kommineni srinivasarao
-
అమిత్ షా, జేపీ నడ్డా మాటల్లో నిజమెంత?
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, శ్రీకాళహస్తిలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ప్రసంగాలలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుది. ఏపీలో అభివృద్ది జోరుగా సాగుతోందని, సంక్షేమ కార్యక్రమాలు బాగా అమలు అవుతున్నాయన్న విషయం అర్థం అవుతుంది. అమిత్ షా, నడ్డా ఏపీ ప్రభుత్వంపై కొన్ని విమర్శలు, ఆరోపణలు చేసినా, వాటిలో పస లేదు. వారు జనరల్ గా చేసే ఆరోపణలే తప్ప నిర్దిష్ట అభియోగాలు చేయలేకపోయారు. ఫలానా ప్రాజెక్టులో అవినీతి జరుగుతోందనో, లేక ఫలానా చోట అక్రమాలు జరిగాయనో అధారాల సహితంగా చెప్పకపోవడం గమనించదగ్గ విషయం. ఇదే పెద్ద నిదర్శనం పైగా ఇటీవలే కేంద్రం రాష్ట్రానికి రెవెన్యూ లోటు కింద పదకుండువేల కోట్లు, పోలవరం ప్రాజెక్టు నిమిత్తం పదమూడు వేల కోట్లు మంజూరు చేసిందంటే ఏపీలో ఇలాంటి ఆరోపణలు లేవన్న కారణంగానే అన్న సంగతి అందరికి తెలుసు. నిజంగానే ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏవైనా స్కామ్‌లకు పాల్పడి ఉంటే, కేంద్రం అడ్డుపడదా!. వేల కోట్ల నిధులు జగన్ కోరిక మేరకు ఇస్తుదా? ఇదే పెద్ద నిదర్శనంగా తీసుకోవాలి. ఆరోపణలు గుర్తులేవా? టీడీపీ, బీజేపీ కలిసి రాష్ట్రాన్ని ఏలినప్పుడు పోలవరంను ఎటిఎంగా ఆనాటి టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మార్చుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఎన్నికల ప్రచార సభలో ఆరోపించారు. మరుగుదొడ్ల నిర్మాణం మొదలు అనేక అంశాలలో అక్రమాలు భారీగా జరిగాయని బీజేపీ అధ్యక్షుడుగా ప్రస్తుతం ఉన్న సోము వీర్రాజు అప్పట్లోనే పెద్ద ఎత్తున ఆరోపించేవారు. 2019లో చంద్రబాబు ప్రభుత్వం ఓటమి చెందిన తర్వాత ఆయన పీఎస్ ఇంటిలో సోదాలు చేసి రెండువేల కోట్ల రూపాయల అక్రమాలు గుర్తించినట్లు కేంద్రం ప్రకటించింది. దీనిని బట్టే తెలుస్తుంది? ఎంతో చిత్తశుద్ది కలిగిన, అవినీతికి దూరంగా ఉంటామని చెప్పుకునే బీజేపీ ప్రభుత్వ పెద్దలు వీటి గురించి ఏమి చేసింది ఇంతవరకు వెల్లడించలేదు. దీనిని బట్టే వారి లక్ష్యశుద్ది ఏమిటో తెలుస్తుంది. టీడీపీ,బిజెపి కలిసి ప్రభుత్వంలో ఉన్నప్పుడే అమరావతి లాండ్ స్కామ్ , స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్ వంటివి జరిగాయని వైసీపీ ప్రభుత్వం కనుగొంది. వాటిపై సిబిఐ విచారణకు సిద్దం అని చెప్పినా, ఇంతవరకు కేంద్రం కిమ్మనలేదు. అవినీతిని దునుమాడుతామనే మోదీ, అమిత్ షా ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు తరచు ఒక మాట చెప్పేవారు. కేంద్రం తనకు సహకరించడం లేదని, ఇరవై తొమ్మిది సార్లు ఢిల్లీ వెళ్లినా ఆశించిన నిధులు ఇవ్వడం లేదని పదే,పదే వాపోయేవారు. అందులో భాగంగానే.. చంద్రబాబు ప్రభుత్వ అవినీతి కారణంగానే కేంద్రం పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వడం లేదని కొందరు బిజెపి నేతలు అంటుండేవారు. మరి అలాంటిది ఇప్పుడు జగన్ విజ్ఞప్తి మేరకు రెవెన్యూ లోటు, పోలవరం ప్రాజెక్టులకు ఇరవైనాలుగు వేల కోట్ల సాయం చేయడానికి కేంద్రం ముందుకు వచ్చింది. అంటే దాని అర్ధం జగన్ ప్రభుత్వంలో అవినీతి , అక్రమాలు లేనట్లే కదా! అయినా ఎందుకు అమిత్ షా, నడ్డాలు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు అన్న ప్రశ్న వస్తుంది. నిజానికి ఇది ప్రధాని మోడీ తొమ్మిదేళ్ల పాలన పై ప్రచారం కోసం ఏర్పాటు చేసిన సభ. అయినా ఆయా రాష్ట్రాలకు వెళ్లినప్పుడు బిజెపియేతర ప్రభుత్వాలు ఉంటే ఏవో కొన్ని విమర్శలు చేయకతప్పదు. అందులో భాగంగానే వీరు ఏపీపై కూడా చేసినట్లు అనిపిస్తుంది. అవినీతి జరిగినట్లు ఎలా అవుతుంది? ఇసుక మాఫీయా అని ఆరోపించారు. చంద్రబాబు టైమ్‌లో మాఫియాలు విజృంభించి ప్రజలను అగచాట్లు పాలు చేస్తే, జగన్ ప్రభుత్వం ఇసుకకు కొత్త విధానం తెచ్చి, అటు ప్రజలకు అందుబాటులో, ఇటు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చగలుగుతోంది. మాజీ మంత్రి పేర్ని నాని అన్నట్లు ఇసుక ద్వారా ఏపీకి నాలుగువేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంటే అవినీతి జరిగినట్లు ఎలా అవుతుంది. మైనింగ్ రంగంలో కూడా గతంలో కన్నా కొన్ని వేల కోట్ల అదాయం పెరిగింది. విశాఖలో భూ మాఫియా అని దుష్ప్రచారం చేస్తున్నారు. ఎక్కడైనా ఒకటి, రెండు చోట్ల భూ కబ్జాలు ఉంటే ఉండవచ్చు. దానిపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ సంగతి అందరికి తెలుసు.. కొందరు టీడీపీ నేతలు ఎకరకాలకు, ఎకరాల ఆక్రమించిన విషయాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్న సంగతి అమిత్ షాకు ఏపీ బీజేపీ నేతలు చెప్పలేదేమో తెలియదు. అదే బీజేపీ,టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన భూ కబ్జాలపై చంద్రబాబు ప్రభుత్వమే సిట్ వేసింది కదా! అప్పుడు మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడే ఆనాటి కబ్జాలపై ఫిర్యాదు చేశారు కదా! నడ్డా, షా లకు ఆ విషయాలు చెప్పి ఉండకపోవచ్చు. ఏపీలో జాతీయ రహదారులు, పారిశ్రామిక కారిడార్లు, పార్మా హబ్ వంటివాటిని ప్రస్తావించారు. వాటన్నిటిని కేంద్రం ఖాతాలో వేసుకునే యత్నం చేశారు. తప్పులేదు. కేంద్రం, రాష్ట్రం కలిసి ఈ ప్రాజెక్టులను చేస్తాయి తప్ప కేంద్రం ఒక్కటే చేయగలిగింది తక్కువే అన్న సంగతి అందరికి తెలుసు. ఒకపక్క రాష్ఠంలో అసలు ఏమీ జరగడం లేదని చెబుతారు. మరో పక్క తాము చాలా చేసేస్తున్నామని అంటారు. మరి ఏది నిజం. కొన్ని స్కీములకు జగన్ తన బ్రాండ్ వేసుకుంటున్నారని ఆరోపించారు. రైతు భరోసా పథకాన్ని షా ఉదహరించారు. ఆయనకు ఈ ప్రసంగం రాసిచ్చినవారెవరో అబద్దం రాశారు. ఎందుకంటే వైఎస్సార్ రైతు భరోసా ,పిఎం కిసాన్ సమ్మాన్ అని పేరు పెట్టారు. తాము ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నామని షా అన్నారు. అది నిజమే కావచ్చు. కాని అంతకు మూడు రెట్లు రాష్ట్రం బియ్యం ఇస్తోంది కదా!. బహుశా తెలుగుదేశం నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సి.ఎమ్.రమేష్, లేదా ఈ మధ్య కాలంలో కొత్త నాయకుడిగా అవతరిస్తున్న సత్య వంటివారు ఎవరైనా ఈ స్పీచ్ రాసిచ్చినట్లుగా ఉంది. కేంద్ర నాయకులతో చిలకపలుకులు.. వారు నిత్యం చేసే ఆరోపణలనే కేంద్ర నాయకులతో చిలకపలుకులు మాదిరి పలికించారనిపిస్తుంది. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తన ప్రసంగంలో చాలా విషయాలు చెప్పారు. అవన్ని వింటే ఏపీలో జగన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇన్ని అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయా అన్న ఆశ్చర్యం కలుగుతుంది. ఒకరకంగా ఇది విమర్శలకు కనువిప్పు కూడా. తీర ప్రాంతంలో పోర్టులు, హార్బర్లు, జాతీయ రహదారుల, రాష్ట్ర రహదారులు, గ్రామీణ రహదారులు, పారిశ్రామిక కారిడార్లు, ఫార్మా హబ్ ఇలా అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు.. ఇక సంక్షేమ కార్యక్రమాలలో లక్షల కొద్ది ఇళ్ల నిర్మాణం, రైతు భరోసా స్కీమ్ తదితర అంశాలను ఆయన తడిమారు. వీటన్నిటిలో కేంద్రం వాటా ఉందని చెప్పడానికి ఇవన్ని ఉదహరించినా, అవన్ని జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం చేస్తున్నట్లే కదా! చదవండి: అది జగన్ ఘనత కాదా రామోజీ! ఇష్టమైనవారి జోలికి వెళ్లడం లేదు.. జగన్ సంక్షేమ కార్యక్రమాల కింద రెండు లక్షల కోట్లకు పైగా ఆర్దిక సాయాన్ని ప్రజలకు అందించారు. అందులో ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా వారి ఖాతాలలోకి వెళ్లేలా కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా చేశారు. ఇలా ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేయగలుగుతున్నాయి. కర్నాటకలో నలభై శాతం కమిషన్ ఆరోపణతోనే కదా బీజేపీ ప్రభుత్వం పరాజయం చెందింది. ఆ విషయం ఏపీ ప్రజలకు తెలియదనుకుంటే బీజేపీ వారు అమాయకులే అనుకోవాలి. కేంద్రంపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని అమిత్ షా అంటున్నారు. రఫెల్ కుంభకోణం ఎంత పెద్ద ఆరోపణలో వారికి తెలియదా! అది నిజం కాదని వీరు చెప్పవచ్చు.. అది వేరే సంగతి. కొందరిపై సిబిఐ, ఈడి, ఐటి శాఖలు ఇష్టం వచ్చినట్లు కేసులు పెడుతున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. అదే తమకు ఇష్టమైనవారి జోలికి వెళ్లడం లేదు. కాస్త నిరాశ కలిగి ఉండొచ్చు.. టీడీపీ నుంచి బీజేపీ లో చేరిన కొందరు మాజీ ఎంపీలు బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసినా ఎందుకు చర్య తీసుకోవడం లేదన్న ప్రశ్న వస్తుంది. అంటే బీజేపీలో ఎవరైనా చేరితే వారు పునీతులు అవుతారని చెప్పడమేనా! కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి పరిశ్రమల గురించి తెలుగుదేశం వారి భాషలో మాట్లాడకుండా ఉంటే ఆమెకే గౌరవంగా ఉండేది. చివరిగా ఒక మాట. ఏపీ నుంచి బీజేపీకి ఇరవై లోక్ సభ సీట్లు ఇవ్వాలని అమిత్ షా విజ్ఞప్తి చేశారు. ఇది ఈ మధ్యకాలంలో వేసిన పెద్ద జోక్ గా కనిపించడం లేదా! అమిత్ షా విశాఖ సభకు జనం పెద్దగా రాకపోవడం కూడా వారికి కాస్త నిరాశ కలిగించి ఉండవచ్చన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వచ్చాయి. వీటన్నిటి ప్రభావంతో ఎపి ప్రభుత్వంపైన కొన్ని విమర్శలు చేస్తే చేసి ఉండవచ్చు. కాని వాటిని పెద్ద సీరియస్‌గా తీసుకోనవసరం లేదు. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
2019లో జగనే ఏపీ సీఎం
సాక్షి, హైదరాబాద్: ఎండ, వాన, చలి లెక్కచేయకుండా ప్రజల కోసం వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తుండటం నిజంగా చాలా గొప్ప విషయమని సినీ నటుడు కృష్ణ అభిప్రాయపడ్డారు. గురువారం తన జన్మదినోత్సవం సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్‌రావుతో సాక్షి ‘మనసులో మాట’ కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణ, దివంగత సీఎం వైఎస్‌తోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితోనూ తన అనుబంధాన్ని ఈ సందర్భంగా పంచుకున్నారు. గతంలో వైఎస్‌ను కలిసేందుకు వారింటికి వెళ్లేవాణ్ని. అప్పటినుంచీ వైఎస్ జగన్‌తో నాకు సత్సంబం ధాలున్నాయని వెల్లడించారు. ప్రజలకు ఏదో చేయాలి, వారి కష్టాలను తీర్చాలన్న పట్టుదల ఉన్న వ్యక్తి జగన్ అని కృష్ణ అభిప్రాయపడ్డారు. ఇసుకేస్తే రాలనంతగా... ఏ ఊళ్లో చూసినా జగన్ కోసం జనాలు ఇసుకేస్తే రాల నంతగా రావడం నిజంగా గర్వించదగ్గ విషయమని అన్నారు. ‘‘ఎండాకాలం. పైగా మే నెల. ఎంత ఇబ్బందో అందరికీ తెలుసు. అయినా జగన్ ప్రజల్లోనే ఉంటూ, వారికోసం అంతగా కష్టపడటం గొప్ప విషయం’’ అని కొనియాడారు. 2019లో వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి అవుతారని కృష్ణ స్పష్టం చేశారు. మాట మీద నిలబడే వైఎస్ ‘‘ఇచ్చిన మాటకు కట్టుబడిన, చేసిన వాగ్దానాలు అమలు చేసిన నాయకున్ని ఒక్క వైఎస్‌ను మాత్రమే చూశాను. ఆయన మాట మీద నిలబడిన తీరు, ప్రజలకు చేసిన సేవ ఎనలేనివి’’ అంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని సినీ హీరో కృష్ణ కొనియాడారు. ఎంపీగా ఇద్దరం... తాను ఎంపీగా ఉన్న సమయంలో వైఎస్ కూడా ఎంపీయేనని కృష్ణ గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి చివరిదాకా మంచి మిత్రులుగా కొనసాగామని తెలిపారు. వైఎస్‌ను చరిత్రాత్మక పాదయాత్ర సందర్భంగా జనం ఎంతగా రిసీవ్ చేసుకున్నారో ఇప్పుడు వైఎస్ జగన్‌ను కూడా పాదయాత్ర పొడవునా అదే మాదిరిగా ఆశీర్వదిస్తున్నారని అన్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ప్రతి ఒక్కటీ జనాలకు ఎంతగా ఉపయోగపడ్డాయో అందరికీ తెలుసునన్నారు. ‘‘ఒక్క పథకమని కాదు, వైఎస్ తీసుకొచ్చిన అన్ని పథకాలూ నాకు ఇష్టమైనవే. అందుకే నాకు ఇష్టమైన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే’’ అని కృష్ణ స్పష్టం చేశారు. -
నమ్మకం ఇచ్చిన మనిషి వైఎస్సార్
♦ మనసులో మాట రాజకీయనేతగా కంటే వ్యక్తిగా వైఎస్ రాజశేఖరరెడ్డి చాలా మంచిమనిషని, ఈ మనిషి ఉంటే చాలు అనే నమ్మకం ప్రజ లకు ఇచ్చిన గొప్పనేత అని శతాధిక చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ పేర్కొన్నారు. ఏ రంగంలో అయినా పొగిడేవారి కంటే విమర్శించే వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సరైన విధంగా నచ్చచెప్పగలిగితే ఎంతటి ప్రముఖులైనా మనం చెప్పింది వింటారనేది చిత్రజీవితంలో తాను పొందిన మంచి అనుభవమన్నారు. రాజకీయ జీవితంలో క్షణం కూడా ఖాళీగా గడపకుండా వైఎస్ జగన్ అందరి అభిమానాన్ని చూరగొంటున్నారని, ఆయన కృషి ఫలిస్తుందని చెబుతున్న కోడి రామకృష్ణ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... సినిమాకు చెందిన అన్ని శాఖల్లోనూ ఇంత అనుభవం ఎలా సాధించారు? దర్శకుడికి బాయ్ చేసే పని నుంచి దర్శకుడు చేసే పనివరకు అన్నీ తెలిసి ఉండాలి. మనవద్ద పనిచేసే బాయ్ కష్టం కూడా తెలియాలి. అందుకే కాఫీ అనగానే బాయ్‌ని కేకేయకూడదు. తను ఏ కష్టంలో ఉన్నాడో చూసి అడగాలి. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటినుంచి నేను ఎడిటర్ పనేమింటి, అసిస్టెంట్ పనేమిటి, మ్యూజిక్ ఏమిటి, ఎలా చేస్తారు.. రైటర్ ఎవరు అని అన్నీ తెలుసుకుం టాను. వారినుంచి సహాయం తీసుకుంటాను. ప్రతి రంగంలోనూ ఒక సమర్థుడిని పెట్టుకుంటాను. సమర్థుడు అంటే నన్ను విమర్శించాలి. ఇది బాగా లేదు సార్ అనగలగాలి. అప్పుడే మళ్లీ వెనక్కు చూసుకుంటాం. సినీరంగంలో పొగడ్తలు తప్పవు కదా? పొగడటం అనేది విషం లాంటిది. మన తప్పును మనకు చెప్పే విమర్శ అద్దం లాంటిది. నాకు పొగిడేవారంటే భయం. విమర్శ మనం వెళ్లే దారిలో ఒక సిగ్నల్ లాంటిది. లేదు సార్, బాగా లేదు సర్, మనం పలాని అంశంలో రాజీపడిపోతున్నాం డైరెక్టర్ గారూ అని ఎవరన్నా అంటే వెంటనే అమ్మా అనుకుని అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ జాగ్రత్త పడాలి. పెద్ద డైరెక్టర్లు, నటులను కూడా మీరు విమర్శించేవారా? ప్రతి ఒక్కరికీ ఒక సైకాలజీ ఉంటుంది. కానీ నేరుగా విమర్శించకూడదు. భానుమతి గారున్నారు. ఆమె డైరెక్టర్, రచయిత, నటి. ఆమెకు ఒక సీన్ చెప్పామంటే తన సూచన చెబుతారు. ఒకే మేడమ్ బాగుంది పెడతాము అని చెప్పి పది నిమిషాలు ఆగి, ఇక్కడ ఇలా వచ్చింది మేడం. ఫరవాలేదా అని అడిగితే అలా వచ్చిందా, అయితేవద్దు తీసేద్దాం అని ఆమె సమాధానపడేవారు. అదే వెంటనే చెబితే కోపం వచ్చేస్తుంది కదా. మంగమ్మగారి మనవడు స్క్రిప్ట్ వినిపించాను. ఆ సినిమాలో ఆవిడ పాత్రకి డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువ ఉంటాయి. గోపాల్‌రెడ్డిగారు, గణేష్ పాత్రో గారు నేను ఆమె వద్దకు వెళ్లి స్క్రిప్టు చదివి వినిపించగానే సర్రున లేచి వెళ్లిపోయిందామె. ‘వెళ్లిపోండి మీరు బయటకు, కాఫీలు ఇవ్వ డం కూడా దండగ మీకు. భానుమతి అంటే ఏమనుకున్నారు’ అంటూ మండిపడ్డారు. లేదమ్మా, తప్పకుండా స్క్రిప్టు మారుస్తాము అని ఒప్పించాము. సరే మార్చండి అన్నారు. ఆ తర్వాతి రోజు పొద్దున్నే కోడూరులో షూటింగ్. అన్నీ సరిగా ఉన్నాయా లేదా అని ఆమె టెన్షన్ పడుతున్నారు. ఆమె ముందుకు వెళ్లి డైలాగ్ చూపిం చాను. ఫస్ట్ షాట్. చుట్టూ జనం. ‘భయంకర బల్లి బట్టల్లేకుండా స్నానం చేస్తూ బావగారు వచ్చారని లేచి నిలబడిందట’ అని డైలాగ్. ఏకధాటిగా చెప్పేసింది. షాట్ ఓకే. జనమంతా చప్పట్లు కొట్టేశారు. ఆమెకు ఆశ్చర్యమేసింది. నిన్న మీరు వద్దన్న డైలాగ్ ఇదే అని చెప్పాను. అన్ని డైలాగులూ ఇదేరకంగా చెప్పండి మీరు. సినిమా సంవత్సరం ఆడుతుందన్నాను. అలాగే చెబుతాను అని ఒక్క డైలాగ్ కూడా మార్చకుండా అన్నీ చెప్పేశారామె. నచ్చచెప్పడంలోనే ఉందండి అసలు విషయం. ఎన్టీఆర్ పరాభవానికి తప్పు మామదా? లేక అల్లుడిదా? మన ఇంట్లో ఏం జరుగుతోంది, మన చుట్టూ ఏం జరుగుతోందని నిత్యం పరిశీలించుకోవాలి. పనిమనిషి నమ్మకంగా పనిచేస్తూ మన ఇంట్లోనే దొంగతనం చేసిందంటే కారణం ఆమె పరిస్థితులను, ఇబ్బందులను మనం అర్థం చేసుకోకపోవడమే. అవసరాలు వారిని డామినేట్ చేసినప్పుడు అందుబాటులో ఉన్న వస్తువు ఏదైనా సరే తీసుకోవాలనిపిస్తుంది. అందుకే పరిస్థితుల ప్రాబల్యమే రామారావు అలా కావడానికి కారణం అని నమ్ముతాను. వైఎస్సార్ పాలనపై మీ అభిప్రాయం? వైఎస్ రాజశేఖరరెడ్డి నాకు మంచి స్నేహితుడు. సాయిబాబా పెట్టెను మద్రాసు నుంచి హైద్రాబాదుకు విమానంలో తీసుకొస్తుంటే, మా ఆవిడ బరువు మోస్తోం దని చూసి అమ్మా ఆ పెట్టె ఇవ్వు అని అడిగి తీసుకున్నారు వైఎస్సార్. ప్రయాణం ముగిసే దాకా బాబా పెట్టె పట్టుకుని వచ్చారు. ఆరోజు బాబా పెట్టె పట్టుకున్నారు కాబట్టే మీరు సీఎం అయ్యారు అని మా అమ్మ తర్వాత కలిసినప్పుడు చెబితే అవునమ్మా అంటూ నవ్వేశారాయన. వ్యక్తిగా చాలా మంచి మనిషి. ఆయన పాలన కూడా చక్కగా చేశారు. ఈ మనిషి ఉంటే చాలు అనే నమ్మకం ప్రజలకు ఇచ్చారు వైఎస్సార్. వైఎస్ జగన్ పాదయాత్రపై మీ అభిప్రాయం ఏమిటి? వైఎస్ జగన్మోహన్రెడ్డి బాగా కష్టపడుతున్నారు. రాజ కీయాల్లో అసలు తీరికన్నదే లేకుండా, ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. ఎప్పటికైనా ఆయన కృషి ఫలిస్తుంది. పైగా ప్రతి ఒక్కరూ ఆయనను ఇష్టపడుతున్నారు. యువనేతగా ఆయన శ్రమిస్తున్న తీరు చూసి, రాజకీయనేతలు కూడా బాగా ఇష్టపడుతున్నారు. కృషి ఉంటే కానీ మనిషి పైకి రాడు అని ఆయన చేసి చెబుతున్నారు. రాజకీయాల కంటే ఆయనలో ఆ తత్వమే నాకు బాగా ఇష్టం. (ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకులో) https://goo.gl/tBWCH9 -
ప్రజల నేత అంటే వైఎస్సారే
కొమ్మినేని శ్రీనివాసరావుతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం హోదాలో ఉండి కోదండరాం సర్పంచ్ కూడా కాలేదు అన్నాడు కేసీఆర్. మరి సర్పంచ్ కూడా కాని వాడిని జేఏసీ చైర్మన్‌గా ఎందుకు పెట్టినావు? ఉద్యమకాలంలో ఆయనను అందలం ఎక్కించావు. ఈరోజు అదే కోదండరాంని వాడు వీడు అని మాట్లాడి సీఎం హోదా పరువు తీశావు. కోదండరాం తప్పేమిటి? ప్రతి ఊరూ తిరిగిండాయన. కేసీఆర్ కంటే ఎక్కువ మీటింగులు పెట్టాడు. ఆయన రాజకీయ నేత కాకపోవచ్చు. కానీ తెలంగాణ అవసరాన్ని విప్పి చెప్పాడు. ముఖ్యమంత్రిగా ఉంటూనే ప్రతిపక్ష నేతలాగా ప్రజల్లోనే తిరుగుతూ, ప్రజల కష్టాలను పట్టించుకున్న నిజమైన జననేత దివంగత సీఎం వైఎస్సారేనని మాజీ మంత్రి, టీ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. సంక్షేమ కార్యక్రమాలను ప్రతిరోజూ సచివాలయంలో ఉదయం 10 గంటలనుంచి గడియారం చూసుకుని మరీ పర్యవేక్షించిన అసలైన నేత వైఎస్సార్ అని ప్రశంసించారు. ఉదయం ఎనిమిదన్నర నుంచి తొమ్మిదన్నర వరకు రోజుకు 5 వేల మందిని కలుస్తూ వచ్చిన అరుదైన నాయకుడు వైఎస్సార్ కాగా, కేసీఆర్ ఈ మూడున్నరేళ్ల కాలంలో 500 మందిని కూడా కలిసి ఉండరని, తెలంగాణలో మళ్లీ గడీలు గుర్తుకొస్తున్నాయని అన్నారు. చంద్రబాబు కానీ, కేసీఆర్ కానీ ప్రజానుకూల పాలన విషయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి దరిదాపుల్లో కూడా నిలబడలేరని అంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... తెలంగాణకోసం నాడు సాగించిన పోరాటంపై ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సీఎం అయినప్పుడు చాలా సంతోషపడ్డాం. ఎవరైతేనేం.. తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. నిరుద్యోగులు, రైతుల కష్టాలు ఇకనైనా తొలగిపోతాయి అని వ్యక్తిగతంగా చాలా సంతోషపడ్డాను. కానీ తెలంగాణకోసం పోరాడిన వ్యక్తిగా, ఒక ఎమ్మెల్యేగా తెలంగాణ సీఎంని నేరుగా కలవలేని పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. రెండేళ్లనుంచి కేసీఆర్ అప్పాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ప్రభుత్వాన్ని ఏర్పర్చిన కొత్తలో కేసీఆర్‌ని కలిశాను. దాదాపు 2 గంటలు మాట్లాడారు. జిల్లాకు మెడికల్ కాలేజీ కావాలని, మరిన్ని అవసరాలను చెబితే అన్నీ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత రెండు మూడుసార్లు అసెంబ్లీలో కనిపించి అభ్యర్థిస్తే స్పందనే లేదు. తర్వాత నియోజకవర్గంలో పెండింగులో ఉన్న పనుల కోసం వారం రోజులపాటు ప్రతిరోజూ ఫోన్ చేసినా కేసీఆర్ ఫోనెత్తలేదు. దీన్ని చెప్పాలంటేనే నాకు గలీజుగా అనిపిస్తోంది. కానీ ప్రజలకు వాస్తవం తెలపాలనే మీద్వారా, ‘సాక్షి’ ద్వారా చెబుతున్నాను. వారం తర్వాత నేను మళ్లీ ఫోన్ చేస్తే ‘మీతో మాట్లాడనని సీఎం చెప్పారండీ, మీరిక ఫోన్ చేయవద్దు’ అని సీఎం పేషీ నుంచి నాకు బదులిచ్చారు. తెలంగాణ ఉద్యమం ప్రతి దశ లోనూ కేసీఆర్‌తో మేం టచ్‌లో ఉండేవాళ్లం. అలాంటిది సీఎం అయ్యాక నాతో కలవడం, మాట్లాడటం ఆయనకు ఇష్టం లేదన్న సమాధానం విని చాలా బాధపడ్డాను. బాబుతో, వైఎస్సార్‌తో నాకెప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు. వైఎస్సార్‌తో అయితే ఎంత చిన్నా, పెద్ద విషయమైనా సరే ఫోన్లోనే మాట్లాడుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకు సీఎం అప్పాయింట్మెంట్ ఇవ్వకపోవడం అవమానమండి. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఎమ్మెల్యేగా మీముందు కూర్చుని ఇవ్వాళ ఇలా చెప్పుకోవడమే చాలా బాధాకరం. తెలంగాణ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందనుకుంటున్నారు? ప్రభుత్వం గురించి చెప్పాలంటే మా తెలంగాణ పరువు మేం తీసుకుంటున్నట్లే అని చెప్పాలి. డీఎస్సీకి సంబంధించి దాదాపు వందసార్లు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో రేపు నోటిఫికేషన్ తెస్తున్నాం అని సీఎం చెప్పి ఉంటారు. లక్షలమంది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన ముఖ్యమైన విషయంపై ఇన్నిసార్లు ప్రకటించాల్సిన అవసరం ఏ ప్రభుత్వానికైనా ఉందా? నెలకు ఒక్కో విద్యార్థి వేలాది రూపాయలు ఖర్చుపెట్టి హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంటున్నారు. వాళ్ల తల్లిదండ్రులు కూలి నాలి చేసుకుని ఒక పూట ఉపవాసముండి మరీ డబ్బు పంపిస్తుంటే డీఎస్సీ ఎప్పుడొస్తుందో తెలియని అగమ్యగోచర పరిస్థితుల్లో పిల్లలు బాధపడుతున్నారు. ప్రాణత్యాగాలు చేసి తెలంగాణను తెచ్చుకున్న యువతీ యువకుల భవిష్యత్తుకు సంబంధించిన విషయంపై కూడా ప్రభుత్వం ఇంత మజాక్ చేసుకుంటోందే? వాళ్ల జీవితాల్తో ఆడుకోవడం కాదా ఇది. సింగరేణి ఎన్నికల తర్వాత కూడా ప్రతిపక్షాలకు బుద్ధిరావడం లేదని సీఎం అన్నారే? సింగరేణి ఎన్నికలలో ప్రభుత్వం ఏం పొడిచినట్లు? గెలిచిన అధికార పార్టీ సంఘానికి, ఓడిపోయిన యూనియన్లకు మధ్య తేడా కేవలం 3 వేల ఓట్లు. ఫలితం ఏమిటో అక్కడే తేలిపోలేదా. అది గెలుపు కాదు. సింగరేణినే మీకు రాసిస్తానని చెప్పారు కేసీఆర్. మామూలు వాగ్దానాలు కాదు. మీ ఖాతాలో రేపే డబ్బులు అంటూ ప్రలోభ పెట్టారు. సింగరేణి లాభాల్లో కార్మికుల వాటా 16 శాతం ఉంటే దాన్ని 25 శాతంకి పెంచారు. ఇన్ని రోజులు చేయనిది ఎన్నికలు కాబట్టి పెంచారు. వారసత్వ ఉద్యోగాలను కోర్టు అడ్డుకుంది కాబట్టి కారుణ్య ఉద్యోగాలను ఇస్తానని మాట మార్చారు. అన్నీ చేస్తాననడమే కానీ చేసిందెప్పుడు. గనికార్మికుల యూనియన్ ఎన్నికలకు ఇంత ప్రాధాన్యతను ఇచ్చిన సీఎంని నా జీవితంలోనే చూడలేదు. వైఎస్సార్, కేసీఆర్ పాలనను ఎలా పోలుస్తారు? పోలికే లేదు. పోలికలు కాదుకదా.. వైఎస్సార్ దరిదాపులకు కూడా రాలేడు కేసీఆర్. వైఎస్ జలయజ్ఞంపై కొన్ని పత్రికలు ఆరోజు ఏవేవో ఆరోపణలు చేశాయి కానీ ఈరోజు కేసీఆర్ చేస్తున్న అవకతవక పనులను ఏ పత్రిక కూడా ప్రస్తావించడం లేదు. ప్రజల ముఖం చూడటానికి కూడా ఇష్టపడని సీఎంని ఇప్పుడే చూస్తున్నాం. సెక్రటేరియట్‌కు రాని సీఎంని గతంలో ఎన్నడూ చూడలేదు. అదే వైఎస్సార్ ఉంటే జిల్లాల్లో లేకుంటే సెక్రటేరియట్లో ఉండేవారు. ఉదయం 8.30 నుంచి 9.30కి ఇంటివద్ద సామాన్య ప్రజలను కలిసేవారు. ప్రజలు ఎవరైనా వెళ్లి ఆయనతో చెప్పుకోవచ్చు. వారి సమస్యలపై ప్రత్యేక కార్యదర్శులను పెట్టి వెంటనే సమాధానం పంపేవారు. వారం రోజుల్లో పరిష్కారం చేసేవారు. 9.30 నుంచి 10 గంటల వరకు క్యాంప్ ఆఫీసులో జనంని కలిసేవారు. నాయకులం మేం వెళ్లి కలిసినా వాట్ సార్, ఏంటి విషయం అని పరామర్శించేవారు. వైఎస్ ప్రజలను పరామర్శించే తీరే వేరు. చంద్రబాబుకు, వైఎస్సార్‌కు మధ్య తేడా ఏమిటి? ఏ సీఎంని కూడా రాజశేఖరరెడ్డితో పోల్చలేము. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం దేశంలోనే లేదు. 108 అంబులెన్స్ పథకం అమెరికాలో ఉండేది. దాన్ని మొదటగా ఏపీలో తీసుకొచ్చింది వైఎస్సార్. తర్వాత కర్ణాటక వంటి రాష్ట్రాలు అమలు చేశాయి. ఇలాంటి పథకాలు పేదవాళ్లకు ఎప్పటికయినా వస్తాయా అని అనుకునేవారు. పేదవాళ్లకు గుండెజబ్బు వస్తే రెండు లక్షల రూపాయలు వైద్యానికి చెల్లించడం అసాధ్యం. చావు తప్ప వారికి మరో మార్గం ఉండేది కాదు. 20 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు వరకు ఎవరైనా సరే గుండె జబ్బు అంటే తెలిసి తెలిసీ చనిపోయేవారే తప్ప వైద్యం అందుబాటులో ఉండేది కాదు. కూలీ చేసుకునేటోడు హైదరాబాద్‌కు పోయి ఆపరేషన్ చేసుకోలేడు. ఎవరూ వాడికి అప్పివ్వరు. అలాంటివారికి ఆరోగ్యశ్రీ కార్డు చూపి, వాళ్లే తీసుకువచ్చి, ఆపరేషన్ చేసి, తర్వాత ఆరునెలల వరకు మందులు కూడా వాళ్లే ఇచ్చి ఎక్కడినుంచి వచ్చారో అక్కడికే వాహనంలో తీసుకెళ్లి దింపేవారు. పదిలక్షల మంది పేదవాళ్లను బతికించాడు వైఎస్సార్. అలాంటి ఆరోగ్యశ్రీ కూడా ఇవ్వాళ నీరుగారిపోయింది. ఓటుకు కోట్లు కేసు వ్యవహారంపై మీ అభిప్రాయం? పరిటాల రవి కుమారుడి పెళ్లికి కేసీఆర్ వెళ్లి బాబును కలిసి ఇద్దరూ మాట్లాడుకుని తిరిగి వచ్చిన తర్వాత ఇక ఓటుకు కోట్లు కేసు విషయం ఏమిటి? దాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆ విషయంలో ఇద్దరు సీఎంలూ రాజీ పడిపోయినట్లే. ఇద్దరికి ఎక్కడో అవగాహన కుదిరినట్లే ఉంది. (కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/HekhpK https://goo.gl/ifzwgQ -
రాజధాని ముసుగులో ‘రియల్ ఎస్టేట్’: ఆర్కే
పైకి ఎన్నిమాటలైనా చెప్పవచ్చు కానీ అమరావతిలో రాజధాని నిర్మాణం కలే కాదు కల్ల కూడా అంటూ మంగళగిరి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపి నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. ఆ విషయం రాజధాని ప్రాంత రైతులకు పూర్తిగా అర్థమైపోయింది కాబట్టే తాము ఇచ్చివేసిన భూముల్లో కూడా వారు ఇప్పటికీ పంటలు వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం పైసా విదల్చకుండా, ప్రపంచ బ్యాంకు నిధులు రాకుండా, నాలుగైదు భవనాలు కూడా కట్టని ప్రభుత్వం రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్‌కి తెరతీస్తోందన్నారు. చంద్రబాబు చేస్తున్నదల్లా సంవత్సరానికి రెండు మూడు శంకుస్థాపనలు చేయడమేగానీ, ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేదని జనంలో ఒకరకమైన అనుమానం, భయం కలుగుతూ వస్తున్నాయంటున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి అభిప్రాయం ఆయన మాటల్లోనే... ప్రశ్న: ల్యాండ్ పూలింగ్ సక్రమ విధానమని, పలువురు మద్దతిచ్చారని బాబు అంటున్నారే? జవాబు: దేశంలో ఇంతకుముందు ఎక్కడా ల్యాండ్ పూలింగ్‌ని పెట్టలేదు. ఆ విధంగా అది అక్రమం. మరొకటి. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అనేది ఉన్నప్పుడు ల్యాండ్ పూలింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. పైగా మీకిష్టమైతేనే భూమి ఇవ్వండి ఇష్టం లేకుంటే ఇవ్వొద్దని ల్యాండ్ పూలింగ్ చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. కానీ మా భూమిని ఇవ్వం అని చెప్పిన రైతుల మీద బాబు పోలీసులను పురమాయించి కేసులు పెట్టించారు. కొట్టించారు. పంటలు దహనం కూడా చేయించారు. కాబట్టి ఎన్ని దీక్షలూ, ధర్నాలూ చేసినప్పటికీ మాకు ఉపయోగం లేకుండా పోతోంది. అందుకే న్యాయపోరాటం మాత్రమే మాకు దారి చూపిస్తుంది అని భావించే పోరాటం ప్రారంభించాం. ప్రభుత్వంపై సుమారుగా 50 వరకు కేసులు వేసి ఉంటాం. హైకోర్టులో కొట్టివేసినవి మినహా 98 శాతం కేసులు మేమే గెలిచాం. ప్ర: నమ్మశక్యంగా లేదు. న్యాయవ్యవస్థ అంత బాగా పనిచేస్తోందా? జ: రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకుని బాబు చేస్తున్న అవినీతి వ్యవహారాలపై మేము వేసిన ప్రతి కేసు విషయంలో సక్సెస్ అయ్యాం. ఆయన అక్రమంగా నివాసం ఉండే ప్రాంతంలోనే ఇసుకను దారుణంగా కొల్లగొడుతుంటే, ప్రొక్లెయిన్లతో తోడేస్తుంటే మేం అడ్డుకున్నాము. కేసు వేస్తే ఆ దోపిడీ ఆగిపోయింది. నా అమరావతి, నా రాజధాని, నా ఇటుక అంటూ స్కూలు పిల్లలు కూడా పది రూపాయలు తప్పక ఇవ్వాల్సిందే అని సర్క్యులర్ పంపి వసూలు చేయడంపై మేం కోర్టు మెట్లెక్కితే.. ప్రభుత్వానికి మొట్టికాయలు పడ్డాయి. ఓటుకు కోట్లు, సదావర్తి కేసుల విషయంలోనూ ఇంతే. ప్ర: రైతులు స్వచ్ఛందంగానే భూములిచ్చారా? జ: దానివెనుక కూడా రహస్యం ఉంది. ఇక్కడ కూడా తాడికొండ, తుళ్లూరు, తాడేపల్లి రూరల్, మంగళగిరి రూరల్.. ఈ నాలుగు మండలాల్లోనే 29 గ్రామాలూ ఉన్నాయి. వీటిలో తాడికొండ పూర్తిగా మెట్ట ప్రాంతం. ఇక్కడ మునుపు ఎకరా ధర రూ. 5 లక్షలు ఉండేది. వర్షం పడితేనే పంట కాబట్టి వాళ్లు ఆనందంగా ఇచ్చేశారు. 1,400 గజాలు మాకొస్తుంది కదా. ఈ ప్రాంతంలోనే రాజధాని ఉంటే బాగుంటుందని అక్కడి రైతులు అనుకోవడం సబబే. కానీ తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాలు పూర్తిగా సారవంతమైన పంట భూముల్ని కలిగి ఉన్నాయి. అందుకే ఇక్కడ భూముల్ని మేం ఇవ్వం అని చాలామంది రైతులు వ్యతిరేకించారు. ఇవ్వాళ్టికి కూడా తుళ్లూరు మండలంలో చాలా మంది మా భూముల్ని ఇవ్వమనే అంటున్నారు. భూములిచ్చిన రైతులకు 32 ఫాంలు లిచ్చింది ప్రభుత్వం. ఫాం 18లో సంతకం చేస్తే ఇక రైతుకు భూమితో ఎలాంటి సంబంధం ఉండదు. పూర్తిగా ప్రభుత్వాధీనంలోకి వెళ్లిపోతుంది. పైగా బాబు రాజధానిని కట్టలేక పోతున్నారు. మోదీ రాజధానికోసం పైసా కూడా ఇవ్వలేదని రైతుల భయం. ప్ర: మరి రూ.2,500 కోట్లు ఇచ్చామని కేంద్రం అంటోందే? జ: ఆ రూ. 2,500 కోట్లను ఏం చేశారనే లెక్కలు ఇంతవరకు బాబు ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వలేదు. కాబట్టి రాజధానికి డబ్బులు లేవు అనేది ఒక అంశం. కాగా, 13 జిల్లాల ప్రజలు చూడలేకపోవచ్చు కానీ, బాబు రాజధాని విషయంలో ఏం చేస్తున్నారనేది ఆ నాలుగు మండలాల ప్రజలు నిత్యం చూస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు 6 లక్షల చదరపుటడుగుల్లో ఒక తాత్కాలిక బిల్డింగ్ కట్టగలిగారు తప్ప రాజధానికి మేం ఇది చేస్తున్నాం, ఇది పూర్తయింది అని చెప్పలేదు. కానీ బాబు చేస్తున్నదల్లా సంవత్సరానికి రెండు మూడు శంకుస్థాపనలు చేయడం. ప్ర: మరి భూములిచ్చిన, ఇవ్వని రైతుల పరిస్థితి ఏమిటి? జ: ఒకటిమాత్రం నిజం. బాబు రాజధానిని కట్టలేరు అని రైతులకు పూర్తిగా అర్థమైపోయింది. ముఖ్యంగా సమయం లేదు. డబ్బుల్లేవు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికే బాబు తమ భూములను తీసేసుకున్నాడని అందరికీ అర్థమైపోయింది. పవన్ కల్యాణ్ చాలాసార్లు రాజధాని ప్రాంతానికి వచ్చారు. ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ ఇస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆయన చెప్పారు. కానీ రాజధాని ప్రాంతంలో దాదాపు అన్ని చోట్లా ఆ నోటిఫికేషన్ ఇచ్చేశారు. అయినా పవన్ ఏ దీక్షలకు పూనుకోలేదు. ప్ర: ప్రపంచ బ్యాంకు రాజధాని ప్రాంతాన్ని సందర్శించింది కదా? జ: ఏపీలో రాజధాని నిర్మాణం కల్లేనండి. బాబు చేయలేడు. సెక్రటేరియట్, అసెంబ్లీని కూడా శాశ్వత స్థాయిలో కట్టలేకపోయారు. కేంద్రం నుంచి ఎలాంటి సహాయమూ లేదు. ప్రపంచ బ్యాంకు రెండుసార్లు రాజధానిని సందర్శించినా, పైసా విదల్చలేదు. నిజంగా రాజధానిని కడుతున్నారు అని తలిస్తే వాళ్లు అమెరికాలో కూర్చునే నిధులు విడుదల చేసేవారు. క్షేత్రస్థాయికి వచ్చి తనిఖీ చేయవలసిన అవసరం ఉండేది కాదు. రాజధాని ఒక కల మాత్రమే. ప్రజారాజధానిని చంద్రబాబు కట్టలేరు. ప్ర: డిజైన్లు అంటూ హడావుడి చేస్తున్నారు కదా? ఇంతవరకు నాలుగైదు దేశాలకు ప్రత్యేక విమానాల్లో వెళ్లి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుబారా చేసి డిజైన్లు తీసుకొచ్చారు. అవి చెల్లవని పక్కన పెట్టేశారు. గతంలోనే విజయవాడకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు ఒక డిజైన్ ఇచ్చారు. దాన్నీ పక్కన పెట్టేశారు. ఇక జపాన్‌కి చెందిన మాకీ సంస్థ ఈ ముడుపులు, అవినీతి వ్యవహారాలు మేము పడలేమని ఆరోపించి మరీ పక్కకు తప్పుకుంది. ప్ర: రహదారుల, శంకుస్థాపనల గతి ఏంటి? జ: ఇంతవరకు ఎవరైతే పొలాలనిచ్చారో వారికి ప్లాట్ కేటాయింపులే జరగలేదు. వాటిలో కూడా కార్నర్ బిట్లు, మెయిన్ రోడ్డుకు వచ్చే బిట్లను మొత్తంగా తెలుగుదేశం మంత్రులు ఒక బిట్‌గా వాళ్లకు వాళ్లే కేటాయింపు చేసుకున్నారని సాక్ష్యాధారాలతో సహా చూపించాం. రోడ్లు వేసి, ప్లాన్ చేసి జోనింగ్ చేసుకుని ఏమీ లేకుండా వాటిని అమ్మేసుకుందాం అనే అభిప్రాయానికి చంద్రబాబు వచ్చేశారు. రాజధానికోసం ఊరూరునుంచి మట్టి నీళ్లు తీసుకొచ్చారు కదా ఏమయ్యాయి? నీళ్లు తీసుకొచ్చారు.. వాటిని ఆరోజే, అక్కడే పారేశారు. మట్టి తీసుకురమ్మన్నారు. దాన్ని ఒక కుప్పలాగా పోశారు. ఇక ప్రతి ఊరినుంచి బిందెలతో నీళ్లు తీసుకురమ్మన్నారు కొన్ని వేల ఇత్తడి బిందెలు అలా తెప్పించారు. మొత్తం ఎన్ని బిందెలు కొన్నారు? ఇవ్వాళ అక్కడ ఎన్ని ఉన్నాయో చూపించమనండి చాలు. (ఆళ్ల రామకృష్ణారెడ్డితో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/kHwqc8 https://goo.gl/RjyjCD -
డ్రగ్స్‌పై రాజీ అతి పెద్ద నేరం..!
కొమ్మినేని శ్రీనివాసరావుతో టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు రహస్యంగా ఉత్తరాలు ఇచ్చేసి తీరా విభజన జరిగిపోయాక అర్ధరాత్రి విభజించారు, ఆంధ్రుల పొట్టకొట్టారు అని ఆరోపిస్తే ఎలా? పైగా విభజన తర్వాత ఇంత అవినీతికర పాలనను చూడలేదు. చేతులు తడపందే ఏపీలో ఇప్పుడు ఏదీ జరగదని అధికారులే చెబుతున్నారు. హైటెక్ సిటీ ప్రాంతంలో తప్పితే హైదరాబాద్‌లో ఏ ప్రాంతంలో అయినా ప్రజలు నడిచిగానీ, కారులో కానీ వెళ్లే చాన్స్ ఉందా? బాబు చేసిన అభివృద్ధి ఇదేనా? దేశమంతా కోట్లమంది డ్రగ్స్‌కు అలవాటు పడినప్పడు సినీ పరిశ్రమను మాత్రమే కౌంటర్ చేయడం తప్పని టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అంటున్నారు. డ్రగ్స్ తీసుకోవడం అతి పెద్ద నేరం కాగా దానికి క్షమాపణలు చెప్పడం, కాస్త సరళంగా వ్యవహరించమనడం ఇంకా పెద్ద నేరమని అన్నారు. పైగా సోర్సును బట్టే సిట్ విచారణ జరిగి ఉంటే, దర్శకుడు పూరీ జగన్నాథ్ క్యాంప్‌కు చెందిన వారినే ఎందుకు విచారించారని ప్రశ్నించారు. ఆడవారు ఇళ్లల్లోనే ఉండటం అనేది ఇప్పుడు పోవడంతో సమాన హక్కులూ వచ్చాయనీ.. దురలవాట్లకు సంబంధించి ఆడా మగా తేడా లేదంటున్న తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... సినిమారంగం అప్పుడెలా ఉండేది, ఇప్పుడెలా ఉంటోంది? అప్పట్లో కలెక్టివ్‌గా టీమ్ వర్క్ ఉండేది. ఇప్పుడు అది పోయింది. అప్పుడు కూడా హీరో, హీరోయిన్ని కేంద్ర స్థానంలో ఉంచి సినిమాలు తీసేవారు. ఇప్పుడయితే హీరో కోసమే సినిమాలు తీస్తున్నారు. మా రోజుల్లో చిన్న సినిమాలను మా ఇష్టమొచ్చిన హీరో, హీరోయిన్లను కొత్తవారిని తీసుకుని తీసేవారం. ఇప్పుడు అలా కాదు. ఫలానా హీరో సినిమా సూపర్ హిట్ అయితే దాన్ని కొత్తవాళ్లను పెట్టి కాపీ చేస్తున్నారు. ఒకరకంగా డూప్లికేట్ సినిమాలన్నమాట. ట్రెండ్ నడుస్తోంది.. అలాగే వెళ్లాలి అనేది ఇప్పుడు ఫ్యాషన్. నష్టాలపై చిత్ర పరిశ్రమలో ఒక ఏర్పాటు, విధివిధానాలు పెడితే మంచిదేమో కదా? అలాంటి కన్వెన్షన్లు ఏవీ పెట్టకూడదు. ఇవ్వకూడదు. వ్యాపారం వ్యాపారమే. ఏ సిని మాకయినా ఒక అంచనా ఉంటుంది. బాహుబలి–2 చాలాబాగా ఆడింది. వేల కోట్లు బిజినెస్ చేసింది. రేపు ఇంకొకరెవరైనా అంత ఖర్చు పెట్టి సినిమా తీస్తానంటే అంత బిజినెస్ ఏ సినిమా కూడా చేయదు. టాలీవుడ్లో సినిమా బిజినెస్ వందకోట్లు, ఇప్పుడయితే మరో 20 కోట్లు ఎక్కువగా బిజినెస్ చేయవచ్చేమో.. కానీ బాహుబలి రూ.2 వేల కోట్లు బిజినెస్ చేసింది కాబట్టి నాకు కూడా 2 వేల కోట్లు ఇవ్వు అని నేను అమ్మితే కొనుక్కున్నవాడు ఏమైపోతాడు? రేపు మరో పెద్ద హీరో సినిమాను 500 కోట్లకు కొంటాను అని ఎవడైనా సిద్ధపడితే అది వాడి తప్పు అంతే. డ్రగ్స్ కేసు ఇండస్ట్రీ మీద వేసిన ప్రభావం ఎంత, మీ స్పందన ఏంటి? చిత్రపరిశ్రమపై డ్రగ్స్ ప్రభావం ఉండదు. దేశంలో డ్రగ్స్ తీసుకునేవారు కోట్లమంది ఉంటున్నారు. సినీ పరిశ్రమలో కొన్ని వేలమంది డ్రగ్స్ తీసుకుంటూ ఉండవచ్చు. ఇలాంటి వారివల్ల సినీ పరిశ్రమపై ప్రభావం ఉండదు. సినీ పరిశ్రమ క్షమాపణలు చెప్పడం, వర్మ కౌంటర్ ఇవ్వడంపై మీ అభిప్రాయం? క్షమాపణలు చెప్పలేదు కానీ ఈ కేసులో కాస్త సరళంగా వెళ్లమని కోరినట్లున్నారు. అది కూడా తప్పే. అలా ఎందుకడగాలి? తమ్మారెడ్డి డ్రగ్స్ తీసుకుంటున్నాడు అని తెలిస్తే ఫిలిం చాంబర్ వెంటనే ఈ భరద్వాజను లోపల వేయండి అని చెప్పాలి. అతడు మా చాంబర్‌కు ప్రెసిడెంటుగా చేశాడు. కొంచెం చూసీ చూడనట్లుగా ఉండండి అని చెప్పకూడదు. డ్రగ్స్ కేసులో ఇదే జరిగి ఉంటే తప్పు. మావాళ్లను చూసీ చూడనట్లుగా ఉండండి, వదిలేయండి అని ఆ ఉత్తరంలో ఉంటే మాత్రం అది క్రైమ్ అండి. చాలా పెద్ద క్రైమ్. సిట్ విచారణ ప్రాతిపదిక సరైందేనా? నాకు తెలిసినంతవరకు ఫిలిం చాంబర్ పెద్దలు క్షమాపణ చెప్పలేదు. ఒక వేళ చెప్పి ఉంటే తప్పు. కాస్త ఉదారంగా చూడమని చెప్పి ఉన్నా తప్పే. అదే సమయంలో డ్రగ్స్ కేసు విచారణ తీరు కూడా తప్పే. ఎందుకంటే సిట్ విచారించిన వారిలో రవితేజ, చార్మితోసహా తొమ్మిదిమంది పూరీ జగన్నాథ్ క్యాంపులో ఆఫీసులో కూర్చునేవారే. అంటే ఇంత పెద్ద చిత్రపరిశ్రమలో పూరీ జగన్నాథ్ తాలూకూ మనుషులే, ఆ క్యాంప్‌కు సంబంధించినవారే డ్రగ్స్ తీసుకుంటున్నారా అనేది నా ప్రశ్న. సోర్సును బట్టే చేసి ఉంటే మిగతావారిని ఎందుకు వదిలేశారు? నటులే కాదు నటీమణులకు డ్రగ్స్ ఎలా అలవాటు అవుతోంది? మీరు హైటెక్ సిటీకి వెళ్లండి. సాయంత్రంపూట రోడ్డుమీదే అమ్మాయిలు సిగిరెట్లు తాగుతూ మందు బాటిళ్లు పట్టుకుని నడిచి వెళుతుంటారు. వాళ్లకు అలవాటు అయిందా అంటే మనం ఏం చెబుతాం? దురలవాట్లకు సంబంధించి ఆడా మగా అని లేదండి. సమాజంలో చాలా తేడా వచ్చేసింది. మన బాల్యంలోలాగా ఆడవారు ఇళ్లల్లోనే ఉండటం అనేది ఇప్పుడు పోయింది. సమాన హక్కులూ వచ్చాయి వాటితో వాటు ఇలాంటి మార్పులు కూడా వచ్చేశాయి. లిబరలైజ్ అయ్యారు. వాళ్ల హక్కు వాళ్లది. వైఎస్ఆర్, బాబు పాలనలో మీరు గమనించిన పోలికలు, తేడాలు ఏమిటి? ఇద్దరికీ మధ్య పోలికలు లేవండి. నక్కకు నాగలోకానికి మధ్య ఉన్నంత తేడాలే ఉన్నాయి. మొదట్లో చంద్రబాబుతో చాలా సన్నిహితంగా ఉండేవాడిని. తనకు విజన్ ఉంది. కానీ ఆయన మనుగడకోసమే ఉండే విజన్ అది. సమాజాన్ని బాగు చేయడానికి విజన్ ఉంటుంది. సమాజాన్ని ఆకర్షించడానికి విజన్ ఉంటుంది. చంద్రబాబుది మాత్రం ఆకర్షణా విజన్ అని చెప్పొచ్చు. తొలిసారి ఆయనతో భేటీలో నాతో అయిదుగంటలపాటు మాట్లాడారు. ఆయన మాటలని చూస్తే ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ అంత గొప్ప రాష్ట్రం లేదనిపించింది. బాబు మాటలు వింటున్నంత సేపు ఇలాంటి సీఎంకి మనం చాకిరీ చేయకపోతే జీవితమే వేస్ట్ అనిపించింది. అంతగా నమ్మేసి పొద్దున్న ఆరుగంటలకు ఆయన కార్యాలయానికి వెళితే రాత్రి 12 గంటలకు బయటపడేవాడిని. బాబు ఇంట్లోనే పడి ఉండేవాళ్లం. గంటలు గంటలు చెబుతుంటారు కాని దాని అమలు మాత్రం కనబడేది కాదు. ఈరోజుకి కూడా ఆయన మాట్లాడితే హైదరాబాద్‌ను డెవలప్ చేశానంటారు. అంత అభివృద్ధి జరిగివుంటే ఒక హైటెక్ సిటీ ప్రాంతంలో తప్పితే నగరం మొత్తం మీద ఏ అభివృద్ధి ప్రాంతంలో అయినా ప్రజలు నడిచిగానీ, కారులో కానీ వెళ్లే చాన్స్ ఉందా? ఎవరికి వాళ్లు ఇష్టానుసారం తోచిన చోట నిర్మాణాలు చేసుకుంటూ పోతుంటే ఇక హైదరాబాద్‌ను నేనే డెవలప్ చేశానంటే కుదురుతుందా? ప్రజలకోసం కాదు, బాబు కోసం విజన్ అంటున్నారు, స్పష్టంగా చెబుతారా? ఎన్టీఆర్‌ను గద్దె దింపాక చంద్రబాబుతో నాలుగేళ్లు కొనసాగాను. ఆ నాలుగేళ్లలో ఆయన చెప్పిన మాట ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదు. ప్రయత్నాలు కొన్ని జరిగాయి. స్లో అయి ఉంటే క్షమించవచ్చు. కానీ దేన్నయితే తాను మాటల్లో వ్యక్తం చేశారో, దాంట్లో 50 శాతం అయినా పని జరగాలి. జరగలేదు. అదే వైఎస్ఆర్ విషయానికి వస్తే సినీ పరిశ్రమకోసమో, ఫిలిం చాంబర్ కోసమో ఫలానా సహాయం చేయాలి అని చెప్పి మేం వెనక్కి వస్తుండగానే దారిలోనే ఫోన్ చేసి ఎలాంటి సహాయం కావాలి అని అడిగేవారు. అంటే ఇచ్చిన మాటకు ఫాలో అప్ చేసేవారు. ఏదైనా సహాయం కోరి ఆయన్ని కలిసి కాగితం ఇచ్చి తిరిగి వస్తే ఆ పని కచ్చితంగా పూర్తయ్యేది. అంత నమ్మకాన్ని ఆయన కలిగించారు. చంద్రబాబు పాలనలో అలాంటిది చూడనేలేదు. నేను బాబుతో ఎంతో సన్నిహితంగా ఉండేవాడిని. కాని ఆయన తన నీడను కూడా నమ్మరు. అంత భయం. అవతలివాళ్లు అడిగారంటే మంచికోసమే అడిగి ఉంటారు అని నమ్మి దాన్ని పూర్తి చేయడం వైఎస్సార్ శైలి అయితే. ఈ పని చేస్తే ఏమవుతుందో, ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని ఒకటికి పదిసార్లు అనుమానించే తత్వం చంద్రబాబుది. మొత్తానికి ఆ పని అయ్యేది కాదు. ఫలానా పని కావాలని అడిగితే ఇది కుదుర్తుంది. ఇది కుదరదు అని వైఎస్సార్ స్పాట్లోనే చెప్పేసేవారు. కాని చంద్రబాబు అయితే ఎంత చిన్నా పెద్దా విషయంలో కూడా తేల్చి చెప్పరు. అలా పని జరిగే ప్రాసెస్ చాలా లేటు అయ్యేది. చాలాసార్లు జరిగేది కాదు కూడా. విభజన సమయంలో చంద్రబాబు వైఖరిపై మీ అభిప్రాయం? చాలా అసహ్యంగా ఉంటుంది. రెండు మూడు సార్లు తెలంగాణకు అనుకూలంగా ఉత్తరాలు ఇచ్చేసి తర్వాత విభజన జరిగిపోయాక అర్ధరాత్రి విభజించారు, పొట్టకొట్టారు అని ఇతరులపై ఆరోపిస్తే ఎలా.. పైగా విభజన తర్వాత ఇంత అవినీతికర పాలన నేనెన్నడూ చూడలేదు. చిన్న పనికావాలన్నా చేతులు తడపందే ఏపీలో ఇప్పుడు జరగదని అధికారులే చెబుతున్నారు. (తమ్మారెడ్డి భరద్వాజతో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/eCkgR4 https://goo.gl/wZLqoZ -
నేరమయ పాలనకు మారుపేరు
కొమ్మినేని శ్రీనివాసరావుతో నట, దర్శకుడు పోసాని కృష్ణమురళి ప్రజారాజ్యాన్ని చిరంజీవి కాంగ్రెస్‌లో కలిపేసినప్పుడే నాకు రాజకీయాలపై విరక్తి కలిగింది. ఇక జీవితంలో నేను ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పోటీ చేయను. కానీ ఎన్నికల్లో మాత్రం వైఎస్ జగన్మోహన్రెడ్డికే సపోర్టు చేస్తా, ఓటేస్తా అని నిర్ణయించుకున్నాను. గతంలో వైఎస్ జగన్ ఎంపీగా, విజయమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కడపలో క్యాంపెయిన్‌లో పాల్గొని ప్రచారం చేసివచ్చాను. నాకు వైఎస్సార్ అంటే ఇష్టం. జగన్‌లో ఆయన పోలికలున్నాయి. నడవడిక ఉంది. ప్రభుత్వాన్ని ఎవరైనా నడపవచ్చు. ముఖ్యమంత్రి సీటులో ఎవరైనా కూర్చోవచ్చు.. కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం చేస్తున్నన్ని తప్పులను ఎవరూ చేయకూడదని ప్రముఖ సినీ రచయిత, నట దర్శకుడు పోసాని కృష్ణ మురళి చెప్పారు. భూకబ్జాలు, లంచాలు, కమీషన్లు, తప్పుల్ని నిలదీసిన అధికారులను కొట్టడం, నిలదీసిన ప్రజలను లారీల్తో గుద్దేయడం. ప్రతిపక్ష నేతలపై ఎస్సీ, ఎస్టీ వేధింపు కేసులను పెట్టి బలవంతంగా ఫిరాయింపులకు గురిచేయడం.. ఒక్కమాటలో చెప్పాలంటే ఏపీలో ప్రస్తుత పాలకులు లెక్కలేని నేరాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో పవర్ఫుల్ ఆయుధాన్ని మాకిచ్చారు. అదే ఓటు. మేం దాంతో చెబుతాం సమాధానం అని ఏపీలో జనం ఘోషిస్తున్నారంటున్న పోసాని అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... మీకు రచన అంటే ఇష్టమా పాత్ర పోషణ అంటే ఇష్టమా? నాకు రైటరంటేనే ఇష్టం. ఎందుకంటే దానివల్లే బతికాను కదా. అదే నాకు అన్నం పెట్టింది. ఎంఏ తెలుగు అనే నా క్వాలిఫికేషనే నన్ను కాపాడింది. ఆ సర్టిఫికెట్ చూసే పరుచూరి గోపాలకృష్ణ నన్ను వాళ్ల అన్నయ్యకు పరిచయం చేసి ఈ కుర్రాడిని మనం పెట్టుకుందాం అని చెప్పి తీసుకున్నారు. మీకు సినిమాల్లో మొదట్లో రాసే అవకాశం ఎలా ఇచ్చారు? గుంటూరు బస్టాండు నుంచి కనిపించిన బస్సు పట్టుకుని మద్రాసుకు వెళ్లి పరుచూరి బ్రదర్స్‌ని కలిస్తే ఎంఏ తెలుగు కదా... కొటేషన్లు నీకు నచ్చినవి రాయి అన్నారు. వారు భోజనం చేసి వచ్చేలోపు పేకాట ముక్కలపై 70 కొటేషన్లు రాసి చూపించాను. బాగా రాశావే. నువ్వు రైటర్ అవుతావు. మాలాగా కష్టపడు అన్నారు. మేనేజర్ని పిలిచి నాలుగు జతల బట్టలు కొనిచ్చారు. బుద్ధిగా ఉండు. బుద్ధిగా పనిచేసుకోపో అన్నారు. అలా నాలుగున్నర ఏళ్లు వారివద్ద ఉన్నాను. 50 సినిమాలకు కథలు రాశాను. మౌనపౌరాటం, కర్తవ్యం వంటి సినిమాలకు రాశాను. పీపుల్స్ ఎన్కౌంటర్ సినిమాకు కథ రాస్తే అవార్డు వచ్చింది. మీరు రాసిన ఏదైనా మంచి డైలాగు చెబుతారా? పీపుల్స్ ఎన్కౌంటర్ సినిమాలో పోలీసు అధికారి ఒక నక్సలైటు లీడర్ని పట్టుకుని ఇంటరాగేషన్ చేస్తాడు. నెలరోజులలోపు మీ జిల్లాలో నక్సలైట్లను ఏరిపారేస్తానంటాడు. అప్పుడా నక్సలైట్ అంటాడు. ఏరిపారేయడానికి బియ్యంలో రాళ్లు కాదు బిడ్డా నక్సలైట్లు అంటే, తూర్పునుంచి పడమరకు.. పడమరనుంచి తూర్పుకు మార్చింగ్ చేస్తూ ప్రపంచానికే పహారా కాస్తున్నవాడే నక్సలైట్ అంటాడు. ఇలాంటి పంచ్ డైలాగులు ఎన్ని రాశానో లెక్క లేదు. పెద్ద కష్టం లేకుండానే మీరు వారి ఆదరణ సంపాదించారు కదా? ఇద్దరు పెద్దమనుషుల మధ్య పెరిగాను నేను. ఏ చెడు అలవాటూ లేని మనుషుల మధ్య పెరిగాను. అదే వ్యసనాలు ఉన్నవారి వద్ద పని చేసి ఉంటే సాయంత్రం ఆరు గంటలకు మందు బాటిల్, ఏడు గంటలకు మరొకటి, పది గంటలకు మరొకటి ఇలా ఎంత గబ్బు పట్టాలో అంత గబ్బుపట్టిపోయి ఉండేవాడిని. డ్రగ్స్ కేసులో సినిమావాళ్లు ఇంతమందా? దేశంలో ప్రతి వ్యవస్థలోనూ లోపాలున్నాయి. విద్యా వ్యవస్థ పాడైపోయింది. అన్నిరకాలుగా ప్రజాస్వామ్యాన్ని రేప్ చేసి మరీ గెలుస్తున్నారు కాబట్టి రాజకీయ వ్యవస్థా పాడైపోయింది. అలాగే మీడియా, ప్రభుత్వోద్యోగులు, పోలీసు వ్యవస్థ అన్నిం టిలోనూ లోపాలున్నాయి. అలాగే సినిమా వాళ్లలోనూ ఉన్నాయి కాదనను. కానీ సినిమా రంగాన్ని మాత్రమే ఎత్తి చూపవద్దు? పెద్ద పెద్ద నటులూ డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారు కదా.. మానసిక సమస్యలా? ప్రభుత్వ వైఫల్యం కాబట్టే భారీ మొత్తంలో డ్రగ్స్ దేశంలోకి వచ్చి పడుతున్నాయి. డ్రగ్స్ మాత్రమే ఎందుకు ఆపాలనుకుంటున్నారు? సిగరెట్లు, బీడీలు, గుట్కా ఇంకా ఎన్నో వ్యసనాలు ఉంటున్నాయి. వాటినెందుకు ఆపరు? ప్రజలను మత్తులో, వ్యసనాల్లో ముంచే ఎన్నో అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోంది కదా? డ్రగ్స్ ఎంత ప్రమాదకరమో సిగరెట్లు, మందు, గుట్కాలు, పాన్ పరాగ్‌లు కూడా అంతే ప్రమాదకరం. కానీ వాటిని మాత్రం షాపుల్లో పెట్టి అమ్మిస్తారు. మనుషులను గబ్బుపట్టించే అన్నింటినీ మీరు ఓపెన్‌లో పెడతారు. కానీ డ్రగ్స్ మాత్రం మీకు దెయ్యంలాగ కనబడుతోంది. డ్రగ్స్ చాలా ప్రమాదకరం అని ప్రభుత్వం చర్యలు చేపట్టింది మరి? ప్రభుత్వం యాడ్ ఇచ్చింది. నా పేరు మహేష్. పొగ తాగాను, కేన్సర్ వచ్చింది అంటూ జలదరింపజేసే బొమ్మలతో ప్రచారం చేస్తోంది. ప్రభుత్వం పొగాకును, చుట్టలను ఎందుకు నిషేధించలేదు? పొగ తాగుట హానికరం అని యాడ్ వేసి కూడా మళ్లీ షాపుల్లో అమ్మడానికి ఎందుకు అనుమతిస్తున్నారు? డ్రగ్స్‌ని నిషేధించినవారికి వాటిని నిషేధిం చడం చేతకాదా? ఇంతకూ డ్రగ్స్ వాడుతున్న నటీనటులను మీరు సమర్థిస్తున్నారా? నేనొకటే చెబుతాను. డ్రగ్స్ ప్రమాదకరమని ఇంతగా చెబుతున్నారే.. మందు తాగి ఎంతమంది చావడంలేదు? పొగ తాగి ఎంతమందికి కేన్సర్ రాలేదు? కాబట్టి డ్రగ్స్‌తో పాటు వీటిని కూడా బ్యాన్ చేసి తర్వాత మాట్లాడండి. సినిమా పరిశ్రమను అధికారులు టార్గెట్ చేస్తున్నారని మీ అభిప్రాయమా? సిట్ వాళ్లు ముందే చెప్పారు. మాకు కొన్ని ఆధారాలు దొరికాయి. వాటిని ధ్రువపర్చుకునేందుకు అనుమానం కలిగినవారిని పిలిచి విచారిస్తున్నాం. అంతే కానీ మేం నోటీసులిచ్చామంటే వారిని అరెస్టు చేస్తామని కాదు అని వారు చాలా స్పష్టంగా చెప్పారు. నోటీసులకే ఈ పరిస్థితి వస్తే రేపు నిజంగా ఏదయినా జరిగితే? డ్రగ్స్ వాడుతున్నానని నాకు నోటీసులిచ్చారనుకోండి. నేను కోర్టులకు వెళ్లను. మీమీద అనుమానం ఉంది. కెల్విన్ పక్కన మీరు ఉన్నట్లు ఫొటో ఉంది మీరు విచారణకు రావాలి అని సిట్ వాళ్లు చెబితే ఒకపౌరుడిగా నేను వెళ్లాలి. నేను ఈ దేశానికి జవాబుదారిని. నా ఇంటికి మాత్రమే కాదు. అకుల్ సబర్వాలే కాదు.. ఎవరు పిలిచినా సరే వస్తానని చెప్పి మరీ వెళ్లి వారి ముందు కూర్చుం టాను. ఇంకా అనుమానం ఉంటే లై డిటెక్టర్ పరీక్ష చేసుకోండి. దొరికితే జైల్లో పెట్టండి, నన్ను క్షమించవద్దు అంటాను. సమాజాన్ని క్లీన్‌గా పెట్టడానికి వాళ్లు ప్రయత్నిస్తున్నారు. అందుకే అర్ధరాత్రి వారు ఫోన్ చేసి రమ్మన్నా నేను వెళతాను. చంద్రబాబు పాలనపై మీ అభిప్రాయం? చంద్రబాబు పెద్ద లీడర్. అందులో సందేహమే లేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు తెలుగు దేశం పార్టీని అడ్వాంటేజీగా తీసుకుని చాలామంది చాలా తప్పులు చేస్తున్నారు. కులరాజకీయాలు చేస్తున్నారు. మంత్రి మా కమ్మోడు.. మేం ఏమయినా చేస్తాం అంటున్నారు. నేను దీన్ని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ‘ప్రజాస్వామ్యంలో మాకు పవర్ఫుల్ ఆయుధం ఇచ్చారు. అదే ఓటు. మేం దాంతో చెబుతాం సమాధానం’. ఇదే జనం అభిప్రాయం. ప్రభుత్వం ఏదైనా కావచ్చు. సీఎం సీటులో ఎవరయినా కూర్చోవచ్చు. కానీ ఇన్ని తప్పులు చేయకూడదు. భూ కబ్జాలు, లంచాలు, వనజాక్షిని కొట్టడం, జనాలను లారీతో గుద్ది చంపడం, భూమానాగిరెడ్డిపై ఎస్సీఎస్టీ కేసు పెట్టి మరీ, తనను పార్టీలోకి లాక్కోవడం... ఇవన్నీ వైరుధ్యాలంటామా, వైషమ్యాలంటామా, స్వప్రయోజనమంటామా? ఒక్కమాటలో చెప్పాలంటే ఏపీలో లెక్కలేని నేరాలకు పాలకులు పాల్పడుతున్నారు. అమరావతి రాజధానిపై మీ అభిప్రాయం? రాళ్లలో బియ్యముంటే పక్కన పెడతాం. బియ్యంలో రాళ్లుంటే పక్కన బెడతాం. కాని రాళ్లే బియ్యమైతే దేన్ని పక్కన బెట్టగలం. నేను నిజాలు ఇలాగే చెబుతాను కాబట్టి నన్ను కూడా రేపు ఆ పార్టీవాళ్లు వచ్చి కొట్టినా కొట్టవచ్చు. గతంలోనే నన్ను బెదిరించారు. అదిచేస్తాం ఇది చేస్తాం అన్నారు. ఎవరికీ భయపడేదే లేదు. (పోసాని కృష్ణమురళితో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/yhaRAA https://goo.gl/qt6rGT -
పోలవరం ప్రాజెక్టు ఎవరి స్వప్నం?
మనసులో మాట కొమ్మినేని శ్రీనివాసరావుతో సీనియర్ నేత డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోలవరం తన కలల ప్రాజెక్టు అని చంద్రబాబు చెబుతున్నది పచ్చి అబద్ధం అని, నాటి ప్రధాని దేవేగౌడ ఈ ప్రాజెక్టుకు అత్యంత సుముఖంగా ఉన్నప్పటికీ ఆయన కోరిన ప్రకారం ప్రాజెక్టు అంచనాలు, మార్పులు గురించి వివరాలు పంపించకుండా తాత్సారం చేసింది చంద్రబాబేనని సీనియర్ రాజకీయ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు తేల్చి చెప్పారు. ప్రధానితో మీటింగులో ఎర్రన్నాయుడు కూడా ఉన్నారని, తర్వాత తొమ్మిదేళ్లు బాబు ముఖ్యమంత్రిగా ఉన్నా పోలవరం వివరాలు కేంద్రానికి పంపలేదని దీన్ని బట్టి పోలవరం ఎవరి కలో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. నేను నిప్పు, నిజాయితీ.. రాజకీయాల్లో నేను తప్పే చేయను అని బాబు చెప్పిన స్వోత్కర్ష ఓటుకు కోట్లు కేసులో మునిగిపోయిందని, ఆ నీతి నిజాయితీ దెబ్బకే అన్నీ వదులుకుని హైదరాబాద్ నుంచి పారిపోయారని హేళన చేశారు. ఎన్టీఆర్ మరో ఆరు నెలలు బతికి ఉంటే రాష్ట్ర చరిత్ర, బాబు చరిత్ర కూడా తేలిపోయేదంటున్న దగ్గుబాటి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు కదా. ఎలా ఫీలవుతున్నారు? రాజకీయాలకు దూరంగా ఉండటం ఏదో గొప్ప అని నేను భావించడం లేదు. రాజకీయాల్లో ఉన్నప్పుడూ బాగానే అనిపించింది. లేనప్పుడు కూడా బాగానే అనిపిస్తోంది. రాజకీయాల్లోంచి నేను సంతృప్తిగా.. అంటే ఏ మచ్చా లేకుండా, అన్ని పనులూ నిర్వహించి మంచి అనిపించుకుని బయటకి వచ్చాను అనే తృప్తితోటే నేను జీవిస్తున్నాను. మిమ్మల్ని బాగా బాధ పెట్టిన సన్నివేశం ఏది? రామారావుగారిని పదవి నుంచి దించేసిన తర్వాత, ఏది ఎలా ఉన్నా నేనుచేసిన పని కరెక్టు కాదు. ఆయన ఒక ఉన్నతమైన శక్తి. జాతికి ప్రతీక ఆయన. ఎన్ని రకాలుగా ఆయన తప్పు చేసి ఉన్నా, నాకు అవి ఇష్టం లేకపోయినా నేను అటువంటి దానిలో భాగస్వామ్యం కావడం అనేది నా జీవితంలోనే అసహ్యకరమైన విషయంగా భావిస్తున్నాను. ఎన్టీరామారావుకు పార్టీ పెట్టమని మీరు ఎప్పుడూ చెప్పలేదా? ఎన్టీ రామారావుకు పార్టీ పెట్టాలని ఎవరన్నా చెప్పడమంటే అంతకంటే హాస్యాస్పదమైన అంశం ఉండదు. అంతకంటే అబద్ధం కూడా ఉండదు. పార్టీ పెట్టాలని ఎన్టీఆర్‌కి తానే సలహా ఇచ్చానని బాబు మొన్ననే అన్నారే? బాబు రోజూ చెప్పేవన్నీ నిజాలేనా? ప్రతి రోజూ ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే కదా. పార్టీని నేను పెట్టమన్నాను అని చెప్పడం అంటేనే పచ్చి అబద్ధం. 1982 మార్చి 29న హైదరాబాద్‌లో రామకృష్ణా సినీ స్టూడియోలో తాను పార్టీ పెడుతున్నట్లుగా ఎన్టీఆర్ ప్రకటించారు. ఏప్రిల్ 11న తొలి మహానాడును నిర్వహించారు. మహానాడు పూర్తయ్యాక బాబును నేను స్వయంగా కలిసి పార్టీలోకి వచ్చి ఆర్గనైజేషన్ వ్యవహారాలు చూసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుం దని ఆహ్వానించాను. దానికి ఆయన కాదన్నారు. మీకు పార్టీ పెట్టేంత ఇది ఉందా అనేశారు. పార్టీ నడపడానికి ఖర్చులు ఎలా వస్తాయి. ఆయన డబ్బులు తీయరు అనేశారు. రామారావు డబ్బులు పెట్టరు అనేదే చంద్రబాబుకు మొదటి నుంచి ఉన్న అభిప్రాయం. బాబు అప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు. డబ్బులు లేకుండా రాజకీయాలు చేయలేం అనేది వారి విశ్వాసం. దాన్నే బాబు వ్యక్తం చేశారు. లేటుగా టీడీపీలోకి వచ్చిన బాబు ముందుకెళ్లిపోయారు.. మీరేమో వెనుకబడిపోయారు? పార్టీలోకి తను ఎలా వచ్చాడో అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి అధికారం కోల్పోయాక అక్కడ ఉండలేక వెంటనే టీడీపీలో చేరిపోయాడు. రాజకీయాల్లోకి మాది ఒకరకమైన ఎంట్రీ. బాబుది మరొక రకమైన ఎంట్రీ. తనకు అప్పటికే అధికారం ఏమిటో తెలుసు. ఏం చేయాలో తెలుసు. మేమేమో వ్యవస్థను బాగు చేయాలి అనే సంకల్పంతో పార్టీలోకి వచ్చాము. జయప్రకాష్ నారాయణ్ ఉద్యమంలో భాగమై డబ్బుల్లేకుండా రాజకీయాలు చేయొచ్చు అని నమ్మి వచ్చినవాళ్లం. కానీ బాబుకు రాజకీయమే జీవనం. దాని కోసం ఏదైనా చేయగలడు. ఎలాంటి సాహసానికైనా పూనుకోగలడు. ఏమైనా చేయగలడు అంటే అడ్డగోలు పనులు కూడా చేస్తాడనా? ఎందుకు చేయడు? మహానాడు, మినీమహానాడు అంటూ రకరకాలుగా సభలు పెట్టేవారు. ప్రతి సంవత్సరం మహానాడు పెట్టడం ఏమిటి, డబ్బు దండగ, దుబారా అనేది మా అభిప్రాయం. కానీ తాను మహానాడులు, మినీమహానాడులు పెట్టడానికి ఉత్సాహం చూపేవాడు. కాంగ్రెస్‌లో ఒక పని తీరు ఉండేది. నాయకులు వస్తారు. మీటింగు పెడతారు. దానికయ్యే ఖర్చులకు అందరూ ఊరిమీద పడతారు. డబ్బులు కలెక్ట్ చేస్తారు. డేరాలు కట్టడం, భోజనాలు పెట్టడం ఇలాంటివాటికే కాకుండా అదనంగా కూడా వసూలు చేస్తారు. టీడీపీలో కూడా ఇలా మహానాడులు, మినీనాడులు పేరు చెప్పేది. ఊరుమీద పడేది. ఇదేమిటన్నది 1987వరకు నాకు అర్థం కాలేదు. ఆ ఏడాది రామారావు గారు అలా విజయవాడలో జరిపిన మహానాడు కోసం వసూలు చేసిన మొత్తం తన ముందు హుండీలో వేయండి అది ఎవరికీ ఇవ్వవద్దు, నా స్వాధీనంలో ఉంచుకుంటాను అని ప్రకటించారు. అందరూ హుండీలో వేశారు. లెక్కిస్తే మహానాడు ఖర్చులు పోను 60 లక్షల రూపాయలు మిగిలింది. అంటే అంతకుముందు మహానాడుల సందర్భంగా మిగిలిన డబ్బుకు లెక్కా జమా లేదు. ఆ 60 లక్షలు పెట్టి గండిపేటలో పార్టీ ఆఫీసు కొన్నారు. మరి అంతకుముందు వసూలు చేసిన డబ్బులు ఏమైనట్లు? డబ్బుతో ముడిపడిన రాజకీయాలు అలా ఉంటాయి అని చెప్పడానికే ఇదంతా ఉదాహరణగా చెప్పాను. అంతకుముందంతా బాబే మహానాడులను నిర్వహించారా? సందేహమేముంది. వందశాతం కరెక్ట్ అది. 1989లో మహానాడును హైదరాబాదులో నేను స్వయంగా నిర్వహించి దాంట్లో 35 లక్షలు మిగిల్చి ఆ మొత్తాన్ని రామారావు గారికి ఇచ్చాను. మహానాడుకు నా ఆధ్వర్యంలో పెట్టిన ఖర్చు 15 లక్షలు. దాతలిచ్చిన దాన్ని పేర్లతో సహా తెలిపి ఆయన ముందు పెట్టాను. పోలవరం నిజంగా చంద్రబాబు కలేనా? పోలవరానికి సంబంధించిన ముఖ్యమైన విషయం ఉంది. దేవేగౌడ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టుపై ఒక సమావేశం జరిగింది. వడ్డే వీరభద్రరావు అనే టీడీపీ ఎమ్మెల్యే ఆ సమావేశానికి హాజరయ్యారు. జలవనరుల మంత్రి, ప్లానింగ్ శాఖ మంత్రి, ప్లానింగ్ కమిషన్ చైర్మన్ మధుదండావతే, ఎర్రన్నాయుడు, ఇంకా ప్లానింగ్, ఫైనాన్స్ శాఖ కార్యదర్శులతో ప్రధాని మీటింగ్ పెట్టారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంచనాలు, వాటిలో మార్పుల గురించిన వివరాలు పంపించమని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని (బాబు సీఎం) అడుగుతున్నాం కానీ ప్రభుత్వం నుంచి మాకు ఇంతవరకు ఎలాంటి స్పందనా అందలేదు. మీరు వెంటనే ఆ వివరాలు పంపిస్తే ప్రాజెక్టు మంజూరు చేయడానికి నేను సుముఖంగా ఉన్నాను అని ఆరోజు ప్రధాని దేవేగౌడ స్వయంగా ప్రకటన ఇచ్చారు. ఆ నాటి మీటింగులో ఎర్రన్నాయుడు కూడా ఉన్నారు. ఆ తర్వాత తొమ్మిదేళ్లు బాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి పోలవరం ఎవరి కలో? లోకేశ్‌ను ఎమ్మెల్సీ చేయడం, మంత్రి పదవి ఇవ్వడంపై మీ అభిప్రాయం? దాంట్లో ఏముందండీ, అది మన సొంత వ్యవహారం కదా. ఎన్టీఆర్ పుత్రులకు పదవి ఇవ్వడం వారసత్వమైనప్పుడు లోకేశ్‌ది వారసత్వం కాదా? ఎన్టీ రామారావు దగ్గర నుంచి మేం తీసేసుకోవచ్చు. కానీ మా దగ్గర నుంచి ఇంకొకరు తీసేసుకోకూడదు. అదీ విషయం. బాబు మాట మాట్లాడితే నేను నిప్పు, నిజాయితీ... అంటుంటారు కదా? ఓటుకు కోట్లు కేసు మాటేంటి? ఆ తర్వాతే కదా హైదరాబాద్ నుంచి పారిపోయింది? (దగ్గుబాటితో ఇంటర్వూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/PYhkkj https://goo.gl/eBKHq8 -
ఓటుకు కోట్లు కేసులో శిక్ష ఖాయం
కొమ్మినేని శ్రీనివాసరావుతో తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబేకాదు.. ఓటుకు కోట్లు కేసులో భాగమై ఉన్న ప్రతి ఒక్కరికి ఏ విధమైన శిక్ష పడాలో అది పడే తీరుతుందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి, తెరాస సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పారు. ఈ కేసులో ప్రభుత్వానికి భాగస్వామ్యం లేదని, అధికారులు వారి పనివారు చేసుకుపోతున్నారని, విచారణ ముగిసేసరికి ఎవరూ శిక్షనుంచి తప్పించుకోలేరని మంత్రి స్పష్టం చేశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు అని కేసీఆర్ అన్నప్పటికీ బాబు నింపాదిగా ఉన్నారు కదా అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ నేరం చేసిన వారిపై అధికారులు చట్టపరిధిలో ఏ చర్య తీసుకోవాలో ఆ చర్యను తప్పకుండా తీసుకుంటారంటున్న పోచారం శ్రీనివాసరెడ్డి అభిప్రాయాలను ఆయన మాటల్లోనే.. ఎరువులను పూర్తిగా ఫ్రీగా ఇవ్వాలనే ఆలోచన ఎలా వచ్చింది? రైతుపట్ల కేసీఆర్‌కి ఉన్న అభిమానమే దానికి కారణం. పూర్తిగా కేసీఆర్ ఆలోచనే ఇది. వేసవిలో, వర్షాకాలంలో ఎంత పరిమాణంలో అంటే ఎన్ని లక్షల టన్నుల ఎరువులు అవసరం అవుతాయి అని మమ్మల్ని అడిగారు. దీనిపై ఎవరూ సూచనలు, సలహాలు ఇవ్వలేదు. కేసీఆర్ మనసులోంచి వచ్చిన ఆలోచన ఇది. దాన్నే విధానంగా ప్రకటించారు. ఉచిత ఎరువుల ఆలోచనను కేసీఆర్ వాడుకున్నారన్న కాంగ్రెస్ ఆరోపణ? కేసీఆర్ రైతు పక్షపాతి అనేది అందరికీ తెలుసు. రైతుల పరిస్థితిని బాగు చేయాలని, బంగారు తెలంగాణలో వారిని భాగస్వాములను చేయాలని, ఈ అప్పులనుంచి బయటకు రావాలని ఆలోచించే వ్యక్తి కాబట్టి ఎవరో చెబితే ఆ పాఠాలు తీసుకోవలసిన అవసరం లేదు. రైతులకు ఉచిత ఎరువులందిస్తామని దేశ చరిత్రలో ఇంతవరకు ఏప్రభుత్వమూ ప్రకటించలేదు. మొత్తం పంట పండించే భూమి విస్తీర్ణానికి ఎరువులు అందించే బాధ్యత నాది.. ఒక రూపాయి కూడా రైతు ఎరువుల కోసం పెట్టాల్సిన పనిలేదు అని దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్. రైతులందరికీ ఉచిత ఎరువులు ఇస్తారా? గ్రామ రైతుసభలను ఏర్పాటు చేస్తాం. గ్రామ రైతు సంఘం అధ్వర్యంలో మా అధికారులు కలిసి గ్రామంలో ఉన్న రైతుల వివరాలను సేకరిస్తారు. రైతులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఎకరాలు ఉన్నాయి అని లెక్కపెడతారు. రైతుల భూమి పెరగదు. చేతులు మారుతుంది. భూమి రికార్డులను కంప్యూటర్లో ఎక్కించి ఏ గ్రామంలో ఎంతమంది రైతులున్నారో డేటా తీసుకుంటాం. ఉదా: ఒక గ్రామంలో రెండు వేల ఎకరాలుంది. ఒక ఎకరాకు నాలుగు వేల చొప్పున మొత్తం 80 లక్షల రూపాయలు వారికి ఆన్లైన్లో పంపిస్తాం. పదెకరాలు, వందెకరాలు ఉన్న రైతుకు కూడా ఉచితంగా ఇస్తారా? తెలంగాణలో మొత్తం 55 లక్షల మంది రైతులున్నారు. వీరందరికీ కలిపి ఒక కోటీ 5 లక్షల ఎకరాల భూమి ఉంది. అంటే తెలంగాణలో ఎకరం నుంచి రెండెకరాల భూమి ఉన్న సన్నకారు, చిన్నకారు రైతులే 95 శాతం పైగా ఉన్నారు. 5 శాతం మంది మాత్రమే పెద్ద రైతులున్నారు. చిన్నా, పెద్దా అందరికీ ఈ ప్రయోజనం వస్తుంది. రైతుల్లో మెజారిటీ చిన్నకారు, సన్నకారు కాబట్టి చిన్నా పెద్దా తారతమ్యాల్లేకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకీ ఈ విధానం అమలు చేస్తాం. రైతుకు నాలుగెకరాలు ఉంటే 16 వేల రూపాయలను మే నెలకు ముందే అతడి ఖాతాలో వేస్తాం. రుణమాఫీ ఫెయిలైనందుకే ఈ ఎరువుల స్కీమ్ తెస్తున్నారని విమర్శపై? భారతదేశంలో 17 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వ పైకంతో రైతులకు రుణమాఫీ చేసిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే. రుణ మాఫీ వైఫల్యం కానే కాదు. 10 శాతం బ్యాంకులు సకాలంలో మద్ధతు ఇవ్వకపోవడమే మొదట్లో కాస్త ఇబ్బంది పెట్టిందంతే. నిజంగా తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారు. ఒక సంవత్సరం కొంత ఆలస్యమై బాధపడ్డారు. తొలి సంవత్సరం అనుకున్న ప్రకారం వారి ఖాతాలోకి జమ చేశాం. తెలంగాణలో రాజకీయ నాయకులు సంతోషంగా లేరు కానీ రైతులయితే ప్రభుత్వంపట్ల సంతోషంగానే ఉన్నారు. రాజకీయంగా వీక్ అవుతున్నందుకే ఉచిత ఎరువులు ఇస్తున్నారా? రాజకీయంగా మేం వీక్ అవుతున్నామా? ఈ మధ్య కాలంలో జరిగిన ఏ ఎన్నికల్లో అయినా సరే డిపాజిట్లు రాకుండా పోయింది ఎవరికి? ప్రజల తీర్పు ఏవిధంగా ఉందనేది స్పష్టమైపోయింది. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను లాగేసుకోవడం అనైతికం కాదా? శాసనసభలో హోదా ఉన్న వ్యక్తులు బలవంతంగా ఫిరాయింపులకు రారు. ప్రభుత్వ పరిపాలనకు ఆకర్షితులయ్యే వస్తారు. పార్టీ పట్ల ప్రేమ, నాయకుడి పట్ల విశ్వాసం, అభిమానం ఇవే ఇతరులు టీఆర్ఎస్లోకి రావడానికి కారణం. ప్రభుత్వ పరిపాలన ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంది. ప్రజల సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థవంతంగా చేస్తుంది అనే నమ్మకమే ఇతర పార్టీ నేతలను ఆకర్షిస్తోంది. తెలంగాణలో విస్తరణకు బీజేపీ ప్రయత్నిస్తోంది కదా? హైదరాబాద్‌లో వారికున్న ఆ అయిదు సీట్లు దక్కించుకుంటే వాళ్లకంటే గొప్పవాళ్లు ఉండరు. బీజేపీ కేంద్రనాయకులే వచ్చి ఊరూరా తిరిగినా ఇక్కడ వారికి ఒరిగేదేమీ ఉండదు. గ్రామగ్రామానా గట్టిగా పునాదిని పెంచుకున్న పార్టీ టీఆర్ఎస్. ప్రస్తుతం అసెంబ్లీలో 119 స్థానాలు ఉన్నాయికదా. వచ్చే ఎన్నికల్లో రెండు మూడు స్థానాలు తప్పితే 110 సీట్లను ఢంకా మోగించి మరీ మేమే గెలుస్తామని చెబుతున్నాను. నేను చెబుతున్న సంఖ్యను ఈరోజు మీరు రాసుకోండి. అంత విశ్వాసం మాకు ప్రజలపై ఉంది. తెలంగాణను పాకిస్తాన్ చేస్తారా అని వెంకయ్యనాయుడే అనేశారు? కులాల మీద, మతాలమీద రిజర్వేషన్ చేయవద్దు, సామాజిక ఆర్థిక స్థితిగతులపై ఆధారపడి రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయనే అన్నారు. తాను చెప్పిందే మేం చేస్తున్నాం. తేడా ఎక్కడుంది? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి? ఇప్పుడున్న సీట్లలో సగం సీట్లు కాపాడుకుంటే చాలు. అదే గొప్ప వారికి. మాకు 110 సీట్లు వస్తాయన్నాను. మిగతా పది స్థానాల్లో రెండు, మూడు మజ్లిస్‌కి వెళితే ఆ మిగిలిన ఆరేడు స్థానాలే కాంగ్రెస్‌కు వస్తాయి. హైదరాబాద్‌లో కూర్చుని మాట్లాడితే కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల వద్దకు వెళ్లి చూస్తేనే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతుంది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని కోదండరామ్ అంటున్నారు? పాదయాత్ర చేసినంత మాత్రాన, నాలుగూళ్లు తిరిగినంత మాత్రాన ప్రజ లకు విశ్వాసం కలగాలి కదా. నాయకుడి పట్ల, ప్రభుత్వం పట్ల, పరిపాలన పట్ల ప్రజలకు విశ్వాసం కలిగితే మీకు ఎన్ని చెప్పినా ప్రయోజనం లేదు. ప్రజలకు టీఆర్ఎస్ పట్ల, కేసీఆర్ పట్ల అచంచల విశ్వాసం ఉంది. ఈ నేపథ్యంలో ఎవ్వరూ ఏమీ చేయలేరు. మాకు జరిగే నష్టమూ లేదు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు అని కేసీఅర్ అన్నారు. కానీ బాబు నింపాదిగా పనిచేసుకుంటున్నారు.? చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దీంట్లో ప్రభుత్వం భాగస్వామ్యం లేదు. అధికారులు వారి పని వారు చేసుకుని పోతున్నారు. ఈ కేసులో ఎవరికి ఏ విధమైన శిక్ష పడాలో అది పడే తీరుతుంది. ఇంతకుమించి నేను వివరించలేను కూడా. ప్రతినిత్యమూ తెలంగాణ బిడ్డలు 15మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. తెలంగాణ వ్యక్తులుగా మేం దీన్ని భరించలేకపోతున్నాం. దయచేసి మీ నోటి నుంచి జై తెలంగాణ అని ఒక్క మాట అనండి చాలు. నేను ఎక్కడికీ పోను టీడీపీలోనే ఉంటాను అని చంద్రబాబుతో అన్నాను. ఆమాట అనడానికి బాబు ఒప్పుకోలేదు. బిడ్డల ఆత్మబలిదానం భరించలేకపోతున్నాను. నేను పార్టీ మారతాను అని చెప్పి రాజీనామా లేఖ రాసి మరీ 2010లో బయటకు వచ్చాను. (పోచారం శ్రీనివాసరెడ్డితో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/5o46Xk https://goo.gl/0UDV02 -
రాజధాని విజన్ గ్రాఫిక్స్‌లోనేనా?
కొమ్మినేని శ్రీనివాసరావుతో దర్శకరత్న దాసరి నారాయణరావు రాజధానిని గ్రాఫిక్స్‌లో అందంగా చూపించడం మంచిదే కానీ అమరావతిని మన తరంలో చూడలేమన్నదే వాస్తవమని ప్రముఖ దర్శకుడు, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అందమైన, గౌప్పదైన రాజధానిని నిర్మిస్తామన్న సంకల్పం, విజన్ మంచిదే కానీ ఒక్క రాజధానిమీదే పూర్తి కేంద్రీకరణ చేస్తే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అది మేలు చేయదన్నారు. చేసిన వాగ్దానాలను చంద్రబాబు నెరవేర్చలేదు కాబట్టే వచ్చే ఎన్నికల్లో ప్రభు త్వంపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉంటుందన్నారు. ముద్రగడ అనే ఉద్యమనేతను కార్నర్ చేసి, ఆసుపత్రిలో పడేసి, టీవీ చూడనీకుండా, పేపరు కూడా చదవనీకుండా, ఎవరూ రాకుండా, కలువకుండా చేసి మానసిక హింసకు గురిచేయడం హేయమైన చర్య అన్నారు. విభజన తనను బాగా గాయపర్చింది కానీ, విభజనానంతరం తెలంగాణలో చాలాబాగా పనిచేస్తున్నారని కితా బిచ్చిన దాసరి నారాయణరావు అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. సినీరంగం.. రాజకీయ రంగం రెండింట్లో భాసిల్లారు. మీ అనుభూతి ఏంటి? సినీరంగం నా ఊపిరి. ఎందుకంటే 9వ ఏట రంగస్థలం ఎక్కాను. అప్పట్నుంచి నటుడిగా, రచయితగా దర్శకుడిగా కొనసాగుతూ వచ్చాను. ఇక రాజకీయం అంటారా. యాదృచ్ఛికంగా జరిగింది. రాజకీయాల్లోకి వస్తానని, రావాలని ఎప్పుడూ అనుకోలేదు. ‘కమ్ బ్యాక్ టు పవర్’ అనే డాక్యుమెంటరీ చిత్రం తోడుగా ఇందిరాగాంధీతో తొలి పరిచయం మొదలుకుని రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ వరకు రాజకీయాల్లో నా ప్రవేశం పూర్తిగా యాదృచ్ఛికంగానే జరిగిందని చెప్పాలి. రాజ్యసభకు రావడం, కేంద్ర మంత్రిగా పనిచేయడం అన్నీ యాక్సిడెంటల్‌గా జరిగినవే. మీరు తీసిన తాతామనవడు గొప్ప స్ఫూర్తినిచ్చిన చిత్రం కదా? ఆ చిత్ర విజయమే దాని స్ఫూర్తి ఎంత గొప్పదో చెబుతుంది. దాని విజయం మామూలు విజయం కాదు.. రెండు కలర్ పిక్చర్లు.. ఇద్దరు అగ్రనటుల సినిమాల మధ్య విడుదలైంది. ఎన్టీఆర్ చిత్రం దేశోద్ధారకుడు, నాగేశ్వరరావు చిత్రం బంగారుబాబు. రెండు సినిమాల మధ్య ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమా విడుదలై 350 రోజులు ఆడిందంటే.. అది ఎలాంటి సందేశాన్ని ఇచ్చిందో నేను మళ్లీ ప్రత్యేకంగా చెప్పాలా? ఎన్టీఆర్, చంద్రబాబు.. ముఖ్యమంత్రులుగా వీరిపై మీ అంచనా? ఎన్టీరామారావుది విశిష్టమైన వ్యక్తిత్వం. సినిమాల్లోనూ, రాజకీయాల్లో కూడా తనది ప్రత్యేకతే. ఆయన నిజంగా బతికుంటే భారతదేశానికి ప్రధాని అయి ఉండే వారు. చాలా స్వచ్ఛమైన వ్యక్తి. కడుపులో ఏమీ ఉండదు. దాచుకోడు. ఓపెన్‌గా ఉంటాడు. ఆ ఓపెన్నెస్సే రాజకీయంగా ఆయన్ను దెబ్బతీసింది. ఇక బాబు గురించి ఇవ్వాళ మాట్లాడనవసరం లేదు. అవసరం వచ్చిన రోజు తప్పక మాట్లాడతాను. ముద్రగడను పలకరించడానికి వెళితే కూడా మిమ్మల్ని అరెస్టు చేశారు కదా? మనం ఇండియాలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా, కిర్లంపూడిలో ఉన్న మని షిని చూడ్డానికి ఇన్ని నిబంధనలు, ఆంక్షలు ఉన్నట్లయితే.. అసలు ఏం జరుగుతోంది క్కడ? నిరంకుశ రాజ్యంలో ఉన్నామా. దేశంలో వాక్సా్వతంత్య్రం, భావస్వా తంత్య్రం, స్వేచ్ఛ అన్నీ పోయాయా? వ్యక్తిగతంగా బాబు మీద నాకే వ్యతిరేకతా లేదు. కానీ ముద్రగడను ఆ స్థాయిలో ట్రీట్ చేయడానికి ఏ శక్తులు బాబు వెనక పని చేశాయో నాకు తెలీదు కానీ ఇప్పటికీ నాకు బాధగానే ఉంది. ఒక మనిషిని ఆసుపత్రిలో పడేసి టీవీ చూడనీకుండా, పేపరు కూడా చదవనీకుండా, ఎవర్నీ చెంతకు రానీయకుండా, హింసాత్మకమైన పరిస్థితిని సృష్టిం చడం భరించలేకున్నాను. ఒక వ్యక్తిని కార్నర్ చేసి, మానసికంగా హింసించడానికి నేను పూర్తిగా వ్యతిరేకిని. మీరు రిజర్వేషన్ ఇవ్వండి. ఇవ్వకపోండి. దాని గురించి నేను మాట్లాడను, వ్యక్తిగతంగా ఒక పోరాటం చేస్తున్న ఉద్యమకారుడిని ఇలా చేసేస్తే ఎలా అర్థం చేసుకోవాలి? మహాత్మాగాంధీ ఉద్యమం చేసినప్పుడు బ్రిటిష్ వాళ్లు మన దేశ స్తులు కారు. మరి వాళ్లేం చేసి ఉండాలి? ఉద్యమానికి మీరు స్వేచ్ఛనివ్వాలి. పాద యాత్రకు వెళతానంటే నేను పంపించనంటే ఎలా? అమరావతి, భూసేకరణపై మీ అభిప్రాయం? అమరావతిలో రాజధాని కట్టడమనేది చాలా అవసరం. హైదరాబాద్ వంటి రాజ ధానిని కోల్పోయిన తర్వాత అంత గొప్ప రాజధానిని మళ్లీ నిర్మించుకోవడం చాలా అవసరం. ప్రభుత్వం దాన్ని చేపట్టి పూర్తి చేయాలి కూడా. కాకపోతే రెండు పంటలు పండే ప్రాంతాన్ని బీడుభూములు చేసి, బలవంతంగా లాక్కునికూడా మేం లాక్కోలేదు వాళ్లే మాకు ఇచ్చారు అని చెబుతారా. ఇచ్చిన వారేమో బక్కరైతులు లాగేసుకున్నారు అని వాళ్లు సామాన్యంగా చెప్పగలరా.. పవర్ ఈజ్ మైటీ. అధికారం ముందు అనా మకులు ఏం మాట్లాడగలరు? కానీ నా ఉద్దేశంలో అమరావతిని మన తరంలో చూడలేం. చాలా సమయం పడుతుంది. దానికి సంబంధించి ఇంకా ఎన్నో వనరులు రావాలి. నిధులు రావాలి. కాగితాలమీద సీజీ వర్క్‌లో ఇది అమరావతి అని గ్రాఫిక్సులో చాలా అందంగా చూపించుకోవచ్చు. కానీ అవన్నీవస్తే అమరావతి చాలా గొప్ప రాజ« దాని అవుతుంది. ఆయన కల, సంకల్పం, విజన్ మంచిదే. నేను తప్పు పట్టను. కానీ పూర్తి కేంద్రీకరణ ఒక రాజధానిపైనే పెట్టేస్తే అది రాష్ట్రాభి వృద్ధికి ఎలా ప్రయోజనం చేస్తుంది? బాబు చేసిన వాగ్దానాలు, రుణమాఫీ వంటి వాటిపై మీ అభిప్రాయం? ఒక్కమాటలో చెబుతా. చేసిన వాగ్దానాలను బాబు నెరవేర్చలేదు. రాజశేఖరరెడ్డితో మీ అనుబంధం? నాపట్ల ఆయనకు ఎంతో గౌరవం ఉండేది. కలసి పని చేశాం. అలాంటి లీడర్ని నేను చూడలేదు. నమ్మిన మనిషికి ప్రాణం ఇస్తారు. మంచివాడా, చెడ్డవాడా, గతంలో తప్పులు చేశాడా, ఒప్పులు చేశాడా అనే విషయం పక్కనబెట్టి తనను నమ్మి వచ్చినవాడికి ప్రాణం ఇచ్చేవారు. అందుకే అంత విశ్వాసం గల మనుషులు ఆయనకు ఏర్పడ్డారు. ఏదైనా చేయాలి అనుకుంటే ఏ రూల్, ఏ సెక్షన్ అడ్డువచ్చినా సరే.. చేయాలనుకుంటే చేసేస్తారు. ఒకరిని అడగడం, చర్చిం చడం, దాన్ని పెండింగులో పెట్టడం లాంటివి చేయరు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ పనితీరుపై మీ అభిప్రాయం? వండర్ఫుల్ పర్సన్. గత ఎన్నికల్లో తాను నెగ్గకపోవటం అనేది ఆయన పార్టీకి చాలా బలమైన పునాదిని కల్పించిందనుకుంటున్నాను. ఇప్పుడాయనలో చాలా పరి ణతి కనిపిస్తోంది. ఏ అంశంమీద మాట్లాడినా స్టడీ చేసి పూర్వాపరాల తోటి, గణాంకాల తోటి చెప్పగలిగిన ప్రతిపక్ష నేత జగన్. ఇది భవిష్యత్తులో చాలా మంచి చేస్తుంది. జగన్ వర్సెస్ బాబు.. దాసరి ఎటు..? దాసరి ఎటు అనేది తర్వాత చెబు తాను. నడుస్తున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. దాన్ని ఎవరు క్యాష్ చేసుకోగలుగుతారు అనే అంశంపైనే వచ్చే ఎన్నికలు ఆధారపడి ఉంటాయి. విభజన తర్వాత ఆంధ్ర ఎలా ఉంది. కేసీఆర్ ఎలా ఉన్నారు? విభజన సమయంలో ఫీలయినమాట వాస్తవం. కానీ విభజన జరిగిన తర్వాత తెలంగాణలో కేసీఆర్ చాలా బాగా పనిచేశారు. కేటీఆర్ ఆయనకు చాలా పెద్ద సపోర్టర్. చిన్నవయసులోనే తనలో పెద్ద పరిపక్వత వచ్చేసింది. ఇక తెలంగాణలో కేసీఆర్ చాలా తెలివిగా పగ్గాలు పట్టుకుని వెళుతున్నారు. కేంద్రంలో మోదీ పాలనపై మీ అభిప్రాయం? పెద్ద నోట్ల రద్దు వచ్చేంతవరకు నాకు ఆయన పట్ల చాలా గౌరవం ఉండేది. కింది వర్గాలనుంచి వచ్చి ఒక స్థాయిని అందుకుని ఇవ్వాళ భారతదేశాన్నే పాలిస్తున్నారు. కానీ పెద్దనోట్ల రద్దు తొందరపడి చేయలేదు కానీ అవగాహనా రాహిత్యంతో చేశారంటాను . దీనివల్ల సాధించింది ఏమీ లేదు కానీ, పోగొట్టుకున్నది ఎక్కువ. (దాసరి నారాయణరావుతో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కోసం క్లిక్ చేయండి) -
రుణమాఫీ, హోదా జిమ్మిక్కు...!
మనసులో మాట కొమ్మినేని శ్రీనివాసరావుతో రిటైర్డ్ ఐఏఎస్ పీవీఆర్కే ప్రసాద్ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం, తెస్తామని చెప్పి తేకపోవడానికి పాలకుల్లో రాజనీతిజ్ఞత లేకపోవడమే కారణమంటున్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, దివంగత ప్రధాని పీవీ నరసింహారావు మీడియా సలహాదారు పీవీఆర్కే ప్రసాద్. రెండు తెలుగు ప్రాంతాల మధ్య వాతావరణాన్ని ఇంతగా కలుషితం చేసి విభజన చేయటం సరికాదంటున్నారు. రుణమాఫీలు అనేవి ఎక్కడ జరిగినా అవి రాజకీయ జిమ్మిక్కులేనని, మానవీయ కోణంతో కూడిన అభివృద్ధి అవసరమే కానీ అభివృద్ధినే మింగేసే మానవీయ కోణం సమస్యాత్మకం అవుతుందని చెబుతున్నారు. ఓటుకు కోట్లు కేసులో తప్పు చేసి ఉంటే తప్పకుండా శిక్ష పడాల్సిందే అంటున్న పీవీఆర్కే ప్రసాద్ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. పీవీ నరసింహారావును కాంగ్రెస్ ప్రధానమంత్రిగా ఎలా ఎంపిక చేసింది? రాజకీయంగా అప్పటికే పీవీ అస్త్రసన్యాసం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయదల్చుకోలేదు. రాజ్యసభలో సీటు ఇచ్చే పరిస్థితి కనబడలేదు. కనబడితే మర్యాద ఇస్తున్నారు తప్పితే విడిగా ఆయన్ని పలకరించేవారు లేకుండా పోయారు. మొదట్నుంచి ఈయనకు గ్రూపు లేదు. తనతో ఉండే ఎంపీలూ లేరు. తన ఓటును తనే వేసుకోవడం పద్ధతి కాదు. ఇలాంటి స్థితిలో రాజీవ్ గాంధీ హత్య జరిగింది. ఎవరిని ప్రధాని చేయాలనేది పెద్ద సమస్య. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద పదవికి అర్హత ఏమంటే అందరికీ ఆమోదనీయవ్యక్తి కంటే అతి తక్కువ అభ్యంతరాలు ఉన్న వ్యక్తి కావాలి. పీవీ అంటారా.. వెనకాల ఒక మనిషీ లేడు. ఆయనతో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసిపడేయవచ్చు. గ్రూపు అనేదే లేదు. పైగా పెద్దవాడు. సీనియర్ పర్సన్, వివాదరహితుడు కాబట్టి ప్రధాని పదవిలో పెడదాం అని నిర్ణయించారు. కానీ పదవిలోకి వచ్చాక చూస్తుండగానే బలపడటమే కాక, దేశానికే ఒక దశా, దిశను ఇచ్చి బాగా నిర్వహిస్తూ మైనారిటీ ప్రభుత్వంలోనూ సంస్కరణలు అమలు చేస్తూ గాంధీయేతర కుటుంబం నుంచి వచ్చి అయిదేళ్లు పాలన సాగించారు. విభజనపై మీ వ్యాఖ్య ఏమిటి? విభజన అనేది అది గత జలసేతు బంధనం. కానీ చెడు వాతావరణం కల్పించి విభజన చేయాల్సి ఉండింది కాదు. 1960ల చివరలో వచ్చిన ఆంధ్రా ఆందోళన కాలంలోనే విభజన చేసి ఉంటే ఏ సమస్యా ఉండేది కాదు. ఆ తర్వాత అయినా ఇరువర్గాలనూ పిలిచి కూర్చోబెట్టి వేరు చేసి ఉంటే సరిపోయేది. ఇవేమీ చేయకపోగా వాతావరణాన్ని ఇంతగా దిగజార్చి చేయడం అనవసరం. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మాట తప్పారు కదా? ఆనాడు వాగ్దానం చేసిన వారికి నిబంధనల ప్రకారం అలాంటిది లేదనే విషయం తెలియదా? రాజనీతిజ్ఞత లేకపోవడమే దీనంతటికీ కారణం. నిజంగా హోదా ఇవ్వదలుచుకుంటే ఏ రూల్స్ కూడా అడ్డురావు. ఇది మంచిది ఇది చెయ్యాలి అనుకున్నప్పుడు ఎందుకు చేస్తున్నాం అనే ప్రశ్న వస్తుంది. ఏదో ఒక లబ్ధి కోసమే ఏదైనా చేస్తారు. నిజంగా ఆ లబ్ధే వస్తే.. హోదా ఇస్తే ఏమి, లేకపోతే ఏమి? హోదాకు సమానమైన ప్రయోజనం పూర్తిగా ఇవ్వగలిగితే హోదా అవసరం లేదు. కానీ ప్రత్యేక హోదా అనేది ఒక సెంటిమెంట్ సమస్య అయి కూర్చుంది. నిజంగా హోదావల్ల వచ్చేవన్నీ మామూలుగా వస్తే ఇక హోదా అవసరం ఎందుకు? కానీ హోదాతో పని లేని ప్రయోజనాలు ఇస్తున్నారా, ఇవ్వలేదా అన్నదే ఇక్కడ పాయింటు. పలు రాష్ట్రాలకు హోదా కల్పించాక అవి ఎంతో లబ్ది పొందాయి కదా? ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించిన అర్హత ఆంధ్రప్రదేశ్‌కు రాదు. సమస్య ఏమిటంటే హోదా వస్తుంది, ఇస్తామని చెప్పేశారు. ఇస్తామని డిక్లేర్ చేసినప్పుడు ఆ మాటకు అందరూ కట్టుబడాలి. కానీ అధికారంలో లేనప్పుడు చేసే వాగ్దానాలకు, అధికారంలోకి వచ్చాక పాలనా పరంగా అమలు చేయాల్సి వచ్చేటప్పటికీ చాలా తేడా ఉంటుందన్నది ఇక్కడ మనకే కాదు రేపు అమెరికాలో వాళ్లకు కూడా తెలుసు. ఎందుకంటే పరిస్థితులు అలాంటివి. పెద్ద నోట్ల రద్దుపై మీ అభిప్రాయం? దేశానికి మంచిది. కానీ ఎవరికీ ఇబ్బంది లేకుండా జరుగుతుందన్నది మాత్రం వాస్తవం కాదు. మనదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ అనేది గ్రామస్థాయి వరకు ఇంకా పూర్తిస్థాయిలో వెళ్లలేదు. ప్రభుత్వం ఏదో ఇస్తామంటే వెళ్లి ఖాతాలు తెరిచారు తప్పితే ఖాతాలు ఆపరేట్ చేసుకోవడానికి తీసుకునేవారు లేరు. పైగా నగదు లావాదేవీలపైనే చాలామంది ఆధారపడి ఉన్నారు. వాటిని కాస్త సరళీకరించి, జనానికి ఇబ్బందులు లేకుండా చేయగలిగితే నోట్ల రద్దు విజయవంతమవుతుంది. దేశంలో కోట్లమంది పేదలున్నారు, ఇబ్బంది పడుతున్నారు కదా? ఇబ్బందిపడుతున్నారు. ఇంత భారీ మార్పు జరిగినప్పుడు తప్పకుండా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ దానికి మూల్యం అన్ని రాజకీయ పార్టీలు చెల్లించాల్సి వస్తుంది కూడా. ఆర్థిక వ్యవస్థ అంతా కుదేలైపోయింది కదా? ఎక్కడ కుదేలైంది? ఏమీ కాలేదు. నాలుగు రోజులు గడిచేసరికి కార్డు ఎలా ఉపయోగిస్తాం, చెక్కు ఎలా రాస్తాం అని తెలుసుకుంటున్నారు. మన ప్రతిఘటన అంతా ఎక్కడ వస్తోందంటే.. ఖాతా ఉన్నవాడు నగదు తీసుకుని ఇద్దామనుకుంటున్నాడు తప్పితే చెక్కు ఇచ్చి తీసుకుందాం అనుకోవడం లేదు. ఏపీ, తెలంగాణలో రుణమాఫీలపై మీ అభిప్రాయం? ఏపీలోనే కాదు, తెలంగాణలోనే కాదు. ఏ రాష్ట్రంలో ఇలాంటివి జరిగినా సరే ఇలాంటివి రాజకీయ జిమ్మిక్కులే. రుణమాఫీ వంటివి ఆర్థిక వ్యవస్థకు మంచివి కాదు. అప్పు అంటే అప్పేనండీ. ఒకసారి నువ్వు అçప్పు తీసుకున్నాక, దాన్ని చెల్లించాలి. పంట పోతే రుణం మాఫీ చేయాలి. అంతే కానీ ఎన్నికలప్పుడు రుణమాఫీలు ఏమిటి? బాబు వంటి సీనియర్ నేత కూడా రుణ మాఫీపై వాగ్దానం చేశారు కదా? ఆయన ఎంతో డెవలప్ చేసానని చెప్పుకుంటున్న హైదరాబాద్‌లోనే సీట్లు రాకపోతే, గెలవాలంటే ఏదో ఒక ప్రయత్నం చేయాలి కదా. రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి జనంలోకి వెళ్లి గెలిచాక కొన్ని స్కీములు అమలు చేశారు. ఎలాంటి స్కీములు పెడితే ఎలాంటి వాళ్లు ఆకర్షితులవుతారో తెలిసింతర్వాత అందరూ అలాంటి స్కీములకు ప్రయత్నిస్తారు. ఒక విషయం గుర్తించాలి. మానవీయ కోణంతో కూడిన అభివృద్ధిని అన్ని రాష్ట్రాలూ అమలు చేస్తే మంచిదే. కానీ అభివృద్ధినే మింగేసే హ్యూమన్ ఫేస్ ఉంటే కష్టమైపోతుంది. ఓటుకు కోట్లుపై మీ వ్యాఖ్య? కెమెరాలలో జరిగిన ఘటనను, పద్ధతిని చూసినవారికి అక్కడేదో తప్పు జరిగిందనే అభిప్రాయం కలుగుతుంది. కానీ అది ఎంతవరకు, ఏ స్థాయిలో జరిగింది, ఎవరు చేయించారు అనేది చట్టమే నిర్ణయిం చాలి. అది ఇప్పటికే న్యాయ విచారణ ప్రక్రియలో ఉంది. అలాంటప్పుడు ఘటనలో ఉన్న వారినీ విమర్శించి, అటు చట్టాన్నీ విమర్శించే పని పెట్టుకోవడం సరైంది కాదు. కానీ తప్పు చేస్తే తప్పకుండా శిక్ష పడాల్సిందే. రెండు తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు మీద మీ వ్యాఖ్య? భవిష్యత్తు తప్పకుండా బాగానే ఉంటుంది. కనీసం అభివృద్ధి విషయంలో ఇద్దరూ పోటీపడుతున్నారు. చేద్దామని ప్రయత్నిస్తున్నారు. అదృష్టవశాత్తూ రెండేళ్ల క్రితం ఉన్న ద్వేషభావం ఇప్పుడు అంతగా లేదు. కొంతలో కొంత సర్దుకున్నారు. అభివృద్ధి చేసుకుంటూ పోతే ఎక్కడున్నా ఇబ్బంది లేదనే ఫీలింగు జనంలో ఉంది. ఉన్న పెట్టుబడులు పోవు. రెండుచోట్లా మదుపు పెట్టవచ్చు అనే అభిప్రాయం కూడా వచ్చేసింది. అందరూ పనిచేస్తే రెండు రాష్ట్రాలూ ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. (పీవీఆర్కే ప్రసాద్‌తో ఇంటర్వూ్య పూర్తి పాఠం కింది లింకులో చూడండి) https:// www. youtube. com/ watch? v= qMSpP7 kSmzo -
ఆ అన్న భరణమే ఈ చెల్లి జీవితం
మనసులో మాట: కొమ్మినేని శ్రీనివాసరావుతో మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజకీయాలంటే అసలు ఓనమాలు కూడా తెలియకున్నప్పటికీ, అనూహ్యమైన పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చానంటున్న మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి.. మహిళలు రాజకీయాల్లో ఎక్కడా వెనుకంజలో లేరు అంటున్నారు. చేవెళ్ల చెల్లెలిపై వైఎస్. రాజశేఖరరెడ్డి చూపిన అభి మానమే ఇంత స్థాయికి తీసుకొచ్చిందని కృతజ్ఞత చెబుతూనే, ఓదార్పు యాత్రను అధిష్టానం వ్యతిరేకించడంలో అందరి తప్పూ ఉండవచ్చంటున్నారు. వైఎస్సార్ ఉన్నప్పుడే తెలంగాణ విషయం చర్చల్లో ఉండి, తప్పకుండా ఇస్తారని మా అందరికీ తెలిసినప్పటికీ రెండేళ్లకు ముందే నిర్ణయం ప్రకటించి ఉంటే రెండు రాష్ట్రాల్లోనూ పరిస్థితి అనుకూలంగా ఉండేదని అంటున్న సబితా ఇంద్రారెడ్డి అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... రాజకీయాల మీద ఆసక్తి ఎలా కలిగింది? పెళ్లి తర్వాతే రాజకీయాలు అంటే ఏమిటో తెలిసింది. అంతకుముందు సర్పంచ్ అంటే ఏమిటో కూడా తెలీదు. రాజకీయాలకు సంబంధంలేని కుటుంబం మాది. ఆయనతో జీవితం మొదలైన తర్వాతే రాజకీయం అంటే ఇదీ అని తెలిసింది. మీ భర్త ఉన్నట్లుండి ప్రమాదంలో పోయాక మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? ఆయన స్థానంలో రాజకీయాల్లోకి రావాలనికానీ, వస్తాననికానీ అనుకోలేదు. పైగా ఆయన పోయిన షాక్‌లో ఉన్నాను. ఎవరొచ్చి అడిగినా రానని చెప్పేదాన్ని. టీడీపీ నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి చనిపోయారు కాబట్టి దాన్ని వదిలి పెట్టడం బాగోదనుకున్నాను. ఈ నేపథ్యంలో రాజశేఖరరెడ్డి అన్న నన్ను పలకరించడానికి ఇంటికి వచ్చారు. ‘అమ్మా రాజకీయాలు అనేవి తర్వాతి సంగతి. కానీ ఇంద్రారెడ్డి కొన్ని రోజులే అయినా, నాకు దగ్గరగా వచ్చాడు. నా కుడిభుజం కోల్పోయినట్లుగా ఉంది. నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఒక సొంత చెల్లెలుగా నీ బాగోగులు చూసుకుంటాను’ అన్నారు. భగవంతుడు ఒక విధంగా అన్యాయం చేసి మరొక రకంగా న్యాయం చేస్తున్నాడని అనుకున్నాను. టీడీపీ చీలిపోయినప్పుడు ఇంద్రారెడ్డి ఏవిధంగా ఆలోచించారు? పార్టీలో తీవ్ర పరిణామాలు జరుగుతున్నారుు ఏం చేయాలని ఆయన ఇంటికొచ్చి నాకు చెప్పారు. చంద్రబాబువైపు వెళితే హోంమంత్రి పదవి అలాగే ఉంటుంది. ఎన్టీఆర్ వైపు వస్తే పదవి పోతుంది అని చెప్పారు. ఆ రోజు ఇంట్లో ఉన్నవాళ్ల మంతా పదవి పోయినా పర్వాలేదు ఎన్టీఆర్‌వైపే ఉండాలని చెప్పాం. తర్వాత ఎన్టీఆర్ వైపే ఉండిపోయారు. ఎన్టీఆర్ మరణించిన తర్వాత కూడా లక్ష్మీపార్వతికే మద్దతుగా నిలిచారు. తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు. ఆపై కాంగ్రెస్‌లోకి వెళ్లారు. వైఎస్సార్ పాదయాత్ర ఘట్టంపై మీ వ్యాఖ్య ఏమిటి? వైఎస్సార్ అన్న పాదయాత్ర చేయాలని నిర్ణయించుకుని నన్ను పిలిపించుకుని తాండూరు నుంచి యాత్ర మొదలెట్టాలనుకుంటున్నానమ్మా అని చెప్పారు. కర్నాటక సరిహద్దులో ఉంటుంది తాండూరు. నేను సరే అన్నాను. ‘కానీ మీరు తాండూరు నుంచే యాత్ర మొదలెడతారు కాబట్టి ముందుగా చేవెళ్లలో ఒక బహిరంగసభ పెడతాను అక్కడ మాట్లాడి తర్వాత తాండూరు నుంచి మొదలెట్టండ’ని కోరాను. సరేనన్నారు. కొద్ది రోజుల తర్వాత ‘మీ ఊరునుంచే యాత్ర మొదలెడతా నమ్మా’ అన్నారు. నేను వ్యతిరేకించాను. ‘పాదయాత్రను మీరు తాండూరునుంచే మొద లెట్టండి చేవెళ్లలో బహిరంగ సభ పెడతాను’ అన్నాను. చేవెళ్లనుంచి పాదయాత్రకు మీరెందుకు వద్దన్నారు? సమాజంలో ఒక ముద్ర అయితే ఉంది కదా. భర్త చనిపోయినవారు అని, అమంగళం అని సెంటిమెంట్‌తో ఆలోచించాను. ‘నువ్వు అలా అన్నావు కదా. ఇక్కడి నుంచి మొదలెడతాను’ అనేశారాయన. అది ఆయన గొప్పతనం. అంత సుదీర్ఘయాత్ర కదా. మంచి జరిగితే సరే. కానీ చెడు జరిగితే ఇక జీవితాంతం మమ్మల్ని మేం క్షమించుకోలేం కదా. పైగా సమాజంలో మళ్లీ మరొక ముద్ర వేస్తారు. ‘అలా అంటు న్నావు కాబట్టి ఇక్కడ్నుంచే మొదలెడతాను’ అనగానే ఇక నాకు టెన్షన్ మొదలయింది. సెంటిమెంటుతో మీరు వద్దన్నా ఆయన వినక పోవడం అపూర్వం కదా? పాదయాత్ర మొదలైనప్పటినుంచి నేనయితే ఇంట్లో కూర్చునే టెన్షన్ పడ్డాను. మధ్యలో రాజమండ్రిలో అన్న జబ్బుపడ్డారనగానే కంగారు మరింత పెరిగింది. పాద యాత్ర పూర్తయేంతవరకు నాకు ఆందోళనగానే ఉండింది. తర్వాత కరీంనగర్లో కలిసి నప్పుడు.. వద్దంటున్నా వినకుండా మా ఊరినుంచే మొదలెట్టారు కదా అన్నాను. అవన్నీ మామూలే కదా, ఏం కాదు అని కొట్టిపడేశారాయన. మీకు మంత్రి పదవి ఎలా వచ్చింది? నేను అసలు ఊహించలేదు. తాండూరు ఎమ్మెల్యే నారాయణరావు మాకంటే సీని యర్ కాబట్టి వస్తే ఆయనకే పదవిరావాలి అనుకున్నాను. రాత్రి భోజనం చేసి పడు కుంటే పదకొండున్నరకు కాల్ వచ్చింది. మరుసటి రోజు ప్రమాణ స్వీకారానికి రావమ్మా అని పిలుపు. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. అదే అన్న గొప్ప తనం. ఊహించని పరిణామం అది. చేవెళ్ల చెల్లెలికి మరచిపోని తీపి గుర్తు అన్నమాట. తర్వాత పల్లెబాట పథకాన్ని కూడా చేవెళ్లనుంచే మొదలెడతానని చెప్పారు. ఇదొకటే కాదు ఏ కొత్త కార్యక్రమం చేప ట్టినా అన్న చేవెళ్లనుంచే మొదలెట్టేవారు. దురదృష్టమో ఏమో కాని రచ్చబండ కార్యక్రమాన్ని అన్న చేవెళ్ల నుంచి మొదలెట్టలేదు. అలా జరిగి ఉంటే రాజశేఖర రెడ్డి అన్న బతికి ఉండేవారేమో అనిపిస్తుంది. జగన్‌కి పదవి ఇవ్వాలని మీరు కోరితే.. రోశయ్యకు ఎలా పట్టం కట్టారు? వైఎస్సార్ మీద అభిమానంతోనే ఆరోజు జగన్‌కి అధికారం ఇవ్వాలని మేం భావించాం. కాని అధిష్టానం చివరగా ఏం నిర్ణయించినా కట్టుబడాల్సిందే. రోశయ్య సీఎం అయ్యాక కొన్నిరోజులు ఓపిక పట్టి సర్దుకుపోవాల్సిందిగా జగన్ ని మేం కోరాం. ఓదార్పు యాత్రను అడ్డుకోవడంలో తప్పు ఎవరిది? అన్ని కోణాల్లోంచి చూస్తే అందరిదీ తప్పే అనిపిస్తుంది. అధిష్టానం జగన్ ని పిలి చిన సందర్భంలో కూడా నేనూ, రఘువీరారెడ్డి జగన్‌ని కలిసి అభ్యర్థించాం. ఓదార్పు యాత్ర అంటున్నారు కదా. కొన్ని రోజులు ఓపిక పట్టు, అందరం చర్చించి చేద్దాం అని కూడా గంటసేపు జగన్ కి నచ్చచెప్పడానికి ప్రయత్నించాం. హోంమంత్రిగా ఉద్యమాన్ని నియంత్రిం చాల్సి వచ్చినప్పుడు మీ ఫీలింగ్స్ ఏమిటి? తెలంగాణకు పూర్తి మద్దతుగా ఉన్న ఇంద్రారెడ్డి భార్యగా ఉద్యమాన్ని అదుపు చేయాల్సి రావడం చాలా బాధనిపించింది. పదవికి రాజీనామా చేయాలని కూడా అని పించింది. కానీ మహిళలకు చిన్న చిన్న పద వులు ఇస్తున్నారు. పెద్ద పదవులు ఇస్తే ఇలాగే వాళ్లు నిలబెట్టుకోలేరు అని ఆరోపిస్తారు. మహిళా లోకంమీదే నిందవేసే ప్రయత్నం చేస్తారు. సులభంగా వ్యాఖ్యలు చేస్తారు కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీనామా చేయవద్దని అనుకున్నాను. 15 ఏళ్లకు ముందు, ఇప్పుడు మీలో చాలా తేడా కనపడుతోంది. ఈ రాజకీయ పరిణతిని ఎలా సాధించారు? మనిషి నిరంతర విద్యార్థి. రాజకీయాల్లో అడుగడుగునా నేర్చుకోవడానికి అవ కాశం ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ చేయాలనే తపన తనంతట తాను వచ్చేస్తుంది. రాజకీయాలు అంటే పనిష్మెంట్ అని నేను ఒక సందర్భంలో వ్యాఖ్యానిస్తే నా భర్త ఇంద్రారెడ్డి వ్యతిరేకించారు. రాజకీయాల్లో ఉన్న తృప్తి నీకు అర్థం కాదన్నారు. అది ఇప్పుడు నాకు అర్థమవుతోంది. అందుకే ఆయన మాటలు ఎప్పుడూ గుర్తు చేసుకుంటుంటాను. రాజకీయాల్లో వేసే ప్రతి అడుగులోను ఎంతో కొంత నేర్చు కుంటూ ఉంటాము. (సబితతో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకులో చూడండి) https://www.youtube.com/watch?v=U2aNqP2vaMQ -
అందరూ కలిసే కొంపముంచారు..!
మనసులో మాట వైఎస్సార్ చనిపోవడం చాలా దురదృష్టకరమైన ఘటన. ఆంధ్రప్రదేశ్ చరిత్రనే అది మార్చిపడేసింది. ఆయన మరణం తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలను, రగులుతున్న తెలంగాణ ఉద్యమాన్ని ఎలా పరిష్కరించాలనే విషయంలో కాంగ్రెస్ పార్టీ అనేక నిర్ణయాలు చేసింది. ఆ నిర్ణయాల వల్లే మేం ఇవ్వాళ ఇలా ఉన్నాం. ఏపీలో, తెలంగాణలో కాంగ్రెస్ కొంప మునగడానికి అందరూ కారణమేనంటున్నారు మాజీ స్పీకర్ శ్రీపాదరావు తనయుడు, మాజీమంత్రి, మాజీ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు. అధిష్టానం చాలా ఆలస్యంగా తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం, సీఎం పదవిలో ఉండికిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించడం.. రాజకీయంగా ఏ రకంగా లబ్ధిపొందుతాం అనే వ్యూహంపై పార్టీలో జరిగిన లోపం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు.. ఇలా అన్నీ కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగాయని చెప్పారు. రాజశేఖరరెడ్డి తనయుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉండి మరింత బాధ్యతాయుత స్థానాన్ని చేపట్టాలని అందరం అనుకున్నా ఘటనలు మరోరకంగా పరి ణమించాయన్నారు. జగన్, తెలంగాణ వంటి అంశాల్లో కొంతమంది సీనియర్ల అభిప్రాయం తీసుకున్నప్పుడు అధిష్టానం తనవంతుగా ఆలోచించి ఒక వ్యూహాన్ని చేపట్టలేదని వాపోయారు. తెలంగాణ ఇచ్చేదీ, తెచ్చేదీ కాంగ్రెస్ పార్టీనే అనే విషయం పక్కకు వెళ్లి, కేసీఆర్ కాంగ్రెస్ మెడలు విరిచి తెలంగాణను తెస్తున్నాడు అనే అభిప్రాయం ముందుకు రావడమే కాంగ్రెస్ పరాజయానికి కారణం అంటున్న దుద్దిళ్ల శ్రీధర్ బాబు అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. నక్సలైట్లు నాన్నపై ఆకస్మికంగా ఎందుకు దాడి చేశారు? ఆ ఘటన గురించి ఆలోచిస్తుంటే అయన్ని ఎందుకు చంపారన్నది ఈరోజుకు కూడా మాకు షాకింగ్ గానే ఉంటుంది. ఎవరేం మాట్లాడుకున్నా, నాన్న ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేవారు. మానవత్వంతో వ్యవహరించేవారు. ప్రత్యేకించి మా ప్రాంతం చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంటుంది. పైగా అటవీప్రాంతం. అక్కడి సామాజిక పరిస్థితులు, నక్సల్ ప్రభావం, ఏదైనా కావచ్చు...ఆ ప్రాంత సమస్యలు వేరే విధంగా ఉంటాయి. అక్కడ ఉన్నవారికే అవి తెలుస్తాయి. నాన్న విషయంలో తాము చేసింది పొరపాటే అనే అభిప్రా యాన్ని కూడా వారు వ్యక్తపరిచినట్లు పేపర్లలో చదివాం. వైఎస్ఆర్తో మీ అనుబంధం గురించి చెప్పండి? రాజకీయ జీవితం మొదలైంది వారితోనే. నాన్న చనిపోయాక వైఎస్సార్ మా ఇంటికి వచ్చినప్పుడు కుటుంబంలోంచి ఎవరో ఒకరు రాజ కీయంలోకి రావాలి అని చెప్పారు. సీనియర్ నేతలు ప్రోత్సహించారు. అలా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ నన్ను చాలా బాగా చూసుకునేవారు. యువ రాజకీయ నేతలను ప్రోత్సహించడం ఆయన ప్రాథమ్యం. ఆయన మంత్రి వర్గంలో పనిచేయడం గొప్ప అనుభవం. డైనమిక్ నిర్ణయాలు తీసుకునేవారు. ఇవ్వాళ ఉదయం ఒక కార్యక్రమం తీసుకుంటే దానికి ఒక గంటలో పరిష్కారం వచ్చేలా చూసే వారు. పార్టీ వ్యవహారాల్లో కాని, అసెంబ్లీలో వ్యవహారాలను ఎలా సజావుగా నిర్వహిం చాలి అనే విషయంలో కాని ఆయనలో ఎప్పుడూ ఒక సానుకూల దృక్పథం కనిపించేది. జగన్మోహన్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ ప్రజాస్వామికంగా వ్యవహరించిందా? వైఎస్ఆర్ మరణం తర్వాత ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేయాలి అంటూ 140 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. కారణాలేవయినా సరే అధిష్టానం వ్యతిరేకించింది. మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. ఆ సమయంలో జగన్‌పై కొందరు వ్యతిరేకంగా చెప్పడం నిజం. జగన్ యువకుడు. కొద్దిగా సర్దుకుని పోతే మంచిదని మేమనుకున్నాం. తనపై మేం చాలా పాజిటివ్ గానే ఉన్నాము. అరుుతే అధిష్టానం ఏ నిర్ణయాలు తీసుకున్నా, మేం తప్పకుండా దాన్ని పాటించాల్సిందే. అంత కష్టమైన సమయంలో ఒక సీనియర్ నేతను సీఎంగా పెట్టాలన్న నిర్ణయం తీసుకున్నప్పుడు మాలాంటి యువకులం కూడా ఓపికతో ఉండాలి. కాంగ్రెస్ మునిగిపోవడానికి కారణం ఎవరు? అధిష్టానమా, కిరణా, లేక మీరందరూనా? అందరి ప్రమేయం ఉండి ఉండొచ్చండి. అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత కిరణ్ దాన్ని వ్యతిరేకించకూడదు. అధిష్టానం తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ‘అది ఫైనల్. అది ఆగే ప్రసక్తి లేదన్నా’ అని మేము ఆయనకు చెప్పాం. కానీ కిరణ్ తన అభిప్రాయం మాకు తెలుపలేదు. ఆ తర్వాత మాకు చాలా గ్యాప్ వచ్చేసింది. రాజకీయంగా ఏవిధంగా లబ్ధి పొందుతాం అనే స్ట్రాటజీ లోపం వల్ల కాంగ్రెస్ దెబ్బతినింది. పైగా రాష్ట్రంలో మేం పదేళ్లు అధికారంలో ఉన్నాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది కూడా దానికి జతకూడింది. కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేసినా మీరు భయపడిపోయారా? తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నప్పుడు నాలుగేళ్లపాటు ఏపీలోనూ సెంటి మెంట్ పెరిగిపోయింది. కిరణ్‌పై ఏదైనా చర్య తీసుకుంటే ఏపీలో సెంటిమెంటు ఇంకా రెచ్చిపోయే ప్రమాదం ఉందని కూడా అనుకున్నాం. ఏం చేద్దాం అనే విషయంపై కొంతమంది సీనియర్ల అభిప్రాయం తీసుకున్నప్పుడు అధిష్టానం చాలా ఆలోచన చేసి ఒక వ్యూహాన్ని చేపట్టవలసింది. కాని అలా జరగలేదు. జగన్‌పై, కొందరు కాంగ్రెస్ మంత్రులపై కేసులు పెట్టడం కరెక్టేనా? ఆరోజు జరిగిన సంఘటనలు బాధాకరం. అలా జరగకుండా ఉండాల్సింది. అవన్నీ కాంగ్రెస్ పార్టీపైనే ప్రభావం చూపారుు. దేశ చరిత్రలోనే అత్యంత గొప్ప ప్రజా నేత వైఎస్ఆర్. కాంగ్రెస్ రాష్ట్రంలో పటిష్టం కావడానికి ఆయన పాత్ర చాలా ఉంది. ఆయన చనిపోయిన తర్వాత ఆ సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. అదే సమయంలో సోదరులు జగన్ కూడా కొద్దిగా ఓపిక పట్టాల్సి ఉండె. కేసులు ఎందుకు పెట్టారు, ఎలా పెట్టారు, ఎవరి ప్రమేయమయినా ఉందా అని తెలీదు కాని అలా జరగకుండా ఉండాల్సింది. జగన్ ఓదార్పుయాత్రకు వెళతానంటే కూడా వ్యతిరేకించడం ఏమిటి? ఓదార్పుయాత్రపై అధిష్టానానికి వ్యతిరేకంగా చెప్పినప్పుడు తాను పార్టీకోసమే చేస్తున్నాను కానీ వ్యక్తిగతంగా కాదని జగన్ కూడా అధిష్టానానికి నచ్చచెప్పాల్సింది. కాని ఆయన ఆ మార్గంలో వెళ్లలేదు. మా వైఎస్సార్ తనయుడాయన. మాతోనే ఉండాల్సింది. ఇవాళ ఆయన ప్రధాన పాత్రలో ఉంటే చూసి ఉండేవాళ్లం. అది చూడలేకపోయామన్నదే బాధ. కిరణ్ సీఎం అయిన తర్వాత జరుగుతున్న పరిణామాలను చక్కదిద్దలేకపోయారా? చక్కదిద్దడానికి వీల్లేనంతగా ఉద్యమం తీవ్ర స్థాయికి వెళ్లింది. ముఖ్యమైన విష యం ఏమిటంటే వైఎస్సార్ లాంటి స్ట్రాంగ్ లీడర్ ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. పాలనాపరంగా కిరణ్ స్ట్రాంగ్. కానీ రాజకీయంగా కాదు. రాష్ట్ర విభజన చేయ వద్దు అనే ఆలోచనతో ఒక సీఎంగా ఆయన బయట పడకూడదు. రెండు ప్రాంతాలకు ఆయన ముఖ్యమంత్రి. ఆ స్థానంలో ఉండి ఒక ప్రాంతానికి అనుకూలంగా అసలు రావద్దు. తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ ఎవరికి దక్కింది? సోనియా గాంధీ పూనుకోకపోయి ఉంటే ఈరోజుకీ ప్రత్యేక రాష్ట్రం రాకపోయి ఉండేదని తెలంగాణ ప్రజల్లో ఇప్పటికీ బలంగానే అభిప్రాయం ఉంది. ప్రజానీకం మొత్తంగా ఆరోజు టీవీల చుట్టూనే ఉన్నారు. తెలియనిది ఎవరికి? ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఈ రెండు పాత్రల్లో వైఎస్సార్, చంద్రబాబుపై మీ అంచనా? ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు వైఎస్సార్ ప్రజాసమస్యలను బలంగా ఎత్తిచూపారు. విద్యుత్ చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా పార్టీ నేతలందరం నిరాహార దీక్ష చేశాం. అది ప్రజలందరికీ మేలు కలిగించే అంశం. ఇక సీఎంగా ఉన్నప్పుడు ఆయన తీసుకున్న విధానాలు ఎంతోమందికి ఉపయోగపడు తున్నాయి. ఈ రోజు పల్లెల్లోకి మీరెళ్లినా ఈ విషయం బోధపడుతుంది. బాబు పాలనలో జన్మభూమి సభలకు వెళ్లినప్పుడు మేం చూశాం. రూ. 200ల పించను తీసుకోవాలంటే అర్హులలో కొందరు చనిపోతే ఇతరు లకు ఆ అవకాశం వస్తుంది అనే అభిప్రాయం సృష్టించారు. వైఎస్ఆర్ హయాంలో అలాంటి పరిస్థితే లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికీ వృద్ధాప్యం పించన్ ఇచ్చేవారు. మోదీ పెద్దనోట్ల రద్దుపై మీ అభిప్రాయం? ఇది చాలా ఇబ్బందికరమైన కార్యక్రమం. గ్రామీణ ప్రాంతంలో నేటివరకూ నోట్ల చలామణి లేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పెద్ద నిర్ణయం గోప్యంగానే ఉండాలి. ముందుగా ఎవరికీ తెలియకూడదు. కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ప్రజ లను ఇబ్బంది పెట్టే ఆస్కారం ఉన్నప్పుడు ఇది నిజంగానే ఆర్థిక ఎమర్జెన్సీ లాంటిదే. కష్టపడి సంపాదించిన సొంత డబ్బును కూడా తీసుకోవడానికి సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారంటే ఇది ఒకరకంగా ఎమర్జెన్సీయే. (దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకులో చూడండి) -
అద్భుత రాజధాని ఆర్డరేస్తే రాదు..!
మనసులో మాట కొమ్మినేని శ్రీనివాసరావుతో డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ రాజధాని విషయంలో అద్భుతాలు చేస్తామనడం దూరదృష్టి లోపమంటున్నారు లోక్‌సత్తా సంస్థాపకులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జయప్రకాష్ నారాయణ్. విద్య, ఆరోగ్యం, ఉపాధి, సంస్కృతి ఇవన్నీ ఒకదానికి ఒకటి సమకూరితేనే ఆధునిక రాజధాని వస్తుంది తప్ప. ఆర్డర్ వేస్తేనో, భూమి రేట్లు 5 కోట్లకు వెళ్లిపోతేనో అకస్మాత్తుగా రాజధాని ఏర్పడదన్నారు. పుష్కరాలు, ఉత్సవాలు వంటి ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లోనే పాలకులు కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌ని పాలకులే కులాల కంపుతో మురికి చేయడం అభివృద్ధికి, ఆధునిక సంస్కృతికి చిహ్నం కాదన్నారు. వాగ్దానాలు, మాటల గారడీలు మాని అధికార వికేంద్రీకరణ, సమర్థ పాలన, ప్రజలకు సేవలందించటం, విద్యా ఆరోగ్యం ప్రతి బిడ్డకూ ఆందే ఏర్పాటు చేయ డమే తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి మార్గం అంటున్న జేపీ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... చంద్రబాబు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టినప్పుడు మీరెలా ఫీలయ్యారు? ఒక నాయకుడికి, మిత్రపక్షాలకు 225 సీట్లను కట్టబెడుతూ జనం తీర్పునిచ్చిన ప్పుడు అర్ధరాత్రిపూట ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని దింపేస్తే అది ఏ రకమైన ప్రజా స్వామ్యం అవుతుంది? ఎలా రాజ్యాంగ బద్దమౌతుంది? సాంకేతికంగా అది చట్టబద్ధం కావచ్చు. కానీ అలాంటి పనిని ఏ పార్టీ చేసినా నైతికంగా తప్పే. తెలంగాణ విషయంలో మీరు సరైన వైఖరి తీసుకున్నారా తీసుకోలేదా? అప్పటికీ ఇప్పటికీ ఒకటే చెబుతున్నాను. ఆనాడు నేను చెప్పింది వాస్తవం అని రుజువవుతోంది. రాజ్యవ్యవస్థ మారకుండా రాజధాని మారితే ప్రయోజనం లేదు. రాష్ట్రం పేరు మారితే పెద్దగా ఏమీ ఒరగదు. తెలంగాణ కావాలంటే తెచ్చుకుందాం కానీ అదొక్కటే సరిపోదు అని ఆనాడే చెప్పాను. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం కరెక్టని తేలిందా లేదా? పార్టీ కోణం నుంచి అయితే రెండు చోట్లా చతికిలపడిపోయారు కదా. ఏపీలో ఒక తరం వరకు కాంగ్రెస్ పార్టీ పుంజుకోకపోవచ్చు. తెలంగాణలోనూ ఆ పార్టీనుంచి చాలామంది జారుకుంటున్నారు. రాజ కీయంగా అద్భుతాలు సాధిస్తామనుకుని, ఓడిపోయారు. అయితే తెలం గాణ ప్రజలు దేశాన్ని కాపాడారు. తెలంగాణ సాధించిన కీర్తిని ప్రజలకు కాకుండా సోనియాకు కట్టబెట్టినట్లయితే బేజీపీ లేదా కాంగ్రెస్.. రాష్ట్ర శాసనసభతో, ప్రజల మనోభావాలతో నిమిత్తం లేకుండా ఓట్ల కోసం, సీట్ల కోసం ఈ దేశంలో అన్ని చోట్లా ఇదే ప్రయోగానికి ఒడిగట్టేవాళ్లు. ఇప్పుడిక ఈ సాహసాన్ని ఎవరూ చేయరు. ప్రజలు తమకు తాముగా కోరుకుని వారి మధ్య సంఘీభావంతో ఒక ఒప్పందానికి వస్తే తప్ప ఢిల్లీలో బలవంతంగా విభజన చేస్తామనే ప్రయత్నం ఇక ఎవరూ చేయరు. కేసీఆర్, చంద్రబాబు పాలన ఎలా ఉంది? కేసీఆర్ పాలనలో రెండు మూడు అంశాలు నాకు నచ్చాయి. సింగపూర్ నుంచి, బ్రిటన్ దాకా గృహ నిర్మాణం ఆధునిక ప్రపంచంలో చాలా కీలకమైనది. అలాగే ఇరి గేషన్, నీటి సంరక్షణ వగైరా. అధికార వికేంద్రీకరణ చేస్తామన్నారు. పంచాయితీలకు ఏడాదికి 5వేల కోట్లు ఇస్తానని కేసీఆర్ అన్నప్పుడు నా గుండె ఉప్పొంగింది. తొలి నుంచీ మేం పోరాడుతున్నది దానిమీదే కదా. కాని ఆయన ఇప్పుడు అలా చేయడం లేదు. ఏపీ విషయంలో బాబుకు గతంలో ఉన్న విస్తృతస్థాయి దృక్పథం కనుమరు గైంది. పెట్టుబడులకోసం ప్రయత్నిస్తు న్నాడు. కానీ అధికార వికేంద్రీకరణపై దిశా నిర్దేశం లేకుండా కులాల జంజాటంతోటే కాలం గడిపేస్తున్నాడు. తాత్కాలికమైన కానుకలు, పుష్కరాలు, అమరావతికి శంకు స్థాపనలు.. ఇలా ఈవెంట్ మేనేజ్మెంట్ హడావుడి తప్ప మరేమీ జరగటం లేదు. అమరావతి ప్రపంచంలోనే నంబర్ వన్ రాజధాని అంటున్నారు. నిజమేనా? ప్రజల హృదయాలు కాస్త గాయపడ్డాయి కాబట్టి, హైదరాబాద్‌కు దీటుగా ఏర్పాటు చేసుకుంటామనటంలో తప్పులేదు. కానీ రాజధాని సహజంగా నిర్మాణం కావాలి. దీన్నే ఆర్గానిక్ గ్రోత్ అంటాం. విద్య, ఆరోగ్యం, ఉపాధి, సంస్కృతి ఇవన్నీ ఒకదానికి ఒకటి సమకూరాలి. దాంతోనే ఆధునిక రాజధాని వస్తుంది తప్ప.. మీరు ఆర్డర్ వేస్తేనో, భూమి రేట్లు 5కోట్లకు వెళ్లిపోతే అకస్మాత్తుగా జరగదు. ఒక యాభై ఏళ్లు, వందేళ్లు పడుతుందని భావించి దానికనుగుణంగా పునాదులు వేస్తే మీరనుకున్నది జరుగుతుంది కాని పాలకుడు ఆదేశిస్తే జరిగేది కాదు. అమరావతిలో రాజధాని విష యంలో ఏం జరుగుతోందో నాకు అర్థం కావటం లేదు. అద్భుతాలు చేస్తాం అన్నారు. ల్యాండ్ పూలింగ్ చేశారు. ఇచ్చినవారు సంతోషంగా ఇచ్చారు. భూమి ఇస్తే పెరిగే విలు వలో రైతుకు వాటా ఉంటుందంటే సంతోషమే కదా. రేపు పొద్దున భూమి రేటు పెరిగితే నాకు కూడా వాటా ఉంటుందనే భావన కలగాలి కానీ నేను తీసేసుకున్నాను. మీ చావు మీరు చావండి, నేను అమ్మేసుకున్నాను అంటే పద్ధతి కాదు. ఓటుకు కోట్లు కేసుపై మీ అభిప్రాయం? కౌన్సిల్‌కు ఉన్న ఒకే ఒక అధికారం ఏమంటే అసెంబ్లీ చేసిన నిర్ణ యాలను 90 రోజుల పాటు ఆపగలగడమే. ఇది తప్పితే దానికి ఏ అధికారమూ లేదు. దాంట్లో ఒక కౌన్సిల్ సభ్యుడి విషయంలో మీకు అధికారమే లేని రాష్ట్రంలో ఇంత రాద్దాంతం ఏమిటి? ఓటుకు డబ్బులిస్తే, పార్టీ ఫిరాయింపులు చేస్తే తప్పకుండా రాజ్యాంగ విరుద్ధమే. ఆ టేపులో గొంతు మీదా కాదా అని బాబును నేను ఎన్నడో ప్రశ్నించాను. కానీ ఇలాంటి వ్యవహారాల్లో పవిత్రులెవరు? అపవిత్రులెవరు? ఎన్నికలలో పోటీ చేసిన ప్పుడు బీజేపీ ఇతర పార్టీలు ఎంపీ సీటుకు 20, 30 కోట్లు ఖర్చు పెట్టలేదని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు మీ సందేశం? రెండున్నరేళ్ల క్రితం మనందరి మనసుల్లో కాస్త భయం ఉండింది. రెండు రాష్ట్రాలు వచ్చేశాయి. ఈ ఆంధ్ర, తెలంగాణ భావం జనం మనస్సుల్లో ఉండి కలుషిత వాతావ రణం సృష్టిస్తే గందరగోళం నెలకొంటుందని అనుకున్నాం. అలా జరగనందుకు ప్రధా నంగా కేసీఆర్‌ని, తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించాలి. రాజకీయం కోసం గతంలో ఏం జరిగినప్పటికీ ఒక సామరస్య వాతావరణం మాత్రం తీసుకొచ్చారు. దానికి మనం సంతోషపడాలి. రెండోది. ఆంధ్ర ప్రజలేమో మాకు అన్యాయం జరిగిపోయిందని అను కున్నారు. కాని మన సమస్యలకు ఇంకొకళ్లు కారణం కాదు అని గ్రహించాలి. తెలంగాణ ప్రజలు గతంలో ఆ వాదన చేసారు. ఆ వాదన తప్పని అప్పుడూ చెప్పాను. ఇప్పుడు ఆంధ్ర ప్రజలు ఆ వాదన చేస్తున్నారు. అది తప్పని ఇప్పుడు చెబుతున్నాను. మన సమస్యలకు పరిష్కారాలు మన చేతుల్లోనే ఉన్నాయి. మన పరిపాలనలో, మన రాజ కీయంలో మన సమాజం నడిచే తీరులో, మనందరి ఆలోచనలలో ఉన్నాయి తప్పితే ఇంకెక్కడినుంచో సమస్యలు రావు. పై నుంచి ఏమిచ్చినా పుచ్చుకుందాం. అది మన హక్కు. వాళ్లేం దానంగా ఇవ్వటం లేదు. ప్రత్యేక రాష్టం వచ్చేస్తే అద్భుతాలు జరిగిపోతాయి, పదో తరగది చదివితే చాలు ప్రతి ఇంటికీ ఉద్యోగం వచ్చేస్తుంది. అందరికీ మూడు ఎకరాలు వచ్చేస్తాయి అంటూ తెలం గాణ ప్రజలు రకరకాల కలలు కన్నారు. ఇప్పుడు మీకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు అధికార వికేంద్రీకరణ, సమర్థ పాలన, ప్రజలకు సేవలందటం, మంచి ప్రమాణాలతో విద్యా ఆరోగ్యం ప్రతి బిడ్డకూ ఆందే ఏర్పాటు చేయడం దానిమీద దృష్టి పెట్టండి. (జయప్రకాశ్ నారాయణ్‌తో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకులో చూడండి) -
వైఎస్సే ఉంటే ఇలా జరిగేదా?
కొమ్మినేని శ్రీనివాసరావుతో సీనియర్ కాంగ్రెస్ నేత దానం నాగేందర్ వైఎస్ జగన్‌ని కంట్రోల్ చేయాలని ఉన్నవీ లేనివీ అన్నీ అసాధారణ కేసులు పెట్టించి డీమోరలైజ్ చేసేస్తే మళ్లీ సరెండర్ అయిపోతాడని అందరూ అను కున్నారు. కానీ వైఎస్సే మొండోడు అనుకుంటే ఆయన కంటే మొండోడు జగన్. సరెండర్ కాదు కదా, ఇంకా మొండెక్కిపోయాడాయన. మొండి వాడిని జగమొండిని చేసినట్లయిపోయింది పరిస్థితి. ఒకే ఒక వ్యక్తి (వైఎస్ఆర్) ఉన్నట్లుండి పోవడం వల్ల ఉమ్మడి రాష్ట్రం చరిత్రే మారి పోయిందని హైదరాబాద్ నగర కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దానం నాగేందర్ అంటున్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ తన నావను తానే ముంచుకుందని, ఒక రాష్ట్ర భవిష్యత్తు వంటి కీలక నిర్ణయంపై అధిష్టానానికి తప్పుడు రిపోర్టు ఇస్తే ఆ నష్టాన్ని ఇప్పుడు పార్టీ మొత్తంగా అనుభవించాల్సి వస్తోందన్నారు. వైఎస్ జగన్ విషయంలో అధిష్టానానికి విషం నూరిపోయ టంతో ఆయన పార్టీలోంచే బయటకు వెళ్లారని, ఇటు తెలంగాణలో అటు ఏపీలో తప్పుగా వ్యవహరించడమే కాంగ్రెస్ పార్టీకి పెను నష్టం కలిగించిందని వ్యాఖ్యానించారు. విభజన తప్పదని తేలాక ఒకటిన్నర సంవత్సరం ముందే ఏపీ, తెలంగాణలకు ఇద్దరు సీఎంలను నియమించి ఉంటే కాంగ్రెస్ పరిస్థితి మరోలా ఉండేదని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ఓదార్పు యాత్రకు తప్పుడు కలర్ ఇవ్వడమే కాంగ్రెస్ భంగపాటుకు కారణమైందంటూ దానం నాగేందర్ ‘‘మనసులో మాట’’లో చెప్పిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. కాంగ్రెస్ రాజకీయాలు సడన్‌గా ఇలా మారిపోయాయేమిటి? రాజకీయాలు మారలేదండి. ఒక వ్యక్తి పోవడం వల్ల ఇంత తేడా వచ్చింది. వైఎస్. రాజశేఖరరెడ్డి ఉంటే ఉమ్మడి రాష్ట్రం ఇలా అయ్యేది కాదు. ఒక్క వ్యక్తివల్లే, ఆయన లేక పోవడం వల్లే ఇంత దుస్థితి వచ్చిందనేది జనం మాట. తెలంగాణ అంశంలో ఎవరు కరెక్ట్.. మీరా, అధిష్టానమా, కిరణా? అధిష్టానానికి తెలంగాణ గురించి చెప్పేవాళ్లు తప్పు చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు ఒకటిన్నర సంవత్సరానికి ముందు ఇచ్చి, కావలసిన ఏర్పాట్లు చేసి ఉంటే బాగుండేది. రెండు రాష్ట్రాలను చేసి, వాటికి ఇద్దరిని ముఖ్యమంత్రులను చేసి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. టీఆర్ఎస్కు కొంచెం శక్తి వచ్చినా, ఆం్ర«ధలో మేము దెబ్బతిన్నా.. పర్వాలేదు. అప్పటికే జగన్ వల్ల ఏపీలో కాంగ్రెస్‌కు నష్టమే. అక్కడ కాంగ్రెస్ రాదు. కనీసం ఇక్కడయినా పార్టీ అధికారం లోకి వస్తుందని అనుకున్నాం. ప్రత్యేక రాష్ట్రం ముందే ఇచ్చేసి ఉంటే ప్రచారం చేసుకునేవాళ్లం. కానీ ఆరుమాసాల ముందు ఇచ్చారు. మూడు మాసాల ముందు ప్రెసిడెంట్ రూల్ పెట్టారు. కాంగ్రెస్ తన నావను తానే ముంచుకుంది. మేం చేసిన తప్పుకు మేమే అనుభవించాల్సి వస్తోంది. జగన్నే సీఎంని చేయాలని 150 మంది ఎమ్మెల్యేలు లెటర్ ఇచ్చారు కదా? ఆ రోజు జరిగిందేమిటంటే ‘జగన్ కొంచెం ఎక్సెంట్రిక్. మాట వినడు. ఎవరినీ కేర్ చేయడు. ఇప్పుడు జగన్‌ని సీఎం చేయొద్దు’ అని ఢిల్లీకి వెళ్లి విషం చిమ్మేశారు. జగనేంటి చిన్న పిల్లగాడు కదా. అప్పుడే సీఎం ఏంటి అని అడ్డుపుల్లలేశారు. కాంగ్రెస్‌కు అసలే పెద్ద చెవులు. ఎవరేది చెప్పినా దాని చెవుల్లోకి వెళ్లిపోతుంది. ఇంతమంది చెప్పగానే అమ్మో జగన్‌కి సీఎం పదవి ఇవ్వడం డేంజరా.. అనుకుని వ్యతిరేక నిర్ణయాలకు వచ్చే శారు. దాంతో తన ఉనికిని తాను కాపాడుకోవాలని జగన్ భావించారు. ‘ఓదార్పు యాత్రలో తప్పేముంది మేడమ్’ అని అడి గారు. జగన్ ఓదార్పు యాత్రకూ మావాళ్లు తప్పుడు భాష్యం చెప్పారు. జగన్ సొంతంగా పార్టీ పెడితే కేసులు పెడ తారా? అవి పొలిటికల్ కేసులు కావా? మొదటినుంచి ఇదే చెబుతున్నా. జగన్‌ని కంట్రోల్ చేయాలంటే ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని రకరకాల సలహాలు ఇచ్చి, ఉన్నవీ లేనివీ.. అన్నీ అసాధారణ కేసులు పెట్టించి ఆయన్ని డీమోరలైజ్ చేసేస్తే మళ్లీ అధిష్టానానికి సరెండర్ అయిపోతా డని అందరూ అనుకున్నారు. కానీ మొండోడి విషయంలో అలా జరుగుతుందా? ముందే ఆయన మొండోడు. రాజశేఖరరెడ్డే ఒక మొండోడు అనుకుంటే ఆయన కంటే మొండోడు జగన్. రాత్రి పగలు అని తేడా ఉండదు. ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే అది అయిపోయేంతవరకు ఇక ప్రజల్లోనే ఉంటాడు. వైఎస్దీ అదే స్వభావం. ప్రజలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటే ఇక ఎవరు చెప్పినా వినేటోడు కాదు. మరి వైఎస్ కుమారుడు కాబట్టి ఆయన వారసత్వం జగన్ కొనసాగించాలి కదా. అదే జరిగింది. ఇలా కేసులు పెట్టడం, వేధించడం తప్పు అని అధిష్టానానికి మీరెప్పుడూ చెప్పలేదా? అధిష్టానానికి తెలియదని కాదు. జగన్‌కి చాలామంది నచ్చచెప్పడానికి ప్రయత్నం చేశారు. కొందరు కేసులు పెడితే మళ్లీ మనకే సరెండర్ అవుతాడని చెప్పారు. కానీ సరెండర్ కాదు కదా. ఇంకా మొండెక్కి పోయాడు. మొండివాడిని జగమొండిని చేసినట్ల యింది పరిస్థితి. ఆ కేసులన్నీ నిలిచేవి కాదని తెలిసి కూడా అలా ఎందుకు పెట్టారు? నిలిచినా నిలవక పోయినా ఒక మాటండీ. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తోంది కదా. కేసులు పెట్టించి, భయపెట్టించి, అదిచేసి ఇది చేసి అందరినీ లాక్కుపోతున్నారు. ఏ పార్టీకయినా ఇది దీర్ఘకాలంలో నడ వదు. రాజకీయంగా ఎదుర్కోవాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి పనితీరుపై మీ అభిప్రాయం? పాదయాత్ర చేయడానికి ముందు ఆయన చాలా దూకుడుగా ఉండేవారు. ఘర్షణ చెలరేగిన సందర్భాల్లో మాలాంటివాళ్లం ఆయనను శాంతపరచి సర్దిచెప్పాల్సి వచ్చేది. కానీ అధికారంలోకి వచ్చాక వైస్సార్ ఎంతగా మారిపోయారంటే, ఆయనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడు తున్నా నవ్వుతూ ఉండేవారు. అప్పట్లో నేను అసెంబ్లీలో వైఎస్ పక్కసీటులోనే కూచునేవాడిని. ఒకసారి మాటల సందర్భంలో ‘పాత రాజశేఖరరెడ్డి ఎక్కడికి పోయాడు?’ అని అడిగేశాను. ‘నాగేందర్..! ఇతరులు విమర్శ చేస్తుంటే మనం వినా ల్సిన సమయమిది. అధికారం ఉంది కదా అని మనం ఇష్టమొచ్చినట్లు మాట్లాడినా, రెచ్చిపోయినా ప్రజలు ఏ మాత్రం మెచ్చుకోరు. విమర్శించేవారు చెప్పాలనుకున్నది చెప్పనిద్దాం. తర్వాత నేను ఎలాగూ సమాధానం ఇస్తాను కదా’ అనేవారు. ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం సానుకూల పరిస్థితిని కూడా మీరు ఉపయోగించు కోలేక పోయారు కదా? విభజన ఖాయమయ్యాక సోనియాగాంధీ, కేసీఆర్‌తో మాట్లాడి.. తర్వాత జరగా ల్సిన దానిపై చర్చిద్దాం అన్నారు. కానీ మావాళ్లేం చేశారు? కేసీఆర్కెందుకు సీఎం పదవి ఇవ్వడం, మేం లేమా? అని సీఎం పదవిపై ఆశ ఉన్నోళ్లంతా మొత్తంగా మళ్లీ ఢిల్లీకి ఉరికారు. మేమిన్ని రోజులుగా సేవ చేస్తుంటే కేసీఆర్‌కి సీఎం పదవి ఎలా ఇస్తారని అడ్డుకున్నారు. కాంగ్రెస్‌లో రెండేళ్ల కంటే ఎవరినయినా సీఎం పదవిలో పెడతారా? మూడో సంవత్సరం కూడా సీఎంగా ఉంటే గొప్ప అనుకోవాలి. వైఎస్సార్ మాత్రమే అన్నేళ్లు చేయగలిగారు. ఇప్పుడు మీ పార్టీలో సీఎం అభ్యర్థులుగా ఎంతమంది ఉన్నారు? మా పార్టీలో ఉన్నది చెప్పకూడదు. లేనిది చెపితేనే జల్దీగా నమ్ముతారు. సీఎం అభ్యర్థులు ఇప్పుడెందుకు పుడతారు? కాంగ్రెస్‌లో విశేషం ఏమిటంటే టైమ్ చూసి వచ్చే స్తారు మళ్లీ. పవర్ వస్తుందీ అనగానే మళ్లీ తయారయిపోతారు కాబోయే సీఎం క్యాండిడేట్లంతా.. వెట్టి చాకిరీ చేసేటోడికేమో గుర్తింపు ఉండదు. ఏం చేయనోడికి ఎక్కడ లేని గుర్తింపూ ఉంటుంది. కేసీఆర్‌లాగా పార్టీని నడిపేవారేరీ కాంగ్రెసులో. రాజశేఖరరెడ్డి విషయం చూస్తే మొత్తం పార్టీని తానే నడిపారు. అలాంటి నాయకులేరీ ఇప్పుడు? (దానం నాగేందర్‌తో పూర్తి ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఫిరాయింపు రాజకీయాలు అనైతికం
మనసులో మాట కొమ్మినేని శ్రీనివాసరావుతో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సామాన్యులలో సామాన్యుడిగా పుట్టి ఎదిగివచ్చినందుకే జనంలో తిరగడం, జనంతో ఉండటం తనకెంతో ఇష్టమంటున్నారు కేంద్ర కార్మికమంత్రి బండారు దత్తాత్రేయ. ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్‌లోని నిరుపేద ప్రాంతం గౌలిగూడలో రెండు గదుల ఇంటిలోనే చాలా కాలం గడిపిన దత్తాత్రేయ తన తల్లిదం డ్రుల సంస్కారం, ఆర్ఎస్ఎస్ సంఘ జీవితం తనను ఇంత స్థాయికి తీసుకొచ్చిం దని అంటున్నారు. ఫిరాయింపులు అనైతికం అనీ బీజేపీ వాటిని సమర్థించదని చెప్పారు. రాజకీయ లబ్ధికోసం చేసిన సందర్భాల్లో కూడా అది అనైతికమే అంటున్న బండారు దత్తాత్రేయ మనసులో మాటలో చెప్పిన అభిప్రాయాలు.. వారి మాటల్లోనే మీ బాల్యం, కుటుంబ నేపథ్యం ఏమిటి? పేదకుటుంబంలో జన్మించాను. తల్లితండ్రులు ఈశ్వరమ్మ, అంజయ్య. హైదరా బాద్‌లో గౌలిగూడ అనే పేదల బస్తీలో పెరిగాను. నాన్న చిన్నప్పుడే చనిపోవడం. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో మా అమ్మ ఉస్మాన్ గంజ్ అనే ప్రాంతానికి వెళ్లి రోడ్డు మీద ఉల్లిపాయలు అమ్ముకుని బతికి మమ్మల్ని సాకింది. నేను ఎదగడానికి ప్రధాన కారణం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం. ఎంపీ అయిన తర్వాత కూడా గౌలిగూడలోనే ఉన్నారు కదా? కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా నేను గౌలిగూడలోనే ఉన్నాను. నేనూ, నా భార్యా, పిల్లలూ ఒకే గదిలో నివసించేవాళ్లం. అమ్మ ఒక గదిలో ఉండేది. నాకు బాగా గుర్తు. ముఖ్యమంత్రి విజయభాస్కర రెడ్డి ఒకసారి కష్టం మీద మా ఇంటికి వచ్చి చూశారు. ‘ఎంిపీగా ఉండి కూడా ఇంత చిన్న ఇంట్లో ఉన్నావు. చాలా సంతోషం. మీ అమ్మ మీకు ఆదర్శం’ అన్నారు. ఆర్ఎస్ఎస్తో ఎలా పరిచయమైంది? పదో తరగతి చదువుతున్నప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖ సమావేశానికి రమ్మని మనోజ్ అనే డాక్టర్ ఆహ్వానించారు. అమ్మ ఒత్తిడి వల్ల ఒకసారి వెళ్లాను. అదే నా జీవితంలో మలుపు. 1968లో డిగ్రీపూర్తి చేశాను. సంఘం లోకి వెళ్లిన తర్వాతే దేశభక్తికి సంబంధించిన అనేక భావాలు ఏర్పడుతూ వచ్చాయి. ప్రచారక్‌గా వెళతానని చెబితే అమ్మ ఒప్పుకుంది. నిజామాబాద్‌లో ప్రచారక్‌గా తొలి బాధ్యత. 1975 వరకు ఇలా పనిచేశాను. రాజకీయాల్లోకి ఎలా ప్రవేశించారు? రాజకీయాల్లోకి వస్తానని ఊహించ లేదు. కానీ ఎమర్జెన్సీ కాలంలో బెల్లం పల్లిలో అరెస్టై ఒకటిన్నరేళ్లు జైల్లో ఉన్నాను. వరవరరావు, చెరబండరాజు, ఎంటీ ఖాన్, మరొకవైపు సోషలిస్టు నాయకులు నాయని నరసింహారెడ్డి, శ్రీధర్ సింగ్ లష్కర్, గౌతు లచ్చన్న, వి. రామారావు, గౌతు లచ్చన్న వంటి వారితో అక్కడ పరిచయమైంది. అక్కడే చదువుకోవడం మొదలెట్టాను. కాస్త ఆలోచన పెరిగింది. 1977లో జైలు నుంచి విడుదలైన తర్వాత దివిసీమలో ఉప్పెన వచ్చింది. ఆర్ఎస్ఎస్ తుపాను బాధితుల కమిటీలో జాయింట్ సెక్రటరీగా పనిచేశాను. అక్కడ సేవాభావంతో పొందిన గుర్తింపే చివరకు రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. టీడీపీతో పొత్తు లేదని మీ నేతలే అంటున్నారు? పొత్తు అనేది ఎన్నికలకు సంబంధించింది. ఎన్నికలు లేవు కాబట్టి పొత్తుల అవ సరం ఇప్పుడు లేదు. అలాగని భవిష్యత్తును ఎవరూ చెప్పలేరు. రాజకీయాల్లో ఇవ్వాళ మిత్రులుగా ఉన్నవారు రేపు ప్రత్యర్థి కావచ్చు. ఇవ్వాల్టి ప్రత్యర్థి రేపు మిత్రుడు కావచ్చు. ఓటుకు కోట్లు కేసు వంటి అంశాలపై మీరు ఎందుకు మాట్లాడటం లేదు? ఇది రాజ్యాంగపరమైన విషయం. దీంట్లో చట్టం, నైతికత అనే రెండు విషయా లున్నారుు. నైతికత, చట్టం విషయంలో ఎవరు తప్పు చేసినా తప్పే. చంద్రబాబు తప్పు చేసినట్లా చేయనట్లా? బాబు, కేసీఆర్ రాజీపడ్డారా? చట్టం తన పని చేస్తోంది కదా ఇప్పుడు.. వారిమధ్య రాజీ మేం కుదర్చలేదు. కేసీఆర్ షరతు పెట్టడం వల్లే బాబు విజయవాడ వెళ్లిపోయారనడంలో వాస్తవం లేదు. బాబు, కేసీఆర్ ఓటుకు కోట్లు, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లోంచి బయటపడ్డట్లేనా? అది రాజకీయ వ్యవహారం. వారి పద్ధతిలో వారు వెళుతున్నారు. ఫిరాయింపులపై మీ అభిప్రాయం? ఒక్కమాటలో చెప్పాలంటే ఫిరాయింపులు అనైతికం. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీకైనా, వ్యవస్థకైనా ఫిరాయింపులు మంచివి కాదు. రాజకీయ లబ్ధికోసం చేయ వచ్చునేమో కానీ ఇది తప్పకుండా అనైతికం. మరి మీ అభిప్రాయం కేసీఆర్‌కి, చంద్రబాబుకు చెప్పారా? వాళ్ల వాళ్ల పద్ధతిలో వాళ్లు రాజకీయం చేస్తున్నారు. నా సలహా కోరలేదు. మీరు కాని వెంకయ్య కాని ఫిరాయింపులు తప్పని వారికి చెప్పలేదా? వ్యక్తులకు చెప్పడం అని కాదు కానీ... జాతీయ స్థారుులోనే ఫిరాయింపులకు వ్యతిరేకంగా మేం వ్యవహరించాం. వెంకయ్యనాయుడు ఫిరాయింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కి, చంద్రబాబుకు మీరిచ్చే సలహా ఏమిటి? రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మధ్య పరస్పర సహకారం ఎంత ఎక్కువగా ఉంటే అభివృద్ధి అంత ఎక్కువగా జరుగుతుంది. కేంద్రమంత్రిగా మీరు సాధించిన విజయాలు ఏవి? దేశంలోని కార్మికులందరికీ కనీస వేతనం గతంలో రోజుకు రూ. 160 ఉంటే ఇప్పుడు రూ.350లు పెంచడం కార్మికమంత్రిగా నాకెంతో సంతోషం కలిగిం చింది. అలాగే మహిళా కార్మికులందరికీ మెటర్నిటీ లబ్ధిని 12 వారాలనుంచి 26 వారాలకు పెంచాను. ఇక బోనస్ రూ. 3,500 ఉంటే దాన్ని రూ. 7 వేలకు పెంచాను. బీమా కవరేజ్ పది వేలు ఉంటే రూ. 21 వేలకు పెంచాను. ఈఎస్ఐ రూ.15 వేలకు ఉంటే దాన్ని 21 వేలకు చేశాను. ఉమ్మడి రాష్ట్ర సీఎంలపై మీ అభిప్రాయం? పాత ముఖ్యమంత్రులలో వెంగళరా వును చూశాను. మాట తక్కువ పని ఎక్కువ. వెంగళరావు, చెన్నారెడ్డి, విజయ భాస్కరరెడ్డి, ఎన్టీఆర్ వీరందరిలో విశేషం ఏమంటే, పాలనలో చాలా దృఢంగా ఉండేవారు. ఎన్టీఆర్ ప్రజాకర్షణలో సాటిలేని వ్యక్తి. కాంగ్రెస్ తప్పులను ఏమాత్రం క్షమించే వాడు కాదు. తర్వాతి వారిపై కూడా ఆయన ముద్రవేసి వెళ్లాడు. విజయ భాస్కరరెడ్డి నీతి నిజాయితీగల నాయకుడు. చాలా గౌరవించే నాయకుడాయన. వైఎస్ రాజశేఖరరెడ్డి పనితీరుపై మీ అభిప్రాయం? ప్రజలతో మమేకమై పనిచేశారు. ఆరోగ్యశ్రీ, పిల్లలకు స్కాలర్ షిప్‌లు ఇలాంటి అంశాల్లో మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్లారు. ప్రజలపట్ల గౌరవం అపారం. కేసీఆర్, చంద్రబాబు ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేకత ఏమేరకు ఉంది? దీనిపై మరికొన్నాళ్లు వేచి చూడాలి. ఇద్దరూ వేగంగా సాగుతున్నారు కాబట్టి ప్రజలు అంత వేగంగా వారిని అర్థం చేసుకుంటారా అన్నది చూడాలి. తెలుగు ప్రజలకు మీరిచ్చే సందేశం? ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు కష్టపడి పనిచేసేవారు. రెండు ప్రాంతాల ప్రజలు పరస్పరం గౌరవించుకుని ఆత్మీయంగా మెలిగే పరిస్థితులు ఉండాలి. విద్వే షాలకు ఎక్కడా తావుండకూడదు. అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. భవి ష్యత్తులో విద్యా, వైద్యం, ఉపాధి ఈ మూడింటికి తెలుగు రాష్ట్రాలు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి. ఇంటర్వ్యూ పూర్తి పాఠాన్ని కింది లింకులో చూడండి https://www.youtube.com/watch?v=_VHA3x2nw-0 -
ఒదిగి బతకటం తెలిసినవాణ్ణి..!
మనసులో మాట కొమ్మినేని శ్రీనివాసరావుతో మాజీ సీఎం, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య సమైక్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ మరణానంతరం ఏర్పడిన వెలితిని పూరించడానికే తనను ఉన్నపళాన ముఖ్యమంత్రిని చేశారని మాజీ సీఎం, మాజీ గవర్నరు కొణిజేటి రోశయ్య పేర్కొన్నారు. తెలంగాణను కేసీఆర్ తెచ్చాడనేకంటే కాంగ్రెస్ గ్రాంటుగా ఇచ్చిందనడమే వాస్తవమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అరెస్టు, తదనం తర పరిణామాలు పూర్తిగా కాంగ్రెస్ వ్యవహార శైలిలో భాగంగానే జరిగాయన్నారు. రాష్ట్ర విభజన, ఏపీ రాజధాని, ప్రత్యేక హోదా, పోలవరం వంటి సీరియస్ అంశాల్లోనూ ఆచితూచి మాట్లాడటమే కాదు.. రేపటి పరిణామాలపై జోస్యం చెప్పలేనంటున్న కొణి జేటి రోశయ్య ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... మీ రాజకీయ ప్రస్థానం ఏమేరకు సంతృప్తినిచ్చింది? ఒక డిజైన్ పెట్టుకుని, దానిప్రకారం పనిచేసి నేను సాధించుకున్నదేమీ లేదు. పరిస్థితుల ప్రభావంతో రాజకీయాల్లో అడుగుపెట్టాను. కాబట్టే అసంతృప్తి అనేది నాకె ప్పుడూ లేదు. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగే మనస్తత్వం కానీ, అధికారం కోల్పోయినపుడు విచారవదనంతో కూర్చుని దిగాలుపడటం కానీ లేవు. మీ రాజకీయ కెరీర్లో మీకు బాగా సంతృప్తి ఇచ్చినది ఏది? ఆర్థిక నిర్వహణ నాకు బాగా ఇష్టమైన విషయం. రాష్ట్రం అప్పులపాలైపోయి లోటు బడ్జెట్లో పడిపోయి ఇబ్బందులకు గురికావడం నాకు ఇష్టం ఉండేది కాదు. సాధారణ కుటుంబం నుంచి వచ్చినవాడిని. ఆ నేపథ్యమే నాకు అలవాటైపోయింది. మనవద్ద ఏముంది? ఏ మేరకు ఖర్చుపెట్టవచ్చు? అప్పు అవసరమైతే ఏ మేరకు తీసుకు రావచ్చు? శ్రుతి మించకుండా అప్పు చేయాలి అని ఆలోచించేవాడిని. మీ రాజకీయ జీవితంలో మీకు బాగా సహకరించిందెవరు? విద్యార్థిగా ఉన్నప్పుడు ఎన్జీ రంగా మా నాయకుడు. అప్పట్లో గౌతు లచ్చన్న రైతు నాయకుడు. తర్వాత చెన్నారెడ్డి, ఎన్ జనార్దనరెడ్డి, విజయభాస్కర రెడ్డి అందరూ బాగా సహకరించేవారు. పరిస్థితులకు తగినట్లు నడచుకోవటం రంగాగారివద్ద నేర్చుకున్నా. జగన్‌కి అత్యధిక ఎమ్మెల్యేల మద్దతున్నా, సీఎంగా మీ పేరే ఎందుకు ప్రతిపాదించారు? వైఎస్ అనూహ్యంగా గతించడంతో ఒక వెలితి ఏర్పడింది. అధిష్టానం నుంచి ప్రణబ్ ముఖర్జీ తదితరులు వచ్చి, ఇక్కడి వారి అభిప్రాయం తెలుసుకుని ముఖ్య మంత్రిగా నన్ను బాధ్యత తీసుకోమన్నారు. నాకు షాక్ కలిగింది. ఎన్నడూ నేను సీఎంని అవుతానని కాని, కావాలని కాని కలగన్నవాడిని కాదు. గెస్ట్ హౌస్‌కి వచ్చిన తర్వాత దీనిపై మళ్లీ ఆలోచించండి అని ప్రణబ్‌ను అడిగాను. ‘అధిష్టానంతో మాట్లాడే ఈ నిర్ణయం తీసుకున్నాము. ఆ నిర్ణయాన్ని అమలు చేయాలి’ అన్నారాయన. ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని మీరు చెప్పారట? అలా నేను చెప్పలేదు. జగన్ నాకు శత్రువూ కాదు. మిత్రుడూ కాదు. రాజశేఖరరెడ్డి కుమారుడిగా గౌరవించేవాడిని. ఆ గౌరవం అతడి పట్ల ఆ రోజూ ఉంది. ఈ రోజూ ఉంది. ఎప్పుడూ ఉంటుంది. తర్వాత కాంగ్రెస్‌ని వదిలి సొంత పార్టీ పెట్టుకున్నాడు. సొంత పార్టీతో ఈ రాష్ట్రంలో అధికారానికి రావచ్చనుకున్నాడు. గట్టి గానే ప్రయత్నం చేశాడు. వైఎస్సార్, జగన్ మధ్య తేడా ఏమిటి? రాజశేఖరరెడ్డికి సొంత ఆలోచన ఉన్నా, నలుగు రితో మాట్లాడే తన నిర్ణయం తీసుకునేవాడు. జగన్‌తో నేను కలిసి పనిచేయలేదు కాబట్టి ఎలా చెప్పగలను? ప్రత్యేక తెలంగాణ సమస్య మీ హయాంలోనే బలపడింది కదా? రాష్ట్ర విభజనను ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ నేనెప్పుడూ ప్రోత్సహించలేదు. ఆ రోజుల్లోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సమైక్యవాదిగా ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరించాను. సడెన్‌గా ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదని హైకమాండ్‌కు చెప్పాం. అధిష్టానం నిర్ణయానికి యస్ అని తలూపలేకపోయాం. తెలంగాణను తెచ్చిన క్రెడిటా, లేక ఇచ్చిన క్రెడిటా.. ఏది కరెక్ట్? డిమాండ్ చేసింది కేసీఆర్. గ్రాంట్ చేసింది హైకమాండ్. ప్రయోజనం లేకపోయి ఉండవచ్చు కానీ, తెలంగాణను ఇచ్చింది మాత్రం అధిష్టానమే. వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని అంటున్నారు? పరిణామాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని అధిష్టానం వ్యవహరించింది. జగన్ కాంగ్రెస్‌వాదిగా ఉండి, కాంగ్రెస్‌లోనే కొనసాగితే మంచిదనే భావన నాలో ఆనాడూ, ఈనాడూ ఉంది. కానీ ఆయన వేరే పార్టీ పెట్టుకుని నడుపుకుంటున్నాడు, కాంగ్రెస్‌లోనే కొనసాగితే మంచి భవిష్యత్తు ఉండేదని చెప్పగలను. ఓటుకు కోట్లు కేసుపై మీరేమనుకుంటున్నారు? నిన్నటివరకు గవర్నరుగా ఉంటూ.. రాజకీయాలకు దూరంగా, అన్ని పార్టీలకూ సమానమైన రీతిలో ఉన్నాను. అప్పుడే నేను లైన్ గీసుకుని మాట్లాడటం భావ్యం కాదు. చంద్రబాబు పాలనపై చాలా విమర్శలు వస్తున్నాయి.. మీ అభిప్రాయం? నాకు కొంచెం సమయం ఇవ్వండి. చూద్దాం ఏమవుతుందో.. సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్‌లు.. తమ పాత్ర సజావుగా పోషిస్తున్నారా? ఎవరి పాత్ర వారు నిర్వహిస్తున్నారు. కానీ నేను తీర్పు చెప్పలేను. ప్రత్యేక హోదా అవసరమని మీరు నమ్ముతున్నారా? దాంట్లోని చిక్కులు ఏమిటో కూడా నాకు పూర్తిగా అర్థం కాలేదు. ప్రత్యేక హోదా వద్దని నేను అనడంలే దు. దీనిపై లోతుగా అధ్యయనం చేయవలసి ఉంది. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుపట్ల మీ అంచనా ఏమిటి? సానుకూల పరిస్థితి వస్తే ప్రజలు మళ్లీ ఆదరించవచ్చు. లేకపోతే ప్రతిపక్షంగా ఉండాలి. దానిని కాలమే నిర్ణరుుంచాలి. కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య చేసుకుందా, లేదా ఎవరైనా దాన్ని హత్య చేశారా? పరిస్థితుల ప్రభావంతో గెలుపు, ఓటమి వస్తుంటాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మొదటిసారి ఓటమి చెంది ప్రజలకు దూరం కాలేదు. గతంలో ఓడిపోయినా మళ్లీ దూసుకొచ్చింది కూడా. ఏపీలో ప్రజలకు ఆగ్రహం కలిగింది. దూరంగా పెట్టారు. కొంతకాలం తర్వాత వాళ్ల మనసుల్లో ఎలాంటి విశ్లేషణ వస్తుందో వేచి చూడాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జగన్ భవిష్యత్తు ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? నేను జ్యోతిష్యం చెప్పే శక్తి ఉన్నవాడిని కాదు. కష్టపడుతున్నారు. తిరుగుతున్నారు. పని చేస్తున్నారు. ప్రజలను సమీకరించుకోవడానికి చేతనైనంత మేరకు కృషి చేస్తున్నారు. వారి కృషి ఎంతవరకు ఫలిస్తుంది అనేది రాబోయే రోజుల్లో చూడాలి. దాని కోసం అందరితో పాటు నేను కూడా వేచి చూస్తుంటాను. -
ఏకపక్ష పాలన ఎన్నాళ్లో సాగదు...!
కొమ్మినేని శ్రీనివాసరావుతో ఏపీ శాసనమండలి విపక్ష నేత సి. రామచంద్రయ్య ఒక పార్టీ గుర్తుతో గెలిచిన నేతలకు ఇంకొక పార్టీవారు కండువా కప్పటం దిగజారిన రాజకీయాలకు సంకేతమని ఏపీ శాసనమండలిలో విపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు సి. రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల దృష్టిలో ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిపోయిందని, బాబు పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. అవినీతి కంపులో మునుగుతున్న తెలుగుదేశం పార్టీ 2019లో మళ్లీ అధికారంలోకి వస్తుందనుకుంటే అది కల్ల అన్నారు, ఏపీ ప్రజలను తక్కువగా అంచనా వేస్తే చరిత్ర పునరావృతమవుతుందని హెచ్చరిస్తున్న సి. రామచంద్రయ్య ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... మొదట్లో ఎన్టీఆర్‌కు సన్నిహితులైన మీరు తర్వాత చంద్రబాబుకు ఎలా దగ్గరయ్యారు? ఎన్టీఆర్ నిజంగానే ఉన్నతమైన వ్యక్తి. కాన్షీరామ్ తర్వాత దేశంలో రాజకీయ విప్లవం తీసుకొచ్చిన నేత ఎన్టీరామారావే. ఆయనకు దూరంకావడానికి కారణం.. అప్పట్లో మమ్మల్ని పూర్తిగా తప్పుదోవ పట్టించారు. పార్లమెంటరీ ప్రజా స్వామ్యమే ప్రమాదంలో పడిందనే భావనను బాబు ప్రచారంలో పెట్టాడు. దాన్ని నేను, నాతో పాటు చాలామంది నమ్మారు. తర్వాత నిజం గ్రహించినప్పుడు ఎంతో అపరాధ భావన ఉండేది. నిజాయితీగా చెబుతున్నాను. ‘నేను ఘోర తప్పిదం చేశాను. కానీ ఆ తప్పుకు నేను భరించేటంత శిక్షను మాత్రమే నాకివ్వు’ అని దేవుణ్ని ప్రార్థించాను. చంద్రబాబు ప్రభుత్వం తీరు, విధానాలపై మీ అభిప్రాయం? చంద్రబాబు తీరు బాలేదు. అడ్డూ అదుపూ లేనివిధంగా ఏమిటీ హైప్? ఈ ఊదర గొట్టు ప్రచారం ఏమిటి? 12 ఏళ్లక్రితం నాటి గోదావరి పుష్కరాలను జవహర్ రెడ్డి అనే ఐఏఎస్ అధికారి ఒక్కరే అద్భుతంగా నిర్వహించారు. కానీ బాబు చేసిందేమిటి. పొద్దున్నించి రాత్రి వరకు అక్కడే కూర్చుని.. 29 మందిని బలిపెట్టారు. ఎందుకిదంతా? టీడీపీ భవిష్యత్తు ఎలా ఉంటుందనుకుంటున్నారు? ప్రజల్లో టీడీపీ విలువ బాగా పడిపోయింది. గత ఎన్నికల్లో మైనారిటీలు అంటే క్రిస్టియన్లు, ముస్లింలు, వెనుకబడిన వర్గాల్లో జగన్ గురించి టీడీపీ వాళ్లు బాగా వ్యతిరేక ప్రచారం చేశారు. అరుునప్పటికీ వీళ్లు టీడీపీకి ఓట్లు వేయలేదు. జగన్మోహన్ రెడ్డికే ఓట్లేశారు. పైగా వాళ్ల ఓటు ఇప్పుడు జగన్‌కే మరింతగా కన్సాలిడేట్ అయింది. థ్యాంక్స్ టు బీజేపీ, థ్యాంక్స్ టు టీడీపీ... కాపు ఉద్యమం, ముద్రగడ దీక్షపై వ్యవహరించిన తీరు బాబుకు ఎదురు తన్నింది. కాపు సామాజిక వర్గంలో వ్యతిరేకత వచ్చింది. సీమ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు? హంద్రీ-నీవా గాలేరు ప్రాజెక్టుకు వైఎస్సార్ 7 వేలకోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. బాబు తొమ్మిదేళ్ల పాలనలో కేవలం 13 కోట్లు ఖర్చుపెట్టారు. ఇప్పుడు నీళ్లు ఇచ్చి సీమను సస్యశ్యామలం చేస్తానంటున్నాడు. ఎలా చేస్తారు? ఎవరో కంటే బాబు భుజాలపై వేసుకున్నట్లు ఉంది. నదుల అనుసంధానం చేశానంటున్నారు కదా? ఈ కాలువలో నీళ్లు బక్కెట్లో తీసుకెళ్లి ఆ కాలు వలో వేస్తే అది అనుసంధానమా? దానివల్ల ఉప యోగమేమిటి? స్వతంత్ర సాగునీటి నిపుణులకు చూపించి దీనివల్ల ఎంత లాభముంది.. పోలవరం ప్రాజెక్టు జాప్యం వల్ల ఎంత నష్టం జరుగనుందని విచారించాలి. మూడేళ్లలో పోలవరం పూర్తయితే పట్టిసీ మను తీసేయాల్సి ఉంటుంది. దీన్ని పూర్తి చేయకుండా పట్టి సీమను తెస్తే రాయలసీమకు ఏం ఒరిగింది? దరిద్రం తప్ప. రాజధానిపై మీ వ్యాఖ్య ఏమిటి? నిపుణుల కమిటీ వేస్తామని, వారు ఆరునెలల్లో నివేదికను సమర్పిస్తారని దాన్ని అధ్యయనం చేసి ఒక నిర్ణయం తీసుకుంటామని విభజన చట్టంలో చెప్పారు. కానీ రాజధాని వ్యవహారాన్ని మొత్తంగా బాబు లాగేసుకున్నాడు. రైతులనుంచి సేకరించిన ఆ భూమి ఆయన ఇల్లా? పార్టీ ఆఫీసా? ఎట్టా తీసుకుంటారు? కొన్ని తరాలను శాసించేటటువంటి నిర్ణయమది. 5 కోట్ల ప్రజానీకానికి చెందిన విషయం. ఎక్కడ కట్టా లనే విషయాన్ని ప్రతిపక్షంతో మాటమాత్రంగానైనా చర్చించాలి కదా. కానీ 2050 వరకు తానే ఉంటానని చంద్రబాబు చెబుతున్నారు కదా? అంటే, ఏపీ ప్రజలను బాబు అంత తక్కువగా అంచనా వేశాడా? బాబు పాలన పట్ల వ్యతిరేకత ఉంది. ఉందని ఆయనకూ తెలుసు. తన పాలనపట్ల 80 శాతం సంతృప్తి ఉంది కానీ ఇంతకుముందుకన్నా ప్రభుత్వంలో 45 శాతం అవినీతి పెరిగిందని కూడా ఆయనే చెప్పారు. అంటే 80 శాతం సంతృప్తి చెందినవాళ్లు ఈ అవినీతిని క్షమిస్తున్నా రనా? పాలనలో చాలా అసంగతమైన విషయాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పాత్ర ఎలా ఉందనుకుంటున్నారు? జగన్ బాగానే పనిచేస్తున్నారు. గతంలో బాబుకు, జగన్‌కూ వచ్చిన ఓట్లకు సంబంధించి ఒక శాతమే తేడా ఉంది. బాబు, టీడీపీ ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా జగన్‌కు అన్ని ఓట్లు వచ్చాయి. బాబేమో మోదీ కాళ్లు పట్టుకున్నాడు. పవన్ కల్యాణ్ గడ్డం పట్టుకున్నాడు. కాపుల నడుములు పట్టుకున్నాడు. కోట్ల రైతులకు అమలు చేయలేని వాగ్దానాలు చేశాడు. ఇన్ని చేస్తే బాబుకు వచ్చిన ఓట్లు ఒక శాతం అధికం మాత్రమే. మరి రేపు పరిస్థితి ఏమిటి? ప్రభుత్వ వ్యవహారాల్లో అవినీతి ఏ స్థాయిలో ఉంది? ఓటుకు కోట్లు కేసులో యాభైలక్షల వ్యవహారం మామూలు ఆరోపణ అనుకుం టున్నారా? ముఖ్యమంత్రి ఇలాంటోడని తెలిస్తే రాష్ట్రానికి ఇక పెట్టుబడులు వస్తాయా? అవినీతిలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం అని జాతీయ సర్వేలో తేల్చారు. బాబు పని తీరు 13వ నంబర్‌కి పడిపోయింది. ఏపీలో అవినీతికి హద్దుల్లేవు. బీజేపీ, టీడీపీల సంబంధాలు ఈ మూడేళ్లు సజావుగా ఉంటాయంటారా? వాళ్లూ విడిపోవాలని ఉన్నారు. వీళ్లూ అదే ఆలోచనతోటే ఉన్నారు. వాడుకున్న తర్వాత బాబే కొంతకాలానికి వదిలేస్తాడు. కానీ బీజేపీ వాళ్లు కూడా ఈసారి బాబుతో ఉంటే తాము ఎదగలేమని పొత్తునుంచి వెళ్లిపోవాలనే పద్ధతిలో ఉన్నారని తెలుస్తోంది. చివరగా 2019.. రేపటి ఎన్నికలపై మీ అంచనా ఏమిటి? 2019లో టీడీపీ పూర్తిగా అధికారంలోకి వస్తుందనుకుంటే అది కల్ల. ఇక కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం తప్పకుండా పెరుగుతుంది. పార్టీ చావలేదు కానీ రోగగ్రస్తురాలిగా మారింది. కోలుకుంటామని నాకు నూరుశాతం నమ్మకం ఉంది. కాబట్టి 2019లో ఏపీలో అధికారంలోకి రావాలనుకుంటున్నవారు మా తలుపులు తట్టవలసి ఉంటుంది. మేం ఎవరితో కలవచ్చు. కలవకూడదు అనేది మా ఎంపికే. (సి. రామచంద్రయ్యతో ఇంటర్వ్యూ పూర్తి పాఠాన్ని కింది లింకులో చూడండి) https://www.youtube.com/watch?v=yFLrKnVHRcA