TSR Subramanian
-
ఆచరణే గీటురాయి
ప్రాథమిక విద్య మొదలుకొని విశ్వవిద్యాలయ విద్య వరకూ అన్ని స్థాయిల్లోనూ విస్తృతమైన సంస్కరణలు తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన నూతన విద్యా విధానం ముసాయిదాపై కేంద్ర మంత్రి వర్గం బుధవారం ఆమోదముద్ర వేసింది. సమకాలీనత సమృద్ధిగా, నైపుణ్యమే ఇరుసుగా వుంటుందని చెబుతున్న ఈ విద్యావిధానం ప్రధాన లక్ష్యాలు– స్థూల నమోదు నిష్పత్తి(జీఈఆర్)ని ఇప్పుడున్న 26 శాతం నుంచి 50 శాతానికి తీసుకెళ్లడం, జీడీపీలో ఇప్పుడు 4 శాతంగా వున్న విద్యారంగ కేటాయింపుల్ని 6 శాతానికి పెంచడం. 2030 కల్లా జిల్లాకొకటి చొప్పున బహుళ శాస్త్రాల విద్యా సంస్థ నెలకొల్పాలన్నది కూడా ఈ ముసాయిదా ధ్యేయం. తొలిసారి 2014లో అధికారంలోకి వచ్చినప్పటినుంచి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ దేశంలో విద్యా వ్యవస్థను సమూల ప్రక్షాళన చేయాలన్న సంకల్పం వుంది. ఇందుకోసం టీఎస్ఆర్ సుబ్రమణియన్ ఆధ్వర్యంలో 2015లో ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీ 2016లో నివేదిక సమర్పించాక ఆ మరుసటి ఏడాది ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ సారథ్యంలో 8మందితో కమిటీ ఏర్పాటైంది. అది 2018 డిసెంబర్లో 484 పేజీల నివేదికను సమర్పించింది. దానిపై అభిప్రాయాలు చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వం అందరినీ కోరింది. ఆనాటినుంచీ నూతన విద్యావిధానం ముసాయిదాపై అనేకానేక చర్చలు జరిగాయి. మొత్తంగా కేంద్రానికి 2 లక్షల సూచనలు అందాయంటున్నారు. వాటి ఆధారంగా తుది ముసాయిదాను రూపొందించారు. కస్తూరి రంగన్ నివేదిక త్రిభాషా సూత్రంకింద హిందీ బోధనను తప్పనిసరి చేయాలన్న సిఫార్సు చేయడంపై దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. అయితే తాజా ముసాయిదాలో వివాదాస్పదమైన ఈ నిబంధనను తొలగించారు. ఏ రాష్ట్రంపైనా ఏ భాషనూ రుద్దేదిలేదని తుది ముసాయిదా చెబుతోంది. అలాగే ప్రాథమిక విద్య మాతృభాషలోనే వుండాలని కూడా ఈ విధానం శాసించలేదు. ‘కుదిరినమేర కనీసం అయిదో తరగతి వరకూ...సాధ్యమైతే ఎనిమిదో తరగతి వరకూ లేదా అంతకుమించి మాతృభాషలో బోధన వుండాలని సూచించింది. ఈ నిబంధన ప్రభుత్వ పాఠశాలలకూ, ప్రైవేటు పాఠశాలలకూ సమంగా వర్తిస్తుందని తెలిపింది. అలావుండేట్టయితే బోధనా మాధ్యమంపై ఎవరికీ అభ్యంతరం వుండదు. ప్రస్తుతం వున్న 10+2+3 విధానానికి బదులు 5+3+3+4 విధానం అమల్లోకొస్తుంది. పిల్లలకు భిన్న భాషలు నేర్చుకునే సౌలభ్యం కల్పించడం కూడా ఈ విధానంలో మెచ్చదగ్గ అంశం. విద్యావిధానం అనేది ఎప్పుడూ సున్నితమైన అంశమే. ఆ విధానం చెబుతున్నదేమిటన్న చర్చతోపాటు అది చెప్పకుండా వదిలేసిందేమిటో కూడా చర్చకొస్తుంది. సెకండరీ స్థాయి వరకూ సార్వత్రిక విద్య వుండాలని తాజా ముసాయిదా నిర్దేశిస్తున్నది. కనుక ఆ తర్వాత ఉన్నత స్థాయి విద్యను సార్వత్రికం చేయడం ప్రభుత్వ ఎజెండాలో లేదని అర్ధమవుతుంది. 2010లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం విదేశీ విద్యాసంస్థల బిల్లు తీసుకొచ్చినప్పుడు విపక్షంలో వుండి బీజేపీ దాన్ని గట్టిగా వ్యతిరేకించింది. అవి వసూలు చేసే భారీ ఫీజుల వల్ల విద్యకయ్యే ఖర్చు తడిసిమోపెడవుతుందని, జనాభాలో చాలా తక్కువమందికి మాత్రమే అది లభ్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. పైగా మన విశ్వవిద్యాలయాల అధ్యాపకులకు అత్యధిక వేతనాల ఆశ చూపి తన్నుకుపోతే అక్కడి విద్య దెబ్బతింటుందని హెచ్చరించింది. కానీ తాజా ముసాయిదా విదేశీ విశ్వవిద్యాలయాలకు దారులు పరుస్తోంది. వీటికి వర్తించబోయే నియమనిబంధనలేమిటో చూడాలి. ఈ ముసాయిదాలో మెచ్చదగ్గ అంశాలున్నాయి. డిగ్రీ స్థాయి విద్యను నాలుగు సంవత్సరాలకు మార్చారు. ఒకసారంటూ చేరాక జైలు శిక్ష అనుభవించినట్టు అందులోనే వుండిపోనవసరం లేకుండా ఎప్పుడైనా నిష్క్రమించే అవకాశం కల్పించారు. ఒక సంవత్సరం మాత్రమే చదివి నిష్క్రమించేవారికి సర్టిఫికెట్, రెండేళ్ల తర్వాత నిష్క్రమించదల్చుకున్నవారికి డిప్లొమా, మూడేళ్ల చదువు పూర్తి చేసి ఉద్యోగంవైపు వెళ్లదల్చుకున్నవారికి బ్యాచులర్ పట్టా ఇస్తారు. ఎంపిక చేసుకున్న సబ్జెక్టులో పరిశోధన చేయదల్చుకున్నవారు నాలుగో సంవత్సరం కొనసాగించవచ్చు. అయిదేళ్ల తర్వాత అయితే మాస్టర్స్‌తో కలిపి ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ డిగ్రీ అందజేస్తారు. ఇప్పుడున్నట్టుగాకాక అభిరుచినిబట్టి సబ్జెక్టులు ఎంపిక చేసుకునే స్వేచ్ఛను విద్యార్థులకు ఇవ్వబోతున్నారు. అకౌంట్స్‌తో పాటు కెమిస్ట్రీ లేదా చరిత్రతోపాటు గణితం...ఇలా వేర్వేరు కాంబినేషన్లతో డిగ్రీ చేయొచ్చు. పరిశోధనా రంగానికి ప్రాముఖ్యతనీయడం, అందుకోసం అమెరికాలోవలే నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం హర్షించదగ్గది. ప్రస్తుత విధానం బట్టీ పట్టడాన్నే ప్రోత్సహిస్తోంది. విద్యార్థి తెలివితేటల్ని, అవగాహన శక్తిని కాక జ్ఞాపకశక్తిని ప్రమాణంగా తీసుకుంటోంది. కింది స్థాయినుంచీ విద్యార్థుల్లో పరిశీలనా సామర్థ్యాన్ని పెంపొందిస్తే ఉన్నతస్థాయికి చేరేసరికి వారి దృష్టి పరిశోధనల వైపు మళ్లుతుంది. వినూత్న ఆవిష్కరణలకు దారులు పరుస్తుంది. అయితే ఆదర్శాలు ఎంత బలమైనవైనా వాటికి దీటైన ఆచరణ వుండాలి. మన దేశంలో పరిశోధనలకు ప్రధాన ఆటంకంగా వుంటున్నది నిధులే. వాటిని అందుబాటులో వుంచగలిగితేనే పరిశోధనలు విస్తృతమవుతాయి. అసలు మన విద్యారంగానికి ఏటా బడ్జెట్లో చేసే కేటాయింపులే అరకొరగా వుంటున్నాయి. జీడీపీలో మరో 2 శాతం మొత్తాన్ని అదనంగా పెంచుతామనడం ఏమూలకూ చాలదు. అలాగే యూజీసీకి బదులుగా ఏర్పడే వ్యవస్థనుంచి విద్యాసంస్థలకు నిధుల కేటాయింపు ఎలావుంటుందో చూడాలి. కొత్త విధానం మన ఫెడరల్ వ్యవస్థకు అనుగుణంగా వుండటం, సామాజిక న్యాయం అమలుకావడం, అట్టడుగు కులాల ప్రయోజనాలు పరిరక్షించడం అత్యవసరం. గాంధీజీ చెప్పినట్టు వ్యక్తిత్వాన్ని పెంపొందించే విద్య, విలువలను నేర్పించే విద్య ఏ తరానికైనా అవసరం. అది నూతన విద్యావిధానం సాకారం చేయాలి. -
కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శి ‘టీఎస్ఆర్’ కన్నుమూత
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శి టీఎస్ఆర్ సుబ్రమణియన్(79) సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారని అధికార వర్గాలు తెలిపాయి. తమిళనాడుకు చెందిన సుబ్రమణియన్ 1961 ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. ప్రధానమంత్రులు వాజ్‌పేయి, గుజ్రాల్, దేవెగౌడ హయాంలో 1996 నుంచి 1998 వరకు సుబ్రమణియన్ క్యాబినెట్ కార్యదర్శిగా పనిచేసి, పదవీ విరమణ పొందారు. ప్రభుత్వ పాలన, దేశ రాజకీయాలపై ఆయన మూడు పుస్తకాలు రాశారు. కాగా, టీఎస్ఆర్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తంచేశారు. -
ఈ సిఫార్సులు సరిపోతాయా?
పర్యావరణంతో మనిషి, ఇతర జీవుల మనుగడ ముడిపడి ఉన్నదన్న స్పృహ కలిగి, దాన్ని కాపాడటంపై దృష్టిపెట్టి మూడు దశాబ్దాలు దాటింది. ఇన్నాళ్లకు కూడా ఆ విషయంలో మనకు సమగ్ర అవగాహన కొరవడిందని... నాలుగడుగులు ముందుకు, రెండడుగులు వెనక్కు పడుతున్నాయని తరచు రుజువవుతున్నది. ఎన్డీయే సర్కారు ఏర్పడ్డాక నియమించిన నిపుణుల కమిటీ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పుడున్న వివిధ చట్టాల పనితీరును సమీక్షించి ప్రస్తుత అవసరాలకు అనుగుణమైన మార్పులు సూచించాలన్నది కమిటీకి అప్పగించిన పని. ఇందులో భాగంగా అయిదు చట్టాలు- పర్యావరణ పరిరక్షణ చట్టం (1986), అటవీ పరిరక్షణ చట్టం (1980), వన్యప్రాణి సంరక్షణ చట్టం (1972), జల కాలుష్య నివారణ, నియంత్రణ చట్టం (1974), వాయు కాలుష్య నివారణ, నియంత్రణ చట్టం (1981)లను పరిశీలించాలని ప్రభుత్వం కోరింది. కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శి టీఎస్ఆర్ సుబ్రమణియన్ నేతృత్వంలోని ఈ కమిటీ గడువుకు చాలా ముందే నివేదిక సమర్పించింది. సంబంధిత వర్గాలవారందరితో మాట్లాడానని కూడా చెబుతున్నది. హరిత చట్టాలను ఉల్లంఘించే, కాలుష్యాన్ని కుమ్మరించే పరిశ్రమలకు భారీ జరిమానాలు విధించాలని కమిటీ ప్రతిపాదించింది. అంతేకాదు... భవిష్యత్తులో పర్యావరణానికి సంబంధించిన అన్ని అంశాలతో ఒక సమగ్ర చట్టం రూపకల్పనకు కృషిచేయాలని సూచించింది. పర్యావరణ చట్టాలు తమకు అడుగడుగునా అడ్డుతగులుతున్నాయని పారిశ్రామికవేత్తలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. సత్వర అనుమతులు లభించి అభివృద్ధికి బాటలు పరిస్తే తప్ప దేశంలో పేదరిక నిర్మూలన అసాధ్యమని మంత్రుల స్థాయిలోని వారే తరచు వాపోతున్నారు. మరోపక్క మన దేశంలో పర్యావరణ క్షీణతకు చెల్లిస్తున్న మూల్యం ఏపాటో సాక్షాత్తూ ప్రపంచబ్యాంకు గణాంకాలే చెబుతున్నాయి. పర్యావరణ విధ్వంసం కారణంగా భారత్‌కు చేకూరుతున్న నష్టం స్థూల దేశీయోత్పత్తిలో 5.7 శాతమని నిరుడు వెలువరించిన నివేదికలో ప్రపంచబ్యాంకు లెక్కగట్టింది. ఇది డబ్బుల్లో చెప్పాలంటే ఏటా రూ. 3.75 లక్షల కోట్లు. ఈ ఏడాది మొదట్లో ప్రకటించిన ప్రపంచ పర్యావరణ సూచీలో మన దేశం స్థానం 155! బ్రిక్స్‌లోని అయిదు దేశాల్లో అట్టడుగునున్నది మనమే! మన నేతలు నిత్యం కలవరించే సింగపూర్ నాలుగో స్థానంలో ఉంటే పాకిస్థాన్ 148 స్థానంలో ఉండి మనకన్నా నయమనిపించుకున్నది. పర్యావరణ పరిరక్షణపై దృష్టిపెట్టకుండా చేసుకుంటూ పోతున్న పట్టణీకరణ వల్ల భారత్‌లో వాయు కాలుష్యం, జలకాలుష్యం ఎక్కువవుతున్నదని ఆ నివేదిక చెప్పింది. పిల్లల మరణాల్లో దాదాపు 23 శాతం, పెద్దల మరణాల్లో 2.5 శాతం కేవలం పర్యావరణ క్షీణత వల్లే జరుగుతున్నాయని ఒక అంచనా. ఇలాంటి విపత్కర స్థితినుంచి బయటపడటం కోసం ఏం చేయాలో... అభివృద్ధిపై అవసరమైన దృష్టిపెడుతూనే పర్యావరణ పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో మేథోమథనం జరిగి ఉంటే బాగుండేది. కానీ, సుబ్రమణియన్ కమిటీకి ఇచ్చిన పరిశీలనాంశాలు ఎంతసేపూ పరిశ్రమలకు సత్వరానుమతులు లభింపజేయడం ఎలాగా అన్న అంశం చుట్టూనే తిరిగాయి. ఐక్యరాజ్యసమితి అంతర్ ప్రభుత్వ బృందం(ఐపీసీసీ) మొన్న ఏప్రిల్‌లో విడుదల చేసిన నివేదిక పర్యావరణ క్షీణత పర్యవసానాలు ఎలా ఉండగలవో హెచ్చరించింది. ముఖ్యంగా భారత్‌లో వరి, గోధుమ, మొక్కజొన్న వంటి పంటల దిగుబడి గణనీయంగా తగ్గగలదని, మత్స్యసంపద దారుణంగా పడిపోతుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సుబ్రమణియన్ కమిటీ ఇచ్చిన నివేదికను గమనిస్తే నిరాశ కలగక మానదు. వాయు, జల కాలుష్యాల నివారణ విషయంలో జవాబుదారీతనం చాలా తక్కువున్నదని, వాటికి సంబంధించిన వ్యవస్థలు కూడా సరిగా లేవని కమిటీ వ్యక్తంచేసిన అభిప్రాయం వాస్తవమే. అయితే, అందుకు విరుగుడుగా ప్రాజెక్టు నిర్వాహకులే తాము కాలుష్యాన్ని అరికట్టడానికి ఎలాంటి సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించనున్నామో చె ప్పే ఏర్పాటు చేయాలన్నది ప్రతిపాదన. ఈ క్రమంలో ఇక ఇన్స్పెక్టర్ల తనిఖీ వగైరాలుండవు. నిపుణులతో కూడిన కమిటీ వారి ప్రతిపాదనల సహేతుకతను నిర్ధారించి అనుమతులు మంజూరుచేస్తుంది. అనంతర కాలంలో ఇందుకు సంబంధించి ఉల్లంఘనలున్నట్టు తేలితే సంబంధిత కర్మాగారం నిర్వాహకులపై భారీ మొత్తంలో జరిమానా వేయాలన్నది కమిటీ సూచన. రహదారులు, రైల్వేలు, విద్యుత్ పంపిణీ లైన్లు వంటి ‘సరళతర’ ప్రాజెక్టులతోపాటు విద్యుత్, మైనింగ్ ప్రాజెక్టులకూ...‘జాతీయ ప్రాధాన్యమున్న ఇతర ప్రాజెక్టులకు’ ఈ ఫాస్ట్‌ట్రాక్ విధానం వర్తించాలని కమిటీ ప్రతిపాదించింది. కాలుష్య నియంత్రణ మండళ్లు, ఇన్స్పెక్టర్ల తనిఖీలు ఉండగానే పరిస్థితులు ఇంత అధ్వాన్నంగా ఉంటే స్వయం ధ్రువీకరణలు వాటిని ఏమేరకు మెరుగుపర్చగలవో అనుమానమే. మొదటి తప్పునకు భారీ జరిమానా విధించి, రెండోసారి తప్పు చేస్తే ప్రాజెక్టే మూసేయాలని కమిటీ సూచించింది. భారీ మొత్తంలో జరిమానాల విధింపు వరకూ బాగానే ఉన్నా అలాంటి ఉల్లంఘనలపై ఇప్పుడు తీసుకునే క్రిమినల్ చర్యలు ఏమవుతాయన్న సంశయం ఉన్నది. కమిటీ చేసిన సిఫార్సుల్లో కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో పర్యావరణ యాజమాన్య సంస్థలు, జాతీయ లెబోరేటరీ ఏర్పాటు, వీటి నిర్ణయాలపై అప్పీల్ చేసుకునేందుకు అప్పిలేట్ కోర్టు వగైరాలున్నాయి. అయితే, ఇప్పుడున్న గ్రీన్ ట్రిబ్యునళ్ల పరిస్థితి ఏమిటో తెలియదు. సుబ్రమణియన్ కమిటీ నివేదికపై అన్ని స్థాయిల్లో చర్చ జరిగి మరింత మెరుగైన విధానాల రూపకల్పనకు కృషిచేయడం అవసరం. -
పూర్తి స్థాయి బ్యాంక్ హోదానే కోరుతున్న ఇండియా పోస్ట్!
ముంబై: ఇండియా పోస్ట్ పూర్తిస్థాయి బ్యాంక్ (యూనివర్సల్ బ్యాంక్) హోదానే కోరుకుంటోందని మహారాష్ట్ర సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ ప్రదీప్ కుమార్ బిషోయ్ పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగా ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ఇండియా పోస్ట్ పూర్తిస్థాయి బ్యాంక్ హోదానే కోరుకుంటున్నప్పటికీ, తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ అంశం మాజీ క్యాబినెట్ సెక్రటరీ టీఎస్ఆర్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కమిటీ పరిశీలనలో ఉందని సైతం ఆయన అన్నారు. ఇండియా పోస్ట్‌కు కేవలం పేమెంట్ బ్యాంక్ హోదా ఇచ్చే అవకాశం ఉందని ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో బిషోయ్ చేసిన ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది.