ప్రపంచంతో పోటీ | CM YS Jagan review on Foundation schools and Manabadi Nadu Nedu | Sakshi
Sakshi News home page

ప్రపంచంతో పోటీ

Published Wed, Sep 8 2021 2:24 AM | Last Updated on Wed, Sep 8 2021 3:05 PM

CM YS Jagan review on Foundation schools and Manabadi Nadu Nedu - Sakshi

కోవిడ్‌ తగ్గుతున్నందున వచ్చే ఏడాది పిల్లలు స్కూళ్లకు వెళ్లే నాటికే విద్యా కానుక అందించాలి. ఇందుకోసం ఇప్పుడే టెండర్లు పిలిచేలా చర్యలు తీసుకోవాలి. ఈ కిట్‌లో వస్తువులు మరింత నాణ్యతగా ఉండేలా దృష్టి సారించాలి. వచ్చే ఏడాది నుంచి విద్యా కానుకలో భాగంగా మూడు జతల దుస్తులకు అదనంగా స్పోర్ట్స్‌ డ్రస్,  స్పోర్ట్స్‌ షూ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. ఇవి మంచి డిజైన్‌తో ఉండేలా చూడాలి.
           – ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ప్రపంచ స్థాయిలో పోటీకి తగినట్టుగా విద్యార్థులను తయారు చేసేందుకు ఉద్దేశించిన నూతన విద్యా విధానం అమలుపై అన్ని రకాలుగా సిద్ధం కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. ఈ విధానం సమర్థవంతంగా అమలు జరిగినప్పుడే మన పిల్లలు ప్రపంచ స్థాయిలో రాణిస్తారని, వారిని ఆ దిశగా సన్నద్ధం చేసేందుకు అడుగులు ముందుకు వేయాలన్నారు. చాలా స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించామని, ఈ దశలో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యా శాఖలో నాడు–నేడుతో పాటు ఫౌండేషన్‌ స్కూళ్లపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్య పుస్తకాల ముద్రణలో నాణ్యత మరింతగా పెంచాలని సూచించారు. ఇప్పటి నుంచే టెండర్ల ప్రక్రియ ప్రారంభించడంపై దృష్టి సారించాలని చెప్పారు. మూడో తరగతి నుంచి సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరిస్తూ.. తొలుత వెయ్యి స్కూళ్లను అఫిలియేషన్‌ చేస్తున్నామని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ..  అన్ని రకాల స్కూళ్లకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

విద్యాశాఖలో నాడు–నేడు, ఫౌండేషన్‌ స్కూళ్లపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

12,663 స్కూళ్లలో రెండో విడత నాడు–నేడు 
► రూ.4,535.74 కోట్ల వ్యయంతో రెండో విడతలో 12,663 స్కూళ్లలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి, రూపురేఖలు మార్చాలి. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి. (రెండో విడతలో 18,498 అదనపు తరగతి గదులు నిర్మించనున్నారు. మూడో విడత రూ.7,821 కోట్ల వ్యయంతో 24,900 స్కూళ్లలో నాడు–నేడు చేపట్టనున్నారు.) 
► నాడు –నేడు కార్యక్రమం ద్వారా ఇంత డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత కచ్చితంగా స్కూళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. లేకపోతే మళ్లీ పూర్వపు స్థితికి వెళ్లిపోతాయి. స్కూళ్లలో టాయిలెట్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
► ప్రతి స్కూల్లో మరమ్మతుల కోసం, సమస్యల పరిష్కారం కోసం కంటింజెన్సీ ఫండ్‌ ఏర్పాటు చేయాలి.  
దీనిపై ఎస్‌ఓపీ (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌) తయారు చేయాలి. అప్పుడే స్కూళ్లు నిత్యనూతనంగా ఉంటాయి.


నాడు–నేడు పనులపై శిక్షణ
► ఈ ఏడాది విద్యా కానుక నూటికి నూరు శాతం పంపిణీ పూర్తయిందని అధికారులు సీఎంకు వివరించారు.   
నాడు–నేడు పనులకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాల్లోని సుమారు 12 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం పేరెంట్స్‌ కమిటీలకు కూడా శిక్షణ ఇస్తామన్నారు.
► స్వేచ్ఛ కార్యక్రమం కింద స్కూల్లో ఆడపిల్లలకు శానిటరీ నాప్‌కిన్స్‌ పంపిణీ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్‌లో ఈ కార్యక్రమం ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. 
► ఈ సమీక్షలో పాఠశాల విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు, సర్వ శిక్షా అభయాన్‌ స్టేట్‌ ప్రోజెక్ట్‌ డైరెక్టర్‌ వెట్రి సెల్వి, పాఠశాల విద్యా శాఖ సలహాదారు ఎ.మురళి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ (ఎస్‌సీఈఆర్‌టీ) బి.ప్రతాప్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement