Census India
-
మంచి పనిని కించపరుస్తారా?
జనాభా సమీకరణాల్లో వస్తున్నంత పరివర్తన సామాజికార్థిక పరిస్థితుల్లో రాకపోవడం దేశంలో ఏకరీతి ప్రగతికి సవాల్ విసురుతోంది. అసమగ్ర అభివృద్ధికి ప్రభుత్వాలే కారణమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ‘జనాభా ఆధారంగా చట్టసభలకు ప్రాతినిధ్య’ పద్ధతి సమాఖ్య స్ఫూర్తికే విఘాతం కలిగించేలా పరిణమించింది. నియోజకవర్గ పునర్విభజనతో జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెరుగనుండగా, దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గనున్నాయి. జనాభా నియంత్రిస్తే తప్పయినట్టు, ఎక్కువ మంది పిల్లల్ని కనడమే గొప్పయినట్టు అధికారిక ప్రచారాలు, అమలు చర్యలు మొదలయ్యే ప్రమాదముంది. ఈ పరిస్థితులపై లోతైన సమగ్ర అధ్యయనం, దిద్దుబాటు చర్యలు తక్షణావసరం.మనమిపుడు 140 కోట్ల మందితో ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా ఉన్నాం. వనరులు, సదుపాయాలు, జనాభా నిష్పత్తిలో చూసినపుడు ఇదొక సంక్లిష్ట నమూనా! ఇటీవలి వరకు అధిక జనాభా దేశంగా ఉన్న చైనా కొన్నేళ్లుగా కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలతో జనాభా వృద్ధిని నిలువరించింది. మనం కూడా నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ, ఆశించిన లక్ష్యాలు అందుకోలేకపోయాం. అయితే, దేశంలోని కొన్ని, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు ఈ విషయంలో మంచి విజయాలు సాధించాయి. అర్థవంతమైన సంతానోత్పత్తి రేటు తరుగుదలను నమోదు చేశాయి. ఇది ప్రగతి సంకేతమే! కానీ, అదే తమ పాలిట శాపంగా పరిణమించిందని ఇప్పుడా రాష్ట్రాలు నెత్తి బాదుకుంటు న్నాయి. ప్రధానంగా రెండు సమస్యల్ని ఎదుర్కొంటున్నామని ఆ యా రాష్ట్రాల అధినేతలు భావిస్తున్నారు. ఒకటి, సంతానోత్పత్తి రేటు నియంత్రణ వల్ల పిల్లలు, యువ జనాభా తగ్గుతూ, వృద్ధుల జనాభా నిష్పత్తి పెరుగుతోంది. రెండోది, జనాభా నిలువరింపు కారణంగా, జాతీయ సగటు జనాభా ఆధారంగా జరిగే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో ఆ యా రాష్ట్రాల్లో ఎంపీ స్థానాల సంఖ్య తగ్గనుంది. ఇది దేశంలోని అత్యున్నత విధాన నిర్ణాయక సభలో ప్రాతినిధ్యం కోతగా భావిస్తూ వారు కలత చెందుతున్నారు. ఇంకోవైపు, జనాభాను అదుపు చేయక, సంతానోత్పత్తి రేటును అధికంగానే చూపుతున్న రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాల సంఖ్య పెరుగనుండటం దేనికి సంకేతం? అనే ప్రశ్న పుట్టుకొస్తోంది.తగ్గిన సంతానోత్పత్తి రేటుదక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య భారతంలోని చిన్న రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటులో రమారమి తరుగుదల నమోదైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోనూ ఈ రేటు తక్కువగానే ఉంది. 2019–21 కాలంలో, దేశంలోనే అత్యల్పంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో సంతానోత్పత్తి రేటు 1.4గా ఉంటే... తెలంగాణ, ఏపీ, కేరళ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లలో ఇది 1.5గా నమోదయినట్టు ‘భారత రిజిస్ట్రార్ జనరల్’ నివేదిక చెబుతోంది. ‘పిల్లలు కనే వయసు’ కాలంలో మహిళలకు పుట్టిన పిల్లల సంఖ్య సగటును, ఆ ప్రాంతపు లేదా ఆ రాష్ట్రపు సంతా నోత్పత్తి రేటుగా పరిగణిస్తారు. అదే సమయంలో బిహార్ (3), ఉత్తర ప్రదేశ్ (2.7), మధ్యప్రదేశ్ (2.6) రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు అధి కంగా నమోదవుతోంది. ఎక్కువ సంతానోత్పత్తి రేటున్న రాష్ట్రాల్లో అభివృద్ధి మందగించడం సహజం.సంతానోత్పత్తి పరిమితుల్లో ఉండటం ప్రగతి సంకేతమే అయినా, మరో సమస్యకు అది కారణమవుతోంది. ఒక వంక పుట్టే పిల్లల సంఖ్య తగ్గుతుంటే, మరోవంక శాస్త్ర సాంకేతికత పురోగతి పుణ్యమా అని మనిషి సగటు జీవనకాలం పెరగటం వల్ల వృద్ధుల సంఖ్య అధిక మవుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లోలాగా ఒక నిర్దిష్ట వయసు దాటినవారికి ప్రభుత్వమే కల్పించే సామాజిక భద్రత పథకాలు, కార్యక్రమాలు మనవద్ద లేకపోవడంతో వారి పోషణ, ఆరోగ్య నిర్వహణ కుటుంబాలకు అదనపు ఆర్థిక భారంగా పరిణమిస్తు న్నాయి. జనాభా ఆధారంగానే వివిధ కేంద్ర పథకాలు, సంక్షేమ కార్య క్రమాల నిధుల కేటాయింపులు, చివరకు చట్టసభల్లో ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్య సంఖ్య ఖరారు కూడా జరగటం తమకు నష్టం కలిగిస్తోందని ఏపీ, తమిళనాడు ముఖ్యమంత్రులు వ్యాఖ్యానించారు.ఆధారపడే జనాభా రేటులో వృద్ధిప్రపంచంలోనే అత్యధిక యువజనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డులకెక్కింది. కానీ, ఇటీవలి కాలంలో వృద్ధుల జనాభా శాతం క్రమంగా పెరుగుతున్నట్టు, మున్ముందు అది మరింత పెరుగనున్నట్టు ఐక్యరాజ్యసమితి విభాగమొకటి (యూఎన్‌ఎఫ్‌పీయే) తన నివేదికలో చెప్పింది. భారత వైద్య, కుటుంబ ఆరోగ్య విభాగం అందించిన సమాచారం ఆధారంగా అంచనాలు లెక్కగట్టిన ఈ విభాగం 2021లో 10.1 శాతంగా ఉన్న వృద్ధుల జనాభా 2036 నాటికి 15 శాతానికి చేరవచ్చని చెప్పింది.అయితే, వృద్ధుల జనాభా పెరుగుదల రేటు సమస్య కాదు... సదరు జనాభా పనిచేసే వయస్కుల మీద ఆధారపడే స్థితి అధిక మవడం ఇబ్బంది. అంటే, వంద మంది పనిచేసే (18–59 ఏళ్లు) వయస్కులున్నపుడు, వారిపై ఆధారపడే వృద్ధుల జనాభా అధికంగా ఉండటం కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై నేరుగా ప్రభావం చూపుతుందనేది అంతర్జాతీయ ప్రమాణాల లెక్క. ఆ నిష్పత్తి పెరుగుతోంది. అది 15 శాతాన్ని దాటితే సమస్యను ‘వృద్ధుల సంక్షోభం’గా లెక్కిస్తారు. భారత జాతీయ జనాభా కమిషన్ (ఎన్సీపీ) 2021 లెక్కల ప్రకారం, కేరళలో ఇది ఇప్పటికే 26.1 శాతంగా ఉంది. తమిళనాడు (20.5), హిమాచల్ ప్రదేశ్ (19.6), ఏపీ (18.5) శాతాలు కూడా అధికంగానే ఉన్నాయి. 2036 నాటికి అవి మరింత గణనీయంగా పెరగటం ఖాయంగా కనిపిస్తోంది. సంతానన్పోత్తి రేటును, తద్వారా జనాభాను నియంత్రించినందుకు, సదరు కుటుంబాల్లో లభించే ఆ ప్రయోజనం... వృద్ధుల పోషణ, వారి ఆరోగ్య పరిరక్షణలోనే కరిగిపోతోందనే వాదన బలంగా వినిపిస్తోంది.కట్టడి చేసినందుకు కనీస స్థానాలా?2026 తర్వాతి జనాభా లెక్కల ఆధారంగా దేశంలో నియోజక వర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. రాష్ట్ర విభజన చట్ట నిర్దేశ్యం ప్రకారం ఏపీ, తెలంగాణల్లోనూ సంఖ్య పెంపుతో పునర్విభజన జరగాల్సి ఉంది. దేశవ్యాప్తంగా గడువు లోపల జనాభా తాజా లెక్కలు అందించడానికి వీలుగా జనగణన ప్రక్రియ సత్వరం చేపట్టనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ప్రకటించింది. దశాబ్దానికి ఒకసారి జరిపే జనగణన, పాత సంప్రదాయం ప్రకారం 2020లో మొదలు కావాల్సింది. కోవిడ్ మహమ్మారి వల్ల అది వాయిదా పడింది. ఇప్పుడు 2025లో చేపట్టి, పదేళ్ల సైకిల్ని (ఇదివరకటిలా 2021 –2031 కాకుండా 2025 –2035గా) మారుస్తున్నారు. జనాభా వృద్ధి రేటు తీరుతెన్నుల్ని బట్టి కె.ఎస్. జేమ్స్, శుభ్ర కృతి జరిపిన అధ్యయనం ప్రకారం, వచ్చే పునర్విభజనతో ఉత్తరాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెరు గనుండగా దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గనుంది. ఉత్తరప్రదేశ్ (12), బిహార్ (10), రాజస్థాన్ (7) లలో లోక్‌సభ నియోజకవర్గాలు పెరుగ నున్నాయి. తమిళనాడు (9), కేరళ (6), ఏపీ (5) లలో తగ్గనున్నాయి. జాతీయ జనాభాలో వాటా పెరుగుదల, తరుగుదలను బట్టి ఈ సంఖ్య మారనుంది. ‘ఎక్కువ పిల్లలు కలిగిన తలిదండ్రులకు ప్రోత్సాహకాలివ్వాలి, ఆ మేరకు చట్టం తేవాలని నేను ఆలోచిస్తున్నాను’ అంటూ ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల అన్నారు. ఇటువంటి పంథా మంచిది కాదనీ, దాని వల్ల ఏ మంచీ జరుగదనేది ప్రపంచ వ్యాప్తంగా రుజువైన అంశమనీ సామాజికవేత్తలు అంటున్నారు. ప్రభుత్వాలిచ్చే ప్రాత్సాహకాలు అదనంగా పుట్టే సంతాన పోషణ, వారి విద్య –వైద్య అవసరాలు తీర్చవనీ, అధిక సంతానం కుటుంబ జీవన ప్రమాణాల పతనానికే కారణమవుతుందనీ విశ్లేషణలున్నాయి.ఈ పరిణామాలను ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకొని ప్రత్యా మ్నాయ చర్యలు చేపట్టాలి. జానాభా వృద్ధిని నిలుపుదల చేసిన వారిని ప్రోత్సహించేలా నిర్ణయాలుండాలి. సరైన జనాభా నిష్పత్తి ఉండేలా చూడాలి. వయసు మళ్లినవారు ఆయా కుటంబాలకు భారం కాకుండా సార్వత్రిక సాంఘిక భద్రతా పథకాలు ఉండాలి. ‘పనిచేసే వయసు’ కాలం నిడివి పెరిగేట్టు జీవన ప్రమాణాల వృద్ధికి చర్యలు తీసుకోవాలి. జనాభా నియంత్రణ తప్పు కాదు. ముసలితనం శాపం కాకూడదు. మంచి పనులకు ప్రోత్సాహం ఉండాలే తప్ప, శిక్షలు ఉండకూడదు.దిలీప్ రెడ్డి వ్యాసకర్త ‘పీపుల్స్ పల్స్’ రిసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
అధిక జనాభా వరమా!
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఇష్టమున్నా లేకున్నా జనాభా అంశంపై చర్చ ఊపందుకుంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మరో ఏణ్ణర్థంలో ప్రారంభం కావాల్సిన నేపథ్యంలో ఈ చర్చ ఎంతో అవసరమైనదీ, తప్పనిసరైనదీ. అయితే ఇందులో ఇమిడివున్న, దీనితో ముడిపడివున్న అనేకానేక ఇతర విషయాలను కూడా స్పృశిస్తే ఈ చర్చ అర్థవంతంగా ఉంటుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సామూహిక వివాహాల సందర్భంగా సోమవారం కొత్త దంపతుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ‘2026లో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన పుణ్యమా అని చిన్న కుటుంబానికి బదులు ఎక్కువమంది సంతానాన్ని కనాలని ఆశీర్వదించే రోజులొచ్చేశాయి’ అని వ్యాఖ్యానించటం గమనించదగ్గది. తెలుగునాట అష్టయిశ్వర్యాలు లభించాలని దంపతులను ఆశీర్వదించినట్టే తమిళగడ్డపై కొత్త దంపతులకు 16 రకాల సంపదలు చేకూరాలని ఆకాంక్షించటం సంప్రదాయం. ఆ ఆకాంక్షను పొడిగించి ఎక్కువమంది పిల్లల్ని కనాలని ఆశీర్వదించాల్సి వస్తుందన్నది ఆయన చమత్కారం. ఆ మాటల వెనక ఆంతర్యం చిన్నదేమీ కాదు. పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యాక లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 543 స్థానాలూ అమాంతం 753కు చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. అంటే ఒక్కసారిగా 210 స్థానాలు పెరుగుతాయన్న మాట! ఆ నిష్పత్తిలో శాసన సభల్లో సైతం సీట్ల పెరుగుదల ఉంటుంది. జనాభా పెరుగుదల రేటులో తీవ్ర వ్యత్యాసాలు కనబడుతున్న నేపథ్యంలో అధిక జనాభాగల ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ లోక్‌సభ స్థానాలూ... ఆ పెరుగుదల అంతగా లేని దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సంఖ్యలో స్థానాలూ వస్తాయన్నది ఒక అంచనా. మరో మాటలో చెప్పాలంటే జనాభా నియంత్రణపైనా, విద్యపైనా, ఆర్థికాభివృద్ధిపైనా పెద్దగా దృష్టి పెట్టని రాష్ట్రాలు లాభపడబోతున్నాయన్నమాట!దేశంలో చివరిసారిగా 1976లో పునర్విభజన జరిగింది. ఈ ప్రక్రియ క్రమం తప్పకుండా చేస్తే సమస్యలకు దారి తీయొచ్చన్న కారణంతో 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి పునర్విభజన ప్రక్రియను 2000 వరకూ స్తంభింపజేశారు. అయితే 2001లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా నియోజకవర్గాల పరిధిలోని ప్రాంతాల హేతుబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు. దాని ప్రకారం లోక్‌సభ స్థానాల సంఖ్య, వాటి పరిధి 2026 తర్వాత జరిగే జనగణన వరకూ మారదు. అయితే ఆ పరిధిలోని అసెంబ్లీ స్థానాలను హేతుబద్ధీకరించవచ్చు. దాని పర్యవసానంగా ఉమ్మడి ఏపీ అసెంబ్లీలోని 294 స్థానాల సంఖ్య మారకపోయినా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో జిల్లాలవారీగా సీట్ల సంఖ్య మారింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాగే జరిగింది.ప్రతి రాష్ట్రానికీ దాని జనాభా నిష్పత్తికి అనుగుణంగా లోక్‌సభలో ప్రాతినిధ్యం కల్పించాలని మన రాజ్యాంగం నిర్దేశిస్తోంది. దేశంలో ప్రతి ఒక్కరి ఓటు విలువా ఒకేవిధంగా ఉండాలన్నది దీని ఆంతర్యం. 2021లో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా వాయిదా వేయక తప్పలేదని కేంద్రం ప్రకటించింది. కనుక వాస్తవ జనాభా ఎంతన్నది తెలియకపోయినా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలోని సాంకేతిక బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ సంఖ్యను 142 కోట్లుగా లెక్కేస్తున్నారు. రాష్ట్రాలవారీగా జనాభా ఎంతన్న అంచనాలు కూడా వచ్చాయి. దాన్నే పరిగణనలోకి తీసుకుంటే ఉత్తరప్రదేశ్ నుంచి ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలు 80 కాస్తా 128కి చేరుతాయి. బిహార్‌కు ఇప్పుడు 40 స్థానాలున్నాయి. అవి 70కి ఎగబాకుతాయి. అలాగే మధ్యప్రదేశ్‌కు ఇప్పుడున్న 29 నుంచి 47కూ, రాజస్థాన్‌కు ప్రస్తుతం ఉన్న 25 కాస్తా 44కు పెరుగుతాయని అంచనా. మహారాష్ట్రకు ప్రస్తుతం 48 ఉండగా అవి 68కి వెళ్లే అవకాశం ఉందంటున్నారు. కానీ అదే సమయంలో జనాభా నియంత్రణలో విజయం సాధించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పెరిగే సీట్ల సంఖ్య స్వల్పంగా ఉంటుంది. దేశ జనాభా వేగంగా పెరుగుతున్నదనీ, ఇదే కొనసాగితే భవిష్యత్తులో అందరికీ చాలినంత ఆహారం లభ్యం కావటం అసాధ్యమన్న అభిప్రాయం ఒకప్పుడుండేది. ఎమర్జెన్సీ రోజుల్లో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించిన ఉదంతాలకు లెక్కేలేదు. మొత్తంగా జనాభా పెరుగుతూనే ఉన్నా, ప్రపంచంలో అత్యధిక జనాభాగల దేశం మనదే అయినా గడిచిన దశాబ్దాల్లో పెరుగుదల రేటు తగ్గింది. ఈ తగ్గుదల సమంగా లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో అధికంగా, ఉత్తరాది రాష్ట్రాల్లో స్వల్పంగా నమోదవుతోంది. ఉదాహరణకు 1951లో తమిళనాడు జనాభా బిహార్ కంటే స్వల్పంగా అధికం. 6 దశాబ్దాల తర్వాత బిహార్ జనాభా తమిళనాడుకన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ!దక్షిణాదిన జనాభా పెరుగుదల పెద్దగా లేకపోవటానికి ఆర్థికాభివృద్ధి, స్త్రీలు బాగా చదువు కోవటం, దారిద్య్రం తగ్గటం ప్రధాన కార ణాలు. దేశ జనాభాలో 18 శాతంగల దక్షిణాది రాష్ట్రాలు దేశ జీడీపీకి 35 శాతం వాటా అందిస్తున్నాయి. కుటుంబాల్లో స్త్రీల నిర్ణయాత్మక పాత్ర ఉత్తరాదితో పోలిస్తే పెరిగింది. కీలకాంశాల్లో ఉత్తరాది రాష్ట్రాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఈ వైఫల్యం వరం కావటం న్యాయమేనా? స్టాలిన్ మాటల ఆంతర్యం అదే. మరికొందరు నేతలు జనాభా పెంచమంటూ ముసిముసి నవ్వులతో సభల్లో చెబుతున్నారు. ఇది నవ్వులాట వ్యవహారం కాదు. పునరుత్పాదక హక్కు పూర్తిగా మహిళలకే ఉండటం, అంతిమ నిర్ణయం వారిదే కావటం కీలకం. అసలు పునర్విభజనకు జనాభా మాత్రమే కాక, ఇతరేతర అభివృద్ధి సూచీలనూ, దేశ ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రాల పాత్రనూ పరిగణనలోకి తీసుకోవటం అవసరం. ఈ విషయంలో విఫలమైతే దక్షిణాది రాష్ట్రాల్లో అసంతృప్తి పెరగటం ఖాయమని కేంద్రం గుర్తించాలి. -
‘జన గణన ఎప్పుడు?.. 14 కోట్ల మంది నష్టపోయారు’
ఢిల్లీ: దేశవ్యాప్తంగా జనాభా లెక్కల కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ఎప్పుడు చేపడతారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. పూర్తిస్థాయిలో జన గణన చేయకపోవటం వల్ల ఇప్పటివరకు 14 కోట్లమంది నష్టపోయారని మండిప్డడారు. ఇప్పటికైనా జన గణన ఎప్పుడు చేపడతారో దేశానికి తెలియజేయాలన్నారు. జన గణన విషయంపై ఆయన సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు.A comprehensive Census essential for socioeconomic development is carried out by the Union Govt every ten years. The last one was to be completed in 2021. But Mr. Modi didnt get it done.One immediate consequence of not having Census 2021 conducted is that at least 14 crore…— Jairam Ramesh (@Jairam_Ramesh) June 10, 2024‘దేశ సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం జనాభా లెక్కల డేటా పదేళ్ళపాటు కేంద్ర ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగడుతంది. జనాభా లెక్కలు 2021లో నిర్వహించాల్సింది. కానీ, ప్రధాని మోదీ అప్పుడు నిర్వహించలేదు. 2021లో జనాభా లెక్కలు చేపట్టకపోవటం వల్ల సుమారు 14 కోట్ల మంది భారతీయులకు జాతీయ ఆహార భద్రత చట్టం (2013) కింద ప్రయోజనాలు కోల్పోతున్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అందకుండా పోతోంది...1/3 వంతు ప్రధాని మోదీ జనాభా లెక్కల కార్యక్రమాన్ని ఎప్పుడు చేపడతారో త్వరలో దేశానికి తెలియజేయాలి. 1951 నుంచి పదేళ్లకొకసారి నిర్వహించే జనాభా లెక్కల వల్ల ఎస్సీ, ఎస్టీల జనాభా డేటా తెలుస్తోంది. అయితే కొత్తగా నిర్వహించే జనాభా లెక్కల డేటాలో ఓబీసీలోని అన్ని కులాల జానాభా వివరాలు ఉండాలి. అప్పుడే రాజ్యాంగంలో పొందుపర్చిన సామాజిక న్యాయానికి నిజమైన అర్థం ఇచ్చినట్లు అవుతుంది’ అని జైరాం రమేశ్ అన్నారు. ఇక.. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కుల గణన చేపడతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. -
వరస తప్పిన ముఖ్యమైన లెక్క
దేశ జనన, మరణాల రిజిస్టర్‌ను ఓటర్ల జాబితాతో అనుసంధానించేలా త్వరలోనే పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్ర సర్కార్ యోచిస్తోంది. దేశ పౌరులెవరికైనా సరే 18 ఏళ్ళు నిండగానే వారి పేరు ఓటర్ల జాబితాలో చేరిపోయేలా ఆ బిల్లుతో వీలు కల్పించాలని భావిస్తోంది. సోమవారం ఢిల్లీలో భారత జనగణన కమిషనర్ కార్యాలయ ప్రారంభోత్సవ వేళ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వెల్లడించిన ఈ సంగతి మారుతున్న కాలమాన పరిస్థితుల్లో మంచి ఆలోచనే. మరణించినవారి పేర్లను తక్షణం తొలగించడానికీ, ఓటుహక్కు వయసు రాగానే జాప్యం లేకుండా కొత్త ఓటర్లు జాబి తాలో చేరడానికీ ఈ అనుసంధాన ప్రక్రియ ఉపకరిస్తుంది. అయితే, అదే సమయంలో పదేళ్ళకోసారి నిర్వహించాల్సిన కీలక జనగణనను ఈ దఫా ఎప్పుడు జరిపేదీ ప్రస్తావించకపోవడమే ఆశ్చర్యం. నిజానికి, 1948 జనగణన చట్టం ప్రకారం ప్రభుత్వం ఈ ప్రక్రియను నిర్వహిస్తుంది. అలాగని ప్రతి పదేళ్ళకూ జనగణన చేయాలని చట్టమేమీ లేదు. ఎప్పుడు జనగణన చేయాలో, ఫలితాలెప్పుడు వెల్లడించాలో నిర్ణీత కాలవ్యవధి అందులో లేదు. అయితే, ఈ లెక్కల ప్రయోజనం అపారం. బ్రిటీష్ ఇండియాలో 1881లో వందల మంది శ్రమించి, 25 కోట్లకు పైగా జనాభా నుంచి జవాబులు సేకరించారు. అప్పటి నుంచి 130 ఏళ్ళ పాటు యుద్ధాలు సహా ఎన్ని సంక్షోభాలు వచ్చినా, మన పాలకులు ఒక క్రమం తప్పని యజ్ఞంగా ఈ జనగణన ప్రక్రియను సాగించారు. తీరా ఈసారి ఆక్రమం తప్పింది. దేశంలో తాజా జనగణన 2021లో జరగాల్సి ఉంది. 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా అందులో తొలి దశ జరపాలని భావించారు. కరోనాతో అది నిరవధిక వాయిదా పడింది. జనం లెక్కను ప్రోదిచేసి, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక తదితర అంశాలతో ఒక సమాచార గనిగా, ప్రభుత్వ – ప్రజా కార్యాచరణకు కీలక సూచికగా ఉపకరించాల్సిన ఆ ప్రక్రియ ఈసారి అలా ఆలస్యమైంది. జాప్యానికి కరోనాయే కారణమన్న ప్రభుత్వ వాదన తర్కానికి నిలవదు. అత్యధికులు కరోనా టీకాలు వేయించుకున్నా, 2022లో మూడో వేవ్ ముగిసి జనజీవనం కుదుటపడినా, వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు సైతం సాగుతున్నా సరే... సర్కార్ ఎందుకనో ఇప్పటి దాకా మళ్ళీ జనగణన ఊసే ఎత్తలేదు. జిల్లాలు, తాలూకాలు, పోలీస్ స్టేషన్ల పాలనా సరిహద్దుల్ని స్తంభింపజేసే తుది గడువును ఈ జూన్ 30 వరకు కేంద్రం పొడిగించింది గనక లెక్కప్రకారం ఆ తర్వాత మూడు నెలలైతే కానీ జనగణన చేపట్టరాదు. అంటే, కనీసం ఈ సెప్టెంబర్ దాకా జనగణన లేనట్టే. ఇక, సాధారణంగా జనసంఖ్యను లెక్కించడం జనగణన చేసే ఏడాది ఫిబ్రవరిలో చేస్తారు. మార్చి 1కి ఇంత జనాభా అంటారు. కానీ, వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో 2024 చివర ఎప్పటికో కానీ ప్రక్రియే మొదలు కాకపోవచ్చు. పైకి మామూలు గానే అనిపించినా, ఈ ఆలస్యం విస్తృత పర్యవసానాలకు దారి తీస్తుంది. ఎందుకంటే, పుష్కరకాలం గడిచిపోయినా ఇప్ప టికీ మన విధాన రూపకర్తలు పాత 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగా సంక్షేమ పథకాల నుంచి సాయాల దాకా నిర్ణయాలు తీసుకోవాల్సి రావడం విచిత్రం, విషాదం. అసలు కరోనాతో ఆలస్యమవడానికి ముందే ఈ 2021 జనగణన వివాదాస్పదమై కూర్చుంది. జనగణనతో పాటు జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)ను నవీకరించేలా జనాభా సర్వే చేపడతామంటూ ప్రభుత్వం తేనెతుట్టె కదిల్చింది. అప్పటికే, ముస్లిమ్లే లక్ష్యంగా వివాదాస్పద ‘పౌరసత్వ చట్టం–2019’ తెచ్చారంటూ, దేశవ్యాప్తంగా నెలల తరబడి నిరసనలు సాగాయి. ఆ చట్టానికి, ఇప్పుడు భారతీయులమని నిరూపించుకోవాల్సిన ఈ ‘ఎన్పీఆర్’ జత చేరిందని విమర్శలు రేగాయి. మరో పక్క ఇప్పటికే ప్రతిపక్షాల్లోని అనేక రాజకీయ పార్టీలు, ప్రాంతీయ నేతలు దేశంలో కులగణన సాగాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆ లెక్కలు కూడా తీస్తే తమ ఓటుబ్యాంకులో చీలికలు రావచ్చనీ, అది తమకు దెబ్బ కావచ్చనీ అధికార పార్టీ భయపడుతోంది. వివిధ వర్గాల నుంచి ప్రత్యేక కోటాలకు డిమాండ్లు తలెత్తుతాయని ఆందోళన చెందుతోంది. అయిన ఆలస్యం ఎలాగూ అయింది గనక వచ్చే ఎన్నికల్లో లెక్క తప్పకుండా ఉండాలంటే, ఈ లెక్కలు పక్కనపెట్టాలనుకుంటే ఆశ్చర్యమేమీ లేదు. జనగణన అంటే కేవలం భౌగోళిక ప్రాంతాల్లో తలకాయలు లెక్కపెట్టడం కాదు. సమాజంలోని భిన్న వర్గాల ఆకాంక్షలకు పునాదిగా నిలిచే ప్రక్రియ. గ్రామీణ – పట్టణ జనాభా వాటా, వలసలు, మాతృభాష, ఆయుఃప్రమాణం, గృహవసతులు వగైరా అనేక గణాంకాలను అందించే సమాచార నిధి. ఆర్థిక జీవిత అంశాలపై దృష్టి పెట్టే అనేక సర్వేలకు మాతృకైన ‘జాతీయ శాంపిల్ సర్వే’, ఆరోగ్యం – సామాజిక స్థితిగతులపై ఇంటింటి సర్వే అయిన ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ వగైరాలు శాంపిల్స్ తీసుకోవడానికి జనగణనే ఆధారం. ఇంతటి ముఖ్యమైన వ్యవహారంపై ఈ సుదీర్ఘ అనిశ్చితి సమంజసం కాదు. జనగణన ప్రక్రియ ఎప్పుడు జరిగినా – ఆధునికతనూ, ఎప్పటి కప్పుడు లెక్కల్లో మార్పుల్ని పొందుపరుచుకొనే లక్షణాన్నీ సంతరించుకోవాలన్న ప్రభుత్వ యోచన ఆహ్వానించదగినదే. కాకపోతే ఎప్పుడో డిజిటల్ వేదికల్ని ఆశ్రయిస్తామనీ, వ్యక్తులు తమకు తామే ఎలక్ట్రానిక్‌గా సమాచారం పూర్తిచేసే హక్కు కల్పిస్తామనీ, అందులో సామాజిక – ఆర్థిక హోదాను లెక్కించే 35కు పైగా పరామితులు ఉంటాయనీ అంటూ... ఇప్పుడు అమితమైన జాప్యం చేయడం అర్థరహితం. అసలుకే మోసం. అయితే, జనగణన ఎప్పుడు చేస్తామో చెప్పకున్నా, ఎలా చేయాలను కుంటున్నదీ పాలకుల నోట వినపడడమే ప్రస్తుతానికి దక్కిన సాంత్వన. -
Census 2021: మీనమేషాలే లెక్కిస్తున్నారు
ఎస్.రాజమహేంద్రారెడ్డి: ‘అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే దేశం ఎప్పుడో బాగుపడేది’ – కామారెడ్డి టౌన్‌ప్లానింగ్ కేసులో తెలంగాణ హైకోర్టు వ్యాఖ్య అవును కదా! తరచి తరచి ఆలోచిస్తే న్యాయస్థానం వ్యాఖ్యతో ఏకీభవించక తప్పదు. వ్యక్తుల నుంచి రాజ్యం దాకా ఇదే తాత్సారం. ఏదో అనుకోవడం. ఇంకేదో అవుతుందని వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోవడమే కాకుండా, వాటికి కారణాలు వెతకడం అలవాటైపోయింది. ఒక దేశం సుభిక్షంగా ఉండాలంటే ఆ దేశంలోని ప్రజలు కనీస స్థాయిలోనైనా సంతోషంగా ఉండాలి. వంద కోట్లపైగా జనాభా ఉన్న భారత్ లాంటి దేశంలో అంతమంది ప్రజల స్థితిగతులు, ఆర్థిక హెచ్చుతగ్గులు, ఉపాధి తీరుతెన్నులూ క్షుణ్నంగా తెలిసి ఉండాలి. ఒక మనిషి అతి సాధారణ జీవితం గడపాలన్నా కూడూ గూడూ కనీసావసరాలు. ఇలాంటి వివరాలు, గణాంకాలు చేతిలో ఉంటేనే ఏ ప్రభుత్వమైనా సంక్షేమ ఫలాలు ఎవరికి అత్యవసరమో, అవసరమో, అవసరం లేదో ఇదమిత్థంగా తేల్చుకోగలుగుతుంది. సరైన దిశలో సరైన చర్యలు చేపట్టగలుగుతుంది. దీనికి లెక్కలు కావాలి. అవే జనాభా లెక్కలు. ఈ లెక్కలు చేతిలో ఉంటే ప్రజల బతుకు లెక్కలు సరిచేసే వీలు చిక్కుతుంది. ఏడాది తిరిగే సరికి గ్రామాలకు గ్రామాలు వలసలతో వెలవెలబోతున్నాయి. ఆ బరువుతో పట్టణాలు ఇరుకైపోతున్నాయి. ఉపాధి వేటలో కష్టాలు తరుముకొస్తున్నాయి. గ్రామాల, పట్టణాల ముఖచిత్రాలు ఇంత వేగంగా మారుతుంటే జనగణన మరింత వేగంగా సాగాలి కదా! కానీ దేశంలో చివరిసారిగా ఈ కసరత్తు జరిగింది 2011లో. అంటే 11 ఏళ్ల కిందట! 2019లో జనగణనకు కేంద్రం ప్రణాళికలు వేసింది. 2021కల్లా ముగించాలని నిర్ణయించింది. ఇప్పుడు మనం 2023లో ఉన్నాం. కానీ ఆ దిశగా తొలి అడుగు కూడా పడలేదు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈసరికి ఆ అనుకున్నదేదో పూర్తయిపోయి ఉండేది. ఎందుకలా జరగలేదు? ఒకసారి చూద్దాం... అంతా సిద్ధంగానే ఉన్నా... నిజానికి 2021లోగా జనభా గణన పూర్తి చేయాలని కేంద్రం 2019లోనే నిర్ణయించడమే గాక రూ.8,754.23 కోట్లు కేటాయించింది కూడా. ఈ కసరత్తుకు 33 లక్షల మంది అవసరమని అంచనా వేసింది. వారిని ఏయే రంగాల నుంచి సమీకరించాలో కూడా నిర్ణయానికి వచ్చింది. మొత్తం ప్రక్రియను రెండు దశల్లో పూర్తి చేయాలని ప్రణాళికలు వేసింది. 2020 ఆగస్టు నుంచి సెప్టెంబర్ దాకా తొలి దశ, 2021 ఫిబ్రవరిలో రెండో దశ పూర్తి చేయాలన్నది ఆలోచన. ప్రణాళికలన్నీ కాగితం మీద భేషుగ్గా కుదిరాయి. కానీ అనూహ్యంగా కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో జన గణనను వాయిదా వేయాల్సి వచ్చింది. 2020లో కరోనా తొలి వేవ్, 2021లో రెండో వేవ్ వల్ల కార్యక్రమం అటకెక్కింది. నిజానికి కరోనా కల్లోలం నడుమే చైనా, అమెరికా, బ్రిటన్ వంటి చాలా దేశాలు 2020లోనే జనాభా లెక్కల ప్రక్రియను ముగించాయి! మన దగ్గర కనీసం 2022లో అయినా ఆ మహా కార్యాన్ని పూర్తి చేసి ఉంటే బాగుండేది. కరోనా నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదన్న సాకుతో తప్పించుకోవడం కుదరదు. ఎందుకంటే గతేడాది ఉత్తరప్రదేశ్ వంటి అతి పెద్ద రాష్ట్రంతో పాటు గుజరాత్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో శాసనసభ ఎన్నికలు దిగ్విజయంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు అడ్డురాని కరోనా భయం జన గణనకు మాత్రమే ఎలా అడ్డంకి అయింది? సూక్ష్మంగా చెప్పాలంటే ఎన్నికలు అనుకున్నట్టు జరిగాయి. జనాభా గణన అనుకున్నట్టు జరగలేదు. దీనిపై కేంద్రం ఈ రోజుకూ కిమ్మనకుండానే ఉంది. అంటే ఇప్పట్లో ఆ ఊసే లేదని కూడా స్పష్టమవుతోంది. వచ్చే ఏడాది (2024) సాధారణ ఎన్నికలుండటంతో ఆ ఏడాదీ జన గణన లేనట్టే. ఒకవైపు బిహార్‌లో కుల గణనకు రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నడుం బిగించిన సంగతి తెలిసిందే. మరి అలాంటి చొరవ కేంద్రం ఎందుకు తీసుకోలేకపోతోంది? ఈ ఏడాది మరో 9 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలున్నాయి. ఇలా ఎన్నికల నిర్వహణలో చూపించే చొరవ జనాభా సేకరణలో ఎందుకు చూపించలేక పోతున్నారనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. దేశ ప్రజల స్థితిగతులపై ఎన్నికలకు ముందే కొత్త లెక్కలు బహిర్గతమైతే ఎన్నికల్లో సమీకరణలు మారిపోతాయనా? ప్రతిపక్షాలకు చేజేతులా గణాంకాల అస్త్రం అందించినట్టు అవుతుందనా? పదేళ్లకోసారి... పదేళ్లకోసారి జనగణన చేయడం ఆనవాయితీగా వస్తోంది. మన దేశంలో తొలిసారిగా 1872లో జనాభా లెక్కలకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత క్రమం తప్పకుండా పదేళ్లకోసారి నిర్వహిస్తూనే ఉన్నారు. 1941 (రెండో ప్రపంచ యుద్ధం), 1961 (చైనా యుద్ధం), 1971 (బంగ్లాదేశ్ విమోచన యుద్ధం)ల్లో కొన్ని ఇబ్బందులు ఎదరైనా పదేళ్ల ఆనవాయితీ తప్పలేదు. ఈసారి లెక్క తప్పింది. ఇంకోసారి తప్పదన్న గ్యారెంటీ లేదు! అయినా అనుకున్నది అనుకున్నట్టు జరిగి ఉంటే ఈసారికి గణాంకాలన్నీ మన చేతిలో ఉండేవి. అంత ఈజీ కాదు... పోనీ, కేంద్రం తక్షణ కర్తవ్యంగా ఇప్పటికిప్పుడు రంగంలోకి దిగి వచ్చే ఏడాదే జనాభా గణన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నా అదంత సులువు కాదు. ఎందుకంటే జన గణనకు ఏడాది ముందే గృహాల జాబితా తయారు చేయాల్సి ఉంటుంది. 2011 ఫిబ్రవరిలో జనాభా సేకరణ జరగడానికి ముందే, అంటే 2010లో ఆవాసాల గుర్తింపును కేంద్రం పూర్తి చేసింది. నిజానికి గృహాలను గుర్తించడమే పెద్ద సమస్య. అయితే నేటి డిజిటల్ యుగంలో ఈ ప్రక్రియ కొంత వేగంగా జరగడానికి ఆస్కారముంది. ఆయా రాష్ట్రాలు తమ పరిపాలనా పరిధులకు జూన్ 30లోగా తుది రూపు ఇవ్వాలని భారత రిజిస్ట్రార్ జనరల్, సెన్సెస్ కమిషనర్ ఆదేశించినట్టు సమాచారం. అంటే గృహాలను గుర్తించే కార్యక్రమానికి జూన్ తర్వాతే వీలుపడుతుంది. ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించడం కన్నా మొబైల్ యాప్ ద్వారా ఈ పనిని సులువుగా చేయవచ్చు. కచ్చితమైన సమాచారాన్ని రాబట్టేలా ప్రశ్నావళి రూపొందించాల్సి ఉంటుంది. జనాభా లెక్కల సేకరణలో భాగంగా 1951లో 13 ప్రశ్నలుండేవి. ఇప్పుడవి 31కి పెరిగాయి. హైటెక్ హంగులను ఉపయోగించుకుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జనాభా గణన చేపడితే సంక్షేమ ఫలాలకు అర్హులైన ప్రజలందరికీ మేలు చేసినట్టవుతుంది. -
ఆశ.. దోశ.. అంచనాలు తలకిందులు!
భువనేశ్వర్: జనాభా లెక్కల జాబితాలో ఇతర వెనుక బడిన వర్గాల(ఓబీసీ)కు ప్రత్యేక స్థానం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. అయితే ఈ అభ్యర్థన పట్ల కేంద్ర ప్రభుత్వం విముఖత ప్రదర్శించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు తలకిందులు కావడంతో నిరుత్సాహానికి గురైంది. పార్లమెంటు సమావేశాల్లో గడిచిన రెండు రోజుల నుంచి బిజూ జనతా దళ్ సభ్యులు ఈ ప్రతిపాదనపై ఒత్తిడి తెస్తున్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖలతో పలు అనుబంధ సంస్థల సంప్రదింపుల మేరకు 2021 జనాభా లెక్కల జాబితా నమూనా ఖరారు చేశారు. గత ఏడాది మార్చి 28వ తేదీన కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో తాజా జనాభా లెక్కింపు ధ్యేయం సవివరంగా స్పష్టం చేసినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ గురువారం స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం నిబంధనల మేరకు షెడ్యూల్డ్ కులం, తెగల వర్గాల్లో మార్పు చేర్పుల సమీక్ష దృష్ట్యా ఈ వివరాల సేకరణ కోసం జనాభా లెక్కల జాబితాలో ప్రత్యేక స్థానం కల్పించినట్లు వివరించారు. రాష్ట్రానికి కేంద్రమంత్రి ప్రతిపాదన రాష్ట్రంలో ఇతర వెనుకబడిన వర్గాల ప్రజానీకం ప్రాముఖ్యాన్ని స్థానిక రాజకీయ పక్షాలు గుర్తించాయి. ప్రధానంగా అధికార పక్షం బిజూ జనతా దళ్, ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ ఓబీసీ వర్గం వైపు కన్నేశాయి. ఈ వర్గపు ప్రజానీకంతో బలమైన ఓటు బ్యాంకు ఆవిష్కరణ కోసం ఎవరి తరహాలో వారు సిగపట్లు పడుతున్నారు. బిజూ జనతా దళ్ సభ్యులు పార్లమెంటులో భారత ప్రభుత్వంపై పెంచుతున్న ఒత్తిడి దృష్ట్యా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల స్పందించారు. రాష్ట్రంలో రాజకీయ లబ్ధి పొందేందుకు అధికార పక్షానికి తాజా ప్రతిపాదన జారీ చేశారు. తొలుత రాష్ట్రంలో ఇతర వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక గుర్తింపు కేటాయించాలి. ఈ వర్గపు ప్రజల కోసం ప్రత్యేక రిజర్వేషన్ ఇతరేతర సకల సదుపాయాల్ని కల్పించేందుకు రాష్ట్ర శాసన సభలో తీర్మానం ఆమోదించాలని కేంద్ర మంత్రి దర్మేంద్ర ప్రధాన్ అధికార పక్షం బిజూ జనతా దళ్‌కు ప్రతిపాదించి కథను మలుపుతిప్పేందుకు బీజం నాటారు. జనాభా లెక్కింపు సహకారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం జనాభా లెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా కార్యాచరణ ప్రారంభించింది. ఈ ఏడాది జనవరి 7వ తేదీన రిజిస్ట్రార్ జనరల్, లెక్కింపు కమిషనర్ జారీ చేసిన గెజిట్ నేపథ్యంలో సకల సహకార చర్యలు చేపడుతున్నారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో ఇంటింటి జనాభా లెక్కింపు ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియ సెప్టెంబరు 30వ తేదీ వరకు నిరవధికంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రెవెన్యూ–విపత్తు నిర్వహణ విభాగం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. -
మొబైల్ యాప్‌తో 'జనగణన'
సాక్షి, జనగామ: కేంద్ర ప్రభుత్వం పేపర్ పద్ధతికి స్వస్తిచెప్పి ఈ సారి మొబైల్ యాప్ తో జనాభా లెక్కలు చేపట్టనుంది. ప్రయోగాత్మకంగా మూడు రాష్ట్రాలను ఎంపిక చేయగా జనగామ జిల్లా ఫైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైంది. ఇందుకోసం అవసరమైన సీఎస్సీ (కామన్ సర్వీస్ సెంటర్)ల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో మీ సేవా, ఈ సేవా కేంద్రాల మాదిరిగానే ఈ కేంద్రాలు పని చేయనున్నాయి. జిల్లాకు ఒక డీసీ (జిల్లా కోఆర్డినేటర్)ని అదే విధంగా ప్రతి గ్రామానికి ఒక వీఎల్ఈ (విలేజ్ లెవల్ ఎన్యుమరేటర్స్)లను కూడా ఇప్పటికే ఎంపిక చేసింది. ఎంపిక చేసిన వారందరికీ గత వారం జిల్లా కేంద్రంలో శిక్షణ కూడా ఇచ్చారు. పదేళ్లకొకసారి దేశంలో జనగణన చేస్తారు. 2001లో జనాభా సర్వే చేశాక మళ్లీ చేయలేదు. కాగితాలను ఉపయోగించి సర్వేను గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల చేత చేయించేవారు. ఈ సారి పేపర్ పద్ధతికి స్వస్తి పలికి ప్రత్యేక యాప్ సాయంతో ఈ సర్వే చేయనున్నారు. ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ సర్వే ప్రయోగాత్మకంగా ప్రారంభించగా కొనసాగుతుంది. తెలం గాణలో ఈ సర్వేను ఇప్పటికే ప్రారంభించా ల్సి ఉండగా ఈ డిజిటల్ పద్ధతిలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వాటిని సవరించి చర్యలు చేపట్టవచ్చునని భావించి పూర్తిగా అధ్యయనం చేశాకే వచ్చే నెల నుండి దీన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నారు. ఎలా చేస్తారు.. సర్వే కోసం జిల్లా స్థాయిలో ఒక కోఆర్డినేటర్‌ను,క్షేత్ర స్థాయిలో డోర్ టు డోర్ వెళ్లి వివరాలు సేకరించేందుకు 281 మంది వీఎల్‌ఈలను నియమించారు. వీఎల్‌ఈలందరికీ ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. జనగామ జిల్లాను పైలెట్ జిల్లాగా ఎంపిక చేశారు. జిల్లాలో మొత్తం 1,20 లక్షల కుటుంబాలు శిక్షణ పొందిన ఎన్యుమరేటర్లు గ్రామాలకు వెళ్లి ట్యాబ్‌ల ద్వారా కుటుంబాల వారీగా వివరాలు సేకరించి ప్రత్యేక యాప్‌లోభద్రపరుస్తారు. ఒక్కో గృహ సర్వేకు రూ.మూడు , వాణిజ్య సర్వేకు రూ.4.50 చొప్పున రెమ్యునరేషన్ చెల్లిస్తారు. -
దేశంలోని నాస్తికులు ఎంతమందో తెలుసా?
వేదభూమి, పుణ్యధరిత్రి.. విశ్వాసాల గడ్డ మన భారతదేశం. మరి అలాంటి మన దేశంలో ఏ మతాన్ని నమ్మనివారు, ఏ దేవుడిని విశ్వసించని నాస్తికులు ఎంతమంది ఉన్నారో తెలుసా? కేవలం 33వేలమంది మాత్రమే. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 120కోట్లమంది జనాభా ఉండగా.. అందులో నాస్తికులు మాత్రం అతి తక్కువగా 33వేలమంది ఉన్నారు. ఇక దేవుడిని నమ్మే విశ్వాసుల్లో (ఆస్తికులు) సగమంది మహిళలే ఉన్నారు. ప్రతి పదిమంది ఆస్తికుల్లో ఏడుగురు గ్రామాల్లోనే నివసిస్తున్నారు. ఈ మేరకు గతవారం విడుదల చేసిన 2011 జనాభా లెక్కల్లో తొలిసారిగా నాస్తికుల వివరాలను వెల్లడించారు. అంతకుముందు 2001లో జరిగిన జనాభా లెక్కల్లో నాస్తికుల సంఖ్యను చెప్పకుండా కేవలం పెద్దమొత్తంలో వారు ఉన్నట్టు తెలిపారు. అత్యధికంగా మహారాష్ట్రలో 9,652 మంది నాస్తికులు ఉండగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 256మంది నాస్తికులు ఉన్నట్టు జనాభా లెక్కలు స్పష్టం చేశాయి. లక్ష్యదీప్‌లో కేవలం ఒక్కరంటే ఒక్కరే నాసికుడు ఉండగా..పలు రాష్ట్రాల్లో 10, 14 ఇలా రెండంకెల సంఖ్యలో నాస్తికులు ఉండటం గమనార్హం. ఏ రాష్ట్రంలో ఎంతమంది నాస్తికులు ఉన్నారో ఈ కింది జాబితాలో చూడొచ్చు. రాష్ట్రాల వారీగా చూసుకుంటే నాస్తికుల వివరాలివి.. రాష్ట్రం నాస్తికుల సంఖ్య మహారాష్ట్ర 9,652 మేఘాలయ 9,089 కేరళ 4,896 ఉత్తరప్రదేశ్ 2,425 తమిళనాడు 1,297 పశ్చిమ బెంగాల్ 784 ఒడిశా 651 ఉత్తరాఖండ్ 572 పంజాబ్ 569 ఎన్సీఆర్ ఢిల్లీ 541 గుజరాత్ 405 అరుణాచల్ ప్రదేశ్ 348 అండమాన్ నికోబార్ దీవులు 333 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 256 హిమాచల్ ప్రదేశ్ 252 అసోం 250 హర్యానా 180 మధ్యప్రదేశ్ 136 కర్ణాటక 112 చండీగఢ్ 89 రాజస్థాన్ 77 గోవా 61 త్రిపుర 53 బిహార్ 47 పుదుచ్చేరి 44 మణిపూర్ 39 జార్ఖండ్ 36 మిజోరం 30 జమ్మూకశ్మీర్ 30 నాగాలాండ్ 21 ఛత్తీస్‌గఢ్ 14 సిక్కిం 10 దాద్రా నగర్ హవేలి 4 లక్ష్యదీప్ 1