ఏపీ: రెండేళ్లలో విద్యారంగంపై రూ.25,714 కోట్లు ఖర్చు | YS Jagan Mohan Reddy Government Develops Education Department Over 2 Years | Sakshi
Sakshi News home page

ఏపీ: రెండేళ్లలో విద్యారంగంపై రూ.25,714 కోట్లు ఖర్చు

Published Fri, May 21 2021 7:15 PM | Last Updated on Fri, May 21 2021 8:57 PM

YS Jagan Mohan Reddy Government Develops Education Department Over 2 Years - Sakshi

సాక్షి, అమరావతి: ‘‘ఉన్నత చదువులే పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి అని, చదువులకు చేసే ఖర్చంతా రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడే” అని బలంగా విశ్వసించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల బంగారు భవిష్యత్తే లక్ష్యంగా అనేక విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తోంది. మన విద్యార్ధులు మంచి చదువులు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని, వారి కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడాలని, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు ప్రపంచంతో పోటీపడి గెలవాలనే సమున్నత లక్ష్యంతో జగనన్న అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, మనబడి నాడు-నేడులో భాగంగా పాఠశాలల ఆధునికీకరణ, జగనన్న గోరుముద్ద తదితర పథకాల ద్వారా ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు అన్ని స్థాయిల్లో ఆర్థిక చేయూతనిస్తూ ప్రోత్సహిస్తోంది. 

జగనన్న అమ్మఒడి..
దేశ చరిత్రలోనే తొలిసారిగా తల్లుల గురించి, వారి పిల్లల చదువుల గురించి ఆలోచించిన ఏకైక ప్రభుత్వం ఏపీనే. పేదరికం కారణంగా ఏ తల్లీ తన బిడ్డలను బడికి పంపలేని పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతో “జగనన్న అమ్మఒడి” పథకం ద్వారా పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా రూ.15 వేలు ఆర్థిక సహాయం... ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులందరికీ ఈ సాయం వర్తింపు...  ఈ పథకం క్రింద రెండేళ్లలో 44,48,865 మంది విద్యార్థులకు రూ.13,022.90 కోట్ల సాయం నేరుగా తల్లుల ఖాతాల్లో జమ. 9వ తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు చదువుతున్న విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుండి వారి ఆప్షన్ మేరకు నగదు లేదా ల్యాప్ టాప్ అందించనుంది ప్రభుత్వం.

జగనన్న విద్యా దీవెన 
పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశ చరిత్రలోనే తొలిసారిగా “జగనన్న విద్యాదీవెన” పథకం ద్వారా డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సులు చదివే ఎస్.సి, ఎస్. టి, బి.సి, ఈబిసి, మైనార్టీ, కాపు, దివ్యాంగులు మరియు పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్... కాలేజీల్లో జవాబుదారీతనం పెంచడం, కాలేజీల్లో పరిస్థితులు, సమస్యలు, సదుపాయాలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ పెంపొందించడం కోసం అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సకాలంలో, ఏ బకాయిలు లేకుండా నాలుగు దఫాల్లో పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికంలోనే నేరుగా ఆ పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఈ పథకం క్రింద రెండేళ్లలో 18,80,934 మందికి రూ.4,879.30 కోట్ల లబ్ది చేకూర్చింది ప్రభుత్వం.

జగనన్న వసతి దీవెన..
ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులు అభ్యసించే పేద విద్యార్థులకు భోజన, వసతి ఖర్చుల నిమిత్తం “జగనన్న వసతి దీవెన” పథకం ద్వారా ఏటా రెండు విడతల్లో 20వేల వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ, ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ.20వేల చొప్పున కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంత మందికీ వారి తల్లుల ఖాతాల్లో ఆర్థిక సాయం నేరుగా జమ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.  ఈ పథకం క్రింద రెండేళ్లలో 15,56,956 మందికి రూ.2,269.93 కోట్లు జమ చేసింది.

జగనన్న విద్యా కానుక..
ప్రభుత్వ యాజమాన్యంలోని అన్ని పాఠశాలల్లో 1 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు “జగనన్న విద్యా కానుక” పథకం ద్వారా బడులు తెరవకముందే కుట్టుకూలితో సహా 3 జతల యూనిఫారాలు, స్కూల్ బ్యాగ్, టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, బెల్ట్, సాక్స్,షూస్ తో పాటు ఇంగ్లీష్-తెలుగు డిక్షనరీ అందిస్తుంది ప్రభుత్వం. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా బడి పిల్లలకు ఇన్ని వస్తువులతో కూడిన స్టూడెంట్ కిట్లు ఇస్తున్న మొట్టమొదటి, ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే. ఈ పథకం క్రింద రెండేళ్లలో దాదాపు 45 లక్షల మంది విద్యార్థులకు రూ.781 కోట్లతో లబ్ది చేకూర్చింది.. 

మనబడి ‘నాడు-నేడు..
ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను సమూలంగా మార్చివేసి మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమం మనబడి ‘నాడు-నేడు’. ఈ కార్యక్రమం క్రింద  మూడు దశల్లో రూ.16,700 కోట్ల వ్యయంతో 45 వేల ప్రభుత్వ పాఠశాలలు, 471 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 151 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 3,287 ప్రభుత్వ హాస్టళ్లతో పాటు 28,169 అంగన్ వాడీ కేంద్రాల రూపు రేఖలు సమూలంగా మారనున్నాయి. మరో 27,438 అంగన్ వాడీలకు కొత్త భవనాలు ఏర్పాటు కానున్నాయి. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు రక్షిత త్రాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నీచర్, ప్రహారీ గోడలు, తరగతి గదులకు పెయింటింగ్, మరమ్మతులు, ఫినిషింగ్, గ్రీన్ బోర్డులు, ఫ్యాన్ లు, ట్యూబ్ లైట్లు, కిచెన్,  ఆంగ్ల భాష నైపుణ్యాలు పెంపొందించేలా ఇంగ్లీష్ ల్యాబ్ వంటి మంచి వసతులు కల్పిస్తుంది.

జగనన్న గోరుముద్ద..
రాష్ట్రవ్యాప్తంగా 45,854 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 36,88,618 మంది విద్యార్థులకు రూ.1,600 కోట్ల వ్యయంతో “జగనన్న గోరుముద్ద” పథకం ద్వారా నాణ్యమైన పౌష్టికాహారం, ప్రతి రోజూ మెనూ మార్చి రుచికరమైన మధ్యాహ్న భోజనం అందిస్తుంది. 

విద్యారంగంలో చేపట్టిన మరిన్ని విప్లవాత్మక కార్యక్రమాలు : 
పేద విద్యార్థులు కూడా ఉన్నత వర్గాల పిల్లలతో సమానంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు పాఠశాలల్లో ప్రాథమికస్థాయి నుండి ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధనను ప్రవేశపెట్టింది. 

విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు 2021-22 విద్యా సంవత్సరం నుండి సీబీఎస్ఈ సిలబస్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

2021-22 విద్యా సంవత్సరం నుండి అన్ని డిగ్రీ కోర్సులలో ఇకపై ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన ప్రారంభించనుంది. 

అంగన్ వాడీలను “వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లు”గా అప్ గ్రేడ్ చేసి  పీపీ1, పీపీ2, ప్రీ ఫస్ట్ క్లాసుల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన .... ఆట పాటలతో బోధన ద్వారా పిల్లల శారీరక, మానసిక వికాసానికి గట్టి పునాదులు వేస్తోంది ప్రభుత్వం.

జూన్ 2019 నుండి ఇప్పటివరకు రెండేళ్లలో విద్యా రంగంపై మొత్తం రూ.25,714 కోట్లు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం నాడు-నేడు పథకం క్రింద ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మారబోతున్న అంగన్ వాడీలలో పిల్లలు, తల్లుల పోషకాహారం కోసం మరో రూ.1,800 కోట్లు ఖర్చు చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement