స్వచ్ఛభారత్ కోసం పన్నులు! | Taxes For Swachh Bharat! | Sakshi
Sakshi News home page

స్వచ్ఛభారత్ కోసం పన్నులు!

Published Thu, Oct 15 2015 1:38 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

స్వచ్ఛభారత్ కోసం పన్నులు! - Sakshi

స్వచ్ఛభారత్ కోసం పన్నులు!

సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛభారత్ మిషన్‌ను సమర్థవంతంగా అమలుచేసేందుకు అవసరమయ్యే ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు పెట్రోల్, డీజిల్, టెలికం సర్వీసుల వంటివాటిపై సెస్ వసూలు చేయాలని నీతి ఆయోగ్ పరిధిలో ఏర్పాటైన స్వచ్ఛభారత్ మిషన్ సబ్‌గ్రూప్ కేంద్రానికి సిఫార్సులు చేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను సబ్ గ్రూప్ కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమ్రంతి  చంద్రబాబు నాయుడు బుధవారం ప్రధాని నరేంద్రమోదీకి సమర్పించారు. సిఫారసులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. స్వచ్ఛ్‌భారత్ పని కష్టమైనదైనప్పటికీ అసాధ్యమేమీ కాదని మోదీ ఈ సందర్భంగా అన్నారు.

 నివేదికలోని ప్రధాన సిఫారసులు
* ప్రజల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై సానుకూల అలవాట్లను ప్రోత్సహించాలి. ఇందుకు వీలుగా  మిషన్‌లో ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్(ఐఈసీ) అనే అంశం కింద నిధులను కేటాయించాలి.
* పరిశుభ్రతపై పాఠశాలలు, కాలేజీల్లో పాఠ్యప్రణాళికలు ఉండాలి.  విద్యార్థులకు పారిశుద్ధ్యంపై అవగాహన పెంచాలి.
* ఈ మిషన్ కింద కేంద్ర, రాష్ట్రాల వాటా 75ః25 నిష్పత్తిలో ఉండాలి. ఆర్థిక వనరుల సమీకరణకు బాండ్లను జారీ చేయాలి.
* ఆర్థిక వనరుల కోసం పెట్రోల్, డీజిల్, టెలికం సర్వీసులపై, ఖనిజ వ్యర్థాలను వెలువరించే ప్రాజెక్టులపై సెస్ వేయాలి. రసాయన ఎరువులపై సబ్సిడీ తగ్గించాలి. సేంద్రియ ఎరువులపై సబ్సిడీ పెంచాలి.
* ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని(పీపీపీ) ఆకర్షించేందుకు తగిన చర్యలు చేపట్టాలి. ఇందులో భాగంగా వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి ప్లాంట్లను నెలకొల్పాలి.
* పంచాయతీలు, మండలాలు, బ్లాకుల మధ్య పోటీతత్వం పెరిగేందుకు ఆర్థిక ప్రోత్సహకాలు ఇవ్వాలి.  వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రస్తుతం ఇస్తున్న సాయాన్ని రూ. 15,000 లకు పెంచాలి.
 
బాబును కలిసిన కేజ్రీవాల్
స్వచ్ఛభారత్ మిషన్ నివేదిక సిఫార్సులకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ప్రకటించారు. ఏపీభవన్‌లో ఆయన చంద్రబాబును కలిశారు.  నవంబరు 22న ఢిల్లీలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి చంద్రబాబును ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement