విశ్లేషణ
దేశంలో దాదాపు 60 శాతం మంది రైతులు ఏమాత్రం అవకాశం ఉన్నా సరే... వ్యవసాయం మానేయాలని కోరుకుంటున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం నష్టాలు! 54 ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో వ్యవసాయ నష్టాలను పూడ్చేందుకు బడ్జెట్ మద్దతును అందించని ఏకైక దేశం భారత్ మాత్రమే. ఇప్పటికీ వ్యవసాయ రంగ వృద్ధి కేవలం 1.4 శాతం మాత్రమే. వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా దారిద్య్రంలో ఉంచడం దీనికి కారణం. అసమానతలను పెంచిపోషిస్తున్న ఆర్థిక సిద్ధాంతాలను ఇంకా పట్టుకుని వేలాడటంలో అర్థం లేదు. అత్యధిక జనాభా వ్యవసాయంలో ఉన్న దేశంలో దానికి అనులోమంగానే బడ్జెట్‌లో స్థిరంగా కొన్నేళ్లు కనీసం 50 శాతం వ్యవసాయ, గ్రామీణ రంగాలకు కేటాయించాలి.
అది 1996వ సంవత్సరం. ఎన్నికల ఫలితాలు వెలువడి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఒకటీ రెండు రోజుల తర్వాత, న్యూఢిల్లీలో కొంతమంది ఆర్థికవేత్తలతో ఆంతరంగిక సమా వేశం జరిగింది. ప్రధానమంత్రిగా ఎన్నికైన వాజ్‌పేయి రాకపోవడంతో, మరో రాజకీయ ప్రముఖుడు మురళీ మనోహర్ జోషి ఆ సమా వేశానికి అధ్యక్షత వహించారు.
ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోకుండా ఉండాలంటే, ఎన్‌డీఏ ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక విధానాలను తీసుకురావాలో సూచించాలని ఆ సమావేశంలో ఆర్థికవేత్తలను కోరారు. హాజరైన చాలామంది ద్రవ్య లోటును నిశితంగా పరిశీలించాలనీ, కరెంట్ ఖాతా లోటును తగ్గించే మార్గాలను కనుగొనాలనీ అభిప్రాయం వెలిబుచ్చారు. కీలకమైనవిగా గుర్తించిన సమస్యలపై చాలా చర్చ జరిగింది. ఉపాధిని సృష్టించడం, తయారీని పెంచడం, ఎగుమతుల ఆర్థిక వ్యవస్థను నిర్మించడం వంటి ఇతర ముఖ్యమైన సమస్యలపై కూడా చర్చ జరిగింది.
విధానపరమైన ప్రాధాన్యం దేనిపై ఉండాలో సూచించమని నన్ను అడిగినప్పుడు, వ్యవసాయంలో నిమగ్నమై ఉన్న 60 శాతం జనాభాకు బడ్జెట్‌లో 60 శాతం మేరకు అందించాలని నేను సమాధాన మిచ్చాను. అక్కడ ఉన్న నా సహచరుల్లో చాలామంది నాతో ఏకీభవించలేదు. వ్యవసాయానికి 60 శాతం బడ్జెట్‌ను కేటాయిస్తే ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందని కొందరు హెచ్చరించారు.
పరిశ్రమలు, మౌలిక సదుపాయ రంగాలకు భారీ కేటాయింపులు జరపాలనీ, దాన్నే అధిక ఆర్థిక వృద్ధికి దారితీసే కచ్చితమైన మార్గంగా తీసుకోవాలనీ వారు నొక్కి చెప్పారు. అయితే కొత్త నమూనాకూ, ఆర్థిక చింతనకూ ఇదే సమయమనీ, వ్యవసాయానికి తగిన బడ్జెట్ కేటాయింపు చేయకపోతే దేశం సర్వతోముఖంగా అభివృద్ధి చెందదనీ నేనూ నొక్కిచెప్పాను.
నా సలహా ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తల ఆలోచనతో పొసగదని నాకు తెలుసు. కానీ, ప్రభుత్వ వ్యతిరేకతను తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం వ్యవసాయంలో, గ్రామీణాభివృద్ధిలో తగినంత పెట్టుబడి పెట్టడమేనని నా అవగాహన. మా అభిప్రాయాలను ప్రధానికి తెలియ జేస్తానని జోషి చెప్పడంతో సమావేశం ముగిసింది.
కొన్ని రోజుల తర్వాత, కొత్త ప్రభుత్వం వ్యవసాయానికి 60 శాతం బడ్జెట్‌ను కేటాయించాలనే ఉద్దేశాన్ని ప్రకటించినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. వ్యవసాయంలో చాలా వనరులను అందుబాటులో ఉంచాల్సిన అవసరం గురించి మీడియాలో కోలాహలం చెలరేగింది.
చాలామంది నిపుణులు దీనివల్ల ఆర్థిక వ్యవస్థ తిరోగమిస్తుందని అన్నారు. నా వాదన ఏమిటంటే, భారతదేశం అధిక వృద్ధి పథం వైపు సాగుతున్నప్పుడు, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న తన జనాభాలో మూడింట రెండు వంతుల మందిని వెనుకే విడిచిపెట్టడం సాధ్యం కాదు.
ఇది సాధ్యం చేయాలంటే, రాజకీయ తత్వవేత్త జాన్ రాల్ సూచించిన న్యాయసూత్రాలకు అనుగుణంగా నడుచుకోవాలంటే, మన విధాన ప్రయత్నం భిన్నంగా ఉండాలి. మానవ మూలధన పెట్టు బడికి, వ్యవసాయాన్ని పునర్నిర్మించడానికి, ఆరోగ్యం, విద్యారంగా లతో సహా గ్రామీణ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి తగిన ఆర్థిక వనరులను కల్పించాలి.
ఈ క్రమంలో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే, ఆర్థిక చింతనలో, విధానాల్లో కీలక మార్పు తేవడం వల్లనే, ప్రధానమంత్రి ఇప్పుడు చెబుతున్న ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ను నిజం చేయ వచ్చు. అయితే, వాజ్‌పేయి ప్రభుత్వం 13 రోజులు మాత్రమే కొన సాగింది. దాంతో మార్పునకు బలమైన పునాది వేయగలిగే ఆశ కూడా ఉనికిలో లేకుండా పోయింది.
నేను దీన్ని ఎందుకు పంచుకుంటున్నానంటే, మొత్తం బడ్జెట్‌లో వ్యవసాయానికి కేటాయింపులు మరింత తగ్గాయి. లక్షలాదిమంది జీవనోపాధికి వ్యవసాయం బాధ్యత వహిస్తున్న నేపథ్యంలో ఇది ఆందోళనకరం. బడ్జెట్‌లో వ్యవసాయం వాటా 2019–20లో అప్పటికే కనిష్ఠంగా ఉన్న 5.44 శాతం నుంచి, 2024–25లో 3.15 శాతానికి పడి పోయింది. వనరుల కేటాయింపులపై ఆధిపత్యం చలాయించేది రాజకీయ ఆర్థిక కారకాలు (బడా వ్యాపారులచే ఎక్కువగా ప్రభా వితమవుతాయి) అని గ్రహించినప్పుడు, తప్పు మార్గాలేమిటో స్పష్టంగా కనిపిస్తాయి.
జనాభాలో 42.3 శాతం మంది ఇప్పటికీ వ్యవసాయంలో నిమగ్నమై ఉండగా, దాని వృద్ధి కేవలం 1.4 శాతంగా ఉంటోందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంకా దారుణంగా, సగటు వ్యవసాయ ఆదాయాలు బాగా క్షీణించాయి. వాస్తవ గ్రామీణ వేతనాలు దశాబ్ద కాలంగా స్తబ్దుగా కొనసాగుతున్నాయి. నేను తరచుగా చెప్పినట్లు, వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా దారిద్య్రంలో ఉంచడం దీనికి కారణం.
దేశంలో దాదాపు 60 శాతం మంది రైతులు ఏమాత్రం అవకాశం ఉన్నా సరే... వ్యవసాయం మానేయాలని కోరుకుంటున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మరి భారతీయ రైతులు ఇంత దారుణంగా ఎలా నష్టపోతున్నారని మీరు ఆలోచిస్తున్నట్లయితే, ‘ఆర్గనై జేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ – డెవలప్‌మెంట్’ (ఓఈసీడీ) చేసిన ఇటీవలి అధ్యయనం పనికొస్తుంది.
భారతీయ వ్యవసాయం అట్టడుగున ఉండటమే కాక, 2022లో 20.18 శాతం ప్రతికూల స్థూల వ్యవసాయ జమను (మైనస్) అందుకుంది. అయితే, 54 ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఈ వ్యవసాయ నష్టాలను పూడ్చేందుకు బడ్జెట్ మద్దతును అందించని ఏకైక దేశం భారత్ మాత్రమే.
జనాభాలో దాని వాటాకు అనులోమానుపాతంలో కొన్ని సంవత్సరాలపాటు వ్యవసాయానికి సరైన వనరులను అందించినట్ల యితే, అది అద్భుతమైన ఆర్థిక పరిపుష్టిని సంతరించుకుంటుంది. వనరుల కేటాయింపులు తగ్గుముఖం పట్టిన తర్వాత, వ్యవసాయ రంగంలో అద్భుతం జరుగుతుందని ఆశించడం వ్యర్థం. 1996లో అప్పటి ఎన్‌డీఏ ప్రభుత్వం వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి బడ్జెట్‌లో 60 శాతం వాటాను అందించడానికి అంగీకరించి ఉంటే, నేటివరకు అది కొనసాగి ఉంటే, భారతదేశ గ్రామీణ ముఖచిత్రం పూర్తిగా మారి పోయి ఉండేది.
ఇప్పుడు కూడా, వ్యవసాయంలో జనాభా 42.3 శాతంగా ఉన్నందున, రూ.48 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌లో కనీసం 50 శాతం వ్యవసాయ, గ్రామీణ రంగాలకు కేటాయించాలని చెప్పడానికి బలమైన కారణాలు ఉన్నాయి. పేదలు, మహిళలు, యువత, అన్న దాత అనే నాలుగు కొత్త ‘కులాలను’ చేరుకోవడానికి బహుశా ఇది ఉత్తమ మార్గం. వాస్తవానికి, వ్యవసాయం అన్ని రకాల కుల రూపాలకు జీవనోపాధిని అందిస్తుంది.
వ్యవసాయంలో తగిన వనరులను ఉంచడం, పనితీరును మెరుగుపర్చడం వల్ల స్థిరమైన జీవనోపాధిని నిర్మించడమే కాకుండా వ్యాపారాన్ని సమర్థంగా నిర్వహించే ఆకాంక్ష లను కూడా ప్రోత్సహిస్తుంది. వ్యవసాయంలో తగిన పెట్టుబడులను కల్పిస్తే అవి ప్రపంచంలోని 75 శాతం మంది పేదల పేదరికాన్ని తగ్గించడంలో సహాయపడతాయని ప్రపంచ బ్యాంకు కూడా ఎక్కడో అంగీకరించింది.
ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన 1 శాతం మంది, దిగువన ఉన్న 95 శాతం కంటే ఎక్కువ సంపదను కూడబెట్టుకున్న తరుణంలో... అసమానతలను మరింత పెంచిన ఆర్థిక సిద్ధాంతాలను పట్టుకుని వేలాడటంలో అర్థం లేదు. కాబట్టి భారతదేశం, దాని సొంత గాథను లిఖించవలసిన అవసరం ఉంది. ఇదంతా వ్యవసాయాన్ని పునరుజ్జీవింపజేయడం ద్వారా ప్రారంభమవుతుంది.
దేవీందర్ శర్మ
వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు
ఈ–మెయిల్: hunger55@gmail.com
Comments
Please login to add a commentAdd a comment