడంలో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడి చెత్త అక్కడే ... జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు ట్రైసైకి ళ్లు అందించినా.. పారిశుధ్య సిబ్బంది లేకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే దర్శనమిస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పారిశుధ్య సిబ్బందిని నియమించి ట్రైసైకిళ్లను వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. నిరుపయోగంగా మారాయి గ్రామాలకు సరఫరా చేసిన ట్రైసైకిళ్లు సిబ్బంది లేక నిరుపయోగంగా మారాయి. దీంతో ఏడాది నుంచి పంచాయతీ కార్యాలయంలో మూలన పడి దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి సరిపడా పారిశుధ్య కార్మికులను నియమించి చెత్త తొలగించేలా చర్యలు చేపట్టాలి. –రమేశ్, బోంద్రట్ ట్రైసైకిళ్లను ఉపయోగంలోకి తెస్తాం జిల్లాలోని ఆయా గ్రామాలకు పంపిణీ చేసిన ట్రైసైకిళ్లను త్వరలోనే పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి తీసుకువస్తాం. ఆయా గ్రామాల్లో డంపింగ్‌యార్డులు లేకపోవడంతో చెత్త సేకరణకు ఇబ్బందవుతోంది. గ్రామాల్లో డంపింగ్‌యార్డులు ఏర్పాటు చేసి ట్రైసైకిళ్ల ద్వారా చెత్త తొలగించి ఉపయోగంలోకి తీసుకువస్తాం. –గంగాధర్, జిల్లా పంచాయతీరాజ్ అధికారి మండలం గ్రామ పంపిణీ చేసిన పంచాయతీలు ట్రైసైకిళ్లు భైంసా 19 60 తానూరు 20 57 ముథోల్ 21 63 కుభీర్ 20 60 లోకేశ్వరం 15 45 కుంటాల 15 45 దిలావర్పూర్ 15 45 కడెం 24 72 ఖనాపూర్ 18 51 లక్ష్మణ్‌చాంద 17 51 మామడ 13 39 నిర్మల్ 25 75 సారంగాపూర్ 18 54 మొత్తం 240 720 -
‘స్వచ్ఛ’తలో గ్రేటర్..
స్వచ్ఛభారత్ మిషన్ ర్యాంకుల ప్రకటన సిటీకి దేశంలో 22వ స్థానం తెలంగాణలో నెం.1 సిటీబ్యూరో: నగరాన్ని క్లీన్‌సిటీగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ చేపట్టిన యజ్ఞానికి తగిన ఫలితం వచ్చింది. స్వచ్ఛ భారత్ మిషన్ గురువారం వెల్లడించిన స్వచ్ఛ ర్యాంకుల్లో ఇతర మెట్రో నగరాలను తలదన్ని మెరుగైన ర్యాంకులో నిలిచింది. ఇటు తెలంగాణలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కంటే జీహెచ్ఎంసీ అగ్రస్థానంలో నిలిచింది. చిన్న పట్టణాలను, పెద్ద నగరాలను ఒకేగాటన కట్టవద్దంటూ జీహెచ్ఎంసీ చేసిన విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకోకుండా అన్నింటికీ కలిపి ర్యాంకులు ప్రకటించింది. అయినాసరే జీహెచ్ఎంసీ జాతీయస్థాయిలో 22వ స్థానాన్ని సాధించింది. గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ నగరాలను తలదన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిల్ కార్పొరేషన్ అగ్రభాగాన నిలిచింది. న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, సౌత్ ఎంసీడీ, నార్త్ ఎంసీడీ, ఈస్ట్ ఎంసీడీ, ఢిల్లీ కంటోన్మెంట్ అన్నింటికీ కలిపి 2015లో 16వ ర్యాంకు రాగా ప్రస్తుతం 100వ ర్యాంకుకు పైగా స్థానానికి పడిపోయాయి. మొత్తం ఐదు కార్పొరేషన్లకు వెరసి సగటున 1118 మార్కులు లభించాయి. కోల్‌కతాకు 2015లో 56వ ర్యాంకు రాగా, ఈసారి పోటీలో పాల్గొనలేదు. ఇంకా.. మరింత మెరుగ్గా.. స్వచ్ఛ భారత్ మిషన్ వెల్లడించిన స్వచ్ఛ ర్యాంకుల్లో జీహెచ్ఎంసీకి 22వ ర్యాంకు రావడంపై మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. నగర ప్రజలందరి సహకారం, జీహెచ్ఎంసీలోని అన్ని స్థాయిల సిబ్బంది కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. స్వచ్ఛ నగరం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన కార్యక్రమాలు, మున్సిపల్ మంత్రి కేటీఆర్ చూపిన చొరవతో ఈ గౌరవం దక్కిందన్నారు. బహిరంగ మల, మూత్ర విసర్జన రహితం, వ్యక్తిగత మరుగుదొడ్లు వంటి కొన్ని అంశాల్లో వెనుకబడినందునే మొదటి స్థానం రాలేదని అభిప్రాయపడ్డారు. వచ్చే సంవత్సరం తొలి రెండు స్థానాల్లో నిలవగలమన్నారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, పలువురు అధికారులు పాల్గొన్నారు. సమష్టి కృషితోనే అగ్రస్థానం స్వచ్ఛ నగరమనే మహత్తర యజ్ఞంలో అందరి సమష్టి కృషితో అగ్రస్థానంలో నిలిచాం. సీఎంతో సహా అందరు ప్రజాప్రతినిధులు, అధికారుల కృషి వల్లే ఇది సాధ్యమైంది. నిత్యం దాదాపు 40 లక్షల మంది రాకపోకలు సాగించే నగరంలో పరిశుభ్రత అనేది అంత సులభం కాదు. నేను, నా నగరం అనే తలంపుతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛత కోసం కృషి చేశారు. ఈ స్ఫూర్తితో మరింత ముందుకెళతాం. త్వరలో అందుబాటులోకి రానున్న డెబ్రిస్ రీసైక్లింగ్ ప్లాంట్ వల్ల ప్రైవేట్‌వ్యక్తులు డెబ్రిస్ తరలించే వీలుండదు. భవన నిర్మాణ అనుమతులు, రహదారుల నిర్మాణ సమయంలోనే వ్యర్థాల తరలింపు ఫీజు వసూలు చేసేలా నిబంధనలు తీసుకురానున్నాం. నాలాల్లో చెత్త వేయకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటాం. స్వచ్ఛ నగరం కోసం ప్రజల్లో మరిన్ని అవగాహన కార్యక్రమాలు పెంచుతాం. – బొంతు రామ్మోహన్, మేయర్ ఇతర నగరాలకు స్ఫూర్తి మహానగరాలు, పెద్ద నగరాలు, చిన్న పట్టణాలుగా వర్గీకరించి పోటీ పెడితే బాగుంటుందని మేం స్వచ్ఛ భారత్ మిషన్‌కు సూచించాం. అలాచేసి ఉంటే మొదటి పదిస్థానాల్లో కచ్చితంగా నిలిచేవాళ్లం. మొత్తం 2 వేల మార్కులకు గాను 80 శాతం మార్కులు వచ్చాయి. వివిధ అంశాల్లో పారిశుధ్య కార్మికుల బయోమెట్రిక్ హాజరు, వాహనాల ట్రాకింగ్ , ఓడీఎఫ్ వంటి అంశాల్లో మార్కులు తగ్గి ఉంటాయి. ర్యాంకు ఎలా ఉన్నా జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టిన బెస్ట్ ప్రాక్టీసెస్ జాతీయస్థాయిని ఆకర్షించాయి. తడి, పొడి చెత్త వేరుచేసే కార్యక్రమాన్ని జూన్ 5న అన్ని స్థానిక సంస్థలు అమలు చేయాల్సిందిగా సర్క్యులర్ జారీ అయింది. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా ఈనెల 5 నుంచే ప్రారంభిస్తున్నాం. వచ్చే సంవత్సరం మొదటి, రెండుస్థానాలు పొందేందుకు మరింత ఉత్సాహంతో పనిచేస్తాం. – డా.బి.జనార్దన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ -
ఇక ‘ఐకానిక్’ చార్మినార్!
స్వచ్ఛభారత్ మిషన్ కింద మరో 10 స్వచ్ఛ ఐకానిక్ ప్రదేశాలను ప్రకటించిన కేంద్రం సాక్షి, న్యూఢిల్లీ: దాదాపు నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన చార్మినార్‌ను స్వచ్ఛ ఐకానిక్ ప్రదేశంగా గుర్తించి ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద ‘స్వచ్ఛ ఐకానిక్ ప్లేసెస్ ఇనీషియేటివ్’రెండో దశలో భాగంగా చార్మినార్‌తో పాటు 10 ప్రదేశాలను ప్రకటించింది. మంగళవారం జమ్మూ కశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర తాగు నీరు, పరిశుభ్రత శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ ప్రదేశాల్లో ఉన్నత స్థాయిలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టడంతో పాటు సందర్శకులకు సౌకర్యాలు కల్పిస్తారు. చార్మినార్‌తో పాటు గంగోత్రి, యమునోత్రి, ఉజ్జయినీలోని మహా కాళేశ్వర్ మందిర్, గోవాలోని చర్చ్ అండ్ కాన్వెంట్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసైసీ, ఎర్నాకు లంలోని ఆదిశంకరాచార్య, శ్రావణ బెలగోలాలోని గోమఠేశ్వర్, దేవగర్‌లోని బైజ్నాథ్ ధామ్, బిహార్‌లోని తీర్థగయా, గుజరాత్‌లోని సోమ్‌నాథ్ దేవాలయాలను రెండో దశలో ఐకానిక్ ప్రదేశాలుగా ప్రకటించారు. ఇప్పటికే మొదటి దశలో ఏపీలోని తిరుమల దేవాల యం, తిరుపతి, అజ్మీర్ షరీఫ్ దర్గా, సీఎస్టీ ముంబై, అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం, అసోంలోని కామాఖ్య దేవాలయం, వారణాసిలోని మణికర్నిక ఘాట్, మదురైలోని మీనాక్షి దేవాలయం, జమ్మూ కశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి ఆలయం, పూరిలోని జగన్నాథ్ దేవాలయం, ఆగ్రాలోని తాజ్‌మహల్‌లను ఐకానిక్ ప్రదేశాలుగా గుర్తించారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద దేశంలోని 100 ప్రసిద్ధ, వారసత్వ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదేశాల్లో పరిశుభ్రతపై కేంద్రం దృష్టి సారించిన విషయం తెలిసిందే. -
వారికోసం ప్రత్యేక టాయిలెట్లు..!
భోపాల్ః స్వచ్ఛభారత్ మిషన్ పనుల్లో భాగంగా భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) హిజ్రాలకోసం ప్రత్యేకంగా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని ముందుగా నగరానికి మధ్యలో ఉన్న మంగళ్ వారా ప్రాంతం నుంచీ ప్రారంభిస్తున్నట్లు కార్పొరేషన్ వెల్లడించింది. ఇందుకోసం వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికను (డీపీఆర్) విడుదల చేసినట్లు బీఎంసీ మేయర్ ఆలోక్ శర్మ తెలిపారు. నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే మాదిరిగా మరుగుదొడ్లను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ టాయిలెట్లకు 25-30 లక్షల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు మేయర్ తెలిపారు. తాను మేయర్ గా ఉన్న ఈ ప్రాంతంలో హిజ్రా జనాభా అధికంగా ఉండటంతో ఈ ప్రత్యేక టాయిలెట్ల ఆలోచన చేసినట్లు మేయర్ పేర్కొన్నారు. ప్రత్యేక టాయిలెట్లు లేకపోవడంతో హిజ్రాలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారని... పురుషులు, స్త్రీలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఉన్నపుడు... వారికోసం ఎందుకు నిర్మించకూడదన్న ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు స్థానిక బీజేపీ నాయకుడు పేర్కొన్నారు. ఇంతకు ముందే మధ్యప్రదేశ్ ప్రభుత్వం.. స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా.. ఓ మాజీ ఎమ్మెల్యే, మాజీ మేయర్ సహా 200 సభ్యులుగల కమ్యూనిటీని ఏర్పాటు చేసిందని పంచాయితీ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఒకరు తెలిపారు. కొన్ని గ్రామాల్లో బహిరంగ మల మూత్ర విసర్జనకు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టడంతో సమస్య పరిష్కరించబడినట్లు ఆయన చెప్పారు.