అధిక జనాభా వరమా! | Sakshi Editorial On debate topic of National Population | Sakshi
Sakshi News home page

అధిక జనాభా వరమా!

Published Wed, Oct 23 2024 4:14 AM | Last Updated on Wed, Oct 23 2024 4:14 AM

Sakshi Editorial On debate topic of National Population

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఇష్టమున్నా లేకున్నా జనాభా అంశంపై చర్చ ఊపందుకుంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మరో ఏణ్ణర్థంలో ప్రారంభం కావాల్సిన నేపథ్యంలో ఈ చర్చ ఎంతో అవసరమైనదీ, తప్పనిసరైనదీ. అయితే ఇందులో ఇమిడివున్న, దీనితో ముడిపడివున్న అనేకానేక ఇతర విషయాలను కూడా స్పృశిస్తే ఈ చర్చ అర్థవంతంగా ఉంటుంది. 

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సామూహిక వివాహాల సందర్భంగా సోమవారం కొత్త దంపతుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ‘2026లో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన పుణ్యమా అని చిన్న కుటుంబానికి బదులు ఎక్కువమంది సంతానాన్ని కనాలని ఆశీర్వదించే రోజులొచ్చేశాయి’ అని వ్యాఖ్యానించటం గమనించదగ్గది. తెలుగునాట అష్టయిశ్వర్యాలు లభించాలని దంపతులను ఆశీర్వదించినట్టే తమిళగడ్డపై కొత్త దంపతులకు 16 రకాల సంపదలు చేకూరాలని ఆకాంక్షించటం సంప్రదాయం. 

ఆ ఆకాంక్షను పొడిగించి ఎక్కువమంది పిల్లల్ని కనాలని ఆశీర్వదించాల్సి వస్తుందన్నది ఆయన చమత్కారం. ఆ మాటల వెనక ఆంతర్యం చిన్నదేమీ కాదు. పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యాక లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 543 స్థానాలూ అమాంతం 753కు చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. అంటే ఒక్కసారిగా 210 స్థానాలు పెరుగుతాయన్న మాట! ఆ నిష్పత్తిలో శాసన సభల్లో సైతం సీట్ల పెరుగుదల ఉంటుంది. 

జనాభా పెరుగుదల రేటులో తీవ్ర వ్యత్యాసాలు కనబడుతున్న నేపథ్యంలో అధిక జనాభాగల ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ లోక్‌సభ స్థానాలూ... ఆ పెరుగుదల అంతగా లేని దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సంఖ్యలో స్థానాలూ వస్తాయన్నది ఒక అంచనా. మరో మాటలో చెప్పాలంటే జనాభా నియంత్రణపైనా, విద్యపైనా, ఆర్థికాభివృద్ధిపైనా పెద్దగా దృష్టి పెట్టని రాష్ట్రాలు లాభపడబోతున్నాయన్నమాట!

దేశంలో చివరిసారిగా 1976లో పునర్విభజన జరిగింది. ఈ ప్రక్రియ క్రమం తప్పకుండా చేస్తే సమస్యలకు దారి తీయొచ్చన్న కారణంతో 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి పునర్విభజన ప్రక్రియను 2000 వరకూ స్తంభింపజేశారు. అయితే 2001లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా నియోజకవర్గాల పరిధిలోని ప్రాంతాల హేతుబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు. 

దాని ప్రకారం లోక్‌సభ స్థానాల సంఖ్య, వాటి పరిధి 2026 తర్వాత జరిగే జనగణన వరకూ మారదు. అయితే ఆ పరిధిలోని అసెంబ్లీ స్థానాలను హేతుబద్ధీకరించవచ్చు. దాని పర్యవసానంగా ఉమ్మడి ఏపీ అసెంబ్లీలోని 294 స్థానాల సంఖ్య మారకపోయినా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో జిల్లాలవారీగా సీట్ల సంఖ్య మారింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాగే జరిగింది.

ప్రతి రాష్ట్రానికీ దాని జనాభా నిష్పత్తికి అనుగుణంగా లోక్‌సభలో ప్రాతినిధ్యం కల్పించాలని మన రాజ్యాంగం నిర్దేశిస్తోంది. దేశంలో ప్రతి ఒక్కరి ఓటు విలువా ఒకేవిధంగా ఉండాలన్నది దీని ఆంతర్యం. 2021లో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా వాయిదా వేయక తప్పలేదని కేంద్రం ప్రకటించింది. కనుక వాస్తవ జనాభా ఎంతన్నది తెలియకపోయినా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలోని సాంకేతిక బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ సంఖ్యను 142 కోట్లుగా లెక్కేస్తున్నారు. 

రాష్ట్రాలవారీగా జనాభా ఎంతన్న అంచనాలు కూడా వచ్చాయి. దాన్నే పరిగణనలోకి తీసుకుంటే ఉత్తరప్రదేశ్‌ నుంచి ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలు 80 కాస్తా 128కి చేరుతాయి. బిహార్‌కు ఇప్పుడు 40 స్థానాలున్నాయి. అవి 70కి ఎగబాకుతాయి. అలాగే మధ్యప్రదేశ్‌కు ఇప్పుడున్న 29 నుంచి 47కూ, రాజస్థాన్‌కు ప్రస్తుతం ఉన్న 25 కాస్తా 44కు పెరుగుతాయని అంచనా. మహారాష్ట్రకు ప్రస్తుతం 48 ఉండగా అవి 68కి వెళ్లే అవకాశం ఉందంటున్నారు. కానీ అదే సమయంలో జనాభా నియంత్రణలో విజయం సాధించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పెరిగే సీట్ల సంఖ్య స్వల్పంగా ఉంటుంది. 

దేశ జనాభా వేగంగా పెరుగుతున్నదనీ, ఇదే కొనసాగితే భవిష్యత్తులో అందరికీ చాలినంత ఆహారం లభ్యం కావటం అసాధ్యమన్న అభిప్రాయం ఒకప్పుడుండేది. ఎమర్జెన్సీ రోజుల్లో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించిన ఉదంతాలకు లెక్కేలేదు. మొత్తంగా జనాభా పెరుగుతూనే ఉన్నా, ప్రపంచంలో అత్యధిక జనాభాగల దేశం మనదే అయినా గడిచిన దశాబ్దాల్లో పెరుగుదల రేటు తగ్గింది. ఈ తగ్గుదల సమంగా లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో అధికంగా, ఉత్తరాది రాష్ట్రాల్లో స్వల్పంగా నమోదవుతోంది. ఉదాహరణకు 1951లో తమిళనాడు జనాభా బిహార్‌ కంటే స్వల్పంగా అధికం. 6 దశాబ్దాల తర్వాత బిహార్‌ జనాభా తమిళనాడుకన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ!

దక్షిణాదిన జనాభా పెరుగుదల పెద్దగా లేకపోవటానికి ఆర్థికాభివృద్ధి, స్త్రీలు బాగా చదువు కోవటం, దారిద్య్రం తగ్గటం ప్రధాన కార ణాలు. దేశ జనాభాలో 18 శాతంగల దక్షిణాది రాష్ట్రాలు దేశ జీడీపీకి 35 శాతం వాటా అందిస్తున్నాయి. కుటుంబాల్లో స్త్రీల నిర్ణయాత్మక పాత్ర ఉత్తరాదితో పోలిస్తే పెరిగింది. కీలకాంశాల్లో ఉత్తరాది రాష్ట్రాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఈ వైఫల్యం వరం కావటం న్యాయమేనా? స్టాలిన్‌ మాటల ఆంతర్యం అదే. 

మరికొందరు నేతలు జనాభా పెంచమంటూ ముసిముసి నవ్వులతో సభల్లో చెబుతున్నారు. ఇది నవ్వులాట వ్యవహారం కాదు. పునరుత్పాదక హక్కు పూర్తిగా మహిళలకే ఉండటం, అంతిమ నిర్ణయం వారిదే కావటం కీలకం. అసలు పునర్విభజనకు జనాభా మాత్రమే కాక, ఇతరేతర అభివృద్ధి సూచీలనూ, దేశ ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రాల పాత్రనూ పరిగణనలోకి తీసుకోవటం అవసరం. ఈ విషయంలో విఫలమైతే దక్షిణాది రాష్ట్రాల్లో అసంతృప్తి పెరగటం ఖాయమని కేంద్రం గుర్తించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement