New education policy
-
నూతన విద్యా విప్లవం వర్ధిల్లాలంటే...
గత ఐదేండ్లలో దేశంలో ఎక్కడా లేని విద్యా విధానం ఆంధ్రప్రదేశ్‌లో అమలైంది. కానీ తమ పిల్లల్ని ఖరీదైన ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో చదివించిన వారు... పేదలు తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ స్కూళ్లలో కావాలని కోరుకుంటే వ్యతిరేకించారు. ఇది విచిత్ర చారిత్రక సన్నివేశం. దేశంలో ప్రయివేట్ విద్య ఎంత ఖర్చుతో కూడుకున్నదో, ఏ భాషలో సాగుతున్నదో తెలియదా? ప్రజా మేధావులకు తెలివి కన్నా, బీద ప్రజల పక్షాన నిలబడే హృదయం ఉండాలి కదా! దేశ చరిత్రలో మొదటిసారి విద్యా సమానత్వ ప్రయోగాన్ని జగన్ ప్రభుత్వం చేస్తోంది. ఆ ప్రక్రియను వ్యతిరేకించే మూడు పార్టీల కూటమిని సమర్థించే మేధావులను ప్రజలు వ్యతిరేకించాల్సింది... తమ పిల్లల భవిష్యత్తు కోసం! 2024 ఆంధ్ర ఎన్నికలు గత రెండు ఎన్నికల కంటే పూర్తిగా భిన్నమైనవి. 2014లో ఒకవైపు మూడు పార్టీల కూటమికీ, వైసీపీకీ రాష్ట్ర విభజన నేపథ్యంలో జరిగాయి. అప్పుడు కేంద్రంలో రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆనాడు కొత్త రాష్ట్ర రాజధాని, ప్రత్యేక ప్యాకేజీ ప్రధాన అంశాలు. 2019 ఎన్నికల్లో అన్ని పార్టీలు విడివిడిగా కొట్లా డాయి. వైసీపీ తన కొత్త విద్యా విధానం, గ్రామాల అభివృద్ధి అంశాలతో 151 సీట్లు గెలిచింది. విడిగా పోరాడిన మూడు పార్టీలు మట్టికరిచాయి. చంద్రబాబుకు 23 సీట్లు, పవన్ కల్యాణ్‌కి 1 సీటు వచ్చాయి. గత ఐదేండ్లలో ఆ పార్టీలు ఊహించని విధంగా దేశంలో ఎక్కడా లేని విద్యా విధానం ఆంధ్రప్రదేశ్‌లో అమలైంది. దీన్ని ఏపీ నాయ కులు చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, జయప్రకాశ్ నారాయణ తీవ్రంగా వ్యతిరేకించారు. వీరేకాక దేశ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఎం.వి. రమణ కూడా వ్యతిరేకించారు. సమస్య కోర్టుకు పోయింది. అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా వ్యతిరేకించింది. సుప్రీంకోర్టు జడ్జిగా రమణకు ఇంగ్లిష్ భాష పాత్ర ఎంతో తెలుసు. అయినా వ్యతిరేకించారు. వీరుకాక మీడియా రంగంలో ఈనాడు గ్రూపు, ఆంధ్రజ్యోతి గ్రూపు, టీవీ 5 నెట్వర్క్ అధిపతులు తమ పిల్లల్ని మంచి, మంచి ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో చదివించి... రైతులు, కూలీలు, దళితులు, బీసీలు, ఆదివాసులు తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ స్కూళ్లలో కావాలని కోరుకుంటే వ్యతిరేకించారు. ఇది విచిత్ర చారిత్రక సన్నివేశం. ఈ ఎన్నికల్లో మళ్ళీ 2014 నాటి ప్రతిపక్ష గుంపు జత కట్టింది. జగన్‌ను ఓడించాలని వీళ్ళు రాత్రింబవళ్లు పనిచేసేది ఎందుకోసం? ముఖ్యంగా గ్రామీణ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువు ఆపెయ్యడం కోసం. ఈ క్రమంలో జయప్రకాశ్ నారాయణ గురించి కొంత చర్చించాలి. ఈయన మాజీ ఐఏఎస్ అధికారి. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కొంతకాలం ఆయన పర్సనల్ సెక్రటరీగా పని చేశారు. ఆ దశలో తెలంగాణలో నక్సలైట్లకూ, తెలుగుదేశం పార్టీకీ తీవ్ర సంఘర్షణ జరుగుతున్నది. ఎన్టీఆర్ సన్నిహిత సోషలిస్టు నాయకుడొకరు కేజీ కన్నాభిరన్ (అప్పటి పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు)కు కబురుపెట్టి, ముఖ్యమంత్రితో హక్కుల నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగుకు నేను, కన్నాభిరన్, బాలగోపాల్, ఎం.టి. ఖాన్ వెళ్లాం. మేం వెయిటింగ్ రూంలో ఉండగా జయప్రకాశ్ నారాయణ ఆ మీటింగ్‌ను జరగ కుండా చూడాలని చాలా ప్రయత్నం చేశాడు. కానీ ఎన్టీఆర్ వినలేదు. మీటింగ్ జరిగింది. నక్సలైట్లను అణచివెయ్యాలి గానీ వారితో చర్చలేమిటని జేపీ ఆలోచన. ఆ విభాగాన్ని చూసే పోలీస్ ఆఫీసర్ అరవిందరావుది కూడా అదే ఆలోచన. మా పౌరహక్కుల టీమ్ ఇరుపక్షాల హత్యలు, కిడ్నాప్‌లు, ఎన్కౌంటర్లు ఆపించాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న రోజులవి. అప్పుడు ఎన్కౌంటర్లు, టీడీపీ కార్యకర్తల కిడ్నాపులు చాలా జరిగాయి. ఆ తరువాత జయప్రకాశ్ నారాయణ ఈనాడు పేపర్, ఈటీవీ ద్వారా మేధావి అవతారమెత్తాడు. అక్కడి నుండి ఒక ఎన్జీవో పెట్టి, ‘లోక్‌సత్తా’ (అంటే ఇంగ్లిష్‌లో గ్లోబల్ పవర్) అనే రాజకీయ పార్టీ రూపందాల్చి, దానికి అలుపెరుగని, ఎన్నడూ దిగిపోని ఏకో ముఖ (అంటే ఆ పార్టీలో మరో ముఖమే కనపడదు) అధ్యక్షుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ గ్లోబల్ పవర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఉన్న మూడు పార్టీల కూటమి చాలనట్లు నాలుగో పార్టీగా అందులో చేరాడు. ఇప్పుడు జేపీ లక్ష్యమంతా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం చదువు ఆపి, మళ్లీ తెలుగు మీడియం పెట్టేంత వరకూ పోరాటం చెయ్యడం! ఆయన మరో లక్ష్యం గ్రామాలలో స్కూళ్ల నిర్మాణం, సెక్రటే రియట్ నిర్మాణాలను ఆపి అభివృద్ధికి మార్గంగా అమరావతిని సింగ పూర్లా చూపడం! అభివృద్ధిపై ప్రపంచ యూనివర్సిటీలు చదివే గొప్ప పుస్తకం ఆయన రాసినట్లు, డెవలప్మెంటల్ ఎకనామిక్స్‌లో తాను అథారిటీ అయినట్లు నిరంతర యూట్యూబ్ ఉపన్యాసాలు ఇస్తున్నారు. గ్లోబల్ పవర్ ఈనాడు నుండి ఇప్పుడు యూట్యూబ్‌కు మారింది. విద్యా వ్యవస్థ మీద కూడా జాన్‌డ్యూయి (కొలంబియా యూనివర్సిటీలో అంబేడ్కర్ గురువు) కంటే తానే మంచి ఎక్స్‌ఫర్ట్ అన్న రీతిలో ఉపన్యాసాలు ఇస్తారు. జేపీ ప్రపంచ మార్పు మీద ఇంగ్లిష్‌లోనో, తెలుగులోనో రాసిన మంచి పుస్తకం మార్కెట్లో ఉంటే చదవాలని ఉంది. కానీ ఇంతవరకు ఒక్కటీ కనిపించలేదు. 30,000 ఎకరాల భూమిని చంద్రబాబు నాయుడు తీసు కున్నప్పుడు వెంకయ్యనాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి. ఆయన సలహా, సహకారం లేకుండా చంద్రబాబు ఆ పని చెయ్యడు. ఇప్పుడు గ్రామీణ బడుల నిర్మాణం, ఇంగ్లిష్ మీడియం చదువు, అమ్మ ఒడి పథకం ఆపి, అమరావతి పట్టణం వచ్చే ఐదేండ్లలో కడితే ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధితో పాటు దేశానికే ఒక మోడల్ సిటీ వస్తుందని బహుశా జేపీగారి నమ్మకం. కానీ ఒక ఎనిమిదో తరగతి విద్యార్థి మా తల్లిదండ్రులు జగన్‌కు ఓటేసి గెలిపించకపోతే, ఇంగ్లిష్ మీడియం ఆగి పోతే, నాకొచ్చే బట్టలు, బూట్లు ఆగిపోతే నేను ఉన్న బట్టలు సర్దుకుని ఇంట్లోనుండి పారిపోతాను అన్నాడు. ఆ పిల్లోడి ఆశను ఏం చెయ్యా లని ఈ నాయకులు అనుకుంటున్నారు? ప్రజా మేధావికి తెలివి కన్నా, వాగ్దాటి కన్నా బీద ప్రజల పక్షాన నిలబడే హృదయం ఉండాలి కదా! దేశంలో ప్రయివేట్ విద్య ఎంత ఖర్చుతో కూడుకున్నదో, ఏ భాషలో సాగుతుందో వీరందరికీ తెలువదా? 2024–25 ఎకనమిక్ సంవత్సరానికి ధీరూబాయి అంబానీ కొడుకు, కోడలు నడిపే స్కూలు ఫీజు చూడండి: సంవత్సరానికి ఎల్కేజీ విద్యార్థి ఫీజు: 1,70,000. 8–10వ తరగతి పిల్లల ఫీజు: 5,90,000. 11–12వ తరగతి పిల్లల పీజు: 9,65,000. ఇటువంటి స్కూళ్లు దేశంలో చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏ మాతృభాషలో నడుస్తు న్నాయి? ఇంతింత ఫీజులలో ఇంగ్లిష్ మీడియంలో, విదేశీ సిలబస్‌తో చదివే పిల్లల్ని జగన్ మోడల్ విద్యా విధానం ద్వారా కాక ఎలా ఎదు ర్కొంటారు? ఏపీలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అన్నది కాదు సమస్య. ఈ ఎన్నికల పోరాటంలో అక్కడ ప్రభుత్వ రంగంలో ప్రారంభమైన ఇంగ్లిష్ క్వాలిటీ విద్యా ఎక్స్పెరిమెంట్ ఏమైతది అనేది కీలకమైన సమస్య. నేనొక సొంత పార్టీ పెట్టుకొని జగన్‌తో పొత్తు పెట్టుకొని ఈ వ్యాసం రాయడం లేదు. జగన్ ఇచ్చిన ఎమ్మెల్యే పదవో, రాజ్యసభ ఎంపీ పదవో తీసుకుని రాయడం లేదు. ఈ దేశ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తు మీద భయంతో రాస్తున్నాను. ఒక పబ్లిక్ ఇంట లెక్చువల్‌కు దోపిడీకి, అణచివేతకు గురౌతున్న ప్రజల జీవనం మారడం ముఖ్యం. రాజకీయ నాయకులకు రాజకీయాలలో తమ ఉనికి ముఖ్యం. తమ ఉనికి కోసమైనా రాజకీయ నాయకులు ప్రజల మార్పు కోసం, సమానత్వం సాధించడం కోసం చర్యలు చేపట్టి నప్పుడు వాటిని సమర్థించడం ప్రజా మేధావి ప్రధాన కర్తవ్యం. ఈ క్రమంలోని దేశ చరిత్రలో మొదటిసారి విద్యా సమానత్వ ఎక్స్పెరిమెంట్ జగన్ ప్రభుత్వం చేస్తున్నందున నేనీ విద్యా విధానాన్ని సమర్థిస్తున్నాను. ఆ ప్రక్రియను వ్యతిరేకించే మూడు పార్టీల కూటమిని సమర్థించే మేధావులను ప్రజలు వ్యతిరేకించాల్సింది... తమ పిల్లల భవిష్యత్తు కోసం! ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
10, 12 బోర్డు పరీక్షలు ఇకపై ఏడాదిలో రెండుసార్లు
న్యూఢిల్లీ: పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాదిలో రెండుసార్లు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. రెండు పరీక్షలు రాయాలా, లేదా ఒక్క పరీక్షకే హాజరు కావాలా అన్నది విద్యార్థుల ఇష్టమని స్పష్టం చేసింది. ఈ ఆప్షన్ ఐచ్ఛికమే తప్ప, నిర్బంధం కాదని వివరించింది. విద్యార్థుల్లో పరీక్షంటే భయం దూరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం పీటీఐకి ఇంటర్వ్యూలో పలు అంశాలను వివరించారు. నూతన కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్సీఎఫ్) సాధాసాధ్యాలపై మంత్రి ప్రధాన్ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈకి మాదిరిగానే విద్యార్థులకు రెండుసార్లు పరీక్ష రాసేందుకు వీలు దొరుకుతుంది. బెస్ట్ స్కోర్ సాధించొచ్చు. ఈ ఆప్షన్ పూర్తిగా విద్యార్థుల ఇష్టానికే వదిలేశాం. ఇందులో ఎటువంటి నిర్బంధం లేదు. ఏడాదిలో ఒకేసారి పరీక్ష ఉండటం, ఈ చాన్స్ మిస్సయితే ఒక సంవత్సరం కోల్పోతామనే భయం, ఒత్తిడి ఎక్కువమంది విద్యార్థుల్లో ఉంటున్నాయి. దీంతో, వారు పరీక్షలు సరిగా రాయలేకపోతున్నారు. రెండుసార్లు పరీక్షలు రాసే అవకాశమిస్తే ఇలాంటి భయాలు వారిలో ఉండవు. పూర్తిస్థాయిలో ప్రిపేరయి పరీక్ష రాస్తే సంతృప్తికరమైన స్కోర్ సాధించగలుగుతారు. ఒకసారి మంచి స్కోర్ తెచ్చుకున్న విద్యార్థి మరో విడత పరీక్ష రాయాలా వద్దా అనేది ఐచ్చికం. ఇందులో ఎటువంటి నిర్బంధం లేదు’అని వివరించారు. 2024 నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నామని తెలిపారు. డమ్మీ స్కూల్స్ పనిపడతాం రాజస్తాన్‌లోని కోటాలో పరీక్షలకు శిక్షణ నిమిత్తం వచ్చిన విద్యార్థులు ఈ ఏడాదిలో రికార్డు స్థాయిలో బలవన్మరణాలకు పాల్పడటంపై మంత్రి ప్రధాన్ స్పందిస్తూ.. ‘ఇది చాలా సున్నితమైన అంశం. విస్మరించరానిది’అన్నారు. అదేవిధంగా, తమ సొంత రాష్ట్రంలోని స్కూల్లో అడ్మిట్ అయిన విద్యార్థులు అక్కడ చదవకుండా, పరీక్షల శిక్షణ కోసం కోటా వంటి చోట్లకు వెళ్తుండటంపై మంత్రి.. ఇటువంటి డమ్మీ స్కూళ్లపై చర్యలకు ఉపక్రమించాల్సిన సమయం వచ్చిందన్నారు. పాఠశాలకు హాజరు కాకపోవడం విద్యార్థుల వ్యక్తిగత ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుందని, వారు ఒంటరితనంతో బాధపడుతూ, ఒత్తిడులకు గురవుతున్నట్లు నిపుణులు చెబుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విద్యా సంబంధ విధాన నిర్ణయాలపై ప్రభుత్వానికి సలహాలిచ్చే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్(సీఏబీఈ)ని ఆధునీకరిస్తామని మంత్రి ప్రధాన చెప్పారు. -
ఇకపై ఏడాదికి రెండు సార్లు బోర్డు ఎక్సామ్స్..
ఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా బోర్డ్ ఎక్సామ్స్‌తో సహా పలు కీలక మార్పులు చేయనున్నారు. అందుకు అనుగుణంగా 2024 ఏడాదికి పాఠ్య పుస్తకాలను సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు కేంద్రం నూతన విధివిధానాలకు సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌ను విడుదల చేసింది. పరీక్షల్లో మంచి మార్కులు సాధించుకునేలా ప్రతి ఏడాది రెండు సార్లు బోర్డు పరీక్షలను పెట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకారం విద్యార్థులు బాగా చదివిని సబ్జెక్టులనే ఎక్సామ్స్ రాసుకునే వెసులుబాటు కల్పించారు. మంచి మార్కులు వచ్చిన పరీక్షనే ఫైనల్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు ఒత్తిడి లేకుండా ఆయా సబ్జెక్టుల్లో నైపుణ్యం తెచ్చుకునేలా ఈ విధానం ఉపయోగపడనుంది. ఇంటర్ స్థాయిలో విద్యార్థులకు రెండు భాషలను అభ్యసించేలా కొత్త విధానాలను సిద్ధం చేశారు. ఇందులో ఒకటి తప్పకుండా భారతీయ భాష అయి ఉండాలని నిబంధనలు విధించారు. పాఠ్యపుస్తకాల ధరను తగ్గించాలని నొక్కి చెబుతూనే, తరగతి గదిలో పుస్తకాలను 'కవరింగ్' చేసే ప్రస్తుత పద్ధతిని నివారించవచ్చని కొత్త ఫ్రేమ్‌వర్క్ గుర్తించింది. ఇదీ చదవండి: చంద్రయాన్-3 హీరోలు.. ఆ వెనుక ఉన్న మేధస్సు వీళ్లదే.. -
దేశంలో బాల్యవిద్య బలహీనమే!
సాక్షి, అమరావతి: ఆరేళ్ల లోపు పిల్లల్లో మెదడు ఎదుగుదల అధికంగా ఉంటుంది. ఆ వయసులో మానసిక వికాసానికి సాన పెట్టాలి. అయితే దేశంలో ఇప్పటికీ 3.7 కోట్ల మందికి పైగా బాలలు పూర్వ బాల్య విద్యకు దూరమైనట్లు ‘సేవ్ ద చిల్డ్రన్’ సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదం సత్ఫలితాలనివ్వాలంటే పూర్వ బాల్యవిద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరముందని పేర్కొంది. విద్యాహక్కు చట్టం–2009, నేషనల్ ఈసీసీఈ పాలసీ–2013, జాతీయ నూతన విద్యావిధానం–2020లో పూర్వ బాల్య విద్య ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలంటే పూర్వ బాల్య విద్యకు తగినన్ని నిధులు కేటాయించాలి. 3– 6 ఏళ్ల వయసు వారి విద్యాభ్యాసాన్ని పాఠశాల విధానంలో చేర్చేలా ప్రీ ప్రైమరీ విధానాన్ని ప్రవేశపెట్టాలని నూతన విద్యావిధానం సిఫార్సు చేసింది. 2011 జనాభా లెక్కల నివేదిక పూర్వ బాల్య విద్యకు అర్హులైన బాలలు దేశంలో 10 కోట్ల మంది ఉన్నారు. ప్రస్తుతం పూర్వ బాల్య విద్య, ప్రాథమిక విద్యకు దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 0.1 శాతం నిధులు మాత్రమే కేటాయిస్తుండగా కనిష్టంగా 1.6 నుంచి 2.2 శాతం వరకు పెంచాలి. అమెరికా, యూకే, ఈక్వెడార్ లాంటి దేశాల్లో 1.17 శాతం వరకు నిధులు కేటాయిస్తున్నారు. రాష్ట్రంలో బాల్య విద్య భేష్ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక విద్యారంగ సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్వ బాల్య విద్య, ప్రాథమిక విద్యకు ప్రాధాన్యమిచ్చారు. జాతీయ నూతన విద్యావిధానం కంటే ముందే రాష్ట్రంలో పూర్వ ప్రాథమిక విద్యకు రూపకల్పన చేశారు. అంగన్వాడీలను స్కూళ్లతో అనుసంధానించి పీపీ–1, పీపీ–2 తరగతులతో ఫౌండేషన్ స్కూళ్లకు శ్రీకారం చుట్టారు. పూర్తిగా బాలల కోసమే ప్రత్యేక బడ్జెట్ పెట్టి ఏటా రూ.16 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. 2021–22లో సీఎం జగన్ ప్రభుత్వం రూ.16,748.47 కోట్లతో తొలిసారిగా బాలల బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2022 – 23లో ఇందుకోసం రూ.16,903 కోట్లు కేటాయించారు. -
సంస్థాగత అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తేనే నిధులు
సాక్షి, అమరావతి: సంస్థాగత అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి.. తదనుగుణంగా కార్యక్రమాలు అమలు చేసే సంస్థలకు మాత్రమే ఇకపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిధులు అందించనుంది. నూతన విద్యా విధానం–2020 ప్రకారం.. యూజీసీ ఈ మేరకు అన్ని ఉన్నత విద్యా సంస్థలకు నూతన ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ప్లాన్ (ఐడీపీ) ప్రణాళికలు రూపొందించడంలో అనుసరించాల్సిన అంశాలను ముసాయిదాలో వివరించింది. అధ్యాపకులుగా నిపుణుల నియామకం, వారి కోసం ఫాస్ట్ ట్రాకింగ్ ప్రమోషన్ సిస్టమ్, క్యాంపస్‌ల ఆడిట్లు, సమర్థవంతమైన బోధన, అభ్యాసం కోసం భౌతిక, మౌలిక సదుపాయాలను పెంచడం వంటి అంశాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. యూజీసీ ఆధ్వర్యంలోని ఇంటర్ యూనివర్సిటీ యాక్సిలరేటర్ సెంటర్ డైరెక్టర్ అవినాష్ చంద్ర పాండే అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ ఈ మార్గదర్శకాలను రూపొందించింది. యూజీసీ, అఖిల భారత సాంకేతిక విద్యా సంస్థ (ఏఐసీటీఈ), హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్లు కూడా ఐడీపీలను అనుసరించే నిధులు విడుదల చేయనున్నాయి. ఆయా ఉన్నత విద్యా సంస్థలు తయారుచేసిన ఐడీపీలు, వాటి అమలులో సాధించిన పురోగతి, పారదర్శక ప్రమాణాల ఆధారంగా ఉన్నత విద్యకు నిధులు వస్తాయని యూజీసీ పేర్కొంది. ప్రస్తుతానికి.. యూజీసీ ఉన్నత విద్యా సంస్థలకు నిధులు సమకూరుస్తుండగా ఇకపై హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్ నిధులను అందించనుంది. అధ్యాపకుల్లో 50 శాతం పరిశ్రమల నిపుణులు.. ప్రొఫెషనల్ కాలేజీల్లో వివిధ విభాగాల్లో థియరీ, ప్రాక్టికల్ మధ్య సమతుల్యతను కొనసాగించడానికి మొత్తం అధ్యాపకుల్లో 50 శాతం మంది వృత్తి నిపుణులు లేదా పారిశ్రామిక నిపుణులుండాలని యూజీసీ పేర్కొంది. సంస్థాగతంగా పరిశోధన, బోధన కార్యక్రమాలు అత్యున్నతంగా కొనసాగేందుకు బోధన సిబ్బందికి తగిన ప్రోత్సాహకాలు ఎప్పటికప్పుడు అందించాలని సూచించింది. ఫ్యాకల్టీ కోసం ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. సిబ్బంది పదవీకాలం, పదోన్నతి ఇంక్రిమెంట్ల కోసం అధ్యాపకుల పనితీరును సరిగ్గా అంచనా వేయడానికి ఉన్నత విద్యా సంస్థలు ‘పీర్ స్టూడెంట్ రివ్యూలు’తో సహా బహుళ ప్రమాణాల వ్యవస్థని రూపొందించాలని సూచించింది. అంతేకాకుండా ప్రతి ఉన్నత విద్యా సంస్థ యూజీసీ నిర్దేశించిన ఫ్యాకల్టీ, విద్యార్థి నిష్పత్తిని తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. ప్రతి సంస్థ విద్య, మౌలిక వసతులను మెరుగుపరచడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని వెల్లడించింది. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు విద్యార్థుల అభీష్టానికనుగుణంగా ఆన్లైన్ లెర్నింగ్, బ్లెండెడ్ లెర్నింగ్ కోసం మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. సామర్థ్యం గల విద్యార్థులను గుర్తించి క్రీడలు, కళల్లో ప్రోత్సహించాలని సూచించింది. ప్రమాణాలు లేని కళాశాలలను అనుమతించరాదు.. వివిధ రాష్ట్రాల ఉన్నత విద్యా సంస్థల్లో విద్యా, మౌలిక వసతులకు సంబంధించి డేటా సరిగా లేదని యూజీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతి రాష్ట్రం.. తక్కువ పనితీరు చూపుతున్న వర్సిటీలు, గుర్తింపు, ప్రమాణాలు లేని కళాశాలలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఇలాంటి సంస్థల సంఖ్యకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు సమాచారాన్ని క్రోడీకరించాలని సూచించింది. ఆయా విద్యా సంస్థలు.. అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, విద్యాపరమైన సౌకర్యాలను సమర్థవంతంగా వినియోగించాలని తెలిపింది. అన్ని ఉన్నత విద్యా సంస్థలు తప్పనిసరిగా తమ క్యాంపస్‌లలో భూ సంబంధిత ఆడిట్‌ను చేపట్టాలని సూచించింది. -
భారతావనికి బాలలే భారమా?
పీడిత సమాజంలో పీడనకు ఒక వర్గం బాలలు బలవుతున్నారు. అందుకే బాలలు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని స్థితిలో భారత సమాజం ఉందంటే అతిశయోక్తి కాదు. సమాజంలో మూడు వంతులుగా ఉన్న బాలల స్థితిగతులను పరిశీలించాల్సిందే. ఈ ప్రాధాన్యత దృష్ట్యా బాలల కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయి చట్టాలు రూపొం దాయి. ప్రత్యేక హక్కులు బాలలకు దఖలు పడ్డాయి. ఇవి భారతదేశంలో 1992 నుండి అమలులోనికి వచ్చాయి. వివక్ష లేకుండా అభిప్రాయాలకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం, భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచడం, జీవించే హక్కును కలిగి ఉండటం బాలల హక్కుల మూల సూత్రాలు. పేదరికం కారణంగా చదువుకి దూరమై కష్టతరమైన పనులు చేస్తూ గడపాల్సిన దుఃస్థితిలో బాలలు ఇప్పటికీ ఉన్నారు. కనీసం ఉపాధి అవకాశాలను అంది పుచ్చుకునే చదువు వరకు కూడా వెళ్లలేకపోతున్నారు. 5 నుండి 14 ఏళ్ల వయసు ఉన్న బాల బాలికలలో ప్రతి 8 మందిలో ఒకరు తమ కోసమో, తమ కుటుంబం కోసమో పాలబుగ్గల ప్రాయంలోనే పనివారుగా మారుతున్నారు. 29 శాతం ప్రాథమిక విద్యకు ముందే బడి మానేస్తున్నారు. వీరిలో అట్టడుగు వర్గాల పిల్లలే ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) వల్ల 5వ తరగతి కూడా పూర్తి చేయకుండానే బాలలు డ్రాపవుట్లుగా మారే ప్రమాదముంది. జాతీయ నూతన విద్యావిధానం పూర్తి స్థాయిలో అమలైతే బాలలు యాచకులుగా, బాల కార్మికులుగా, వలస బాధితులుగా, నేరగాళ్లుగా తయారయ్యే అవకాశం ఉంది. బీజేపీ అధికారంలోనికి రాగానే బాలకార్మికుల పనికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో చట్టం చేసింది. ఏ దేశంలో కూడా ఇలాంటి సాహసం చేసిన దాఖలాలు లేవు. బాలలే ఈ సమాజానికి పెట్టుబడి అని ఒకవైపు అంటూనే ఇటువంటి చట్టాలు చేయడం ఎంతవరకు సమంజసం? ఇందువల్ల పిల్లలు కూలీలుగా మారే ప్రమాదం పొంచి ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)... భారత్‌లో ప్రతి 100 మందికి 79 మంది బాలలు రక్త హీనతతో, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని తెలిపింది. శారీరక ఎదుగుదల లేని బాలలు 64 శాతం మందీ, తగినంత బరువులేని బాలలు 43 శాతం మందీ ఉన్నారనీ, ప్రతి ఏటా అంధత్వంతో కోటి మంది ఇబ్బందులు పడుతున్నారనీ డబ్ల్యూహెచ్ఓ తేటతెల్లం చేసింది. శిశు సంరక్షణకూ, బాలల ఆరో గ్యానికి తగిన బడ్జెట్ కేటాయించక పోవడం కార ణంగా మన దేశంలో బాలల పరిస్థితి ఇంతగా దిగజారింది. మనసుంటే ప్రస్తుతం ఉన్న వనరులూ, చట్టాల తోనే బాలల స్థితిగతులను మెరుగుపరచవచ్చని కేరళ రాష్ట్రం నిరూపించింది. బాలలకు పౌష్టికాహారం అందించడంలో కేరళ మొదటి స్థానంలో ఉంది. విద్యా రంగంలో మోడల్‌గా ఉంది. వరల్డ్ విజన్ ఇండియా, ఐఎఫ్ఆర్ లీడ్లు సంయుక్తంగా 24 సూచికలతో చేసిన సర్వేలో కేరళ చిన్నారుల సంక్షేమంలో టాప్‌లో ఉందని వెల్లడైంది. బీజేపీ పాలిత ప్రాంతమైన జార్ఖండ్ ఆఖరి స్థానంలో ఉంది. ఇప్పుడు ఆ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎన్ఈపీ అమలైతే రేపటి పౌరుల పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. బాలల్లో అన్నార్తులు, అనాథలు, యాచకులు, నేరగాళ్లు, సంఘ విద్రోహశక్తులు ఉండకూడదంటే వినాశకర సంస్కరణలు ఆపాలి, ఆగాలి. బాలలకు రాజ్యాంగం ఇచ్చే హక్కులను చిత్తశుద్ధితో అమలు చేయాలి. ప్రతి శిశువుకు మంచి భవితను కోరుకునే హక్కు ఉంది. ఆ హక్కుల రక్షణకు పోరాడే వేదికలకు మద్దతునివ్వాలి. కె.విజయ గౌరి, వ్యాసకర్త యు.టి.ఎఫ్. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొబైల్: 89853 83255 -
New Education Policy: డిగ్రీ ఇక నాలుగేళ్లు
సాక్షి, మచిలీపట్నం: కృష్ణా యూనివర్సిటీ అనుబంధ కాలేజీల్లో డిగ్రీ కోర్సు ఇకపై నాలుగేళ్లు ఉండనుంది. 2022–23 విద్యా సంవత్సరం నుంచే దీనిని ప్రారంభించేలా వర్సిటీ అకడమిక్ సెనేట్ కీలక నిర్ణయం తీసుకుంది. వర్సిటీ సమావేశ మందిరంలో మంగళవారం అకడమిక్ సెనేట్ సమావేశమైంది. వైస్ చాన్స్‌లర్ కేబీ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం. రామిరెడ్డి, సీడీసీ డీన్ సుందరకృష్ణ పాటు కమిటీలో 32 మంది సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. 2021–22 సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాలను సభ్యుల ముందు ఉంచారు. అదే విధంగా 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ కార్యకలాపాలు, తదితర 50 అంశాలపై చర్చించి, సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. విద్యా పరంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ►నూతన విద్యా పాలసీకి అనుగుణంగా యూనివర్సిటీ అనుబంధ కాలేజీలన్నింటిలోనూ నాలుగేళ్ల డిగ్రీ కోర్సు అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మూడు ఏళ్లు పూర్తయ్యాక పదినెలల ఇంటర్న్‌షిప్ ఉండేలా సిలబస్‌ను రూపొందించనున్నారు. దీనిని 2022–23 విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని నిర్ణయించారు. ►డిగ్రీ కోర్సులన్నీ ఇంగ్లిష్ మీడియంలో బోధన, పరీక్షల నిర్వహణకు నిర్ణయించారు. ►డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలో పరీక్షల నిర్వహణలకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించారు. ►కాలేజీల్లో నాణ్యమైన విద్యాబోధన చేపట్టేలా అన్ని చర్యలు తీసుకునేలా పర్యవేక్షణ పెంచ నున్నారు. ►నాలుగేళ్ల డిగ్రీతో బయటకు వచ్చే ప్రతి విద్యార్థి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను తప్పనిసరిగా పొందేలా బోధనకు ప్రాధాన్యం ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సెనేట్ సభ్యులు సూచించారు. ►అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ జయశంకర్ ప్రసాద్ సమన్వయకర్తగా వ్యవహరించగా, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం. రామిరెడ్డి సెనేట్ అజెండా, వర్సిటీలో నూతన విద్యా విధానం అమలు తీసుకుంటున్న చర్యలపై వివరించారు. -
ప్రపంచంతో పోటీ
కోవిడ్ తగ్గుతున్నందున వచ్చే ఏడాది పిల్లలు స్కూళ్లకు వెళ్లే నాటికే విద్యా కానుక అందించాలి. ఇందుకోసం ఇప్పుడే టెండర్లు పిలిచేలా చర్యలు తీసుకోవాలి. ఈ కిట్‌లో వస్తువులు మరింత నాణ్యతగా ఉండేలా దృష్టి సారించాలి. వచ్చే ఏడాది నుంచి విద్యా కానుకలో భాగంగా మూడు జతల దుస్తులకు అదనంగా స్పోర్ట్స్ డ్రస్, స్పోర్ట్స్ షూ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. ఇవి మంచి డిజైన్‌తో ఉండేలా చూడాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రపంచ స్థాయిలో పోటీకి తగినట్టుగా విద్యార్థులను తయారు చేసేందుకు ఉద్దేశించిన నూతన విద్యా విధానం అమలుపై అన్ని రకాలుగా సిద్ధం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. ఈ విధానం సమర్థవంతంగా అమలు జరిగినప్పుడే మన పిల్లలు ప్రపంచ స్థాయిలో రాణిస్తారని, వారిని ఆ దిశగా సన్నద్ధం చేసేందుకు అడుగులు ముందుకు వేయాలన్నారు. చాలా స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించామని, ఈ దశలో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యా శాఖలో నాడు–నేడుతో పాటు ఫౌండేషన్ స్కూళ్లపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్య పుస్తకాల ముద్రణలో నాణ్యత మరింతగా పెంచాలని సూచించారు. ఇప్పటి నుంచే టెండర్ల ప్రక్రియ ప్రారంభించడంపై దృష్టి సారించాలని చెప్పారు. మూడో తరగతి నుంచి సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీబీఎస్ఈ అఫిలియేషన్ గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరిస్తూ.. తొలుత వెయ్యి స్కూళ్లను అఫిలియేషన్ చేస్తున్నామని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. అన్ని రకాల స్కూళ్లకు సీబీఎస్ఈ అఫిలియేషన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. విద్యాశాఖలో నాడు–నేడు, ఫౌండేషన్ స్కూళ్లపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 12,663 స్కూళ్లలో రెండో విడత నాడు–నేడు ► రూ.4,535.74 కోట్ల వ్యయంతో రెండో విడతలో 12,663 స్కూళ్లలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి, రూపురేఖలు మార్చాలి. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి. (రెండో విడతలో 18,498 అదనపు తరగతి గదులు నిర్మించనున్నారు. మూడో విడత రూ.7,821 కోట్ల వ్యయంతో 24,900 స్కూళ్లలో నాడు–నేడు చేపట్టనున్నారు.) ► నాడు –నేడు కార్యక్రమం ద్వారా ఇంత డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత కచ్చితంగా స్కూళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. లేకపోతే మళ్లీ పూర్వపు స్థితికి వెళ్లిపోతాయి. స్కూళ్లలో టాయిలెట్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ► ప్రతి స్కూల్లో మరమ్మతుల కోసం, సమస్యల పరిష్కారం కోసం కంటింజెన్సీ ఫండ్ ఏర్పాటు చేయాలి. దీనిపై ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) తయారు చేయాలి. అప్పుడే స్కూళ్లు నిత్యనూతనంగా ఉంటాయి. నాడు–నేడు పనులపై శిక్షణ ► ఈ ఏడాది విద్యా కానుక నూటికి నూరు శాతం పంపిణీ పూర్తయిందని అధికారులు సీఎంకు వివరించారు. నాడు–నేడు పనులకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాల్లోని సుమారు 12 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం పేరెంట్స్ కమిటీలకు కూడా శిక్షణ ఇస్తామన్నారు. ► స్వేచ్ఛ కార్యక్రమం కింద స్కూల్లో ఆడపిల్లలకు శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్‌లో ఈ కార్యక్రమం ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ► ఈ సమీక్షలో పాఠశాల విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, సర్వ శిక్షా అభయాన్ స్టేట్ ప్రోజెక్ట్ డైరెక్టర్ వెట్రి సెల్వి, పాఠశాల విద్యా శాఖ సలహాదారు ఎ.మురళి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ (ఎస్సీఈఆర్టీ) బి.ప్రతాప్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
15 కోట్ల మంది పాఠశాలలకు దూరం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది పిల్లలు, యువత విద్యా వ్యవస్థకి దూరంగా ఉన్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. మరో 25 కోట్ల మందికి అక్షరజ్ఞానం కూడా లేదని వెల్లడించారు. భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) గురువారం ‘‘ఉద్యోగాల కల్పన, పెట్టుబడులు’’ అనే అంశంపై నిర్వహించిన వార్షిక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం, ప్రైవేటు, చారిటబుల్ సంస్థలు, అంగన్వాడీ కేంద్రాలు, ఉన్నత విద్యా సంస్థల్లో 3–22 ఏళ్ల మధ్య వయసున్న వారి గణాంకాలను పరిశీలిస్తే దాదాపుగా 35 కోట్ల మంది చదువుకుంటున్నారని తెలిపారు. ఆ వయసు కలిగిన వారు దేశ జనాభాలో 50 కోట్లు మంది ఉన్నారని, దీనిని బట్టి చూస్తే 15 కోట్ల మంది విద్యకు దూరంగా ఉన్నారని అర్థమవుతోందన్నారు. వారందరినీ బడిబాట పట్టించడమే లక్ష్యంగా కేంద్రం పని చేస్తుందని, మన దేశ ఆర్థిక వ్యవస్థలో పని చేసే వారి సంఖ్య పెంచాలంటే అందరికీ విద్య అందుబాటులోకి రావాలని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ఈ తరుణంలో అక్షరాస్యత 80 శాతానికి చేరుకుందని ప్రధాన్ చెప్పారు. దాదాపుగా 25 కోట్ల మంది ఇప్పటికీ నిరక్షరాస్యులుగా ఉన్నారని తెలిపారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) మరో 25 సంవత్సరాలకి సాధించాల్సిన లక్ష్యాలకు సంబంధించిన రోడ్ మ్యాప్ అన్నారు. దేశ స్వాతంత్య్ర శతాబ్ది వేడుకల సమయానికి ఏం సాధించాలో మార్గనిర్దేశం చేస్తుందని తెలిపారు. కరోనా సంక్షోభం సమయంలో డిజిటల్ విద్యకు ప్రాధాన్యం పెరిగిందని, తద్వారా విద్యారంగంలో సృజనాత్మకత, పెట్టుబడులకు అవకాశం పెరుగుతుందని అన్నారు. భవిష్యత్‌లో పల్లె పల్లెకి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్లు వస్తాయని, దీనివల్ల విద్యా వ్యవస్థలో డిజిటలైజేషన్ పెరిగి వినూత్న మార్పులు వస్తాయని చెప్పారు. -
YS Jagan: కొరత లేకుండా టీచర్లు
► 1, 2 తరగతులకు విద్యా హక్కు చట్టం నిబంధనల మేరకు పిల్లల సంఖ్యను బట్టి ఒకరు, లేదా ఇద్దరు టీచర్లు ఉంటారు. ► 3, 4, 5 తరగతులకు సబ్జెక్టుకు ఒకరు చొప్పున టీచర్లు ఉంటారు. నూతన విద్యా విధానం వల్ల ఒక్క స్కూలు కూడా మూత పడదు. ఒక్క టీచర్‌ను కూడా తొలగించడం జరగదు. సాక్షి, అమరావతి: నూతన విద్యా విధానంలో స్కూళ్ల వర్గీకరణకు, విద్యార్థుల నిష్పత్తికి తగినట్లు టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. టీచర్లకున్న అనుభవాన్ని, బోధనలో వారికున్న నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇంగ్లిష్ మీడియంలో బోధన అందడం ద్వారా ప్రపంచ స్థాయిలో పోటీకి తగినట్టుగా విద్యార్థులు తయారవుతారని పేర్కొన్నారు. నూతన విద్యా విధానంపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను ఉంచడంపై తయారు చేసిన ప్రతిపాదనలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నూతన విద్యా విధానం ద్వారా చిన్న నాటి నుంచే విద్యార్థులకు నైపుణ్యం ఉన్న టీచర్లు అందుబాటులో ఉంటారన్నారు. ఆర్టీఈ నిబంధనలను అనుసరిస్తూనే.. 3వ తరగతి నుంచి విద్యార్థులకు వివిధ సబ్జెక్టుల్లో విషయ నిపుణులైన టీచర్ల ద్వారా చక్కటి బోధన అందించడానికి తగిన సంఖ్యలో టీచర్లను పెట్టేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా సింగిల్ టీచర్‌తో నడుస్తున్న స్కూళ్లలో కూడా వర్గీకరణ ద్వారా విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా, సబ్జెక్టులను వేర్వేరు టీచర్లు బోధించే పరిస్థితులు వస్తాయని చెప్పారు. ఉపాధ్యాయులపై తగ్గనున్న పని భారం నూతన విద్యా విధానం ద్వారా ఉపాధ్యాయులపై పని భారం కూడా తగ్గుతుందని, అర్హతలున్న అంగన్వాడీ టీచర్లకు కూడా ప్రమోషన్ ఛానల్ ఏర్పడుతుందని సీఎం తెలిపారు. తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా బోధించాలని ఆదేశించారు. నూతన విద్యా విధానం, నాడు –నేడు కోసం మొత్తంగా సుమారు రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. నూతన విద్యా విధానంపై కలెక్టర్లు, జేసీలు, డీఈఓలు, పీడీలకు అవగాహన కల్పించాని, దీనిపై ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు అందరిలోనూ అవగాహన తీసుకురావాలని స్పష్టం చేశారు. ఎవరికైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేయాన్నారు. ఈనెల 16న విద్యాకానుక ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సమీక్షలో ఇంకా చర్చకు వచ్చిన అంశాలు ఇలా ఉన్నాయి. నూతన విద్యా విధానంపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం జగన్. చిత్రంలో మంత్రి సురేష్ తదితరులు ఆరు రకాలుగా స్కూళ్ల వర్గీకరణ ► శాటిలైట్ పౌండేషన్ స్కూల్స్ (పీపీ–1, పీపీ–2) ► ఫౌండేషన్ స్కూల్స్ (పీపీ–1, పీపీ–2, 1, 2) ► ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ (పీపీ–1 నుంచి 5వ వరగతి వరకు) ► ప్రీ హైస్కూల్స్ (3 నుంచి 7 లేదా 8వ తరగతి వరకు) ► హైస్కూల్స్ (3 నుంచి 10వ తరగతి వరకు) ► హైస్కూల్ ప్లస్ (3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు) పీపీ–1 నుంచి 12వ తరగతి వరకు వర్గీకరణ వల్ల ప్రస్తుతం ఉన్న స్కూళ్లు 44 వేల నుంచి సుమారు 58 వేలు అవుతాయని అధికారులు సీఎంకు వివరించారు. విప్లవాత్మక మార్పులు ► అమ్మ ఒడి, ఇంగ్లిష్ మీడియం, నాడు–నేడు తదితర విప్లవాత్మక మార్పుల వల్ల క్షేత్ర స్థాయిలో గణనీయమైన ఫలితాలు వస్తున్నాయి. 2014–15 నాటికి రాష్ట్రంలోని అన్ని రకాల స్కూళ్లలో ఎన్రోల్మెంట్ 72.33 లక్షలు కాగా, 2018–19 నాటికి 70.43 లక్షలకు పడిపోయింది. అమ్మ ఒడి పథకం వల్ల 2020–21 నాటికి ఎన్రోల్ అయిన విద్యార్థుల సంఖ్య మళ్లీ 73.06 లక్షలకు చేరుకుంది. అమ్మ ఒడి కారణంగా 2.63 లక్షల మంది పిల్లలు అధికంగా చేరారు. ► ప్రభుత్వ పాఠశాలల్లో 2014–15 నాటికి ఎన్రోల్ అయిన విద్యార్థుల సంఖ్య 42.83 లక్షలు. 2018–19 నాటికి ఆ సంఖ్య 37.21 లక్షలకు పడిపోయింది. 2020–21 నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్ అయిన విద్యార్థుల సంఖ్య మళ్లీ 43.44 లక్షలకు చేరింది. ► ప్రభుత్వ విద్యారంగంపై నమ్మకం పెరిగింది. అమ్మ ఒడి ద్వారా పిల్లలను బడికి పంపాలన్న కోరిక బలపడిందని, ఈ పథకం ద్వారా స్కూల్లో చదువుకుంటున్న పిల్లల వివరాలు పక్కాగా ఉన్నాయని అధికారులు తెలిపారు. సామాజిక తనిఖీల ద్వారా (సోషల్ ఆడిట్) కచ్చితమైన డేటా రూపొందిందన్నారు. దేశంలో మరే ఇతర రాష్ట్రాల్లోనూ విద్యార్థుల వివరాలు ఇంత పక్కాగా లేవని వివరించారు. ఈ సమావేశంలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
16 నుంచి స్కూళ్లు.. ఆ రోజే నూతన విద్యావిధానంపై ప్రకటన
రూ.16 వేల కోట్లతో చేపట్టిన నాడు – నేడు, నూతన విద్యా విధానంతో సాధించబోయే లక్ష్యాలను స్పష్టంగా చెప్పాలి. సమూల మార్పుల ద్వారా విద్యా వ్యవస్థ పునరుజ్జీవానికి ఏం చేయబోతున్నామో తెలియజేయాలి. తల్లిదండ్రులకూ అవగాహన కలిగించాలి. నూతన విధానంలో ఏరకంగా ఉద్యోగ తృప్తి ఉంటుందో టీచర్లకు వివరించాలి. – సీఎం జగన్ 16న జరిగే మరిన్ని కార్యక్రమాలు ►తొలి విడత నాడు–నేడు కింద రూపురేఖలు మారిన స్కూళ్లు ప్రజలకు అంకితం ►రెండో విడత నాడు నేడు పనులకు శ్రీకారం ►విద్యార్థులకు విద్యా కానుక కిట్లు పంపిణీ కొత్త విధానంలో 6 రకాల స్కూల్స్ 1.శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ (పీపీ–1, పీపీ–2) 2.ఫౌండేషన్ స్కూల్స్ (పీపీ–1, పీపీ–2, 1, 2 తరగతులు) 3.ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ (పీపీ–1, పీపీ–2, 1, 2, 3, 4, 5 తరగతులు) 4.ప్రీ హైస్కూల్స్ (పీపీ–1, పీపీ–2, 1, 2, 3, 4, 5, 6, 7 తరగతులు) 5.హైస్కూల్స్ (3 నుంచి 10వ తరగతి వరకు) 6.హైస్కూల్ ప్లస్ (3 నుంచి 12వ తరగతి వరకు) సాక్షి, అమరావతి: వచ్చే నెల 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా శాఖను ఆదేశించారు. అదే రోజు తొలి విడతలో నాడు–నేడు కింద రూపురేఖలు మారిన స్కూళ్లను ప్రజలకు అంకితం చేస్తూ.. రెండో విడత స్కూళ్లలో నాడు–నేడు కింద పనులకు శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. అదే రోజే విద్యా కానుకను ప్రారంభించి, నూతన విద్యా విధానం విధి, విధానాలను ప్రకటిస్తామని చెప్పారు. విద్యా శాఖ, అంగన్వాడీ కేంద్రాల్లో నాడు–నేడు పనులు, నూతన విద్యా విధానం, విద్యా కానుక అంశాలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నూతన విద్యా విధానంపై గత సమావేశాల్లో ఆలోచనలు, వాటిని ఖరారు చేయడంపై చేసిన కసరత్తును అధికారులు సీఎంకు వివరించారు. నూతన విద్యా విధానాన్ని అనుసరించి స్కూళ్ల వర్గీకరణ ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. ఏమైనా మెరుగులు దిద్దాల్సి ఉంటే త్వరితగతిన ఆ ప్రక్రియ పూర్తి చేసి, వచ్చే నెల 16న నూతన విద్యా విధానం విధివిధానాలను వెల్లడించాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎం జగన్ ఇంకా ఏం చెప్పారంటే.. నాడు–నేడులో భాగంగా స్కూళ్ల ప్రహరీలపై గీసిన ఆకర్షణీయమైన పెయింటింగ్స్ వద్ద ఆడుకుంటున్న పిల్లలు అంగన్వాడీల నుంచే ఇంగ్లిష్ మీడియం ►ఫౌండేషన్ స్కూళ్లలో భాగంగా అంగన్వాడీల నుంచే ఇంగ్లిష్ మీడియం ప్రారంభం అవుతుంది. శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్‌గా అంగన్వాడీలు రూపాంతరం చెందుతాయి. శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్‌కు ఫౌండేషన్ స్కూల్స్ మార్గ నిర్దేశం చేస్తాయి. ఇక్కడ కూడా ఎస్జీటీ టీచర్లు పర్యవేక్షిస్తూ ఉత్తమ బోధన అందేలా చూస్తారు. ►శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్ ప్రతి ఆవాసంలో ఉంటుంది. కిలోమీటరు లోపలే ఫౌండేషన్ స్కూల్ ఏర్పాటవుతుంది. మూడు కిలోమీటర్ల పరిధిలో హైస్కూల్ ఉంటుంది. మూడు కిలోమీటర్ల పరిధి దాటి ఒక్క స్కూలూ ఉండదు. వీటన్నింటినీ పక్కాగా ఏర్పాటు చేస్తూ నూతన విద్యా విధానాన్ని అమలు చేయబోతున్నాం. అవగాహన కల్పించాలి ►ఎందుకు నూతన విద్యా విధానం పట్ల మొగ్గు చూపుతున్నామనేదానిపై మరింత జాగ్రత్తగా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. ఫౌండేషన్ స్కూల్స్, నూతన విద్యా విధానంపై ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు జరిగాయా? లేదా? (విస్తృతంగా చర్చించామని అధికారులు చెప్పారు) ►ఇందులో ఎటువంటి సందేహాలకు తావుండరాదు. తల్లిదండ్రులకు కూడా ఈ విషయం స్పష్టంగా అర్థం కావాలి. నూతన విద్యా విధానం వల్ల కలిగే ప్రయోజనాలు వారికీ తెలియాలి. ఆ మేరకు విస్తృతంగా అవగాహన కలిగించాలి. ►అంగన్వాడీలకు మరింత ప్రోత్సాహం కలిగించేందుకు వారికి ప్రమోషన్ చానల్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండేలా హేతుబద్ధీకరణ, జాతీయ ప్రమాణాలను అనుసరించి విద్యా వ్యవస్థ ఉంటుంది. ఏ స్కూలునూ మూసేయం, ఎవ్వరినీ తొలగించం. పారదర్శకతతో పనులు ముందుకు సాగాలి ►మొదటి విడత నాడు–నేడులో అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలి. పిల్లల భవిష్యత్తు కోసం, సమాజ శ్రేయస్సు కోసం ఇంత ఖర్చు పెడుతున్నాం. ఎక్కడా అవినీతికి, వివక్షకు తావుండరాదు. పిల్లల చదువుల కోసం ఇంత ఖర్చు చేసిన ప్రభుత్వం గతంలో లేదు. ►పారదర్శకతతో పనులు ముందుకు సాగాలి. అవినీతి ఏ స్థాయిలో ఉన్నా సహించేది లేదు. ఈ విషయం పై స్థాయి హెడ్ మాస్టర్ నుంచి కింద స్థాయి వారి వరకు వర్తిస్తుంది. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా చెబుతున్నా. ►పాఠ్య పుస్తకాలు, డిక్షనరీ, జగనన్న విద్యా కానుక.. తదితరాలన్నీ ఆగస్టు 16 నాటికి సిద్ధంగా ఉండాలి. మార్కుల ఆధారంగా గ్రేడ్లు ►తొలిదశలో నాడు–నేడు కింద చేపట్టిన స్కూల్స్‌లో పనులు దాదాపు పూర్తయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. అమ్మఒడి, నాడు–నేడు, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, ఇంగ్లిష్ మీడియం వంటి సంస్కరణలు విద్యా వ్యవస్ధలో మంచి ఫలితాలు అందించబోతున్నాయన్నారు. ►వరుసగా రెండేళ్లు పరీక్షలు నిర్వహించకుండానే టెన్త్ విద్యార్థులను పాస్ చేశామని, కొన్ని రిక్రూట్మెంట్లలో మార్కులను పరిగణనలోకి తీసుకుంటున్నందున 2020 టెన్త్ విద్యార్థులకూ అంతర్గత పరీక్షల ఆధారంగా మార్కులు ఇస్తామని తెలిపారు. ►ఇలాగే 2021 టెన్త్ విద్యార్థులకూ మార్కులు ఇవ్వనున్నామని వివరించారు. స్లిప్ టెస్టుల్లో మార్కుల ఆధారంగా 70% మార్కులు, ఫార్మేటివ్ అసెస్మెంట్ ఆధారంగా మిగిలిన 30% మార్కులు ఇస్తామన్నారు. మొత్తం మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇస్తామని వెల్లడించారు. ►విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నైపుణ్య బోధనే నూతన విద్యా విధానం లక్ష్యం ►ఉపాధ్యాయులను అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకోవడమే నూతన విద్యా విధానం ప్రధాన లక్ష్యం. పిల్లలకు ప్రతి సబ్జెక్టుపై నైపుణ్యం, ఆ సబ్జెక్టులో చక్కటి పరిజ్ఞానం ఉన్న టీచర్లతో బోధన ఉంటుంది. ప్రస్తుతం 5వ తరగతి వరకు ప్రతి టీచర్ 18 రకాల సబ్జెక్టులు బోధిస్తున్నారు. ►ఇంటర్ తర్వాత డిప్లమో ఇన్ ఎడ్యుకేషన్ చేసి సెకండరీ గ్రేడ్ టీచర్లుగా పని చేస్తున్నారు. కొన్ని చోట్ల సుమారు 200 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు బోధించాల్సి వస్తోంది. మరికొన్ని చోట్ల నలుగురికి ఒకే టీచర్ బోధిస్తున్న పరిస్థితి ఉంది. నూతన విద్యా విధానం ద్వారా ఈ రకమైన పరిస్థితుల్లో మార్పు తెస్తున్నాం. ►5వ తరగతి వరకు 18 సబ్జెక్టులను బీఈడీ, పీజీ చేసిన ఉపాధ్యాయులతో సబ్జెక్టుల వారీగా పిల్లలకు బోధన అందించబోతున్నాం. తద్వారా పిల్లలకు ఫోకస్డ్ ట్రైనింగ్ వస్తుంది. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి శాస్త్రీయంగా ఉండేలా రూపొందిస్తున్నాం. ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ రాబోతున్నారు. -
ప్రాథమిక పాఠశాలల్లో సీబీఎస్ఈ
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యారంగంలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం‘మన బడి–నాడు నేడు’ కింద పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. పాఠశాలలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతూ.. సంస్కరణలు సత్ఫలితాలిచ్చేలా కార్యాచరణ దిశగా అడుగులేస్తోంది. పాఠశాల విద్యలో దశల వారీగా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆ పద్ధతుల్లో బోధన చేసేలా ఉపాధ్యాయులనూ సిద్ధం చేయిస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన సామర్థ్యాలను మెరుగుపర్చేలా సీబీఎస్ఈ పాఠ్యాంశాల బోధనపై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ బోధన కొనసాగించడంతో పాటు మూల్యాంకన రీతులను అనుసరించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సీమ్యాచ్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు నిరంతర వృత్తిపరమైన అభివృద్ధిలో భాగంగా ‘స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్’ (సీమ్యాట్) ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న దాదాపు 90 వేల మంది టీచర్లను ఈ శిక్షణలో భాగస్వాములను చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ విధానాన్ని అమలు చేయాలని సంకల్పించిన నేపథ్యంలో ఆంగ్ల మాధ్యమంలోనూ బోధన చేసేలా ఉపాధ్యాయులకు తర్ఫీదు ఇస్తారు. తద్వారా విద్యార్థులకు ఉత్తమ పరిజ్ఞానం అందించి వారి సామర్థ్యాలను మరింత మెరుగుపర్చాలని సర్కారు నిర్ణయించింది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సీబీఎస్ఈ బోధనా విధానం (టీచింగ్ మెథడాలజీ), మూల్యాంకన పద్ధతులపై తర్ఫీదు ఇస్తారు. కరోనా నేపథ్యంలో దీక్షా డిజిటల్ వేదిక ద్వారా ఉపాధ్యాయులకు ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. సోమవారం నుంచి జూలై 3వ తేదీ వరకు కొనసాగే శిక్షణ కార్యక్రమంపై ఉపాధ్యాయులకు సూచనలు జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ డీఈవోలకు, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్లకు ఆదేశాలు జారీ చేసింది. శిక్షణ ముఖ్యోద్దేశాలివీ.. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల కోసం 1–6వ తరగతి వరకు పుస్తకాలను ఆంగ్ల, తెలుగు మాధ్యమాల్లో ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. నూతన పాఠ్య పుస్తకాల నేపథ్య పరిజ్ఞానం, కార్యాచరణ ఆధారిత, ప్రయోగాత్మక అభ్యసనాలతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన పాఠ్య పుస్తకాల్లోని పాఠ్యాంశాలను లక్ష్యాలను సాధించేలా సీబీఎస్ఈ విధానంలో బోధన చేసేలా ఉపాధ్యాయులను తీర్చిదిద్దనున్నారు. అభ్యసన ఫలితాలు సాధించడంపై కంటెంట్ అనాలసిస్‌తోపాటు సృజనాత్మక రీతుల్లో బోధనాభ్యసన విధానాలను అనుసరించేలా తర్ఫీదునిస్తారు. మూల్యాంకన విధానాలు, సాధనాలు, మూల్యాంకన ప్రాసెస్‌లపై శిక్షణ ఇస్తారు. సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణమైన సామర్థ్యాలతో విద్యార్థులకు బోధన చేసేలా శిక్షణ ఇస్తారు. తెలుగు మాధ్యమంలో బోధన చేస్తున్న ఉపాధ్యాయులకు సీబీఎస్ఈ విధానంలో ఆంగ్ల మాధ్యమ బోధనా పద్ధతులపై శిక్షణ ఇస్తారు. శిక్షణ ఇలా.. ► ఉపాధ్యాయులకు ప్రాథమిక స్థాయిలో ఇంగ్లిష్, మేథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ బోధనపై శిక్షణ ఉంటుంది. ► దీక్షా ప్లాట్ఫారం ద్వారా నిర్వహించే ఈ కోర్సు నిడివి 12 గంటలు. ఆన్లైన్లో రోజుకు గంట చొప్పున మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు 12 రోజుల పాటు దీనిని నిర్వహిస్తారు. ► ఎన్సీఈఆర్టీ–న్యూఢిల్లీ, రీజనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్ఐఈ), మైసూర్‌కు చెందిన ప్రొఫెసర్లు, కేంద్రియ విద్యాలయాల బోధనా సిబ్బంది రిసోర్సు పర్సన్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదీ షెడ్యూల్ ఇంగ్లిష్: జూన్ 21 నుంచి 24వ తేదీ వరకు, మేథమెటిక్స్: జూన్ 25 నుంచి 29వ తేదీ వరకు, ఈవీఎస్: జూన్ 30 నుంచి జూలై 3వ తేదీ వరకు. నూతన పాఠ్య పుస్తకాలు రెడీ.. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి పంపిణీకి సిద్ధమైన నూతన పాఠ్య పుస్తకాలు సంఖ్య తరగతి పాఠ్య పుస్తకాల సంఖ్య 1వ తరగతి 29,10,424 2వ తరగతి 30,96,822 3వ తరగతి 39,46,165 4వ తరగతి 39,40,938 5వ తరగతి 38,68,931 6వ తరగతి 35,38,818 7వ తరగతి 36,43,742 8వ తరగతి 41,19,992 9వ తరగతి 39,58,521 10వ తరగతి 37,93,110 -
భావి అవసరాలు తీర్చేలా నూతన విద్యావిధానం
అహ్మదాబాద్: భారత్ గత సంవత్సరం ఆవిష్కరించిన నూతన విద్యా విధానం భవిష్యత్ అవసరాలను తీర్చగలదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆ విధానాన్ని రూపొందించారని ప్రశంసించారు. విద్యార్థి నేర్చుకునే జ్ఞానం దేశాభివృద్ధికి ఉపయోగపడాలనే డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ ఆకాంక్షను తీర్చేదిగా ఉందన్నారు. ప్రజాస్వామ్య విలువలు భారత సామాజిక జీవనంలో అంతర్లీనంగా ఉన్నాయన్నారు. అహ్మదాబాద్‌లోని బాబాసాహెబ్ అంబేడ్కర్ యూనివర్సిటీ నిర్వహించిన ‘అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్’ 95వ వార్షిక సమావేశం, యూనివర్సిటీ వైస్ చాన్సెలర్ల జాతీయ సెమినార్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ బుధవారం ప్రసంగించారు. ప్రతీ విద్యార్థికి వేర్వేరు ప్రత్యేక సామర్థ్యాలు ఉంటాయని, వాటిని గుర్తించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుడిపై ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. ‘విద్యార్థి సామర్థ్యం ఏమిటి? సరిగ్గా బోధిస్తే ఏ స్థాయికి వెళ్లగలడు? ఆ విద్యార్థి లక్ష్యం ఏమిటి? అనే అంశాలను విశ్లేషించాలి’ అని సూచించారు. కృత్రిమ మేథ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా, 3డీ ప్రింటింగ్, వర్చువల్ రియాలిటీ, రోబోటిక్స్, జియో ఇన్ఫర్మేటిక్స్, మొబైల్ టెక్నాలజీ, స్మార్ట్ హెల్త్ కేర్, రక్షణ తదితర రంగాల్లో భారత్‌ను యావత్ ప్రపంచం దిక్సూచిగా చూస్తోందన్నారు. భవిష్యత్ అవసరాల కోసం మూడు నగరాల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. జ్ఞానం, ఆత్మగౌరవం, మర్యాదపూర్వక వ్యవహారశైలిని అంబేద్కర్ గౌరవించేవారన్నారు. ఆయన చూపిన ఈ మార్గంలో నడిచే బాధ్యతను మన విద్యాలయాలు చేపట్టాలన్నారు. అంబేద్కర్‌పై కిశోర్ మాక్వానా రచించిన నాలుగు పుస్తకాలను ప్రధాని ఆవిష్కరించారు. అంబేద్కర్‌కు ప్రధాని నివాళులు బీఆర్ అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాలను సామాజిక స్రవంతిలోకి తీసుకురావడానికి అంబేడ్కర్ చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తిదాయకమని ప్రధాని పేర్కొన్నారు. జయంతి సందర్భంగా అంబేడ్కర్‌కు శిరçస్సు వంచి నమస్కరిస్తున్నానని బుధవారం ప్రధాని ట్వీట్ చేశారు. సరిపడా వ్యాక్సిన్లు అందజేస్తాం ► కరోనాపై కలిసికట్టుగా పోరాడుదాం ► ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు సాక్షి, న్యూఢిల్లీ: దేశ అవసరాలకు సరిపడా కోవిడ్–19 వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కరోనా మహమ్మారిపై అందరం కలిసికట్టుగా పోరాడుతామని పిలుపునిచ్చారు. ఈ విషయంలో రాజకీయ పార్టీలు, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు, కమ్యూనిటీ గ్రూప్‌లు ఏకతాటిపైకి రావాలని కోరారు. మోదీ గురువారం అన్ని రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనాను ఎదుర్కొనే విషయంలో సామాజిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేసేలా చూడాలని అన్నారు. గత ఏడాది వైరస్ ఉధృతి అధికంగా ఉన్నప్పుడు జన్ భాగీదారి(ప్రజల భాగస్వామ్యం)తో సమర్థంగా కట్టడి చేయగలిగామని గుర్తుచేశారు. ఈసారి కూడా ప్రజలను మరింత కార్యోన్ముఖులను చేయాలని పిలుపునిచ్చారు. టీమ్ ఇండియా స్ఫూర్తితో పోరాటం కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో అందరినీ కలుపుకొని పోయేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలను పక్కనపెట్టి ఈ పోరాటంలో ‘టీమ్ ఇండియా’ స్ఫూర్తితో ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించడం (టెస్ట్), వైరస్ రూపాంతరం చెందుతున్న తీరుపై దృష్టి పెట్టడం (ట్రాక్), సరైన సమయంలో చికిత్సనందించడం (ట్రీట్)’ అనే వ్యూహాన్ని సమర్థంగా అమలు చేయాలని సూచించారు. ఆయన బుధవారం గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. -
ప్రొఫెషనల్ కోర్సులు మరింత చేరువ
సాక్షి, అమరావతి: ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉన్నత విద్యలోనూ వినూత్న విధానాలకు కేంద్రం శ్రీకారం చుడుతోంది. దేశంలో ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంటు రేషియో (జీఈఆర్)ను పెంచేందుకు వీలుగా జాతీయ నూతన విద్యావిధానం–2020లో అనేక అంశాలను చేర్చింది. ఈ లక్ష్యాలు నెరవేరేందుకు వీలుగా ఆయా విద్యా విభాగాలు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ప్రొఫెషనల్, టెక్నికల్ కోర్సులలో చేరికలు పెరిగేందుకు ఆన్లైన్, ఓపెన్ డిస్టెన్స్ లెరి్నంగ్ (ఓడీఎల్) విధానాలను మరింత విస్తృతం చేస్తోంది. ఆన్లైన్, ఓడీఎల్ విధానంలో నాన్ ప్రొఫెషనల్ కోర్సులే ఎక్కువగా అందుబాటులో ఉండగా ఇప్పుడు ప్రొఫెషనల్ కోర్సులనూ క్రమేణా విద్యార్థులకు చేరువ చేయాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా కొత్త విధివిధానాలతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2018 యూజీసీ రెగ్యులేషన్ల ప్రకారం ఆన్లైన్, ఓడీఎల్ నాన్ ప్రొఫెషనల్ కోర్సులను పలు విద్యాసంస్థలు అమల్లోకి తీసుకురాగా.. ఇప్పుడు ఏఐసీటీఈ నిర్ణయంతో ప్రొఫెషనల్ కోర్సులనూ ఆయా విద్యాసంస్థలు విద్యార్థులకు అందించనున్నాయి. రెగ్యులర్ కోర్సులతో సమానంగా.. ఈ కోర్సులను రెగ్యులర్ కోర్సులతో సమానమైన ప్రాధాన్యతతో విద్యార్థులకు అందనున్నాయి. ఏఐసీటీఈ చట్టం–1987 ప్రకారం డిప్లొమో, పీజీ డిప్లొమో సర్టిఫికెట్, పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమో, పోస్టు గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ డిగ్రీలను ఆన్లైన్, ఓడీఎల్ ద్వారా అమలుచేస్తారు. విద్యా సంవత్సరంగా జనవరి/ఫిబ్రవరి లేదా జులై/ఆగస్టుల మధ్య 12 నెలల కాలవ్యవధిలో ఇవి అమలవుతాయి. ఈ కోర్సులను నాణ్యతా ప్రమాణాలతో విద్యార్థులకు అందించేలా ప్రతి సంస్థ ‘సెంటర్ ఫర్ క్వాలిటీ అస్యూరెన్సు (సీఐక్యుఏ) ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలి. ఆన్లైన్, డిస్టెన్స్ విధానంలో ఈ కోర్సులు అమలుచేస్తున్నా విద్యార్థులు టీచర్ల మధ్య ముఖాముఖి అభ్యసనం ఉండేలా కొంతకాలం సంప్రదాయ అభ్యసన విధానాన్నీ అమలుచేయాల్సి ఉంటుంది. ఆన్లైన్, డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలోని కోర్సులకు కూడా రెగ్యులర్ కోర్సులతో సమానంగా క్రెడిట్ సిస్టమ్ అమలవుతుంది. విద్యార్థి ఆయా కోర్సులను యూనిట్ల వారీగా విద్యార్థి అభ్యసించిన గంటలు, అసెస్మెంటులో తేలిన ప్రమాణాలను అనుసరించి ఈ క్రెడిట్లు ఇస్తారు. డ్యూయెల్ విధానంలో అమలుకు అవకాశం ►విద్యాసంస్థలు డ్యూయెల్ (ద్వంద్వ) విధానంలో అంటే సంప్రదాయ కోర్సులను అమలుచేస్తూనే ఆన్లైన్, ఆన్లైన్ డిస్టెన్స్ కోర్సులను అమలుచేయడానికి అవకాశం కల్పించనున్నారు. ►రెగ్యులర్ కోర్సులతో సమానంగా వీటిని గుర్తిస్తున్నందున ఆ కోర్సుల్లోని లెరి్నంగ్ మెటీరియల్ మాదిరిగానే ‘ఈ లెరి్నంగ్ మెటీరియల్’ను డిజిటల్ ఫార్మాట్లో విద్యార్థులకు అందిస్తారు. ►విద్యార్థులు తమంతట తాము అభ్యసించడం, పరిజ్ఞానాన్ని స్వయంగా పెంచుకోవడం, ఎప్పటికప్పుడు స్వయం మూల్యాంకనం (సెల్ఫ్ ఎవాల్యుయేషన్) ద్వారా స్వయం మార్గదర్శకత్వం వంటివి పెంపొందించుకోగలుగుతారు. ►రెగ్యులర్ కోర్సులకు మాదిరిగానే ఈ పరీక్షలను కూడా నిరీ్ణత కేంద్రాల్లో ఆన్లైన్లో నిర్వహించాల్సి ఉంటుంది. ►పెన్, పేపర్ లేదా కంప్యూటరాధారిత, లేదా పూర్తిస్థాయి ఆన్లైన్ విధానంలో విద్యార్థులను నిపుణులైన వారితో పరీక్షింపజేయాలి. కోర్సులు అందించే సంస్థల అర్హతలు.. ♦యూజీసీ గుర్తింపు, స్వయంప్రతిపత్తి ఉన్న ఉన్నత విద్యాసంస్థలు, డీమ్డ్ వర్సిటీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యూనివర్సిటీలు మాత్రమే ఈ కోర్సులు అందించేందుకు అర్హమైనవి. ♦ఈ ఆన్లైన్ కోర్సులు అమలుచేసే సంస్థలకు నాక్ 4 పాయింట్ల స్కేలులో 3.26 పాయింట్లు, లేదా ఎన్బీఏ స్కోరు 1000 స్కేల్లో 700 వచ్చి ఉండడం తదితర నిబంధనలను ఏఐసీటీఈ అమలుచేస్తుంది. ♦నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్కులో ఆ సంస్థలు టాప్ 100లో ఉండాలి. ♦ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం అన్ని సదుపాయాలను కలిగి ఉండాలి. ♦ఆయా సంస్థల్లోని ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కోర్సులను కూడా ఆన్లైన్, ఓడీఎల్ విధానంలో అందించవచ్చు. ♦ఈ కోర్సులను అమలుచేసేటప్పుడు విద్యార్థులకు సహకారం కోసం నిపుణులైన బోధకులతో ‘లెరి్నంగ్ సపోర్టు సెంటర్ల’ను ఏర్పాటుచేయాలి. ♦ఆన్లైన్ విధానంలో ఏఐసీటీఈ నిషేధించిన ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులను ఆన్లైన్, ఓడీఎల్ విధానంలో అమలుకు వీల్లేదు. వీటితో పాటు ఫార్మసీ, ఆర్కిటెక్చర్, హోటల్ మేనేజ్మెంట్, అప్లయిడ్ ఆర్ట్స్, క్రాఫ్టŠస్, డిజైన్ వంటి కోర్సులను ఆన్లైన్, ఓడీఎల్ విధానంలో అమలుచేయరాదు. ♦విద్యార్థులను రెగ్యులర్ కోర్సులకు నిర్దేశించిన పరిమితికి మూడు రెట్లు అదనంగా చేర్చుకోవడానికి అవకాశమిస్తారు. ♦నిబంధనలు ఉల్లంఘించే సంస్థల అనుమతుల రద్దుకు ఏఐసీటీఈ యూజీసీకి సిఫార్సు చేస్తుంది. అవసరమైన చట్టపరమైన చర్యలనూ చేపడుతుంది. చదవండి: అగ్రవర్ణ పేదలకూ నవరత్నాలతో భారీ లబ్ధి టీడీపీ అడ్డదారులు: పైకి కత్తులు.. లోన పొత్తులు -
ట్వెల్త్ వరకు టీచర్లకు టెట్!
సాక్షి, హైదరాబాద్: పూర్వ ప్రాథమిక స్థాయి (ప్రీ ప్రైమరీ) నుంచి 12వ తరగతి వరకు బోధించే వారందరికీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను వర్తింపజేయాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిర్ణయించింది. భవిష్యత్తులో ఆయా తరగతులకు బోధించేందుకు టీచర్లుగా నియమితులయ్యే వారంతా ముందుగా టెట్‌లో అర్హత సాధించి ఉండాలన్నమాట. నూతన విద్యా విధానంలో భాగంగా ఇది అమల్లోకి రానుంది. దీనిపై లోతుగా అధ్యయనం చేసి సమగ్ర మార్గదర్శకాలను రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎన్సీటీఈ సభ్య కార్యదర్శి కేసంగ్ వై. శెర్పా తెలిపారు. మార్చి 31వ తేదీ నాటికి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు. మరోవైపు ఇప్పటివరకు అన్ని రాష్ట్రాల్లో నిర్వహించిన టెట్లు, వాటికి హాజరైన అభ్యర్థులు, అందులో అర్హత సాధించినవారు, టెట్ నిబంధనల విషయంలో తలెత్తిన సమస్యలు, రాష్ట్రాల అభ్యంతరాలు.. ఈ వివరాలన్నింటినీ తమకు పంపించాలని అన్ని రాష్ట్రాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులకు, పాఠశాల విద్య కమిషనర్లకు బుధవారం లేఖ రాశారు. 2010 నుంచే టెట్ టీచర్ కావాలనుకుంటే ముందుగా టెట్‌లో అర్హత సాధించి ఉండాలన్న నిబంధనను ఎన్సీటీఈ 2010లోనే అమల్లోకి తెచ్చింది. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు (ప్రాథమిక), 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు (ప్రాథమికోన్నత) బోధించే టీచర్లు టెట్‌లో అర్హత సాధించి ఉండాలని పేర్కొంది. ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ స్కోర్‌కు వెయిటేజీ ఇవ్వాలని తెలిపింది. టెట్ వ్యాలిడిటీ ఏడేళ్లు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 2011 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో ఆరుసార్లు టెట్‌ను నిర్వహించారు. అర్హత సాధించిన వారి స్కోర్‌ను బట్టి ఉపాధ్యాయ నియామకాల్లో గరిష్టంగా 20 శాతం వెయిటేజీ ఇస్తున్నారు. అయితే రాష్ట్రంలో పాఠశాల స్థాయిని బట్టి టీచర్ల కేడర్లు లేవు. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ), స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) రెండు కేడర్లే ఉన్నాయి. దీంతో ఎస్జీటీ కావాలంటే టెట్ పేపరు–1లో అర్హత సాధించి ఉండాలని, ఎస్ఏ కావాలంటే పేపరు–2లో అర్హత సాధించి ఉండాలన్న నిబంధనను విధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారమే ఉపాధ్యాయ నియామకాలు చేపడుతోంది. 9, 10 తరగతులు బోధించేందుకు ప్రత్యేక కేడర్ లేదు కనుక పదో తరగతికి బోధించే స్కూల్ అసిస్టెంట్ కావాలన్నా టెట్‌ను అమలు చేస్తోంది. డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ నూతన విద్యా విధానంలో భాగంగా ప్రీప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ఎన్సీటీఈ నిర్ణయించింది. ఇందుకోసం డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సును కూడా ప్రవేశ పెట్టింది. తాము నియమించిన కమిటీ తాజాగా టెట్ సమగ్ర మార్గదర్శకాలను రూపొందిస్తుందని, అందులో పరీక్ష విధానం, పరీక్షలో పరిగణనలోకి తీసుకునే అంశాలు కూడా ఉంటాయని ఎన్సీటీఈ పేర్కొంది. ఇప్పటివరకు నిర్వహించిన టెట్ల విషయంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన అంశాలు, లోపాలు, ఫిర్యాదులు, సమస్యలు, ప్రభుత్వాలే కాకుండా వివిధ సంస్థలు, వ్యక్తులు, ఏజెన్సీలు, ఇతర భాగస్వామ్య విభాగాలు సమర్పించిన అంశాలన్నింటినీ కమిటీ అధ్యయనం చేస్తుందని తెలిపింది. కాగా సీబీఎస్ఈ, రాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల 15వ తేదీలోగా ఈ వివరాలు తమకు పంపించాలని స్పష్టం చేసింది. -
ఉన్నత చదువులు ఇక విద్యార్థుల అభీష్టం
సాక్షి,అమరావతి: అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా నూతన విద్యా విధానం–2020ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం దాని కార్యాచరణకు సమాయత్తమవుతోంది. నూతన విద్యా విధానం ప్రకారం ఉన్నత చదువులు విద్యార్థి కేంద్రంగా సాగేలా చర్యలు చేపడుతోంది. విద్యార్థులు తమ అభీష్టానుసారం ఉన్నత చదువుల అభ్యసనానికి బహుళ ప్రవేశ, నిష్క్రమణలకు అవకాశం కల్పించనుంది. ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా ఏ కోర్సు అయినా చదువుకునేందుకు వారికి వీలుకలుగనుంది. ఈ క్రమంలో ఆయా కోర్సుల్లో విద్యార్థులు సాధించిన క్రెడిట్ల బదిలీ కోసం ‘అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్– (ఏబీసీ)’ అనే నూతన కార్యక్రమానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) శ్రీకారం చుడుతోంది. ఇదీ లక్ష్యం ► నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్‌ను అనుసరించి విద్యార్థులు దేశంలోని ఉన్నత విద్యా సంస్థలలో ఇంటర్ డిసిప్లినరీ/మల్టీ డిసిప్లినరీ కోర్సులు అభ్యసించడానికి, వారి క్రెడిట్లు ఆయా సంస్థల నుంచి పరస్పరం బదిలీకి (క్రెడిట్ ట్రాన్స్ఫర్)కు ఈ కొత్త విధానం వీలు కల్పించనుంది. ► తమ చదువులను సొంతంగా నిర్ణయించుకుంటూ డిప్లొమో, డిగ్రీ, పీజీ డిప్లొమో వంటి వాటిని ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా, ఏ స్థాయి నుంచైనా అభ్యసించడానికి వీలుగా బహుళ ప్రవేశ, నిష్క్రమణలకు అవకాశం ఉంటుంది. ► నూతన ఆలోచనలు, సృజనాత్మకత, ఆవిష్కరణలకు మార్గమేర్పడేలా బహుళ కోర్సుల అధ్యయనానికి వీలుంటుంది. ఏ విద్యా సంస్థలోనైనా, ఎప్పుడైనా నచ్చిన కోర్సులు, వివిధ కాంబినేషన్లలో చదువుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ► తమ డిగ్రీలను తమకు నచ్చిన రీతిలో యూనివర్సిటీలు, అటానమస్ కాలేజీలలో అభ్యసించే అవకాశం. బహుళ ప్రవేశ, బహుళ నిష్క్రమణలతో విద్యార్థులు ఆయా కోర్సుల పూర్తికి స్వయం సమయ నిర్దేశం. ► అకడమిక్ మొబిలిటీ కోసం బోధనాభ్యసన ప్రక్రియలను అన్ని విద్యా సంస్థలు బ్లెండెడ్ (ఆన్లైన్, ఆఫ్‌లైన్) విధానంలో అందించేలా ఏర్పాట్లు. ఫుల్‌టైమ్, పార్టు టైమ్ అభ్యసనానికి వీలు. బ్యాంకు లావాదేవీలు ఇలా.. ► ‘అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్’కు విద్యార్థులు, విద్యా సంస్థలు స్టేక్ హోల్డర్లు. విద్యార్థుల క్రెడిట్లను భద్రపరిచే డిజిటల్, వర్చువల్, ఆన్లైన్ స్టోర్ హౌస్లా ఈ బ్యాంక్ ఉంటుంది. ‘నేషనల్ అకడమిక్ డిపోజిటరీ’ మాదిరిగానే ఏబీసీ స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)గా ఉంటుంది. ఉన్నత విద్యలో స్టేక్ హోల్డర్లకు ఎంతో ఉపయుక్తమైన డైనమిక్ వెబ్సైట్ ద్వారా ఇది సేవలందిస్తుంది. ► అన్ని ఉన్నత విద్యా సంస్థల విద్యార్థుల క్రెడిట్ రికార్డులను నిర్వహించేలా ఏబీసీకి కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అధికారిక గుర్తింపునిచ్చాయి. ఏబీసీ ద్వారా విద్యార్థులు ఆయా కోర్సుల క్రెడిట్లను యూనిక్ అకౌంట్, ఇండివిడ్యువల్ అకౌంట్ల ద్వారా డిజిటల్ ఫామ్‌లో పరిశీలించుకునే అవకాశం ఉంటుంది. ► ఏబీసీ గుర్తింపు ఉన్న విద్యా సంస్థల క్రెడిట్లనే జమ చేసుకుంటుంది. యూజీసీ, కేంద్ర మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఆయా క్రెడిట్ల వేలిడిటీ ఉంటుంది. విద్యార్థుల క్రెడిట్లను ఆయా విద్యా సంస్థల ద్వారానే ఏబీసీలో డిపాజిట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆఫ్‌లైన్, ఆన్లైన్ కోర్సులు నిర్వహించే స్వయం ప్లాట్‌ఫాంతో పాటు వర్సిటీలు, ఇతర సంస్థలు కూడా విద్యార్థుల క్రెడిట్లను వారి యూనిక్ ఐడీ నంబర్ అకౌంట్ ద్వారా ఏబీసీలో జమ చేస్తాయి. విదేశాల్లోని విద్యా సంస్థల్లో అభ్యసించే కోర్సుల క్రెడిట్లను కూడా ఏబీసీలో భద్రపరిచేందుకు ఆవకాశం ఉంటుంది. అర్హత ఉన్న సంస్థలకే ఖాతాలకు అవకాశం ► ఏబీసీ ప్రస్తుతానికి యూజీసీ గుర్తించిన అన్ని ఉన్నత విద్యా కోర్సుల క్రెడిట్ల భద్రతకు అవకాశమిస్తుంది. ► యూనివర్సిటీ గుర్తింపు, అటానమస్ కాలేజీలకు మాత్రమే అవకాశం. వాటికి కూడా నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) నుంచి కనీసం ఏ గ్రేడ్ గుర్తింపు ఉన్న సంస్థలకు మాత్రమే ఏబీసీలో రిజిష్టర్‌కు అవకాశం. ► ఆడియో విజువల్ సదుపాయం, ఈ–రిసోర్సులు, వర్చ్యువల్ క్లాస్ రూములు, స్టుడియోలు, ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఆన్లైన్ కోర్సుల సదుపాయంతో పాటు ప్రభుత్వ విభాగాలు నిర్దేశించిన ఇతర మౌలిక వసతులన్నీ కలిగి ఉండాలి. ► ఇంజనీరింగ్, మెడికల్, డెంటల్, లా తదితర కోర్సుల క్రెడిట్లను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి, అఖిల భారత వైద్య విద్యా మండలి తదితర విభాగాల ఆమోదంతో డిపాజిట్‌కు అవకాశం ఇవ్వనుంది. ► యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ముసాయిదాపై ఆయా విద్యా సంస్థలు, విద్యావేత్తలు, ఇతర స్టేక్ హోల్డర్లు ఏబీసీఆర్ఈజీయూఎల్ఏటీఐఓఎన్ఎస్2021 ఃజీమెయిల్.కామ్ కు తమ అభిప్రాయాలు పంపవచ్చు. -
అన్ని సెంట్రల్ వర్సిటీలకు ఒకే ప్రవేశ పరీక్ష!
సాక్షి, అమరావతి: దేశంలో అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అన్ని కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని కేంద్ర విద్యా శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ శాఖ కార్యదర్శి అమిత్‌ఖరే ఇటీవల మీడియాకు వెల్లడించారు. కేంద్రం గతేడాది నూతన విద్యావిధానం–2020ను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వేర్వేరుగా ఉన్న ఉన్నత విద్యా విభాగాలన్నిటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు ప్రతిపాదించింది. ఈ క్రమంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఈసీఐ)ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా దేశంలో వివిధ ఉన్నత విద్యాకోర్సులకు జాతీయ స్థాయిలో కామన్ ఎంట్రన్స్ టెస్టులు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు 54 ఉన్నాయి. ప్రస్తుతం వీటిలో ప్రవేశాలకు వేటికవే ఎంట్రెన్స్ టెస్టులు నిర్వహించుకుంటున్నాయి. ఇకపై జాతీయస్థాయిలో ఒకే ప్రవేశ పరీక్ష ద్వారా వీటిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంజనీరింగ్ తదితర కోర్సులకూ ప్రతిపాదన మెడికల్ కోర్సులకు నీట్‌ను నిర్వహిస్తున్నట్టు.. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్, తదితర సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశానికి కూడా ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని గతంలో కేంద్రం ప్రతిపాదించింది. ఇదే ప్రతిపాదనను ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) కూడా చేసినా చాలా రాష్ట్రాలు అంగీకరించలేదు. ప్రస్తుతం ఉన్నత విద్య కమిషన్ ఏర్పాటుతో మళ్లీ ఆ ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం వేర్వేరుగా ఉన్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఏఐసీటీఈ, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) తదితర సంస్థలను కమిషన్‌లో విలీనం చేస్తున్నారు. దీంతో ఆయా కోర్సులకు దేశవ్యాప్తంగా ఒకే ప్రవేశ పరీక్ష పెడతామని నూతన విద్యావిధానంలో కేంద్రం ప్రతిపాదించింది. అయితే రాష్ట్రాల నుంచి ఏ మేరకు సానుకూలత ఉంటుందనేది అనుమానమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అన్ని విద్యా సంస్థల సీట్ల భర్తీ కష్టమే.. జాతీయస్థాయిలో ఒకే ప్రవేశ పరీక్ష వల్ల ఇక ఎంసెట్ వంటివి ఉండవు. కేవలం జాతీయస్థాయి పరీక్షల్లో వచ్చే మెరిట్ ఆధారంగానే రాష్ట్రాల్లోని కాలేజీల్లో సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే ఇందుకు చాలా రాష్ట్రాలు ముందుకు రావడం లేదు. మెడికల్ కాలేజీల సంఖ్య పరిమితంగా ఉండడం వల్ల నీట్ ద్వారా సీట్ల భర్తీ సాధ్యమవుతోంది. అయితే వందల సంఖ్యలో కాలేజీలు ఉండే సాంకేతిక వృత్తి విద్యాకోర్సులకు ఇది సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ప్రైవేటు కాలేజీలు, డీమ్డ్ వర్సిటీలు, మైనార్టీ కాలేజీలు తమ ప్రవేశ పరీక్షలను తామే నిర్వహించుకుంటున్నాయి. మరోవైపు ఆయా రాష్ట్రాల్లోని కాలేజీల్లో సీట్ల భర్తీకి సంబంధించి రకరకాల నిబంధనలున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాల స్థాయిలోనే ప్రవేశ పరీక్షలను నిర్వహించుకోనివ్వాలని చెబుతున్నారు. ఇలా అయితేనే సీట్ల భర్తీకి వీలుంటుందని, జాతీయస్థాయి ప్రవేశ పరీక్షతో సా«ధ్యం కాదని పేర్కొంటున్నారు. విద్యార్థులపై ప్రవేశ పరీక్షల ఒత్తిడి ప్రస్తుతం ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు వేర్వేరు ప్రవేశ పరీక్షలను రాయాల్సి వస్తోంది. వీటికి సన్నద్ధమవ్వడం, దరఖాస్తు చేసేందుకు రుసుములు చెల్లించడం వారిని వ్యయప్రయాసలకు గురిచేస్తోంది. దీనివల్ల వారు తీవ్ర మానసిక ఒత్తిడితోపాటు ఆర్ధికంగా ఇబ్బందుల పాలవుతున్నారు. కాబట్టి జాతీయస్థాయిలో ఒకే ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించడమే దీనికి పరిష్కారమని మరికొందరు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కువ మంది విద్యార్థులు రాస్తున్న ప్రవేశపరీక్షలు ఇవీ.. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు ► జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్, గేట్, ఐఐటీ జామ్, యూపీఎస్ఈఈ, బీసీఈసీఈ, ఏసీఈఈ, కేఈఏఎమ్, డబ్ల్యూబీజేఈఈ, సీవోఎంఈడీకే యూజీఈటీ, టీఎస్ఎంసెట్, సీయూసెట్, ఏపీఎంసెట్, ఓజేఈఈ, ఎల్‌పీయూఎన్‌ఈఎస్‌టీ ► కేసీఈటీ, జేకేసీఈటీ, సీజీపీఈటీ, సీయూఎస్ఏటీ, జీయూజేసీఈటీ, జీసీఈటీ, యూకేఎస్ఈఈ, ఐఐఎస్సీ, ఐఐఎస్టీ, ఐఐఎస్ఈఆర్, టీఏఎన్సీఈటీ, టీఎన్ఈఏ, ఏపీఈసెట్, టీఎస్ఈసెట్. మెడికల్ ప్రవేశ పరీక్షలు.. ► నీట్, ఎయిమ్స్, జిప్మర్ ఎంబీఏ ప్రవేశపరీక్షలు.. ► క్యాట్, మ్యాట్, గ్జాట్, సీమ్యాట్, జీఎంఏటీ, ఎన్‌ఎంఏటీ, ఆత్మ, ఐబీశాట్, స్నాప్, ఐఐఎఫ్‌టీ, కేఎంఏటీ (కేరళ), కేఎంఏటీ (కర్ణాటక), ఏపీ ఐసెట్, టీఎస్ ఐసెట్. లా ప్రవేశపరీక్షలు.. ► లా, క్లాట్, ఏఐఎల్ఈటీ, ఏఐబీఈ, ఎల్‌శాట్, ఏపీలాసెట్, టీఎస్‌లాసెట్, ఎంహెచ్సెట్లా వర్సిటీ ప్రవేశపరీక్షలు.. ► బిట్‌శాట్, ఎస్‌ఆర్‌ఎంజేఈఈ, యూపీఈఎస్‌ఈఏటీ, వీఐటీఈఈఈ, ఎంయూసెట్, పీటీయూసెట్, బీవీపీసెట్, సింబయాసిస్ సెట్, ఎస్ఏఏటీ, కేఐఐటీఈఈ, ఏఎంయూ, పీఈఎస్ఎస్ఏటీ, ఐపీయూసెట్, జేఎన్‌యూఈఈ, బీహెచ్‌యూ సెట్, అలహాబాద్ వర్సిటీ సెట్, ఢిల్లీ యూనివర్సిటీ సెట్, ఏయూసెట్ ఫార్మసీ ప్రవేశపరీక్షలు.. ► జీప్యాట్, ఎంహెచ్సీఈటీ, పీయూసీఈటీ అగ్రికల్చర్ ప్రవేశపరీక్షలు.. ► ఐసీఏఆర్ ఏఐఈఈఏ, ఓయూఏటీ, ఎంపీపీఏటీ, జేఈటీ అగ్రికల్చర్, జేసీఈసీఈ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే మంచిది.. జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే మంచిది. కానీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ పాయింట్ల ఎంపికలో విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. దీంతో మెరిట్ విద్యార్థులతో రిజర్వేషన్ విద్యార్థులకు ఇబ్బందే. కేవలం ప్రవేశ పరీక్ష నిర్వహించి కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు రాష్ట్రాల పరిధిలోకి తీసుకువస్తే ఇబ్బంది ఉండదు. – డాక్టర్ డి.మురళీధర్‌రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్, బయోటెక్నాలజీ, శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ ఫీజుల భారం తగ్గుతుంది.. ఇంజనీరింగ్ కోర్సులకు ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఫీజుల భారం తగ్గుతుంది. నాణ్యత కలిగిన కళాశాలలే మనగలుగుతాయి. విద్యార్థులకు ఎక్స్పోజర్ పెరుగుతుంది. ఇతర ప్రాంతాల్లోని మంచి కళాశాలల్లో చేరే అవకాశం వస్తుంది. ఇది మంచి నిర్ణయమే. అయితే.. విద్యార్థులకు తలెత్తే ఇబ్బందులపై ముందుగా అధ్యయనం చేయాలి. – ప్రొఫెసర్ జీఎన్ ప్రదీప్‌కుమార్,సివిల్ ఇంజనీరింగ్ విభాగం, శ్రీ వేంకటేశ్వర వర్సిటీ -
అందరికీ చదువు ఎంతెంత దూరం?
ఒక దేశ సర్వతోముఖ అభివృద్ధిలో విద్యకు ఉన్న ప్రాధాన్యతను మన దేశ నాయకులు బహుధా గుర్తిం చారు. నూతన విద్యా విధానం– 2020 మొట్టమొదటి ప్రాధాన్యత ఏమిటంటే 2030 సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా నూటికి నూరు శాతం పిల్లలను బడిలో చేరుస్తూ, మాధ్యమిక స్థాయి వరకు విద్యను సార్వజనీనం చేయడం. నూతన విద్యా విధానానికి సంబంధించిన ప్రధాన లక్ష్యం సాధించాలంటే, పాఠశాల విద్య స్థితి ప్రస్తుతం ఎలా ఉన్నది, గత కొన్ని ఏళ్లుగా ఎలా ప్రగతి సాధిస్తున్నది అనే విషయాన్ని తెలుసుకోవాలి. వివిధ రంగాలపరంగా దేశంలో అనేక అసమానతలు ఉన్నట్లు ఎన్నో అధ్యయనాలు వెల్లడిం చాయి. మాధ్యమిక విద్యను సార్వజనీనం చేయడం అనే లక్ష్యాన్ని 2060 సంవత్సరం నాటికి భారత్ చేరుకునే అవకాశం ఉందని యునెస్కో నివేదిక బహిర్గతం చేస్తోంది. ఒకవిధంగా చూస్తే ఇది సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో నిర్దేశించుకున్న 2030 కాలావధికి బహుదూరం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి యంగ్ లైవ్స్ అధ్యయనం, ఇండియా స్పెండ్ నివేదిక, ఏఎస్ఈఆర్ (ఆన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎజుకేషన్ రిపోర్ట్) నివేదిక వంటివి కొన్ని నిష్టుర సత్యాలను వెల్లడించాయి. చదవడం, లెక్కలు చేయడం లాంటి ప్రాథమిక సామర్థ్యాలను సైతం తెలుగు సమాజంలోని పిల్లలు అందుకోవడంలో చాలా అసమానతలు ఉన్నాయని; నేర్చుకోవడం అనే ప్రక్రియ వీరిలో క్రమంగా క్షీణిస్తూ వచ్చిందని ఈ నివేదికలు తెలియజేస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాస్యత శాతం (68) జాతీయ సగటు (74) కంటే ఎప్పుడూ తక్కువగానే ఉంటూవచ్చింది. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ (83), రంగారెడ్డి (76), పశ్చిమ గోదావరి (75), కృష్ణ (74) జిల్లాలు మాత్రమే జాతీయ సగటుకు దగ్గరగా ఉన్నాయి. అదే సమయంలో కర్నూలు, మునుపటి మహబూబ్‌నగర్ జిల్లాలు అత్యధిక లింగ వివక్షతో పాటు, అత్యల్ప అక్షరాస్యత శాతాన్ని నమోదు చేశాయి. నికర నమోదు శాతం (నెట్ ఎన్రోల్మెంట్ రేషియో) 14–15 ఏళ్ల వయసు పిల్లల్లో 1993–94లో ఉన్న 32.2 శాతం నుంచి 2011–12 వరకు 51.7 శాతానికి పెరిగింది. గణనీయమైన 2.7 వృద్ధిరేటు సాధించినప్పటికీ 2020 నాటికి 62.1 శాతం పిల్లల నమోదు మాత్రమే సాధ్యమవుతుందని ఒక అంచనా. కాకపోతే అగ్రకులాల పిల్లలు, ఇతర ఉపాంతీకరించబడిన పిల్లల్లో భేదాలు తగ్గుముఖం పడుతుండటం విశేషం. అయినా నూరు శాతం నమోదు లక్ష్యం 2038 సంవత్సరం నాటికి మాత్రమే సాధ్యపడుతుంది. అదే 16–17 వయసు పిల్లల్లో నికర నమోదు నూరు శాతం సాధించాలంటే మరో 25 ఏళ్లు ఆగక తప్పదు. 2020 నాటికి 14–15 వయసు పిల్లల్లో 2.2 శాతం ఎప్పటికీ నమోదు కారు. పైగా పదింట ఒక వంతు మంది పిల్లలు బడి మానేసే అవకాశం ఉంది. అలాగే 16–17 వయసు వారిలో పావువంతు పిల్లలు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉంది. 17 ఏళ్ల వయసులో మాధ్యమిక స్థాయి ముగింపు రేటు 1993–94లో ఉన్న 40 నుంచి 2011–12 వరకు 63.1కి పెరిగింది. ఈ లెక్కన 72.5 శాతం మంది మాత్రమే 2020 నాటికి మాధ్యమిక స్థాయి పూర్తి చేయనున్నారు. తల్లిదండ్రుల చదువు, ఇంటి కోసం ఖర్చు పెట్టగలిగే స్థాయి లాంటివి దీనిమీద గణనీయమైన ప్రభావం చూపుతున్నాయని ఎకనామెట్రిక్ విశ్లేషణ తెలియజేస్తోంది. ఎయిడెడ్ కాని ప్రైవేట్ పాఠశాలల్లో కన్నా, ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలల్లో మాధ్యమిక ముగింపు రేటు అత్యధికంగా ఉండటం గమనార్హం. తెలంగాణ రాష్టం విషయానికి వస్తే 6–14 వయసు పిల్లల్లో నూరు శాతం నమోదు లక్ష్యాన్ని 2020 నాటికి చేరుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఈ లక్ష్యాన్ని 2023 నాటికి చేరుకోనుంది. అయితే రెండు రాష్ట్రాల్లోనూ కొన్ని జిల్లాలు ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో అవరోధం కానున్నాయి. 2016–17లో మేము చేసిన ఒక అధ్యయనంలో 6–16 ఏళ్ల వయసు వారిలో 14 శాతం పిల్లలు బడి మానేసినవారు కాగా, మూడు శాతం పిల్లలు ఎన్నడూ బడి ముఖం చూడని వాళ్ళు. బడి మానేస్తున్న పిల్లల్లో సగటున ఆరో తరగతి వరకు చదువుతున్నారు. ఈ పరిస్థితుల్లో తీవ్రమైన సంకల్పంతో ముందుకు సాగితే తప్ప మాధ్యమిక విద్యను సార్వజనీనం చేయడం అనేది సుదూర కలగానే మిగిలిపోనుంది. మహబూబ్‌నగర్, కరీంనగర్, కర్నూల్, విశాఖపట్నం లాంటి తక్కువ అక్షరాస్యత గల జిల్లాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు ఏర్పాటు చేయడం; ఉచిత బస్సు పాసులు, పుస్తకాలు, యూనిఫారాలు పంపిణీ చేయడం; మధ్యాహ్న భోజనం ఏర్పాటు; నగదు బదిలీ చేయడానికి బాలికల వివాహాన్ని ఆలస్యం చేయడం ఒక షరతుగా పెట్టడం; బాలికలకు ప్రత్యేక టాయిలెట్స్ ఏర్పాటు చేయడం లాంటి మెరుగైన మౌలిక వసతుల కల్పనలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇవన్నీ పిల్లలను బడిలో చేర్చడం, వారిని కొనసాగించడంలో విశేషమైన సానుకూల పాత్రను పోషించాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలో గురుకుల పాఠశాలల్ని ఎక్కడా లేని విధంగా అధిక సంఖ్యలో స్థాపించడం, మాధ్యమిక విద్యను పూర్తి చేయడాన్ని బాలికలకు అందించే నగదు ప్రేరేపకాలతో ముడిపెట్టడం లాంటివి సంపూర్ణ అక్షరాస్యతా లక్ష్యసాధనలో గణనీయమైన ఫలితాలు తేనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బడి మానేసిన పిల్లల్ని గుర్తించడం, వారిని వెనక్కి తేవడంలో గ్రామ సచివాలయాలు విశేష పాత్ర పోషిస్తున్నాయి. అమ్మ ఒడి, జగనన్న దీవెన, నాడు– నేడు, జగనన్న వసతి దీవెన లాంటి ప్రభుత్వ కార్యక్రమాలను వివరించడంలో కూడా ఇవి ముందున్నాయి. క్షేత్రస్థాయిలో 50 ఇళ్లకు ఒక కార్యకర్త చొప్పున ఉండటం ఏపీని సమీప భవిష్యత్తులో మెరుగైన స్థితిలో ఉంచనుంది. మార్పు కోసం ఉద్దేశించిన నాలుగు మూల స్తంభాలు– ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం, దీనికిగాను ఇప్పటికే ఉన్న ఉపాధ్యాయులు, విద్యార్థులకు తగిన శిక్షణ ఇవ్వడం; పాఠ్యాంశాలను మెరుగుపరిచి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయడం; పాఠశాల మౌలిక వసతులను గణనీయంగా పునరుద్ధరించడం, మరింత పోషకాహారం అందించడం, పిల్లలకు కావాల్సిన పాఠశాల అవసరాలను ఉచితంగా అందించడం వంటి విశిష్టమైన చర్యలు ప్రభుత్వ పాఠశాల విద్య నాణ్యతను విప్లవాత్మకంగా మార్చే వీలుంది. ఇప్పటికే బడి పుస్తకాలను మిర్రర్ ఇమేజ్ బుక్స్ పేరిట ఇంగ్లిష్, తెలుగు భాషల్లో పక్కపక్కన ముద్రించడం జరి గింది. వీటన్నింటి ఫలితంగా నూతన విద్యా విధాన లక్ష్యాలను చేరుకోవడంలో ఆంధ్రప్రదేశ్ సరైన దారిలో ఉంది. పృథ్వీకర్ రెడ్డి వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త, సెస్ మొబైల్ : 94408 90508 -
విద్యలో విప్లవం
సాక్షి, అమరావతి: ఒకటవ తరగతికి ముందే పీపీ1, పీపీ2, ప్రీ ఫస్ట్ క్లాస్ (సంసిద్ధతా తరగతులు) ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. పిల్లలకు 6 ఏళ్ల వయసు వచ్చే సరికే 85 శాతం మెదడు అభివృద్ధి చెందుతుందని అధ్యయనాలు, నిపుణులు చెబుతున్న దృష్ట్యా మొదటి తరగతికి ముందే సంసిద్ధతా తరగతులను అభ్యసిస్తే వారి పునాది ధృడంగా ఉంటుందన్నారు. దీనిని అనుసరిస్తూ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం 2021–22 నుంచి జాతీయ నూతన విద్యా విధానం అమలు చేయాలన్నారు. ఇందులో భాగంగా 5+3+3+4 అమలుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. జాతీయ నూతన విద్యా విధానంపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. జాతీయ విద్యా విధానంపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ బలమైన పునాదితో మంచి ఫలితాలు – విద్యార్థి రాణించాలంటే పునాది బలంగా ఉండాలి. అది జరగాలంటే ఒకటవ తరగతికి రాకముందే చదువు పట్ల ఆసక్తి, శ్రద్ధ ఉండేలా చూడాలి. ఆట పాటలతో చిన్నారులు బడిబాట పట్టేలా చూడాలి. అందుకోసమే విద్యా రంగంలో విప్లవాత్మక చర్యలకు నాంది పలుకుతూ అంగన్వాడీలలో పీపీ1, పీపీ2 ప్రారంభించబోతున్నాం. ఆ తర్వాత ప్రీ ఫస్ట్ క్లాస్ ఉంటుంది. విద్యార్థి ఒకటవ తరగతిలో చేరేసరికి చదువు పట్ల అవగాహన ఉంటుంది. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. ఈ మేరకు సిలబస్ రూపొందించాలి. జాతీయ నూతన విద్యా విధానాన్ని 2021–22 నుంచే అమలు చేయడానికి తగిన విధంగా పాఠ్య పుస్తకాలు ముద్రించాలి. ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు రూపొందించాలి. – విద్యా రంగంలో గ్రామ, వార్డు సచివాలయాల సేవలను వినియోగించుకునేందుకు అవసరమైన విధి, విధానాలను రూపొందించాలి. అందుకు తగిన ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్) ఉండాలి. ప్రత్యేక యాప్ కూడా రూపొందించాలి. ప్రమాణాలు బావుండాలి – అన్ని విద్యాలయాలు, కళాశాలలను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. అవి కనీస ప్రమాణాలు పాటిస్తున్నాయో? లేదో? ధ్రువపరుచుకోవాలి. తగిన ప్రమాణాలు పాటించని విద్యా సంస్థలను తక్షణమే మూసి వేయాలి. అవి తిరిగి ఆయా ప్రమాణాలు సాధించిన తర్వాతే తిరిగి ప్రారంభానికి అనుమతివ్వాలి. – ఉపాధ్యాయ శిక్షణా సంస్థల పని తీరు, ఉపాధ్యాయ శిక్షణ కరిక్యులమ్‌పై కూడా తగిన శ్రద్ధ కనపర్చాలి. సక్రమంగా పని చేయని ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు, నాణ్యత ప్రమాణాలు పాటించని వాటిని తక్షణమే మూసి వేయాలి – వివిధ పాఠశాలలు, శిక్షణా సంస్థలు, కాలేజీలు ప్రమాణాలు పాటించాల్సిన ఆవశ్యకతపై తల్లిదండ్రులుకు వివరించాలి. విద్యా సంస్థల్లో ప్రమాణాలు కొరవడితే నష్టపోయేది విద్యార్థులేనని వారికి అవగాహన కల్పించాలి. ఉపాధ్యాయుల బదిలీలు – విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులను పునర్నియమించే విధంగా అవసరసమైన బదిలీలు (రీ అపోర్షన్మెంట్) చేయాలి. – ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ నీలం సాహ్ని, ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, విద్యా శాఖ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు, హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య, సర్వశిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెట్రిసెల్వి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు అంశాలు అమలు – జాతీయ నూతన విద్యా విధానంలో ప్రతిపాదించిన అనేక అంశాలను రాష్ట్రంలో ఇప్పటికే అమలు చేస్తున్నామని విద్యా శాఖ అధికారులు సీఎంకు వివరించారు. – పాఠశాలలు, అంగన్వాడీల్లో మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకం అమలు, ప్రాథమిక స్ధాయిలో పాఠశాల సంసిద్ధత కార్యక్రమాల అమలు, ద్విభాషా పాఠ్య పుస్తకాలు రూపొందించడం, సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టడం, స్థానిక సంస్కృతికి అద్దం పట్టేలా పాఠ్య పుస్తకాల రూపకల్పన, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు ఏడాదికి కనీసం 50 గంటల పాటు శిక్షణా కార్యక్రమాలు అమలు జరిగేలా చూడటం వంటివన్నీ రాష్ట్రంలో అమలు అవుతున్నాయి. – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం 1,261 గురుకుల పాఠశాలలు, బాలికల కోసం 352 కస్తూరిబా గాంధీ విద్యాలయాలు (కేజీబీవీ), దివ్యాంగుల కోసం 672 భవిత కేంద్రాలను ఏర్పాటయ్యాయి. – పాఠశాలల ప్రమాణాల పరిరక్షణ కోసం ఇప్పటికే పాఠశాల విద్య, ఉన్నత విద్యకు సంబంధించి రెండు వేర్వేరు కమిషన్లు పని చేస్తున్నాయి. – అంగన్వాడీ సిబ్బందిలో మరింత నైపుణ్యం పెంచడంలో భాగంగా ఇంటర్ అర్హత ఉన్న వారికి ఆరు నెలల డిప్లొమా కోర్సు, పదవ తరగతి అర్హత ఉన్న వారికి ఏడాది డిప్లొమా కోర్సు ప్రవేశపెట్టాల్సి ఉంది. -
నూతన విద్యా విధానంపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో చట్టం అమలు, ప్రయోజనాలపై చర్చించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యకు ప్రభుత్వం ఇదివరకే పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం తీసుకురావడంతో సీఎం దానిపై మంగళవారం సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. (సవాళ్లను అధికమించేందుకే నూతన విద్యా విధానం) సీఎం సమీక్ష అనంతరం మంత్రి అదిమూలపు సురేష్ సాక్షి టీవీతో మాట్లాడారు. ‘కేంద్రం ప్రవేశ పెట్టిన నూతన విద్యా విధానంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న మెజారిటీ అంశాలు దానిలో ఉన్నాయి. ప్రీ ప్రైమరీ క్లాసులు నిర్వహించాలని మనం ముందుగానే నిర్ణయం తీసుకున్నాం. కొత్త పాలసీ ప్రకారం ప్రీ ప్రైమరీ అంగన్ వాడీ విద్యకు, స్కూల్ విద్యకు మధ్యలో ఓ ఏడాది అనుసంధానం చేయాలని నిర్ణయించాం. పీపీ1, పీపీ2 తో పాటు మరొక ఏడాది పెంచుతున్నాం. హై స్కూల్ లెవెల్లో 3, 5, 8 తరగతుల్లో పరీక్షలు ఉంటాయి, అవి కేవలం వారి సామర్ధ్యాన్ని పరీక్షించడానికి మాత్రమే. 10 తరగతిలో బోర్డు పరీక్షలు యధావిధిగా ఉంటాయి. ఉన్నత విద్యను కూడా నైపుణ్యంతో ఉండేలా చర్యలు చేపట్టాం. మన రాష్ట్రం నుంచి చదువుకునే విద్యార్థులు అన్ని విధాలా సమర్థంగా ఉండేలా తీర్చి దిద్దుతాం. ’ అని పేర్కొన్నారు. -
నూతన విద్యా విధానం అమలుకు ఏపీ సిద్ధం
సాక్షి, అమరావతి : భారత ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన జాతీయ విద్యా విధానం 2020 ను భవిష్యత్తు అవసరాల అనుగుణంగా తీర్చిదిద్దారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. 21వ శతాబ్దపు క్లిష్టమైన ఉన్నత విద్య అవసరాలు, రానున్న సమస్యలను నూతన విధానం పరిష్కరించగలదన్నారు. భారత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నత విద్యావిధానంలో మార్పులు ఆశిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యావిధానం 2020పై సోమవారం నిర్వహించిన గవర్నర్ల సదస్సులో రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ విజయవాడ రాజ్ భవన్ నుండి ఆన్ లైన్ విధానంలో పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు ప్రముఖులు ఈ సదస్సులో నూతన విద్యా విధానం గురించి తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జాతీయ విద్యా విధానం -2020 ను తాను స్వాగతిస్తున్నానన్న గవర్నర్, ఉన్నత విద్యావ్యవస్థలో నాణ్యతా ప్రమాణాలను సాధించాలనే లక్ష్యంతో నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని నిజమైన స్ఫూర్తితో అమలు చేయాలని యోచిస్తోందని బిశ్వ భూషణ్ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. (పాఠశాలల్లో ఇక ‘బ్రేక్ ఫాస్ట్’) పరిశోధనలలో నాణ్యత, నవ్యతతో పాటు పేటెంట్ ఆధారిత పరిశోధన, మేధో సంపత్తి హక్కులను ప్రోత్సహించే క్రమంలో జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థతో రాష్ట్ర విశ్వవిద్యాలయాల పక్షాన అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. రాష్ట్రంలో సంస్థాగత పరిశోధనలను ప్రోత్సహించడానికి రాష్ట్ర స్థాయి పరిశోధనా మండలిని ఏర్పాటు చేయటమే కాక, విద్యా సంస్ధలను పరిశ్రమలతో అనుసంధానించటం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. జాతీయ విద్యా విధానం -2020 యొక్క సిఫారసులకు అనుగుణంగా ఆన్లైన్, డిజిటల్ విద్యకు ప్రాముఖ్యతను ఇస్తూ, మిశ్రమ అభ్యాసాన్ని ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నూతన నిర్వహణ వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని గౌరవ గవర్నర్ అన్నారు. గ్రామీణ, వెనుకబడిన విద్యార్థులకు ఆన్లైన్ విద్యకు అవకాశం కల్పించడానికి, పట్టణ, గ్రామీణ, మారుమూల ప్రాంతాల మధ్య సాంకేతికత లభ్యతలో అంతరాన్ని తగ్గించడానికి ఇ-లెర్నింగ్ కమ్యూనిటీలను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించారని వివరించారు. నూతన పాలసీ సిఫారసులను అధ్యయనం చేయడానికి, రాష్ట్రంలోని నిర్దిష్ట అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాలసీ అమలు కోసం విధాన చర్యలు, మార్గదర్శకాలను సూచించడానికి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఉన్నత విద్యావ్యవస్థలో నాణ్యత, ప్రమాణాలను ప్రోత్సహిస్తూ, జాతీయ విద్యా విధానం 2020 ను అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని గవర్నర్ స్పష్టం చేసారు. ఈ సదస్సులో విజయవాడ రాజ్ భవన్ నుండి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, కళాశాల విద్యా కమీషనర్ ఎంఎం నాయక్, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ అచార్యా హేమచంద్రా రెడ్డి, గవర్నర్ వారి సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాధ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వాల జోక్యం తక్కువగా ఉండాలి : మోదీ
సాక్షి, ఢిల్లీ : అందుబాటులో అందరికీ నాణ్యమైన విద్య ప్రధాన లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించిన నూతన విద్యావిధానంలో ప్రభుత్వాల జోక్యం తక్కువగా ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) పై అన్ని రాష్ట్రాల గవర్నర్లు, విద్యాశాఖ మంత్రులు, వైస్ఛాన్సలర్లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'దేశ ఆకాంక్షలను నెరవేర్చడానికి ముఖ్యమైన ఆయుధం విద్య. గత కొన్ని సంవత్సరాలుగా మన విద్యా విధానంలో గొప్ప మార్పులేవీ చోటు చేసుకోలేదు. దాంతో దేశంలో ఆసక్తి, సృజనాత్మకతల స్థానంలో మూక మనస్తత్వం అభివృద్ధి చెందింది. కానీ ఎన్ఈపీ విధానంలో అధ్యయనం చేయడానికి బదులు నేర్చుకోవడం, అభిరుచి, ప్రాక్టికాలిటీ అనే అంశాలుంటాయి. పాఠ్యాంశాల కంటే విమర్శనాత్మక ఆలోచనపై ఆధారపడి ఉంటుంది. 21వ శతాబ్దపు అవసరాలకు అనువైనదిగా తీర్చిదిద్దడంపై ఈ విధానం ప్రధానంగా దృష్టి పెట్టింది. ఎప్పట్నుంచో ఉండే సమస్యలను పరిష్కరించి భారత్ మరో "జ్ఞాన ఆర్థిక వ్యవస్థ" గా మారడానికి ఈ కొత్త విద్యావిధానం ఎంతో సహాయపడుతుందని' మోదీ వివరించారు. (జాతి నిర్మాణంలో జాతీయ విద్యా విధానం కీలక పాత్ర) ఎలాంటి గజిబిజి లేకుండా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా విద్యను బోధించాలన్నారు. ప్రతి యూనివర్శిటీ, కాలేజీకి దశలవారీగా స్వయంప్రతిపత్తి కల్పిస్తామని మోదీ ప్రకటించారు. అంతేకాకుండా ఉత్తమ విద్యాసంస్థలకు రివార్డులు సైతం అందజేస్తామని వివరించారు. ఎన్ఈపీతో కొత్త ఆరోగ్యకర చర్చకు తెర లేచిందని, తద్వారా విద్యా విధానం మరింత మెరుగవుతుందని పేర్కొన్నారు. ఎన్ఈపీని విజయవంతంగా అమలు చేయడంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యా వ్యవస్థలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుడుతూ నూతన విద్యావిధానం–2020 (ఎన్ఈపీ–2020) కేంద్రం ఆమోదించిన సంగతి తెలిసిందే. 34 సంవత్సరాల క్రితం నాటి జాతీయ విద్యా విధానం 1986 స్థానంలో ఇది రూపుదిద్దుకుంది. సామాజికంగా, ఆర్ధికంగా అణగారిన వర్గాల వారిపై ఈ విధానంలో ప్రత్యేక దృష్టి పెట్టారు. (పాఠశాల, ఉన్నత విద్యలో భారీ సంస్కరణలు) -
కొత్త జాతీయ విద్యావిధానంతో సరికొత్త సమస్యలు
‘ఒకే దేశం ఒకే విద్య’ అనే ప్రాతిపదికన ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన ‘కొత్త జాతీయ విద్యావిధానం 2020’ దేశవ్యాప్త చర్చకు దారితీయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే, కేంద్ర ప్రభుత్వం చట్టంగా రూపొందించనున్న ‘నూతన విద్యావిధానం’లో మేలు చేసే పలు సంస్కరణలకు చోటు కల్పించినప్పటికీ, వారసత్వంగా పీడిస్తున్న కీలక సమస్యలను పరిష్కరించే ప్రతిపాదనలు ఏవీ అందులో కనబడలేదు. రెండు దశల్లో 8వ తరగతి వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాషలోనే విద్యార్థులకు విద్యను అందించాలని ప్రతిపాదించడం ఏ మేరకు ఆచరణాత్మకం అనే సందేహాలు, ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. విద్యనందించే బాధ్యత నుండి గత ప్రభుత్వాలు తప్పుకొన్న కారణంగా విద్య క్రమేపీ ప్రైవేటు రంగంలోకి జారిపోయింది. పోనీ, ఆ ప్రైవేటు రంగంలోనైనా సవ్యమైన విద్యనందిస్తున్నారా అంటే అందుకు స్పష్టమైన సమాధానం లభించదు. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన కొన్ని విద్యా సంస్థలు కేవలం మార్కులు సాధించడమే విద్యార్థుల జీవిత లక్ష్యమన్నట్లుగా చీకటి కొట్టాల్లాంటి గదుల్లో ఉంచి విద్యార్థులపై ఒత్తిడి పెంచే విధానం మొదలై దాదాపు 3 దశాబ్దాలు దాటింది. కొత్తదనం ఏదీ? కొత్త విద్యావిధానంలో పాత సమస్యలను పరిష్కరించే విప్లవాత్మక మార్పులు ఉంటాయని ఆశించిన వారికి ఆశాభంగం కలిగింది. ప్రస్తుతం ఉన్న 10+2+3 విధానాన్ని మార్పుచేసి 5+3+3+4 విధానాన్ని ప్రవేశపెట్టడం కొత్తదనంగా చూపుతున్నారు. ఈ మార్పు వల్ల ఇంటర్ కూడా పాఠశాల విద్య కిందికి వస్తుంది. పిల్లలకు 3 ఏళ్ల నుంచే కిండర్ గార్డెన్ (పూర్వ ప్రాథమిక విద్య) విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించాలనుకోవడం ఆహ్వానించదగినదే. అయితే, ఈ విద్యను బోధించే బాధ్యతను అంగన్వాడీలలో పనిచేసే ఆయాలకు అప్పగించి.. వారికి డిజిటల్, డిస్టెన్స్, డీటీహెచ్ పద్ధతులలో 6 నెలలపాటు శిక్షణ అందించాలనుకోవడం ఎంతవరకు ఆచరణాత్మకం? అంగన్వాడీ ఆయాలకు తగిన బోధనా అర్హతలు ఉండాలి కదా. ఇక, 6వ తరగతి నుంచే ఒకేషనల్ విద్యను ప్రవేశపెట్టాలన్న నిర్ణయంలో ఎటువంటి సహేతుకత కన్పించదు. 9–10 సంవత్సరాల వయస్సు విద్యార్థులకు వృత్తి విద్యకు సంబంధించిన అంశాలను నేర్చుకోవాలనే జిజ్ఞాస అంతగా ఉండదు. ఆసక్తిలేని అంశాలను వారిపై బలవంతంగా రుద్దితే అసలుకే మోసం వస్తుంది. 15 సంవత్సరాలు నిండిన తర్వాత పాలిటెక్నిక్, ఐటీఐ వంటి వృత్తి విద్య కోర్సులలో ప్రవేశిస్తున్న విద్యార్థుల సంఖ్య ఇప్పటికీ తక్కువ శాతంగానే ఉంది. పిన్న వయసులోనే వృత్తి విద్యను నేర్పినట్లయితే.. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యసించాలన్న బలీయమైన కోరిక, పట్టుదల సడలిపోతుంది. కొత్త విధానంలో మాతృభాషలో లేదా స్థానిక భాషలో 5వ తరగతి వరకు విద్యాబోధన జరగాలని, రెండవ అంచెలో 8వ తరగతి వరకు దానిని పొడిగించాలని ప్రతిపాదించడం కచ్చితంగా పేద, మధ్య తరగతి వర్గాలవారి పిల్ల లకు నష్టం కలుగుతుంది. ఒకవైపు పిల్లలకు ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్లంలో విద్యాబోధన అందించి.. వారికి ఉన్నత అవకాశాలు కల్పించాలన్న కోరిక 95% మంది బలహీన వర్గాల పిల్లల తల్లిదండ్రులలో బలంగా ఉన్న నేపథ్యంలో.. ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు కొత్త విద్యావిధానంపై కేంద్ర ప్రతిపాదన ప్రతిబంధకంగా మారుతుంది. ఇంగ్లిష్ విద్యను పేద పిల్ల లకు దూరం చేయడం సమంజసం కాదు. ఇంగ్లిష్‌ను లేకుండా చేయడం అంటే మనల్ని మనం వెనక్కు నెట్టుకోవడమేనని ‘ఎం.సి. చాగ్లా’ ఏనాడో స్పష్టం చేశారు. రాష్ట్రాల ఆధ్వర్యంలో ఉండే విశ్వవిద్యాలయాలలో ప్రాంతీయ భాషలలోనే విద్యను బోధించాలని 1967లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినపుడు విద్యాశాఖ సహాయమంత్రిగా ఉన్న ఎం.సి. చాగ్లా దానిని వ్యతిరేకిస్తూ తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. ఇంగ్లిష్ భాషపై వ్యతిరేకత దేనికి? భాషను జాతీయతా లక్షణంగా పరిగణించరాదని ఎంతోమంది విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. ఒక భాష.. అది హిందీ కావొచ్చు.. మరొకటి కావొచ్చు. దానిద్వారానే ప్రజ లలో దేశభక్తి కలుగుతుందనుకోవడం హేతుబద్ధత కాదు. ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిష్‌లో బోధన చేయాలన్న అంశానికి 95% మందికిపైగా తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌లో మొగ్గుచూపుతున్నట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇంగ్లిష్ మాధ్యమంలో విద్యాబోధన జరపడం అన్నది మాతృభాషాభివృద్ధికి వ్యతిరేకం కాదు. కేంద్రం తెచ్చిన కొత్త విద్యావిధానంలో పాఠ్య ప్రణాళికల్లో మార్పు తెచ్చి ప్రాథమిక స్థాయి నుంచి పరిశోధన వరకు ప్రాచీన, సమకాలీన సంస్కృతులు, చరిత్రలకు సంబంధించిన అంశాలను చేరుస్తామనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన కూడా వివాదాస్పదం కానుంది. జాతి మొత్తానికి సంబంధించి కొన్నింటిని మాత్రమే ఎంపిక చేసి వాటిని పాఠ్యాంశాలుగా చేయడం వల్ల.. భవిష్యత్తులో ప్రాంతీ యంగా అనేక సమస్యలు ఉత్పన్నం కావడానికి ప్రస్తుతం కేంద్రం అనుసరించబోయే విధానం అనుచిత బీజాలు నాటినట్లవుతుంది కదా! ఇది దేశ సెక్యులర్, ప్రజాస్వామ్య వ్యవస్థలకు విఘాతం కలిగించవచ్చు, విభేదాలకు దారితీయవచ్చు. భారత రాజ్యాంగంలోని 254 అధికరణ ప్రకారం ‘విద్య’ ఉమ్మడి జాబితాలో ఉంది. అంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికి విద్యపై సమాన హక్కులు, బాధ్యతలు దఖలు పడ్డాయి. రాష్ట్రాలలో చేసే చట్టాలకు అనుగుణంగా చట్టాలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. పాఠశాల విద్యకు సంబంధించి.. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్వేచ్ఛతో నిర్ణయాలు తీసుకొంటున్నాయి. అయితే, నూతన విద్యావిధానం చట్టంగా రూపొం దిన తర్వాత.. రాష్ట్రాలు తప్పనిసరిగా దానినే అనుసరించాల్సిన అనివార్యత ఏర్పడితే.. అది మరో దేశవ్యాప్త సమస్యగా మారవచ్చు. కేంద్రం ప్రకటించిన ఈ నూతన విద్యావిధానం ఇంకా ముసాయిదా రూపంలో ఉంది కనుక ఇందులో అనేక సమగ్ర మార్పులు, చేర్పులు చేయవచ్చు. అందుకు దీనిపై పార్లమెంట్లో విస్తృతమైన చర్చ జరగాలి. రాష్ట్రాల అభిప్రాయాలు కేంద్రం స్వీకరిం చాలి. రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సలహాలను పరిగణనలోకి తీసుకోవాలి. విస్తృత అంగీకారంతోనే కొత్త విద్యావిధానం విజయవంతం కాగలదు తప్ప తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే సరికొత్త సమస్యలకు బాటలు పరిచినట్లవుతుంది. వ్యాసకర్త ప్రభుత్వ చీఫ్ విప్, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు -
పాఠశాలల్లో ఇక ‘బ్రేక్ ఫాస్ట్’
సాక్షి, అమరావతి: పాఠశాలల్లోని విద్యార్థులకు ఇక నుంచి మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారాన్ని కూడా అందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఇటీవల ఆమోదించిన నూతన విద్యావిధానంలో ఆయా అంశాలను పొందుపరిచింది. ప్రతి రోజూ ఉదయాన్నే పోషకవిలువలతో కూడిన అల్పాహారాన్ని పిల్లలకు ఇవ్వడం ద్వారా పసిప్రాయం నుంచే వారిలో మేథోపరమైన, శారీరకాభివృద్ధి సాధ్యమవుతుందని.. దీంతో వారు విద్యా సామర్థ్యాలను సులభంగా నేర్వగలుగుతారని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ♦మధ్యాహ్నం భోజనానికి అదనంగా శక్తి నిచ్చే అల్పాహారాన్ని అందించడం ద్వారా ఉత్తమ ప్రమాణాలు సాధించే అవకాశం ఉంటుంది. ♦వేడి అల్పాహారం సాధ్యం కానప్పుడు స్థానికంగా లభించే చిక్కీలు, పండ్లు వంటి ఇతర పౌష్ఠిక పదర్ధాలను అందించవచ్చని సూచించింది. ♦తద్వారా పునాది స్థాయిలోనే అక్షరాస్యత మెరుగుపడుతుంది, ప్రారంభ బాల్య సంరక్షణకు వీలవుతుంది. ♦పాఠశాలస్థాయికి వచ్చేసరికి వారిలో మెరుగైన మేథోవికాసం ఏర్పడి పాఠశాల విద్య బలోపేతమవుతుంది. ♦అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించడంతో పాటు çఉపాధ్యాయ విద్యను మరింత బలోపేతం చేయాలని కూడా స్పష్టం చేసింది. ♦విద్యపై కేటాయించే నిధులను క్షేత్రస్థాయిలో సకాలంలో ఖర్చు చేయకపోవడం వల్ల కూడా లక్ష్యాల సాధనకు ఆటంకం కలిగిస్తున్నట్లుగా కేంద్రం గుర్తించింది. ♦నిధులు సద్వినియోగమయ్యేలా పాలనా ప్రక్రియల్లో మార్పులు చేయడం, క్రమబద్ధీకరించడం ద్వారా బడ్జెట్ మిగిలిపోకుండా చూడవచ్చని పేర్కొంది. ♦ఇందుకోసం కార్యక్రమాలు అమలు చేసే ఏజెన్సీలకు ‘జస్ట్ ఇన్ టైమ్’ అనే కొత్త విధానంతో నిధుల విడుదల నిబంధనలు వర్తింపచేస్తారు. ♦ప్రభుత్వ వనరులను సమర్థవంతంగా ఉపయోగించడం, నిధుల మిగులును నివారించడం దీని లక్ష్యం. ♦పారదర్శకత,సాధికార, స్వయంప్రతిపత్తి ఉండే సంస్థలను గుర్తించి వాటికి ఆయా కార్యక్రమాల అమలును అప్పగించాలి. ఇందుకు ప్రయివేటు ఏజెన్సీలను గుర్తించి ప్రోత్సహించడం మంచిదని సూచించింది. ♦వీటితో పాటు విద్యారంగంలో దాతలను ప్రోత్సహించడం ద్వారా వారినుంచి ఆర్థిక సహకారాన్ని పొందడంపై దృష్టి పెట్టాలని.. పబ్లిక్ బడ్జెట్ కంటే ఈ తరహా కార్యకలాపాలకు మద్దతు ఇచ్చేలా ప్రభుత్వ సంస్థలు చొరవ తీసుకోవాలని వివరించింది. -
ఎన్ఈపీ 2020: తమిళనాడు కీలక నిర్ణయం
చెన్నై: కేంద్రం ఇటీవల ప్రకటించిన నూతన విద్యా విధానం(ఎన్ఈపీ)–2020లోని మూడు భాషల విధానం తమను వేదనకు గురిచేసిందని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి విచారం వ్యక్తం చేశారు. తమ రాష్ట్రంలో ఈ విధానాన్ని అమలు చేయబోమని స్పష్టం చేశారు. మూడు భాషల విధానాన్ని పునఃసమీక్షించాలని, దీని అమలుపై రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం విజ్ఞప్తి చేశారు. 1965లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హిందీని అధికార భాషగా గుర్తించినపుడు తమిళనాడు విద్యార్థులు చేసిన ఉద్యమాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర నిర్ణయంతో తాము ఏకీభవించలేమని, ద్విభాషా(తమిళ్, ఇంగ్లీష్)ను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు సైతం ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు.(పాఠశాల, ఉన్నత విద్యలో భారీ సంస్కరణలు) అదే విధంగా మాజీ ముఖ్యమంత్రులు ఎంజీ రామచంద్రన్, జయలలిత, సీఎన్ అన్నాదురై రాష్ట్రాలపై హిందీయేతర భాషా రాష్ట్రాలపై ఆ భాషను బలవంతంగా రుద్దవద్దని తీసుకున్న నిర్ణయాల గురించి పునరుద్ఘాటించారు. కాగా తాము ఏ రాష్ట్రంపై, ఏ భాషను రుద్దే ప్రయత్నం చేయడం లేదని కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ట్వీట్ చేసిన మరుసటి రోజే పళనిస్వామి తన ప్రభుత్వం తమ నిర్ణయం ప్రకటించడం గమనార్హం.ఇక విద్యా వ్యవస్థలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుడుతూ ఎన్ఈపీ–2020కు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. (జాతీయ విద్యావిధానంపై కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు) ఇందులో భాగంగా ప్రి స్కూలు నుంచి సెకండరీ స్థాయి వరకు అన్ని స్థాయిలలోనూ పాఠశాల విద్యను సార్వత్రికంగా అందుబాటులో ఉంచాలని పేర్కొంది. అంతేగాక కనీసం 5వ తరగతి వరకు మాతృభాష, స్థానిక భాష, ప్రాంతీయ భాషను బోధన మాధ్యమంగా ఉంచాలని.. 8వ తరగతి నుంచి ఆపై వరకూ దీనిని కొనసాగించవచ్చని సూచించింది. మూడు భాషల(హిందీ, ఇంగ్లిష్, ప్రాచుర్యం పొందిన ఇతర భాష(దక్షిణాది భాష) విధానంలో భాగంగా పాఠశాలలోని అన్ని స్థాయిల్లో విద్యార్థులు సంస్కృతాన్ని ఐచ్ఛిక సబ్జెక్టుగా ఎంచుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ విధానంపై తమిళనాడు ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రజలపై హిందీ, సంస్కృత భాషలు రుద్దేందుకు కేంద్ర సర్కారు చేస్తున్న ప్రయత్నమిదని, ఇందుకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఇతర పార్టీలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సైతం జట్టుకట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు. తాజా సంస్కరణలు మనుస్మృతికి మెరుగులు దిద్ధినట్లు ఉన్నాయంటూ విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో దిగి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తాము ద్విభాషా విధానానికే కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. ఇక తమిళనాడులో మాతృభాషపై మక్కువ, హిందీ భాషపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో హిందీ భాషను అధికార భాషగా గుర్తించే ప్రయత్నాలు చేయగా.. ఈ దక్షిణాది రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తడంతో అప్పటి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ కేంద్ర, హిందీయేతర రాష్ట్రాల మధ్య అనుసంధానానికై ఇంగ్లీష్ భాష వారధిగా ఉంటుందని హామీ ఇచ్చారు. -
కుష్బూకు హైకమాండ్ షోకాజ్ నోటీస్!?
సాక్షి, చెన్నై: నటి కుష్బూకు కాంగ్రెస్ హైకమాండ్ షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైందని సమాచారం. నటి కుష్బూను ఫైర్‌బ్రాండ్‌గా పేర్కొనవచ్చు. నటిగానే కాకుండా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకుంటున్నారీమె. ఆ మధ్య డీఎంకే నుంచి బయటకు వచ్చిన కుష్బూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రచార కర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వివాదాలకు కేంద్ర బిందువుగా మారే కుష్బూ ఆ మధ్య రజనీకాంత్ ఒక వేదికపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. దీంతో రజనీ వివరణ ఇచ్చారు. అప్పుడు కుష్బూ రజనీకాంత్‌కు మద్దతుగా నిలిచారు. తాజాగా మరో వివాదానికి తెరలేపారు. ఇటీవల ప్రధానమంత్రి మోదీ నూతన విద్యావిధానాన్ని ప్రవేశ పెట్టారు. దీన్ని కాంగ్రెస్ ప్రచార కర్త కుష్బూ స్వాగతిస్తూ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలను రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అంతే కాదు కుష్బూ బీజేపీలో ఉన్నత పదవి వస్తుందనే ఆశతో పార్టీని మారడానికి సిద్ధం అవుతున్నారనే ఆరోపణలను చేస్తున్నారు. దీనికి స్పందిచిన కుష్భూ తనకు పార్టీ మారే ఆలోచన లేదని, అదే విధంగా భావ ప్రకటన స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉందని పేర్కొన్నారు. (కమలం వైపు కుష్బూ చూపు) అదేవిధంగా తన వ్యాఖ్యలు పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉంటే రాహుల్‌గాందీకి క్షమాపణ చెప్పుకుంటానని, అంతే కానీ తాను తల ఆడించే రోబో బొమ్మగా ఉండలేనని ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా ప్రధాని మోదీకి మద్దతుగా వ్యాఖ్యలు చేసిన కుష్బూపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేఎస్.అళగిరి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకున్నట్లు, కుష్బూకు వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైనట్లు సమాచారం. (కేంద్ర నిర్ణయానికి ఖుష్భూ మద్దతు) -
ఉద్యోగ సృష్టికర్తలొస్తారు..
న్యూఢిల్లీ: ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్లు కాదు.. ఉద్యోగాలు ఇచ్చేవాళ్లను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం నూతన విద్యా విధానం–2020ని ప్రకటించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. శనివారం స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. విద్యార్థి ఏం నేర్చుకోవాలని కోరుకుంటున్నాడో అదే అందించడం కొత్త విద్యా విధానంలో భాగంగా ఉంటుందని వెల్లడించారు. ఇది కేవలం ఒక విధాన పత్రం కాదని, 130 కోట్ల మందికిపైగా ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం అని పేర్కొన్నారు. ‘ఇష్టం లేని సబ్జెక్టులను తమపై బలవంతంగా రుద్దుతున్నారని చాలామంది విద్యార్థులు భావిస్తున్నారు. ఆసక్తి లేని చదువులు చదవాలని వారిపై మిత్రులు, కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. దీనివల్ల విద్యార్థులు అక్షరాస్యులు అవుతారేమో గానీ వారికి ఉపయోగం మాత్రం ఉండదు. డిగ్రీలు సంపాదించినప్పటికీ ఆత్మవిశ్వాసం కొరవడుతుంది. ఇది వారి జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితిని సమూలంగా మార్చేయడమే నూతన విద్యా విధానం ఉద్దేశం’ అని మోదీ ఉద్ఘాటించారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ నాలుగో ఎడిషన్‌ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్వహించింది. ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలకు విద్యార్థులు పరిష్కార మార్గాలు చూపడమే దీని ఉద్దేశం. ఈ ఏడాది 243 సమస్యల పరిష్కారానికి 10 వేల మందికిపైగా పోటీపడ్డారు. విజేతలకు నగదు బహుమతి అందజేశారు. -
మీ శక్తిని ఎప్పటికీ విశ్వసిస్తాను: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : గత శతాబ్దాలలో భారతదేశం ఒక్కటే ఎక్కువ మంది ఉత్తమ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, సాంకేతిక వ్యవస్థాపకులను ప్రపంచానికి పరిచయం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ దేశాలకు భారతీయులు సేవలందిస్తున్నందుకు దేశ ప్రజానీకమంతా గర్వపడాలని వ్యాఖ్యానించారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో దేశం తన ప్రభావవంతమైన పాత్రను పోషించడానికి 21వ శతాబ్దం మరింత వేగంగా మారాలని అభిప్రాయపడ్డారు. ఈ ఆలోచనతో దేశంలో ఆవిష్కరణ, పరిశోధన, రూపకల్పన, అభివృద్ధి, వ్యవస్థాపకత కోసం అవసరమైన పర్యావరణ వ్యవస్థ వేగంగా తయారవుతోందని వ్యాఖ్యానించారు. (ఎన్ఈపీ 2020: చైనీస్ భాషపై సందిగ్దత!) 130 కోట్ల భారతీయుల ఆకాంక్షల ప్రతిబింభం స్మార్ట్ ఇండియా హ్యాకథన్ 2020 యొక్క గ్రాండ్ ఫినాలేలో శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ‘ఆన్లైన్ విద్య కోసం కొత్త వనరులను సృష్టించడం లేదా స్మార్ట్ ఇండియా హాకథాన్ వంటి ప్రచారాలు, భారతదేశ విద్య మరింత ఆధునికంగా, ఆధునికంగా మారాలని ప్రయత్నం, ఇక్కడ ప్రతిభకు పూర్తి అవకాశం లభిస్తుంది. దేశానికి కొత్త విద్యా విధానం కొద్ది రోజుల క్రితం ప్రకటించబడింది. 21వ శతాబ్దపు యువత ఆలోచన, అవసరాలు మరియు ఆశలు మరియు ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ విధానం రూపొందించబడింది. ఇది కేవలం విధాన పత్రం మాత్రమే కాదు, 130 కోట్లకు పైగా భారతీయుల ఆకాంక్షల ప్రతిబింభం. తల్లిదండ్రులు బంధువులు మరియు స్నేహితుల నుండి ఒత్తిడి వచ్చినప్పుడు, వారు ఇతరులు ఎంచుకున్న విషయాలను చదవడం ప్రారంభిస్తారు. దేశానికి చాలా పెద్ద జనాభా ఉంది. ఇందులో బాగా చదువుకున్నవారు ఉన్నారు, కాని వారు చదివిన వాటిలో చాలా వరకు అది వారికి నిజజీవితంలో పనిచేయదు. డిగ్రీల డిగ్రీ తర్వాత చేసికూడా తనలో సామర్ధ్యం కొరవడడం కారణంగా అసంపూర్ణత గల విద్యార్ధి అవుతాడు. కొత్త విద్యా విధానం ద్వారా ఈ విధానాన్ని మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, మునుపటి లోపాలను తొలగిస్తున్నారు. భారతదేశ విద్యా వ్యవస్థలో ఒక క్రమబద్ధమైన సంస్కరణ, విద్య యొక్క ఉద్దేశ్యం మరియు కంటెంట్ రెండింటినీ మార్చే ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పుడు విద్యా విధానంలో తీసుకువచ్చిన మార్పులు, భారతదేశ భాషలు మరింత పురోగమిస్తాయి, మరింత అభివృద్ధి చెందుతాయి. ఇది భారతదేశ జ్ఞానాన్ని పెంచడమే కాక, భారతదేశ ఐక్యతను కూడా పెంచుతుంది. భారతదేశంలోని గొప్ప భాషలకు ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. విద్యార్థులు తమ ప్రారంభ సంవత్సరాల్లో వారి స్వంత భాషలో నేర్చుకోవడం చాలా పెద్ద ప్రయోజనం. జీడీపీ ఆధారంగా ప్రపంచంలోని టాప్ 20 దేశాల జాబితాను పరిశీలిస్తే, చాలా దేశాలు తమ మాతృభాషలో విద్యను అందిస్తాయి. ఈ దేశాలు తమ దేశంలోని యువత ఆలోచన మరియు అవగాహనను అభివృద్ధి చేస్తాయి. ప్రపంచంతో కమ్యూనికేట్ చేయడానికి ఇతర భాషలకు కూడా ప్రాధాన్యత ఇస్తాయి. యువత శక్తిని నేను ఎప్పుడూ విశ్వస్తాను స్థానిక జానపద కళలు మరియు విభాగాలకు, శాస్త్రీయ కళ మరియు జ్ఞానానికి సహజమైన స్థలాన్ని ఇవ్వడం గురించి చర్చ జరుగుతుండగా, మరోవైపు టాప్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా భారతదేశంలో క్యాంపస్ తెరవడానికి ఆహ్వానించబడ్డాయి. దేశ యువత శక్తిని నేను ఎప్పుడూ విశ్వస్తాను. ఈ నమ్మకాన్ని ఈ దేశంలోని యువత మళ్లీ మళ్లీ నిరూపించబడింది. ఇటీవల కరోనాను రక్షించడానికి ఫేస్ షీల్డ్స్ కోసం డిమాండ్ పెరిగింది. 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో దేశ యువత ఈ డిమాండ్‌ను తీర్చడానికి ముందుకు వచ్చింది. దేశంలోని పేదలకు మెరుగైన జీవితాన్ని ఇవ్వడానికి ఈజీ ఆఫ్ లివింగ్ అనే మా లక్ష్యాన్ని సాధించడంలో మీ అందరి పాత్ర చాలా ముఖ్యమైనది. స్మార్ట్ ఇండియా హాకథాన్ ద్వారా గత సంవత్సరాల్లో దేశానికి అద్భుతమైన ఆవిష్కరణలు వచ్చాయి. ఈ హాకథాన్ తరువాత కూడా దేశ అవసరాలను అర్థం చేసుకుని, దేశాన్ని స్వావలంబనగా మార్చడానికి కొత్త పరిష్కారాలపై కృషి చేస్తూనే ఉంటారని యువతపై నమ్మకం ఉంది.’ అని మోదీ పేర్కొన్నారు. -
ఎన్ఈపీ 2020: చైనీస్ భాషపై సందిగ్దత!
న్యూఢిల్లీ: విద్యా వ్యవస్థలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుడుతూ నూతన విద్యావిధానం–2020 (ఎన్ఈపీ–2020)కు కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రి స్కూలు నుంచి సెకండరీ స్థాయి వరకు అన్ని స్థాయిలలోనూ పాఠశాల విద్యను సార్వత్రికంగా అందుబాటులో ఉంచాలని పేర్కొంది. అంతేగాక కనీసం 5వ తరగతి వరకు మాతృభాష, స్థానిక భాష, ప్రాంతీయ భాషను బోధన మాధ్యమంగా ఉంచాలని.. 8వ తరగతి నుంచి ఆపై వరకూ దీనిని కొనసాగించవచ్చని సూచించింది. మూడు భాషల విధానంలో భాగంగా పాఠశాలలోని అన్ని స్థాయిల్లో విద్యార్థులు సంస్కృతాన్ని ఐచ్ఛిక సబ్జెక్టుగా ఎంచుకోవచ్చని స్పష్టం చేసింది.(విద్యార్థుల అభీష్టమే ఫైనల్) అదే విధంగా ఇతర ప్రాచీన భాషలు, సాహిత్యం కూడా విద్యార్థులు ఎంపిక చేసుకోవడానికి వీలుంటుందని, 6–8 గ్రేడ్ ల మధ్య ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ కార్యక్రమం కింద విదేశీ భాషలను సెకండరీ విద్యాస్థాయిలో నేర్చుకోవచ్చని పేర్కొంది. అయితే గతేడాది విదేశీ భాషల విభాగంలో ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, జపనీస్, చైనీస్ భాషలను ముసాయిదాలో పేర్కొన్న కేంద్రం.. బుధవారం నాటి కేబినెట్ నిర్ణయంలో మాత్రం చైనీస్ భాష గురించి ప్రస్తావన తీసురాలేదు. అంతేగాక ఈ ఏడాది కొత్తగా కొరియన్, రష్యన్, పోర్చుగీస్, థాయ్ భాషలను ఈ జాబితాలో చేర్చారు. ఈ నేపథ్యంలో తాజా లిస్టు నుంచి చైనీస్(మాండరిన్)ను మినహాయించిన క్రమంలో ఈ భాషను నేర్చుకునేందుకు విద్యార్థులకు అవకాశం ఉందా లేదా అన్న విషయంలో సందిగ్దత నెలకొంది. (పాఠశాల, ఉన్నత విద్యలో భారీ సంస్కరణలు) మరోవైపు.. సరిహద్దుల్లో చైనా పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలోనే ఉద్దేశపూర్వంగా చైనీస్‌ను పక్కన బెట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా గల్వాన్ లోయలో జూన్‌లో చైనా ఆర్మీ భారత సైన్యాన్ని దొంగ దెబ్బ కొట్టి 20 మంది సైనికుల ప్రాణాలు బలిగొన్న విషయం విదితమే. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు చర్చలు జరుగుతున్నా డ్రాగన్ తన వైఖరి మార్చుకోకపోవడంతో భారత్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. చైనీస్ యాప్‌లతో జాతీయ భద్రత, సార్వభౌమాధికారానికీ, సమగ్రతకు నష్టం వాటిల్లే ప్రమాదముందని భావించి జూన్ 29న టిక్‌టాక్ సహా 59 యాప్‌లను నిషేధించిన కేంద్రం.. ఇటీవల మరో 47 యాప్‌లపై సైతం నిషేధం విధించింది. ఇక బుధవారం ప్రకటించిన నూతన విద్యావిధానంలో చైనీస్ భాషను మినహాయించడంపై కూడా ఉద్రిక్తతల ప్రభావం పడినట్లు కనబడుతోంది. -
కేంద్ర నిర్ణయానికి ఖుష్భూ మద్దతు
చెన్నై : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం-2020కి కాంగ్రెస్ నాయకురాలు ఖుష్భూ మద్దతు తెలిపారు. అయితే తన అభిప్రాయం పార్టీ వైఖరికి భిన్నమైదని కూడా స్పష్టం చేశారు. ఒక సిటిజన్‌గా మాత్రమే ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్టు తెలిపారు. ‘నూతన విద్యా విధానం-2020పై నా వైఖరి.. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకం. ఇందుకు రాహుల్ గాంధీకి నేను క్షమాపణలు చెబుతున్నాను. ప్రతిదానికి తలాడించే రోబోలా కాకుండా.. నిజం మాట్లాడాను. ప్రతీది మన నాయకుడి అంగీకారం గురించి కాకూడదు.. పౌరుడిగా మన అభిప్రామాన్ని ధైర్యంగా చెప్పగలగాలి’ అని ఖుష్భూ పేర్కొన్నారు. (ప్రముఖ క్రీడాకారులు.. డిప్యూటీ డైరెక్టర్లుగా నియామకం) అయితే ఆమె ట్వీట్‌పై పలువురు కాంగ్రెస్ సానుభూతిపరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్క ట్వీట్‌తో తను పెద్ద దుమారాన్నే చూశానని ఖుష్భూ అన్నారు. అంతకు ముందు కూడా సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమె మద్దతు తెలిపారు. నూతన విద్యా విధానం-2020 అనేది స్వాగతించదగినదని పేర్కొన్నారు. (రియాపై జేడీయూ నేత సంచలన ఆరోపణలు) -
విద్యార్థుల అభీష్టమే ఫైనల్
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదించిన నూతన విద్యా విధానం కేవలం మార్గదర్శకమే తప్ప విధిగా అమలుచేయాలన్న విధానపత్రం కానేకాదని న్యాయనిపుణులు, విద్యారంగ ముఖ్యులు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థి కేంద్రంగా, విద్యార్థి అభీష్టం మేరకు మాత్రమే ఇది అమలుకావాల్సి ఉంటుందన్నది కొత్త విధానం సారాంశంగా స్పష్టమవుతోందని వారంటున్నారు. కొత్త విద్యా విధానం ద్వారా కేంద్రం మాతృభాషలో బోధనను తప్పనిసరి చేసిందంటూ కొన్ని పత్రికలు గురువారం ప్రచురించాయి. అయితే, న్యాయనిపుణులు మాత్రం అలా ఎక్కడా కేంద్రం చెప్పలేదని స్పష్టం చేస్తున్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలుకాబోదన్నట్లుగా కూడా ఆయా పత్రికలు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ కథనాలు ప్రచురించడాన్ని వారు తప్పుబడుతున్నారు. వారేమంటున్నారంటే.. ఏ విధానాన్నీ రుద్దే పరిస్థితి ఉండదు ‘జాతీయ విద్యా విధానం అన్నది మార్గదర్శక సూత్రాలు కలిగిన డాక్యుమెంట్ మాత్రమే. అది ప్రతి రాష్ట్రానికీ అన్వయించే పరిస్థితులు, పాటించే పరిస్థితులు ఉంటే.. పాటించవచ్చు. రాష్ట్రాల పరిస్థితులు మేరకు, వారి వారి ఆకాంక్షల ప్రకారం దీన్ని పాటించవచ్చు. విద్య అన్నది కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్నందున కొత్త విద్యావిధానం అమలుకావాలంటే రాష్ట్రాల తోడ్పాటు కూడా అవసరమని కేంద్రం అందులో స్పష్టంగా చెప్పింది. అందువల్ల ఎవ్వరి మీద కూడా దీన్ని బలవంతంగా రుద్దజాలమని కేంద్రం చెప్తోంది. కొత్త విద్యావిధానంలో ఇచ్చిన సూచనలు అన్నీ కూడా విద్యార్థుల అభీష్టాల మీద ఆధారపడి ఉంటాయి. ప్రైవేటు స్కూళ్లలోనూ తెలుగు మీడియం పెట్టాలని ఇటీవల ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేస్తే దాన్ని డివిజన్ బెంచ్ కొట్టేసింది. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల హక్కులకు భంగం కలిగించలేమని చెప్పింది. అంటే.. కొత్త విద్యావిధానం అన్నది సాధ్యాసాధ్యాల మీద ఆధారపడి ఉంటుంది’.. అని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం రాజ్యాంగ నిపుణుడు ఒకరు వ్యాఖ్యానించారు. తప్పనిసరి కానే కాదు ‘ఏ పత్రంలోనైనా సాధ్యమైనంత వరకు, సాధ్యమైతే అని పేర్కొంటే అదెప్పుడూ తప్పనిసరి (మేండేటరీ) కాదు. కొత్త విధానంలో కూడా మాధ్యమం విషయంలో ‘యాజ్‌పార్ యాజ్ ప్రాక్టికబుల్’ అని పేర్కొన్నారు. ఆంగ్ల మాధ్యమం విషయంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కూడా మాధ్యమం మాతృభాషలోనే ఉండాలన్నది మేండేటరీ కాదు అది మార్గదర్శకమే అని హైకోర్టు కూడా స్పష్టంచేసింది. కానీ, విద్యార్థుల అభీష్టం మేరకు మాధ్యమాన్ని అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఆ ప్రకారమే ప్రభుత్వం మాధ్యమంపై విద్యార్థుల అభిప్రాయాన్ని కోరితే 96 శాతానికి పైగా ఆంగ్ల మాధ్యమానికే ఆప్షన్ ఇచ్చారు. తెలుగు మీడియంను కోరుకున్న వారు 3.05 శాతం మంది ఉండగా ఇతర భాషా మాధ్యమాన్ని కోరుకున్న వారు 0.78 శాతం మంది ఉన్నారు. రాష్ట్రంలో కూడా విద్యార్థులు కోరుకున్న మాధ్యమమే అమల్లోకి వస్తుంది’.. అని మరో న్యాయనిపుణుడు అభిప్రాయపడ్డారు. దేనినీ రుద్దడంలేదని కేంద్రం స్పష్టీకరణ కేంద్రం ఒక పాలసీ పెట్టాలంటే దాన్ని ఎన్ఫోర్సు చేయదు. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతోనే చేస్తుంది. ఇది అందరూ భాగస్వాములై అమలుచేయాల్సిన కార్యక్రమం తప్ప ఏదో ఒక ప్రభుత్వం ద్వారా అయ్యేది కాదు. నూతన విద్యావిధానం డాక్యుమెంటులో కూడా తాము ఏ భాషనూ రుద్దబోమని కేంద్రం చెప్పింది. ఆయా రాష్ట్రాలు సాధ్యాసాధ్యాలను చూసుకుని అమలుచేయాలని కేంద్రం సూచించింది. ముఖ్యంగా విద్యార్థి అభీష్టం ఏమిటో చూడమని స్పష్టంచేసింది.’ అని విద్యారంగ నిపుణుడు ఒకరు చెప్పారు. సీఎం వైఎస్ జగన్ అమలుచేయనున్న అంశాలే కొత్త విధానంలోనూ.. రాష్ట్ర పాఠశాల విద్య, ఉన్నత విద్యాశాఖ అధికారులకు సీఎం వైఎస్ జగన్ పలు సమావేశాల్లో సూచించిన అంశాల్లో కొన్ని కేంద్ర నూతన విద్యావిధానంలో ఉండడం విశేషం. అవి.. ► పాఠశాల విద్యలో నర్సరీ, పీపీ–1, పీపీ–2లను స్కూళ్లకు అనుసంధానం చేయాలని ఇంతకుముందే అధికారులను ఆదేశించి కార్యాచరణ చేపట్టారు. ► నూతన విద్యావిధానంలో పేర్కొన్న లెర్నింగ్ టు లెర్న్ అనేది ఇంతకుముందు అధికారుల సమావేశాల్లో సీఎం సూచించారు. ► పాఠశాల విద్యలో సెమిస్టర్ విధానం గురించి కూడా సీఎం ఇంతకుముందే అధికారులకు సూచనలు చేశారు. దాని ప్రకారం అధికారులు చర్యలు కూడా ప్రారంభించారు. ► డిగ్రీని నాలుగేళ్లుగా చేస్తూ ఒక ఏడాది ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసే ప్రణాళికను రూపొందింపజేశారు. యూజీసీ.. మూడేళ్లే డిగ్రీ ఉండాలంటే మూడేళ్లలోనే 10 నెలల పాటు ఇంటర్న్‌షిప్ ఉండేలా ప్రణాళిక సిద్ధంచేశారు. ► రాష్ట్రంలో పాఠశాల, ఉన్నత విద్యల నియంత్రణ, పర్యవేక్షణల కమిషన్లను ఏర్పాటుచేశారు. ► ఉన్నత విద్య పాఠ్య ప్రణాళికను పూర్తిగా మార్పు చేయించి అవుట్‌కమ్ బేస్డ్ పాఠ్య ప్రణాళికను తయారుచేయించారు. ► క్రెడిట్ బ్యాంకు అని నూతన విద్యావిధానంలో ఉండగా దానిని ఇంతకు ముందే రాష్ట్రం పెట్టింది. పేదల జీవితాల్లో వెలుగులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంతో పేద, బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. ఏపీలో దాని అమలు పేద, మధ్య తరగతి విద్యార్థులకు దన్నుగా నిలుస్తోంది. – డాక్టర్ జి.మమత, అసిస్టెంట్ ప్రొఫెసర్, జేఎన్టీయూ అనంతపురం ఇంగ్లిష్ వచ్చిన వారికే ఉద్యోగాలు ప్రస్తుతం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ పిల్లలు ఇంగ్లిష్ మీడియం కావాలని కోరుతున్నారు. దాని ప్రాధాన్యతను తల్లిదండ్రులు తెలుసుకోవడంవల్లే తమ పిల్లల్ని ఆ మాధ్యమంలో చదివించాలనే నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు. – పి. అశోక్‌కుమార్ రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, తాటిచెర్ల గ్రామం, అనంతపురం రూరల్ మండలం ఆంగ్ల మాధ్యమాన్ని కొనసాగిస్తే మంచిది రాష్ట్రంలో తల్లిదండ్రులు, విద్యార్థులు ఎక్కువమంది ఆంగ్ల మాధ్యమాన్ని కోరుకుంటున్నందున ఎవరికీ నష్టం జరగకుండా ఆంగ్ల మాథ్యమాన్ని కూడా కొనసాగిస్తే మంచిది. – జోసెఫ్ సుధీర్‌బాబు, ఎస్టీయూ అధ్యక్షుడు కేంద్ర విధానం రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనను ప్రతిబింబిస్తోంది నూతన విద్యావిధానంలో 3–6 సం.ల వయస్సున్న విద్యార్థులను ప్రీ ప్రైమరీ దశ కింద చేర్చడం చూస్తుంటే ఇదివరకే మన సీఎం చెప్పిన ప్రీ ప్రైమరి–1.. ప్రీ ప్రైమరీ–2 లకు పోలి ఉన్నట్లుగా ఉంది. ఇది పరిణితి చెందిన మన ప్రభుత్వ ఆలోచనకు నిదర్శనం. – కోమటిరెడ్డి రెడ్డి శివశంకర్, జి. చంద్రశేఖర్.. మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అట్టడుగు వర్గాలకు ఆంగ్ల బోధనతోనే ప్రయోజనం ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి నుంచే ఇంగ్లిష్ బోధన ఉంటే అట్టడుగు జాతులకు ఎంతో ప్రయోజనం. ప్రపంచంలో ఎక్కడ ఉద్యోగం చేయాలన్నా ఇంగ్లిష్ ఎంతో అవసరం. సీఎం వైఎస్ జగన్ ముందుచూపుతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. – పీటీ నరసింహారెడ్డి, రిటైర్డ్ ఎంఈఓ. అనంతపురం జిల్లా ఆంగ్ల మాధ్యమమే కావాలి నూతన విద్యావిధానంలో మాధ్యమాన్ని ఎంచుకునే స్వేచ్ఛను విద్యార్థికిచ్చారు. రాష్ట్రంలో తల్లిదండ్రుల నుంచి ఇటీవల సేకరించిన అభిప్రాయాల్లో 96 శాతం ఆంగ్లమాద్యమమే కావాలని కోరారు. మేమంతా మా ఆంగ్ల మాధ్యమ బోధననే కోరుకుంటున్నాం. – చింతల వెంకటసతీష్, 2వ తరగతి బాలిక తండ్రి, విజయనగరం ఆంగ్లంతోనే బడుగులకు న్యాయం ప్రాథమిక విద్య నుంచి ప్రభుత్వం అమలుచేస్తున్న ఆంగ్ల మాధ్యమం బహుజన వర్గాలకు అద్వితీయ అవకాశం. ఇంగ్లిష్ మీడియంలో చదవకపోవడంవల్ల ఇప్పటికీ నాకు దానిపై పట్టులేదు. రానున్న తరానికి ఆ సమస్య రాకూడదు. – బంకపల్లి శివప్రసాద్, టీచర్ ఎంపీపీఈ స్కూల్, గంట్యాడ మండలం, విజయనగరం జిల్లా ఆంగ్ల మాధ్యమంతోనే భవితకు భరోసా ఆంగ్లంపై పట్టులేని కారణంగా ఎంతోమంది తమ అవకాశాలను చేజార్చుకుంటున్నారు. ఆంగ్ల మాధ్యమం కోరుకున్న ప్రతి పిల్లవాడు ఆంగ్లంలో విద్యను అభ్యసించే అవకాశం రావాలి. తద్వారా భవితకు భరోసా ఉంటుంది. – గెద్ద సత్యన్నారాయణ, 4వ తరగతి విద్యార్ధి తండ్రి, బొండపల్లి, విజయనగరం జిల్లా విద్యార్థి కోరుకున్న మాధ్యమమే మంచిది నూతన విద్యావిధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించినా అమలులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పరిస్థితులు, వనరులు దృష్టిలో పెట్టుకుని అమలుచేస్తాయి. రాష్ట్రంలో 96 శాతానికి పైగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమం కోరుకున్నారు. ఆ మేరకు ఆంగ్ల మాధ్యమం పెడుతూనే ఇతర మాధ్యమాలు కోరుకున్న వారికి ఉంటే అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి.– కత్తి నరసింహారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఇంగ్లిష్ అనివార్యం ప్రతి విద్యార్థి ఆంగ్లంలో భావవ్యక్తీకరణ నైపుణ్యాలు పెంపొందించుకోవడం అనివార్యం. ప్రాథమిక స్థాయిలో నేర్చుకునే భాష జీవితాంతం ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడాలంటే ఇంగ్లిష్‌లో పట్టు సాధించాలి. –డాక్టర్ మాధవి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎస్కేయూ -
ఆచరణే గీటురాయి
ప్రాథమిక విద్య మొదలుకొని విశ్వవిద్యాలయ విద్య వరకూ అన్ని స్థాయిల్లోనూ విస్తృతమైన సంస్కరణలు తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన నూతన విద్యా విధానం ముసాయిదాపై కేంద్ర మంత్రి వర్గం బుధవారం ఆమోదముద్ర వేసింది. సమకాలీనత సమృద్ధిగా, నైపుణ్యమే ఇరుసుగా వుంటుందని చెబుతున్న ఈ విద్యావిధానం ప్రధాన లక్ష్యాలు– స్థూల నమోదు నిష్పత్తి(జీఈఆర్)ని ఇప్పుడున్న 26 శాతం నుంచి 50 శాతానికి తీసుకెళ్లడం, జీడీపీలో ఇప్పుడు 4 శాతంగా వున్న విద్యారంగ కేటాయింపుల్ని 6 శాతానికి పెంచడం. 2030 కల్లా జిల్లాకొకటి చొప్పున బహుళ శాస్త్రాల విద్యా సంస్థ నెలకొల్పాలన్నది కూడా ఈ ముసాయిదా ధ్యేయం. తొలిసారి 2014లో అధికారంలోకి వచ్చినప్పటినుంచి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ దేశంలో విద్యా వ్యవస్థను సమూల ప్రక్షాళన చేయాలన్న సంకల్పం వుంది. ఇందుకోసం టీఎస్ఆర్ సుబ్రమణియన్ ఆధ్వర్యంలో 2015లో ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీ 2016లో నివేదిక సమర్పించాక ఆ మరుసటి ఏడాది ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ సారథ్యంలో 8మందితో కమిటీ ఏర్పాటైంది. అది 2018 డిసెంబర్లో 484 పేజీల నివేదికను సమర్పించింది. దానిపై అభిప్రాయాలు చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వం అందరినీ కోరింది. ఆనాటినుంచీ నూతన విద్యావిధానం ముసాయిదాపై అనేకానేక చర్చలు జరిగాయి. మొత్తంగా కేంద్రానికి 2 లక్షల సూచనలు అందాయంటున్నారు. వాటి ఆధారంగా తుది ముసాయిదాను రూపొందించారు. కస్తూరి రంగన్ నివేదిక త్రిభాషా సూత్రంకింద హిందీ బోధనను తప్పనిసరి చేయాలన్న సిఫార్సు చేయడంపై దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. అయితే తాజా ముసాయిదాలో వివాదాస్పదమైన ఈ నిబంధనను తొలగించారు. ఏ రాష్ట్రంపైనా ఏ భాషనూ రుద్దేదిలేదని తుది ముసాయిదా చెబుతోంది. అలాగే ప్రాథమిక విద్య మాతృభాషలోనే వుండాలని కూడా ఈ విధానం శాసించలేదు. ‘కుదిరినమేర కనీసం అయిదో తరగతి వరకూ...సాధ్యమైతే ఎనిమిదో తరగతి వరకూ లేదా అంతకుమించి మాతృభాషలో బోధన వుండాలని సూచించింది. ఈ నిబంధన ప్రభుత్వ పాఠశాలలకూ, ప్రైవేటు పాఠశాలలకూ సమంగా వర్తిస్తుందని తెలిపింది. అలావుండేట్టయితే బోధనా మాధ్యమంపై ఎవరికీ అభ్యంతరం వుండదు. ప్రస్తుతం వున్న 10+2+3 విధానానికి బదులు 5+3+3+4 విధానం అమల్లోకొస్తుంది. పిల్లలకు భిన్న భాషలు నేర్చుకునే సౌలభ్యం కల్పించడం కూడా ఈ విధానంలో మెచ్చదగ్గ అంశం. విద్యావిధానం అనేది ఎప్పుడూ సున్నితమైన అంశమే. ఆ విధానం చెబుతున్నదేమిటన్న చర్చతోపాటు అది చెప్పకుండా వదిలేసిందేమిటో కూడా చర్చకొస్తుంది. సెకండరీ స్థాయి వరకూ సార్వత్రిక విద్య వుండాలని తాజా ముసాయిదా నిర్దేశిస్తున్నది. కనుక ఆ తర్వాత ఉన్నత స్థాయి విద్యను సార్వత్రికం చేయడం ప్రభుత్వ ఎజెండాలో లేదని అర్ధమవుతుంది. 2010లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం విదేశీ విద్యాసంస్థల బిల్లు తీసుకొచ్చినప్పుడు విపక్షంలో వుండి బీజేపీ దాన్ని గట్టిగా వ్యతిరేకించింది. అవి వసూలు చేసే భారీ ఫీజుల వల్ల విద్యకయ్యే ఖర్చు తడిసిమోపెడవుతుందని, జనాభాలో చాలా తక్కువమందికి మాత్రమే అది లభ్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. పైగా మన విశ్వవిద్యాలయాల అధ్యాపకులకు అత్యధిక వేతనాల ఆశ చూపి తన్నుకుపోతే అక్కడి విద్య దెబ్బతింటుందని హెచ్చరించింది. కానీ తాజా ముసాయిదా విదేశీ విశ్వవిద్యాలయాలకు దారులు పరుస్తోంది. వీటికి వర్తించబోయే నియమనిబంధనలేమిటో చూడాలి. ఈ ముసాయిదాలో మెచ్చదగ్గ అంశాలున్నాయి. డిగ్రీ స్థాయి విద్యను నాలుగు సంవత్సరాలకు మార్చారు. ఒకసారంటూ చేరాక జైలు శిక్ష అనుభవించినట్టు అందులోనే వుండిపోనవసరం లేకుండా ఎప్పుడైనా నిష్క్రమించే అవకాశం కల్పించారు. ఒక సంవత్సరం మాత్రమే చదివి నిష్క్రమించేవారికి సర్టిఫికెట్, రెండేళ్ల తర్వాత నిష్క్రమించదల్చుకున్నవారికి డిప్లొమా, మూడేళ్ల చదువు పూర్తి చేసి ఉద్యోగంవైపు వెళ్లదల్చుకున్నవారికి బ్యాచులర్ పట్టా ఇస్తారు. ఎంపిక చేసుకున్న సబ్జెక్టులో పరిశోధన చేయదల్చుకున్నవారు నాలుగో సంవత్సరం కొనసాగించవచ్చు. అయిదేళ్ల తర్వాత అయితే మాస్టర్స్‌తో కలిపి ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ డిగ్రీ అందజేస్తారు. ఇప్పుడున్నట్టుగాకాక అభిరుచినిబట్టి సబ్జెక్టులు ఎంపిక చేసుకునే స్వేచ్ఛను విద్యార్థులకు ఇవ్వబోతున్నారు. అకౌంట్స్‌తో పాటు కెమిస్ట్రీ లేదా చరిత్రతోపాటు గణితం...ఇలా వేర్వేరు కాంబినేషన్లతో డిగ్రీ చేయొచ్చు. పరిశోధనా రంగానికి ప్రాముఖ్యతనీయడం, అందుకోసం అమెరికాలోవలే నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం హర్షించదగ్గది. ప్రస్తుత విధానం బట్టీ పట్టడాన్నే ప్రోత్సహిస్తోంది. విద్యార్థి తెలివితేటల్ని, అవగాహన శక్తిని కాక జ్ఞాపకశక్తిని ప్రమాణంగా తీసుకుంటోంది. కింది స్థాయినుంచీ విద్యార్థుల్లో పరిశీలనా సామర్థ్యాన్ని పెంపొందిస్తే ఉన్నతస్థాయికి చేరేసరికి వారి దృష్టి పరిశోధనల వైపు మళ్లుతుంది. వినూత్న ఆవిష్కరణలకు దారులు పరుస్తుంది. అయితే ఆదర్శాలు ఎంత బలమైనవైనా వాటికి దీటైన ఆచరణ వుండాలి. మన దేశంలో పరిశోధనలకు ప్రధాన ఆటంకంగా వుంటున్నది నిధులే. వాటిని అందుబాటులో వుంచగలిగితేనే పరిశోధనలు విస్తృతమవుతాయి. అసలు మన విద్యారంగానికి ఏటా బడ్జెట్లో చేసే కేటాయింపులే అరకొరగా వుంటున్నాయి. జీడీపీలో మరో 2 శాతం మొత్తాన్ని అదనంగా పెంచుతామనడం ఏమూలకూ చాలదు. అలాగే యూజీసీకి బదులుగా ఏర్పడే వ్యవస్థనుంచి విద్యాసంస్థలకు నిధుల కేటాయింపు ఎలావుంటుందో చూడాలి. కొత్త విధానం మన ఫెడరల్ వ్యవస్థకు అనుగుణంగా వుండటం, సామాజిక న్యాయం అమలుకావడం, అట్టడుగు కులాల ప్రయోజనాలు పరిరక్షించడం అత్యవసరం. గాంధీజీ చెప్పినట్టు వ్యక్తిత్వాన్ని పెంపొందించే విద్య, విలువలను నేర్పించే విద్య ఏ తరానికైనా అవసరం. అది నూతన విద్యావిధానం సాకారం చేయాలి. -
పాఠశాల, ఉన్నత విద్యలో భారీ సంస్కరణలు
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: నూతన విద్యావిధానం–2020 (ఎన్ఈపీ–2020)కి బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యా వ్యవస్థలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుడుతూ ఈ విధానాన్ని రూపొందించారు. 34 సంవత్సరాల క్రితం నాటి జాతీయ విద్యా విధానం 1986 స్థానంలో ఇది రూపుదిద్దుకుంది. అందుబాటులో అందరికీ నాణ్యమైన విద్య ప్రధాన లక్ష్యంగా, 2030 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా దీన్ని రూపొందించారు. పాఠశాల, కళాశాల విద్యను 21వ శతాబ్దపు అవసరాలకు అనువైనదిగా తీర్చిదిద్దడంపై ఈ విధానం ప్రధానంగా దృష్టి పెట్టింది. సామాజికంగా, ఆర్ధికంగా అణగారిన వర్గాల వారిపై ఈ విధానంలో ప్రత్యేక దృష్టి పెట్టారు. జీడీపీలో విద్యారంగ కేటాయింపులు కనీసం ఆరు శాతానికి చేర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల విద్యకు ప్రమాణాలు: ళి విద్యా సంబంధ, విధాన నిర్ణయాలకు సంబంధించి స్పష్టమైన ప్రత్యేక వ్యవస్థ ఉండాలని ఈ విధానం స్పష్టం చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పాఠశాల ప్రమాణాల రాష్ట్ర అథారిటీ(ఎస్ఎస్ఎస్ఏ)ని ఏర్పాటు చేసుకుంటాయి. 2035 నాటికి 50 శాతానికి జీఈఆర్: ళి ఉన్నత విద్యలో దేశంలో స్థూల ఎన్రోల్మెంట్ నిష్పత్తి (జీఈఆర్)ని 26.3 శాతం( 2018) నుంచి 2035 నాటికి 50 శాతానికి చేర్చాలని జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యంగా నిర్ణయించుకుంది. కొత్తగా 3.5 కోట్ల సీట్లను జత చేయనున్నారు. ఎంఫిల్ కోర్సులను తొలగించాలని నిర్ణయించారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ► ఉన్నత విద్యా వ్యవస్థ పాలన అవసరాల కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయనున్నారు. వైద్య విద్య, న్యాయ విద్యకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంటుంది. దీనికి నాలుగు స్వతంత్ర విభాగాలు ఉంటాయి. అవి నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్, జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (జిఇసి), హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్, నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్. ► ఉపాధ్యాయ విద్యకు సంబంధించి, సమగ్రమైన నూతన జాతీయ కరికులమ్ ఫ్రేమ్ వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్‌ను 2021 నాటికి రూపొందించనున్నారు. 2030 నాటికి బోధనకు నాలుగు సంవత్సరాల బీఈడీ డిగ్రీ కనీస అర్హత అవుతుంది. నాసిరకం ఉపాధ్యాయ విద్యా సంస్థలపై కఠిన చర్యలుంటాయి. ► ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్దులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటారు. నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్‌ను విస్తరింపచేసి స్కాలర్షిప్ పొందిన విద్యార్ధుల ప్రగతిని గమనిస్తారు. ప్రైవేటు విద్యాసంస్థలు ఎక్కువ ఫ్రీషిప్, స్కాలర్షిప్లను తమ విద్యార్థులకు అందించేలా చూస్తారు. ముఖ్యాంశాలు.. ► ప్రి స్కూలు నుంచి సెకండరీ స్థాయి వరకు అన్ని స్థాయిలలోనూ పాఠశాల విద్యను సార్వత్రికంగా అందుబాటులో ఉంచాలి. వినూత్న విద్యా కేంద్రాలు, మౌలికసదుపాయాల మద్దతుతో మధ్యలోనే బడి మానేసిన దాదాపు 2 కోట్లమందిని మళ్లీ బడిబాట పట్టించాలి. ► పూర్వ ప్రాథమిక విద్యపై దృష్టిపెడుతూ 10+2 విద్య స్థానంలో 5+3+3+4 సంవత్సరాల విద్యను తీసుకురానున్నారు. 3–8, 8–11, 11–14, 14–18 సంవత్సరాల విద్యార్ధులు దీనిపరిధిలోకి వస్తారు. ► పిల్లల మానసిక వికాసానికి అనువైన దశగా అంతర్జాతీయంగా గుర్తించిన నేపథ్యంలో ఇకపై 3–6 సంవత్సరాల వయసుగల వారు పాఠశాల విద్యా ప్రణాళిక కిందికి వస్తారు. ఈ విధానంలో మూడు సంవత్సరాలు అంగన్ వాడీ లేదా ప్రీ స్కూల్‌తో మొత్తం 12 సంవత్సరాల పాఠశాల విద్య ఉంటుంది. ► పాఠశాల స్థాయిలో విద్యార్థుల సమగ్ర వికాసాన్ని దృష్టిలో ఉంచుకుని వారిని 21 వ శతాబ్దపు నైపుణ్యాలకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఆలోచన స్థాయిని పెంచేందుకు, కీలక అంశాలను నేర్చుకునేందుకు పాఠ్యాంశాలను తగ్గిస్తారు. ప్రయోగాత్మక అభ్యాసానికి వీలు కల్పించి దానిపై దృష్టిపెడతారు. సబ్జెక్టుల ఎంపికలో విద్యార్ధులకు స్వేచ్చ ఉంటుంది. ఆర్ట్స్, సైన్సు మధ్య కఠిన విభజన ఏదీ ఉండదు. వృత్తి విద్యను 6 వ గ్రేడ్ నుంచే ఇంటర్న్‌షిప్‌తో పాటు ప్రారంభిస్తారు. ► కొత్త సమగ్రమైన నేషనల్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (ఎన్సీఎఫ్ఎస్ఈ– 2020–21)ను ఎన్సీఈఆర్టీ అభివృద్ధి చేయనుంది. ళీ మాతృభాష, స్థానిక భాష, ప్రాంతీయ భాషను బోధన మాధ్యమంగా కనీసం 5వ తరగతి వరకు ఉంచాలని, 8వ తరగతి, ఆపై వరకూ దీనిని కొనసాగించవచ్చని సూచించారు. సంస్కృతాన్ని పాఠశాలలోని అన్ని స్థాయిల్లో విద్యార్థులు ఐచ్ఛికంగా మూడు భాషల విధానంలో భాగంగా ఎంచుకోవచ్చని స్పష్టం చేసింది. ► ఇతర ప్రాచీన భాషలు, సాహిత్యం కూడా విద్యార్థులు ఎంపిక చేసుకోవడానికి వీలుంటుంది. 6–8 గ్రేడ్ ల మధ్య ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమం కింద విదేశీ భాషలను సెకండరీ విద్యాస్థాయిలో నేర్చుకోవచ్చు. ళీ వెనుకబడిన ప్రాంతాలు, వర్గాల కోసం స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్లను, జెండర్ ఇంక్లూజన్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తారు. దివ్యాంగులైన పిల్లలు రెగ్యులర్ పాఠశాల ప్రక్రియలో ఫౌండేషన్ స్థాయి నుంచి ఉన్నత విద్యవరకు పూర్తి స్థాయిలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తారు. హెచ్చార్డీ కాదు.. విద్యా శాఖ మానవ వనరుల అభివృద్ధి(హెచ్చార్డీ) మంత్రిత్వ శాఖ పేరును మళ్లీ విద్యా శాఖగా మారనుంది. సంబంధిత ప్రతిపాదనకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నూతన విద్యా విధానం సిఫారసుల్లో మంత్రిత్వ శాఖ పేరు మార్పు కూడా ఒకటి. 1985లో రాజీవ్ గాంధీ హయాంలో విద్యా శాఖ పేరును హెచ్చార్డీ శాఖగా మార్చరు. -
విద్యా విధానంలో భారీ మార్పులు
-
విద్యా విధానంలో భారీ మార్పులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు నూతన జాతీయ విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే మానవ వనరుల శాఖ పేరును విద్యా శాఖగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. నూతన విద్యా విధానంలో భాగంగా మూడేళ్ల నుంచి 18 ఏళ్ల వరకు విద్యను కేంద్రం తప్పనిసరి చేసింది. విద్యార్థులపై కరికులమ్ భారం తగ్గించాలనేది నూతన విధానం ఉద్దేశమని స్పష్టం చేసింది. 2030 నాటికి అందరీకి విద్య అందించాలనేది తమ లక్ష్యమని పేర్కొంది. బహుభాషల బోధన దిశగా నూతన విద్యా విధానం ఉండనున్నట్టు తెలిపింది. ఇకపై ఆర్ట్స్, సైన్స్ కోర్సుల విద్యా బోధనలో పెద్దగా తేడాలు ఉండవని వెల్లడించింది. (కరోనా: మార్కెట్లోకి హెటిరో ‘ఫావిపిరవిర్’ ట్యాబ్లెట్) అలాగే ప్రస్తుతం ఉన్న విధానంలో కేంద్రం భారీ మార్పులు తీసుకువచ్చింది. కొత్తగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం ప్రకారం.. ప్రస్తుతం ఉన్న 10+2(పదో తరగతి, ఇంటర్) విధానాన్ని 5+3+3+4 మర్చారు. ఇందులో మూడేళ్ల ప్రీ స్కూలింగ్/అంగన్‌వాడితోపాటుగా 12 ఏళ్ల పాఠశాల విద్య ఉండనుంది. ప్రాథమిక విద్యకు దేశవ్యాప్తంగా ఒకే కరికులమ్ అమలు చేయనున్నారు. ఆరో తరగతి నుంచే విద్యార్థులకు కోడింగ్, ప్రోగామింగ్ కరికులమ్ ప్రవేశపెట్టనున్నారు. ఆరో తరగతి నుంచే వొకేషన్ కోర్సులను తీసుకురానున్నారు. విద్యార్థులపై పాఠ్యాంశాల భారం తగ్గించి కాన్సెప్ట్ నేర్పే ప్రయత్నం చేయనున్నారు. ఎమ్‌ఫిల్ కోర్సును పూర్తిగా రద్దు చేశారు. (ఆ రాష్ట్రంలో ప్యూన్లుగా టీచర్లు..!) కాగా, ప్రస్తుతం ఉన్న జాతీయ విద్యా విధానాన్ని 1986లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1992లో దాన్ని సవరించారు. కాగా, బీజేపీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో దేశంలో నూతన విద్యా విధానం తీసుకురానున్నట్టు చెప్పిన సంగతి తెలిసిందే. -
పాఠశాల విద్యలోనూ సెమిస్టర్లు!
సాక్షి, హైదరాబాద్ : దేశంలో విద్యా రంగాన్ని ప్రక్షాళన చేయాలంటూ నూతన విద్యా విధానం–2019 ముసాయిదాలో కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన ఇస్రో మాజీ చీఫ్ కస్తూరి రంగన్ సారథ్యంలోని కమిటీ... పాఠశాల విద్యలోనూ సెమిస్టర్ విధానం తీసుకురావాలని ప్రతిపాదించింది. సెకండరీ విద్య పరిధిలోకి 8వ తరగతి నుంచి 12వ తరగతిని తీసుకొచ్చి ఏటా రెండు సెమిస్టర్ల చొప్పున 8 సెమిస్టర్లను అమలు చేయాలని పేర్కొంది. అలాగే వృత్తివిద్యను కూడా పాఠశాల విద్యలో భాగంగా కొనసాగించాలని స్పష్టం చేసింది. అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూళ్లతో అనుసంధానించాలని, వీలైతే ఆ రెండింటినీ ప్రైమరీ స్కూళ్ల పరిధిలోకి తెచ్చి స్కూల్ కాంప్లెక్స్ పేరుతో నిర్వహించాలని సిఫార్సు చేసింది. ఉపాధ్యాయ నియామకాల్లో టెట్‌తోపాటు క్లాస్రూమ్ డెమో అమలును తప్పనిసరి చేయాలని సూచించింది. మరోవైపు త్రిభాషా విధానాన్ని ఆరో తరగతి నుంచి అమలు చేయాలని పేర్కొంది. ఈ విషయంలో కమిటీ సిఫార్సులపై తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో అన్ని భాషలకు సమ ప్రాధాన్యం ఉంటుందని, ఏ భాషపైనా వివక్ష చూపబోమని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రస్తుతం కమిటీ సిఫారసులపై ఈ నెల 30 వరకు అభిప్రాయాలను సేకరిస్తున్నామని, ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ స్పష్టం చేసింది. కమిటీ సిఫారసుల్లో మరికొన్ని ప్రధానాంశాలు... సెకండరీ విద్యగానే కొనసాగింపు.. ►హయ్యర్ సెకండరీ విద్యను, సెకండరీ విద్యను కలిపి సెకండరీ విద్యగానే కొనసాగించాలి. అందులో సెమిస్టర్ విధానం అమలు చేయాలి. 9, 10, 11, 12 తరగతుల్లో సెమిస్టర్ విధానం తీసుకురావాలి. ఏటా రెండు సెమిస్టర్ల చొప్పున 8 సెమిస్టర్లు అమలు చేయాలి. ►హయ్యర్ సెకండరీ లేదా జూనియర్ కాలేజీ విధానం తొలగించాలి. 11వ తరగతి, 12వ తరగతి విధానం అమలు చేయాలి. దాన్నీ సెకండరీ విద్య పరిధిలోకి తేవాలి. ►కనీసం 5వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన కొనసాగించాలి. వీలైతే 8వ తరగతి వరకు కూడా మాతృభాషనే అమలు చేయాలి. వృత్తి విద్యను పాఠశాల విద్యలో భాగంగా కొనసాగించాలి. ►అంగన్వాడీ కేంద్రాలను ప్రీస్కూళ్లతో విలీనం చేయాలి. అవకాశం ఉన్న చోట అంగన్వాడీ కేంద్రాలు, ప్రీ స్కూళ్లను, ప్రైమరీ స్కూళ్ల పరిధిలోకి తేవాలి. స్కూల్ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేసి నిర్వహించాలి. – ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్‌ను మానవ వనరుల అభివృద్ధిశాఖ పరిధిలోనే కొనసాగించాలి. ►ఉపాధ్యాయ నియామకాల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్షతోపాటు 5–7 నిమిషాల క్లాస్రూమ్ డెమోను కచ్చితంగా అమలు చేయాలి. ►ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిని 1:30గా కొనసాగించాలి. ఎన్నికల విధులకు టీచర్లను దూరం చేయాల్సిందే... ►ప్రతిభావంతులైన వారు ఉపాధ్యాయ విద్యలోకి వచ్చేలా ప్రోత్సాహించాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి మెరిట్ ఆధారిత స్కాలర్షిప్ ఇస్తూ దేశంలో ఎక్కడైనా నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎడ్ చదివేలా ప్రోత్సహించాలి. ►టీచర్లకు బోధనతో సంబంధంలేని ప్రభుత్వ పనులను తగ్గించాలి. ప్రస్తుతం టీచర్లు ఆ పనులతో బిజీగా ఉంటున్నారు. వాటిని నుంచి దూరం చేయాలి. ఎన్నికల విధుల్లో భాగస్వాములను చేయవద్దు. పాలన పనులను అప్పగించవద్దు. వారు పూర్తిగా బోధన, అభ్యసన పనుల్లోనే నిమగ్నం అయ్యేలా చేయాలి. ►ప్రతి టీచర్ తన నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు కనీసం 50 గంటలు కేటాయించేలా చూడాలి. ►ప్రైవేటు పాఠశాలలు ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్ అనే పదాన్ని వినియోగించకూడదు. ఆ పదం కేవలం ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకే ఉండాలి. ►ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచకుండా తగిన ఏర్పాట్లు చేయాలి. యూజీసీ స్థానంలో ఎన్హెచ్ఈఆర్ఏ... ►యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ స్థానంలో నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలి. దీని ఆధ్వర్యంలోనే మొత్తం ఉన్నత విద్యతోపాటు వృత్తి విద్యా కోర్సులను కూడా పర్యవేక్షించాలి. ►ఏఐసీటీఈ, ఎన్సీటీఈ తదితర సంస్థలన్నింటినీ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ సెట్టింగ్ బాడీస్‌గా మార్పు చేయాలి. ► ఆన్లైన్లో నిర్వహించే కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ►దూరవిద్యను కూడా నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) పరిధిలోకి తీసుకురావాలి. దూరవిద్య అధ్యయన కేంద్రాలుగా నాణ్యతా ప్రమాణాలు పాటించే విద్యాసంస్థలనే ఎంపిక చేయాలి. ►న్యాక్ గ్రేడింగ్ విధానాన్ని సమూలంగా మార్చేయాలి. గ్రేడింగ్ విధానం ఉండొద్దు. న్యాక్ గుర్తింపు ఉందా లేదా అనే విధానమే తీసుకురావాలి. ►ఉన్నత విద్యాసంస్థలకు అనుబంధ గుర్తింపు విధానం తొలగించాలి. అవన్నీ బోధన కాలేజీలుగా కొనసాగేలా చర్యలు చేపట్టాలి. ప్రైవేటు విద్యాసంస్థలకు పరిశోధన నిధులు... ►ప్రైవేటు విద్యాసంస్థలకు కూడా ప్రాజెక్టుల కోసం నిధులు పొందేలా చర్యలు చేపట్టాలి. ►ప్రభుత్వ విద్యాసంస్థలతో సమానంగా ప్రైవేటు విద్యాసంస్థలకు ఎన్ఆర్ఎఫ్ ఫండింగ్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలి. ►పరిశోధనలకు ప్రాధాన్యం ఇచ్చేలా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడంతోపాటు దానికి అదనంగా ప్రస్తుతం ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐసీఎస్ఎస్ఆర్ సంస్థలను కొనసాగించాలి. ►నీట్ తరహాలో ఎంబీబీఎస్ పూర్తయ్యే సమయంలో ఎగ్జిట్ పరీక్షగా కామన్ పరీక్షను ప్రవేశపెట్టాలి. ► అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ కేడర్ల మధ్యలో స్థాయిలను కొనసాగించాలి. ►ఎంఫిల్ విద్యా విధానాన్ని తొలగించాలి. -
రాష్ట్రాల ఆగ్రహం.. వెనక్కి తగ్గిన కేంద్రం!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంపై పలు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేంద్రం వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో పాఠ్యాంశంగా హిందీని కూడా చేర్చాలని కేంద్ర మానవ వనరుల అభివృధి శాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై తమిళనాడు, కర్ణాటక, బెంగాల్ ముఖ్యమంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీని బలవంతంగా రుద్దడానికి వీళ్లేదని తేల్చిచెప్పారు. తమపై ఏ భాషను బలవంతంగా రుద్దాలని చూసినా ప్రతిఘటన తప్పదని ఆయా ప్రాంతాల విద్యావేత్తలు, రచయితలు హెచ్చరిస్తున్నారు. దీంతో తాజా నిర్ణయంపై కేంద్రం పునారాలోచిస్తోంది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖమంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోమని.. వారి అభిప్రాయం మేరకు సవరణ చేస్తామని స్పష్టం చేశారు. తాము అన్ని భాషలను గౌరవిస్తామని.. బలవంతంగా హిందీని అమలుచేయలేమని తెలిపారు. కాగా దేశంలో సరికొత్త విద్యావిధానాన్ని అమలుచేస్తామని 2014 నాటి ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీ మేరకు ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరీ రంగన్ నేతృత్వంలో తొమ్మిది మందితో కూడిన నిపుణుల కమిటీని కేంద్రం నియమించింది. ఈ కమిటీ తన నివేదికను కేంద్ర మంత్రి రమేష్ పోకిరియాల్ నిషాకు శుక్రవారం సమర్పించింది. కొత్త జాతీయ విద్యాపథకం లక్ష్యాలను అందులో పొందుపరిచింది. ఆరోతరగతి నుంచి నిర్బంధ హిందీ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించింది. సరికొత్త జాతీయ విద్యావిధానంపై ప్రజలు తమ అభిప్రాయాలను ఈనెల 30లోగా వెబ్సైట్ ద్వారా తెలియజేయవచ్చని తెలిపింది. అయితే ఏ భాషపైనా నిర్బంధం విధించాలని ఆ కమిటీ సిఫార్సు చేయలేదని కేంద్రం చెబుతోంది. దీంతో పలు రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అది మా రక్తంలోనే లేదు: స్టాలిన్ -
‘విద్యా రిజర్వేషన్లలో మార్పులుండవ్’
ముంబై: రాబోయే నూతన విద్యా విధానంలో రిజర్వేషన్లలో మార్పులు చేసే యోచన ప్రభుత్వానికి లేదని మావన వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. ప్రతిపాదిత విద్యా విధాన ముసాయిదాను కేబినెట్‌కు పంపే ముందు విద్యా రంగ నిపుణులతో చర్చిస్తామన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లలో మార్పులు చేసే యోచన తమకు లేదని తెలిపారు. రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లను యధావిధిగా కొనసాగిస్తామని చెప్పారు. విద్యా వ్యవస్థను మెరుగు పరచడమే తమ లక్ష్యమని ప్రకటించారు. -
నో చాన్స్!
సాక్షి, చెన్నై: రాష్ట్రంలోకి హిందీ, సంస్కృతం అనుమతించే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ కొత్త విద్యా విధానం విషయంలో తమ స్పష్టతను రాష్ట్ర పాఠశాల, ఉన్నత విద్యా శాఖల మంత్రులు బెంజిమిన్, అన్భళగన్‌లు తెలియ జేశారు. అసెంబ్లీ వేదికగా మంత్రులు హామీని డీఎంకే ఆహ్వానించింది. అదే సమయంలో ప్రత్యేక తీర్మానానికి పట్టుబడుతూ, డీఎంకే పంపిన విజ్ఞప్తిపై స్పీకర్ ధనపాల్ పరిశీలన జరుపుతున్నారు. తమిళులకు భాషాభిమానం ఎక్కు వే అన్న విషయం తెలిసిందే. అందుకే ఇక్కడ, హిందీ, సంస్కృతంకు చోటు లేదని చెప్పవచ్చు. ఆ రెండు భాషల్ని అనుమతించే ప్రసక్తే లేదని ఆది నుంచి ఇక్కడి రాజకీయ పక్షాలు స్పష్టం చేస్తూ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్త విద్యా విధానంకు సిద్ధం కావడంతో, బలవంతంగా హిందీ, సంస్కృతం రుద్దే ప్రయత్నం జరుగుతున్నదన్న ఆందోళనలు బయలు దేరాయి. దీనికి వ్యతిరేకంగా పోరు బాటు సైతం సాగుతూవస్తున్నది. ఈ నేపథ్యంలో మంగళవారం అసెంబ్లీలో ప్రాథమిక, ఉన్నత విద్యా శాఖలకు కేటాయింపులపై జరిగిన చర్చలో కేంద్ర ప్రభుత్వ కొత్త విద్యా విధానం ప్రస్తావనకు వచ్చింది. డీఎంకే సభ్యుడు తంగం తెన్నరసు రాష్ట్రంలోని విద్యా విధానాలు, కేటాయింపుల గురించి ప్రసంగాల్ని హోరెత్తిస్తూ, కేంద్ర ప్రభుత్వ కొత్త విద్యా విధానంలో రాష్ట్ర ప్రభుత్వ స్పష్టతను ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రకటించిన కమిటీలో అధికారులే ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. ఇందుకు ఉన్నత విద్యా శాఖ మంత్రి అన్భళగన్ స్పందించారు. కొత్త విద్యావిధానానికి సంబంధించిన కొన్ని అం శాలు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చి ఉన్నాయని వివరించారు. వీటిని పరిశీలించి, అందుకు తగ్గ సమాధానా లు, అభిప్రాయాలను అమ్మ జయలలిత సకాలంలో ప్రకటిస్తారని పేర్కొన్నారు. తమిళనాడు సంక్షేమం, తమిళ భాషాభ్యున్నతి, సంస్కృతి సంప్రదాయాల ప రిరక్షణ దిశగా తమ ప్రభుత్వం ముందు కు సాగుతుందే గానీ, వాటిని కాలరాసే ప్రయత్నాలను అనుమతించ బోదని స్పష్టం చేశారు. తమిళనాడులోకి హిందీ, సంస్కృతంను బలవంతంగా రుద్దేందు కు తగ్గ అవకాశాలను తాము ఇచ్చే ప్ర సక్తే లేదన్నారు. తమిళనాడులోని విద్యా విధానం, ఇక్కడ అవకాశాలు తదితర అంశాలను కేంద్రం దృష్టికి తమ అభిప్రాయాల ద్వారా తీసుకెళ్తామన్నారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, హిందీ, సంస్కృతంలకు ఇక్కడ అవకాశాలు కల్పించబోమని మరో మారు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని పాఠశాల విద్యా శాఖ మంత్రి బెంజిమిన్ పేర్కొంటూ, ఆ రెండింటికి అనుమతి లేదని వ్యాఖ్యానించారు. ఇక, అన్భళగన్ తన ప్రసంగంలో మదురై, చెన్నై , అన్నావర్సిటీలకు వీసీల నియా మకంకుగాను ఎంపిక కమిటీ నియమించామని ప్రకటించారు. ఈ కమిటీ ఇచ్చే నివేదికను గవర్నర్‌కు పంపించడం జరుగుతుందని, ఆ తర్వాతే వీసీల నియామకం ఉంటుందని వివరించారు. ఇక, హిందీ, సంస్కృతాన్ని రాష్ట్రంలోకి అనుమతించేందుకు అవకాశాలు ఇవ్వం అని అసెంబ్లీ వేదికగా మంత్రులు స్పష్టం చేయడాన్ని ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్ ఆహ్వానించారు. అదే సమయంలో తాము ఇచ్చిన ప్రత్యేక తీర్మానం అంశాన్ని పరిగణించాలని స్పీకర్‌ను కోరారు. ఈ విజ్ఞప్తి పరిశీలనలతో ఉన్నట్టు ఈసందర్భంగా స్పీకర్ ధనపాల్ ప్రకటించారు. ముందుగా ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి ఎడపాడి పళని స్వామి ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ, నాగపట్నం జిల్లాలోని వెట్టారులో చెక్ డ్యాంల నిర్మాణానికి పరిశీలన జరుపుతున్నామని ప్రకటించారు. ఇక, పంచాయతీ యూనియన్ల విభజన ప్రక్రియ గురించి మరో మంత్రి ఎస్పీ వేలుమణి ప్రసంగిస్తూ, జిల్లాల కలెక్టర్లు ఇచ్చే నివేదిక ఆధారంగా నియమ నిబంధనల మేరకు విభజన పర్వం సాగుతుందన్నారు. ఇక, కొత్త జిల్లాల ఏర్పాటు గురించి మంత్రి ఆర్బీ ఉదయకుమార్ ప్రసంగిస్తూ, ప్రస్తుతానికి అలాంటి యోచన లేదు అని స్పష్టం చేశారు. సభలో ఒకరు ప్రసంగిస్తున్న సమయంలో మరొకరు అడ్డు పడే విధంగా సాగుతున్న వ్యవహారంపై సీఎం జయలలిత స్నేహ పూర్వక సూచనను సభలో చేయడం విశేషం. ప్రతి పక్ష సభ్యులు ఏదేని అంశాలపై చర్చ సాగిస్తున్నప్పుడు, ఆ చర్చ ముగిసే వరకు మధ్య మధ్యలో ప్రశ్నలు వేయడం మానుకుంటే మంచిదని, ప్రభుత్వం చేసిందా.చేస్తుందా..? సమాధానం ఎవరు ఇస్తారు..? ఇలా మధ్య మధ్యలో ప్రశ్నలను సంధించడం వలను సమాధానాలు ఇచ్చేందుకు అప్పటికప్పుడే మంత్రులు సిద్ధం అవుతున్నారని సూచించారు. -
నైపుణ్యాల పేరుతో కార్పొరేటీకరణకు కుట్ర
సాక్షి, సిటీబ్యూరో: కేంద్రం ప్రభుత్వం అమలు చేయనున్న జాతీయ నూతన విద్యావిధానంలో సామాజిక అంశాలు, గ్రామీణ ప్రజల స్థితిగతులకు చోటు దక్కలేదని పలువురు విద్యావేత్తలు అన్నారు. కార్పొరేట్, మార్కెటింగ్ అంశాలను దృష్టిలో ఉంచుకుని నూతన విద్యా విధానం ముసాయిదాను రూపొందించారని ఆరోపించారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం ‘న్యూ ఎడ్యుకేషన్ పాలసీ’పై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ఒకవైపు దేశ ప్రాచీన విద్యను శ్లాఘిస్తూనే.. మరోవైపు విదేశీ యూనివర్సిటీల ఏర్పాటుకు రెడ్ కార్పెట్ వేయడం దారుణమన్నారు. విద్యను సామాజిక రాజకీయ అంశంగా పరిగణించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాల పేరుతో కార్పొరేట్, గ్లోబలైజేషన్‌కు పెద్దపీట వేస్తోందని, గ్రామీణ జీవన విధానం మెరుగుపడే దిశగా ఆలోచించడం లేదన్నారు. ప్రైవేటు చేతిలో విద్య ఎందుకు ఉండాలన్న ప్రశ్నకు సమాధానం లేదని, దేశ అవసరాలు, డిమాండ్లు, సమానత్వ భావన, విలువలను ప్రస్తావిస్తే అందరికీ సమానమైన విద్య దక్కుతుందన్నారు. ప్రభుత్వం వైఖరి కారణంగా నాణ్యమైన విద్య కొందరికే పరిమితమైందని, బడుగు, బలహీన వర్గాలు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలే విద్యా విధానాన్ని బ్రష్టు పట్టించాయని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. కేవలం మార్కుల కోసమే.. తప్ప పాఠ్య సారాంశాన్ని అర్థం చేసుకునే విధానాన్ని గాలి కొదిలేశారన్నారు. పరీక్షలపైనే దృష్టి కేంద్రీకరిస్తుండడంతో విద్యార్థుల్లో సృజనాత్మకత క్షీణిస్తుందన్నారు. కార్పొరేట్ శక్తులు విద్యార్థిని వినియోగదారునిగా, టీచర్‌ను షాప్ కీపర్‌గా, తల్లిదండ్రులను స్టాక్ హోల్డర్లుగా మార్చాయని ధ్వజమెత్తారు. ప్రగతికి ఎవరూ అడ్డుకాదని, ఎక్స్‌లెన్స్ కంటే సమానత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. లేని పక్షంలో ప్రభుత్వ విద్యా విధానాలు గాలిలో మేడలవుతాయన్నా రు. నూతన విద్యా విధాన ముసాయిదాను నిరసిస్తూ ఈనెల 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపట్టనున్నట్లు తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ అధ్యక్షులు ప్రొఫెసర్ కె. చక్రధరరావు తెలిపారు. సమావేశంలో డాక్టర్. కె. లక్ష్మినారాయణ, మనోహర్ పాల్గొన్నారు. -
విద్యావ్యవస్థలో తక్షణ మార్పులు అవసరం
‘న్యూ ఎడ్యుకేషన్ పాలసీ’పై ఏర్పాటైన కమిటీ అభిప్రాయం న్యూఢిల్లీ: నిర్లక్ష్య లేదా అవినీతితో కూడిన నియంత్రణ వ్యవస్థలు నాణ్యత లేని ప్రైవేట్ విద్యాసంస్థల వ్యాప్తికి కారణమవుతున్నాయని కొత్త విద్యా విధానం(ఎన్ఈపీ)పై ఏర్పాటైన నిపుణుల బృందం అభిప్రాయపడింది. ప్రస్తుత విధానంలో లోపాలతో పాటు ‘న్యూ ఎడ్యుకేషన్ పాలసీ’ తయారీ కోసం మానవ వనరుల అభివృద్ధి శాఖకు కమిటీ కొన్ని సూచనలు చేసింది. విద్యపై ఏ మాత్రం ఆసక్తిలే కుండా, కేవలం డబ్బుతో ప్రభావితం చేసే వ్యక్తుల వల్ల అనేక ప్రైవేట్ వర్సిటీలు, కాలేజీలు వర్ధిల్లుతున్నాయని, అవినీతిలో కూరుకున్న నియంత్రణ వ్యవస్థల్ని తమకు అనుకూలంగా మలచుకుంటున్నారని కమిటీ అభిప్రాయపడింది. ఇలాంటి అస్తవ్యస్త ప్రైవేట్ విద్యాసంస్థల వ్యాప్తిని అడ్డుకునేం దుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల్లో పారదర్శకత లేని ఆర్థిక నిర్వహణను ప్రస్తుత వ్యవస్థ ప్రోత్సహిస్తోం దని, ఇది పరోక్షంగా నల్లధనాన్ని వినియోగానికి కారణమవుతోందని వెల్లడించింది. తాత్కాలిక, గెస్ట్ టీచర్లపై ఎక్కువగా ఆధారపడడం నాణ్యమైన విద్య వ్యవస్థకు వ్యతిరేకమని కమిటీ తెలిపింది. ఉన్నత విద్యాసంస్థల్లో సిబ్బంది నియామకాలపై కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ప్రతి ఐదు సంవత్సరాలకోసారి సమీక్ష జరగాలని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ద్వారా అధ్యాపకుల నియామకాల వల్ల కూడా భర్తీ ఆలస్యమవుతోందని వెల్లడిం చింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని అన్ని ఉన్నత విద్యాసంస్థలకు గుర్తింపు తప్పనిసరి చేయాలంది. సాంకేతిక, వైద్య, వ్యవసాయ విద్యాసంస్థలకూ యూజీసీ గుర్తింపు తప్పనిసరని పేర్కొంది.ఈ కమిటీ నివేదికను కేంద్ర మానవ వనరులశాఖ అధికారులు పరిశీ లించి ఎన్ఈపీ తయారీలో పరిగణనలోకి తీసుకుంటారు. -
'త్వరలో నూతన విద్యా విధానం'
హైదరాబాద్ : తెలంగాణలో ఈ ఏడాది నుంచి నూతన విద్యా విధానం అమల్లోకి తెస్తామని డిప్యూటి సీఎం కడియం శ్రీహరి అన్నారు. అసెంబ్లీలో మంగళవారం విద్యావిధానంపై చర్చ సందర్భంగా కడియం ఉద్వేగభరితంగా మాట్లాడారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ సరిదిద్దుకునే అవకాశాలున్నాయని, ఈ ఏడాది నుంచే ప్రైవేట్ పాఠశాలను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించామని, తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపేలా చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, నూతన భవనాల నిర్మాణాల కోసం రూ.1500 కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి కడియం సభకు తెలిపారు. సోషల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ స్కూల్స్‌లలో మంచి ఫలితాలు సాధిస్తున్నాయని కితాబిచ్చారు. వీసీల నియామకాలపై స్పందిస్తూ..వీసీలు, సరిపడా సిబ్బంది లేక యూనివర్శిటీలు అస్తవ్యస్తంగా మారాయని, ఏప్రిల్ 2లోగా అన్ని వర్సిటీలకు వీసీలను నియమిస్తామని కడియం పేర్కొన్నారు. -
పాఠశాల విద్యలో సంస్కరణలు: బాబు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యలో సమూల సంస్కరణలు ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సాంకేతికతను జోడించి ఆధునిక బోధనా పద్ధతులతో కూడిన నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఆయన బుధవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన డెల్ కంపెనీ ప్రతి నిధులతో పాఠశాల విద్యపై చర్చించారు. పాఠశాలల్లో ప్రమాణాలను పెంచేందుకు రూపొందించిన విధానాలపై డెల్ ప్రతినిధు లు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పటికే తాము బ్రెజిల్, పాకిస్తాన్ తదితర దేశాల్లో పాఠశాల స్థాయిలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. వసతులు, నిధులకు లోటు లేదు పాఠశాలల్లో వసతులు, నిధులకు లోటు లేదని, కావాల్సిందల్లా వ్యవస్థను సమర్థంగా నడిపించే చోదక శక్తి మాత్రమేనని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రతి టీచర్, ప్రతి విద్యార్థి గురించి తెలుసుకునేలా సాంకేతిక విధానాలను ప్రవేశపెట్టాలని డెల్ ప్రతినిధులను ఆయన కోరారు. -
రాష్ట్ర యూనివర్సిటీలకూ ‘సెంట్రల్’ తరహా నిధులు
కావాలని వైస్ చాన్సలర్లు, ప్రొఫెసర్ల డిమాండ్ నూతన విద్యా విధానంపై కేంద్రానికి సిఫార్సు చేయాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కేంద్రీయ విశ్వవిద్యాలయాల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు, పరిశోధనలకు ఇస్తున్నట్లుగానే రాష్ట్ర యూనివర్సిటీలకు కూడా కేంద్రప్రభుత్వం నిధులివ్వాలని పలు వర్సిటీల ప్రొఫెసర్లు, మాజీ వీసీలు, రిటైర్డ్ ప్రొఫెసర్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రం విధాన నిర్ణయం తీసుకోవాలని, నూతన విద్యా విధానంలోనూ వీటికి చోటు కల్పించాలని సూచించారు. నూతన విధానంలో ఉన్నత విద్య ఎలా ఉండాలన్న అంశంపై క్షేత్రస్థాయి నుంచి కేంద్రం అభిప్రాయ సేకరణ చేపట్టడం తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి అధ్యక్షతన, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ వెంకటాచలం, ప్రొఫెసర్ మల్లేశ్‌ల నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో పలు వర్సిటీల రిటైర్డ్, ప్రస్తుత వైస్ చాన్సలర్లు, ప్రొఫెసర్లు పి.పద్మావతి, కృష్ణారెడ్డి, శ్రీనివాసులు, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్, అల్తాఫ్ హుస్సేన్, వినయ్‌బాబు తదితరులు పాల్గొని అభిప్రాయాలు వెల్లడించారు. పలు అంశాలపై తీర్మానాలు చేశారు. వాటిలో ప్రధానాంశాలు... ► వసతుల కల్పన, ఆర్థికాంశాలు తదితరాల్లో కేంద్రీయ, రాష్ట్ర వర్సిటీల మధ్య చాలా వ్యత్యాసముంది. రాష్ట్ర వర్సిటీలకు రాష్ట్రాలిచ్చే మొత్తం చాలడం లేదు. దాన్ని పెంచాలి. కేంద్రం వాటిలో మౌలిక సదుపాయాల కల్పనకు, పరిశోధనలకు నిధులను భారీగా ఇవ్వాలి. ► కేంద్రీయ వర్సిటీలతోపాటు రాష్ట్ర వర్సిటీల్లోనూ నియామకాలకు కేంద్రమే విధానపరమైన నిర్ణయం చేయాలి. ► కాలేజీలకు అటానమస్ హోదా కల్పించాలి. ముఖ్యంగా ప్రభుత్వ కాలేజీలు ఆ హోదా పొందేందుకు అవసరమైన మౌలిక వసతులు, సదుపాయాల కల్పన, నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. తద్వారా నేరుగా ఆయా కాలేజీలకు యూజీసీ నిధులు వస్తాయి. ► వర్సిటీలకు ఆర్థిక, పాలన, విద్యాపరమైన స్వేచ్చ కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే నిధులివ్వాలి. అవసరమైన వాటిపై ఖర్చుచేసుకునే అవకాశమివ్వాలి. ► విద్యా నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు అధ్యాపకుల నియామకాలు చేపట్టాలి. చాయిస్ బేస్డ్ క్రెడిట్, సెమిస్టర్ విధానాలను అమల్లోకి తేవాలి. ► విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచే, ఉపాధి కల్పించే కోర్సులను ప్రభుత్వ కాలేజీలన్నింట్లోనూ ప్రవేశపెట్టాలి. ► వెనకబడిన వర్గాలు ఆర్థిక వెనకబాటుతనం వల్లే ఇంకా ఉన్నత విద్యకు నోచుకోవడం లేదు. వారికి ప్రభుత్వం భారీగా ఆర్థిక సహకారం అందించాలి. ప్రతి పట్టణ కేంద్రంలో వారికి హాస్టల్ సదుపాయం కల్పించాలి. టెక్నాలజీ, సబ్జెక్టుపరమైన విజ్ఞానం అందించే ప్రత్యేక బోధన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ► ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో పరిశ్రమలకు అవసరమైన కోర్సులను ప్రభుత్వ విద్యా సంస్థలే అమల్లోకి తేవాలి. వాటి వ్యయాన్ని ఆయా పరిశ్రమలే ప్రభుత్వానికి, విద్యా సంస్థలకు అందించాలి. అంతేతప్ప, ప్రైవేటు సంస్థలే విద్యా సంస్థలను కొనసాగించడం వల్ల లాభముండదు. ► పరీక్షల విధానాన్ని పూర్తిగా సంస్కరించి పేపర్‌లెస్ పద్ధతిని తేవాలి. బహుళ ప్రయోజనకర కోర్సులను ప్రవేశపెట్టాలి. -
సర్కారీ బడులపై నమ్మకం కలిగించాలి
‘నూతన విద్యా విధానం’పై సదస్సులో కడియం * అది లేదు గనుకే ప్రైవేట్ స్కూళ్లకు పిల్లలు * ప్రభుత్వ విద్యావ్యవస్థను కాపాడాలని టీచర్లకు హితవు * పలు సలహాలిచ్చిన ఉపాధ్యాయ సంఘాలు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం లేకనే, మెరుగైన విద్య కోసం అప్పు లు చేసైనా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ‘‘రాష్ట్రంలో 60 లక్షల మంది పాఠశాల విద్యార్థుల్లో 29 లక్షలు ప్రభుత్వ, 31 లక్షలు ప్రైవేటు స్కూళ్లలో ఉన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచరు ఉం డాల్సి ఉంటే అధికారిక లెక్కల ప్రకారం 21 మందికి ఒకరున్నారు. ఉన్నత పాఠశాలల్లో ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక టీచరు ఉండాల్సి ఉంటే 19 మందికి ఒకరున్నారు. అయినా ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతుంటే ప్రభుత్వ స్కూళ్లలో తగ్గుతోంది’’ అని ఆవేదన వెలిబుచ్చారు. ‘నూతన విద్యా విధానం’పై గురువారం హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో ఆయన అతిథిగా పాల్గొని, 48 ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులనుద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ స్కూళ్లను పటిష్టం చేయాల్సిన బాధ్యత టీచర్లదేనన్నారు. అందరికీ విద్య-అందరి బాధ్యత రాష్ట్రంలో విద్యారంగం అనేక సమస్యలను ఎదుర్కొటోందని, ప్రభుత్వ విద్యావ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత టీచర్లతో పాటు అందరిపైనా ఉందని కడియం అన్నారు. కేంద్రం సంకల్పించిన నూతన విద్యా విధానానికి రాష్ట్రం తరఫున నివేదిక పంపాల్సి ఉందని గుర్తు చేశారు. నిపుణులు, మేధావుల నుంచి సూచనలు స్వీకరించేందుకు త్వరలో వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో పాఠశాల విద్య డెరైక్టర్ కిషన్, ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్, పాతూరి సుధాకర్‌రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఏమన్నాయంటే.. టోల్‌ఫ్రీతో అవమానించొద్దు: సరోత్తమ్ అన్ని వ్యవస్థల మాదిరిగానే విద్యావ్యవస్థ కూడా కలుషితమైందని పీఆర్టీయూటీఎస్ అధ్యక్షుడు సరోత్తమ్‌రెడ్డి అన్నారు. పాఠశాలలపై పర్యవేక్షణకు కాదని పోలీసు అధికారులను నియమించాలని ప్రభుత్వం యోచిస్తుం డడం సరికాదన్నారు. టీచర్లపై ఫిర్యాదుల స్వీకరణకు టోల్‌ఫ్రీ నంబరు ఇవ్వడం అవమానించడమేనన్నారు. పోలీసులను నియమించే యోచన లేదని కడియం స్పష్టం చేశారు. ‘‘సమాచార సేకరణ నిమిత్తమే టోల్ ఫ్రీ నంబరి చ్చాం’’అని అన్నారు. కంప్యూట ర్ విద్య అటకెక్కింది: మోహన్‌రెడ్డి సర్కారీ స్కూళ్లలో కంప్యూటర్ విద్య అటకెక్కిందని పీఆర్టీయూ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి అన్నారు. ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్, స్కూళ్లలో సదుపాయాలు కల్పించాలన్నారు. వీటిపై మార్చిలో ఉపాధ్యాయ సంఘాలతో మళ్లీ భేటీ అవుతామని కడియం చెప్పారు. వృత్తి విద్యకు ప్రాధాన్యం: హర్షవర్ధన్ వృత్తి విద్యపై ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు ఆసక్తిని పెంపొదిస్తే మేలని, నూతన విద్యా విధానంలో దీనికి ప్రాధాన్యమివ్వాలని పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. విధానపత్రం సరిగా లేదు: నర్సిరెడ్డి కేంద్రం రూపొందించిన నూతన విద్యా విధాన పత్రం సరిగా లేదని టీఎస్ యూటీఎఫ్ అధ్యక్షుడు నర్సిరెడ్డి అన్నారు. హెచ్ఎంలకు పర్యవేక్షణ బాధ్యతలు: శర్మ ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ల సంఖ్య పెరిగినందున కాంప్లెక్స్ స్కూల్ ప్రధానోపాధ్యాయులకు తమ పరిధిలోని స్కూళ్ల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని హెడ్మాస్టర్ల సంఘం అధ్యక్షుడు మల్లిఖార్జున శర్మ సూచించారు. పాఠశాల మాదనే భావన: రాజిరెడ్డి ప్రభుత్వ పాఠశాల తమదనే భావన సమాజంలో వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఎస్టీయూ అధ్యక్షుడు రాజిరెడ్డి సూచించారు. పనిచేసే టీచర్లను ప్రోత్సహించాలని.. పనిచేయని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. బాలికలకు రెసిడెన్షియల్ విద్య:కొండల్‌రెడ్డి బాలికలకు రెసిడెన్షియల్ విద్యా విధానాన్ని తప్పనిసరి చేయాలని టీపీటీఎఫ్ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి అన్నారు.