పన్నెండేళ్ల అమ్మాయి పదహారేళ్ల్ల అమ్మాయి గురించి కథ రాస్తే ఎలా ఉంటుంది?! ఏడవతరగతి చదువుతున్న పన్నెండేళ్ల పట్లోళ్ల అక్షయినీ రెడ్డి రాసిన ‘ట్రైల్ ఆఫ్ మిస్‌ఫార్చ్యూన్’ పుస్తకం ద్వారా మనకు ఈ విషయాలు తెలుస్తాయి. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మనవరాలు అక్షయినీ రెడ్డి.
‘‘మా నానమ్మ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారో రోజూ చూస్తుంటాను. నానమ్మ, అమ్మ, నాన్న.. మా ఇంట్లోని వ్యక్తులే నాకు స్ఫూర్తి. నానమ్మ లైఫ్ గురించి ఒక బుక్ రాయాలనుకుంటున్నాను...’ అంటూ ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది.
‘‘నాకు కథలపైన ఆసక్తి మొదలైందంటే అమ్మ చెప్పిన స్టోరీస్ వల్లే. రోజూ రాత్రి పడుకునే ముందు అమ్మ రకరకాల కథలు చెబుతుంటుంది. తముణ్ణి, నన్ను బయటకు తీసుకెళ్లినప్పుడైనా, కాస్త టైమ్ దొరికినా ఏదో చిట్టి కథ ఉంటుంది. సెకండ్ క్లాస్‌లో ఉన్నప్పుడు కథలు చెప్పి, వాటిని షార్ట్ ఫార్మ్‌లో రాసి చూపించమనేది. తర్వాత్తర్వాత పుస్తకాల్లోని కథలు చదివినా, వాటిని ఒక చిన్న పేరాలో రాసి చూపించేదాన్ని.
ఈ అలవాటు నాకు పుస్తకాలంటే ఇష్టం పెరిగేలా చేసింది. ఇప్పుడు నా కోసం ఇంట్లో ఓ లైబ్రరీయే ఏర్పాటు చేశారు. ఎక్కువ భాగం ఇంగ్లిష్‌వే ఉంటాయి. ఫారినర్స్ రాసినవి, సుధామూర్తి రచనలు బాగా చదువుతాను. ఒక బుక్ చదివాక బాగా నచ్చితే ఆ బుక్ నుంచి మరొక స్టోరీ రాస్తాను. ‘ట్రైల్ ఆఫ్ మిస్ ఫార్చ్యూన్’ పుస్తకం అలా రాసిందే. నానమ్మ, నాన్న, అమ్మ, స్కూల్లో టీచర్స్, ఫ్రెండ్స్.. చాలా మెచ్చుకున్నారు.
బలమైన వ్యక్తిత్వం
‘ట్రైల్ ఆఫ్ మిస్ ఫార్చ్యూన్’ బుక్ లో పదహారేళ్ల అమ్మాయి పేరు ఆటమ్. ఆమె భావోద్వేగాలు ఈ పుస్తకం నిండా ఉంటాయి. ఒక చిన్న వెకేషన్ కోసం తల్లిదండ్రులను ఒప్పించి మెక్సికోకు బయల్దేరుతుంది. అనుకోని సంఘటనలో తల్లి మరణిస్తుంది. తమ కుటుంబం నుంచి దూరమైన ఆంటోనియోను కలుసుకుంటుంది. క్షేమకరం కాని ఆ ్రపాంతంలో ఉండలేక మెక్సికో నుంచి వాళ్లు లండన్‌కు చేరుకుంటారు. అక్కడ జేమ్సన్ అనే వ్యక్తిని కలుస్తారు.
జేమ్సన్ కుటుంబంతో ఉండటమూ క్షేమకరం కాదని అర్థమై తండ్రి, ఆంటోనియోలతో కలిసి జర్మనీకి వెళ్లిపోతుంది. జీవితమెప్పుడూ సంతోషంగా ఉండాలనుకునే ఆటమ్ ప్రతినిత్యం సమస్యలతో చేసే ప్రయాణం గురించి ఈ కథ వివరిస్తుంది. ఆ అమ్మాయి స్నేహాలను ఎలా డెవలప్ చేసుకుంటుంది, ఫ్యామిలీని ఎలా చూసుకుంటుంది, ఒకమ్మాయి ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి అనే విషయాలు నేర్పిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే హ్యాపీ ఎండింగ్ తప్పక దొరుకుతుంది అనే హోప్‌ని ఇస్తుంది.
నా ఫ్రెండ్స్ టైటిల్ విషయంలో, కవర్ పేజీ విషయంలో సాయం చేశారు. ఈ బుక్ కోసం ఏడాది పాటు వర్క్ చేశాను. నిజానికి 16 ఏళ్ల అమ్మాయి ఎలా ఆలోచిస్తుంది అనే విషయాలను గురించి అంతగా మ్యాచ్ చేయలేకపోవచ్చు. నా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరూ బుక్స్ బాగా చదువుతారు. వారికి ఈ పుస్తకంలో స్నేహపూర్వక స్వభావం, స్ట్రాంగ్ విల్‌పవర్, వ్యక్తిత్వం బాగా నచ్చాయి. నా ఫ్రెండ్స్‌కు నేను రాసిన స్టోరీ నచ్చింది. నా ఫ్రెండ్స్ ఈ బుక్ కొని చాలా సపోర్ట్ చేశారు. స్కూల్లో అందరూ నన్ను అభినందించారు. కొందరు మంచి విమర్శలు కూడా చేశారు.
ఎంతో నేర్చుకోవాలి...
రచనలు చేయడంలో చాలా నేర్చుకోవాల్సి ఉందని నాకు ఈ పుస్తకం ద్వారా తెలిసి వచ్చింది. వచ్చిన విమర్శల నుంచి కూడా నేర్చుకుంటున్నాను. స్టోరీలో ఒక పాత్రను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఆ క్యారెక్టర్‌ని ఎలా డెవలప్ చేయాలి, స్టోరీ ΄్లాట్ ఎలా రాయాలి.. వంటివి నేర్చుకోవాలి. ఇదంతా తెలుసుకుంటూనే నా రచనల్లో వాటిని ఇంక్లూడ్ చేస్తూ వెళ్లాలని ఉంది. ముఖ్యంగా మా నానమ్మ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారో చూస్తుంటాను.
నానమ్మ గురించి ఒక బుక్ రాయాలనుకుంటున్నాను. అందుకు, నేను ఇంకా చాలా నేర్చుకోవాలి. మంచి రైటర్‌గా, బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా పేరుతెచ్చుకుంటూనే లాయర్‌ని అవ్వాలనే లక్ష్యంతో చదువుకుంటున్నాను. లాయర్‌గా న్యాయం కోసం పోరాటం చేస్తూనే, నా రచనల ద్వారా కొంతమందినైనా ప్రభావితం చేయాలనేది నా ముందున్న లక్ష్యం’’ అంటూ తెలిపింది ఈ బాల రచయిత్రి.
టైమ్ క్రియేషన్
ఈ బుక్ రిలీజ్ అయ్యాక మా ఫ్రెండ్స్‌తో సహా కొంతమంది నీకు టైమ్ ఎలా సరిపోతుంది అని అడిగారు. నేను టైమ్‌ను క్రియేట్ చేసుకున్నాను. రోజులో ఒక గంటసేపు ఈ బుక్ కోసం కేటాయించుకున్నాను. మొత్తం ఇరవై ఐదు వేల పదాలు. నేనే స్వయంగా టైప్ చేసి, ఎడిటింగ్ చేసుకుంటూ, తిరిగి మార్పులు చేసుకుంటూ రాశాను. దీనిని బుక్‌గా తీసుకురావడానికి అమ్మవాళ్లకు చెప్పకుండానే నలుగురు పబ్లిషర్స్‌తో మాట్లాడాను. వాళ్లు ఆశ్చర్యపోయారు. పబ్లిషర్స్ అమ్మ వాళ్లను అ్రపోచ్ అవడంతో... ఈ పని ఈజీ అయ్యింది.
– నిర్మలారెడ్డి
ఫొటోలు: గడిగె బాలస్వామి
Comments
Please login to add a commentAdd a comment