Dilkusha guest house
-
బీసీ కులాల జనగణన తక్షణమే చేపట్టాలి
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది దేశ వ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో ఎస్సీ, ఎస్టీల తరహాలోనే బీసీ కులాల గణన కూడా చేపట్టాలని పలు బీసీ సంఘాలు కోరాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాయి. ఆదివారం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో పలువురు బీసీ సంఘాల నేతలు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో దిల్కుషా అతిథిగృహంలో భేటీ అయ్యారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం కులాల వారీగా 1931లో జనగణన చేపట్టిన తర్వాత ఇప్పటివరకు ఆ లెక్కలు తీయలేదని బీసీ సంఘాల నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 2011లో యూపీఏ హయాంలో కులాలవారీగా తీసిన లెక్కలను కూడా నేటి వరకు ప్రకటించలేదని చెప్పారు. కులగణన చేపట్టాలని బిహార్, ఒడిశా, తమిళనాడు అసెంబ్లీలు తీర్మానం చేశాయని, దేశంలోని 18 రాజకీయ పార్టీలు కూడా కులగణనకు మద్దతు ప్రకటిస్తూ ప్రధానికి లేఖలు రాశాయని వివరించారు. అనంతరం బీసీ సంఘాల నేతలు మాట్లాడుతూ.. తమ విజ్ఞప్తికి కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు. కేబినెట్ మంత్రి హోదాలో ఈ విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. కిషన్‌రెడ్డి కలిసిన వారిలో బీసీ సంఘాల నేతలు కనకాల శ్యామ్ కురుమ, తాటికొండ విక్రంగౌడ్, రావుల్‌కోల్ నరేశ్, మణిమంజరి, వరికుప్పల మధు, శివారాణి, బండిగారి రాజు, వెంకట్ తదితరులున్నారు. -
‘దిల్కుషా’లో మేయర్ క్యాంప్ ఆఫీస్?
బంజారాహిల్స్ : గ్రేటర్ హైదరాబాద్ మేయర్ క్యాంపు ఆఫీస్ కోసం జీహెచ్ఎంసీ అధికారులు స్థలాన్వేషణ మొదలుపెట్టారు. ఇందుకోసం రాజ్‌భవన్ పక్కన ఉన్న దిల్కుషా గెస్ట్‌హౌస్, గ్రీన్‌ల్యాండ్స్‌లో ఉన్న గ్రీన్‌ల్యాండ్స్ గెస్ట్‌హౌస్‌ను శనివారం గ్రేటర్ మేయర్ బొంతు రాంమోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, సెంట్రల్ జోన్ కమిషనర్ గౌరవ్ ఉప్పల పరిశీలించారు. వీటిలో దిల్కుషా గెస్ట్‌హౌజ్ వైపు మేయర్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ రెండు గెస్ట్‌హౌస్‌లలో ఒకదాన్ని రెండు రోజుల్లో ఎంపిక చేసి అందులో మౌలిక సదుపాయాలు కల్పించాలని తలపెట్టారు. మేయర్ కోసం క్యాంపు ఆఫీస్ అందుబాటులోకి తీసుకురావడం ఇదే మొదటిసారి. మేయర్‌ను కలవడానికి వచ్చేవారు ఇప్పుడున్న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఇరుకైన సౌకర్యాలతో ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుసుకున్న అధికారులు ప్రత్యేకంగా క్యాంపు ఆఫీస్ అందుబాటులోకి తేవాలని యోచించి ఆ మేరకు రెండు గెస్ట్‌హౌస్‌లను పరిశీలించారు. గ్రీన్‌ల్యాండ్స్ గెస్ట్‌హౌస్ ముందు జరుగుతున్న మెట్రోపనులు వల్ల కొంత వరకు ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులతోపాటు మేయర్ కూడా భావిస్తున్నట్లు సమాచారం. మొత్తం గెస్ట్‌హౌస్‌ను క్యాంపు ఆఫీస్ కోసం తీసుకోవాలా? కొన్ని గదులు మాత్రమే సరిపోతాయా అన్నదానిపై కూడా ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. మొత్తానికి రెండు మూడు రోజుల్లో మేయర్క్యాంపు ఆఫీస్‌పై తుది నిర్ణయం వెలువడనుంది.