ప్రధానికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ థ్యాంక్స్!
తిరువనంతపురం: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న తనను ప్రశంసించిన ప్రధాని నరేంద్రమోడీకి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కృతజ్క్షతలు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రారంభించిన క్లీనింగ్ క్యాంపెన్ కార్యక్రమాన్ని మోడీ పూర్థిస్థాయిలో ముందుకు తీసుకుపోవడాన్ని థరూర్ అభినందించారు. రాజకీయ పార్టీలకు సంబంధం లేని ఓ జాతీయ కార్యక్రమం స్వచ్ఛ భారత్ అని థరూర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో తాను పాల్గొనడానికి రాజకీయ ప్రధాన్యత లేదని.. దీనికి రాజకీయ రంగు పూయవద్దని థరూర్ కోరారు. పరిశుభ్రత కార్యక్రమాలకు గత ప్రధానమంత్రులు జవహర్ లాల్ నెహ్రూ, ఏబీ వాజ్ పేయ్ లు ప్రాధాన్యత ఇచ్చారని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధిష్టాన ఆదేశాలను బేఖాతరు చేస్తూ తిరువనంతపురంలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో శనివారం పాల్గొన్న సంగతి తెలిసిందే.