కనిగిరి పట్టణ అభివృద్ధికి మరో అడుగు ముందుకు పడింది. రెవెన్యూ డివిజన్ కేంద్రం హోదాతో వివిధ ప్రభుత్వ శాఖల సేవలు మరింత చేరువ కాగా.. మూడేళ్లుగా నగర పంచాయతీ రెవెన్యూ ఆదాయం ఏటా రూ.4 కోట్లు పెరగడంతో తాజాగా నగర పంచాయతీ నుంచి గ్రేడ్–2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయింది. ఫలితంగా మున్సిపాలిటీలో వివిధ శాఖల పోస్టులు పెరగడంతో అభివృద్ధి నిధుల లభ్యత పెరగనుంది.
కనిగిరి రూరల్(ప్రకాశం జిల్లా) : కనకగిరి.. పేరు సార్ధకం చేసుకునేలా కనిగిరి అభివృద్ధికి మార్గం సుగమం అవుతోంది. నియోజకవర్గ కేంద్రమైన కనిగిరి అభివృద్ధిపై ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యుడు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బుర్రా మధుసూదన్ యాదవ్ తనదైన శైలిలో ముద్ర వేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో నిన్న రెవెన్యూ డివిజన్ సాధించగా.. తాజాగా కనిగిరిని నగర పంచాయతీ నుంచి గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయించారు.
రెవెన్యూ డివిజన్‌తో అభివృద్ధికి ఊపు:
కనిగిరి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మారడంతో అనేక ప్రభుత్వ ఉన్నత కార్యాలయాలు ప్రజల చెంతకు చేరాయి.. చేరుతున్నాయి. సుమారు 4 నుంచి 5 కి.మీల దూరం వరకు విస్తరించి ఉన్న కనిగిరిలో కనుచూపు మేరలో భూముల ధరలు పెరిగాయి. రెవెన్యూ డివిజన్ పరిధిలోని మిగతా మండలాల ప్రజల రాకపోకలు సాగుతుండటంతో వ్యాపారాలు, పెరిగి ఆయా వర్గాల వాళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చిన్న చిన్న పనులకు కందుకూరు వంటి దూర ప్రాంతాలకు వెళ్లకుండా కనిగిరిలోనే పనులు చక్కబెట్టుకుంటున్నారు. దీంతో వ్యయ ప్రయాసలు తగ్గాయి. రెవెన్యూ, వైద్య, విద్య, పోలీస్, మండల పరిషత్ తదితర అంశాల సమస్యలను ఇక్కడే త్వరితగతిన పరిష్కారం అవుతుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నిన్న నగర పంచాయతీ–నేడు గ్రేడ్ 2 మున్సిపాలిటీ
కనిగిరిని గ్రేడ్ 2 మున్సిపాలిటీగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు శుక్రవారం ప్రభుత్వ శాఖ నుంచి జీఓ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ పట్టుబట్టి మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్ సహకారంతో సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయించారు. రాష్ట్రంలో కనిగిరి నగర పంచాయతీ ఒక్కటి మాత్రమే గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో కనిగిరి పట్టణం అభివృద్ధిలో మరింత ముందడుగు వేయనుంది. ఈమేరకు మున్సిపాలిటీలో వివిధ శాఖల పోస్టులు పెరగడంతో పాటు, ప్రత్యేక నిధులు వచ్చే అవకాశాలున్నాయి.
మారనున్న కనిగిరి రూపు రేఖలు:
గ్రేడ్ 2 మున్సిపాలిటీగా రూపాంతరం చెందడంతో కనిగిరి రూపు రేఖలు పూర్తి స్థాయిలో మారనున్నాయి. చాలా కాలం పంచాయతీగా ఉన్న కనిగిరి.. ఆ తర్వాత మేజర్ గ్రామ పంచాయతీ అయింది. అనంతరం కనిగిరి, శంఖవరం, కాశీపురం, మాచవరం పంచాయతీలను కలిపి కనిగిరి నగర పంచాయతీగా చేశారు. నగర పంచాయతీగా హోదా ఏర్పడిన తర్వాత రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. ఈసారి గ్రేడ్ 2 మున్సిపాలిటీ స్థాయిలో ఎన్నికలు జరుగుతాయి. మూడేళ్లుగా మున్సిపాలిటీ రెవెన్యూ ఆదాయం ఏటా రూ.4 కోట్లు పెరిగినట్లు నగర పంచాయతీ కౌన్సిల్ మున్సిపల్ శాఖకు వెల్లడించడంతో గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు.
పెరిగిన కౌన్సిల్ హోదా...
ఇప్పటి వరకు నగర పంచాయతీ చైర్మన్..మున్సిపల్ చైర్మన్‌గా, నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులుగా హోదా పొందుతారు. ఇంజినీరింగ్, అడ్మినిస్ట్రేషన్ శాఖల్లో ఉన్న పోస్టులు పెరుగుతాయి. అమృత్ సరోవర్ వంటి భారీ నిధుల ప్రాజెక్టులు, ఆర్థిక సంఘ నిధులు పెరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. వచ్చే మున్సిపల్ ఎన్నికల నాటికి ప్రస్తుతం ఉన్న 20 వార్డులను 25 వార్డులుగా మార్చుకొనే అవకాశాలు ఉన్నాయి. (క్లిక్: నల్లమల ఘాట్ రోడ్‌లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్)
సీఎం సహకారంతో కనిగిరిని మరింత అభివృద్ధి చేస్తా
సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సహకారంతో కనిగిరిని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తా. బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో, సీఎం వద్దకు వెళ్లి కనిగిరిని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసుకున్నా. మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్, సీడీఎంఏ, సీఎస్‌ల సహకారంతో సీఎం దృష్టికి తీసుకెళ్లి కనిగిరిని గ్రేడ్ 2 మున్సిపాలిటీగా హోదా సాధించుకున్నా. పేదలకు మంచి ఆరోగ్యం, విద్య, సాగు, తాగునీరు అందించడమే నాధ్యేయం.
– బుర్రా మధుసూదన్ యాదవ్, ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యుడు
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు
కనిగిరి గ్రేడ్ 2 మున్సిపాలిటీగా మారడంలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ చేసిన కృషి ప్రశంసనీయం. ఎమ్మెల్యే ఆదేశానుసారం కనిగిరి పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు పనిచేస్తా. చైర్మన్‌గా తాను, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులంతా ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
– అబ్దుల్ గఫార్, చైర్మన్, కనిగిరి మున్సిపాలిటీ
Comments
Please login to add a commentAdd a comment