ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, శ్రీకాళహస్తిలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ప్రసంగాలలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుది. ఏపీలో అభివృద్ది జోరుగా సాగుతోందని, సంక్షేమ కార్యక్రమాలు బాగా అమలు అవుతున్నాయన్న విషయం అర్థం అవుతుంది. అమిత్ షా, నడ్డా ఏపీ ప్రభుత్వంపై కొన్ని విమర్శలు, ఆరోపణలు చేసినా, వాటిలో పస లేదు. వారు జనరల్ గా చేసే ఆరోపణలే తప్ప నిర్దిష్ట అభియోగాలు చేయలేకపోయారు. ఫలానా ప్రాజెక్టులో అవినీతి జరుగుతోందనో, లేక ఫలానా చోట అక్రమాలు జరిగాయనో అధారాల సహితంగా చెప్పకపోవడం గమనించదగ్గ విషయం.
ఇదే పెద్ద నిదర్శనం
పైగా ఇటీవలే కేంద్రం రాష్ట్రానికి రెవెన్యూ లోటు కింద పదకుండువేల కోట్లు, పోలవరం ప్రాజెక్టు నిమిత్తం పదమూడు వేల కోట్లు మంజూరు చేసిందంటే ఏపీలో ఇలాంటి ఆరోపణలు లేవన్న కారణంగానే అన్న సంగతి అందరికి తెలుసు. నిజంగానే ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏవైనా స్కామ్‌లకు పాల్పడి ఉంటే, కేంద్రం అడ్డుపడదా!. వేల కోట్ల నిధులు జగన్ కోరిక మేరకు ఇస్తుదా? ఇదే పెద్ద నిదర్శనంగా తీసుకోవాలి.
ఆరోపణలు గుర్తులేవా?
టీడీపీ, బీజేపీ కలిసి రాష్ట్రాన్ని ఏలినప్పుడు పోలవరంను ఎటిఎంగా ఆనాటి టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మార్చుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఎన్నికల ప్రచార సభలో ఆరోపించారు. మరుగుదొడ్ల నిర్మాణం మొదలు అనేక అంశాలలో అక్రమాలు భారీగా జరిగాయని బీజేపీ అధ్యక్షుడుగా ప్రస్తుతం ఉన్న సోము వీర్రాజు అప్పట్లోనే పెద్ద ఎత్తున ఆరోపించేవారు. 2019లో చంద్రబాబు ప్రభుత్వం ఓటమి చెందిన తర్వాత ఆయన పీఎస్ ఇంటిలో సోదాలు చేసి రెండువేల కోట్ల రూపాయల అక్రమాలు గుర్తించినట్లు కేంద్రం ప్రకటించింది.
దీనిని బట్టే తెలుస్తుంది?
ఎంతో చిత్తశుద్ది కలిగిన, అవినీతికి దూరంగా ఉంటామని చెప్పుకునే బీజేపీ ప్రభుత్వ పెద్దలు వీటి గురించి ఏమి చేసింది ఇంతవరకు వెల్లడించలేదు. దీనిని బట్టే వారి లక్ష్యశుద్ది ఏమిటో తెలుస్తుంది. టీడీపీ,బిజెపి కలిసి ప్రభుత్వంలో ఉన్నప్పుడే అమరావతి లాండ్ స్కామ్ , స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్ వంటివి జరిగాయని వైసీపీ ప్రభుత్వం కనుగొంది. వాటిపై సిబిఐ విచారణకు సిద్దం అని చెప్పినా, ఇంతవరకు కేంద్రం కిమ్మనలేదు. అవినీతిని దునుమాడుతామనే మోదీ, అమిత్ షా ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు తరచు ఒక మాట చెప్పేవారు. కేంద్రం తనకు సహకరించడం లేదని, ఇరవై తొమ్మిది సార్లు ఢిల్లీ వెళ్లినా ఆశించిన నిధులు ఇవ్వడం లేదని పదే,పదే వాపోయేవారు.
అందులో భాగంగానే..
చంద్రబాబు ప్రభుత్వ అవినీతి కారణంగానే కేంద్రం పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వడం లేదని కొందరు బిజెపి నేతలు అంటుండేవారు. మరి అలాంటిది ఇప్పుడు జగన్ విజ్ఞప్తి మేరకు రెవెన్యూ లోటు, పోలవరం ప్రాజెక్టులకు ఇరవైనాలుగు వేల కోట్ల సాయం చేయడానికి కేంద్రం ముందుకు వచ్చింది. అంటే దాని అర్ధం జగన్ ప్రభుత్వంలో అవినీతి , అక్రమాలు లేనట్లే కదా! అయినా ఎందుకు అమిత్ షా, నడ్డాలు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు అన్న ప్రశ్న వస్తుంది. నిజానికి ఇది ప్రధాని మోడీ తొమ్మిదేళ్ల పాలన పై ప్రచారం కోసం ఏర్పాటు చేసిన సభ. అయినా ఆయా రాష్ట్రాలకు వెళ్లినప్పుడు బిజెపియేతర ప్రభుత్వాలు ఉంటే ఏవో కొన్ని విమర్శలు చేయకతప్పదు. అందులో భాగంగానే వీరు ఏపీపై కూడా చేసినట్లు అనిపిస్తుంది.
అవినీతి జరిగినట్లు ఎలా అవుతుంది?
ఇసుక మాఫీయా అని ఆరోపించారు. చంద్రబాబు టైమ్‌లో మాఫియాలు విజృంభించి ప్రజలను అగచాట్లు పాలు చేస్తే, జగన్ ప్రభుత్వం ఇసుకకు కొత్త విధానం తెచ్చి, అటు ప్రజలకు అందుబాటులో, ఇటు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చగలుగుతోంది. మాజీ మంత్రి పేర్ని నాని అన్నట్లు ఇసుక ద్వారా ఏపీకి నాలుగువేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంటే అవినీతి జరిగినట్లు ఎలా అవుతుంది. మైనింగ్ రంగంలో కూడా గతంలో కన్నా కొన్ని వేల కోట్ల అదాయం పెరిగింది. విశాఖలో భూ మాఫియా అని దుష్ప్రచారం చేస్తున్నారు. ఎక్కడైనా ఒకటి, రెండు చోట్ల భూ కబ్జాలు ఉంటే ఉండవచ్చు. దానిపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఆ సంగతి అందరికి తెలుసు..
కొందరు టీడీపీ నేతలు ఎకరకాలకు, ఎకరాల ఆక్రమించిన విషయాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్న సంగతి అమిత్ షాకు ఏపీ బీజేపీ నేతలు చెప్పలేదేమో తెలియదు. అదే బీజేపీ,టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన భూ కబ్జాలపై చంద్రబాబు ప్రభుత్వమే సిట్ వేసింది కదా! అప్పుడు మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడే ఆనాటి కబ్జాలపై ఫిర్యాదు చేశారు కదా! నడ్డా, షా లకు ఆ విషయాలు చెప్పి ఉండకపోవచ్చు. ఏపీలో జాతీయ రహదారులు, పారిశ్రామిక కారిడార్లు, పార్మా హబ్ వంటివాటిని ప్రస్తావించారు. వాటన్నిటిని కేంద్రం ఖాతాలో వేసుకునే యత్నం చేశారు. తప్పులేదు. కేంద్రం, రాష్ట్రం కలిసి ఈ ప్రాజెక్టులను చేస్తాయి తప్ప కేంద్రం ఒక్కటే చేయగలిగింది తక్కువే అన్న సంగతి అందరికి తెలుసు.
ఒకపక్క రాష్ఠంలో అసలు ఏమీ జరగడం లేదని చెబుతారు. మరో పక్క తాము చాలా చేసేస్తున్నామని అంటారు. మరి ఏది నిజం. కొన్ని స్కీములకు జగన్ తన బ్రాండ్ వేసుకుంటున్నారని ఆరోపించారు. రైతు భరోసా పథకాన్ని షా ఉదహరించారు. ఆయనకు ఈ ప్రసంగం రాసిచ్చినవారెవరో అబద్దం రాశారు. ఎందుకంటే వైఎస్సార్ రైతు భరోసా ,పిఎం కిసాన్ సమ్మాన్ అని పేరు పెట్టారు. తాము ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నామని షా అన్నారు. అది నిజమే కావచ్చు. కాని అంతకు మూడు రెట్లు రాష్ట్రం బియ్యం ఇస్తోంది కదా!. బహుశా తెలుగుదేశం నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సి.ఎమ్.రమేష్, లేదా ఈ మధ్య కాలంలో కొత్త నాయకుడిగా అవతరిస్తున్న సత్య వంటివారు ఎవరైనా ఈ స్పీచ్ రాసిచ్చినట్లుగా ఉంది.
కేంద్ర నాయకులతో చిలకపలుకులు..
వారు నిత్యం చేసే ఆరోపణలనే కేంద్ర నాయకులతో చిలకపలుకులు మాదిరి పలికించారనిపిస్తుంది. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తన ప్రసంగంలో చాలా విషయాలు చెప్పారు. అవన్ని వింటే ఏపీలో జగన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇన్ని అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయా అన్న ఆశ్చర్యం కలుగుతుంది. ఒకరకంగా ఇది విమర్శలకు కనువిప్పు కూడా. తీర ప్రాంతంలో పోర్టులు, హార్బర్లు, జాతీయ రహదారుల, రాష్ట్ర రహదారులు, గ్రామీణ రహదారులు, పారిశ్రామిక కారిడార్లు, ఫార్మా హబ్ ఇలా అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు.. ఇక సంక్షేమ కార్యక్రమాలలో లక్షల కొద్ది ఇళ్ల నిర్మాణం, రైతు భరోసా స్కీమ్ తదితర అంశాలను ఆయన తడిమారు. వీటన్నిటిలో కేంద్రం వాటా ఉందని చెప్పడానికి ఇవన్ని ఉదహరించినా, అవన్ని జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం చేస్తున్నట్లే కదా!
చదవండి: అది జగన్ ఘనత కాదా రామోజీ!
ఇష్టమైనవారి జోలికి వెళ్లడం లేదు..
జగన్ సంక్షేమ కార్యక్రమాల కింద రెండు లక్షల కోట్లకు పైగా ఆర్దిక సాయాన్ని ప్రజలకు అందించారు. అందులో ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా వారి ఖాతాలలోకి వెళ్లేలా కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా చేశారు. ఇలా ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేయగలుగుతున్నాయి. కర్నాటకలో నలభై శాతం కమిషన్ ఆరోపణతోనే కదా బీజేపీ ప్రభుత్వం పరాజయం చెందింది. ఆ విషయం ఏపీ ప్రజలకు తెలియదనుకుంటే బీజేపీ వారు అమాయకులే అనుకోవాలి. కేంద్రంపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని అమిత్ షా అంటున్నారు. రఫెల్ కుంభకోణం ఎంత పెద్ద ఆరోపణలో వారికి తెలియదా! అది నిజం కాదని వీరు చెప్పవచ్చు.. అది వేరే సంగతి. కొందరిపై సిబిఐ, ఈడి, ఐటి శాఖలు ఇష్టం వచ్చినట్లు కేసులు పెడుతున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. అదే తమకు ఇష్టమైనవారి జోలికి వెళ్లడం లేదు.
కాస్త నిరాశ కలిగి ఉండొచ్చు..
టీడీపీ నుంచి బీజేపీ లో చేరిన కొందరు మాజీ ఎంపీలు బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసినా ఎందుకు చర్య తీసుకోవడం లేదన్న ప్రశ్న వస్తుంది. అంటే బీజేపీలో ఎవరైనా చేరితే వారు పునీతులు అవుతారని చెప్పడమేనా! కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి పరిశ్రమల గురించి తెలుగుదేశం వారి భాషలో మాట్లాడకుండా ఉంటే ఆమెకే గౌరవంగా ఉండేది. చివరిగా ఒక మాట. ఏపీ నుంచి బీజేపీకి ఇరవై లోక్ సభ సీట్లు ఇవ్వాలని అమిత్ షా విజ్ఞప్తి చేశారు. ఇది ఈ మధ్యకాలంలో వేసిన పెద్ద జోక్ గా కనిపించడం లేదా! అమిత్ షా విశాఖ సభకు జనం పెద్దగా రాకపోవడం కూడా వారికి కాస్త నిరాశ కలిగించి ఉండవచ్చన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వచ్చాయి. వీటన్నిటి ప్రభావంతో ఎపి ప్రభుత్వంపైన కొన్ని విమర్శలు చేస్తే చేసి ఉండవచ్చు. కాని వాటిని పెద్ద సీరియస్‌గా తీసుకోనవసరం లేదు.
-కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment