జైపూర్: ఇటీవల వెలువడిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. ఓటర్లు మరోసారి కాషాయ జెండాను ఎగురువేశారు. దీంతో ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. అయితే, ఈ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ శక్తివంతమైనా నాయకుడు అంటూ ప‍్రశంసించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
వివరాల ప్రకారం.. శశిథరూర్ సోమవారం జైపూర్‌లో లిచరేచర్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై శశిథరూర్ స్పందిస్తూ.. ప్రధాని మోదీని ప‍్రశంసించారు. ఈ క‍్రమంలోనే మోదీ శక్తివంతమైన నాయకుడు, క్రియాశీల నేత అంటూ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలపరంగా ఆయన చేసిన పనులు అభివర్ణించదగ్గవని అన్నారు. బీజేపీ విజయాన్ని మేము ఊహించలేదన్నారు. అంతలోనే తనదైన స్టైల్‌లో మోదీపై తీవ్ర విమర్శలు చేశారు.
మోదీ శక్తివంతమైన నాయకుడే కానీ.. మోదీ సమాజంలోకి వదిలిన కొన్ని శక్తులు దేశ ప్రజలను మతం, వర్గం పరంగా జాతిని విడదీస్తున్నాయని సంచలన ఆరోపణలు గుప్పించారు. అది దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో యూపీలో బీజేపీ విజయం సాధించింది కానీ.. రానున్న రోజుల్లో మళ్లీ యూపీ ప్రజలే బీజేపీకి షాకిస్తారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ యూపీలో బలమైన ప్రత్యర్థిగా ఎదిగిందని కితాబిచ్చారు. అలాగే, యూపీలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రియాంక గాంధీ తన శాయశక్తుల కృషి చేశారని కొనియాడారు. కానీ, చివరకు ఓటమిని ఎదుర్కొవాల్సి వచ్చిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment