
నేటి నుంచి జాతీయ సీనియర్ పురుషుల హాకీ చాంపియన్‌షిప్
తొలిసారి ‘త్రీ డివిజన్’ ఫార్మాట్‌లో పోటీలు
ఈ నెల 15న ఫైనల్ ‘బి’ డివిజన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
ఝాన్సీ (ఉత్తరప్రదేశ్): పురుషుల సీనియర్ హాకీ నేషనల్ చాంపియన్‌షిప్‌నకు వేళైంది. శుక్రవారం ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్ ఈనెల 15న జరగనున్న ఫైనల్‌తో ముగియనుంది. ‘త్రీ డివిజన్’ ఫార్మాట్‌లో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 30 జట్లు పాల్గొంటున్నాయి. గత ఏడాది తమిళనాడులో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో ఒడిశా జట్టు టైటిల్ సాధించి సంచలనం సృష్టించింది. వరుసగా రెండో ఏడాది ఒడిశా తమ జోరు కొనసాగించి టైటిల్ నిలబెట్టుకుంటుందో లేదో వేచి చూడాలి.
‘ఎ’ డివిజన్‌లో ఉన్న 12 జట్లు టైటిల్ కోసం పోటీ పడుతుండగా... ‘బి’ డివిజన్‌లోని 10 జట్లు, ‘సి’ డివిజన్‌లోని 8 జట్లు ప్రమోషన్ కోసం ప్రయత్నించనున్నాయి. ప్రదర్శన ఆధారంగా వచ్చే ఏడాది తిరిగి డివిజన్‌ల మార్పు జరుగుతుంది. ‘సి’ డివిజన్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు... వచ్చే ఏడాది ‘బి’ డివిజన్‌కు... ‘బి’ డివిజన్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన రెండు జట్లు ‘ఎ’ డివిజన్‌కు చేరనున్నాయి.
ప్రతి డివిజన్‌లో కింది స్థానాల్లో నిలిచిన రెండు జట్లు... డిమోషన్ పొందుతాయి. ‘మహిళల సీనియర్ నేషనల్ చాంపియన్‌షిప్‌ను ఈ ఫార్మాట్‌లో నిర్వహించడం వల్ల ఆటకు మేలు జరిగింది. అందుకే పురుషుల విభాగంలోనూ దీన్ని కొనసాగిస్తున్నాం. దీంతో ప్రతి డివిజన్‌లోని జట్టు మరింత మెరుగైన స్థితిలో నిలిచేందుకు ప్రయత్నిస్తుంది’అని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ అన్నాడు.
» ‘ఎ’ డివిజన్‌లోని 12 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో మూడు టీమ్‌ల చొప్పున పోటీ పడనున్నాయి. లీగ్ దశ ముగిసేసరికి గ్రూప్ అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుతాయి.
» ఈనెల 13న సెమీఫైనల్స్, 15న ఫైనల్ నిర్వహించనున్నారు.
» డిఫెండింగ్ చాంపియన్ ఒడిశాతో పాటు రన్నరప్ హరియాణా జట్లు ‘ఎ’ డివిజన్ నుంచి బరిలోకి దిగనున్నాయి. ఈ రెండు జట్లతో పాటు పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బెంగాల్, కర్ణాటక, పుదుచ్చేరి జట్లు ‘ఎ’ డివిజన్‌లో చోటు దక్కించుకున్నాయి.
» ‘బి’, ‘సి’డివిజన్ మ్యాచ్‌లు నేటి నుంచి ప్రారంభం కానుండగా... ‘ఎ’ డివిజన్ మ్యాచ్‌లు ఈ నెల 8న ఆరంభమవుతాయి.
» ఇది 15వ పురుషుల సీనియర్ హాకీ జాతీయ చాంపియన్‌షిప్ కాగా... గత ప్రదర్శన ఆధారంగా జట్లను విభజించారు.
» తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జట్లు ప్రస్తుతం ‘బి’ డివిజన్‌లో ఉన్నాయి. వీటితో పాటు చండీగఢ్, గోవా, ఉత్తరాఖండ్, ఢిల్లీ, మిజోరం, దాద్రా నగర్ హవేలీ–దామన్ దియు, కేరళ, అస్సాం జట్లు కూడా ఇదే గ్రూప్‌లో రెండు ‘పూల్స్’గా పోటీ పడనున్నాయి.
» ‘సి’ డివిజన్‌లో రాజస్తాన్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకశీ్మర్, త్రిపుర, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, బిహార్, గుజరాత్ జట్లున్నాయి.
» ఒక్కో మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు 3 పాయింట్లు లభిస్తాయి. మ్యాచ్ ‘డ్రా’ అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది.