ఆచరణే గీటురాయి | New Education Policy | Sakshi
Sakshi News home page

ఆచరణే గీటురాయి

Published Fri, Jul 31 2020 3:38 AM | Last Updated on Fri, Jul 31 2020 3:40 AM

New Education Policy - Sakshi

ప్రాథమిక విద్య మొదలుకొని విశ్వవిద్యాలయ విద్య వరకూ అన్ని స్థాయిల్లోనూ విస్తృతమైన సంస్కరణలు తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన నూతన విద్యా విధానం ముసాయిదాపై కేంద్ర మంత్రి వర్గం బుధవారం ఆమోదముద్ర వేసింది. సమకాలీనత సమృద్ధిగా, నైపుణ్యమే ఇరుసుగా వుంటుందని చెబుతున్న ఈ విద్యావిధానం ప్రధాన లక్ష్యాలు– స్థూల నమోదు నిష్పత్తి(జీఈఆర్‌)ని ఇప్పుడున్న 26 శాతం నుంచి 50 శాతానికి తీసుకెళ్లడం, జీడీపీలో ఇప్పుడు 4 శాతంగా వున్న విద్యారంగ కేటాయింపుల్ని 6 శాతానికి పెంచడం. 2030 కల్లా జిల్లాకొకటి చొప్పున బహుళ శాస్త్రాల విద్యా సంస్థ నెలకొల్పాలన్నది కూడా ఈ ముసాయిదా ధ్యేయం. తొలిసారి 2014లో అధికారంలోకి వచ్చినప్పటినుంచి బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి ఈ దేశంలో విద్యా వ్యవస్థను సమూల ప్రక్షాళన చేయాలన్న సంకల్పం వుంది. 

ఇందుకోసం టీఎస్‌ఆర్‌ సుబ్రమణియన్‌ ఆధ్వర్యంలో 2015లో ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీ 2016లో నివేదిక సమర్పించాక ఆ మరుసటి ఏడాది ఇస్రో మాజీ చైర్మన్‌ కస్తూరి రంగన్‌ సారథ్యంలో 8మందితో కమిటీ ఏర్పాటైంది. అది 2018 డిసెంబర్‌లో 484 పేజీల నివేదికను సమర్పించింది. దానిపై అభిప్రాయాలు చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వం అందరినీ కోరింది. ఆనాటినుంచీ నూతన విద్యావిధానం ముసాయిదాపై అనేకానేక చర్చలు జరిగాయి. మొత్తంగా కేంద్రానికి 2 లక్షల సూచనలు అందాయంటున్నారు. వాటి ఆధారంగా తుది ముసాయిదాను రూపొందించారు. 

కస్తూరి రంగన్‌ నివేదిక త్రిభాషా సూత్రంకింద హిందీ బోధనను తప్పనిసరి చేయాలన్న సిఫార్సు చేయడంపై దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. అయితే తాజా ముసాయిదాలో వివాదాస్పదమైన ఈ నిబంధనను తొలగించారు. ఏ రాష్ట్రంపైనా ఏ భాషనూ రుద్దేదిలేదని తుది ముసాయిదా చెబుతోంది. అలాగే ప్రాథమిక విద్య మాతృభాషలోనే వుండాలని కూడా ఈ విధానం శాసించలేదు. ‘కుదిరినమేర కనీసం అయిదో తరగతి వరకూ...సాధ్యమైతే ఎనిమిదో తరగతి వరకూ లేదా అంతకుమించి మాతృభాషలో బోధన వుండాలని సూచించింది. ఈ నిబంధన ప్రభుత్వ పాఠశాలలకూ, ప్రైవేటు పాఠశాలలకూ సమంగా వర్తిస్తుందని తెలిపింది. అలావుండేట్టయితే బోధనా మాధ్యమంపై ఎవరికీ అభ్యంతరం వుండదు. ప్రస్తుతం వున్న 10+2+3 విధానానికి బదులు 5+3+3+4 విధానం అమల్లోకొస్తుంది. పిల్లలకు భిన్న భాషలు నేర్చుకునే సౌలభ్యం కల్పించడం కూడా ఈ విధానంలో మెచ్చదగ్గ అంశం.

విద్యావిధానం అనేది ఎప్పుడూ సున్నితమైన అంశమే. ఆ విధానం చెబుతున్నదేమిటన్న చర్చతోపాటు అది చెప్పకుండా వదిలేసిందేమిటో కూడా చర్చకొస్తుంది. సెకండరీ స్థాయి వరకూ సార్వత్రిక విద్య వుండాలని తాజా ముసాయిదా నిర్దేశిస్తున్నది. కనుక ఆ తర్వాత ఉన్నత స్థాయి విద్యను సార్వత్రికం చేయడం ప్రభుత్వ ఎజెండాలో లేదని అర్ధమవుతుంది. 2010లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం విదేశీ విద్యాసంస్థల బిల్లు తీసుకొచ్చినప్పుడు విపక్షంలో వుండి బీజేపీ దాన్ని గట్టిగా వ్యతిరేకించింది. అవి వసూలు చేసే భారీ ఫీజుల వల్ల విద్యకయ్యే ఖర్చు తడిసిమోపెడవుతుందని, జనాభాలో చాలా తక్కువమందికి మాత్రమే అది లభ్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. పైగా మన విశ్వవిద్యాలయాల అధ్యాపకులకు అత్యధిక వేతనాల ఆశ చూపి తన్నుకుపోతే అక్కడి విద్య దెబ్బతింటుందని హెచ్చరించింది. కానీ తాజా ముసాయిదా విదేశీ విశ్వవిద్యాలయాలకు దారులు పరుస్తోంది. వీటికి వర్తించబోయే నియమనిబంధనలేమిటో చూడాలి. ఈ ముసాయిదాలో మెచ్చదగ్గ అంశాలున్నాయి. 

డిగ్రీ స్థాయి విద్యను నాలుగు సంవత్సరాలకు మార్చారు. ఒకసారంటూ చేరాక జైలు శిక్ష అనుభవించినట్టు అందులోనే వుండిపోనవసరం లేకుండా ఎప్పుడైనా నిష్క్రమించే అవకాశం కల్పించారు. ఒక సంవత్సరం మాత్రమే చదివి నిష్క్రమించేవారికి సర్టిఫికెట్, రెండేళ్ల తర్వాత నిష్క్రమించదల్చుకున్నవారికి డిప్లొమా, మూడేళ్ల చదువు పూర్తి చేసి ఉద్యోగంవైపు వెళ్లదల్చుకున్నవారికి బ్యాచులర్‌ పట్టా ఇస్తారు. ఎంపిక చేసుకున్న సబ్జెక్టులో పరిశోధన చేయదల్చుకున్నవారు నాలుగో సంవత్సరం కొనసాగించవచ్చు. అయిదేళ్ల తర్వాత అయితే మాస్టర్స్‌తో కలిపి ఇంటిగ్రేటెడ్‌ బ్యాచిలర్‌ డిగ్రీ అందజేస్తారు. ఇప్పుడున్నట్టుగాకాక అభిరుచినిబట్టి సబ్జెక్టులు ఎంపిక చేసుకునే స్వేచ్ఛను విద్యార్థులకు ఇవ్వబోతున్నారు. అకౌంట్స్‌తో పాటు కెమిస్ట్రీ లేదా చరిత్రతోపాటు గణితం...ఇలా వేర్వేరు కాంబినేషన్లతో డిగ్రీ చేయొచ్చు. పరిశోధనా రంగానికి ప్రాముఖ్యతనీయడం, అందుకోసం అమెరికాలోవలే నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం హర్షించదగ్గది. ప్రస్తుత విధానం బట్టీ పట్టడాన్నే ప్రోత్సహిస్తోంది. విద్యార్థి తెలివితేటల్ని, అవగాహన శక్తిని కాక జ్ఞాపకశక్తిని ప్రమాణంగా తీసుకుంటోంది. కింది స్థాయినుంచీ విద్యార్థుల్లో పరిశీలనా సామర్థ్యాన్ని పెంపొందిస్తే ఉన్నతస్థాయికి చేరేసరికి వారి దృష్టి పరిశోధనల వైపు మళ్లుతుంది. వినూత్న ఆవిష్కరణలకు దారులు పరుస్తుంది. 

అయితే ఆదర్శాలు ఎంత బలమైనవైనా వాటికి దీటైన ఆచరణ వుండాలి. మన దేశంలో పరిశోధనలకు ప్రధాన ఆటంకంగా వుంటున్నది నిధులే. వాటిని అందుబాటులో వుంచగలిగితేనే పరిశోధనలు విస్తృతమవుతాయి. అసలు మన విద్యారంగానికి ఏటా బడ్జెట్‌లో చేసే కేటాయింపులే అరకొరగా వుంటున్నాయి. జీడీపీలో మరో 2 శాతం మొత్తాన్ని అదనంగా పెంచుతామనడం ఏమూలకూ చాలదు. అలాగే యూజీసీకి బదులుగా ఏర్పడే వ్యవస్థనుంచి విద్యాసంస్థలకు నిధుల కేటాయింపు ఎలావుంటుందో చూడాలి. కొత్త విధానం మన ఫెడరల్‌ వ్యవస్థకు అనుగుణంగా వుండటం, సామాజిక న్యాయం అమలుకావడం, అట్టడుగు కులాల ప్రయోజనాలు పరిరక్షించడం అత్యవసరం. గాంధీజీ చెప్పినట్టు వ్యక్తిత్వాన్ని పెంపొందించే విద్య, విలువలను నేర్పించే విద్య ఏ తరానికైనా అవసరం. అది నూతన విద్యావిధానం సాకారం చేయాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement