♦ మనసులో మాట
రాజకీయనేతగా కంటే వ్యక్తిగా వైఎస్ రాజశేఖరరెడ్డి చాలా మంచిమనిషని, ఈ మనిషి ఉంటే చాలు అనే నమ్మకం ప్రజ లకు ఇచ్చిన గొప్పనేత అని శతాధిక చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ పేర్కొన్నారు. ఏ రంగంలో అయినా పొగిడేవారి కంటే విమర్శించే వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సరైన విధంగా నచ్చచెప్పగలిగితే ఎంతటి ప్రముఖులైనా మనం చెప్పింది వింటారనేది చిత్రజీవితంలో తాను పొందిన మంచి అనుభవమన్నారు. రాజకీయ జీవితంలో క్షణం కూడా ఖాళీగా గడపకుండా వైఎస్ జగన్ అందరి అభిమానాన్ని చూరగొంటున్నారని, ఆయన కృషి ఫలిస్తుందని చెబుతున్న కోడి రామకృష్ణ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...
సినిమాకు చెందిన అన్ని శాఖల్లోనూ ఇంత అనుభవం ఎలా సాధించారు?
దర్శకుడికి బాయ్ చేసే పని నుంచి దర్శకుడు చేసే పనివరకు అన్నీ తెలిసి ఉండాలి. మనవద్ద పనిచేసే బాయ్ కష్టం కూడా తెలియాలి. అందుకే కాఫీ అనగానే బాయ్‌ని కేకేయకూడదు. తను ఏ కష్టంలో ఉన్నాడో చూసి అడగాలి. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటినుంచి నేను ఎడిటర్ పనేమింటి, అసిస్టెంట్ పనేమిటి, మ్యూజిక్ ఏమిటి, ఎలా చేస్తారు.. రైటర్ ఎవరు అని అన్నీ తెలుసుకుం టాను. వారినుంచి సహాయం తీసుకుంటాను. ప్రతి రంగంలోనూ ఒక సమర్థుడిని పెట్టుకుంటాను. సమర్థుడు అంటే నన్ను విమర్శించాలి. ఇది బాగా లేదు సార్ అనగలగాలి. అప్పుడే మళ్లీ వెనక్కు చూసుకుంటాం.
సినీరంగంలో పొగడ్తలు తప్పవు కదా?
పొగడటం అనేది విషం లాంటిది. మన తప్పును మనకు చెప్పే విమర్శ అద్దం లాంటిది. నాకు పొగిడేవారంటే భయం. విమర్శ మనం వెళ్లే దారిలో ఒక సిగ్నల్ లాంటిది. లేదు సార్, బాగా లేదు సర్, మనం పలాని అంశంలో రాజీపడిపోతున్నాం డైరెక్టర్ గారూ అని ఎవరన్నా అంటే వెంటనే అమ్మా అనుకుని అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ జాగ్రత్త పడాలి.
పెద్ద డైరెక్టర్లు, నటులను కూడా మీరు విమర్శించేవారా?
ప్రతి ఒక్కరికీ ఒక సైకాలజీ ఉంటుంది. కానీ నేరుగా విమర్శించకూడదు. భానుమతి గారున్నారు. ఆమె డైరెక్టర్, రచయిత, నటి. ఆమెకు ఒక సీన్ చెప్పామంటే తన సూచన చెబుతారు. ఒకే మేడమ్ బాగుంది పెడతాము అని చెప్పి పది నిమిషాలు ఆగి, ఇక్కడ ఇలా వచ్చింది మేడం. ఫరవాలేదా అని అడిగితే అలా వచ్చిందా, అయితేవద్దు తీసేద్దాం అని ఆమె సమాధానపడేవారు. అదే వెంటనే చెబితే కోపం వచ్చేస్తుంది కదా. మంగమ్మగారి మనవడు స్క్రిప్ట్ వినిపించాను. ఆ సినిమాలో ఆవిడ పాత్రకి డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువ ఉంటాయి. గోపాల్‌రెడ్డిగారు, గణేష్ పాత్రో గారు నేను ఆమె వద్దకు వెళ్లి స్క్రిప్టు చదివి వినిపించగానే సర్రున లేచి వెళ్లిపోయిందామె. ‘వెళ్లిపోండి మీరు బయటకు, కాఫీలు ఇవ్వ డం కూడా దండగ మీకు. భానుమతి అంటే ఏమనుకున్నారు’ అంటూ మండిపడ్డారు. లేదమ్మా, తప్పకుండా స్క్రిప్టు మారుస్తాము అని ఒప్పించాము. సరే మార్చండి అన్నారు. ఆ తర్వాతి రోజు పొద్దున్నే కోడూరులో షూటింగ్. అన్నీ సరిగా ఉన్నాయా లేదా అని ఆమె టెన్షన్ పడుతున్నారు. ఆమె ముందుకు వెళ్లి డైలాగ్ చూపిం చాను. ఫస్ట్ షాట్. చుట్టూ జనం. ‘భయంకర బల్లి బట్టల్లేకుండా స్నానం చేస్తూ బావగారు వచ్చారని లేచి నిలబడిందట’ అని డైలాగ్. ఏకధాటిగా చెప్పేసింది. షాట్ ఓకే. జనమంతా చప్పట్లు కొట్టేశారు. ఆమెకు ఆశ్చర్యమేసింది. నిన్న మీరు వద్దన్న డైలాగ్ ఇదే అని చెప్పాను. అన్ని డైలాగులూ ఇదేరకంగా చెప్పండి మీరు. సినిమా సంవత్సరం ఆడుతుందన్నాను. అలాగే చెబుతాను అని ఒక్క డైలాగ్ కూడా మార్చకుండా అన్నీ చెప్పేశారామె. నచ్చచెప్పడంలోనే ఉందండి అసలు విషయం.
ఎన్టీఆర్ పరాభవానికి తప్పు మామదా? లేక అల్లుడిదా?
మన ఇంట్లో ఏం జరుగుతోంది, మన చుట్టూ ఏం జరుగుతోందని నిత్యం పరిశీలించుకోవాలి. పనిమనిషి నమ్మకంగా పనిచేస్తూ మన ఇంట్లోనే దొంగతనం చేసిందంటే కారణం ఆమె పరిస్థితులను, ఇబ్బందులను మనం అర్థం చేసుకోకపోవడమే. అవసరాలు వారిని డామినేట్ చేసినప్పుడు అందుబాటులో ఉన్న వస్తువు ఏదైనా సరే తీసుకోవాలనిపిస్తుంది. అందుకే పరిస్థితుల ప్రాబల్యమే రామారావు అలా కావడానికి కారణం అని నమ్ముతాను.
వైఎస్సార్ పాలనపై మీ అభిప్రాయం?
వైఎస్ రాజశేఖరరెడ్డి నాకు మంచి స్నేహితుడు. సాయిబాబా పెట్టెను మద్రాసు నుంచి హైద్రాబాదుకు విమానంలో తీసుకొస్తుంటే, మా ఆవిడ బరువు మోస్తోం దని చూసి అమ్మా ఆ పెట్టె ఇవ్వు అని అడిగి తీసుకున్నారు వైఎస్సార్. ప్రయాణం ముగిసే దాకా బాబా పెట్టె పట్టుకుని వచ్చారు. ఆరోజు బాబా పెట్టె పట్టుకున్నారు కాబట్టే మీరు సీఎం అయ్యారు అని మా అమ్మ తర్వాత కలిసినప్పుడు చెబితే అవునమ్మా అంటూ నవ్వేశారాయన. వ్యక్తిగా చాలా మంచి మనిషి. ఆయన పాలన కూడా చక్కగా చేశారు. ఈ మనిషి ఉంటే చాలు అనే నమ్మకం ప్రజలకు ఇచ్చారు వైఎస్సార్.
వైఎస్ జగన్ పాదయాత్రపై మీ అభిప్రాయం ఏమిటి?
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాగా కష్టపడుతున్నారు. రాజ కీయాల్లో అసలు తీరికన్నదే లేకుండా, ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. ఎప్పటికైనా ఆయన కృషి ఫలిస్తుంది. పైగా ప్రతి ఒక్కరూ ఆయనను ఇష్టపడుతున్నారు. యువనేతగా ఆయన శ్రమిస్తున్న తీరు చూసి, రాజకీయనేతలు కూడా బాగా ఇష్టపడుతున్నారు. కృషి ఉంటే కానీ మనిషి పైకి రాడు అని ఆయన చేసి చెబుతున్నారు. రాజకీయాల కంటే ఆయనలో ఆ తత్వమే నాకు బాగా ఇష్టం.
(ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకులో)
https://goo.gl/tBWCH9
Comments
Please login to add a commentAdd a comment