పర్యావరణంతో మనిషి, ఇతర జీవుల మనుగడ ముడిపడి ఉన్నదన్న స్పృహ కలిగి, దాన్ని కాపాడటంపై దృష్టిపెట్టి మూడు దశాబ్దాలు దాటింది. ఇన్నాళ్లకు కూడా ఆ విషయంలో మనకు సమగ్ర అవగాహన కొరవడిందని... నాలుగడుగులు ముందుకు, రెండడుగులు వెనక్కు పడుతున్నాయని తరచు రుజువవుతున్నది. ఎన్డీయే సర్కారు ఏర్పడ్డాక నియమించిన నిపుణుల కమిటీ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పుడున్న వివిధ చట్టాల పనితీరును సమీక్షించి ప్రస్తుత అవసరాలకు అనుగుణమైన మార్పులు సూచించాలన్నది కమిటీకి అప్పగించిన పని. ఇందులో భాగంగా అయిదు చట్టాలు- పర్యావరణ పరిరక్షణ చట్టం (1986), అటవీ పరిరక్షణ చట్టం (1980), వన్యప్రాణి సంరక్షణ చట్టం (1972), జల కాలుష్య నివారణ, నియంత్రణ చట్టం (1974), వాయు కాలుష్య నివారణ, నియంత్రణ చట్టం (1981)లను పరిశీలించాలని ప్రభుత్వం కోరింది. కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శి టీఎస్‌ఆర్ సుబ్రమణియన్ నేతృత్వంలోని ఈ కమిటీ గడువుకు చాలా ముందే నివేదిక సమర్పించింది. సంబంధిత వర్గాలవారందరితో మాట్లాడానని కూడా చెబుతున్నది. హరిత చట్టాలను ఉల్లంఘించే, కాలుష్యాన్ని కుమ్మరించే పరిశ్రమలకు భారీ జరిమానాలు విధించాలని కమిటీ ప్రతిపాదించింది. అంతేకాదు... భవిష్యత్తులో పర్యావరణానికి సంబంధించిన అన్ని అంశాలతో ఒక సమగ్ర చట్టం రూపకల్పనకు కృషిచేయాలని సూచించింది.
పర్యావరణ చట్టాలు తమకు అడుగడుగునా అడ్డుతగులుతున్నాయని పారిశ్రామికవేత్తలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. సత్వర అనుమతులు లభించి అభివృద్ధికి బాటలు పరిస్తే తప్ప దేశంలో పేదరిక నిర్మూలన అసాధ్యమని మంత్రుల స్థాయిలోని వారే తరచు వాపోతున్నారు. మరోపక్క మన దేశంలో పర్యావరణ క్షీణతకు చెల్లిస్తున్న మూల్యం ఏపాటో సాక్షాత్తూ ప్రపంచబ్యాంకు గణాంకాలే చెబుతున్నాయి. పర్యావరణ విధ్వంసం కారణంగా భారత్‌కు చేకూరుతున్న నష్టం స్థూల దేశీయోత్పత్తిలో 5.7 శాతమని నిరుడు వెలువరించిన నివేదికలో ప్రపంచబ్యాంకు లెక్కగట్టింది. ఇది డబ్బుల్లో చెప్పాలంటే ఏటా రూ. 3.75 లక్షల కోట్లు.
ఈ ఏడాది మొదట్లో ప్రకటించిన ప్రపంచ పర్యావరణ సూచీలో మన దేశం స్థానం 155! బ్రిక్స్‌లోని అయిదు దేశాల్లో అట్టడుగునున్నది మనమే! మన నేతలు నిత్యం కలవరించే సింగపూర్ నాలుగో స్థానంలో ఉంటే పాకిస్థాన్ 148 స్థానంలో ఉండి మనకన్నా నయమనిపించుకున్నది. పర్యావరణ పరిరక్షణపై దృష్టిపెట్టకుండా చేసుకుంటూ పోతున్న పట్టణీకరణ వల్ల భారత్‌లో వాయు కాలుష్యం, జలకాలుష్యం ఎక్కువవుతున్నదని ఆ నివేదిక చెప్పింది. పిల్లల మరణాల్లో దాదాపు 23 శాతం, పెద్దల మరణాల్లో 2.5 శాతం కేవలం పర్యావరణ క్షీణత వల్లే జరుగుతున్నాయని ఒక అంచనా. ఇలాంటి విపత్కర స్థితినుంచి బయటపడటం కోసం ఏం చేయాలో... అభివృద్ధిపై అవసరమైన దృష్టిపెడుతూనే పర్యావరణ పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో మేథోమథనం జరిగి ఉంటే బాగుండేది.
కానీ, సుబ్రమణియన్ కమిటీకి ఇచ్చిన పరిశీలనాంశాలు ఎంతసేపూ పరిశ్రమలకు సత్వరానుమతులు లభింపజేయడం ఎలాగా అన్న అంశం చుట్టూనే తిరిగాయి. ఐక్యరాజ్యసమితి అంతర్ ప్రభుత్వ బృందం(ఐపీసీసీ) మొన్న ఏప్రిల్‌లో విడుదల చేసిన నివేదిక పర్యావరణ క్షీణత పర్యవసానాలు ఎలా ఉండగలవో హెచ్చరించింది. ముఖ్యంగా భారత్‌లో వరి, గోధుమ, మొక్కజొన్న వంటి పంటల దిగుబడి గణనీయంగా తగ్గగలదని, మత్స్యసంపద దారుణంగా పడిపోతుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సుబ్రమణియన్ కమిటీ ఇచ్చిన నివేదికను గమనిస్తే నిరాశ కలగక మానదు. వాయు, జల కాలుష్యాల నివారణ విషయంలో జవాబుదారీతనం చాలా తక్కువున్నదని, వాటికి సంబంధించిన వ్యవస్థలు కూడా సరిగా లేవని కమిటీ వ్యక్తంచేసిన అభిప్రాయం వాస్తవమే.
అయితే, అందుకు విరుగుడుగా ప్రాజెక్టు నిర్వాహకులే తాము కాలుష్యాన్ని అరికట్టడానికి ఎలాంటి సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించనున్నామో చె ప్పే ఏర్పాటు చేయాలన్నది ప్రతిపాదన. ఈ క్రమంలో ఇక ఇన్‌స్పెక్టర్ల తనిఖీ వగైరాలుండవు. నిపుణులతో కూడిన కమిటీ వారి ప్రతిపాదనల సహేతుకతను నిర్ధారించి అనుమతులు మంజూరుచేస్తుంది. అనంతర కాలంలో ఇందుకు సంబంధించి ఉల్లంఘనలున్నట్టు తేలితే సంబంధిత కర్మాగారం నిర్వాహకులపై భారీ మొత్తంలో జరిమానా వేయాలన్నది కమిటీ సూచన. రహదారులు, రైల్వేలు, విద్యుత్ పంపిణీ లైన్లు వంటి ‘సరళతర’ ప్రాజెక్టులతోపాటు విద్యుత్, మైనింగ్ ప్రాజెక్టులకూ...‘జాతీయ ప్రాధాన్యమున్న ఇతర ప్రాజెక్టులకు’ ఈ ఫాస్ట్‌ట్రాక్ విధానం వర్తించాలని కమిటీ ప్రతిపాదించింది.
కాలుష్య నియంత్రణ మండళ్లు, ఇన్‌స్పెక్టర్ల తనిఖీలు ఉండగానే పరిస్థితులు ఇంత అధ్వాన్నంగా ఉంటే స్వయం ధ్రువీకరణలు వాటిని ఏమేరకు మెరుగుపర్చగలవో అనుమానమే. మొదటి తప్పునకు భారీ జరిమానా విధించి, రెండోసారి తప్పు చేస్తే ప్రాజెక్టే మూసేయాలని కమిటీ సూచించింది. భారీ మొత్తంలో జరిమానాల విధింపు వరకూ బాగానే ఉన్నా అలాంటి ఉల్లంఘనలపై ఇప్పుడు తీసుకునే క్రిమినల్ చర్యలు ఏమవుతాయన్న సంశయం ఉన్నది. కమిటీ చేసిన సిఫార్సుల్లో కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో పర్యావరణ యాజమాన్య సంస్థలు, జాతీయ లెబోరేటరీ ఏర్పాటు, వీటి నిర్ణయాలపై అప్పీల్ చేసుకునేందుకు అప్పిలేట్ కోర్టు వగైరాలున్నాయి. అయితే, ఇప్పుడున్న గ్రీన్ ట్రిబ్యునళ్ల పరిస్థితి ఏమిటో తెలియదు. సుబ్రమణియన్ కమిటీ నివేదికపై అన్ని స్థాయిల్లో చర్చ జరిగి మరింత మెరుగైన విధానాల రూపకల్పనకు కృషిచేయడం అవసరం.
ఈ సిఫార్సులు సరిపోతాయా?
Published Sat, Nov 22 2014 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM
Advertisement
Advertisement