పట్నా: కరోనా బాధితుడు మరణిస్తే అతడిని కోవిడ్ వార్డులోనే గంటల తరబడి వదిలేసిన ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. పట్నాలోని నలంద మెడికల్ కాలేజీ ఆస్పత్రి (ఎన్ఎమ్‌సీహెచ్)లో ఆదివారం ఓ కరోనా బాధితుడు మరణించాడు. అయితే అతడి మృతదేహాన్ని కోవిడ్ వార్డులోనే వదిలేసి, అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆ వార్డులో మరో ఏడుగురు పేషెంట్లు ఉండటం గమనార్హం. దీంతో సోమవారం ఓ రోగి బంధువు ఆ వార్డును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "మా అమ్మ బెడ్డు పక్కనే అతని మృతదేహం ఉంది. దీంతో ఆమె ఆదివారం నుంచి తినడమే మానేసింది. ఈ గదిలో ఉన్నవారందరూ భయానికి లోనవుతున్నారు. మరోవైపు చనిపోయిన వ్యక్తిని చాలీచాలని టవల్‌తో కప్పారు" అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. (కునుకులేని అమెరికా)
అదే అస్పత్రిలోని మరో వార్డులోనూ ఇద్దరు కోవిడ్ పేషెంట్లు మరణిస్తే వారిని అలాగే వదిలేశారని ఓ రోగి బంధువు సౌరభ్ గుప్తా ఆరోపించారు. ఆదివారం నుంచి ఆ వార్డులోకి ఒక్క డాక్టర్ కూడా వచ్చి చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆస్పత్రిలోనే ఉంచి తమ బంధువును చేతులారా చంపుకోలేమని, పట్నాలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. రోగులకు సత్వర వైద్యం అందించట్లేదన్న ఆరోపణలను ఎన్ఎమ్‌సీహెచ్ ప్రిన్సిపల్ డా.హీరాలాల్ మాతో ఖండించారు. వైద్యులు, నర్సులు ఎప్పటికప్పుడూ రోగులను పరీక్షిస్తూనే ఉన్నారని తెలిపారు. సోమవారం ఐదుగురు మరణించారని, అయితే బాన్స్ ఘాట్ స్మశానవాటికలో రాత్రి 8 గంటల తర్వాతే అనుమతి ఉండటంతో వారిని అప్పటివరకు బెడ్లపైనే వదిలేశామని పేర్కొన్నారు. తమ ఆస్పత్రిలో మార్చురీ గది లేదని స్పష్టం చేశారు. (కరోనాకు కొత్త మందు!)
Comments
Please login to add a commentAdd a comment