సాక్షి, కనిగిరి (ప్రకాశం): గత సార్వత్రిక ఎన్నికల నుంచి కనిగిరి నియోజకవర్గంలో తిరుగుతున్నా. ఆరు మండలాల్లోని ప్రతి గ్రామంలో పర్యటించా. పార్టీ కార్యక్రమాలతో పాటు సేవాహిత కార్యక్రమాలూ చేశా. ఎందరో పేదలను ఆదుకున్నా. అనాథ పిల్లలను దత్తత తీసుకున్నా. నేను నియోజకవర్గంలో పర్యటించినప్పుడు తాగు, వాడుక నీటి సమస్య అధికంగా ఉందని గుర్తించా. ప్రధానంగా ఫ్లోరైడ్ నీటి సమస్య ఉంది. నేను పీసీపల్లి మండంలో పర్యటించినప్పుడు ఎక్కువ గ్రామాల్లో ఫ్లోరైడ్, కిడ్నీ, క్యాన్సర్ బాధితులు కన్పించారు. ఆయా గ్రామాలపై పూర్తిగా అధ్యాయనం చేశా. ప్రభుత్వం నుంచి కనీస సహకారం లేక, డయాలసిస్ కేంద్రాలు లేక అనేక మంది యువకులు కిడ్నీ, ఫ్లోరైడ్ వ్యాధితో మరణిస్తున్నట్లు గుర్తించా. సమస్యను మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్ది దృష్టికి తీసుకెళ్లి.. సమస్య తీవ్రతను వివరించా.
ఈ మేరకు సమస్యపై ఆయన కూడా తీవ్రంగా స్పందించారు. విషయాన్ని మా పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. నల్గొండ తర్వాత ఫ్లోరైడ్ సమస్య అత్యధికంగా కనిగిరిలోనే ఉందని, అనేక మంది కిడ్నీ బాధితులు డయాలసిస్ లేక చిన్న వయసులోనే చనిపోతున్నారని, సురక్షిత నీటి జలాలు లేక ప్రజలు రోగాల బారిన పడుతున్నట్లు జగన్‌మోహన్‌రెడ్డికి వివరించడంతో ఆయన వెంటనే స్పందించారు. 2017 జనవరి 20న పీసీపల్లి మండలంలో భారీ ధర్నా చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ధర్నాతో అధికార పార్టీ వెన్నుల్లో వణుకు పుట్టింది. వెంటనే కనిగిరితో పాటు మరో మూడు నియోజకవర్గాలకు డయాలసిస్ కేంద్రాలు మంజూరు చేశారు. కనిగిరిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుణ్యమే.
వైద్యుల కొరతపై దృష్టి
కనిగిరి ప్రభుత్వాస్పత్రిలో సుమారు 9 ఏళ్ల నుంచి మత్తు డాక్టర్ లేడు. గత పాలకులు కనీసం పట్టించుకోలేదు. పేదలకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షలా మారింది. ఆస్పత్రిలో ఆపరేషన్‌లు జరగడం లేదు. మత్తు డాక్టర్ లేక చిన్న ఆపరేషన్‌లకు కూడా ఒంగోలు రిఫర్ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులకు డెలివరీ ఆపరేషన్(సీజిరియన్) జరగడం లేదు. ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో బిల్లులు కట్టలేక పేదలు బంగారు అభరణాలు, పుస్తెలు తాకట్టు పెడుతున్నారు. ఇది చాలా బాధాకరం. మత్తు డాక్టర్‌తో పాటు ఇతర డాక్టర్లను నియమించాలని నిరసనలు, ధర్నాలు చేశాం. నేతలు మాటలు వల్లించి తప్పించుకున్నారు. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఆస్పత్రిలో మత్తు డాక్డర్ నియామకానికి చర్యలు తీసుకుంటా. ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తా.
పన్నుల భారం
నేను పట్టణంలో, నియోజకవర్గంలో ఏ పనిచేసినా ప్రజామోదం, ప్రజాభిష్టం మేరకే పనిచేస్తా. ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టే పనిచేయను. టీడీపీ ప్రభుత్వం విపరీతంగా పన్నులు పెంచింది. ఇంటి, కుళాయి పన్నులను ఒక్క సారిగా రూపాయికి 100 రెట్లు పెంచింది. ప్రజలు నడ్డి విరిచింది. ఇంటి పన్నుల తగ్గించాలని నేను కూడా ప్రజలతో కలిసి పోరాటం చేశా. నేను ఎమ్మెల్యే అయితే ఇంటి పన్నులను క్రమ బద్ధీకరణ చేస్తా. సమస్యను ఉన్నత స్థాయికి తీసుకెళ్లిపరిష్కరిస్తా. వ్యాపారం చేసుకునే కొద్దిపాటి స్థలం వరకే ట్యాక్స్ వేసేలా చర్యలు తీసుకుంటా. పెంచిన ఇంటి పన్నులు తగ్గిస్తా.
ఉచితంగా సాగర్ నల్లా..
గ్రామాలతో పాటు, పట్టణంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. నీటి కోసం అనేకసార్లు ప్రజలు రోడ్డెక్కారు. ప్రత్యేక్షంగా నేను కూడా ప్రజా పోరాటాల్లో పాల్గొని ప్రజల కోసం పోరాటం చేశా. ప్రజా సమస్యలు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా తెలుసుకున్నా. అందుకే నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ప్రతి ఇంటికి ఉచితంగా సాగర్ నల్లా అందించే కార్యక్రమం చేపడతా. కనిగిరిలోని నాగుల చెరువు, పెద చెరువును సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులుగా మారుస్తా. ప్రతి ఒక్కరికి సురక్షిత నీరు అందిస్తా.
నిమ్జ్ కోసం ప్రయత్నం
కనిగిరి ప్రాంతానికి నిమ్జ్ ఎంతో అవసరం. నిమ్జ్‌తోనే పరిశ్రమల స్థాపన జరిగి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కలుగుతుంది. గత పాలకులు నిమ్జ్‌ను తీవ్ర నిర్లక్ష్యం చేశారు. కనీసం ముందడగు వేయలేదు. మేము అధికారంలోకి వస్తే నిమ్జ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటా. నిమ్జ్‌కు నిధులు సాధిస్తా. కనిగిరి మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దుతా. ప్రధానంగా నీటి సమస్య, డ్రైనేజీ సమస్యపై దృష్టి సారించి తొలి ప్రాధాన్యతగా చర్యలు తీసుకుంటా. శివారు కాలనీల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తా. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లస్థలాలిచ్చి, పక్కా ఇళ్లను కట్టిస్తా. అర్హుడైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటా.
అవినీతి లేని పాలన అందిస్తా
కనిగిరి నియోజకవర్గంలో అవినీతి లేని పాలన అందిస్తా. తాగు, సాగు నీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారిస్తా. ఏ గ్రామాంలోనూ గొలుసు దుకాణాలు లేకుండా పూర్తిగా నివారిస్తా. వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో పీసీపల్లి మండలాన్ని చేర్చడం, మోపాడు రిజార్వయర్‌ను వెలిగొండ జలాలతో నింపేందుకు చర్యలు తీసుకుంటా. నాగార్జున సాగర్ కుడి కాలువను పొడగించి, కనిగిరికి శాశ్వతంగా తాగు, సాగు నీటిని అందిస్తా. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తా.
- ఎంఎల్ నారాయణ, సీపీఐ అభ్యర్థి
ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి కృషి
ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కోసం పనిచేస్తా. వెలిగొండ, పాలేటిపల్లి, నిమ్జ్ కింద భూముల కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తా. అర్హులైన పేద లందరికి నూర శాతం సంక్షేమ పథకాలు అందచేస్తా. వెనుకబడిన కనిగిరి ప్రాంతం అభివృద్ధి కోసం పరిశ్రమల స్థాపన కృషి చేస్తా. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు చర్యలుతీసుకుంటా.
- పాశం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
Comments
Please login to add a commentAdd a comment