* తొలుత ప్రజల్లో అవగాహన, ఆపై వసతుల కల్పన, చివరగా చట్టం అమలు
* కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్య నాయుడు వెల్లడి
* హైదరాబాద్‌లోని ఏఎస్‌సీఐలో జరిగిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరు
* టోకెన్ నిధులుగా త్వరలో తెలంగాణకు రూ.20 కోట్లు, ఏపీకి రూ.10 కోట్లు
* సదస్సులో పాల్గొన్న పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు
* ఇరు రాష్ట్రాల నుంచి 18 మంది ‘స్వచ్ఛ భారత్ దూత’ల నియామకం
సాక్షి, హైదరాబాద్: ‘స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మూడు దశల్లో అమలు చేస్తాం. తొలి దశలో పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం నిర్వహిస్తాం. రెండో దశలో ప్రజలకు మౌలిక వసతులను కల్పిస్తాం. చివరగా స్వచ్ఛ భారత్ సాధన కోసం చట్టాన్ని అమలు చేస్తాం’ అని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు వెల్లడించారు. ‘పురపాలన, స్వచ్ఛభారత్’ అంశంపై సోమవారం నగరంలోని భారతీయ పరిపాలన సిబ్బంది కళాశాల (ఏఎస్‌సీఐ)లో జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ దేశంలో 68 శాతం ప్రజలు నేటికీ బహిర్భూమికే వెళ్తున్నారన్నారు. పారిశుద్ధ్యంపట్ల ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు కోసం విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత బహిరంగ ప్రదేశాల్లో మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణం, పార్కింగ్ వసతితోపాటు ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. ఈ దశలను విజయవంతంగా పూర్తి చేశాకే నిర్బంధ పారిశుద్ధ్యం అమలు కోసం చట్టం చేస్తామన్నారు.
ఈ సందర్భంగా సింగపూర్‌లో అమలవుతున్న పారిశుద్ధ్య విధానాన్ని వెంకయ్య గుర్తు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం, చెత్త వేయడం చేయరాదంటూ అక్కడి ట్రావెల్ గైడ్లు విదేశీ యాత్రికులకు వివరిస్తుంటారని... కార్లోంచి ఎవరైనా కాగితం ముక్కను రోడ్డుపై పడేసినా అధికారులు వెంబడి ంచి మరీ పట్టుకొని 500 డాలర్ల జరిమానా విధిస్తారన్నారు. పారిశుద్ధ్యలేమితో దేశంలోని పేదలు ఏటా వైద్యానికి రూ.6,500 చొప్పున వెచ్చిస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు ఓ నివేదికలో తెలిపిందని వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశేషంగా కృషి చేసిన 18 మందిని స్వచ్ఛ భారత్ దూతలుగా వెంకయ్య నియమించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి చెరో 9 మందిని ఎంపిక చేశామన్నారు.
సందర్శకులకు టాయిలెట్లు తప్పనిసరి
త్వరలో భవన నిర్మాణ చట్టాన్ని తీసుకువస్తామని వెంకయ్య తెలిపారు. నూతన చట్టం ప్రకారం.. న్యాయవాదులు, వైద్యులు తదితర వృత్తి నిపుణులు తమను కలిసేందుకు వచ్చే సందర్శకుల కోసం తమ భవనాల్లో టాయిలెట్లను నిర్మించాలన్నారు. హోటళ్లన్నీ వ్యర్థాలను అక్కడికక్కడే నిర్వీర్యం చేసే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని.. లేకుంటే ‘స్వచ్ఛ భారత్’ సాధ్యం కాదన్నారు. ‘స్వచ్ఛ భారత్’ అమలు కోసం త్వరలో తెలంగాణకు రూ.20 కోట్లు, ఏపీకి రూ.10 కోట్లను టోకెన్ నిధులుగా విడుదల చేస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల కార్యక్రమంగా నిర్వహించాలనేది ప్రధాని ఉద్దేశమన్నారు. కాగా, ‘స్వచ్ఛ భారత్’ అమలులో కేంద్రం చొరవను టీఆర్‌ఎస్ ఎంపీ కవిత అభినందించారు. అయితే మరుగుదొడ్ల నిర్మాణం కంటే నిర్వహణే అత్యంత సమస్యగా ఉందన్నారు. స్వచ్ఛ భారత్ అమలుకు ఇప్పటికే తమ రాష్ట్రంలో పలుమార్లు మున్సిపల్ కమిషనర్లకు అవగాహన కల్పించామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు.
‘పుర’ పన్నులు వడ్డించాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఐదేళ్లకోసారి పన్నులను పెం చి వసూలు చేస్తేనే మెరుగైన సేవలు అందించగలుగుతామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. పన్నుల పెంపును వాయిదా వేయడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపాలిటీల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు దేశవ్యాప్తంగా క్రెడిట్ ర్యాంకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నామన్నారు. పన్నుల వసూళ్ల ద్వారా సమకూర్చుకున్న ఆదాయ వివరాలతోపాటు ఉద్యోగుల జీతాలకు చేసిన వ్యయం, మిగులు నిధులు, కేంద్ర, రాష్ట్రాల నుంచి అందిన నిధుల సమాచారాన్ని అన్ని మున్సిపాలిటీలు కేంద్రానికి తెలపాల్సి ఉంటుందన్నారు. ఈ సమాచారం ఆధారంగా మున్సిపాలిటీలకు రేటింగ్ ర్యాంకులతోపాటు కేంద్ర ప్రభుత్వ నిధులు కేటాయిస్తామన్నారు. సొంత ఆదాయాన్ని సమకూర్చుకోకపోతే కేంద్ర నిధులపై ఆశలు పెట్టుకోవద్దన్నారు. దేశంలో పురపాలన చెడిపోయిందని.. దీన్ని మెరుగుపరచడానికే ఈ సదస్సు తలపెట్టామని పేర్కొన్నారు.
స్వచ్ఛ భారత్ దూతలు వీరే
1. పవన్ కల్యాణ్
2. అక్కినేని అమల
3. శివలాల్ యాదవ్
4. వేమూరి రాధాకృష్ణ
5. ఎస్.పి. బాలసుబ్రమణ్యం
6. జీఎస్ రావు
7. బీవీఆర్ మోహన్ రెడ్డి
8. డాక్టర్ గోపీచంద్, స్టార్ ఆస్పత్రి
9. జేఏ చౌదరి, ఐటీ
10. నితిన్, సినీ హీరో
11. సుద్దాల అశోక్ తేజ
12. కోనేరు హంపి, చెస్ క్రీడాకారిణీ
13. పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్ కోచ్
14. వీవీఎస్ లక్ష్మణ్, మాజీ క్రికెటర్
15. కవిత, ఎంపీ
16. జయదేవ్ గల్లా, ఎంపీ
17. జె.రామేశ్వర్ రావు
18. జీవీకే రెడ్డి, జీవీకే గ్రూపు
(పవన్ కల్యాణ్, అమల, జీవీకే రెడ్డి, శివలాల్ యాదవ్ మినహా మిగిలిన వారంతా ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.)
‘స్వచ్ఛ భారత్’ నిర్బంధమే!
Published Tue, Jan 6 2015 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 7:15 PM
Advertisement
Advertisement