విత్తనాల సాగు, అమ్మకాల్లో రైతుల హక్కులను కాపాడే నిబంధనలు పలు ప్రభుత్వాలు కేంద్ర స్థాయిలో తీసుకొస్తున్నప్పటికీ విత్తన రైతు మూలాలను దెబ్బతిసే చర్యలకు మాత్రం సాహసించలేదు. కానీ 2019లో ప్రధాని మోదీ తీసుకొచ్చిన సీడ్ బిల్లు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన కీలక ప్రతిపాదనలను పక్కన బెట్టింది. ప్రధానంగా రైతులు విత్తనాలను ఉత్పత్తి చేసి అమ్ముకునే హక్కును కాపాడే విషయంలో ముసాయిదా లోపాయకారీగా ప్రైవేట్ రంగ కంపెనీలకు లబ్ధి కలిగిస్తూ నామమాత్ర ప్రతిపాదనలు చేసి చేతులు దులుపుకుంది. అందుకే తాము రైతు ఉద్యమాన్ని ప్రారంభించకపోయి ఉంటే 2019 విత్తన బిల్లుకు కేంద్రం ఇప్పటికే చట్ట రూపం కల్పించేదని రైతు నేత రాకేష్ టికాయత్ చేసిన ప్రకటన సత్యమే అని చెప్పాలి.
కేంద్రప్రభుత్వం రైతుల డిమాండ్లను గనుక పరిష్కరించకపోతే 16 రాష్ట్రాల్లో విద్యుత్ లైన్లను తెంచిపారేస్తామని ఇటీవలే రైతు నేత రాకేష్ తికాయత్ హెచ్చరించిన నేపథ్యంలో, ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన 2019 విత్తన బిల్లు మరోసారి పతాక శీర్షికలకు ఎక్కింది. రైతు ఉద్యమం కనుక జరగక పోయి ఉంటే కేంద్ర ప్రభుత్వం ఈ పాటికే ప్రైవేట్ సీడ్ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చే విత్తన బిల్లుకు చట్టరూపం కల్పించేదని టికాయత్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే ఈ సీడ్ బిల్లులో ఉంటున్న అత్యంత సమస్యాత్మకమైన అంశం ఏమిటి అనేది చర్చనీయాంశం అవుతోంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో విత్తన క్రమబద్ధీకరణ నియంత్రణ విషయంలో సీడ్ బిల్లు తీసుకొచ్చిన ప్రతిపాదనలు ఏమిటో చూద్దాం.
1966 సీడ్స్ యాక్ట్‌కు చట్టరూపం ఇవ్వడం ద్వారా వ్యవస్థీకృత సీడ్ ప్రోగ్రాంని దేశంలో అమలులోకి తీసుకురావడం జరిగింది. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయడమే ఈ చట్టం లక్ష్యం. ఈ చట్టాన్ని తీసుకురావడానికి గాను 1968 సీడ్స్ నిబంధనలను రూపొందించారు. ఇప్పటివరకు ఈ చట్టం పరిమిత స్థాయిలోనే అమలవుతోంది. పైగా కొన్ని రకాల విత్తన రకాలను మాత్రమే ఈ చట్టం నియంత్రిస్తోంది. 1983లో నిత్యావసర సరుకుల చట్టం 1955 అధికారాల కింద విత్తన నియంత్రణ చట్టాన్ని నాటి ప్రభుత్వం తీసుకొచ్చింది. విత్తన పంపిణీ, సరఫరాను నియంత్రణ కోసం దీన్ని తీసుకొచ్చారు.
రెండు దశాబ్దాల తర్వాత, 1966 సీడ్స్ యాక్ట్‌ను రద్దు చేసి దాని స్థానంలో సీడ్స్ బిల్ 2004ను తీసుకొచ్చారు. అయితే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఈ బిల్లును సమర్ఫించినప్పుడు, ఈ బిల్లుకు వ్యతిరేకంగా కమిటీ బలమైన ప్రతిపాదనలు చేసింది. ప్రైవేట్ కంపెనీల లాభార్జనకు వ్యతిరేకంగా, రైతులు విత్తనాలను ఉత్పత్తి చేసి అమ్ముకునే హక్కును కాపాడే విషయంలో ఈ ముసాయిదా బిల్లు ఏం చెబుతోంది అనే అంశాన్ని కమిటీ నిశితంగా పరిశీలించింది.
అంతకు కొన్ని సంవత్సరాలకు ముందు, 2001లో అంటే బిల్లుని ఇంకా ప్రవేశపెట్టక ముందు, పంటల రకాలు, రైతుల హక్కుల చట్టం (పీపీవీఎఫ్‌ఆర్‌ఏ) తీసుకొచ్చారు. విత్తన వ్యాపారంలో రైతుల హక్కులను కాపాడే నిబంధనలు ఈ చట్టంలో పొందుపర్చారు. విత్తన వ్యాపారంలో బహుళ జాతి కంపెనీల ప్రవేశానికి దారి కల్పించడాన్ని గౌరవిస్తూ ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రమాణాలను భారత్ పాటించాల్సినందువల్ల ఇలాంటి చట్టం ఒకటి తీసుకురావలసిన అవసరం అప్పట్లో ఏర్పడింది.
శాసనపరమైన సంక్లిష్టతల మధ్యనే నరేంద్రమోదీ ప్రభుత్వం 2019లో సీడ్ బిల్లు ముసాయిదాను తీసుకొచ్చింది. అయితే ఈ ముసాయిదాలో నాటి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన ప్రతిపాదనలను పాక్షికంగా మాత్రమే మనం చూడవచ్చు. రైతులు తమ విత్తనాలను నమోదు చేసుకోవాలని, అవి తక్కువ అంకురోత్పత్తిని, భౌతిక స్వచ్ఛతను, జన్యు స్వచ్ఛతను కలిగి ఉండేలా జాగ్రత్తలు పాటించాలని బిల్లు ప్రతిపాదించిందన్న వాస్తవానికి వ్యతిరేకంగా స్టాండింగ్ కమిటీ ప్రధానంగా మాట్లాడింది. అలాంటి నిబంధనలు విత్తనాలను తయారు చేసి అమ్మే రైతుల హక్కుకు వ్యతిరేకంగా ఉన్నాయని కమిటీ గుర్తించింది. పైగా ఈ చట్టం మార్కెట్‌ను పూర్తిగా ప్రైవేట్ రంగానికి తలుపులు తెరిచేస్తోందని కమిటీ భావించింది.
అందుకే విత్తనాల ధరల నియంత్రణపై, వాటి స్వీయ ధ్రువీకరణ తొలగింపుపై కఠిన నిబంధనలను అమల్లోకి తెస్తూ ప్రయివేట్ విత్తన సంస్థలను అదుపుచేసే అంశాలను స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది. అలాగే తొమ్మిదో పంచవర్ష ప్రణాళికా కాలంలో విత్తన పంటల బీమా స్కీమ్‌ని తిరిగి ప్రారంభించాల్సిన అవసరాన్ని కమిటీ లేవనెత్తింది. అలాగే గుర్తించదగిన మరికొన్ని సూచనలను కూడా చేసింది.
స్టాండింగ్ కమిటీ చేసిన అనేక ప్రతిపాదనలను 2019 ముసాయిదా బిల్లులో పొందుపర్చారు. కానీ అనేక కీలకమైన అంశాలపట్ల ముసాయిదా ఇప్పటికీ మౌనం పాటిస్తోంది. రైతు మాత్రమే కాకుండా ప్రతి విత్తన ఉత్పత్తిదారుకూ చట్టం వర్తిస్తుందని పేర్కొంటున్న క్లాజ్ 1(3)(బి)ని సవరించాలని కమిటీ సిఫార్సు చేసింది. దీన్ని ప్రస్తుత ముసాయిదా పొందుపర్చింది కూడా. అయితే సాంప్రదాయిక విత్తన రకాలను నిల్వ చేసుకునేవారిని, లేదా విత్తనాలకు మరికాస్త విలువ కల్పించేవారిని కూడా చేరుస్తూ రైతు అనే నిర్వచనాన్ని మరింతగా విస్తరించాలనే స్టాండింగ్ కమిటీ సిఫారసుకు ఈ బిల్లులో చోటు లభించలేదు. తమ వద్ద ఉన్న విత్తనాలను తప్పకుండా నమోదు చేయాలని రైతులను ఈ ముసాయిదా ఇప్పుడు బలవంత పెట్టడం లేదు కానీ, రైతులు లేక కంపెనీలు కానివారు, (బహుశా దేశీయ కమ్యూనిటీకి చెందిన సభ్యులు) విత్తనాలను ఉత్పత్తి చేసి, అమ్ముకోవడం ఇప్పుడు సాధ్యం కాదు.
అలాగే మార్కెట్లో నాసిరకం విత్తనాలను, అవాంఛనీయమైన విత్తనాలను అమ్మడానికి వీల్లేకుండా, తప్పుముద్రతో వస్తున్న విత్తనాలను నిత్యం తనిఖీ చేయడానికి ఒక నిర్దిష్ట యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాలని స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది కానీ, ఈ ముసాయిదా బిల్లులో అలాంటి యంత్రాంగం ప్రస్తావన లేదు. పైగా విత్తనం అనే నిర్వచనం పరిధిలో సింథటిక్ విత్తనాలను పొందుపర్చరాదని కమిటీ సూచించింది కానీ ఈ ముసాయిదా బిల్లు అదే సింథటిక్ విత్తనాలను హైబ్రిడ్ విత్తనాలు అనే నిర్వచనంతో చేర్చింది.
అలాగే రైతుల భాగస్వామ్యం గురించి కమిటీ నొక్కి చెప్పింది. వివిధ భౌగోళిక ప్రాంతాల నుండి వచ్చిన రైతు ప్రతినిధులను కేంద్ర విత్తన కమిటీలో తప్పకుండా పొందుపర్చాలని స్టాండింగ్ కమిటీ ప్రత్యేకించి కోరింది. ముసాయిదా బిల్లు రైతు ప్రతినిధుల భాగస్వామ్యాన్ని పొందుపర్చింది కానీ దానికి ఒక అర్హతను జోడిస్తూ ఆ డిమాండ్‌ను పలుచబార్చింది. విత్తన నియంత్రణ అమలులో రైతులను ఒక పార్టీగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని సూచిస్తూ, రైతుల ప్రాతినిధ్యం రొటేషన్ ప్రకారం ఉంటుందని ముసాయిదా బిల్లు పేర్కొంది.
అలాగే కేంద్ర విత్తన కమిటీ ద్వారా లేక రాష్ట్ర స్థాయి విత్తన కమిటీల ద్వారా విత్తనాల ధరలను నియంత్రించవలసిన అవసరం గురించి స్టాండింగ్ కమిటీ ప్రత్యేకించి నొక్కి చెప్పింది. పర్యావరణానికి హాని కలిగించే లేదా ఇతర అనివార్య కారణాలతో కొత్త విత్తన రకాల నమోదును ప్రజలు వ్యతిరేకించేలా ఒక నిబంధనకూడా బిల్లులో పొందుపర్చాలని కమిటీ కోరుకుంది. దీనికి అనుగుణంగా విత్తన శాతం మూలాన్ని ప్రకటించాలని కూడా కమిటీ సూచించింది. అయితే ఈ సిఫార్సులు వేటినీ ముసాయిదా బిల్లులో చేర్చలేదు.
రైతుల ప్రయోజనాల మాట ఏమిటి?
దేశవ్యాప్తంగా విత్తనాల వ్యాపారంలోకి ప్రైవేట్ రంగం విస్తరించిన నేపథ్యంలో విత్తనాల ధరలు చుక్కలంటుతున్నాయి దీంతో విత్తన సాగు వ్యయం కూడా పెరిగిపోతోంది. ఉదాహరణకు ఆవాల విత్తనాలను అమ్మడంలో భాగం పంచుకుంటున్న పయనీర్ అనే ప్రైవేట్ కంపెనీ ఇప్పుడు ఒక కిలో ఆవాల విత్తనాలను 750 రూపాయలకు అమ్ముతోంది. ఇతర ప్రైవేట్ కంపెనీలు అమ్ముతున్న ధరలు కూడా ఇదే విధంగా ఉన్నాయి.
పలురకాల ప్రకృతిపరమైన ఉపద్రవాల కారణంగా తమ పంట కచ్చితంగా చేతికొస్తుందన్న నమ్మకం రైతులకు లేకపోగా, విత్తన సాగుకు పెట్టిన ఖర్చు కూడా వారు పొందలేకపోతున్నారు. సాగుకోసం చేసిన అప్పుల్ని చెల్లించడానికి డబ్బు అందుబాటులో లేకపోవడంతో వీరు తరచుగా రుణ ఊబిలో కూరుకుపోతున్నారు.
శ్రుతి జైన్
వ్యాసకర్త జర్నలిస్ట్ (ది వైర్ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment