Census 2021: మీనమేషాలే లెక్కిస్తున్నారు | Census 2021 Postponement: Center doesnot care if Corona decreases | Sakshi
Sakshi News home page

Census 2021: మీనమేషాలే లెక్కిస్తున్నారు

Published Sat, Jan 14 2023 4:44 AM | Last Updated on Sat, Jan 14 2023 4:44 AM

Census 2021 Postponement: Center doesnot care if Corona decreases - Sakshi

ఎస్‌.రాజమహేంద్రారెడ్డి:

‘అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే దేశం ఎప్పుడో బాగుపడేది’
 – కామారెడ్డి టౌన్‌ప్లానింగ్‌ కేసులో తెలంగాణ హైకోర్టు వ్యాఖ్య

అవును కదా! తరచి తరచి ఆలోచిస్తే న్యాయస్థానం వ్యాఖ్యతో ఏకీభవించక తప్పదు. వ్యక్తుల నుంచి రాజ్యం దాకా ఇదే తాత్సారం. ఏదో అనుకోవడం. ఇంకేదో అవుతుందని వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోవడమే కాకుండా, వాటికి కారణాలు వెతకడం అలవాటైపోయింది. ఒక దేశం సుభిక్షంగా ఉండాలంటే ఆ దేశంలోని ప్రజలు కనీస స్థాయిలోనైనా సంతోషంగా ఉండాలి. వంద కోట్లపైగా జనాభా ఉన్న భారత్‌ లాంటి దేశంలో అంతమంది ప్రజల స్థితిగతులు, ఆర్థిక హెచ్చుతగ్గులు, ఉపాధి తీరుతెన్నులూ క్షుణ్నంగా తెలిసి ఉండాలి.

ఒక మనిషి అతి సాధారణ జీవితం గడపాలన్నా కూడూ గూడూ కనీసావసరాలు. ఇలాంటి వివరాలు, గణాంకాలు చేతిలో ఉంటేనే ఏ ప్రభుత్వమైనా సంక్షేమ ఫలాలు ఎవరికి అత్యవసరమో, అవసరమో, అవసరం లేదో ఇదమిత్థంగా తేల్చుకోగలుగుతుంది. సరైన దిశలో సరైన చర్యలు చేపట్టగలుగుతుంది. దీనికి లెక్కలు కావాలి. అవే జనాభా లెక్కలు. ఈ లెక్కలు చేతిలో ఉంటే ప్రజల బతుకు లెక్కలు సరిచేసే వీలు చిక్కుతుంది. ఏడాది తిరిగే సరికి గ్రామాలకు గ్రామాలు వలసలతో వెలవెలబోతున్నాయి. ఆ బరువుతో పట్టణాలు ఇరుకైపోతున్నాయి.

ఉపాధి వేటలో కష్టాలు తరుముకొస్తున్నాయి. గ్రామాల, పట్టణాల ముఖచిత్రాలు ఇంత వేగంగా మారుతుంటే జనగణన మరింత వేగంగా సాగాలి కదా! కానీ దేశంలో చివరిసారిగా ఈ కసరత్తు జరిగింది 2011లో. అంటే 11 ఏళ్ల కిందట! 2019లో జనగణనకు కేంద్రం ప్రణాళికలు వేసింది. 2021కల్లా ముగించాలని నిర్ణయించింది. ఇప్పుడు మనం 2023లో ఉన్నాం. కానీ ఆ దిశగా తొలి అడుగు కూడా పడలేదు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈసరికి ఆ అనుకున్నదేదో పూర్తయిపోయి ఉండేది. ఎందుకలా జరగలేదు? ఒకసారి చూద్దాం...

అంతా సిద్ధంగానే ఉన్నా...
నిజానికి 2021లోగా జనభా గణన పూర్తి చేయాలని కేంద్రం 2019లోనే నిర్ణయించడమే గాక రూ.8,754.23 కోట్లు కేటాయించింది కూడా. ఈ కసరత్తుకు 33 లక్షల మంది అవసరమని అంచనా వేసింది. వారిని ఏయే రంగాల నుంచి సమీకరించాలో కూడా నిర్ణయానికి వచ్చింది. మొత్తం ప్రక్రియను రెండు దశల్లో పూర్తి చేయాలని ప్రణాళికలు వేసింది. 2020 ఆగస్టు నుంచి సెప్టెంబర్‌ దాకా తొలి దశ, 2021 ఫిబ్రవరిలో రెండో దశ పూర్తి చేయాలన్నది ఆలోచన. ప్రణాళికలన్నీ కాగితం మీద భేషుగ్గా కుదిరాయి. కానీ అనూహ్యంగా కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో జన గణనను వాయిదా వేయాల్సి వచ్చింది.

2020లో కరోనా తొలి వేవ్, 2021లో రెండో వేవ్‌ వల్ల కార్యక్రమం అటకెక్కింది. నిజానికి కరోనా కల్లోలం నడుమే చైనా, అమెరికా, బ్రిటన్‌ వంటి చాలా దేశాలు 2020లోనే జనాభా లెక్కల ప్రక్రియను ముగించాయి! మన దగ్గర కనీసం 2022లో అయినా ఆ మహా కార్యాన్ని పూర్తి చేసి ఉంటే బాగుండేది. కరోనా నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదన్న సాకుతో తప్పించుకోవడం కుదరదు. ఎందుకంటే గతేడాది ఉత్తరప్రదేశ్‌ వంటి అతి పెద్ద రాష్ట్రంతో పాటు గుజరాత్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో శాసనసభ ఎన్నికలు దిగ్విజయంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఎన్నికలకు అడ్డురాని కరోనా భయం జన గణనకు మాత్రమే ఎలా అడ్డంకి అయింది? సూక్ష్మంగా చెప్పాలంటే ఎన్నికలు అనుకున్నట్టు జరిగాయి. జనాభా గణన అనుకున్నట్టు జరగలేదు. దీనిపై కేంద్రం ఈ రోజుకూ కిమ్మనకుండానే ఉంది. అంటే ఇప్పట్లో ఆ ఊసే లేదని కూడా స్పష్టమవుతోంది. వచ్చే ఏడాది (2024) సాధారణ ఎన్నికలుండటంతో ఆ ఏడాదీ జన గణన లేనట్టే. ఒకవైపు బిహార్లో కుల గణనకు రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ నడుం బిగించిన సంగతి తెలిసిందే. మరి అలాంటి చొరవ కేంద్రం ఎందుకు తీసుకోలేకపోతోంది? ఈ ఏడాది మరో 9 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలున్నాయి. ఇలా ఎన్నికల నిర్వహణలో చూపించే చొరవ జనాభా సేకరణలో ఎందుకు చూపించలేక పోతున్నారనేదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. దేశ ప్రజల స్థితిగతులపై ఎన్నికలకు ముందే కొత్త లెక్కలు బహిర్గతమైతే ఎన్నికల్లో సమీకరణలు మారిపోతాయనా? ప్రతిపక్షాలకు చేజేతులా గణాంకాల అస్త్రం అందించినట్టు అవుతుందనా?

 పదేళ్లకోసారి...
పదేళ్లకోసారి జనగణన చేయడం ఆనవాయితీగా వస్తోంది. మన దేశంలో తొలిసారిగా 1872లో జనాభా లెక్కలకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత క్రమం తప్పకుండా పదేళ్లకోసారి నిర్వహిస్తూనే ఉన్నారు. 1941 (రెండో ప్రపంచ యుద్ధం), 1961 (చైనా యుద్ధం), 1971 (బంగ్లాదేశ్‌ విమోచన యుద్ధం)ల్లో కొన్ని ఇబ్బందులు ఎదరైనా పదేళ్ల ఆనవాయితీ తప్పలేదు. ఈసారి లెక్క తప్పింది. ఇంకోసారి తప్పదన్న గ్యారెంటీ లేదు! అయినా అనుకున్నది అనుకున్నట్టు జరిగి ఉంటే ఈసారికి గణాంకాలన్నీ మన చేతిలో ఉండేవి.

అంత ఈజీ కాదు...
పోనీ, కేంద్రం తక్షణ కర్తవ్యంగా ఇప్పటికిప్పుడు రంగంలోకి దిగి వచ్చే ఏడాదే జనాభా గణన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నా అదంత సులువు కాదు. ఎందుకంటే జన గణనకు ఏడాది ముందే గృహాల జాబితా తయారు చేయాల్సి ఉంటుంది. 2011 ఫిబ్రవరిలో జనాభా సేకరణ జరగడానికి ముందే, అంటే 2010లో ఆవాసాల గుర్తింపును కేంద్రం పూర్తి చేసింది. నిజానికి గృహాలను గుర్తించడమే పెద్ద సమస్య. అయితే నేటి డిజిటల్‌ యుగంలో ఈ ప్రక్రియ కొంత వేగంగా జరగడానికి ఆస్కారముంది. ఆయా రాష్ట్రాలు తమ పరిపాలనా పరిధులకు జూన్‌ 30లోగా తుది రూపు ఇవ్వాలని భారత రిజిస్ట్రార్‌ జనరల్, సెన్సెస్‌ కమిషనర్‌ ఆదేశించినట్టు సమాచారం. అంటే గృహాలను గుర్తించే కార్యక్రమానికి జూన్‌ తర్వాతే వీలుపడుతుంది. ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించడం కన్నా మొబైల్‌ యాప్‌ ద్వారా ఈ పనిని సులువుగా చేయవచ్చు. కచ్చితమైన సమాచారాన్ని రాబట్టేలా ప్రశ్నావళి రూపొందించాల్సి ఉంటుంది. జనాభా లెక్కల సేకరణలో భాగంగా 1951లో 13 ప్రశ్నలుండేవి. ఇప్పుడవి 31కి పెరిగాయి. హైటెక్‌ హంగులను ఉపయోగించుకుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జనాభా గణన చేపడితే సంక్షేమ ఫలాలకు అర్హులైన ప్రజలందరికీ మేలు చేసినట్టవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement