
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది దేశ వ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో ఎస్సీ, ఎస్టీల తరహాలోనే బీసీ కులాల గణన కూడా చేపట్టాలని పలు బీసీ సంఘాలు కోరాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాయి. ఆదివారం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో పలువురు బీసీ సంఘాల నేతలు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో దిల్‌కుషా అతిథిగృహంలో భేటీ అయ్యారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం కులాల వారీగా 1931లో జనగణన చేపట్టిన తర్వాత ఇప్పటివరకు ఆ లెక్కలు తీయలేదని బీసీ సంఘాల నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
2011లో యూపీఏ హయాంలో కులాలవారీగా తీసిన లెక్కలను కూడా నేటి వరకు ప్రకటించలేదని చెప్పారు. కులగణన చేపట్టాలని బిహార్, ఒడిశా, తమిళనాడు అసెంబ్లీలు తీర్మానం చేశాయని, దేశంలోని 18 రాజకీయ పార్టీలు కూడా కులగణనకు మద్దతు ప్రకటిస్తూ ప్రధానికి లేఖలు రాశాయని వివరించారు. అనంతరం బీసీ సంఘాల నేతలు మాట్లాడుతూ.. తమ విజ్ఞప్తికి కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు. కేబినెట్ మంత్రి హోదాలో ఈ విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. కిషన్‌రెడ్డి కలిసిన వారిలో బీసీ సంఘాల నేతలు కనకాల శ్యామ్ కురుమ, తాటికొండ విక్రంగౌడ్, రావుల్‌కోల్ నరేశ్, మణిమంజరి, వరికుప్పల మధు, శివారాణి, బండిగారి రాజు, వెంకట్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment