భువనేశ్వర్: జనాభా లెక్కల జాబితాలో ఇతర వెనుక బడిన వర్గాల(ఓబీసీ)కు ప్రత్యేక స్థానం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. అయితే ఈ అభ్యర్థన పట్ల కేంద్ర ప్రభుత్వం విముఖత ప్రదర్శించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు తలకిందులు కావడంతో నిరుత్సాహానికి గురైంది. పార్లమెంటు సమావేశాల్లో గడిచిన రెండు రోజుల నుంచి బిజూ జనతా దళ్ సభ్యులు ఈ ప్రతిపాదనపై ఒత్తిడి తెస్తున్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖలతో పలు అనుబంధ సంస్థల సంప్రదింపుల మేరకు 2021 జనాభా లెక్కల జాబితా నమూనా ఖరారు చేశారు. గత ఏడాది మార్చి 28వ తేదీన కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో తాజా జనాభా లెక్కింపు ధ్యేయం సవివరంగా స్పష్టం చేసినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ గురువారం స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం నిబంధనల మేరకు షెడ్యూల్డ్ కులం, తెగల వర్గాల్లో మార్పు చేర్పుల సమీక్ష దృష్ట్యా ఈ వివరాల సేకరణ కోసం జనాభా లెక్కల జాబితాలో ప్రత్యేక స్థానం కల్పించినట్లు వివరించారు.
రాష్ట్రానికి కేంద్రమంత్రి ప్రతిపాదన
రాష్ట్రంలో ఇతర వెనుకబడిన వర్గాల ప్రజానీకం ప్రాముఖ్యాన్ని స్థానిక రాజకీయ పక్షాలు గుర్తించాయి. ప్రధానంగా అధికార పక్షం బిజూ జనతా దళ్, ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ ఓబీసీ వర్గం వైపు కన్నేశాయి. ఈ వర్గపు ప్రజానీకంతో బలమైన ఓటు బ్యాంకు ఆవిష్కరణ కోసం ఎవరి తరహాలో వారు సిగపట్లు పడుతున్నారు. బిజూ జనతా దళ్ సభ్యులు పార్లమెంటులో భారత ప్రభుత్వంపై పెంచుతున్న ఒత్తిడి దృష్ట్యా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల స్పందించారు. రాష్ట్రంలో రాజకీయ లబ్ధి పొందేందుకు అధికార పక్షానికి తాజా ప్రతిపాదన జారీ చేశారు. తొలుత రాష్ట్రంలో ఇతర వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక గుర్తింపు కేటాయించాలి. ఈ వర్గపు ప్రజల కోసం ప్రత్యేక రిజర్వేషన్ ఇతరేతర సకల సదుపాయాల్ని కల్పించేందుకు రాష్ట్ర శాసన సభలో తీర్మానం ఆమోదించాలని కేంద్ర మంత్రి దర్మేంద్ర ప్రధాన్ అధికార పక్షం బిజూ జనతా దళ్‌కు ప్రతిపాదించి కథను మలుపుతిప్పేందుకు బీజం నాటారు.
జనాభా లెక్కింపు సహకారం
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం జనాభా లెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా కార్యాచరణ ప్రారంభించింది. ఈ ఏడాది జనవరి 7వ తేదీన రిజిస్ట్రార్ జనరల్, లెక్కింపు కమిషనర్ జారీ చేసిన గెజిట్ నేపథ్యంలో సకల సహకార చర్యలు చేపడుతున్నారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో ఇంటింటి జనాభా లెక్కింపు ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియ సెప్టెంబరు 30వ తేదీ వరకు నిరవధికంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రెవెన్యూ–విపత్తు నిర్వహణ విభాగం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment