సాక్షి, అమరావతి: విద్యా రంగ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఇతర రాష్ట్రాలకు నీతి ఆయోగ్ సూచించింది. విద్యారంగం పురోభివృద్ధికి 11 రకాల సూచనలు చేసిన నీతి ఆయోగ్ ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలు ఆదర్శవంతమని ప్రశంసించింది. హిమాచల్‌ప్రదేశ్, హరియాణా, రాజస్థాన్‌లో అమలవుతున్న కొన్ని కార్యక్రమాలను కూడా నీతి ఆయోగ్ తన సూచనలకు జోడించింది. సుస్థిర చర్యల ద్వారా మానవ వనరుల అభివృద్ధి (ఎస్‌ఏటీహెచ్–ఎడ్యుకేషన్) కోసం కేంద్ర ప్రభుత్వం 2017లో జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్‌ను రోల్ మోడల్‌గా ఎంపిక చేసింది. తద్వారా విద్యా వ్యవస్థలో 20 శాతం మేర మెరుగుదల కనిపించింది. అయితే ఆ రాష్ట్రాల కన్నా మెరుగైన రీతిలో ఏపీలో విప్లవాత్మక సంస్కరణలతో పాఠశాల విద్య పటిష్టతకు బాటలు వేయడాన్ని నీతి ఆయోగ్ గుర్తించింది.
ముందుగానే ఏపీలో అమలు
విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు ప్రాథమిక, పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి విద్య అందుబాటులో ఉండాలని, 96 శాతం మందికి అందాలని నీతి ఆయోగ్ పేర్కొంది. అభ్యాస ఫలితాల ఆధారిత ఫ్రేమ్‌వర్క్, విద్యా సంస్కరణలు, మానవ వనరులు, పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేయడం, జవాబుదారీతనాన్ని పెంపొందించడం ముఖ్యమని సూచించింది. మూల్యాంకన ప్రక్రియను పటిష్టం చేయడం, అభ్యసన అంతరాలను తగ్గించి పిల్లలందరినీ ‘ఏ’ గ్రేడ్ స్థాయికి తీసుకురావడం లాంటి సూచనలు చేసింది. అంగన్‌వాడీలలో ఆటపాటలు, సమీపంలోని ప్రాథమిక పాఠశాలకు అనుసంధానం, అక్షరాస్యత, సంఖ్యల పరిజ్ఞానం పెంచడంపై దృష్టి సారించాలని పేర్కొంది. అయితే అంతకు ముందు నుంచే రాష్ట్రంలో ఈ కార్యక్రమాల అమలుకు సీఎం జగన్ చర్యలు తీసుకోవడం గమనార్హం. ఇటీవల ప్రధాని ఆర్థిక సలహా మండలి విడుదల చేసిన విద్యా నివేదికలో సైతం ఏపీ అన్ని రాష్ట్లాలకన్నా ముందంజలో నిలిచిందని అభినందించిన విషయం తెలిసిందే.
పటిష్టంగా పునాది
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు తగిన విధంగా ఉండడం లేదని నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే, అసర్ నివేదికలు స్పష్టం చేసిన నేపథ్యంలో పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి విద్య పటిష్టానికి సీఎం జగన్ చర్యలు తీసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య అందించేలా పీపీ–1, పీపీ–2లను ఏర్పాటు చేయడంతోపాటు అందుబాటులో ఉన్న ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానించారు. రాష్ట్రంలో 55 వేల వరకు అంగన్‌వాడీ కేంద్రాలుండగా మన అంగన్‌వాడీ, నాడు – నేడు కార్యక్రమం ద్వారా రూ.4,442 కోట్లతో అభివృద్ధికి చర్యలు చేపట్టారు. పిల్లలకు పౌష్టికాహారంతో పాటు ఆటపాటలతో బోధించేలా ఎస్సీఈఆర్టీ ద్వారా ప్రత్యేక సిలబస్‌తో సచిత్ర పుస్తకాలను పంపిణీ చేశారు. ఫౌండేషన్, పాఠశాల విద్యను పటిష్టం చేయడంలో భాగంగా ఆరంచెల విధానానికి శ్రీకారం చుట్టారు. పూర్వ ప్రాథమిక, ప్రాథమిక, ప్రాథమిక ప్లస్, పూర్వ ఉన్నత, ఉన్నత, ఉన్నత ప్లస్ పాఠశాలలుగా తీర్చిదిద్దుతున్నారు.
చదువులకు ప్రోత్సాహం
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగనన్న అమ్మ ఒడి, మనబడి నాడు–నేడు, జగనన్న గోరుముద్ద, విద్యా కానుక, ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం, వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లు లాంటి కార్యక్రమాలను చేపట్టింది. జగనన్న అమ్మ ఒడి ద్వారా 80 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఏటా రూ.15 వేల చొప్పున నేరుగా జమ చేస్తున్నారు. మనబడి నాడు – నేడు ద్వారా రూ.16 వేల కోట్లకు పైగా నిధులు వెచ్చించి 57 వేల ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమూలంగా మారుస్తున్నారు. జగనన్న గోరుముద్ద రూ.1200కోట్లను,విద్యాకానుక కింద రూ.760 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది.
అకడమిక్ సంస్కరణలు
అకడమిక్ సంస్కరణలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగు పరిచేందుకు దేశ విదేశాలకు చెందిన నిపుణులతో చర్చించి 1 – 7 తరగతులకు పాఠ్యపుస్తకాల సిలబస్‌ను అభివృద్ధి చేసింది. ద్విభాషా పాఠ్య పుస్తకాలను మిర్రర్ ఇమేజ్‌తో పంపిణీ చేసింది. సీబీఎస్‌ఈ విధానాన్ని 2022–23 నుంచి రాష్ట్రంలో అమలు చేసేలా ఏర్పాట్లు చేసింది. విద్యా ప్రమాణాలు పెంచడం కోసం దేశంలోనే తొలిసారిగా పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. నూతన విద్యా విధానం, నీతి ఆయోగ్ సూచనలకు ముందుగానే పాఠశాల విద్యలో పలు సంస్కరణలను సీఎం జగన్ చేపట్టారు.
Niti Aayog-Andhra Pradesh: సంస్కరణలకు ఆది గురువు ఏపీ.. నీతి ఆయోగ్ ప్రశంసలు
Published Sun, Jan 9 2022 3:02 AM | Last Updated on Sun, Jan 9 2022 11:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment