ఆ అన్న భరణమే ఈ చెల్లి జీవితం | Sabita indrareddy interview with Kommineni | Sakshi
Sakshi News home page

ఆ అన్న భరణమే ఈ చెల్లి జీవితం

Published Wed, Dec 7 2016 2:05 AM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM

మహానేత వైఎస్సార్ తో సబితా ఇంద్రారెడ్డి(ఫైల్)

మహానేత వైఎస్సార్ తో సబితా ఇంద్రారెడ్డి(ఫైల్)

మనసులో మాట: కొమ్మినేని శ్రీనివాసరావుతో మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి
 
రాజకీయాలంటే అసలు ఓనమాలు కూడా తెలియకున్నప్పటికీ, అనూహ్యమైన పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చానంటున్న మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి.. మహిళలు రాజకీయాల్లో ఎక్కడా వెనుకంజలో లేరు అంటున్నారు. చేవెళ్ల చెల్లెలిపై వైఎస్. రాజశేఖరరెడ్డి చూపిన అభి మానమే ఇంత స్థాయికి తీసుకొచ్చిందని కృతజ్ఞత చెబుతూనే, ఓదార్పు యాత్రను అధిష్టానం వ్యతిరేకించడంలో అందరి తప్పూ ఉండవచ్చంటున్నారు. వైఎస్సార్ ఉన్నప్పుడే తెలంగాణ విషయం చర్చల్లో ఉండి, తప్పకుండా ఇస్తారని మా అందరికీ తెలిసినప్పటికీ రెండేళ్లకు ముందే నిర్ణయం ప్రకటించి ఉంటే రెండు రాష్ట్రాల్లోనూ పరిస్థితి అనుకూలంగా ఉండేదని అంటున్న సబితా ఇంద్రారెడ్డి అభిప్రాయాలు ఆమె మాటల్లోనే...
 
రాజకీయాల మీద ఆసక్తి ఎలా కలిగింది?
పెళ్లి తర్వాతే రాజకీయాలు అంటే ఏమిటో తెలిసింది. అంతకుముందు సర్పంచ్ అంటే ఏమిటో కూడా తెలీదు. రాజకీయాలకు సంబంధంలేని కుటుంబం మాది. ఆయనతో జీవితం మొదలైన తర్వాతే రాజకీయం అంటే ఇదీ అని తెలిసింది.
 
మీ భర్త ఉన్నట్లుండి ప్రమాదంలో పోయాక మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?
ఆయన స్థానంలో రాజకీయాల్లోకి రావాలనికానీ, వస్తాననికానీ అనుకోలేదు. పైగా ఆయన పోయిన షాక్‌లో ఉన్నాను. ఎవరొచ్చి అడిగినా రానని చెప్పేదాన్ని. టీడీపీ నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి చనిపోయారు కాబట్టి దాన్ని వదిలి పెట్టడం బాగోదనుకున్నాను. ఈ నేపథ్యంలో రాజశేఖరరెడ్డి అన్న  నన్ను పలకరించడానికి ఇంటికి వచ్చారు. ‘అమ్మా రాజకీయాలు అనేవి తర్వాతి సంగతి. కానీ ఇంద్రారెడ్డి కొన్ని  రోజులే అయినా, నాకు దగ్గరగా వచ్చాడు. నా కుడిభుజం కోల్పోయినట్లుగా ఉంది. నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి  వస్తే ఒక సొంత చెల్లెలుగా నీ బాగోగులు చూసుకుంటాను’ అన్నారు. భగవంతుడు ఒక  విధంగా అన్యాయం చేసి మరొక రకంగా న్యాయం చేస్తున్నాడని అనుకున్నాను.
 
టీడీపీ చీలిపోయినప్పుడు ఇంద్రారెడ్డి ఏవిధంగా ఆలోచించారు?
పార్టీలో తీవ్ర పరిణామాలు జరుగుతున్నారుు ఏం చేయాలని ఆయన ఇంటికొచ్చి నాకు చెప్పారు. చంద్రబాబువైపు వెళితే హోంమంత్రి పదవి అలాగే ఉంటుంది. ఎన్టీఆర్ వైపు వస్తే పదవి పోతుంది అని చెప్పారు. ఆ రోజు ఇంట్లో ఉన్నవాళ్ల మంతా పదవి పోయినా పర్వాలేదు ఎన్టీఆర్‌వైపే ఉండాలని చెప్పాం. తర్వాత ఎన్టీఆర్ వైపే ఉండిపోయారు. ఎన్టీఆర్ మరణించిన తర్వాత కూడా లక్ష్మీపార్వతికే మద్దతుగా నిలిచారు. తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు. ఆపై కాంగ్రెస్‌లోకి వెళ్లారు.
 
వైఎస్సార్ పాదయాత్ర ఘట్టంపై మీ వ్యాఖ్య ఏమిటి?
వైఎస్సార్ అన్న పాదయాత్ర చేయాలని నిర్ణయించుకుని నన్ను పిలిపించుకుని తాండూరు నుంచి యాత్ర  మొదలెట్టాలనుకుంటున్నానమ్మా అని చెప్పారు. కర్నాటక సరిహద్దులో ఉంటుంది తాండూరు. నేను సరే  అన్నాను. ‘కానీ మీరు తాండూరు నుంచే యాత్ర మొదలెడతారు కాబట్టి ముందుగా చేవెళ్లలో ఒక  బహిరంగసభ పెడతాను అక్కడ మాట్లాడి తర్వాత తాండూరు నుంచి మొదలెట్టండ’ని కోరాను. సరేనన్నారు. కొద్ది రోజుల తర్వాత ‘మీ ఊరునుంచే యాత్ర మొదలెడతా నమ్మా’ అన్నారు. నేను వ్యతిరేకించాను. ‘పాదయాత్రను మీరు తాండూరునుంచే మొద లెట్టండి చేవెళ్లలో బహిరంగ సభ పెడతాను’ అన్నాను.
 
చేవెళ్లనుంచి పాదయాత్రకు మీరెందుకు వద్దన్నారు?
సమాజంలో ఒక ముద్ర అయితే ఉంది కదా. భర్త చనిపోయినవారు అని, అమంగళం అని సెంటిమెంట్‌తో ఆలోచించాను. ‘నువ్వు అలా అన్నావు కదా. ఇక్కడి నుంచి మొదలెడతాను’ అనేశారాయన. అది ఆయన  గొప్పతనం. అంత సుదీర్ఘయాత్ర కదా. మంచి జరిగితే సరే. కానీ చెడు జరిగితే ఇక జీవితాంతం మమ్మల్ని మేం క్షమించుకోలేం కదా. పైగా సమాజంలో మళ్లీ మరొక ముద్ర వేస్తారు. ‘అలా అంటు న్నావు కాబట్టి ఇక్కడ్నుంచే మొదలెడతాను’ అనగానే ఇక నాకు టెన్షన్ మొదలయింది.
 
సెంటిమెంటుతో మీరు  వద్దన్నా ఆయన వినక పోవడం అపూర్వం కదా?
పాదయాత్ర మొదలైనప్పటినుంచి నేనయితే ఇంట్లో కూర్చునే టెన్షన్ పడ్డాను. మధ్యలో రాజమండ్రిలో అన్న  జబ్బుపడ్డారనగానే కంగారు మరింత పెరిగింది. పాద యాత్ర పూర్తయేంతవరకు నాకు ఆందోళనగానే ఉండింది. తర్వాత కరీంనగర్‌లో కలిసి నప్పుడు.. వద్దంటున్నా వినకుండా మా ఊరినుంచే మొదలెట్టారు కదా అన్నాను. అవన్నీ మామూలే కదా, ఏం కాదు అని కొట్టిపడేశారాయన.
 
మీకు మంత్రి పదవి ఎలా వచ్చింది?
నేను అసలు ఊహించలేదు. తాండూరు ఎమ్మెల్యే నారాయణరావు మాకంటే సీని యర్ కాబట్టి వస్తే ఆయనకే పదవిరావాలి అనుకున్నాను. రాత్రి భోజనం చేసి పడు కుంటే పదకొండున్నరకు కాల్ వచ్చింది. మరుసటి రోజు ప్రమాణ స్వీకారానికి రావమ్మా అని పిలుపు. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. అదే అన్న గొప్ప తనం. ఊహించని పరిణామం అది. చేవెళ్ల చెల్లెలికి మరచిపోని తీపి గుర్తు అన్నమాట. తర్వాత పల్లెబాట పథకాన్ని కూడా చేవెళ్లనుంచే మొదలెడతానని చెప్పారు. ఇదొకటే కాదు ఏ కొత్త కార్యక్రమం చేప ట్టినా అన్న చేవెళ్లనుంచే మొదలెట్టేవారు. దురదృష్టమో ఏమో కాని రచ్చబండ కార్యక్రమాన్ని అన్న చేవెళ్ల నుంచి మొదలెట్టలేదు. అలా జరిగి ఉంటే రాజశేఖర రెడ్డి అన్న బతికి ఉండేవారేమో అనిపిస్తుంది.
 
జగన్‌కి పదవి ఇవ్వాలని మీరు కోరితే.. రోశయ్యకు ఎలా పట్టం కట్టారు?
వైఎస్సార్ మీద అభిమానంతోనే ఆరోజు జగన్‌కి అధికారం ఇవ్వాలని మేం భావించాం. కాని అధిష్టానం చివరగా ఏం నిర్ణయించినా కట్టుబడాల్సిందే. రోశయ్య సీఎం అయ్యాక కొన్నిరోజులు ఓపిక పట్టి సర్దుకుపోవాల్సిందిగా జగన్ ని మేం కోరాం. 
 
ఓదార్పు యాత్రను అడ్డుకోవడంలో తప్పు ఎవరిది?
అన్ని కోణాల్లోంచి చూస్తే అందరిదీ తప్పే అనిపిస్తుంది. అధిష్టానం జగన్ ని పిలి చిన సందర్భంలో కూడా నేనూ, రఘువీరారెడ్డి జగన్‌ని కలిసి అభ్యర్థించాం. ఓదార్పు యాత్ర అంటున్నారు కదా. కొన్ని రోజులు ఓపిక పట్టు, అందరం చర్చించి చేద్దాం అని కూడా గంటసేపు జగన్ కి నచ్చచెప్పడానికి ప్రయత్నించాం.
 
హోంమంత్రిగా ఉద్యమాన్ని నియంత్రిం చాల్సి వచ్చినప్పుడు మీ ఫీలింగ్స్ ఏమిటి?
తెలంగాణకు పూర్తి మద్దతుగా ఉన్న ఇంద్రారెడ్డి భార్యగా ఉద్యమాన్ని అదుపు చేయాల్సి రావడం చాలా బాధనిపించింది. పదవికి రాజీనామా చేయాలని కూడా అని పించింది. కానీ మహిళలకు చిన్న చిన్న పద వులు ఇస్తున్నారు. పెద్ద పదవులు ఇస్తే ఇలాగే వాళ్లు నిలబెట్టుకోలేరు అని ఆరోపిస్తారు. మహిళా లోకంమీదే నిందవేసే ప్రయత్నం చేస్తారు. సులభంగా వ్యాఖ్యలు చేస్తారు కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీనామా చేయవద్దని అనుకున్నాను. 
 
15 ఏళ్లకు ముందు, ఇప్పుడు మీలో చాలా తేడా కనపడుతోంది. ఈ రాజకీయ పరిణతిని ఎలా సాధించారు?
మనిషి నిరంతర విద్యార్థి. రాజకీయాల్లో అడుగడుగునా నేర్చుకోవడానికి అవ కాశం ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ చేయాలనే తపన తనంతట తాను వచ్చేస్తుంది. రాజకీయాలు అంటే పనిష్మెంట్  అని నేను ఒక సందర్భంలో వ్యాఖ్యానిస్తే నా భర్త ఇంద్రారెడ్డి వ్యతిరేకించారు. రాజకీయాల్లో ఉన్న తృప్తి నీకు అర్థం కాదన్నారు. అది ఇప్పుడు నాకు అర్థమవుతోంది. అందుకే ఆయన మాటలు ఎప్పుడూ గుర్తు  చేసుకుంటుంటాను. రాజకీయాల్లో వేసే ప్రతి అడుగులోను ఎంతో కొంత నేర్చు కుంటూ ఉంటాము.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement