సాక్షి, అమరావతి: యూనివర్సిటీలు, కాలేజీలు, ఉన్నత విద్యాసంస్థల్లో ‘ఎర్న్ వైల్ లెర్న్’ (చదువుతూ సంపాదన–ఈడబ్ల్యూఎల్) పథకాన్ని త్వరలో ప్రవేశపెట్టాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించింది. దీనికి సంబంధించిన ముసాయిదా ప్రతిపాదనలను సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలకు పంపింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులను చదువుల్లో ముందుకు తీసుకెళ్లడంతోపాటు వారికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచేందుకు ఈ పథకాన్ని యూజీసీ రూపొందించింది.
ఈ వర్గాల విద్యార్థులు తమ విద్యను కొనసాగిస్తూనే కొంత సంపాదించుకునేందుకు వీలుగా ‘చదువుతూనే సంపాదన’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. దీనిని విజయవంతంగా అమలుచేయడం ద్వారా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు పార్ట్‌టైమ్ ఎంగేజ్‌మెంట్ అవకాశాలను అందించాలని అన్ని ఉన్నత విద్యాసంస్థలకు యూజీసీ ప్రతిపాదించింది. ప్రతి గంటకు నిర్ణీత మొత్తాన్ని చెల్లించాలని, గరిష్టంగా వారానికి 20 గంటలపాటు నెలలో 20 రోజులు ఈ పార్ట్‌టైమ్ వర్క్‌లు వారికి అప్పగించాలని యూజీసీ పేర్కొంది.
రోజూ తరగతిలో బోధనాభ్యసన ప్రక్రియలు పూర్తయిన తర్వాతే ఈ పార్ట్‌టైమ్ సేవలను విద్యార్థులకు కల్పించాలని తెలిపింది. ‘చదువుతూ సంపాదన’ అనే ఈ పథకం ద్వారా ఈ వర్గాల విద్యార్థులు వారి చదువులకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి వీలవుతుందని, అదే సమయంలో వారు ఉపాధి మార్గాలను మెరుగుపర్చుకునేలా నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంపొందించుకోగలుగుతారని యూజీసీ అభిప్రాయపడింది. ఈ ‘ఎర్న్ వైల్ లెర్న్’ పథకం బలహీనవర్గాలకు చెందిన విద్యార్థుల చదువుల్లో ఆర్థిక కష్టాలను తగ్గించడంతో పాటు విద్యార్థుల్లో కష్టపడి సంపాదించే తత్వాన్ని పెంపొందిస్తుంది.
చదువుల్లో విద్యార్థులను మరింత మెరుగుపరుస్తుంది. విద్య నాణ్యత పెరగడంతోపాటు వారిలో సానుకూల దృక్పథాన్ని అభివృద్ధి చేస్తుంది’.. అని యూజీసీ తన ముసాయిదా ప్రతిపాదనల్లో పేర్కొంది. అంతేకాక.. వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి, సాంకేతిక నైపుణ్యాల మెరుగుకు తోడ్పాటునందిస్తుందని, తద్వారా ఈ వర్గాల విద్యార్థుల్లో సామర్థ్యాలు గణనీయంగా పెరుగుతాయని యూజీసీ అభిప్రాయపడింది. ‘విద్యార్థులు వృత్తిపరమైన పనులను త్వరగా చేపట్టడంలో ఈ కార్యక్రమం సహాయపడుతుంది.
పార్టుటైమ్ పనుల కేటాయింపు ఇలా..
సామాజికంగా, ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థులకు విద్యాసంస్థల్లో ఎలాంటి పార్ట్‌టైమ్ ఉపాధి కార్యక్రమాలు కలి్పంచాలో కూడా యూజీసీ సూచించింది. ఇందుకు సంబంధించిన జాబితాను రూపొందించింది. ఇందులో..
♦ రీసెర్చ్ ప్రాజెక్టులతో కూడిన అసిస్టెంట్‌షిప్, లైబ్రరీ అసైన్‌మెంట్లు, కంప్యూటర్ సర్విసెస్, డేటాఎంట్రీ, లేబొరేటరీ అసిస్టెంట్లు తదితరాలతో పాటు ఆయా సంస్థలు ఇతర అంశాల్లోనూ పార్ట్‌టైమ్ జాబ్‌లను కలి్పంచాలని యూజీసీ పేర్కొంది.
♦ ఇందుకు సంబంధించి ఆయా ఉన్నత విద్యాసంస్థల్లో ప్రత్యేక సెల్‌లను ఏర్పాటుచేయాలని తెలిపింది.
♦ సంస్థ డీన్ లేదా డిపార్ట్‌మెంటల్ హెడ్ తదితరులతో చర్చించి అర్హులైన విద్యార్థులను గుర్తించిన అనంతరం ఉన్నతాధికారుల ఆమోదంతో విద్యార్థులకు తగ్గ పనులను అప్పగించాలని వివరించింది.
♦ ప్రతి అకడమిక్ సెషన్‌లోనూ ఈ విద్యార్థులను గుర్తించి పూల్‌గా ఏర్పరచి వీసీ, లేదా ప్రిన్సిపాళ్ల ఆమోదంతో పార్ట్‌టైమ్ పనులు కేటాయించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.
♦ జాతీయ విద్యా విధానం–2020కి అనుగుణంగా ఈ మార్గదర్శకాలు రూపొందించారు.
♦ సామాజిక–ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి ఇది ఎంతో ఉత్తమమైన కార్యక్రమమని యూజీసీ వివరించింది.
♦ మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు, చిన్నచిన్న పట్టణాల నుంచి వచ్చిన పిల్లలు, దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడ్డ వారికి ఈ కార్యక్రమం ద్వారా ప్రాధాన్యమివ్వాలని తెలిపింది.
బ్రిడ్జి కోర్సుల నిర్వహణ
ఇక ఉన్నత విద్యాసంస్థల్లో చేరే ఈ విద్యార్థులకు తొలి ఏడాదిలోనే బ్రిడ్జి కోర్సులను నిర్వహించాలని యూజీసీ పేర్కొంది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఈ విద్యార్థులు సంబంధిత కోర్సుల్లోని అంశాలకు సంబంధించి పూర్వపు పరిజ్ఞానాన్ని పూర్తిగా నేర్చుకునే పరిస్థితుల్లేక వెనుకబడి ఉంటారని, ఆ లోపాన్ని పూరించేందుకు ఈ కోర్సులు ఎంతగానో తోడ్పడతాయని తెలిపింది. ఇతర విద్యార్థులతో సమాన స్థాయికి వీరు చేరుకునేందుకు ఇవి అవకాశం కలి్పస్తాయని తెలిపింది. సెమిస్టర్ ప్రోగ్రామ్ ప్రారంభానికి ముందు ఏటా వీటిని నిర్వహించాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment