ఎన్.వెంకటేశగౌడ
సాక్షి, పలమనేరు : మంత్రి నియోజకవర్గమని పేరేగానీ గ్రామాల్లో కాని, పట్టణంలో కానీ తాగేందుకు నీళ్లులేవు. అందుకే పలమనేరులో ఇంటింటికీ నళ్లా, గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కల్పించడమే తన ధ్యేయమని పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎన్.వెంకటేశగౌడ తెలిపారు. ఆయన శనివారం ‘సాక్షి’ తో మాట్లాడారు.
అభివృద్ధి కోసమే పార్టీ మారానని టీడీపీలో చేరి మంత్రి పదవిని దక్కించుకున్న అమరనాథ రెడ్డి నియోజకవర్గంలో చేసిందేమీలేదన్నారు. రూ.900 కోట్లతో అభివృద్ది చేశామంటూ గొప్పలు చెబుతున్నారేగానీ దాంట్లో రూ.300 కోట్లదాకా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖమంత్రిగా తన సొంత నియోజకవర్గంలో కనీసం కుటీర పరిశ్రమైనా కల్పించారా అని సూటిగా ప్రశ్నించారు.
దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తి, పెద్దిరెడ్డి అండతో తాను రాజీయాల్లోకి వచ్చానన్నారు. తనను గెలిపిస్తే పేదల కష్టాలు తెలిసినా వానిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు.
ప్రశ్న: రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?
జవాబు: నేను ఏడేళ్లుగా నియోజకవర్గంలో ఎన్‌వీజీ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలను చేస్తున్నా. పెద్దిరెడ్డి కుటుంబ అండదండలతో నా రాజకీయ ప్రస్థానం మొదలైంది. గత ఎన్నికల్లో ఇక్కడి అభ్యర్థిని గెలిపించడం నుంచి స్థానికంగానే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నా. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రను చూసి స్ఫూర్తి పొందాను. నాయకుడు అంటే అలానే ఉండాలనుకున్నా. ఇందులో భాగంగానే నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నా.
ప్రశ్న: కుటుంబ నేపథ్యం గురించి
జవాబు:మాది పలమనేరు నియోజకవర్గంలోని వీకోటమండలం తోటకనుమ . తండ్రిపేరు చెంగేగౌడ. నా సతీమణి పావణి గృహిణి. నాకు ఇద్దరు సంతానం. నా విద్యాభ్యాసం పక్కనే ఉన్న వీ.కోటలో సాగింది. 9వతరగతి దాకా చదువుకున్నా. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో బెంగళూరుకు వెళ్లా. అక్కడ తాపీ పనులు చేశా. ఈ ప్రాంతం నుంచి వెళ్లిన కూలీలను గ్రూపుగా చేసి చిన్నచిన్న పనులు ఒప్పుకున్నాను. అదే రంగంలో అంచలంచెలుగా ఎదిగి బిల్డర్‌గా స్థిరపడ్డాను.
ప్ర: ఐదేళ్ల టీడీపీ పాలనపై ఏమంటారు
జ: టీడీపీ నాయకులు నిధులు దోచుకోవడానికే సరిపోయింది. నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో తాగేందుకు నీళ్లు కూడా లేవు. మంత్రి లేనిపోని మాటలు, ప్రజలను ఏమార్చేందుకు శిలాఫలకాలు తప్పా ఇక్కడ చేసిందేమీ లేదు.
ప్ర:నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు గుర్తించారు...
జ: నియోజకవర్గంలో ప్రధానంగా తాగునీటి సమస్య ఉంది. ఇది మెట్టప్రాంతం కాబట్టి రైతుల సాగునీటికి ఇబ్బందులున్నాయి. పెండింగ్‌లోని గంగన్న శిరస్సు, కైగల్ ఎత్తిపోతల, హంద్రీనీవాతో చెరువుల అనుసంధానం చేయాల్సి ఉంది. ఏనుగుల సమస్య, టమాటా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం ఇలా చాలా సమస్యలున్నాయి.
ప్ర: ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తారు?
జ: నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా. ఇంతవరకు మా సొంత మండలానికి ఏ రాజకీయపార్టీలోనూ ప్రాతినిధ్యం వహించే అవకాశం రాలేదు. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ నా ద్వారా ఆ అవకాశం కల్పించింది. వెంకటగౌడ ఎమ్మెల్యేగా బాగా పనిచేశాడబ్బా అని జనం చెప్పుకుంటే చాలు. ఏడాదికి ఒక్కసారి .. ఐదేళ్లలో కనీసం ఐదుసార్లు ఇంటింటికీ వెళతాను. వాళ్ల యోగక్షేమాలు తెలుసుకుంటాను. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.
Comments
Please login to add a commentAdd a comment