ఒక జాతీయ పత్రిక నిర్వహించిన తాజా సర్వే... నరేంద్ర మోదీ ప్రజాదరణ 66 శాతం నుంచి 24 శాతానికి పడిపోయిందని దిగ్భ్రాంతికరమైన విషయాన్ని వెల్లడించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి ప్రజాదరణ కూడా ప్రత్యేకించి నిరుపేద ఓటర్లలో తీవ్రంగా దెబ్బతింది. నితిశ్ కుమార్ ఈ పరిస్థితిని జాగ్రత్తగా అంచనా వేస్తున్నారు. యూపీలో తిరిగి అధికారాన్ని నిలుపుకోవడానికి బీజేపీ సవాలు ఎదుర్కొంటున్న తరుణంలో నరేంద్రమోదీపై ఒత్తిడి తీసుకురావడానికి ఇదే సరైన సమయమని నితీశ్‌కు తెలుసు. ఈ నేపథ్యంలోనే లాలూ, ములాయం, నితీశ్ శిబిరాలు రెండో మండల్ యుగం గురించి చర్చిస్తున్నాయి. 2015 అసెంబ్లీ ఎన్నికలను మండల్ 2 యుద్ధంగా లాలూ ప్రసాద్ యాదవ్ పేర్కొనడాన్ని మనం గుర్తుంచుకోవాలి.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, హెచ్‌ఏఎమ్ అధ్యక్షుడు జితిన్ రామ్ మాంఝీ తదితర నేతలు కులాలవారిగా జనాభా గణన సమస్యపై ఆగస్టు 23న ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ప్రధానితో భేటీ తర్వాత బిహార్ సీఎం నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కులాలవారీ జనగణన అంశంపై నిర్ణయం ప్రధాని మోదీపైనే ఉందనేశారు. ఈ అంశంపై బిహార్ ప్రజలతోపాటు దేశం మొత్తంగా ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని, ప్రధాని మా మాటలు ఆలకించినందుకు కృతజ్ఞులమనీ, ఆయనే ఇక దీనిపై నిర్ణయం తీసుకోవలసి ఉందని నితీశ్ స్పష్టం చేశారు. దేశంలో కులాలవారీ జనాభా గణన చేపట్టాలని ప్రధానిపై ఒత్తిడి తీసుకురావడమే నితీశ్ లక్ష్యం. ప్రధానితో భేటీ అనంతరం తేజస్వి యాదవ్ కూడా మాట్లాడుతూ, ’జాతి ప్రయోజనాల రీత్యా ఇది ఒక చారిత్రక ముందడుగు, పేదలంతా దీనివల్ల లబ్ధి పొందుతారు. దేశంలోని జంతువులను, చెట్ల సంఖ్యను లెక్కించగలుగుతున్నప్పుడు, కులాల వారీగా సమగ్ర డేటా లేకుండా ప్రభుత్వం సంక్షేమ విధానాలను ఎలా చేపట్టగలద’ని ప్రశ్నించారు. ఇది కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది. కులాలవారీ జనగణనపై నిర్ణయం తీసుకోవడం ప్రధానికి సులభమైన పనేనా? కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి దీనివల్ల ఎదురయ్యే రాజకీయపరమైన అడ్డంకులేమిటి? బిహార్‌లో ఆర్జేడీ, ఐక్య జనతాదళ్ వంటి ప్రాంతీయ పార్టీలకు, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి, తదితర పార్టీలకు ఈ కులాలవారీ జనగణన తీసుకొచ్చే అవకాశాలేమిటి? ఈ సమస్యపై ఈ పార్టీలన్నీ ఎందుకు ఒక్కటయ్యాయి?
1991లో మండల్ కమిషన్ నివేదిక అమలు నాటి నుంచి సంఖ్యాపరంగా ఆధిక్యత కలిగి, రాజకీయంగా శక్తిమంతంగా ఉన్న ఇతర వెనుకబడిన కులాలు (ఓబీసీలు) ఆధారంగా ప్రత్యేకించి బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు బలపడుతూ వచ్చాయి. 1998లో బీజేపీ కేంద్రంలో అధికారానికి వచ్చి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పటికీ, రెండు దశాబ్దాలపాటు బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్, ఉత్తరప్రదేశ్‌లో ములాయం సింగ్ యాదవ్ తమతమ రాష్ట్రాల్లో అధికార స్థానాల్లో కొనసాగుతూ వచ్చారు. 1990లలోనే యూపీలో, బిహార్‌లో బీజేపీ చొచ్చుకెళ్లి బలం పుంజుకున్నది వాస్తవం. అలాగే 21వ శతాబ్ది తొలి దశాబ్ది సమయంలో కాంగ్రెస్‌ను బీజేపీ మట్టికరిపించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్‌ల ఆధిక్యతను ఈ రెండు రాష్ట్రాల్లో కమలం సవాలు చేయలేకపోయింది. బీజేపీ ప్రధానంగా అగ్రకులాలూ, వైశ్యుల పార్టీగా కొనసాగుతూ రావడమే దీనికి కారణం.
అయితే ములాయం, లాలూ పార్టీల్లోని చీలకలను, ఘర్షణలను బీజేపీ ఉపయోగించుకున్నది వాస్తవం. ఈ రెండు పార్టీలు మండల్ కమిషన్ ద్వారా గణనీయంగా లబ్ధిపొందిన ఓబీసీల విశ్వాసాన్ని పొందాయి. అయితే ఈ రెండు రాష్ట్రాల్లోని కుల నాయకుల ఆకాంక్షలను సంతృప్తిపర్చడంలో బీజేపీ పూర్తిగా విఫలమైంది. ఉదాహరణకు, బిహార్ లోని పట్నా, నలందా ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న కుర్మి కుల నాయకుడు నితీశ్ కుమార్‌ని బీజేపీ కొన్ని సార్లు పక్కనపెట్టింది. అలాగే తూర్పు ఉత్తరప్రదేశ్ లోని అప్నాదళ్ అధినేత అనుప్రియ పటేల్‌ని కూడా బీజేపీ దూరం పెట్టింది. కానీ, లాలూ, ములాయంల రాజకీయ బలానికి నష్టం కలిగించడంలో బీజేపీ విఫలమైందనే చెప్పాలి. పైగా బిహార్‌లో 17 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 20 శాతం జనాభాగా ఉన్న ముస్లింల మద్దతును ఇప్పటికీ ఈ ఇద్దరు నేతలే పొందుతున్నారని మర్చిపోరాదు.
2014 నుంచి ఓబీసీ ఓటు తీరు
1998 నుంచి 2009 వరకు లోక్ సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు ప్రత్యేకించి లాలూ, ములాయం పార్టీలు ఓబీసీకు చెందిన ఓట్లను వరుసగా 35 శాతం, 42 శాతం వరకు చేజిక్కించుకున్నాయి. 2004లో కాంగెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయెన్స్ బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమాక్రాటిక్ అలయెన్స్ ప్రభుత్వాన్ని తోసిరాజని అధికారంలోకి వచ్చింది. 2009లో కూడా కేంద్రంలో అధికారాన్ని యూపీఏ నిలుపుకుంది. సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ రాజకీయ వ్యాఖ్యాత ప్రొఫెసర్ సంజయ్ కుమార్ ఈ విషయంపై తాజాగా మరింత స్పష్టతనిచ్చారు. ‘2009 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు 42 శాతం ఓబీసీ ఓట్లను పొందగా బీజేపీ 22శాతం ఓట్లను పొందింది. కానీ తదుపరి దశాబ్దానికల్లా ఓబీసీల మద్దతును బీజేపీ గణనీయంగా పొంది ఆశ్చర్యపర్చింది. 2019 ఎన్నికల నాటికి బీజేపీ 42 శాతం ఓబీసీ ఓట్లను చేజిక్కించుకోగా, ప్రాంతీయ పార్టీలకు 27 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. ఈ మధ్యకాలంలో ఓబీసీలలో బీజేపీ మద్దతు బలం గణనీయంగా పెరిగిందనడానికి ఇదే స్పష్టమైన సాక్ష్యం.’’
2014 నుంచి 2019 మధ్య ఓబీసీల ఓట్లు స్థానం మారడానికి పలు కారణాలున్నాయి. ఓబీసీలలో, దళితులలో ఆర్‌ఎస్‌ఎస్ క్షేత్రస్థాయిలో చేసిన విస్తృతమైన కృషి వీటిలో ఒకటి. అలాగే బిహార్‌కి చెందిన కోయిరి నాయకుడు ఉపేంద్ర కుష్వా, అనుప్రియ పటేల్ వంటి ఓబీసీ నేతలు ములాయం, లాలూ పార్టీలకు దూరం కావడం కూడా దీనికి జతకలిసింది. బిహార్, ఉత్తరప్రదేశ్‌లలో యాదవులు, కుర్మీలు వంటి ఎగువతరగతి ఓబీసీలు శక్తిమంతంగా ఉంటున్నప్పటికీ, ఇటీవలికాలంలో ప్రధాని నరేంద్రమోదీ తన ఓబీసీ అస్తిత్వాన్ని వివిధ ప్రచార సభల్లో చాటుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో నోనియా, తెలి, మలకర్, తుర్హా, లోహర్, గోండ్ వంటి దిగువతరగతి ఓబీసీలను తనకు అనుకూలంగా తిప్పుకోవడంలో బీజేపీ విజయం సాధించిందని చాలామంది చెబుతున్నారు కానీ, ఇప్పటికీ బీజేపీకి అగ్రకులాల దన్నే అధికంగా ఉంటోందన్నది వాస్తవం.
ఓబీసీ నేతల్లో మోదీ వ్యతిరేక చైతన్యం
మొత్తానికి, లాలూ, ములాయం, తేజస్వి, అఖిలేష్ యాదవ్, నితీశ్ కుమార్‌తో సహా ఓబీసీ నేతలు, వారి వారసులు తమకు ఇన్నాళ్లుగా సాంప్రదాయికంగా కొనసాగుతూ వచ్చిన ఓటు పునాది తగ్గుతూ వస్తోందని స్పష్టంగానే గమనించారు. అదేసమయంలో కార్పొరేట్, అగ్రకులాల ప్రయోజనాలే పరమావధిగా కలిగిన బీజేపీ, పేదల అనుకూల ఎజెండాను రూపొందించడంలో పరిమితులను ఎదుర్కొంటూండటం కూడా వాస్తవమే. ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ రిజర్వేషన్ల విధానంపై పదే పదే వ్యతిరేకత వ్యక్తం చేయడం, మారుమూల ప్రాంతాల్లో అగ్రకులాలు పేదలపై చేస్తున్న అత్యాచారాలను బీజేపీ నిర్లక్ష్యం చేస్తూండటం కూడా తెలిసిందే.
మండల్ 2 సాధ్యపడేనా?
ఒక జాతీయ వారపత్రిక తాజా సర్వే ప్రకారం నరేంద్ర మోదీ ప్రజాదరణ 66 శాతం నుంచి 24 శాతానికి పడిపోయిందని దిగ్బ్రాంతికరమైన విషయాన్ని వెల్లడించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో సీఎం ఆదిత్యనాథ్ యోగి ప్రజాదరణ కూడా నిరుపేద ఓటర్లలో తీవ్రంగా దెబ్బతింది. యూపీలో తిరిగి అధికారాన్ని నిలుపుకోవడానికి బీజేపీ సవాలు ఎదుర్కొంటున్న తరుణంలో నరేంద్రమోదీపై ఒత్తిడి తీసుకురావడానికి ఇదే సరైన సమయమని నితీశ్‌కు తెలుసు. అందుకే కులాలవారీ జనగణన డిమాండును మోదీ కనుక విస్మరిస్తే దిగువతరగతి ఓబీసీల్లో అది కచ్చితంగా సందేహాలను మరింతగా పెంచుతుందని జేడీయూ అత్యున్నత నాయకుడొకరు వివరించారు. ఇప్పటికే దిగువ తరగతి ఓబీసీలు నిత్యావసర వస్తువుల ధరల మోతబరువుతో, కోల్పోయిన జీవన అవకాశాలతో నలిగిపోతున్నారన్నది ఆయన భావం. సోషలిస్టు ఉద్యమం పునాదులు కలిగిన బీజేపీయేతర పార్టీలు వెనుకబడిన కులాల, తరగతుల మధ్య ఐక్యతా సాధనకు ప్రణాళికలు రచించుకుంటున్నారు. దీంతో లాలూ, ములాయం, నితీశ్ శిబిరాలు రెండో మండల్ యుగం గురించి చర్చిస్తున్నాయి. 2015 అసెంబ్లీ ఎన్నికలను మండల్ 2 యుద్ధంగా లాలూ ప్రసాద్ యాదవ్ పేర్కొనడాన్ని మనం గుర్తుంచుకోవాలి.
వ్యాసకర్త: నళిన్ వర్మ
సీనియర్ జర్నలిస్టు
(ది వైర్ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment