
భువనేశ్వర్ : ‘నాకు పెళ్లై రెండేళ్లవుతుంది. పెళ్లైన నాటి నుంచి నా భర్య నన్ను మానసికంగా వేధిస్తోంది. ఆమె వేధింపుల్ని తట్టుకోలేకపోతున్నా. ఇక నాకు చావే శరణ్యం’ అంటూ ఓ భర్త కదులుతున్న ట్రైన్ ఎదురు దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ప్రస్తుతం ఆ దుర్ఘటన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈస్ట్ కోస్ట్ డివిజన్ రైల్వే పోలీసుల వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం ఖోర్ధాజిల్లా కుంభార్బస్తా (Kumbharbasta) కు చెందిన రామచంద్ర బర్జెనా కదులుతున్న ట్రైన్ నుంచి ప్రాణాలు తీసుకున్నాడు. దుర్ఘటనకు ముందు ఓ వీడియోను తన సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేశాడు.
ఆ వీడియోలో ‘నేను రామచంద్ర బర్జెనాను. నేను కుంభార్బస్తాలో ఉంటాను. ఇవాళ నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. అందుకు కారణం నా భార్య రూపాలీనే. రూపాలీ నన్ను మెంటల్ టార్చర్ చేస్తోంది. ఇక నేను బ్రతకలేను’ అని విలపిస్తూ వీడియోలో చెప్పాడు. వీడియో తీసిన అనంతరం, నిజిఘర్-తపాంగ్ రైల్వే ట్రాక్ సమీపంలో కదులుతున్న రైలు ముందు దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రామచంద్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఒడిశా రాష్ట్రానికి చెందిన దంపతులు రామచంద్ర, రూపాలీకి రెండేళ్ల క్రితం వివాహమైంది. వారికో కుమార్తె. అయితే, పెళ్లైన నాటి నుంచి భార్య రూపాలి.. భర్త రామచంద్రను మానసికంగా వేధిస్తుండేది. అది సరిపోదున్నట్లు మెట్టినింట్లో చిచ్చుపెట్టేది. ఇవన్నీ తట్టుకోలేక రామచంద్ర ప్రాణాలు తీసుకున్నాడు. రామచంద్ర ఆత్మహత్యపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడు రామచంద్ర తీసిన వీడియో ఆధారంగా భార్య రూపాలీని అరెస్ట్ చేశారు.
Odisha: Unable to endure relentless torture from his wife, a young man tragically ended his life. The incident occurred in Kumarabasta village of Khordha district. The deceased has been identified as Ramchandra Badjena. Before his death, Ramchandra posted a video on social media,… https://t.co/hmwt0hzaEx
— ସତ୍ୟାନ୍ୱେଷୀ/सत्यान्वेषी/Satyanweshi (@imsatyanweshi) April 5, 2025
రామచంద్ర ఆత్మహత్య తర్వాత అతని తల్లిదండ్రులు.. కోడలు రూపాలీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘నా కుమారుడు రామచంద్రకు రూపాలీతో రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి కూడా మా ఇంట్లోనే అంగరంగ వైభవంగా చేశాం. పెళ్లైన నాటి నుంచి రూపాలీ నా కొడుకుని చిత్ర హింసలు పెట్టేది. పాప పుట్టింది. తరుచూ మెట్టి నుంచి పుట్టింటికి వెళ్లేది. పుట్టింటికి వెళ్లకపోతే నన్ను నా కుటుంబ సభ్యుల్ని దూషిస్తుండేది. అయినప్పటికీ, అత్త కుటుంబసభ్యులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని రూ.20లక్షలు అప్పుగా ఇచ్చాం. కానీ రూపాలీ తీరు మారలేదు. నా కొడుకు ఆమె చేతిలో నరకాన్ని అనుభవించాడు. ఆమె క్రూరత్వానికి ఫలితం ఇదే. మాకు న్యాయం చేయండి’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.