Census of India 2021
-
Census 2021: మీనమేషాలే లెక్కిస్తున్నారు
ఎస్.రాజమహేంద్రారెడ్డి: ‘అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే దేశం ఎప్పుడో బాగుపడేది’ – కామారెడ్డి టౌన్‌ప్లానింగ్ కేసులో తెలంగాణ హైకోర్టు వ్యాఖ్య అవును కదా! తరచి తరచి ఆలోచిస్తే న్యాయస్థానం వ్యాఖ్యతో ఏకీభవించక తప్పదు. వ్యక్తుల నుంచి రాజ్యం దాకా ఇదే తాత్సారం. ఏదో అనుకోవడం. ఇంకేదో అవుతుందని వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోవడమే కాకుండా, వాటికి కారణాలు వెతకడం అలవాటైపోయింది. ఒక దేశం సుభిక్షంగా ఉండాలంటే ఆ దేశంలోని ప్రజలు కనీస స్థాయిలోనైనా సంతోషంగా ఉండాలి. వంద కోట్లపైగా జనాభా ఉన్న భారత్ లాంటి దేశంలో అంతమంది ప్రజల స్థితిగతులు, ఆర్థిక హెచ్చుతగ్గులు, ఉపాధి తీరుతెన్నులూ క్షుణ్నంగా తెలిసి ఉండాలి. ఒక మనిషి అతి సాధారణ జీవితం గడపాలన్నా కూడూ గూడూ కనీసావసరాలు. ఇలాంటి వివరాలు, గణాంకాలు చేతిలో ఉంటేనే ఏ ప్రభుత్వమైనా సంక్షేమ ఫలాలు ఎవరికి అత్యవసరమో, అవసరమో, అవసరం లేదో ఇదమిత్థంగా తేల్చుకోగలుగుతుంది. సరైన దిశలో సరైన చర్యలు చేపట్టగలుగుతుంది. దీనికి లెక్కలు కావాలి. అవే జనాభా లెక్కలు. ఈ లెక్కలు చేతిలో ఉంటే ప్రజల బతుకు లెక్కలు సరిచేసే వీలు చిక్కుతుంది. ఏడాది తిరిగే సరికి గ్రామాలకు గ్రామాలు వలసలతో వెలవెలబోతున్నాయి. ఆ బరువుతో పట్టణాలు ఇరుకైపోతున్నాయి. ఉపాధి వేటలో కష్టాలు తరుముకొస్తున్నాయి. గ్రామాల, పట్టణాల ముఖచిత్రాలు ఇంత వేగంగా మారుతుంటే జనగణన మరింత వేగంగా సాగాలి కదా! కానీ దేశంలో చివరిసారిగా ఈ కసరత్తు జరిగింది 2011లో. అంటే 11 ఏళ్ల కిందట! 2019లో జనగణనకు కేంద్రం ప్రణాళికలు వేసింది. 2021కల్లా ముగించాలని నిర్ణయించింది. ఇప్పుడు మనం 2023లో ఉన్నాం. కానీ ఆ దిశగా తొలి అడుగు కూడా పడలేదు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈసరికి ఆ అనుకున్నదేదో పూర్తయిపోయి ఉండేది. ఎందుకలా జరగలేదు? ఒకసారి చూద్దాం... అంతా సిద్ధంగానే ఉన్నా... నిజానికి 2021లోగా జనభా గణన పూర్తి చేయాలని కేంద్రం 2019లోనే నిర్ణయించడమే గాక రూ.8,754.23 కోట్లు కేటాయించింది కూడా. ఈ కసరత్తుకు 33 లక్షల మంది అవసరమని అంచనా వేసింది. వారిని ఏయే రంగాల నుంచి సమీకరించాలో కూడా నిర్ణయానికి వచ్చింది. మొత్తం ప్రక్రియను రెండు దశల్లో పూర్తి చేయాలని ప్రణాళికలు వేసింది. 2020 ఆగస్టు నుంచి సెప్టెంబర్ దాకా తొలి దశ, 2021 ఫిబ్రవరిలో రెండో దశ పూర్తి చేయాలన్నది ఆలోచన. ప్రణాళికలన్నీ కాగితం మీద భేషుగ్గా కుదిరాయి. కానీ అనూహ్యంగా కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో జన గణనను వాయిదా వేయాల్సి వచ్చింది. 2020లో కరోనా తొలి వేవ్, 2021లో రెండో వేవ్ వల్ల కార్యక్రమం అటకెక్కింది. నిజానికి కరోనా కల్లోలం నడుమే చైనా, అమెరికా, బ్రిటన్ వంటి చాలా దేశాలు 2020లోనే జనాభా లెక్కల ప్రక్రియను ముగించాయి! మన దగ్గర కనీసం 2022లో అయినా ఆ మహా కార్యాన్ని పూర్తి చేసి ఉంటే బాగుండేది. కరోనా నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదన్న సాకుతో తప్పించుకోవడం కుదరదు. ఎందుకంటే గతేడాది ఉత్తరప్రదేశ్ వంటి అతి పెద్ద రాష్ట్రంతో పాటు గుజరాత్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో శాసనసభ ఎన్నికలు దిగ్విజయంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు అడ్డురాని కరోనా భయం జన గణనకు మాత్రమే ఎలా అడ్డంకి అయింది? సూక్ష్మంగా చెప్పాలంటే ఎన్నికలు అనుకున్నట్టు జరిగాయి. జనాభా గణన అనుకున్నట్టు జరగలేదు. దీనిపై కేంద్రం ఈ రోజుకూ కిమ్మనకుండానే ఉంది. అంటే ఇప్పట్లో ఆ ఊసే లేదని కూడా స్పష్టమవుతోంది. వచ్చే ఏడాది (2024) సాధారణ ఎన్నికలుండటంతో ఆ ఏడాదీ జన గణన లేనట్టే. ఒకవైపు బిహార్‌లో కుల గణనకు రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నడుం బిగించిన సంగతి తెలిసిందే. మరి అలాంటి చొరవ కేంద్రం ఎందుకు తీసుకోలేకపోతోంది? ఈ ఏడాది మరో 9 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలున్నాయి. ఇలా ఎన్నికల నిర్వహణలో చూపించే చొరవ జనాభా సేకరణలో ఎందుకు చూపించలేక పోతున్నారనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. దేశ ప్రజల స్థితిగతులపై ఎన్నికలకు ముందే కొత్త లెక్కలు బహిర్గతమైతే ఎన్నికల్లో సమీకరణలు మారిపోతాయనా? ప్రతిపక్షాలకు చేజేతులా గణాంకాల అస్త్రం అందించినట్టు అవుతుందనా? పదేళ్లకోసారి... పదేళ్లకోసారి జనగణన చేయడం ఆనవాయితీగా వస్తోంది. మన దేశంలో తొలిసారిగా 1872లో జనాభా లెక్కలకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత క్రమం తప్పకుండా పదేళ్లకోసారి నిర్వహిస్తూనే ఉన్నారు. 1941 (రెండో ప్రపంచ యుద్ధం), 1961 (చైనా యుద్ధం), 1971 (బంగ్లాదేశ్ విమోచన యుద్ధం)ల్లో కొన్ని ఇబ్బందులు ఎదరైనా పదేళ్ల ఆనవాయితీ తప్పలేదు. ఈసారి లెక్క తప్పింది. ఇంకోసారి తప్పదన్న గ్యారెంటీ లేదు! అయినా అనుకున్నది అనుకున్నట్టు జరిగి ఉంటే ఈసారికి గణాంకాలన్నీ మన చేతిలో ఉండేవి. అంత ఈజీ కాదు... పోనీ, కేంద్రం తక్షణ కర్తవ్యంగా ఇప్పటికిప్పుడు రంగంలోకి దిగి వచ్చే ఏడాదే జనాభా గణన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నా అదంత సులువు కాదు. ఎందుకంటే జన గణనకు ఏడాది ముందే గృహాల జాబితా తయారు చేయాల్సి ఉంటుంది. 2011 ఫిబ్రవరిలో జనాభా సేకరణ జరగడానికి ముందే, అంటే 2010లో ఆవాసాల గుర్తింపును కేంద్రం పూర్తి చేసింది. నిజానికి గృహాలను గుర్తించడమే పెద్ద సమస్య. అయితే నేటి డిజిటల్ యుగంలో ఈ ప్రక్రియ కొంత వేగంగా జరగడానికి ఆస్కారముంది. ఆయా రాష్ట్రాలు తమ పరిపాలనా పరిధులకు జూన్ 30లోగా తుది రూపు ఇవ్వాలని భారత రిజిస్ట్రార్ జనరల్, సెన్సెస్ కమిషనర్ ఆదేశించినట్టు సమాచారం. అంటే గృహాలను గుర్తించే కార్యక్రమానికి జూన్ తర్వాతే వీలుపడుతుంది. ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించడం కన్నా మొబైల్ యాప్ ద్వారా ఈ పనిని సులువుగా చేయవచ్చు. కచ్చితమైన సమాచారాన్ని రాబట్టేలా ప్రశ్నావళి రూపొందించాల్సి ఉంటుంది. జనాభా లెక్కల సేకరణలో భాగంగా 1951లో 13 ప్రశ్నలుండేవి. ఇప్పుడవి 31కి పెరిగాయి. హైటెక్ హంగులను ఉపయోగించుకుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జనాభా గణన చేపడితే సంక్షేమ ఫలాలకు అర్హులైన ప్రజలందరికీ మేలు చేసినట్టవుతుంది. -
జనగణన మరింత ఆలస్యం!
న్యూఢిల్లీ: దేశీయంగా కరోనా ఉధృతి పెరుగుతున్నందున, దశాబ్దానికి ఒకమారు జరిపే సార్వత్రిక జనగణన కార్యక్రమం ఇప్పట్లో జరగకపోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. నిజానికి ఈ గణన 2020–21లో జరగాల్సిఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పటికీ పరిస్థితులు పూర్తిగా శాంతించనందున ఇప్పట్లో గణన ఉండకపోవచ్చంటున్నారు. జిల్లాల సరిహద్దులను, సివిల్ మరియు పోలీసు యూనిట్ల హద్దులను 2022 జూన్ వరకు మార్చవద్దని కేంద్రం ఇటీవలే రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు సెన్సస్ రిజిస్టార్ జనరల్ అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. జనగణనకు మూడు నెలల ముందు ఇలా హద్దుల మార్పుపై నిషేధం విధిస్తారు. ఇప్పటికే జూన్ వరకు నిషేధం ఉన్నందున ఇది తొలగిన అనంతరమే జనగణనకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంటే జూన్‌లో నిషేధం తొలగిన అనంతరం జనగణన నోటిఫికేషన్ జారీ చేయదలిస్తే మరోమారు సరిహద్దుల మార్పును నిలిపివేస్తూ ఆదేశాలిస్తారు. తర్వాత 3నెలలకు గణన ఆరంభమవుతుంది. అంటే ఎంత కాదన్నా, వచ్చే అక్టోబర్ వరకు జనగణన జరిగే అవకాశం లేదని నిపుణుల విశ్లేషణ. జిల్లాల, ఇతర యూనిట్ల హద్దుల మార్పుపై నిషేధాన్ని కేంద్రం తొలుత 2020 జనవరి 1 నుంచి మార్చి 31 వరకు విధించింది. ప్రస్తుత నిషేధం ఈ జూన్ 30 వరకు ఉంటుంది. -
బీసీ కులాల జనగణన తక్షణమే చేపట్టాలి
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది దేశ వ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో ఎస్సీ, ఎస్టీల తరహాలోనే బీసీ కులాల గణన కూడా చేపట్టాలని పలు బీసీ సంఘాలు కోరాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాయి. ఆదివారం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో పలువురు బీసీ సంఘాల నేతలు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో దిల్కుషా అతిథిగృహంలో భేటీ అయ్యారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం కులాల వారీగా 1931లో జనగణన చేపట్టిన తర్వాత ఇప్పటివరకు ఆ లెక్కలు తీయలేదని బీసీ సంఘాల నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 2011లో యూపీఏ హయాంలో కులాలవారీగా తీసిన లెక్కలను కూడా నేటి వరకు ప్రకటించలేదని చెప్పారు. కులగణన చేపట్టాలని బిహార్, ఒడిశా, తమిళనాడు అసెంబ్లీలు తీర్మానం చేశాయని, దేశంలోని 18 రాజకీయ పార్టీలు కూడా కులగణనకు మద్దతు ప్రకటిస్తూ ప్రధానికి లేఖలు రాశాయని వివరించారు. అనంతరం బీసీ సంఘాల నేతలు మాట్లాడుతూ.. తమ విజ్ఞప్తికి కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు. కేబినెట్ మంత్రి హోదాలో ఈ విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. కిషన్‌రెడ్డి కలిసిన వారిలో బీసీ సంఘాల నేతలు కనకాల శ్యామ్ కురుమ, తాటికొండ విక్రంగౌడ్, రావుల్‌కోల్ నరేశ్, మణిమంజరి, వరికుప్పల మధు, శివారాణి, బండిగారి రాజు, వెంకట్ తదితరులున్నారు. -
కులాలవారీ జనగణన.. బీజేపీకి పరీక్షే..!
ఒక జాతీయ పత్రిక నిర్వహించిన తాజా సర్వే... నరేంద్ర మోదీ ప్రజాదరణ 66 శాతం నుంచి 24 శాతానికి పడిపోయిందని దిగ్భ్రాంతికరమైన విషయాన్ని వెల్లడించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి ప్రజాదరణ కూడా ప్రత్యేకించి నిరుపేద ఓటర్లలో తీవ్రంగా దెబ్బతింది. నితిశ్ కుమార్ ఈ పరిస్థితిని జాగ్రత్తగా అంచనా వేస్తున్నారు. యూపీలో తిరిగి అధికారాన్ని నిలుపుకోవడానికి బీజేపీ సవాలు ఎదుర్కొంటున్న తరుణంలో నరేంద్రమోదీపై ఒత్తిడి తీసుకురావడానికి ఇదే సరైన సమయమని నితీశ్‌కు తెలుసు. ఈ నేపథ్యంలోనే లాలూ, ములాయం, నితీశ్ శిబిరాలు రెండో మండల్ యుగం గురించి చర్చిస్తున్నాయి. 2015 అసెంబ్లీ ఎన్నికలను మండల్ 2 యుద్ధంగా లాలూ ప్రసాద్ యాదవ్ పేర్కొనడాన్ని మనం గుర్తుంచుకోవాలి. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, హెచ్ఏఎమ్ అధ్యక్షుడు జితిన్ రామ్ మాంఝీ తదితర నేతలు కులాలవారిగా జనాభా గణన సమస్యపై ఆగస్టు 23న ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ప్రధానితో భేటీ తర్వాత బిహార్ సీఎం నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కులాలవారీ జనగణన అంశంపై నిర్ణయం ప్రధాని మోదీపైనే ఉందనేశారు. ఈ అంశంపై బిహార్ ప్రజలతోపాటు దేశం మొత్తంగా ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని, ప్రధాని మా మాటలు ఆలకించినందుకు కృతజ్ఞులమనీ, ఆయనే ఇక దీనిపై నిర్ణయం తీసుకోవలసి ఉందని నితీశ్ స్పష్టం చేశారు. దేశంలో కులాలవారీ జనాభా గణన చేపట్టాలని ప్రధానిపై ఒత్తిడి తీసుకురావడమే నితీశ్ లక్ష్యం. ప్రధానితో భేటీ అనంతరం తేజస్వి యాదవ్ కూడా మాట్లాడుతూ, ’జాతి ప్రయోజనాల రీత్యా ఇది ఒక చారిత్రక ముందడుగు, పేదలంతా దీనివల్ల లబ్ధి పొందుతారు. దేశంలోని జంతువులను, చెట్ల సంఖ్యను లెక్కించగలుగుతున్నప్పుడు, కులాల వారీగా సమగ్ర డేటా లేకుండా ప్రభుత్వం సంక్షేమ విధానాలను ఎలా చేపట్టగలద’ని ప్రశ్నించారు. ఇది కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది. కులాలవారీ జనగణనపై నిర్ణయం తీసుకోవడం ప్రధానికి సులభమైన పనేనా? కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి దీనివల్ల ఎదురయ్యే రాజకీయపరమైన అడ్డంకులేమిటి? బిహార్‌లో ఆర్జేడీ, ఐక్య జనతాదళ్ వంటి ప్రాంతీయ పార్టీలకు, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి, తదితర పార్టీలకు ఈ కులాలవారీ జనగణన తీసుకొచ్చే అవకాశాలేమిటి? ఈ సమస్యపై ఈ పార్టీలన్నీ ఎందుకు ఒక్కటయ్యాయి? 1991లో మండల్ కమిషన్ నివేదిక అమలు నాటి నుంచి సంఖ్యాపరంగా ఆధిక్యత కలిగి, రాజకీయంగా శక్తిమంతంగా ఉన్న ఇతర వెనుకబడిన కులాలు (ఓబీసీలు) ఆధారంగా ప్రత్యేకించి బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు బలపడుతూ వచ్చాయి. 1998లో బీజేపీ కేంద్రంలో అధికారానికి వచ్చి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పటికీ, రెండు దశాబ్దాలపాటు బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్, ఉత్తరప్రదేశ్‌లో ములాయం సింగ్ యాదవ్ తమతమ రాష్ట్రాల్లో అధికార స్థానాల్లో కొనసాగుతూ వచ్చారు. 1990లలోనే యూపీలో, బిహార్‌లో బీజేపీ చొచ్చుకెళ్లి బలం పుంజుకున్నది వాస్తవం. అలాగే 21వ శతాబ్ది తొలి దశాబ్ది సమయంలో కాంగ్రెస్‌ను బీజేపీ మట్టికరిపించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్‌ల ఆధిక్యతను ఈ రెండు రాష్ట్రాల్లో కమలం సవాలు చేయలేకపోయింది. బీజేపీ ప్రధానంగా అగ్రకులాలూ, వైశ్యుల పార్టీగా కొనసాగుతూ రావడమే దీనికి కారణం. అయితే ములాయం, లాలూ పార్టీల్లోని చీలకలను, ఘర్షణలను బీజేపీ ఉపయోగించుకున్నది వాస్తవం. ఈ రెండు పార్టీలు మండల్ కమిషన్ ద్వారా గణనీయంగా లబ్ధిపొందిన ఓబీసీల విశ్వాసాన్ని పొందాయి. అయితే ఈ రెండు రాష్ట్రాల్లోని కుల నాయకుల ఆకాంక్షలను సంతృప్తిపర్చడంలో బీజేపీ పూర్తిగా విఫలమైంది. ఉదాహరణకు, బిహార్ లోని పట్నా, నలందా ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న కుర్మి కుల నాయకుడు నితీశ్ కుమార్‌ని బీజేపీ కొన్ని సార్లు పక్కనపెట్టింది. అలాగే తూర్పు ఉత్తరప్రదేశ్ లోని అప్నాదళ్ అధినేత అనుప్రియ పటేల్‌ని కూడా బీజేపీ దూరం పెట్టింది. కానీ, లాలూ, ములాయంల రాజకీయ బలానికి నష్టం కలిగించడంలో బీజేపీ విఫలమైందనే చెప్పాలి. పైగా బిహార్‌లో 17 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 20 శాతం జనాభాగా ఉన్న ముస్లింల మద్దతును ఇప్పటికీ ఈ ఇద్దరు నేతలే పొందుతున్నారని మర్చిపోరాదు. 2014 నుంచి ఓబీసీ ఓటు తీరు 1998 నుంచి 2009 వరకు లోక్ సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు ప్రత్యేకించి లాలూ, ములాయం పార్టీలు ఓబీసీకు చెందిన ఓట్లను వరుసగా 35 శాతం, 42 శాతం వరకు చేజిక్కించుకున్నాయి. 2004లో కాంగెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయెన్స్ బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమాక్రాటిక్ అలయెన్స్ ప్రభుత్వాన్ని తోసిరాజని అధికారంలోకి వచ్చింది. 2009లో కూడా కేంద్రంలో అధికారాన్ని యూపీఏ నిలుపుకుంది. సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ రాజకీయ వ్యాఖ్యాత ప్రొఫెసర్ సంజయ్ కుమార్ ఈ విషయంపై తాజాగా మరింత స్పష్టతనిచ్చారు. ‘2009 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు 42 శాతం ఓబీసీ ఓట్లను పొందగా బీజేపీ 22శాతం ఓట్లను పొందింది. కానీ తదుపరి దశాబ్దానికల్లా ఓబీసీల మద్దతును బీజేపీ గణనీయంగా పొంది ఆశ్చర్యపర్చింది. 2019 ఎన్నికల నాటికి బీజేపీ 42 శాతం ఓబీసీ ఓట్లను చేజిక్కించుకోగా, ప్రాంతీయ పార్టీలకు 27 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. ఈ మధ్యకాలంలో ఓబీసీలలో బీజేపీ మద్దతు బలం గణనీయంగా పెరిగిందనడానికి ఇదే స్పష్టమైన సాక్ష్యం.’’ 2014 నుంచి 2019 మధ్య ఓబీసీల ఓట్లు స్థానం మారడానికి పలు కారణాలున్నాయి. ఓబీసీలలో, దళితులలో ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయిలో చేసిన విస్తృతమైన కృషి వీటిలో ఒకటి. అలాగే బిహార్‌కి చెందిన కోయిరి నాయకుడు ఉపేంద్ర కుష్వా, అనుప్రియ పటేల్ వంటి ఓబీసీ నేతలు ములాయం, లాలూ పార్టీలకు దూరం కావడం కూడా దీనికి జతకలిసింది. బిహార్, ఉత్తరప్రదేశ్‌లలో యాదవులు, కుర్మీలు వంటి ఎగువతరగతి ఓబీసీలు శక్తిమంతంగా ఉంటున్నప్పటికీ, ఇటీవలికాలంలో ప్రధాని నరేంద్రమోదీ తన ఓబీసీ అస్తిత్వాన్ని వివిధ ప్రచార సభల్లో చాటుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో నోనియా, తెలి, మలకర్, తుర్హా, లోహర్, గోండ్ వంటి దిగువతరగతి ఓబీసీలను తనకు అనుకూలంగా తిప్పుకోవడంలో బీజేపీ విజయం సాధించిందని చాలామంది చెబుతున్నారు కానీ, ఇప్పటికీ బీజేపీకి అగ్రకులాల దన్నే అధికంగా ఉంటోందన్నది వాస్తవం. ఓబీసీ నేతల్లో మోదీ వ్యతిరేక చైతన్యం మొత్తానికి, లాలూ, ములాయం, తేజస్వి, అఖిలేష్ యాదవ్, నితీశ్ కుమార్‌తో సహా ఓబీసీ నేతలు, వారి వారసులు తమకు ఇన్నాళ్లుగా సాంప్రదాయికంగా కొనసాగుతూ వచ్చిన ఓటు పునాది తగ్గుతూ వస్తోందని స్పష్టంగానే గమనించారు. అదేసమయంలో కార్పొరేట్, అగ్రకులాల ప్రయోజనాలే పరమావధిగా కలిగిన బీజేపీ, పేదల అనుకూల ఎజెండాను రూపొందించడంలో పరిమితులను ఎదుర్కొంటూండటం కూడా వాస్తవమే. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ రిజర్వేషన్ల విధానంపై పదే పదే వ్యతిరేకత వ్యక్తం చేయడం, మారుమూల ప్రాంతాల్లో అగ్రకులాలు పేదలపై చేస్తున్న అత్యాచారాలను బీజేపీ నిర్లక్ష్యం చేస్తూండటం కూడా తెలిసిందే. మండల్ 2 సాధ్యపడేనా? ఒక జాతీయ వారపత్రిక తాజా సర్వే ప్రకారం నరేంద్ర మోదీ ప్రజాదరణ 66 శాతం నుంచి 24 శాతానికి పడిపోయిందని దిగ్బ్రాంతికరమైన విషయాన్ని వెల్లడించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో సీఎం ఆదిత్యనాథ్ యోగి ప్రజాదరణ కూడా నిరుపేద ఓటర్లలో తీవ్రంగా దెబ్బతింది. యూపీలో తిరిగి అధికారాన్ని నిలుపుకోవడానికి బీజేపీ సవాలు ఎదుర్కొంటున్న తరుణంలో నరేంద్రమోదీపై ఒత్తిడి తీసుకురావడానికి ఇదే సరైన సమయమని నితీశ్‌కు తెలుసు. అందుకే కులాలవారీ జనగణన డిమాండును మోదీ కనుక విస్మరిస్తే దిగువతరగతి ఓబీసీల్లో అది కచ్చితంగా సందేహాలను మరింతగా పెంచుతుందని జేడీయూ అత్యున్నత నాయకుడొకరు వివరించారు. ఇప్పటికే దిగువ తరగతి ఓబీసీలు నిత్యావసర వస్తువుల ధరల మోతబరువుతో, కోల్పోయిన జీవన అవకాశాలతో నలిగిపోతున్నారన్నది ఆయన భావం. సోషలిస్టు ఉద్యమం పునాదులు కలిగిన బీజేపీయేతర పార్టీలు వెనుకబడిన కులాల, తరగతుల మధ్య ఐక్యతా సాధనకు ప్రణాళికలు రచించుకుంటున్నారు. దీంతో లాలూ, ములాయం, నితీశ్ శిబిరాలు రెండో మండల్ యుగం గురించి చర్చిస్తున్నాయి. 2015 అసెంబ్లీ ఎన్నికలను మండల్ 2 యుద్ధంగా లాలూ ప్రసాద్ యాదవ్ పేర్కొనడాన్ని మనం గుర్తుంచుకోవాలి. వ్యాసకర్త: నళిన్ వర్మ సీనియర్ జర్నలిస్టు (ది వైర్ సౌజన్యంతో) -
జనగణనకు నాలుగంచెల వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి చేపట్టనున్న జాతీయ 16వ జనగణనకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జనగణన చేపట్టే తేదీలను అధికారికంగా వెల్లడించనప్పటికీ ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించింది. జనగణనలో ప్రజల నుంచి తీసుకోవాల్సిన వివరాలతో కూడిన పట్టికను ఇప్పటికే జాతీయ జనగణన డైరెక్టరేట్ విడుదల చేయగా, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌లో పునర్ముద్రించింది. దీంతోపాటు జనగణన చేపట్టే విధానానికి సంబంధించిన కొన్ని మార్గదర్శకాలను కూడా రూపొందించింది. ఈసారి జనగణన కోసం నాలుగంచెల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొదటి అంచెలో జిల్లాకు ఒకరు లేదా ఇద్దరు మాస్టర్ ట్రైనర్లను నియమిస్తోంది. 2021 డిసెంబర్ వరకు రిటైర్మెంట్ లేని గ్రూప్–1 అధికారులను ఇందుకోసం ఎంచుకుని వీరికి శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాతి దశలో గెజిటెడ్ హెడ్మాస్టర్లు, గణాంక అధికారులు, జీహెచ్ఎంసీ సిబ్బందిని ఎంపిక చేసుకుంటోంది. వీరు జనగణన సూపర్వైజర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. వీరు ఎన్యూమరేటర్లను పర్యవేక్షించనున్నా రు. ఎన్యూమరేటర్లుగా మండల, జిల్లా స్థాయిలో పనిచేస్తున్న టీచర్లను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వివరాల సేకరణకు పెన్ను, పేపర్‌ను ఉపయోగించకూడదని, మొబైల్ ఫోన్ యాప్‌తోనే వివరాలను నిక్షిప్తం చేయాలన్న జాతీయ జనగణన డైరెక్టరేట్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. -
ఎన్పీఆర్ వర్సెస్ సెన్సస్!
సాక్షి, న్యూఢిల్లీ: జనగణన–2021కి, జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)కు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జనగణన(సెన్సస్)కు, ఎన్పీఆర్కు మధ్య కొన్ని తేడాలను గమనిస్తే... జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) ఎన్పీఆర్ అంటే దేశంలోని సాధారణ నివాసుల వివరాలతో కూడిన ఒక రిజిస్టర్. పౌరసత్వం చట్టం–1955 పరిధిలో పౌరసత్వ నిబంధనలు, 2003 ఆధారంగా ఈ ఎన్పీఆర్ను రూపొందించనున్నారు. ప్రతి సాధారణ పౌరుడి వివరాల డేటాబేస్‌ను రూపొందిస్తారు. ఆరు నెలలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పాటు ఒక చోట నివాసం ఉన్న వ్యక్తి లేదా కనీసం రానున్న ఆరునెలలు ఒక ప్రాంతంలో నివాసం ఉండాలని నిర్ణయించుకున్న వ్యక్తిని ‘సాధారణ నివాసి’గా పరిగణిస్తారు. స్థానిక(గ్రామ/మండల), తాలూకా, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఎన్పీఆర్ను అప్డేట్ చేస్తారు. ఎన్పీఆర్లో వ్యక్తి పేరు, నివాస స్థితి, కుటుంబ యజమానితో గల బంధుత్వం, లింగ భేదం, పుట్టిన తేదీ, వైవాహిక స్థితి, విద్యార్హత, వృత్తి, తల్లిదండ్రులు లేదా భాగస్వాముల పేర్లు, జన్మస్థలం, జాతీయత, ప్రస్తుత చిరునామా, ఎంతకాలంగా ప్రస్తుత చిరునామాలో ఉంటున్నారు, శాశ్వత చిరునామా వంటి 14 అంశాలను పూరించాల్సి ఉంటుంది. ప్రతీ పౌరుడు ఈ పట్టికలో నమోదు కావాల్సిందే. వారికి జాతీయ గుర్తింపు కార్డును ఇస్తారు. సాధారణ నివాసుల సమగ్ర వివరాలున్న డేటాబేస్‌ను రూపొందించేందుకు ఎన్పీఆర్ను రూపకల్పన చేశారు. ఈ డేటాబేస్‌లో ఆ నివాసుల ఇతర, బయోమెట్రిక్ వివరాలుంటాయి. జనగణన (సెన్సస్): ఎన్పీఆర్తో పోలిస్తే జన గణనలో మరిన్ని వివరాలను సేకరిస్తారు. వ్యక్తి గృహ వివరాలు, ఇంటి నిర్మాణం, కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు, గృహోపకరణాల వివరాలు, పూర్తి ఆదాయ మార్గాలు, వ్యవసాయ– వ్యవసాయేతర వర్గాలు, సాగు, తాగు నీటి లభ్యత, వ్యవసాయ విధానం, వాణిజ్య వర్గాలు, ఎస్సీ, ఎస్టీ వివరాలు, భాష, మతం, దివ్యాంగత.. తదితర పూర్తి సమాచారాన్ని నమోదు చేస్తారు. జనగణన– 2021ని రెండు దశల్లో పూర్తి చేయనున్నారు. 2020 ఏప్రిల్– సెప్టెంబర్ మధ్య తొలి దశను పూర్తి చేస్తారు. ఈ దశలో కుటుంబ సమగ్ర వివరాలను నమోదు చేస్తారు. 2021 ఫిబ్రవరి 9 – 28 మధ్య రెండో దశ నమోదు జరుగుతుంది. ఆ దశలో వర్గాల వారీగా మొత్తం జనాభా సంఖ్యను గణిస్తారు. ఎన్నార్సీ అంటే.. చట్ట ప్రకారం భారతీయ పౌరులుగా నమోదైన వారి జాబితాయే జాతీయ పౌర పట్టిక(నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, ఎన్నార్సీ). ఇందులో 1955 పౌరసత్వ చట్టం ప్రకారం..భారతీయ పౌరులుగా అర్హత పొందిన వారి పేర్లతోపాటు వారికి సంబంధించిన ఇతర వివరాలు కూడా పొందుపరచబడి ఉంటాయి. ఈ పట్టికను మొట్టమొదటిసారిగా 1951లో ప్రభుత్వం రూపొందించింది. ఇప్పటి వరకు దానిని మళ్లీ అప్‌గ్రేడ్ చేయలేదు. అయితే, ఇది అస్సాంలో మాత్రమే ఎప్పటికప్పుడు వివిధ కారణాలతో అప్‌గ్రేడ్ అవుతోంది. భారతీయ పౌరుడంటే ఎవరు? 1955 పౌరసత్వ చట్టం ప్రకారం.. ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి భారతీయ పౌరుడే. దీని ప్రకారం.. ఎ) 1950 జనవరి 26వ తేదీన కానీ, అంతకుపూర్వం కానీ..1987 జూలై 1వ తేదీకి ముందు జన్మించిన వారు భారతీయ పౌరులు. బి) 1987 జూలై 1వ తేదీన కానీ, అంతకుముందు పుట్టిన వారు. అయితే.. 2003లో సవరించిన పౌరసత్వ నిబంధనలు అమల్లోకి రాకముందు జన్మించిన వారు; తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరు ఆ సమయానికి భారత పౌరులై ఉన్నా.. సి) 2003లో సవరించిన పౌరసత్వ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత జన్మించిన వారు; తల్లిదండ్రులిద్దరూ పౌరులై ఉన్నా లేక తల్లిదండ్రులిద్దరిలో ఒకరు అక్రమ వలసదారు కాకున్నా పౌరుడిగానే పరిగణింపబడతారు. -
కేంద్రం కీలక నిర్ణయం: ఎన్పీఆర్ అంటే ఏమిటి?
సాక్షి, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర జాబితా(ఎన్నార్సీ)కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ నరేంద్ర మోదీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2015లో చేపట్టిన ఇంటింటి సర్వే ద్వారా సేకరించిన డేటా ఆధారంగా జాతీయ ప్రజా రిజిస్టర్ (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్- ఎన్పీఆర్)ను నవీకరించే ప్రక్రియకు... కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ. 8500 కోట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఎన్పీఆర్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. అసోం మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్పీఆర్తో పాటు 2021 జనాభా లెక్కల ప్రక్రియ సెప్టెంబరు 2020 వరకు కొనసాగనుంది. ఈ క్రమంలో అసలు ఎన్పీఆర్ అంటే ఏమిటి... దాని ముఖ్య ఉద్దేశం, ఎన్పీఆర్ను వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలు, ఎన్పీఆర్ నుంచి అసోంను ఎందుకు మినహాయించారు తదితర అంశాల గురించి గమనిద్దాం. ఎన్పీఆర్ అంటే ఏమిటి? దేశంలోని ప్రతీ పౌరుడి కచ్చితమైన వివరాలు సేకరించడమే ఎన్పీఆర్ ముఖ్య ఉద్దేశం. ఎన్పీఆర్ ప్రకారం... ఏదైనా ఒక నిర్ణీత ప్రదేశంలో ఒక వ్యక్తి గల ఆరు నెలలుగా నివాసం ఉంటున్నా లేదా మరో ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం అక్కడే నివాసం ఉండాలనుకుంటే అతడిని యూజువల్ రెసిడెంట్(సాధారణ నివాసి)గా పేర్కొంటారు. పౌరసత్వ చట్టం 1955, పౌరసత్వ నిబంధనలు(రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్స్, జాతీయ గుర్తింపు కార్డుల జారీ) 2003లోని వివిధ ప్రొవిజన్లను అనుసరించి... గ్రామం, పట్టణం, జిల్లా, రాష్ట్రం తదితర విభాగాల్లో దేశంలోని పౌరుల వివరాలను సేకరిస్తారు. ఎన్పీఆర్ డేటాబేస్‌లో జనాభా లెక్కలు, పౌరుల బయోమెట్రిక్ వివరాలు, ఆధార్, మొబైల్, పాన్ నంబర్లు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటర్ ఐడీ వివరాలు.. అదే విధంగా పాసుపోర్టు నంబర్లను నిక్షిప్తం చేస్తారు. అయితే ఇందులో ఆధార్ నంబరు వాలంటీరిగా ఇస్తే మాత్రమే తీసుకుంటారు. ఏయే వివరాలు అడుగుతారు? ఎన్పీఆర్ ప్రక్రియలో భాగంగా వ్యక్తి పేరు, ఇంటి యజమాని, తండ్రి పేరు, తల్లి పేరు, వివాహితులైతే భార్య/భర్త పేరు, లింగం, పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశం, జాతీయత, తాత్కాలిక చిరునామా, శాశ్వత చిరునామా, ఈ చిరునామాల్లో ఎంతకాలంగా నివాసం ఉంటున్నారు?, వృత్తి, విద్యార్హతల గురించి ప్రశ్నిస్తారు. డోర్-టూ- డోర్ సర్వే ఆధారంగా... ఎన్పీఆర్ కోసం.. 2011 జనాభా లెక్కల సేకరణలో భాగంగా 2010లో సేకరించిన డేటాను.. 2015లో చేపట్టిన ఇంటింటి సర్వే ఆధారంగా నవీకరించి.. డిజిటలైజ్ చేశారు. ప్రస్తుతం 2021 జనాభా లెక్కల ప్రక్రియ ఆధారంగా అసోం మినహా భారత్‌లోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ఎన్పీఆర్ ప్రక్రియ చేపట్టనుంది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎన్పీఆర్ను వద్దన్న రాష్ట్రాలు.. ఎన్పీఆర్, ఎన్పీఆర్ నవీకరణ ప్రక్రియకు సంబంధించిన అన్ని కార్యకలాపాలకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అడ్డుచెప్పింది. సీఏఏపై రాష్ట్రంలో ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా ఎన్నార్సీ అమలును తాము ఆమోదించబోమని స్పష్టం చేశారు. ఎన్పీఆర్ ఆధారంగా ఎన్నార్సీ అమలు ఉంటుందన్న నేపథ్యంలో ఎన్పీఆర్ ప్రక్రియను తమ రాష్ట్రంలో అనుమతించబోమని తెలిపారు. అదే విధంగా కేరళ, రాజస్తాన్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్పీఆర్ ప్రక్రియకు సహకరించబోమని స్పష్టం చేశాయి.(చదవండి : పౌరసత్వ చట్టం: ఎందుకీ ఆందోళనలు?) అసోంను ఎందుకు మినహాయించారు? ఎన్పీఆర్ పూర్తయి, అధికారిక ముద్రణ తర్వాత ప్రభుత్వం దీనినే భారత జాతీయ పౌరసత్వ(ఎన్ఆర్సీ) రిజిస్టర్‌కు ఆధారంగా చేసుకుంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక అసోంలో ఇటీవలే ఎన్నార్సీను అమలు చేసిన విషయం తెలిసిందే. దీని ఆధారంగా అక్రమ వలసదారులను గుర్తించి వారిని క్యాంపులకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ నిజమైన పౌరుల వివరాలను సేకరించే ఎన్పీఆర్ ప్రక్రియలో అసోంను మినహాయించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అపోహలు వద్దు.. ఎన్పీఆర్ డేటా పబ్లిక్ డొమైన్లలో కనిపించదు. ప్రొటోకాల్‌ను అనుసరించి కొంతమంది ప్రత్యేక యూజర్లకు మాత్రమే ఈ డేటా అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అర్హులైన లబ్దిదారులను గుర్తించేందుకు ఎన్పీఆర్ డేటాను వినియోగించుకుంటామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. పౌరుల వ్యక్తిగత డేటా భద్రతపై అపోహలు వద్దని విఙ్ఞప్తి చేసింది. -
ఎన్పీఆర్: కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ వివరణ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి వర్గం మంగళవారం ఆమోదించిన ఎన్పీఆర్ ఆమోదం, తదితర అంశాలపై కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియా సమావేశం నిర్వహించారు. జనాభా నమోదు కార్రయక్రమాన్ని చేపట్టేందుకు అన్ని రాష్ట్రాలూ అంగీకరించాయని తెలిపారు. 2010లోనే దీన్ని తొలిసారి ప్రవేశపెట్టారని, అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తొలి కార్డును జారీ చేశారని తెలిపారు. భారతదేశంలో జీవించే ప్రజలందరి జాబితాను రూపొందించేందుకే దీనిని నిర్వహిస్తున్నామన్నారు. పీయూష్ గోయల్ తదితర మంత్రివర్గ సహచరులు పాల్గొన్న ఈ సమావేశంలో రూ. వేల కోట్ల అటల్ భూజల్ యోజనకు ఆమోదం తెలిపినట్టు తెలిపారు. అలాగే ఆయుధాల చట్టంలో సవరణలు చేసినట్టు వెల్లడించారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు- ముఖ్యాంశాలు : 2021 ఫిబ్రవరి నుంచి 16వ జనాభా గణన వుంటుంది. ఇందుకోసం స్పెషల్ మొబైల్ ఆప్ తీసుకొస్తాం. ప్రజలు ఈ యాప్ ద్వారా స్వయంగా వివరాలను నమోదు చేయవచ్చు. స్వయం ప్రకటిత వివరాల ఆధారంగా గణన వుంటుంది. అంతేకానీ, దీనికి ఎలాంటి ధృవీకరణ పత్రాలు, బయో మెట్రిక్ వివరాల నమోదు వుండదు. ప్రధానంగా సంక్షేమ పథకాల అసలైన లబ్దదారులు వెలుగులోకి వస్తారు. తద్వారా లబ్దిదారులకు మేలు కలగనుంది. టూరిజం విభాగం అభివృద్ధిపై మరింత దృష్టిపెట్టినట్టు కేంద్రమంత్రి వివరించారు. హిమాలయా, నార్త్ఈస్ట్, కృష్ట, కోస్టల్, ఇకో, డిజర్ట్, తీర్థాంకర్, రామాయణ తదితర 16 సర్క్యూట్స్ ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఒక వ్యక్తి రెండు ఆయుధాలకు లైసెన్స్ కలిగి వుండేందుకు అనుమతి. గతంలో మూడువుండగా, తర్వాత ఒక ఆయుధానికి పరిమితం చేసినా, తాజా నిర్ణయంలో రెండు ఆయుధాలకు అనుమతి. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌గా నియమించబడే అధికారి ఫోర్ స్టార్ జనరల్ , సైనిక వ్యవహారాల విభాగానికి అధిపతిగా ఉంటారు. రైల్వే బోర్డు పునర్నిర్మాణం చారిత్రాత్మక నిర్ణయం. ఈప్రక్రియ కొనసాగుతోంది- మంత్రి పియూష్ గోయల్. మొత్తం 8 రైల్వే సేవలను ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ (ఐఆర్ఎంఎస్) కిందికి తీసుకురానుంది. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది.