దేశ జనన, మరణాల రిజిస్టర్‌ను ఓటర్ల జాబితాతో అనుసంధానించేలా త్వరలోనే పార్లమెంట్‌లో ఒక బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్ర సర్కార్ యోచిస్తోంది. దేశ పౌరులెవరికైనా సరే 18 ఏళ్ళు నిండగానే వారి పేరు ఓటర్ల జాబితాలో చేరిపోయేలా ఆ బిల్లుతో వీలు కల్పించాలని భావిస్తోంది. సోమవారం ఢిల్లీలో భారత జనగణన కమిషనర్ కార్యాలయ ప్రారంభోత్సవ వేళ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వెల్లడించిన ఈ సంగతి మారుతున్న కాలమాన పరిస్థితుల్లో మంచి ఆలోచనే.
మరణించినవారి పేర్లను తక్షణం తొలగించడానికీ, ఓటుహక్కు వయసు రాగానే జాప్యం లేకుండా కొత్త ఓటర్లు జాబి తాలో చేరడానికీ ఈ అనుసంధాన ప్రక్రియ ఉపకరిస్తుంది. అయితే, అదే సమయంలో పదేళ్ళకోసారి నిర్వహించాల్సిన కీలక జనగణనను ఈ దఫా ఎప్పుడు జరిపేదీ ప్రస్తావించకపోవడమే ఆశ్చర్యం.
నిజానికి, 1948 జనగణన చట్టం ప్రకారం ప్రభుత్వం ఈ ప్రక్రియను నిర్వహిస్తుంది. అలాగని ప్రతి పదేళ్ళకూ జనగణన చేయాలని చట్టమేమీ లేదు. ఎప్పుడు జనగణన చేయాలో, ఫలితాలెప్పుడు వెల్లడించాలో నిర్ణీత కాలవ్యవధి అందులో లేదు. అయితే, ఈ లెక్కల ప్రయోజనం అపారం. బ్రిటీష్ ఇండియాలో 1881లో వందల మంది శ్రమించి, 25 కోట్లకు పైగా జనాభా నుంచి జవాబులు సేకరించారు. అప్పటి నుంచి 130 ఏళ్ళ పాటు యుద్ధాలు సహా ఎన్ని సంక్షోభాలు వచ్చినా, మన పాలకులు ఒక క్రమం తప్పని యజ్ఞంగా ఈ జనగణన ప్రక్రియను సాగించారు.
తీరా ఈసారి ఆక్రమం తప్పింది. దేశంలో తాజా జనగణన 2021లో జరగాల్సి ఉంది. 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా అందులో తొలి దశ జరపాలని భావించారు. కరోనాతో అది నిరవధిక వాయిదా పడింది. జనం లెక్కను ప్రోదిచేసి, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక తదితర అంశాలతో ఒక సమాచార గనిగా, ప్రభుత్వ – ప్రజా కార్యాచరణకు కీలక సూచికగా ఉపకరించాల్సిన ఆ ప్రక్రియ ఈసారి అలా ఆలస్యమైంది.
జాప్యానికి కరోనాయే కారణమన్న ప్రభుత్వ వాదన తర్కానికి నిలవదు. అత్యధికులు కరోనా టీకాలు వేయించుకున్నా, 2022లో మూడో వేవ్ ముగిసి జనజీవనం కుదుటపడినా, వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు సైతం సాగుతున్నా సరే... సర్కార్ ఎందుకనో ఇప్పటి దాకా మళ్ళీ జనగణన ఊసే ఎత్తలేదు. జిల్లాలు, తాలూకాలు, పోలీస్ స్టేషన్ల పాలనా సరిహద్దుల్ని స్తంభింపజేసే తుది గడువును ఈ జూన్ 30 వరకు కేంద్రం పొడిగించింది గనక లెక్కప్రకారం ఆ తర్వాత మూడు నెలలైతే కానీ జనగణన చేపట్టరాదు. అంటే, కనీసం ఈ సెప్టెంబర్ దాకా జనగణన లేనట్టే.
ఇక, సాధారణంగా జనసంఖ్యను లెక్కించడం జనగణన చేసే ఏడాది ఫిబ్రవరిలో చేస్తారు. మార్చి 1కి ఇంత జనాభా అంటారు. కానీ, వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో 2024 చివర ఎప్పటికో కానీ ప్రక్రియే మొదలు కాకపోవచ్చు. పైకి మామూలు గానే అనిపించినా, ఈ ఆలస్యం విస్తృత పర్యవసానాలకు దారి తీస్తుంది. ఎందుకంటే, పుష్కరకాలం గడిచిపోయినా ఇప్ప టికీ మన విధాన రూపకర్తలు పాత 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగా సంక్షేమ పథకాల నుంచి సాయాల దాకా నిర్ణయాలు తీసుకోవాల్సి రావడం విచిత్రం, విషాదం.
అసలు కరోనాతో ఆలస్యమవడానికి ముందే ఈ 2021 జనగణన వివాదాస్పదమై కూర్చుంది. జనగణనతో పాటు జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)ను నవీకరించేలా జనాభా సర్వే చేపడతామంటూ ప్రభుత్వం తేనెతుట్టె కదిల్చింది. అప్పటికే, ముస్లిమ్‌లే లక్ష్యంగా వివాదాస్పద ‘పౌరసత్వ చట్టం–2019’ తెచ్చారంటూ, దేశవ్యాప్తంగా నెలల తరబడి నిరసనలు సాగాయి. ఆ చట్టానికి, ఇప్పుడు భారతీయులమని నిరూపించుకోవాల్సిన ఈ ‘ఎన్పీఆర్’ జత చేరిందని విమర్శలు రేగాయి.
మరో పక్క ఇప్పటికే ప్రతిపక్షాల్లోని అనేక రాజకీయ పార్టీలు, ప్రాంతీయ నేతలు దేశంలో కులగణన సాగాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆ లెక్కలు కూడా తీస్తే తమ ఓటుబ్యాంకులో చీలికలు రావచ్చనీ, అది తమకు దెబ్బ కావచ్చనీ అధికార పార్టీ భయపడుతోంది. వివిధ వర్గాల నుంచి ప్రత్యేక కోటాలకు డిమాండ్లు తలెత్తుతాయని ఆందోళన చెందుతోంది. అయిన ఆలస్యం ఎలాగూ అయింది గనక వచ్చే ఎన్నికల్లో లెక్క తప్పకుండా ఉండాలంటే, ఈ లెక్కలు పక్కనపెట్టాలనుకుంటే ఆశ్చర్యమేమీ లేదు.
జనగణన అంటే కేవలం భౌగోళిక ప్రాంతాల్లో తలకాయలు లెక్కపెట్టడం కాదు. సమాజంలోని భిన్న వర్గాల ఆకాంక్షలకు పునాదిగా నిలిచే ప్రక్రియ. గ్రామీణ – పట్టణ జనాభా వాటా, వలసలు, మాతృభాష, ఆయుఃప్రమాణం, గృహవసతులు వగైరా అనేక గణాంకాలను అందించే సమాచార నిధి. ఆర్థిక జీవిత అంశాలపై దృష్టి పెట్టే అనేక సర్వేలకు మాతృకైన ‘జాతీయ శాంపిల్ సర్వే’, ఆరోగ్యం – సామాజిక స్థితిగతులపై ఇంటింటి సర్వే అయిన ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ వగైరాలు శాంపిల్స్ తీసుకోవడానికి జనగణనే ఆధారం.
ఇంతటి ముఖ్యమైన వ్యవహారంపై ఈ సుదీర్ఘ అనిశ్చితి సమంజసం కాదు. జనగణన ప్రక్రియ ఎప్పుడు జరిగినా – ఆధునికతనూ, ఎప్పటి కప్పుడు లెక్కల్లో మార్పుల్ని పొందుపరుచుకొనే లక్షణాన్నీ సంతరించుకోవాలన్న ప్రభుత్వ యోచన ఆహ్వానించదగినదే. కాకపోతే ఎప్పుడో డిజిటల్ వేదికల్ని ఆశ్రయిస్తామనీ, వ్యక్తులు తమకు తామే ఎలక్ట్రానిక్‌గా సమాచారం పూర్తిచేసే హక్కు కల్పిస్తామనీ, అందులో సామాజిక – ఆర్థిక హోదాను లెక్కించే 35కు పైగా పరామితులు ఉంటాయనీ అంటూ... ఇప్పుడు అమితమైన జాప్యం చేయడం అర్థరహితం. అసలుకే మోసం. అయితే, జనగణన ఎప్పుడు చేస్తామో చెప్పకున్నా, ఎలా చేయాలను కుంటున్నదీ పాలకుల నోట వినపడడమే ప్రస్తుతానికి దక్కిన సాంత్వన.
వరస తప్పిన ముఖ్యమైన లెక్క
Published Thu, May 25 2023 12:23 AM | Last Updated on Thu, May 25 2023 12:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment