సాక్షి,అమరావతి: అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా నూతన విద్యా విధానం–2020ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం దాని కార్యాచరణకు సమాయత్తమవుతోంది. నూతన విద్యా విధానం ప్రకారం ఉన్నత చదువులు విద్యార్థి కేంద్రంగా సాగేలా చర్యలు చేపడుతోంది. విద్యార్థులు తమ అభీష్టానుసారం ఉన్నత చదువుల అభ్యసనానికి బహుళ ప్రవేశ, నిష్క్రమణలకు అవకాశం కల్పించనుంది. ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా ఏ కోర్సు అయినా చదువుకునేందుకు వారికి వీలుకలుగనుంది. ఈ క్రమంలో ఆయా కోర్సుల్లో విద్యార్థులు సాధించిన క్రెడిట్ల బదిలీ కోసం ‘అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్– (ఏబీసీ)’ అనే నూతన కార్యక్రమానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) శ్రీకారం చుడుతోంది.
ఇదీ లక్ష్యం
► నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్‌ను అనుసరించి విద్యార్థులు దేశంలోని ఉన్నత విద్యా సంస్థలలో ఇంటర్ డిసిప్లినరీ/మల్టీ డిసిప్లినరీ కోర్సులు అభ్యసించడానికి, వారి క్రెడిట్లు ఆయా సంస్థల నుంచి పరస్పరం బదిలీకి (క్రెడిట్ ట్రాన్స్‌ఫర్)కు ఈ కొత్త విధానం వీలు కల్పించనుంది.
► తమ చదువులను సొంతంగా నిర్ణయించుకుంటూ డిప్లొమో, డిగ్రీ, పీజీ డిప్లొమో వంటి వాటిని ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా, ఏ స్థాయి నుంచైనా అభ్యసించడానికి వీలుగా బహుళ ప్రవేశ, నిష్క్రమణలకు అవకాశం ఉంటుంది.
► నూతన ఆలోచనలు, సృజనాత్మకత, ఆవిష్కరణలకు మార్గమేర్పడేలా బహుళ కోర్సుల అధ్యయనానికి వీలుంటుంది. ఏ విద్యా సంస్థలోనైనా, ఎప్పుడైనా నచ్చిన కోర్సులు, వివిధ కాంబినేషన్లలో చదువుకునేందుకు వెసులుబాటు ఉంటుంది.
► తమ డిగ్రీలను తమకు నచ్చిన రీతిలో యూనివర్సిటీలు, అటానమస్ కాలేజీలలో అభ్యసించే అవకాశం. బహుళ ప్రవేశ, బహుళ నిష్క్రమణలతో విద్యార్థులు ఆయా కోర్సుల పూర్తికి స్వయం సమయ నిర్దేశం.
► అకడమిక్ మొబిలిటీ కోసం బోధనాభ్యసన ప్రక్రియలను అన్ని విద్యా సంస్థలు బ్లెండెడ్ (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్) విధానంలో అందించేలా ఏర్పాట్లు. ఫుల్‌టైమ్, పార్టు టైమ్ అభ్యసనానికి వీలు.
బ్యాంకు లావాదేవీలు ఇలా..
► ‘అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్’కు విద్యార్థులు, విద్యా సంస్థలు స్టేక్ హోల్డర్లు. విద్యార్థుల క్రెడిట్లను భద్రపరిచే డిజిటల్, వర్చువల్, ఆన్‌లైన్ స్టోర్ హౌస్‌లా ఈ బ్యాంక్ ఉంటుంది. ‘నేషనల్ అకడమిక్ డిపోజిటరీ’ మాదిరిగానే ఏబీసీ స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)గా ఉంటుంది. ఉన్నత విద్యలో స్టేక్ హోల్డర్లకు ఎంతో ఉపయుక్తమైన డైనమిక్ వెబ్‌సైట్ ద్వారా ఇది సేవలందిస్తుంది.
► అన్ని ఉన్నత విద్యా సంస్థల విద్యార్థుల క్రెడిట్ రికార్డులను నిర్వహించేలా ఏబీసీకి కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అధికారిక గుర్తింపునిచ్చాయి. ఏబీసీ ద్వారా విద్యార్థులు ఆయా కోర్సుల క్రెడిట్లను యూనిక్ అకౌంట్, ఇండివిడ్యువల్ అకౌంట్ల ద్వారా డిజిటల్ ఫామ్‌లో పరిశీలించుకునే అవకాశం ఉంటుంది.
► ఏబీసీ గుర్తింపు ఉన్న విద్యా సంస్థల క్రెడిట్లనే జమ చేసుకుంటుంది. యూజీసీ, కేంద్ర మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఆయా క్రెడిట్ల వేలిడిటీ ఉంటుంది. విద్యార్థుల క్రెడిట్లను ఆయా విద్యా సంస్థల ద్వారానే ఏబీసీలో డిపాజిట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ కోర్సులు నిర్వహించే స్వయం ప్లాట్‌ఫాంతో పాటు వర్సిటీలు, ఇతర సంస్థలు కూడా విద్యార్థుల క్రెడిట్లను వారి యూనిక్ ఐడీ నంబర్ అకౌంట్ ద్వారా ఏబీసీలో జమ చేస్తాయి. విదేశాల్లోని విద్యా సంస్థల్లో అభ్యసించే కోర్సుల క్రెడిట్లను కూడా ఏబీసీలో భద్రపరిచేందుకు ఆవకాశం ఉంటుంది.
అర్హత ఉన్న సంస్థలకే ఖాతాలకు అవకాశం
► ఏబీసీ ప్రస్తుతానికి యూజీసీ గుర్తించిన అన్ని ఉన్నత విద్యా కోర్సుల క్రెడిట్ల భద్రతకు అవకాశమిస్తుంది.
► యూనివర్సిటీ గుర్తింపు, అటానమస్ కాలేజీలకు మాత్రమే అవకాశం. వాటికి కూడా నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) నుంచి కనీసం ఏ గ్రేడ్ గుర్తింపు ఉన్న సంస్థలకు మాత్రమే ఏబీసీలో రిజిష్టర్‌కు అవకాశం.
► ఆడియో విజువల్ సదుపాయం, ఈ–రిసోర్సులు, వర్చ్యువల్ క్లాస్ రూములు, స్టుడియోలు, ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఆన్‌లైన్ కోర్సుల సదుపాయంతో పాటు ప్రభుత్వ విభాగాలు నిర్దేశించిన ఇతర మౌలిక వసతులన్నీ కలిగి ఉండాలి.
► ఇంజనీరింగ్, మెడికల్, డెంటల్, లా తదితర కోర్సుల క్రెడిట్లను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి, అఖిల భారత వైద్య విద్యా మండలి తదితర విభాగాల ఆమోదంతో డిపాజిట్‌కు అవకాశం
ఇవ్వనుంది.
► యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ముసాయిదాపై ఆయా విద్యా సంస్థలు, విద్యావేత్తలు, ఇతర స్టేక్ హోల్డర్లు ఏబీసీఆర్‌ఈజీయూఎల్‌ఏటీఐఓఎన్‌ఎస్2021 ఃజీమెయిల్.కామ్ కు తమ అభిప్రాయాలు పంపవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment