ఏకపక్ష పాలన ఎన్నాళ్లో సాగదు...! | KSR interview with c ramachandraiah | Sakshi
Sakshi News home page

ఏకపక్ష పాలన ఎన్నాళ్లో సాగదు...!

Published Wed, Sep 14 2016 1:32 AM | Last Updated on Tue, Aug 14 2018 3:05 PM

ఏకపక్ష పాలన ఎన్నాళ్లో సాగదు...! - Sakshi

ఏకపక్ష పాలన ఎన్నాళ్లో సాగదు...!

కొమ్మినేని శ్రీనివాసరావుతో ఏపీ శాసనమండలి విపక్ష నేత సి. రామచంద్రయ్య
 
ఒక పార్టీ గుర్తుతో గెలిచిన నేతలకు ఇంకొక పార్టీవారు కండువా కప్పటం దిగజారిన రాజకీయాలకు సంకేతమని ఏపీ శాసనమండలిలో విపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు సి. రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల దృష్టిలో ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిపోయిందని, బాబు పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. అవినీతి కంపులో మునుగుతున్న  తెలుగుదేశం పార్టీ 2019లో మళ్లీ అధికారంలోకి వస్తుందనుకుంటే అది కల్ల అన్నారు, ఏపీ ప్రజలను తక్కువగా అంచనా వేస్తే చరిత్ర పునరావృతమవుతుందని హెచ్చరిస్తున్న సి. రామచంద్రయ్య ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
 
మొదట్లో ఎన్టీఆర్‌కు సన్నిహితులైన మీరు తర్వాత చంద్రబాబుకు ఎలా దగ్గరయ్యారు?
 ఎన్టీఆర్ నిజంగానే ఉన్నతమైన వ్యక్తి. కాన్షీరామ్ తర్వాత దేశంలో రాజకీయ విప్లవం తీసుకొచ్చిన నేత ఎన్టీరామారావే. ఆయనకు దూరంకావడానికి కారణం.. అప్పట్లో మమ్మల్ని పూర్తిగా తప్పుదోవ పట్టించారు. పార్లమెంటరీ ప్రజా స్వామ్యమే ప్రమాదంలో పడిందనే భావనను బాబు ప్రచారంలో పెట్టాడు. దాన్ని నేను, నాతో పాటు చాలామంది నమ్మారు. తర్వాత నిజం గ్రహించినప్పుడు ఎంతో అపరాధ భావన ఉండేది. నిజాయితీగా చెబుతున్నాను. ‘నేను ఘోర తప్పిదం చేశాను. కానీ ఆ తప్పుకు నేను భరించేటంత శిక్షను మాత్రమే నాకివ్వు’ అని దేవుణ్ని ప్రార్థించాను.

 చంద్రబాబు ప్రభుత్వం తీరు, విధానాలపై మీ అభిప్రాయం?
 చంద్రబాబు తీరు బాలేదు. అడ్డూ అదుపూ లేనివిధంగా ఏమిటీ హైప్? ఈ ఊదర గొట్టు ప్రచారం ఏమిటి? 12 ఏళ్లక్రితం నాటి గోదావరి పుష్కరాలను జవహర్ రెడ్డి అనే ఐఏఎస్ అధికారి ఒక్కరే అద్భుతంగా నిర్వహించారు. కానీ బాబు చేసిందేమిటి. పొద్దున్నించి రాత్రి వరకు అక్కడే కూర్చుని.. 29 మందిని బలిపెట్టారు. ఎందుకిదంతా?
 
టీడీపీ భవిష్యత్తు ఎలా ఉంటుందనుకుంటున్నారు?
 ప్రజల్లో టీడీపీ విలువ బాగా పడిపోయింది. గత ఎన్నికల్లో మైనారిటీలు అంటే క్రిస్టియన్లు, ముస్లింలు, వెనుకబడిన వర్గాల్లో జగన్ గురించి టీడీపీ వాళ్లు బాగా వ్యతిరేక ప్రచారం చేశారు. అరుునప్పటికీ వీళ్లు టీడీపీకి ఓట్లు వేయలేదు. జగన్‌మోహన్ రెడ్డికే ఓట్లేశారు. పైగా వాళ్ల ఓటు ఇప్పుడు జగన్‌కే మరింతగా కన్సాలిడేట్ అయింది. థ్యాంక్స్ టు బీజేపీ, థ్యాంక్స్ టు టీడీపీ... కాపు ఉద్యమం, ముద్రగడ దీక్షపై వ్యవహరించిన తీరు బాబుకు ఎదురు తన్నింది. కాపు సామాజిక వర్గంలో వ్యతిరేకత వచ్చింది.

 సీమ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు?
 హంద్రీ-నీవా గాలేరు ప్రాజెక్టుకు వైఎస్సార్ 7 వేలకోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. బాబు తొమ్మిదేళ్ల పాలనలో కేవలం 13 కోట్లు ఖర్చుపెట్టారు. ఇప్పుడు నీళ్లు ఇచ్చి సీమను సస్యశ్యామలం చేస్తానంటున్నాడు. ఎలా చేస్తారు? ఎవరో కంటే బాబు భుజాలపై వేసుకున్నట్లు ఉంది.

 నదుల అనుసంధానం చేశానంటున్నారు కదా?
 ఈ కాలువలో నీళ్లు బక్కెట్లో తీసుకెళ్లి ఆ కాలు వలో వేస్తే అది అనుసంధానమా? దానివల్ల ఉప యోగమేమిటి? స్వతంత్ర సాగునీటి నిపుణులకు చూపించి దీనివల్ల ఎంత లాభముంది.. పోలవరం ప్రాజెక్టు జాప్యం వల్ల ఎంత నష్టం జరుగనుందని విచారించాలి. మూడేళ్లలో పోలవరం పూర్తయితే పట్టిసీ మను తీసేయాల్సి ఉంటుంది. దీన్ని పూర్తి చేయకుండా పట్టి సీమను తెస్తే రాయలసీమకు ఏం ఒరిగింది? దరిద్రం తప్ప.  

 రాజధానిపై మీ వ్యాఖ్య ఏమిటి?
నిపుణుల కమిటీ వేస్తామని, వారు ఆరునెలల్లో నివేదికను సమర్పిస్తారని దాన్ని అధ్యయనం చేసి ఒక నిర్ణయం తీసుకుంటామని విభజన చట్టంలో చెప్పారు. కానీ రాజధాని వ్యవహారాన్ని మొత్తంగా బాబు లాగేసుకున్నాడు. రైతులనుంచి సేకరించిన ఆ భూమి ఆయన ఇల్లా? పార్టీ ఆఫీసా? ఎట్టా తీసుకుంటారు? కొన్ని తరాలను శాసించేటటువంటి నిర్ణయమది. 5 కోట్ల ప్రజానీకానికి చెందిన విషయం. ఎక్కడ కట్టా లనే విషయాన్ని ప్రతిపక్షంతో మాటమాత్రంగానైనా చర్చించాలి కదా.

 కానీ 2050 వరకు తానే ఉంటానని చంద్రబాబు చెబుతున్నారు కదా?
 అంటే, ఏపీ ప్రజలను బాబు అంత తక్కువగా అంచనా వేశాడా? బాబు పాలన పట్ల వ్యతిరేకత ఉంది. ఉందని ఆయనకూ తెలుసు. తన పాలనపట్ల 80 శాతం సంతృప్తి ఉంది కానీ ఇంతకుముందుకన్నా ప్రభుత్వంలో 45 శాతం అవినీతి పెరిగిందని కూడా ఆయనే చెప్పారు. అంటే 80 శాతం సంతృప్తి చెందినవాళ్లు ఈ అవినీతిని క్షమిస్తున్నా రనా? పాలనలో చాలా అసంగతమైన విషయాలున్నాయి.

 ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పాత్ర ఎలా ఉందనుకుంటున్నారు?
 జగన్ బాగానే పనిచేస్తున్నారు. గతంలో బాబుకు, జగన్‌కూ వచ్చిన ఓట్లకు సంబంధించి ఒక శాతమే తేడా ఉంది. బాబు, టీడీపీ ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా జగన్‌కు అన్ని ఓట్లు వచ్చాయి. బాబేమో మోదీ కాళ్లు పట్టుకున్నాడు. పవన్ కల్యాణ్ గడ్డం పట్టుకున్నాడు. కాపుల నడుములు పట్టుకున్నాడు. కోట్ల రైతులకు అమలు చేయలేని వాగ్దానాలు చేశాడు. ఇన్ని చేస్తే బాబుకు వచ్చిన ఓట్లు ఒక శాతం అధికం మాత్రమే. మరి రేపు పరిస్థితి ఏమిటి?

 ప్రభుత్వ వ్యవహారాల్లో అవినీతి ఏ స్థాయిలో ఉంది?
 ఓటుకు కోట్లు కేసులో యాభైలక్షల వ్యవహారం మామూలు ఆరోపణ అనుకుం టున్నారా? ముఖ్యమంత్రి ఇలాంటోడని తెలిస్తే రాష్ట్రానికి ఇక పెట్టుబడులు వస్తాయా? అవినీతిలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం అని జాతీయ సర్వేలో తేల్చారు. బాబు పని తీరు 13వ నంబర్‌కి పడిపోయింది. ఏపీలో అవినీతికి హద్దుల్లేవు.

 బీజేపీ, టీడీపీల సంబంధాలు ఈ మూడేళ్లు సజావుగా ఉంటాయంటారా?
 వాళ్లూ విడిపోవాలని ఉన్నారు. వీళ్లూ అదే ఆలోచనతోటే ఉన్నారు. వాడుకున్న తర్వాత బాబే కొంతకాలానికి వదిలేస్తాడు. కానీ బీజేపీ వాళ్లు కూడా ఈసారి బాబుతో ఉంటే తాము ఎదగలేమని పొత్తునుంచి వెళ్లిపోవాలనే పద్ధతిలో ఉన్నారని తెలుస్తోంది.

చివరగా 2019.. రేపటి ఎన్నికలపై మీ అంచనా ఏమిటి?
 2019లో టీడీపీ పూర్తిగా అధికారంలోకి వస్తుందనుకుంటే అది కల్ల. ఇక కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం తప్పకుండా పెరుగుతుంది. పార్టీ చావలేదు కానీ రోగగ్రస్తురాలిగా మారింది. కోలుకుంటామని నాకు నూరుశాతం నమ్మకం ఉంది. కాబట్టి 2019లో ఏపీలో అధికారంలోకి రావాలనుకుంటున్నవారు మా తలుపులు తట్టవలసి ఉంటుంది. మేం ఎవరితో కలవచ్చు. కలవకూడదు అనేది మా ఎంపికే.
 (సి. రామచంద్రయ్యతో ఇంటర్వ్యూ పూర్తి పాఠాన్ని కింది లింకులో చూడండి)
https://www.youtube.com/watch?v=yFLrKnVHRcA

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement