సాక్షి, అమరావతి: స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. నాడు –నేడు కార్యక్రమంతో స్కూళ్లు, ఆస్పత్రుల్లో మెరుగైన పరిస్థితులు కల్పిస్తామని ఈ సందర్భంగా సీఎం అన్నారు. దాదాపు 45 వేల స్కూళ్లను ఈ కార్యక్రమం కింద బాగుచేస్తున్నామని ఆయన వెల్లడించారు. తర్వాత దశలో జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐలు, గురుకుల పాఠశాలలు, హాస్టళ్లను కూడా బాగుచేస్తామని తెలిపారు. ప్రతి పాఠశాలలో టాయిలెట్స్, కాంపౌండ్‌వాల్, ఫర్నీచర్, ఫ్యాన్లు, బ్లాక్‌బోర్డ్స్ పెయింటింగ్, ఫినిషింగ్.. ఇలా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్కూళ్లలో 9 రకాల పనులు చేపడుతున్నామని సీఎం చెప్పారు. ప్రతి స్కూళ్లో చేపట్టాల్సిన పనులపై చెక్‌లిస్ట్ ఉండాలని ఆయన సూచించారు. సమీక్షా కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, ఆళ్లనాని, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
హైస్కూల్ నుంచి జూనియర్ కాలేజీగా అప్‌గ్రేడ్..
నవంబర్ 14 నుంచి నాడు-నేడు కార్యక్రమం ప్రారంభమవుతుందని సీఎం జగన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాకమిటీలను భాగస్వామ్యం చేస్తామని అన్నారు. వచ్చే ఏడాది నుంచి స్కూళ్లలో 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఆపై వచ్చే ఏడాది 9వ తరగతిలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతామని అన్నారు. స్కూళ్లు ప్రారంభం కాగానే యూనిఫామ్స్, బూట్లు, పుస్తకాలు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. మండలంలోని మంచి హైస్కూల్‌ను జూనియర్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. అవసరమైన పాఠ్య ప్రణాళిక, విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.
జనవరిలో పోస్టుల భర్తీకి క్యాలెండర్..
నాడు-నేడు కార్యక్రమం కింద ఆస్పత్రులను బాగుచేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. సబ్‌సెంటర్లు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా, జిల్లా ఆస్పత్రులు, బోధనాస్పత్రులను బాగుచేస్తామని చెప్పారు. ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. 510 రకాలకు పైగా మందులు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. డిసెంబర్ 15 నుంచి మందులు అదుబాటులో ఉంటాయని వెల్లడించారు. నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో నాణ్యతా ప్రమాణాలు ఉండాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా ప్రమాణాలు పెరగాలని సీఎం అన్నారు. వచ్చే మే నాటికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సు పోస్టుల భర్తీ చేపడతామని స్పష్టం చేశారు. జనవరిలో పోస్టుల భర్తీకి క్యాలెండర్ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు.
Comments
Please login to add a commentAdd a comment