పట్నా: దేశంలో కరోనా వైరస్‌కు అడ్డుకట్టవేయడానికి ప్రభుత్వం కోవిడ్ టీకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. రెండు డోసుల టీకాను ప్రజలకు అందిస్తోంది. ఇటీవల ఈ రెండు డోసులతో పాటు మూడో టీకాగా.. బూస్టర్ డోస్ కూడా వేస్తోంది. అయితే ఓ డాక్టర్ ఏకంగా ఐదు డోసుల టీకా వేయించుకున్నట్లు రికార్డులు చూపడం బీహార్‌లో కలకలం రేపింది. దీంతో బిహార్ ప్రభుత్వం ఈ విషయంపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించింది.
చదవండి: India Covid-19: కాస్త తగ్గిన రోజువారీ కేసులు.. అయినా కొత్తగా 2 లక్షలకు పైనే
పట్నాలో సివిల్ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ విభా కుమారి సింగ్ ఐదు కరోనా టీకాలు వేసుకున్నట్లు ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. ఈ విషయంపై సదరు డాక్టర్ స్పందిస్తూ.. తాను కోవిడ్ టీకా నిబంధనలకు లోబడి కేవలం మూడు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ (బ్యూస్టర్‌తో కలిపి) మాత్రమే వేయించుకున్నట్లు పేర్కొన్నారు. అయితే తన పాన్‌కార్డును ఉపయోగించుకొని ఎవరో మరో రెండు డోసుల టీకాను వేయించుకున్నారని తెలిపారు.
కోవిన్ పోర్టల్ వివరాల ప్రకారం.. డాక్టర్ విభా 28 జనవరి, 2021న మొదటి డోసు, మార్చిలో రెండో డోసు వ్యాక్సిన్ వేయించుకున్నారు. అదేవిధంగా 13 జనవరి, 2022న ఆమె బూస్టర్ డోస్ తీసుకున్నారు. అయితే ప్రభుత్వ రికార్డులు ప్రకారంలో ఆమె బూస్టర్ డోస్‌తో కలిపి 5 డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లు చూపడంతో అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 6 ఫిబ్రవరి 2021న మూడో డోసు, 17జూన్ 2021న నాలుగో డోసును ఆమె పాన్‌కార్డు ద్వారా వ్యాక్సిన్ వేయించుకున్నట్లు రికార్డుల్లో వుంది. దీనిపై దర్యాప్తు ప్రారంభించామని పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment