నూతన విద్యా విధానం అమలుకు ఏపీ సిద్ధం | Biswabhusan Harichandan Speech In Governors Meeting On New Education Policy | Sakshi
Sakshi News home page

భవిష్యత్తు సవాళ్లను అధికమించేందుకే నూతన విద్యా విధానం

Published Mon, Sep 7 2020 6:15 PM | Last Updated on Mon, Sep 7 2020 6:44 PM

Biswabhusan Harichandan Speech In Governors Meeting On New Education Policy - Sakshi

సాక్షి, అమరావతి : భారత ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన జాతీయ విద్యా విధానం 2020 ను భవిష్యత్తు అవసరాల అనుగుణంగా తీర్చిదిద్దారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. 21వ శతాబ్దపు క్లిష్టమైన ఉన్నత విద్య అవసరాలు, రానున్న సమస్యలను నూతన విధానం పరిష్కరించగలదన్నారు. భారత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నత విద్యావిధానంలో మార్పులు ఆశిస్తూ  కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యావిధానం 2020పై సోమవారం నిర్వహించిన గవర్నర్ల సదస్సులో రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ విజయవాడ రాజ్ భవన్ నుండి ఆన్ లైన్ విధానంలో పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు ప్రముఖులు ఈ సదస్సులో నూతన విద్యా విధానం గురించి తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జాతీయ విద్యా విధానం -2020 ను తాను స్వాగతిస్తున్నానన్న గవర్నర్, ఉన్నత విద్యావ్యవస్థలో నాణ్యతా ప్రమాణాలను సాధించాలనే లక్ష్యంతో నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని నిజమైన స్ఫూర్తితో అమలు చేయాలని యోచిస్తోందని బిశ్వ భూషణ్  సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. (పాఠశాలల్లో ఇక ‘బ్రేక్‌ ఫాస్ట్‌’)

పరిశోధనలలో నాణ్యత, నవ్యతతో పాటు పేటెంట్ ఆధారిత పరిశోధన, మేధో సంపత్తి హక్కులను ప్రోత్సహించే క్రమంలో జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థతో రాష్ట్ర విశ్వవిద్యాలయాల పక్షాన అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. రాష్ట్రంలో సంస్థాగత పరిశోధనలను ప్రోత్సహించడానికి రాష్ట్ర స్థాయి పరిశోధనా మండలిని ఏర్పాటు చేయటమే కాక, విద్యా సంస్ధలను పరిశ్రమలతో అనుసంధానించటం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. జాతీయ విద్యా విధానం -2020 యొక్క సిఫారసులకు అనుగుణంగా ఆన్‌లైన్, డిజిటల్ విద్యకు ప్రాముఖ్యతను ఇస్తూ, మిశ్రమ అభ్యాసాన్ని ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నూతన నిర్వహణ వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని గౌరవ గవర్నర్ అన్నారు.  గ్రామీణ,  వెనుకబడిన విద్యార్థులకు ఆన్‌లైన్ విద్యకు అవకాశం కల్పించడానికి, పట్టణ, గ్రామీణ, మారుమూల ప్రాంతాల మధ్య సాంకేతికత లభ్యతలో అంతరాన్ని తగ్గించడానికి ఇ-లెర్నింగ్ కమ్యూనిటీలను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించారని వివరించారు. 

నూతన పాలసీ సిఫారసులను అధ్యయనం చేయడానికి, రాష్ట్రంలోని నిర్దిష్ట అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాలసీ అమలు కోసం విధాన చర్యలు, మార్గదర్శకాలను సూచించడానికి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఉన్నత విద్యావ్యవస్థలో నాణ్యత, ప్రమాణాలను ప్రోత్సహిస్తూ, జాతీయ విద్యా విధానం 2020 ను అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని గవర్నర్ స్పష్టం చేసారు. ఈ సదస్సులో విజయవాడ రాజ్ భవన్ నుండి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, కళాశాల విద్యా కమీషనర్ ఎంఎం నాయక్,  ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ అచార్యా హేమచంద్రా రెడ్డి,  గవర్నర్ వారి సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాధ్ తదితరులు పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement